ఆవేదనకి అక్షర రూపం – ‘నిరుడు కురిసిన వెన్నెల’

0
10

[dropcap]శ్రీ [/dropcap]జిల్లేళ్ళ బాలాజీ రచయితగా, అనువాదకులుగా పాఠక లోకానికి చిరపరిచితులు. ఆయన రచించిన పదిహేను కథలతో వెలువరించిన సంపుటి ‘నిరుడు కురిసిన వెన్నెల’. 1985 నుంచి 2000 సంవత్సరం వరకు వివిధ పత్రికలలో ప్రచురితమైన చక్కని కథల్ని ఈ సంపుటిలో అందించారు రచయిత. తన జీవితంలో తాను పడ్డ ఆవేదనను, వివిధ ఘట్టాలను కథలుగా మలిచే ప్రయత్నం చేశానని రచయిత తెలిపారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, దృశ్యాలు, వింత పోకడలు మనసును బాధించినప్పుడు వాటిని కథలుగా రాయడానికి ప్రయత్నించానని బాలాజీ అన్నారు.

భర్త చనిపోయి వైధవ్యంలోని దుఃఖాన్ని అనుభవిస్తున్న జానకీదేవి ఆ నిర్లిప్తత నుండి, విచారం నుండి బయటపడి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకుంటుంది. ఆ క్రమంలో వెంకటస్వామి అనే ప్రతిభావంతుడైన కళాకారుడిని ప్రోత్సహించి అతను ఆ కళలో రాణించేలా చేస్తుంది. అయితే కొద్ది కాలం గడిచే కొద్దీ వారిద్దరి వ్యవహారం గురించి లోకులు చెవులు కొరుక్కోవడం ప్రారంభిస్తారు. జానకీదేవి కూతురు తల్లిని అనుమానిస్తుంది. ఈ వార్తలు తన పెళ్ళికి ఇబ్బందవుతాయని కూతురు అంటుంది. అప్పుడు వెంకటస్వామి, జానకీదేవి ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే – ‘అరుంధతి’ కథ చదవాలి.

ఒక సంభాషణతో ప్రారంభించి చదువరులలో చిన్న అనుమానం కల్పించి కథ ఏ రీతిని సాగుతుందో ఊహింపజేసి – వారిని ఆశ్చర్యపరుస్తూ మరోలా ముగిసిన కథ ‘కొత్త దంపతులు’. ఈ చిన్న కథకి చక్కగా కుదిరిన సంభాషణాలే ప్రాణం. సమాజానికి తమవంతు సాయం చేయాలన్న తపన శ్యామల మాటల్లో గోచరిస్తాయి. లోకుల మాటతీరు, సమాజం నైజం ఎలా ఉంటాయో చెప్పేలా అనసూయమ్మ మాటలు ఉంటాయి.

తండ్రి ఆపరేషన్‌కి డబ్బు అవసరమవుతుంది రామ్మూర్తికి. కానీ ఎక్కడా అప్పు దొరకదు. తెలిసిన వాళ్ళని అడుగుతూంటాడు. ఎవరూ ఇవ్వరు, తప్పించుకుంటూ ఉంటారు. చివరికి ఆదికేశవులు ఓ చీటీ రాసిచ్చి ‘వెంకటేశులు’ కొట్లో తన పేరు చెప్పి ప్రయత్నించమంటాడు. అక్కడ కొద్ది డబ్బే దొరుకుతుంది. కనకారావు అనే వ్యక్తి దగ్గర ఎక్కువ వడ్డీకయినా అప్పు తీసుకోవడానికి సిద్ధమవుతాడు రామ్మూర్తి. కానీ డబ్బు దొరకదు, తండ్రి దక్కడు. శవంపై పూలమాలలు వేసి దండాలు పెట్టిన వారిలో కనకారావు, ఆదికేశవులు కూడా ఉంటారు. సమాజంలో లోపిస్తున్న మానవీయ స్పందనలకి దర్పణం ‘ఆపద్బాంధవులు?’ కథ.

తనని మానసికంగా, శారీరికంగా హింసించిన భర్త చనిపోతే జానకికి దుఃఖం రాలేదు. కానీ పుట్టింటికి తీసుకొచ్చి విధవరాలికి చెయ్యాల్సిన తంతుని తల్లిదండ్రులు మొదలుపెడితే అప్పుడు బాధ కలుగుతుంది. కానీ జానకి కొడుకు అడ్డుకుంటాడు. కొన్ని దురాచారాలని పాటించవలసిన అవసరం లేదని, తల్లికి తాను అండగా ఉంటానని, అమ్మకి ఆధారాన్ని అవుతానని అంటాడు. జీవితం పట్ల సానుకూల దృక్పథం వ్యక్తం చేసే చిన్న కథ ‘ఆధారం’.

తనకి జరిగిన అన్యాయాన్ని అన్న భరత్‍తో చెప్పుకుంటుంది కౌముది. ఏ అఘాయిత్యం చేసుకోనని చెల్లెలి దగ్గర మాట తీసుకుంటాడు. సమస్యని పరిష్కరించుకోవడానికి మనోహర్ తల్లిదండ్రులను కలుస్తారు అన్నాచెల్లెల్లు. తమ కొడుకు తప్పుని అంగీకరించకుండా కౌముది గురించి నీచంగా మాట్లాడుతారు వాళ్ళు. తప్పని పరిస్థితులలో ఆ అన్నాచెల్లెళ్లు ఏం చేశారో ‘ప్రతీకారం’ కథ చెబుతుంది.

యూనివర్శిటీ నుంచి కారులో ఇంటికి వెళ్తున్న ఎమ్మే సైకాలజీ విద్యార్థిని శ్రావణి – రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కావడంతో – చుట్టుపక్కల పరిసరాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఓ కొట్టు వద్ద తనని ప్రేమిస్తున్నాని చెప్పిన పవన్ – ఏదో కొంటూ కనబడతాడు. అంతకు ముందు అతన్ని అన్ని రకాలుగా పరీక్షించి – అతని ప్రేమపై నమ్మకం కలిగి, తన తండ్రికి చెప్పాలనుకుంటుంది శ్రావణి. కానీ అతను కొన్న ‘వస్తువు’ని జాగ్రత్తగా గమనించిన శ్రావణి – తరువాత పవన్‍ని ప్రశ్నించి – అతని నిజ స్వభావాన్ని గుర్తిస్తుంది. అతనిలోని అత్యాశని పట్టించిన ఆ ‘వస్తువు’ ఏమిటో ‘అంచనా’ కథ చదివితే తెలుస్తుంది.

తన విద్యార్థిలోని బిడియాన్ని పోగొట్టి, విద్యలో రాణించేలా చేస్తాడో తెలుగు లెక్చరర్. తనలోని లోపాలని గ్రహించి, గురువుగారి సూచనలతో బాగా చదువుకుని ఓ రచయితగా పేరు తెచ్చుకుంటాడు రవి. సాహిత్యంలో ఉత్తమ స్థాయి పురస్కారం లభించినట్లు తెలిసాకా, ఓసారి పాత ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి ఆనాడు తన గురువు రాసి యిచ్చిన సందేశాన్ని చూసుకుని గురువుగారికి మనసులోనే నమస్కృతులు తెలియజేస్తాడు. అతడిని అంతగా ప్రభావితం చేసిన ఆ అక్షరాలు ‘సువర్ణాక్షరాలు’ అని రచయిత అంటారు.

వరకట్న దురాచారాన్ని ప్రతిఘటించాలనే లక్ష్యంతో అల్లిన కథ ‘ప్రాయశ్చిత్తం’. ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. అన్న కట్నం కోసం భార్యని వేధిస్తే, తమ్ముడు ఆదర్శ వివాహం చేసుకుని ప్రేరణగా నిలుస్తాడు. అంతే కాదు, తన మాటలలో అన్నని మార్చి వదినని కాపురానికి తెచ్చేలా చేస్తాడు.

భర్తని కోల్పోయి దుఃఖంలో ఉన్న అన్నపూర్ణపై కన్నేస్తాడు ఆమె భర్త స్నేహితుడు కృష్ణమూర్తి. సాయం చేస్తాననే నెపం మీద తన ఉద్దేశాన్ని ప్రకటిస్తాడు. అప్పుడే ఇంట్లోకి రాబోతున్న అన్నపూర్ణ పెద్ద కొడుకు భరత్ ఈ మాటలు వింటాడు. ఎప్పుడూ ‘అన్నపూర్ణ గారూ’ అని పిలిచే కృష్ణమూర్తి – హఠాత్తుగా అమ్మని ఏకవచనంతో పిలవడం, చులకనగా చూడడం గుర్తిస్తాడు. తండ్రి మరణంతో తలకిందులైన తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటే గాని కృష్ణమూర్తి లాంటి తోడేళ్ళను ఎదుర్కోలేమని గ్రహించి, మర్నాడు కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళితో అతనికో మాట చెబుతాడు. చిన్న వయసులోనే బాధ్యతని తలకెత్తుకున్న యువకుడి కథ ‘తిమిర సంహారం’.

కొన్ని నగ్న చిత్రాలు గీసి సొంతంగా ప్రదర్శనలో పెట్టి తన చిత్రకళా నైపుణ్యాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటాడు ఆనంద్. అతనిచ్చే డబ్బు తన కుటుంబ పోషణకి ఆధారం అవుతుందని అతనికి మోడల్‍గా ఉండేందుకు ఒప్పుకుంటుంది ప్రహేల అనే యువతి. ఎన్నో రోజులు ఆమెని నగ్నంగా వివిధ భంగిమలలో చూసినా అతనిలో ఉద్రేకం కలగదు. కానీ ఓ రోజు అతనిలో భావ సంచనలం జరిగి, ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. తన మీద జాలి పడవద్దని అంటుంది. అతని ప్రతిపాదనని తిరస్కరిస్తుంది. ఆమె సదుద్దేశాన్ని గ్రహించిన ఆనంద్ తాను గీసిన ఆమె నగ్న చిత్రాలన్నీ స్టోర్‍ రూమ్‍లో పడేస్తాడు ఆనంద్. ‘ప్రహేలానందలహరి’ వైవిధ్యమైన కథ.

తల్లిదండ్రులు లేని శ్రీధర్‌ని తాతయ్య పెంచి పెద్ద చేస్తాడు. పేదరికం కారణంగా, కులం కారణంగా – అందరూ శ్రీధర్‍‌ని చిన్నచూపు చూస్తుంటారు. తన అశక్తతని, నిస్సహాయతని అణచుకోలేని శ్రీధర్ ఎదుటి వాళ్ళ కోపాన్ని తాతయ్య ముందు వ్యక్తపరుస్తూ జీవితం పట్ల అసహనాన్ని పెంచుకుంటాడు. ఆత్మన్యూనతతో రగిలిపోతాడు. జీవనోపాధి కోసం ఏవేవో పనులు చేయాలనుకుంటాడు. అప్పుడు తాతయ్య ఓ సలహా చెప్తాడు. అది నచ్చని శ్రీధర్ ఆ సలహాని తోసిపుచ్చుతాడు. ఇంతలో తాతయ్య మరణించి శ్రీధర్ ఒంటరివాడవుతాడు. జీవితాన్నంతా పునశ్చరణ చేసుకున్న శ్రీధర్‍కి పలు సందర్భాలలో తాతయ్య తనకి చేసిన సూచనలు గుర్తొచ్చి, తాతయ్య చూపిన మార్గంలో నడిచి జీవితానికి సాంత్వన చేకూర్చుకుంటాడు. ఒకప్పుడు అతడిని దూషించిన మిత్రుడు రాఘవ వచ్చి క్షమాపణలు కోరుతాడు. జీవితం పట్ల దృక్పథం మార్చుకున్న శ్రీధర్ అతడిని మన్నిస్తాడు. ఆసక్తిగా చదివించే కథ ‘అనుబంధం’.

సంగీతం నేర్పే గురువులలో ఉన్న దురహంకారం, అభిజాత్యాలు ఓ వయోలిన్ గురువుకి ఎంత నష్టం చేకూర్చాయో ‘ఆలింగనం’ కథ చెబుతుంది. కళాకారులలో సహజంగా ఉండే స్పర్ధ తీరు మారి ఒకరి ఉన్నతిని సహించలేని స్థితిగా మారినప్పుడు ఆ కళాశాలలో బలిపశువవుతాడు గురుమూర్తి అనే ఉపాధ్యాయుడు. అతన్ని అన్ని రకాలుగా వేధించినప్పటికీ, కళ మీద ప్రేమతో సర్దుకుపోతాడు. కుల వివక్ష కారణంగా గురువుల హేళనని భరించలేని ఓ శిష్యుడు కాలేజీ మానేసి వెళ్ళిపోతానంటే, కాలేజీ మానేసినా, సంగీతం మానవద్దని, అతనికి తాను వయోలిన్ పాఠాలు చెప్తానని అంటాడు గురుమూర్తి.

వివాహ వ్యవస్థలో మార్పు రావాలని ఆశించిన కథ ‘మార్పు రా(కా)వాలి’. పెళ్ళయి కొద్ది రోజులకే భర్తని కోల్పోయి పుట్టింటికి వచ్చిన అక్కకి మరో పెళ్ళి చేయాలని తపన పడుతుంది ఆష. తనకి వైకల్యం ఉన్నా, ఏదో రకంగా తన పెళ్ళి చేసి పంపాలని ప్రయత్నిస్తున్న తండ్రికి ముందు అక్కకి మంచి దారి చూపమని కోరుతుంది. తనని పెళ్ళి చేసుకుంటానని వచ్చిన వాడి నిజస్వరూపాన్ని గ్రహించి అతన్ని దూరం పెడుతుంది. తండ్రి షష్టిపూర్తి చేస్తారు కొడుకులు. తన ప్రవర్తనతో తండ్రి ఆలోచనల్లో మార్పు తెస్తుంది ఆష.

ఉమ్మెత్తపూలు’, ‘గులాబీ’ కథలు మహిళల అంతరంగాలని చాటుతాయి. ‘ఉమ్మెతపూలు’ భర్తని కోల్పోయిన స్త్రీల పట్ల సమాజంలోని దురాచారాలని ప్రశ్నిస్తే; ‘గులాబీ’ కథ స్త్రీల సమస్యలని ప్రస్తావించి, మగవాళ్ల దురహంకారాన్ని, కామంతో కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తించిన నైజాన్ని చాటిన కథ.

***

ఈ కథలలోని కొన్ని సమస్యలు నేటి వర్తమాన సంక్షుభిత సమాజంలోని సమస్యల ముందు కాస్త చిన్నవిగా కనబడవచ్చు. వ్యక్తులలో, సమాజంలో, వ్యవస్థలలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని కథల్లో రచయిత ఆయా పాత్రల ద్వారా సూచించిన పరిష్కారాలు నేడు వర్తించవని కొందరికి అనిపించవచ్చు. సమస్య ఎప్పుడూ సాపేక్షమే. ఒకరికి తేలికగా అనిపించే సమస్య మరొకరికి ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. అందుకని కథాకాలాన్ని అనుసరించి ఆయా పాత్రల మనోభావాలను, నాటి సమస్యలను, వాటి పరిష్కారాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 25-30 సంవత్సరాల క్రితంనాటి సామాజిక స్థితిగతులను ఈ సంపుటి మరోసారి మన  ముందుకు తెస్తుంది.

ఈ పుస్తకంలోని కథలు చాలావరకు చిన్న కథలే. మూడు నాలుగు పేజీలలోపే ఉన్నాయి. కానీ చక్కటి సంభాషణల ద్వారా ఆయా సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టు పాఠకుల మనోఫలకంపై ముద్రిస్తారు రచయిత. హాయిగా చదివింపజేసి, ఆలోచింపచేసే కథల సంపుటి ‘నిరుడు కురిసిన వెన్నెల’.

***

ఈ పదిహేను కథలతో పాటు ఈ పుస్తకంలో రచయిత ఆంధ్రజ్యోతి (తిరుపతి) సాహిత్యం పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, గోదావరి వెబ్ మ్యాగజైన్‍కి ఇచ్చిన ఇంటర్వ్యూ, శ్రీ శ్రీనివాసులు (సాహిత్య అకాడమీ, చెన్నై) వారి పిహెచ్‌డి గ్రంథం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలలో సాహిత్యం పట్ల రచయిత దృక్కోణం, అనువాదాల పట్ల ఆయన అభిప్రాయాలు, ఆధునిక కాలంలో సాహిత్యంలో వస్తున్న మార్పులపై ఆయన అభిప్రాయాలను తెలుసుకోవచ్చు.

***

నిరుడు కురిసిన వెన్నెల
రచయిత : జిల్లేళ్ల బాలాజీ
ప్రచురణ: పార్వతీ విశ్వం ప్రచురణలు
పేజీలు : 108
వెల : రూ. 110/-
ప్రతులకు : జిల్లేళ్ల బాలాజీ,
ఇం.నెం. 9-535, ఓంశక్తి గుడి పక్క సందులో,
లింగేశ్వర నగర్‌, బైరాగి పట్టెడ,
తిరుపతి – 517501
సెల్‌ : 7382008979, 9866628639
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here