నిశ్చల చిత్రం

1
6

[dropcap]ని[/dropcap]లువెత్తు సౌందర్యం మూర్తీభవించినట్లుంది.

చూపు తిప్పుకోలేని బలమైన ఆకర్షణ తన సొంతం.

అంతే కాదు, మనుష్యుల లోని ర‌క‌ర‌కాల అనుభూతుల్ని ప‌రిచ‌యం చేసి, వాళ్ళ మ‌న‌స్త‌త్వాల్ని అర్థం చేసుకునే అవ‌కాశం ఇచ్చిన తనంటే అంటే ప్రేమ,అభిమానం ప్రాణం కూడా!

**

నేను, రోజా కారులో కూర్చున్నాము. ఆ నిలువెత్తు అందం సీట్ మీదుగా మమ్మల్ని చూస్తూ…. ….

ఎవరి పనుల్లో వాళ్లుండిన ఈ మధ్యాహ్నం వేళ వీధంతా ఖాళీగా ఉంది.

కారు నెమ్మదిగా వెళుతోంది. కళ్ళ మీదకి నిద్ర తెర వచ్చి రెప్పలని కప్పేసింది.

అకస్మాత్తుగా పెద్ద కుదుపు. దానితో ముందుకు వాలింది. అంతవరకూ స్తబ్ధుగా ఉన్నది ఆడ పులిలా లేచి “బుద్ధి లేదా జాగ్రత్తగా నడుపు కారుని.” డ్రైవర్‌పై అరిచింది.

“అలాగే మేడం” అంటూ వినయంగా బదులిచ్చాడు.

కుర్రాడు బిక్క చచ్చిపోయాడు రోజా అరుపుకి.

ఇవేమీ పట్టని రోజా మటుకు తనని ప్రేమగా తడుముతూ ఏదో పారవశ్యం పొందుతోంది

మొహంలో అలసట బాగా కనిపిస్తుంది. కళ్ళ చివరన ముడతలు, చెంపలు బాగా ఎండిపోయి చర్మం ముడతలు పడి ఉంది. ఆ మిల మిల మెరిసే కళ్ళు అచ్చు సూర్య కాంతిలా అనిపిస్తాయి.. ఏమి ఆలోచిస్తోంది? కలిసి జీవించిన అన్ని సంవత్సరాల గురించి ఆమెకు ఏమి గుర్తుంది? ఏమో? తనని గురించి ఆలోచిస్తుందేమో!

ఆ అందం వెనకాల యెంత చరిత్ర ఉంది. ఎన్ని తరాలు చూసింది. అదేమిటో తనని చూసిన ప్రతి వాళ్ళకి ప్రేమ కలుగుతుంది.

మా జీవితాలలో ఎంత గానో పెనవేసుకుపోయింది.

చల్లని సాయంత్రాలలో, మేము తరచుగా తన దగ్గరే గానీ ఆ పాత ఇనుప కుర్చీలపై కూర్చుంని పేకలు ఆడుకునే వాళ్ళము.

అప్పుడు తను మన అవతలి కార్డుల్లోకి తొంగి చూసేలా చేస్తుందా లేదా అనేది, అప్పుడప్పుడు మాలో మాకు చిలిపి కలహాలకి మూలం అయ్యేది.

ఓడిపోయిన వాళ్ళం తనని తిట్టుకునే వాళ్ళు, గెలిచినా వాళ్ళు ముద్దు పెట్టుకునే వాళ్ళు. రెంటిని సమభావంతో చూసే తనంటే అంటే మాకు ఎనలేని ప్రేమ.

మా పెళ్ళయిన తొలినాళ్లలో సరోజ పుట్టింటి నుంచి తనని తెచ్చుకుంది.

అది వాళ్ళింట్లో నాలుగు తరాలుగా ఉంది.

అందరూ నవ్వారు కూడా. అంత వయసైపోయిన దాన్ని తెచ్చుకోవడం ఎందుకు అని. ఎవరి మాట లెక్క చేయలేదు. అప్పటి నుంచి తను నాకు కూడా ప్రియనేస్తం అయిపోయింది.

మా దాంపత్యానికి సాక్ష్యం. రోజా సిగ్గుల మొగ్గగా ముడుచుకు పోయినా తను మటుకు ఆ చక్కటి ముద్దు మోమును నాకు చూపించేది.

తను అటు తిరిగి అలక నటించినా అది అబద్ధం అని తేల్చేసేది.

రోజా తన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. తను ఏ మాత్రం డల్‌గా ఉన్న బాధ పడేది. పైగా తనని ఇంట్లో అందరూ అనేవారు. పిల్లల కన్నాఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది అంటూ.

“అవును నా పిల్లలకన్నా నా జీవితం లోకి ముందు వచ్చింది. అందుకే అదంటే అభిమానం” అనేది

ప్రతి రోజు ఆఫీస్ నుంచి వచ్చి నా పర్సు, వాచీ, పెన్ను తన దగ్గరే ఉంచేవాడిని.

అలాగే రోజా నగలు కూడ భద్రంగా తన సొరుగులో దాచుకునేది.

**

సంసారం పెరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎన్నో కొత్త మార్పులు చేరాయి. కానీ తను మటుకు మాతోనే, మా ఎదురుగా ఉంటూ మీకు వయసు వస్తోందని హెచ్చరించేది.

మా పిల్లల ముద్దు ముచ్చట్లు మాతో పాటుగా తను చూస్తూ ఆనందించేది.

**

మా జీవితం మూడో భాగం లోకి అడుగుపెట్టింది.

పిల్లలు పెరిగారు. కాలేజీకి వెళ్లారు, ఉద్యోగాలు సంపాదించారు. పెళ్ళిళ్ళు జరిగాయి. జీవితాల్లో స్థిరపడ్డారు.

ఇద్దరూ చెరో ఫ్లాట్ కొనుకున్నారు. మా పాత ఇల్లుని అమ్మేసి ఇద్దరి దగ్గర ఉండమన్నారు.

ఇల్లు అమ్మడం ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. మేము మటుకు మీ దగ్గర ఉంటాము అని చెప్పాము. వాళ్ళు సంతోషించారు.

కాని అది ఎక్కువ కాలం లేదు. మా కొడుకులకి కోడళ్ళకి తను ప్రతిబంధకం అయింది. ఎప్పుడు మా గదిలోకి వచ్చినా వాళ్ళు “ముందు దీన్ని ఎక్కడయినా పారేయండి” అంటూ తిట్టేవాళ్ళు.

**

అలాంటిది.. ఈ రోజు వస్తుందని అసలు అనుకోలేదు.

ఎన్నింటికి సాక్ష్యం. ఒకటా రెండా! తన జీవితమంతా మమ్మల్ని మోసింది.

అసలు తను లేని జీవితం ఊహించుకోవటానికే భయమేస్తోంది.

తనతో మాకున్న అనుబంధం అటువంటిది.

మేము నవ్వితే మురిసి, ఏడిస్తే విలవిల్లాడి, హుషారుగుంటే ముద్దు చేసే మా ప్రియ నేస్తం.

ముఖ్యంగా రోజాకి వయసు పై బడ్డాకా మరీ అనుబంధం పెంచుకుంది.

ఇప్పుడు ఇలా నిస్సహయంగా.. రెక్కలు తెగిన జటాయువులా…

కొన్ని రోజులుగా తన ఒళ్ళంతా మచ్చలు పడి వికారంగా తయారయింది.

అందుకే మా పిల్లలకి అందులో మా చిన్నకోడలికి అసలు కిట్టటం లేదు.

దానికి ఓ కారణం ఉందని రోజా చెప్పింది. “ఆమె లావుగా ఉందని అన్నదని” ఆమె కోపానికి కారణమయింది. అది నిజమే ప్రసవం అయ్యాక బొద్దుగా తయారైంది. అలా అంటే ఆమె బాధ పడుతుందని ఎవరూ చెప్పలేదు. కాని తను మటుకు నిజం చెప్పేసింది.

సత్యం కఠోరమయింది కదా!

అదీ అసలు కోపం.

ఒక రోజు పెద్దకొడుకు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు బంతి ఆడుతున్నారు, వద్దని చెప్పినా వినలేదు. అప్పుడే ఒక దారుణం జరిగింది. బాల్ వెళ్లి తనకి తగిలింది.

అంతే భళ్ళున కుప్పగా పడి నేల రాలిపోతోంది.. అప్పుడు తను చూసిన చూపు.. మా గుండెల్ని మెలిపెట్టింది. ఏమి చెయ్యలేని నిస్సహాయత.

అప్పుడు అర్థమయింది. తను మరణించింది….. అవును మరణించింది.

“ఏమండీ నాదో కోరిక తనకి మనమే అంత్యక్రియలు చేద్దాం” అని ఏడిచింది రోజా.

ఎప్పటిలాగే అందరూ వెక్కిరించారు. నవ్వారు

“నా మూలంగా తను చనిపోయింది” అని మనవడు బాధపడ్డాడు.

“నువ్వు కారణం కాదు. వయసు అయిపొయింది అందుకు” వాడిని అనునయించాను.

“అమ్మయ్య శని వదిలింది. ఇక, తీసి అవతల పారేయండి. నాన్నా” అన్నాడు నా కొడుకు.

“అంటే పనికి రాకపోతే అవతలి పారేస్తామా? అయితే మమ్మలిని కూడా పారేయి, ఏం మనుష్యులు రా మీరు”

“అదికాదు నాన్నా”

“వద్దు నువ్వేమి చెప్పద్దు. ఇప్పుడే నేను కారు బుక్ చేసుకుని మన ఊరు వెళ్ళిపోతున్నాను. అంతే కాదు ఇన్నాళ్ళు మనతో ఉన్నందుకు తన మరణాన్ని గౌరవించాలి. ఊర్లో అంత్యక్రియలు చేస్తాము” అని గట్టిగా నా అభిప్రాయం చెప్పేసాను.

“తనతో జీవితంలో మన ప్రయాణం ఎప్పుడూ సంతోషదాయకమే, కానీ ఇప్పుడు మటుకు…….. ఇలా….” ఉప్పెనలా దుఃఖం పొంగుకు వచ్చింది రోజాకి.

పిల్లలు ఏదో అంటున్నా వినిపించుకోలేదు. తన చివరి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది.

అంతే!

**

“సర్ వచ్చేసాం.” అని చెప్పాడు డ్రైవర్.

ఆలోచనలో పడి సమయం తెలియలేదు.

నెమ్మదిగా రోజాను చెయ్యి పట్టి దింపాను.

బట్టలో చుట్టిన ఆ ఆరడుగుల అందాన్ని తీసుకొచ్చి వరండాలో పడుకో పెట్టాడు మాతో వచ్చిన అబ్బాయి.

రోజా అభిమానంగా తనని తడుముతూ ఉంది. రక్తం వస్తున్నాలెక్క చెయ్యలేదు.

తనతో పాటు తెచ్చుకున్న గునపంతో వేప చెట్టు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గొయ్యి చేసి తనని తీసుకెళ్ళి లోపలికి దింపాడు.

మొదట నేను మట్టి వేసాను. చాలా దుఃఖం వచ్చింది. రోజాను పట్టుకుని తన చేత మూడుసార్లు మట్టి వేయించాను.

అప్పుడు చూసుకున్నాము ఇద్దరం ముక్కలుగా విరిగిన తనలోని మా ప్రతిబింబాలని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here