నిష్కామ కర్మ

0
9

[dropcap]ని[/dropcap]ష్కామము అంటే కోరికలు లేక పోవటము. కర్మ అంటే పని.

నిష్కామ కర్మ అంటే చేసే పని నుంచి ఫలితము ఆశించకుండా చెయ్యటము. మనము సామాన్యంగా చేసే పనులలో దాదాపు అన్ని పనులను ఏదో ఒక ఫలితము ఆశించే చేస్తాము.  ఉదా: పరీక్షలలో ఉతీర్ణులవటం కోసం చదవటము. ఆకలి తీరటం కోసము తినటము వంటివి. ఇందులో చేసే పనులలో కొంత మనము కర్మ ఫలితాలు, మంచి కానీ, చెడు కానీ మూట కట్టుకుంటాము. ఈ కర్మ ఫలితాలే మనకు సుఖమో, కష్టమో కలిగిస్తాయి. ఈ కర్మలను అనుభవించటానికి మనము తిరిగి తిరిగి జన్మిస్తూ వుంటాము.

మనము సాధనతో పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోవాలంటే, మోక్షగామిగా మన జీవితము పండించుకోవాలంటే, నిష్కామకర్మ తప్పని సరి. అసలు మోక్షానికి ఈ నిష్కామకర్మయే సులువైన మార్గం.

ఈ నిష్కామ కర్మలను అనుసరించటము వలన సర్వ సంకల్పాలు నశించి, మనసు శుద్ధమై, నిర్మలమైన భక్తుడు భగవంతుని చేరుతాడు. మానవులు ధర్మబద్ధంగా నివసించటము వలన ఈ నిష్కామకర్మ అవలంబించగలరు.

నిష్కామకర్మ గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా వివరించాడు.

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!

అంటే -ఫలంపై దృష్టిలేని పని విధానాన్ని భగవానుడు సూచించాడు. అలాగని ఉదాసీనంగా పని చేయమని భగవానుడు చెప్పడం లేదు. ఉత్సాహంగా శ్రమించు; తుది ఫలితాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమంటున్నాడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కే తీరుతుంది; అర్హత లేకపోతే ఎంత తాపత్రయపడ్డా అందే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితమేదైనా, మహాప్రసాదం అనుకోవడమే ఆనందదాయకం.

నిష్కామకర్మ యోగం ఆచరించే వ్యక్తి ప్రతి జీవికి పరమ లక్ష్యమైన మోక్షాన్ని అందుకోగలడు. జీవితంలో నిష్కామ కర్మయోగం ఎంతో అవసరం… స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఫలితాన్ని గురించిన తాపత్రయాన్ని వదిలేస్తే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది.

సకామ కర్మల వలన మమకారము పెరుగుతుంది. అది బంధాలు పెనవేసుకోవటానికి కారణమవుతుంది. తత్‌ ఫలితముగా ఈ జనన మరణ చట్రంలో చిక్కుకుపోయిన ముడులు విప్పలేము. కాని,నిష్కామ కర్మల వలన మమకారము తగ్గుతుంది.

సాధకుడు శాస్త్ర అధ్యయనము, సాధన, జపతపాదులు వలన వైరాగ్యము ఉదయించి, నిష్కామ కర్మలు అవలంబిస్తాడు. తత్‌ ఫలితముగా జ్ఞానము కలిగి మోక్షానికి అర్హుడవుతాడు.

నిష్కామకర్మ అంటే దేనిపైనా శ్రద్ధ లేకుండా నిస్సారంగా జీవించటం కాదు.జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవటానికి శక్తిని అందిస్తూ.. ఆటుపోట్లకు క్రుంగిపోని చక్కటి జీవితాన్ని పొందటానికి అద్భుతమైన మార్గమిది.

అయితే, నిష్కామకర్మ ఆచరించే వారికి క్రుంగుబాటు దరిచేరదు.

సంసార జీవితంలో స్త్రీలకు, పురుషులకు ఎదురయ్యే సమస్యలకు కూడా నిష్కామకర్మ అనేది అద్భుతమైన పరిష్కారమార్గం. జనకమహారాజు సంసారంలో ఉంటూ రాజ్యపాలన చేస్తూనే నిష్కామయోగిగా జీవించారని పెద్దలు తెలియజేశారు. మనస్సును అదుపులో ఉంచుకోవటం, చుట్టూ సమాజంలో ఉన్న పరిస్థితుల మధ్య నిష్కామకర్మ యోగాన్ని ఆచరించటం అనేది కష్టమైనా, సాధన వలన, ధృడసంకల్పముతో దానిని సాధించవచ్చు.

ఆకలిగా వున్నవారికి సాధ్యమయినంతగా అన్నదానము, జ్ఞానము కోరిన వారికి జ్ఞానము దానము చేయటం మొదలు ఎన్నో తోటివారికి ఉపయోగపడే పనులు చేసి, వాటి నుంచి ఫలితము ఆశించకపోవటము నిష్కామకర్మనే!

ఇలాంటి పనులతో మొదలైన ధర్మచింతన పరమపథమైన మోక్షానికి మార్గం చూపుతుందని మనకు గీతలో భగవానుడు చెప్పివున్నాడు. కాబట్టి, సాధకులకు అనువైన సులభమైనది ఈ నిష్కామకర్మ. సంసారులకు సంసారములలో తరించటానికి, జీవితములో వచ్చే ఆటుపోట్లకు నిలబడే ధైర్యం ఇచ్చి బ్రతుకు పండించుకోవటానికి ఈ నిష్కామకర్మ ఉత్తమమైన మార్గంగా పెద్దలు చెబుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here