నిరంతర పరిశోధకుడు నిత్యానందరావు

0
9

[dropcap]చా[/dropcap]లామంది పరిశోధకులు విద్యార్థి దశను దాటి ఉద్యోగంలోకి చేరుకోగానే రచనా వ్యాసంగానికి దూరమవుతారు. కొంతమంది యూనివర్శిటీ ఉద్యోగాలలో చేరగానే వారికి సర్వజ్ఞత అలవడుతుంది. దాంతో వారు రాయడమే మానేస్తారు. దీనికి భిన్నంగా విద్యార్థి దశలో ఎంత అంకిత భావంతో పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టారో, ఇప్పటికీ అదే నిబద్ధత, నిజాయితీ, పరిశోధనాసక్తులతో కొనసాగడం నిత్యానందరావుకే చెల్లింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలనే కాకుండా ఇతరేతర అంశాలకు సంబంధించిన వాటిపై కూడా కూలంకుషంగా పరిశోధించి విషయ సేకరణతో, విశ్లేషణాత్మకంగా వ్యాసాలను రాయడం వారి ప్రత్యేకత. వారు ఇప్పటికే రెండు వేల పై చిలుకు వ్యాసాలు రాసి వుంటారని ఒక అంచనా. కాని వారు ఇప్పటివరకు మూడు వ్యాస సంపుటాలు మాత్రమే వెలువరించగలిగారు. చాలా కాలానికి అనగా ఇప్పుడు వారి నాలుగో సంపుటిని ‘నిత్యాన్వేషణం’ పేరుతో వెలువరించడం సంతోషకరం. వారు రాసిన వ్యాసాల నుండి పది పెద్ద వ్యాసాలను తీసుకుని ‘సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం’గా ఈ పుస్తకాన్ని తీసుకురావడం కూడా వైవిధ్యంగానే భావించాలి. ఇందులో సగం వ్యాసాలు సాహిత్యపు లోతులను పరామర్శిస్తాయి. మిగతా సగం వ్యాసాలు ప్రతిభావంతులైన సాహితీకారుల గొప్పదనాన్ని తెలియజేస్తాయి.

అందులో మొదటి వ్యాసం “తెలంగాణ ప్రాచీన కవుల భావ కవితా వైశిష్ట్యం”. మన కవుల భావుకతా సిద్ధికి ప్రధాన ఆలంబనగా నిలిచింది వారి ఊహా శబలత. జీవితం మీద వారికున్న అనురక్తి, ఉత్సాహశీలం, భావుకతా సిద్ధికి వారు అలంకరణలుగా చేసుకున్నారు. ధ్వని మార్గంలో ప్రస్థానించారు. శబ్ద చమత్కారాల నాశ్రయించారు. నవరసాలను సార్థకంగా వినియోగించుకున్నారు. లోకోక్తులను, లోకాచారాలను, సంప్రదాయాలను ఊతగా చేసుకున్నారు. అది ఇది అననేల? ఎన్ని మార్గాల్లో భావుకతని సంధించవచ్చో అన్ని మార్గాలను అనుసరించి చిరస్మరణీయులయ్యారు. తెలంగాణ ప్రాచీన కవులలో భావుకతాపరంగా ఆలోచిస్తే చప్పున గుర్తుకువచ్చే కవి బమ్మెర పోతన. కులాతీత భక్తి తత్త్వాన్ని ప్రబోధించిన పాల్కురికి సోమన వస్తు భావ రస రచనల్లో దేశీయ మార్గాన్ని అనుసరించిన స్వతంత్ర కావ్య నిర్మాతగా వారి భావనాశక్తి అపూర్వం, అమోఘం. భాస్కర రామాయణం రాసిన భాస్కరుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, సారంగు తమ్మయ్య, మరింగంటి కవులు, పొనగంటి తెలగన తో పాటు గోన బుద్ధారెడ్డి, కొరవి గోపరాజు, అద్దంకి గంగాధర కవి, గౌరన, మారన లాంటి కవులు భిన్న భిన్నమైన తీరులలో ఆవిష్కరించిన భావుకతను గుర్తించి విశ్లేషించి ఆస్వాదించడంలోనే ఆనందం వుందంటారు.

‘తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు-సూచీ గ్రంథాలు కోశాలు’లో చెల్లాచెదురుగా వున్న విజ్ఞానాన్నంతా ఒక చోటికి సమీకరించి, వర్గీకరించి పాఠకుడికి అందజేయడమే విజ్ఞాన సర్వస్వాల లక్ష్యమని చెబుతారు. మహాభారతం, పండితారాధ్య చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, హంసవింశతి, సకలనీతి సమ్మతం, వాణీ విలాస వనమాలిక లాంటి ప్రాచీన కావ్యాల భిన్న భిన్న విషయ పేటికలైన విజ్ఞాన సర్వస్వాలే అని నిర్ధారిస్తారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వ రచనకు శ్రీకారం చుట్టిన మహాశయుడు కొమరాజు వెంకట లక్ష్మణరావు మొదలుకొని వివిధ సంస్థలతో పాటు వ్యక్తులుగా బి.ఎన్. శాస్త్రి, రాపాక ఏకాంబరాచార్యులు, జి. వెంకటరత్నంలు చేసిన కృషిని తెలియజేశారు. వ్యాసాలను, గ్రంథాలను ఇతరమైన వాటికి వివరాల జోలికి పోకుండా కేవలం సూచింపబడితే వాటిని సూచీ గ్రంథాలు అంటారు. ఇందులో కాశీనాథుని నాగేశ్వరరావు ‘ఆంధ్ర వాఙ్మయ సూచిక’ మొదలుకుని తెలుగు అకాడెమీ వారి ‘కథాకోశం’ వరకు వచ్చిన సూచీ గ్రంథాల గురించి పేర్కొన్నారు. ఇందులో వెలుదండ నిత్యానందరావు తయారుచేసిన ‘విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధన’ అనే సూచీ గ్రంథం గురించి పేర్కొనడం సముచితమే. ఒక పదానికి సరియైన అర్థాన్ని వివరించే నిఘంటువులు, అలాగే పర్యాయ పద నిఘంటువులు, సంకేత పదకోశాలు, అన్నమయ్య పదకోశాలతో పాటు రకరకాల నిఘంటువుల గురించి తెలియజేశారు. గ్రంథాలయ సమాచారశాస్త్రం లోని ‘ఆచూకీ గ్రంథాలు’ అనే విభాగానికి చెందిన ఈ అంశాలను విపులీకరించి వివరించడంలో పరిశోధకుడు చూపిన నేర్పు ప్రశంసనీయం.

‘రామదాసు సాహిత్య సమీకరణం’ అనే వ్యాసంలో అన్నమయ్యవి సంకీర్తనలనీ, రామదాసువి భజన కీర్తనలనీ, త్యాగయ్యవి కృతలవీ, క్షేత్రయ్యవీ పదాలనీ, పరబ్రహ్మానివి తత్త్వాలని వింగడిస్తూ వాటిని వివరించారు. రామదాసు కీర్తనలను అన్నింటిని సేకరించి, పాఠాంతరాలను గుర్తించి సంశోధిత ప్రతిని తయారుచేయాలంటారు. రామదాసు మీద నేటికి ఎన్నో వ్యాసాలు, నాటకాలు, చారిత్రక రచనలు, కావ్యాలు, యక్షగానాలు, నవలలు, పరిశోధనలు వచ్చాయి. వీటన్నింటిని ఒకచోటికి తీసుకువచ్చి ముద్రించి అందరికీ అందుబాటులోకి తేవాలని వారు సేకరించిన జాబితాను ఇవ్వడం బాగుంది.

పదాల విరుపు, పదాలకు అర్థం, సమాసాలకు విగ్రహ వాక్యాలు, తాత్పర్య-భావ నిర్ణయం, ఆక్షేపణలకు సమాధానాలు – ఈ అయిదు లక్షణాలు వ్యాఖ్యానాలకు ప్రధానమైనవి. కావ్యంలోని అందచందాలను, చమత్కారాలను, వ్యంగ్య మర్యాదలను, మూర్తిమత్వాన్ని పాఠకులు గ్రహించి ఆనందించేలా చేయడం వ్యాఖ్యాత పని. ఈ అర్థ నిర్ణయం, భావ గ్రహణంలోనే వ్యాఖ్యాతల, విమర్శకుల, అనువాదకుల శక్తియుక్తులు, ప్రతిభా సామర్థ్యాలు, సరస్వతం బయటపడతాయి. ఒక్కోసారి ఈ అర్థ నిర్ణయం లేదా భావ గ్రహణంలో వీరు పొరపాట్లు చేయవచ్చు. ఉద్దేశపూర్వకంగానో, అవగాహన లోపం వల్లనో, తొందరపాటు లేదా ఏమరుపాటు వల్లనో పొరపాట్లు జరిగే అవకాశం వుంటుందని ‘వ్యాఖ్యానాల్లో అర్థ నిర్ణయం సాధక బాధకాలు’లో తెలియజేశారు.

గోదావరి జిల్లాల రచయితల సాహిత్య పర్యాలోచన సదస్సు వారు ఎంతో శ్రమించి 267 మంది రచయితల పేర్లతో ఒక కరపత్రాన్ని విడుదల చేస్తూ, అందులో ఎవరైనా ఒకరి మీద మాట్లాడవలసిందిగా నిత్యానందరావును పిలిచారు. ఆయన అది పక్కనబెట్టి, ఆ జాబితాలోని చేరని యాభైమంది సాహిత్యకారుల పరిచయాన్ని ఒక వ్యాస రూపంలో మలచి నిర్వాహకులకు అందజేయడంలోనే ఆయన ప్రత్యేకతను గుర్తించవచ్చు. ఏ విషయంలోనైనా సమగ్రత కోసం పాటుబడడంలోనే ఆయన విశిష్టత దాగి వుంది.

డా. పల్లా దుర్గయ్య సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప విద్వాంసులు. పండితులుగా లబ్ద ప్రతిష్ఠులైనారు. కాని కవిగా వారు ప్రచారాన్ని కోరుకోలేదు. ప్రకాశానికి నోచుకోలేదు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రయత్నాల కాలంలో సాహితీ సౌరభాన్ని అద్దిన విశేష కావ్యాలు దుర్గయ్య గారి గంగిరెద్దు, పాలవెల్లి. సంప్రదాయసిద్ధమైన పాండిత్యం, ఆధునిక చైతన్య సూచనమైన అధిక్షేపాది గుణాలు వారిలో సమపాళ్ళలో మేళవింపబడ్డాయని చెప్పడానికి వారి ఈ రెండు కవితా సంపుటాలే సాక్ష్యాలు. పల్లా దుర్గయ్య అపార సంస్కృతాంధ్ర వైదుష్యానికి ఎత్తిన జయపతాక వారి ‘ప్రబంధ వాఙ్మయ  వికాసం’. ఇందులో ప్రబంధ శబ్దం చర్చ, లక్షణాలు – పరిణామం, మనుచరిత్రాది ప్రబంధ పరిశీలనం మొదలగువాటితో వివరణాత్మకంగా సాగింది. ‘చతుర వచోనిధి’ గ్రంథంలో, మూలకథకు పెద్దన చేసిన మార్పులలోని ఔచిత్యం, కిరాతార్జునీయాది కావ్యాలతో తులనాత్మక పరిశీలనా, నాటకీయ శిల్పం మొదలగువాటిని పరామర్శించారు. విజ్ఞాన సర్వస్వం, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం లాంటి సంప్రదింపు గ్రంథాలకు విలువైన వ్యాసాలు రాశారు. వానమామలై వరదాచార్యులు పోతన చరిత్రకు సుదీర్ఘమైన పీఠిక రాశారు. దుర్గయ్యగారు ఆముక్తమాల్యద రచన మీద ఉన్న పాల్కురికి సోమన ప్రభావాన్ని అంచనా వేసిన తీరు యుక్తియుక్తంగా వుంది. ‘పాండితీ ప్రతిబామండనుడు డా. పల్లా దుర్గయ్య’ అంటూ వారిని సృజనశీలిగా, పరిశోధనాదక్షుడిగా నిరూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

శ్రీ పాటిబండ మాధవశర్మ ఛందః పరిశోధనా పారంగతులు. ఆదర్శ దేశికులు. ఔచిత్యం, అలంకార, శబ్ద రసాదుల నెరిగి మాతృకానుసారంగా అనువదించగలిగిన ఉభయ భాషా కోవిదులు. కవి అంతరంగాల లోతులను దర్శించి ప్రదర్శించగలిగిన వ్యాఖ్యాతలు. సమకాలీన ఆచార వ్యవహారశైలిని సాభిప్రాయంగా చిత్రించిన నవలాకారులు. భావబంధురమైన పద్య రచన చేసిన ప్రౌఢకవులు. గాంధీయ, మార్క్సియాది దృక్పథాల కాకర్షితుడై సముచితంగా స్పందించిన సామాజిక చింతనాపరులు. ప్రగతిశీల భావ ‘వీణ’లు మీటిన మేటి పత్రికా సంపాదకులు. వర్తమాన భావ కవిత్వం నుండి మహాభారత ఛందో విక్రమం వరకు సాధికారికంగా విశ్లేషించి స్వీయముద్రతో అభిప్రాయ ప్రకటనం చేసిన ప్రామాణిక పరిశోధకులు. ఈ ‘శేముషీ రోచిష్ణుడు పాటిబండ మాధవశర్మ’ అనే వ్యాసంలో వారి జీవిత విశేషాలను – విమర్శకునిగా, పరిష్కర్తగా, అనువాదకునిగా, నవలాకారునిగా, కవిగా వారు చేసిన కృషిని, గొప్పదనాన్ని వివరించారు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి హాస్యం అర్థవంతమైనది, స్ఫూర్తిమంతమైనది. గిలిగింతలు పెట్టేది. చురుక్కుమనిపించేది. ఆధునిక నాగరికతలోని డొల్లతనాన్ని అవహేళన చేసేది. లోతు లేని పాండిత్యాలను తూర్పారబట్టేది. తన్ను వెక్కిరింప ప్రయత్నించినవారికి పెడసరంగా సమాధానమిచ్చి  నోరు మూయించేది. నుడికారాలను వాచ్యార్థంలో ప్రయోగించి హాస్య సృష్టి చేసేది. తార్కిక దృష్టితో చర్చను సాగదీసి నవ్వించేది. పదాల విరుపులతో, శ్లేషలతో వికటత్వాన్ని పండించేది. అమాయకత్వాన్ని, ప్రణయాన్ని, విషాదాన్ని ఒక్కటేమిటి? దేనితో అవకాశం చిక్కితే దానిని ఆసరా చేసుకుని నవ్వుల పువ్వులను విరబూయించేది. అలా ‘విశ్వనాథ హాస్యచతురత’ను ‘అమాయక హాస్యం, మనస్తత్వ ప్రదర్శకం, వర్ణనాత్మక హాస్యం, అజ్ఞాన ఖండనం, తార్కిక హాస్యం, ప్రణయ హాస్యం, పేరడీ, ఆవేదనాత్మక హస్యం, మిత్ర సల్లాపం, బంధు సల్లాపం, శాబ్దిక హాస్యం, అధిక్షేపాత్మక హాస్యం, చేష్టాగత హాస్యం’గా వర్గీకరించి, వారి రచనల ఆధారంగా నిరూపించడం బాగా వచ్చింది. దీని కోసం విశ్వనాథ సమద్ర సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి పరిశోధకుడు వెనుకాడలేదు.

‘జాతీయోద్యమ సాహిత్యం’ అనగా జాతి తన అస్తిత్వాని, సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి సృష్టించుకున్న సాహిత్యం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. భారత స్వాతంత్రోద్యమ కాలంలోని వివిధ దశలను, వివిధ సంఘటనలను ఆయా దశల్లో నాయకత్వం వహించిన స్థానిక, జాతీయ నాయకులను స్మరిస్తూ, ప్రతిఫలిస్తూ తెలుగు సాహిత్యకారులు రచనలు చేశారు. ఖండకావ్యాల్లో, మహా కావ్యాల్లో, గేయాల్లో, నాటకాల్లో, నవలల్లో, కథల్లో, సంపాదకీయాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రిటీష్ పాలన పట్ల వ్యతిరేక అభిప్రాయాలను, వారికి వ్యతిరేకంగా పోరాడాలన్న ప్రబోధాన్ని, ఉద్యమ కార్యాచరణను, దైర్యప్రచోదనాన్ని గుర్తించవచ్చు. ఈ వ్యాసంలోని ఉదాహరణలను స్వాతంత్రోద్యమ కాలం నుండి గాంధీజీ హత్య వరకు అంటే 1948 వరకే పరిమితం చేసుకోవడం గమనించదగ్గ విషయం.

తీసుకున్న అంశాన్ని తార్కికమైన శైలితో, పూర్వాపర సమన్వయంతో, సముచిత వర్గీకరణంతో, వివరణంతో క్లుప్తంగా పరిమితమైన పుట్టల్లో రాసే వచన రూపమే ‘వ్యాసం’. వ్యాస సౌధానికి కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు నాలుగు మూల స్తంభాలుగా నిలిచారని వారి కృషిని తెలియజేశారు. అలాగే వ్యాసాలను ఎన్ని రకాలుగా విభజించడానికి ఆస్కారముందో తెలుపుతూ, ఆయా విభాగాలను ఉదాహరణలతో సహా తెలియజేశారు. బాగానే వుంది కాని, విశ్వవిద్యాలయాల్లో సమర్పించే సిద్ధాంత గ్రంథాలను ‘సిద్ధాంత వ్యాసాలు’గా పేర్కొని, దానికో అధ్యాయాన్ని కేటాయించడం ఆశ్చర్యంగా వుంది.

ఉపపత్తులు చూపకుండా రాసే అలవాటు నిత్యానందరావుకు లేదు. ప్రతి వ్యాసంలో బోలెడన్ని ఉదాహరణలు, ఫోటోలతో పాటు ఆధార గ్రంథాల సూచీని జత చేయడం ఆయన నిజాయితీని, పట్టుదలను సూచిస్తుంది. ఏ వ్యాసం రాసినా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తు, దాన్ని వింగడించుకుని, విశ్లేషించి వివరించడం మరో ఎత్తు. సమాచారాత్మకములు, విజ్ఞానాత్మకములు అయిన ఈ వ్యాసాలు విద్యార్థులకు, పరిశోధకులకు రిఫరెన్సులుగా ఉపయోగపడతాయి.

***

నిత్యాన్వేషణం

(సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం)

రచన: ఆచార్య వెలుదండ నిత్యానందరావు

ప్రచురణ: ప్రణవం పబ్లికేషన్స్, హైదరాబాద్ 500079

పేజీలు: 336, వెల: ₹400

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, మరియు 9441666881.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here