నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-12

1
5

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

ఇస్లాం రాజ్యం ఏర్పాటు  దిశగా..

[dropcap]హై[/dropcap]దరాబాదులో నేను చేయాల్సిన మొదటి పని, హైదరాబాదులోని విభిన్నమైన  శక్తికూటముల బలాబలాలు తెలుసుకోవటం.

అధికారం కోసం నాలుగు విభిన్న శక్తుల నడుమ జరుగుతున్న పోరాట వేదిక హైదరాబాదు. ఘనత వహించిన ప్రభువు ఒక శక్తి. ముద్దుగా ఇత్తెహాద్ అని పిలిచే మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్సల్మీన్ మరో శక్తి. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ మూడవ శక్తి. భారత కమ్యూనిస్టు పార్టీ నాలుగవ శక్తి. ఈ నాలుగు  శక్తుల నడుమ హైదరాబాదు వేదికగా అధికారం కోసం పోరు జరుగుతోంది.

ఇండియా ఏక్ట్ 1919 ప్రకారం, బ్రిటీష్ ఇండియా లోని ప్రాంతీయ ప్రభుత్వాలలో కొన్ని శాఖలపై నియంత్రణను ఎన్నికయిన చట్టసభలకు అప్పగించింది బ్రిటీష్ ప్రభుత్వం. దీని ఫలితంగా భారతదేశంలో  పలు రాజ్యాలలో, హైదరాబాదుతో సహా,  ప్రజలకు తమ హక్కుల గురించిన గ్రహింపు కలిగింది.

ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు, హైదరాబాదులో అభ్యుదయ భావాల ప్రధాని సల్ అలీ ఇమామ్, నియంతృత్వం స్థానే ఓ కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసేందుకు నిజామ్‍ను ఒప్పించాడు. అయితే, ఈ కార్యనిర్వాహక మండలి ఏర్పాటు కాగానే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిజామ్ ఈ మండలిని నిర్వీర్యం చేశాడు. 1920 కల్లా రాజ్యంలో తలఎత్తుతున్న రాజకీయ భావనలను అణచివేశాడు.

ఆరేళ్ళ తరువాత, పదవీ విరమణ చేసిన అధికారి, మహమూద్ నవాజ్‍ఖాన్ మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్సల్మీన్ ను ఏర్పాటు చేశాడు. నిజామ్‍కు మద్దతుగా ముస్లిం లందరినీ ఏకం చేయటం, అధిక సంఖ్యలో ఉన్న హిందువుల సంఖ్యను మత మార్పిళ్ళ ద్వారా తగ్గించి వేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఈ సంస్థకు నిజామ్ అండదండలు ఉన్నాయి.

కొన్నాళ్ళకి  ముస్లింల సభ ‘మెహఫిల్-ఎ-మిలాద్’లో నిజామ్ దృష్టి బహదూర్ ఖాన్ అనే వ్యక్తి పై పడింది. నిజామ్  ఆయనను సమర్థవంతుడైన నాయకుడిగా భావించి, బహాదూర్ యార్ జంగ్ అని నామకరణం చేసి, ఇత్తెహాద్ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు.

1926లో నిజామ్ సర్వశక్తిమంతుడు కాడనీ, బ్రిటీష్ సార్వభౌమత్వం తిరుగులేనిదని లార్డ్ రీడింగ్ కుండబద్దలు కొట్టి, హైదరాబాదు లోని అరాచక పాలనను తన నియంత్రణలోకి తీసుకొన్నాడు.

రాజ్యంలోని ఆదాయ వ్యవహారాలు, పోలీసు, పరిశ్రమల శాఖలతో పాటు ఇతర ప్రధాన శాఖలను నలుగురు బ్రిటీష్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా నామినేట్ అయ్యాడు. ఈ మండలి ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలను నిజామ్ తప్పనిసరిగా ఆమోదించాలని బ్రిటీష్ ప్రభుత్వం సూచించింది.

ఇంత వరకూ అడ్డూ అదుపు లేని సౌకర్యాలను  నిజామ్ రాచరికంలో అనుభవిస్తున్న ముస్లింలు తమ లాభాలకు అడ్డుపడే బ్రిటీష్ వారి ఈ చర్యను నిరసించారు. ఇది ముల్కి ఉద్యమానికి దారి తీసింది. రాజ్యంపై ప్రభావం చూపించే కీలకమైన స్థానాలు, అధికారాలలో  హైదరాబాదేతర శక్తులు ఉండకూడదన్నది ఈ ఉద్యమ లక్ష్యం.

ముల్కి ఉద్యమం కార్యాచరణ పత్రం (మేనిఫెస్టో) ప్రకారం ఈ ఉద్యమం ఆటు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు, నిజామ్ పాలనలో ఉన్న హిందూ – ముస్లిం ప్రజలకు సంతృప్తి కలిగించి, దయామయుడైన   ప్రభువు ఆనందం పొందే ఓ సూత్రాన్ని ఏర్పాటు చేయటం ప్రధాన లక్ష్యం. ఈ ఉద్యమం ఒక గొప్ప ప్రయోజనం సాధించేది ఉంది. ఈ ఉద్యమం చిరకాలం సాగుతుంది. అంత త్వరలో సమసిపోయేది కాదు. మూర్తీభవించిన దక్కన్ జాతీయ ప్రభువు నిజామ్ చిరంజీవిగా ఉండాలి (జిందాబాద్) అన్న నినాదంతో ఈ కరపత్రం ముగుస్తుంది.

హైదరాబాద్‍లో ముల్కి కానీ వారిలో అధికులు ఉత్తర భారతం నుంచి హైదరాబాదు వచ్చిన ముస్లింలు. ముల్కి ఉద్యమం ద్వారా చెలరేగిన బావోద్వేగాల జ్వాలలు తమని చేరక  ముందే వీరు ఉద్యమం దారి మళ్ళించారు. వారు హైదరాబాదుపై ముస్లింల సార్వభౌమత్వాధికారం ఉందన్న నినాదాన్ని సమాజంలో వదిలారు. దాంతో ఈ ఉద్యమం హిందూ, బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా, ముస్లింలకు మద్దతు నిచ్చే ఉద్యమంగా మారిపోయింది. బహదూర్ యార్ జంగ్ వీస్తున్న పవనాలదిశను  గ్రహించాడు. ఉద్యమ నాయకుడయ్యాడు. చిరకాలంలో అందరూ ఆమోదించిన ముస్లింల నాయకుడయ్యాడు. ‘మూర్తీభవించిన దక్కన్ జాతీయ సార్వభౌముడు’ అన్న నినాదం ‘మూర్తీభవించిన దక్కన్ ముస్లింల సార్వభౌముడు నిజామ్’ అని ప్రకటించే స్థాయికి ఎదిగింది ఉద్యమం. ఈ రెండు నినాదాలు తనకు లాభకరం కాబట్టి నిజామ్ ఈ రెండు నినాదాలకు సమ్మతి తెలిపాడు.

బహదూర్ యార్ జంగ్ నేతృత్వంలో  ‘ఇత్తెహాద్’ ఒక శక్తివంతమైన మత సంస్థగా ఎదిగింది. దీని ప్రధాన లక్ష్యం హిందువులు, అభ్యుదయ భావాలు కల ముస్లింల రాజకీయపుటాశలను నేలరాయటం. ముల్కి భావనను హిందూ వ్యతిరేక భావనగా రూపాంతరం చెందించేందుకు హైదరాబాదు జిల్లాల్లోని హిందువులను పెద్ద సంఖ్యలో ముస్లింలుగా మతం మార్చే కార్యకాలాపాలను పెద్ద ఎత్తున చేపట్టాడు బహదూర్ యార్ జంగ్. ఈ చర్యల ఫలితంగా హిందువుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఆరంభమయింది. కానీ బహాదూర్ యార్ జంగ్‌ మాత్రం ముస్లింలలో ఈయన ఇస్లాం  మతం  కోసం పోరాడే పవిత్ర వీరుడిగా ఎదిగాడు.

అయితే, భారత్ ప్రజాస్వామ్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో రాజ్యంలో జాగృతమైన ప్రజల ఆకాంక్షలను అణచివేయటం అంత సులభం కాదు. కాబట్టి, 1929లో రాజ్యంలో బహిరంగ సభలన్నింటినీ నిజామ్ ప్రభుత్వం నిషేధించింది.  నిజానికి ఈ నిషేధం కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభువు అండదండలున్న ఇత్తెహాద్‌కు ఇది వర్తించదు. ఇత్తెహాద్ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు.

1930-35 నడుమ గాంధీజీ నాయకత్వంలో సత్యాగ్రహ ఉద్యమ తరంగాలు దేశాన్ని ముంచెత్తాయి. భారత, బ్రిటీష్ రాజకీయ నాయకుల నడుమ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు, బ్రిటీష్ పార్లమెంటులో 1935 భారత ప్రభుత్వ చట్టం ఆమోదం పొందటం దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజితులు చేసింది.

1935లో కొందరు పౌరులు మతంతో ప్రమేయం లేకుండా ‘నిజామ్ పౌరుల సమితి’ని ఏర్పాటు చేశారు. హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలలో భాగం ఇది. ఈ సమితి ఏర్పాటును నిజామ్ మెచ్చలేదు. రాజ్యం నుంచి బాధ్యతాయుతమైన పాలనను కోరకూడదు. తన ప్రజలను తన ఇష్టం వచ్చిన పాలించే హక్కు ‘అలా హజ్రత్’ కు ఉంది. దాంతో పుట్టక ముందే ఈ సమితి నశించింది.

భాషాపరంగా హైదరాబాదును మూడు భాగాలుగా విభజించవచ్చు. తెలుగు అధికంగా మాట్లాడే జిల్లాలు, మరాఠీ అధికంగా మాట్లాడే జిల్లాలు, కన్నడం అధికంగా మాట్లాడే జిల్లాలుగా విభజించవచ్చు. ప్రతి భాషా విభాగంలో వారికి ప్రత్యేకమైన స్థానిక సంస్థలు, మహాసభలు అనబడే పౌర సంఘాలు ఉన్నాయి. పైకి విద్యా వ్యాప్తి, సాంఘిక సేవ అన్నవి లక్ష్యాలుగా ప్రకటించినా, ఈ మహాసభలు రాజకీయ కార్యకలాపాలను సజీవంగా ఉంచాయి.

పదకొండవ శతాబ్దంలో ఇంగ్లండ్, డెన్మార్క్, నార్వేల రాజు కాన్యూట్‌ను ప్రజలు గొప్ప శక్తి కలవాడని పొగుడుతూంటే, తాను మానవమాత్రుడిని అని, ఆటుపోట్లను ఆపలేక తన నిస్సహాయతను ప్రదర్శిస్తాడు రాజు కాన్యూట్. అంటే, ముంచుకు వచ్చే వెల్లువను ఎంత శక్తివంతుడైనా ఆపలేడు. అలా రాజ్యంలో వెల్లువై ముంచెత్తుతున్న ప్రజల రాజకీయ ఆశయాల వెల్లువ నిజామ్ కనుసన్నలతో ఆగలేదు. 1935లో ఇండియా ఏక్ట్ ద్వారా ప్రాంతీయ చట్టసభలకు బ్రిటీష్ ఇండియాలో స్వతంత్ర ప్రతిపత్తికి చట్టబద్ధత లభించినప్పటి నుంచీ, పలు రాజ్యాలలో ఈ చట్టాన్ని అమలు చేయటం తమ హక్కు అని ప్రజలు ఉద్యమించారు. 1937లో నిజామ్ రాజ్యంలోని ప్రజల ఆశయాలకు ప్రభుత్వ పాలనతో అనుసంధానం చేసేందుకు ఒక కమిటీని నియమించాడు.

సమస్య పరిష్కారాన్ని దాటవేసే ఈ చర్యతో ప్రజలలో నిరాశ కలిగింది. అభ్యుదయ భావాలు గల హిందువులు, ముస్లింలు చేతులు కలిపి ఓ సభను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వెంటనే ఐకమత్యంగా ఉన్న హిందువులు ముస్లీముల  నడుమ విభేదాలు సృష్టించారు. ‘13 శాతం సంఖ్య ఉన్న ముస్లింలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు హిందువులు సిద్ధంగా ఉన్నారా?’ అన్న ప్రశ్న లేవనెత్తారు. హిందువులు ఈ ప్రతిపాదనకు సుముఖంగా స్పందించకపోవటంతో ఈ సభ నుంచి ముస్లింలు వైదొలగారు.  హిందూ ముస్లింలకు 50 శాతం నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండాలి అన్న సూత్రాన్ని – నిజామ్, అతని సలహాదార్లు, ఓ మౌలిక రాజ్యాంగ సూత్రంగా చివరి వరకూ పట్టుకుని వేళ్ళాడారు.

నిజామ్ సమర్థకుడు అయిన సర్ అర్థర్ లోథియన్, నిజామ్ పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తపరుస్తూ, ‘ప్రస్తుత పరిస్థితులలో నిజామ్, ముస్లింలకు లభిస్తున్న సౌకర్యాలను తగ్గించే రీతిలో రాజ్యాంగాన్ని మార్చలేడు. ఇది ఇత్తెహాదులకు ఆగ్రహం కలిగిస్తుంది. వీరంతా నిజామ్ మద్దతుదార్లు. కాబట్టి, వారి మద్దతును నిజామ్ కోల్పోలేడు. నిజామ్‌కు సాధ్యమైన మార్పేది హిందువులకు ఆమోదం కాదు. అందువల్ల అతనికి కోల్పోయిన ముస్లిం మద్దతుదారుల స్థానాన్ని భర్తీ చేసేందుకు హిందూ మద్దతు లభించదు’ అని తన పుస్తకంలో (Kingdoms of Yesterday by Sir Arthur Lothian) 1947లో రాశాడు. ఇది 1937 నుంచీ వర్తిస్తుంది.

1937లో, అప్పటి ఆర్థిక శాఖా మంత్రి సర్ అక్బర్ హైదరిని పాలక మండలి అధ్యక్షుడిగా నియమించి ప్రధాన మంత్రి అని పిలిచారు. అయితే సర్ అక్బర్ పరిస్థితి పగవారికి కూడా రావద్దని అనిపించేట్టుండేది. ఈయన భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రతిపాదించిన సమస్త భారత సమాఖ్య వైపు నడిపిస్తాడని ముస్లింలు ఆయనను అనుమానించారు. ఈయన రాజ్యం హక్కుల కోసం పట్టుబట్టి, జాతీయ సమాఖ్య ఏర్పాటుకు అడ్దు పడుతున్నాడని బ్రిటీష్ ప్రభుత్వం అతడిపై ఆరోపణలు చేసేది.

మత ఛాందసవాది కాని సర్ అక్బర్ అసిధారా వ్రతం చేయాల్సి వచ్చింది. ఇత్తెహాద్ వారికి ప్రియతముడు. వారు నడిపే పత్రిక రూహ్‍బర్  ను నియంత్రించే ఖ్వాజా మొయినుద్దీన్ అన్సారీని కార్యనిర్వాహక మండలికి కార్యదర్శిగా నియమించాడు. నవాబ్ మొయిన్ నవాబ్ జంగ్‌గా ప్రసిద్ధి పొందిన ఈయన కొన్నాళ్లకి ఇత్తెహాద్ ఆత్మసాక్షిగా ఎదిగాడు.

1938లో శ్రీ రామాచార్, శ్రీ బి. కృష్ణారావు (ప్రస్తుతం,  అంటే , ఈ పుస్తక రచన కాలంలో,  కేరళ గవర్నర్)లు నిజామ్ రాజ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‍ను ఏర్పాటు చేశారు. అసఫా వంశానికి చెందిన ఘనత వహించిన నిజామ్ నేతృత్వంలో బాధ్యతాయుతమైన పాలనను సాధించటం వీరి లక్ష్యం.

ఈ చర్యకు నిజామ్ అలవాటయిన రీతిలో స్పందించాడు. సెప్టెంబర్ 4న, హైదరాబాద్ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల తరువాత, రాష్ట్ర కాంగ్రెస్ చట్ట వ్యతిరేకమని, మత సంస్థ అనీ నిషేధించాడు. నిజానికి మత సంస్థలు అయిన ఇత్తెహాద్ కానీ, హిందూ మహాసభలు కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటూ పోయాయి. నిజామ్‍కు ఇవి ప్రమాదకరంగా అనిపించలేదు.

కాంగ్రెస్‍ను నిషేధిస్తున్న వార్త హైదరాబాద్ గజెట్‍లో ప్రచురితమవుతున్న సమయంలో ఆయన కొందరు ప్రధాన పౌరులతో సమావేశమయ్యాడు. హైదరాబాదులో జాతీయ భావనలను ఎలా విస్తరింప చెయ్యాలన్నది వారంతా సమావేశంలో చర్చించారు. సర్ అక్బర్ హాస్య చతురతకు ఇది ఒక నిదర్శనం.

అధికారుల ఒత్తిడి, వ్యక్తిగత బెదిరింపులు, అణచివేతలు, హింస జరుగుతుందన్న బెదిరింపుల ద్వారా ముస్లింలు ఉండే ఏ ప్రాంతంలో కూడా హిందువులు మందిరాన్ని నిర్మించటం కాని, మరమ్మత్తులు చేయటాన్ని కానీ అడ్డుకునేవారు. హిందూ మందిరాలను నాశనం చేసేవారు. మందిరాల పవిత్రతను భంగం చేసేవారు. కానీ నేరస్థులెవరినీ పట్టుకునేవారు కాదు. నేరస్థులెవరో తెలిసినా, శిక్షించేవారు కాదు. ఇదే సమయంలో ముస్లిం మత గురువులు, దీన్‌దార్లు బహదూర్ నేతృత్వంలో ఇత్తెహాద్‌లు హిందువులకు తమ మత ప్రచారాన్ని అడ్డూ అదుపు లేకుండా చేసేవారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here