నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-2

1
9

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]కె.[/dropcap]ఎం. మున్షీ గా ప్రసిద్ధి పొందిన కన్హయ్యలాల్ మానెక్‍లాల్ మున్షీ, డిసెంబరు 30, 1887న బ్రిటీష్ కాలం నాటి గుజరాత్ రాష్ట్రంలోని ‘భరూచ్’ వద్ద జన్మించారు. భార్గవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కన్హయ్యలాల్ తండ్రి మానెక్‍లాల్ మున్షీ. తల్లి తాపిబెన్. ఆరుగురు ఆడపిల్లల తరువాత పుట్టిన మొదటి మగపిల్లవాడు కావటంతో అతి గారాబంగా పెరిగారు మున్షీ. 1923-24 ప్రాంతంలో మున్షీ రాసిన ‘ఆధే రాస్తే’ ప్రకారం మున్షీ పూర్వీకులు ఉన్నత విద్యావంతులు. ‘సచిన్’ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారు. ఆయన తండ్రి బ్రిటీష్ పాలనా వ్యవస్థలో ఉద్యోగం చేసేవారు. అందుకని మున్షీ చదువు సూరత్, ధన్‍ధూకా, భరూచ్ వంటి ప్రాంతాలలో సాగింది.

బాల్యం నుంచి మున్షీకి తన ప్రాంతం, భాష, సంస్కృతి, సాంప్రదాయల పట్ల గౌరవం, అభిమానంతో పాటు గర్వం కూడా ఉండేది. ఇంట్లో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం, అవగాహన నేర్పితే, పాఠశాలలో అతనికి ఆధునిక విద్య, విజ్ఞానాలతో పరిచయం కలిగింది. మున్షీ అరవిందో శిష్యుడు. అతని ప్రభావంతో భారతీయ ప్రాచీన తత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవాభిమానాలు కలిగాయి.

మహాత్మాగాంధీ ప్రభావంతో జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడయ్యారు మున్షీ. అరబిందో ప్రభావంతో విప్లవ మార్గంలో ప్రయాణించిన మున్షీ, గాంధీ ప్రభావంతో శాంతియుత పోరాటం వైపు మళ్ళారు. గుజరాతి, ఆంగ్ల సాహిత్యాలపై పట్టు సంపాదించారు. కాంగ్రెస్ తరఫున దేశ స్వతంత్య్రం కోసం పోరాడి జైలు పాలయ్యారు. దేశంలో మారుతున్న వాతావరణం మున్షీని కలవరపరిచింది. ప్రత్యేక దేశం కావాలన్న ఇస్లామీయుల డిమాండ్ మున్షీకి శాంతియుత పోరాటం పరిమితులను అవగాహనకు తెచ్చింది. హింస ద్వారా అయినా ‘ప్రత్యేక దేశం’ డిమాండ్‍ను వదిలేసేట్టు చేయాలన్న ఆలోచన కలిగింది. హిందువులు, ముస్లింలు సామరస్యంగా కలసి ఉండే ‘అఖండ హిందూస్తాన్’ గురించి కలలు కనేవారు మున్షీ.

భారతీయులకు తమ సంస్కృతి సంప్రదాయల పట్ల గౌరవాభిమానాలు ఉండడం, పూర్వీకుల పట్ల విశ్వాసం, ఆత్మవిశ్వాసం వంటి భావనలను ఇనుమడింపజేస్తుందన్న నమ్మకంతో, గుజరాతీలలో గుజరాతీ చరిత్ర సంస్కృతి పట్ల గౌరవం కలిగించాలనే ఉద్దేశంతో కలం చేపట్టి హిస్టారికల్ ఫిక్షన్ రచనలు ప్రారంభించారు మున్షీ.

గుజరాతీ ‘అస్మిత’ అన్న పదం కె.ఎం.మున్షీ రూపొందించినదే. గుజరాత్ ‘ఆత్మగౌరవం’, గొప్పదనాలను ప్రదర్శిస్తూ – పటాన్ ని ప్రభుత్ (The Glory of Patan), 1916, గుజరాత్ నో నాథ (The Lord or Master of Gujarat) 1917, రాజాధిరాజ (The King of Kings), 1922 వంటి మూడు నవలలు రాసారు. ఈ మూడు నవలలు గుజరాతీయులనే కాదు, దేశ ప్రజలందరినీ ఆకర్షించాయి. ఈ స్ఫూర్తితో ఈ నవల రచన శైలిని ప్రేరణగా తీసుకుని, దేశంలోని అన్ని భాషల వారు తమ తమ ప్రాంతం గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రదర్శిస్తూ, చారిత్రక కాల్పనిక రచనలను సృజించారు. తెలుగులో విశ్వనాథ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రిలతో సహా పలువురు రచయితలు హిస్టారికల్ ఫిక్షన్ రచనలు చేశారు. ఈ రకంగా ‘అస్మిత’ భావన ప్రాచుర్యం పొందింది.

మున్షీ చరిత్ర నవలల గురించి ఓ విమర్శకుడు “Munshi happens to be a historian as well as a novelist. Ordinarily a conscientious historian would not take liberties with history, and without taking such liberties it would not possible for him to be effective as a novelist.. It is surprising that Munshi the historian and Munshi the novelist do not seriously fall out. The reason is that Munshi is far from being the academic type of more or less dispassionate historian. Indeed he searched for strength and inspiration in the Pre-Muslim history of India.” అని వ్యాఖ్యానించాడు.

మున్షీ ప్రభావంతో దేశవ్యాప్తంగా హిస్టారికల్ ఫిక్షన్ రచయితలు ముస్లింల కన్నా ముందరి చరిత్ర నుండి ప్రేరణను పొంది ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసే రచనలు చేశారు. చరిత్ర రచనలో సమకాలీన సమాజాన్ని ప్రతిబింబింప చేస్తూ సమస్యలకు పరిష్కారాలు వెతికారు. తమిళంలో ప్రఖ్యాత రచయిత కల్కి ‘పొన్నియన్ సెల్వన్’ రచనలపై మున్షీ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. తెలుగులో నోరి నరసింహ శాస్త్రి రచనలపై మున్షీ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మున్షీ ‘పటన్’కు సంబంధించి మూడు నవలలు (ట్రిలజీ) రాసినట్టుగా, నోరి నరసింహ శాస్త్రి, కవిత్రయం జీవితాలను ప్రదర్శిస్తూ మూడు నవలలు రాశారు.

స్వాతంత్ర్యం సాధించిన తరువాత మున్షీ పలు కమిటీలలో సమర్థవంతంగా పని చేశారు. సోమనాథ్ మందిరాన్ని పునరుద్ధరించాలన్న సర్దార్ పటేల్ ఆలోచనలను, ఆయన మరణం తరువాత నెహ్రూ వ్యతిరేకతను లెక్క చేయకుండా పూర్తి చేశారు. ‘జై సోమనాథ్’ అనే అద్భుతమైన చరిత్ర నవల రాశారు.

ఎంతో దూరదృష్టి కల మున్షీ 1950లో ఆరంభించిన ‘వనమహోత్సవ్’ సాంప్రదాయం ఇంకా దేశంలో కొనసాగుతోంది. భావితరాలకు తమ చరిత్ర, సంస్కృతి, తాత్విక చింతన, అద్భుతమైన వారసత్వం సజీవంగా అందించేందుకు ఆయన 7 నవంబర్ 1938న భారతీయ విద్యా భవన్‍ను ఆరంభించారు. ప్రస్తుతం భారతీయ విద్యా భవన్, భారత్ లో 119 సెంటర్లు, విదేశాలలో 7 సెంటర్ల ద్వారా విద్యను అందిస్తోంది. మున్షీ దృష్టిలో భారతీయ సంస్కృతిని పునరుజ్జీవం చేసేందుకు మూడు విషయాలు అత్యావశ్యకం.

  1. The other-worldliness in our outlook, the curse of the past, had to be replaced by a sense of joy in the life as it is lived.
  2. Such of the traditions as were outmoded and stifled the creative vitality of the individual and the collective life had to be replaced by a vigorous, constructive and flexible attitude on life.
  3. The fundamental values which had given ageless vitality to Indian culture had to be captured afresh for the younger generation.

ఈ మూడు ఉద్దేశాలను సాకారం చేస్తూ భారతీయ విద్యా భవన్ – భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాలపై అద్భుతమైన పుస్తకాలను ప్రచురించింది. మున్షీ సైతం శ్రీకృష్ణావతార, భగవాన్ పరశురామ్ వంటి గొప్ప పుస్తకాలు రాశారు. 1954లో మున్షీ ప్రారంభించిన భవన్స్ జర్నల్ ఈనాటికీ యువతకు మార్గదర్శనం చేస్తోంది. ఫిబ్రవరీ 8, 1971 న మున్షీ మరణించారు.

1948లో నిజామ్ రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యేందుకు వ్యతిరేకిస్తూ స్వతంత్ర్య దేశంగా ఏర్పడాలని పట్టుబట్టిన సమయంలో భారత ప్రభుత్వం తరఫున దౌత్య ప్రతినిధిగా, ఏజంట్ జనరల్‍గా హైదరాబాదు  వచ్చారు మున్షీ.  మున్షీ హైదరాబాద్ రావటానికి కూడా భారత ప్రభుత్వం, నిజామ్‍ల నడుమ జరిగిన Standstill (యథాతథం) ఒప్పందం కారణం.

1937-39 ప్రాంతాలలో బొంబాయి గృహశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెలరేగిన మతపరమైన అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేశారు మున్షీ. అవసరమైతే హింస ద్వారా అయినా, ప్రత్యేక దేశం కావాలన్న ముస్లింల కోరికను అణచివేయాలని నమ్మినవారు మున్షీ. అందుకని మున్షీని హైదరాబాద్‍కు భారత ప్రభుత్వం ఏజంట్-జనరల్‍గా పంపుతున్నదని తెలియగానే ఈ నిర్ణయాన్ని నిజామ్ వ్యతిరేకించాడు. మున్షీని శత్రువుగానే చూసింది నిజామ్ ప్రభుత్వం. ఆయనని దాదాపుగా గృహ నిర్బంధం లోనే ఉంచింది. నివసించేందుకు తగిన వసతి గృహం కూడా ఇవ్వలేదు. అయినా సరే, ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా మున్షీ – సర్దార్ పటేల్ తనపై ఉంచిన గురుతరమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. నిజానికి సర్దార్ పటేల్   ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు మున్షీ హైదరాబాద్ వచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ మహాత్మాగాంధీ “ఇది నీ ధర్మం” అని చెప్పటంతో ధర్మ నిర్వహణ కోసం హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు మున్షీ.

తనపై నిజామ్ ఎన్ని నిబంధనలు విధించినా, అనుక్షణం ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందన్న నిజం తెలిసికూడా మున్షీ హైదరాబాదులో నెలకొని ఉన్న పరిస్థితులను సర్దార్ పటేల్‍కు చేరవేశారు. మున్షీ అందించిన సమాచారం ఆధారంగానే సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’కు ఆమోదం తెలిపారు. అందుకే మున్షీని ‘ఆపరేషన్ పోలోలో పాల్గొన్న నిశ్శబ్ద సైనికుడు’ అని అంటారు.

‘ఆపరేషన్ పోలో’ విజయవంతం అవటంలో మున్షీ పాత్రను శ్లాఘిస్తూ సర్దార్ పటేల్ – “On behalf of the Government, I wish to say that we are deeply conscious of the high sense of public duty that induced you to accept this office and the very able manner in which you discharged the duties entrusted to you which contributed in no small measure to the final result.” అని మున్షీని ప్రశంసించారు.

‘ఆపరేషన్ పోలో’లో పాల్గొన్న నిశ్శబ్ద సైనికుడు మున్షీ – హైదరాబాదులో 5 జనవరి 1948 నుంచి 21 సెప్టెంబర్ 1948 వరకూ తన అనుభవాలను పొందుపరిచిన పుస్తకం ‘The End of an Era’. ఆ అనుభవాల తెలుగు అనువాదం ఇది.  చదవండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here