నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-23

3
13

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]మం[/dropcap]త్రి జోషీ అధికంగా కాశిం రజ్వీకి కొమ్ము కాశాడు. నవంబర్‍లో ఆయన నాపై అతనికి ఉన్న పట్టు గురించి, నా ఆలోచనలను ప్రభావితం చేయగల తన శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అంతే కాదు, సర్దార్‍తో ఆయనకు ఉన్న చనువు వల్ల తిన్నగా సర్దార్‍తో మాట్లాడి సమస్యను పరిష్కరించగలనని   రజ్వీని నమ్మించాడు.

సర్దార్ లానే తానూ గుజరాత్‍కు చెందినవాడు కాబట్టి, సర్దార్‍తో ఇంటర్వ్యు కావాలని తోటి గుజరాతీలా ఓ ఉత్తరం రాశాడు. కానీ తనను కలవాలని సర్దార్‍ను రజ్వీ అభ్యర్థిస్తున్నట్టు ఉత్తరం రాశాడు. రజ్వీని కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సర్దార్  సమాధానం ఇచ్చారు. కానీ, రజ్వీని కలిసేందుకు సర్దార్ ఆత్రంగా ఉన్నారన్న భావనను రజ్వీకి కలిగించాడు జోషి. ఇదంతా రజ్వీ అహాన్ని సంతృప్తి పరిచింది. దాంతో సర్దార్‍ను కలిసేందుకు జోషీతో కలసి ఢిల్లీ ప్రయాణమయ్యాడు రజ్వీ.

సర్దార్‌తో, సర్దార్ సెక్రటరీ శ్రీ శంకర్, జోషీలతో జరిపిన పలు సంభాషణల ద్వారా ఢిల్లీలో ఏం జరిగిందో నేను గ్రహించాను.

సర్దార్ గదిలోకి జోషీని, రజ్వీని తీసుకువెళ్ళాడు శంకర్. ఆ గదిలో సర్దార్ నిశ్చలంగా, విగ్రహంలా కూర్చుని ఉన్నారు. సర్దార్ ముఖం గంభీరంగా, దృఢ నిశ్చయంతో ఉంది.

జోషీ మర్యాదగా నవ్వుతూ నమస్కారం చేశాడు. రజ్వీ గదిలోకి వచ్చాడు. తల ‘సలామ్’లా ఊపుతూ సర్దార్ ఎదురుగా కూర్చున్నాడు.

గదిలో నిశ్శబ్దం తాండవించింది కాస్సేపు.

“చెప్పండి, మీకు ఏం కావాలి?” అడిగారు సర్దార్.

రజ్వీ మతి భ్రమించినవాడిలా ఉన్నాడు. అతని కళ్ళు దయ్యం పట్టినవాడిలా కదలుతున్నాయి. నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. ఆయన కోపంగా చూస్తూ కూర్చున్నాడు. జోషీ భయంగా, ఇబ్బందిగా ఉన్నాడు. సర్దార్ కళ్ళు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నాయి.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అన్నాడు రజ్వీ “మీరు  హైదరాబాదు విషయంలో  మనసును మార్చుకోవాలి ”.

తలచుకుంటే నిశ్శబ్దాన్ని అతి ఇబ్బంది కలిగే విధంగా మలచగలరు సర్దార్. చాలా సేపటి తరువాత “ఎవరి మనసు  విషంతో నిండి వుందో , వారి  మనస్సుల్లో  మార్పు రావాలి” అన్నారు సర్దార్.

“హైదరాబాద్‍ను స్వతంత్రంగా ఎందుకు ఉండనివ్వరు?” అడిగాడు రజ్వీ.

“నేను ఇతర ఏ రాజ్యానికి ఇవ్వని అధికారాలు హైదరాబాద్‍కు ఇచ్చేందుకు అన్ని పరిమితులు, పరిధులు దాటాను. ఇక అంతకన్నా అధికంగా హైదరాబాద్‍కు ఏమీ ఇవ్వటం కుదరదు.”

“కానీ హైదరాబాద్ ఎదుర్కుంటున్న కష్టాలను మీరు అర్థం చేసుకోవాలి” కొనసాగించాడు రజ్వీ.

“పాకిస్తాన్‍తో మీరు ఏదో ఒప్పందం చేసుకుంటే తప్ప హైదరాబాద్‍కు ఎలాంటి కష్టాలున్నట్టు నాకు అనిపించటం లేదు” సమాధానంగా అన్నారు సర్దార్.

“మీరు మా కష్టాలను అర్థం చేసుకోకపోతే మేమూ మా పట్టు విడవం. హైదరాబాదులో చివరి మనిషి వరకూ పోరాడుతాం. ప్రాణాలు విడుస్తాం” అత్యంత ఉత్తేజితుడై అరిచినట్టు అన్నాడు రజ్వీ.

“మీరు ఆత్మహత్య చేసుకునేందుకు అంత ఉత్సాహంగా ఉంటే, నేనెవరిని వద్దనటానికి?” నిర్మొహమాటంగా అన్నారు సర్దార్.

“హైదరాబాద్ ముస్లింల గురించి మీకు తెలియదు. మా స్వాతంత్రం కోసం మేము సర్వం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.”

“త్యాగం ప్రస్తావన వస్తే, తానేం చేయగలదో భారతదేశం చేసి చూపించింది. తానేం త్యాగం చేయగలదో ఇంకా హైదరాబాద్ చేసి చూపించాల్సి ఉంది” నింపాదిగా అన్నారు సర్దార్.

“దీన్ కోసం, మిల్లత్ కోసం రక్తం చిందిస్తామ” ని పిచ్చిపట్టినవాడిలా అరవటం ఆరంభించాడు రజ్వీ (దీన్ అంటే మతం, సంప్రదాయం; మిల్లత్ అంటే జాతి, నమ్మకం వంటి అర్థాలున్నాయి).

రజ్వీ అరుపులను శాంతంగా విన్నారు సర్దార్. అరిచి అరిచి ఊపిరి పీల్చుకునేందుకు రజ్వీ ఆగినప్పుడు శాంతంగా చెప్పారు సర్దార్ – “ఆలస్యం అయ్యే లోగా నిజాన్ని మీరు గ్రహిస్తే మంచిది. వెలుతురు ఎదురుగా ఉన్నప్పుడు దాన్ని విస్మరించి  చీకటిలోకి దూకకండి”. ( అంటే, వెలుతురులాంటి సత్యాన్ని విస్మరించి, చీకటిలాంటి అబద్ధాన్ని నిజమని భ్రమపడకండి అని అర్ధం..//అనువాదకుడు)

పర్షియా మిళితమైన ఉర్దూలో, చక్కటి ఇంగ్లీషులో రజ్వీ మాట్లాడాడు. గుజరాతీ హిందీ, స్వచ్ఛమైన ఇంగ్లీషులో సర్దార్ మాట్లాడేరు. సర్దార్ చివరి మాటలతో ఈ ఇంటర్వ్యూ ముగిసింది.

రజ్వీ, జోషీలు వెళ్లిపోయారు.

నవంబరు 25న, రజాకార్ల కేరింతల నడుమ సర్దార్‍తో తన కలయిక వివరాలను రజ్వీ బహిరంగ సభలో ప్రకటించాడు.

“సర్దార్ స్వయంగా ఆహ్వానించటంతో ఢిల్లీ వెళ్ళాను. ప్రపంచం ముందు హైదరాబాద్ పరిస్థితిని, ముస్లింల స్థితిని ప్రదర్శించటం నా ఢిల్లీ ప్రయాణ లక్ష్యం. నన్ను ఢిల్లీకి ఆహ్వానించింది సర్దార్ పటేల్. ఒకవేళ నేను కనుక సర్దార్ పటేల్ ఆహ్వానాన్ని మన్నించక పోయి ఉంటే, మనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారానికి బలమిచ్చినట్టవుతుంది. ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ముస్లిం అన్నవాడు నిజం కోసం నిలిచేందుకు వెరువడు. నేను సర్దార్ పటేల్‍ను కలిశాను. సర్దార్ పటేల్ కాంగ్రెస్‍కు మారుపేరు. అంటే నేను కాంగ్రెస్‍ను కలిసినట్టు.

దేవుడి దయ వల్ల మొదటిసారి మన దేశానికి మన దేశ ప్రజలు ప్రాతినిధ్యం వహించారు. ఇంతకు ముందు మన తరఫున చర్చలకు వెళ్ళినవారు సర్దార్ పటేల్ తలుపు ముందు బిచ్చగాళ్ళలా బ్రతిమిలాడారు. మౌంట్‌బాటెన్ ముందు మోకరిల్లారు. దీని ఫలితం ఏమిటంటే సర్దార్ గర్వంతో చెట్టెక్కి కూర్చున్నాడు.”

నేను హైదరాబాద్‍లో అడుగుపెట్టినప్పటి పరిస్థితి:

జనవరి 15న నా నివాసం బొలారం రెసిడెన్సీ నుంచి దక్కన్ హౌస్‍కు మార్చాను.  హైదరాబాద్ కంటోన్‍మెంట్‍లో దక్కన్ హౌజ్ ఒక భాగం. అంత వరకూ సికింద్రాబాదులో ఉన్న సైన్యానికి అధికారి ఆ భవంతిలో నివసించేవాడు.

దక్కన్ హౌస్ పేరును ‘దక్షిణ భవన్’గా మార్చాను. నిజామ్, రజ్వీ, వారి అనుచరులలో ఇది సంచలనం సృష్టించింది. దక్కన్ భవన్ పేరును మార్చే హక్కు నాకు ఎవరిచ్చారు? సికిందరాబాద్ సైన్యం ఆధీనంలో ఉన్న ఈ భవంతి త్వరలో నిజామ్ ప్రభుత్వ అధికారం పరిధిలోకి వస్తుంది. నేను దక్కన్ భవనం పేరు మార్చటం గురించి జరిగిన చర్చల వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి.

1948లో ‘దక్షిణ సదన్’ అన్న పేరు సంతరించుకున్న ప్రాధాన్యాన్ని, ఆ పేరు ప్రజలలో కలిగించిన విశ్వాసాన్ని విస్మరించి, పోలీసు చర్య జరిగిన తరువాత సైన్యాధికారులు ఈ భవంతిని మళ్ళీ దక్కన్ హౌస్ అనే పేరుతోనే చలామణీ చేయటం దురదృష్టకరం.

హైదరాబాద్‍తో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఏజంట్ జనరల్ ఉండటం ప్రజలకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. వారి మనోబలాన్ని పెంచింది. గతంలో బ్రిటీష్ రెసిడెంట్‍కు ఉన్న అధికారాలు నాకున్నాయని, నేను అంత శక్తివంతుడనని ఎలా అనుకున్నారో గాని ప్రజలు నమ్మారు. నిజానికి రెసిడెంట్‍కి ఉన్నన్ని అధికారాలు నాకు లేవు. నేను  హైదరాబాద్‍లో ఉండటం, హైదరాబాద్ విషయంలో సర్దార్ తగిన చర్యలు తీసుకుంటున్నారటానికి సూచనగా భావించారు ప్రజలు.

ప్రజలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయిన వారు సికింద్రాబాదులోని తమ ఇళ్ళకు తిరిగి రావటం ఆరంభించారు. తమ దీన గాథలు చెప్పుకునేందుకు, బాధలు వివరించేందుకు ప్రజలు నా దగ్గరకు రావటం మొదలయింది.

మరో వైపు, ఇత్తెహాద్ నా గురించి ఎడతెగని దుష్ప్రచారం సాగిస్తూనే ఉంది. నేను మాట్లాడిన ప్రతి మాటలో, ఏదో ఓ వంకర ఆలోచనని కనుగొని, లేని అర్థాలు ఆపాదించి నన్ను దూషించేందుకు దాన్ని ఉపయోగించేవారు. వాళ్ళ దృష్టిలో నా గురించి ఒక విషయం నిర్ధారణ అయింది. నేను కేవలం ‘వ్యాపార మధ్యవర్తి’ని మాత్రమే. నాకు అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వకూడదని వాళ్ళు నిశ్చయించారు. భారతదేశ జెండా ఉన్న కారులో ప్రయాణించే హక్కు నాకు లేదు. ప్రజలను కలవటం నా పని కాదు. రిసెప్షన్లకు నేను వెళ్ళకూడదు.

హైదరాబాదులో నేను పత్రికలకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ‘నేను భారత ప్రభుత్వం, హైదరాబాద్ ప్రభుత్వాల నడుమ స్నేహ భావనలను, సంబంధాలను పెంపొందించేందుకు హైదరాబాద్ వచ్చాను. నిజామ్ నన్ను గెలవనిస్తే, ఆయన హృదయాన్ని కూడా  గెలిచేందుకు వచ్చాను’ అన్నాను. ఎలాంటి దురుద్దేశం లేని ఈ మాటలు వారికి అభ్యంతరకరంగా అనిపించాయి. నిజామ్ హృదయాన్ని గెలవటం గురించి మాట్లాడేటందుకు నేనెవరిని?

నేను హైదరాబాద్‍లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ ఇత్తెహాద్ అధికారికంగా, అనధికారికంగా అన్ని రకాలుగా నన్ను భయభ్రాంతుడిని చేయాలని ప్రయత్నించింది. నేను హైదరబాదు‍లో నా బాధ్యతలు వదిలిపారిపోయేటట్టు లేదా నేను ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిశ్శబ్దంగా ఉండిపోయేట్టు చేయాలని ప్రయత్నించారు. నేను వారు కోరినట్టు కాకుండా కార్యశీలిలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని నిరూపించాలని నిశ్చయించుకున్నాను.

లాయక్ అలీ, మొయిన్ నవాబ్ జంగ్, రామాచార్, జోషీలు పాల్గొన్న కొన్ని కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. రజ్వీ ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ఒకాయన ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఓ  కార్యక్రమానికి ఆహ్వానించాడు.

“నేను, మున్షీ ఉన్న కార్యక్రమానికి రావటమా? హైదరాబాద్ వచ్చినప్పటి నుంచీ  నన్ను కలవటానికి ఒక్కసారి కూడా రాలేదు మున్షీ” అన్నాడు రజ్వీ.

నేను వచ్చిన కొన్ని రోజుల తరువాత సికిందరాబాద్ ప్రజలు నా గౌరవార్థం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ జరగాల్సిన ముందు రోజు, రజాకార్లు, పలు వీధులలో తిరుగుతూ ఎవ్వరూ సభలో పాల్గొనవద్దనీ, పాల్గొంటే తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బెదిరించారు. అయినా సరే, రేస్ కోర్స్ మైదానంలో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ప్రజలు సభలో పాల్గొన్నారు. రామానంద తీర్థ సభకు అధ్యక్షత వహించాడు. మొట్టమొదటిసారి ప్రజలు ‘మహాత్మా గాంధీకీ జై’, ‘జవహర్ లాల్ నెహ్రూకీ జై’, ‘సర్దార్ పటేల్ కీ జై’ వంటి నినాదాలను ధైర్యంగా, ఎలాంటి భయాలు లేకుండా చేశారు.

నేను జాగ్రత్తగా మాట్లాడాను. అక్బరు తరహా సంప్రదాయాన్ని అనుసరిస్తూ హిందూ-ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తున్న వాడిలా నిజామ్‍ను అభివర్ణించాను. ఇలాంటి పొగడ్తకు నిజామ్ అభిమానులు, హిందువులైనా, ముస్లింలైనా సంతోషించాలి. నేను ‘విలీనం’ అన్న మాటను వాడలేదు. భారత్ హైదరాబాద్‍ల నడుమ శాశ్వత స్నేహ సంబంధాలని సాధించేందుకు ప్రయత్నించే మధ్యవర్తిగా మాత్రమే నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడినా లాభం లేకుండా పోయింది. మరుసటి రోజు ఇత్తెహాద్ పత్రికలు నాపై విరుచుకు పడ్డాయి. నా గౌరవార్థం ఏర్పాటు చేసిన సభలో పాల్గొనే హక్కు నాకు లేదు. పాల్గొన్నా, ఉపన్యసించే హక్కు నాకు అస్సలే లేదు. వ్యాపార ప్రతినిధిగా నేను నా పరిధిని మించి ప్రవర్తిస్తున్నాను. హైదరాబాద్ వదిలి వెళ్ళమని నన్ను శాసించాలి . అన్నిటినీ మించి, ఘనత వహించిన ప్రభువు ‘నిజామ్’ను నేను అక్బర్‍తో పోల్చి అవమానించాను. అక్బర్ అసలైన ముస్లిం కాడు. ఇస్లామిక్ రాజ్యానికి ప్రభువు నిజామ్. అలాంటి నిజామ్‍ను అక్బర్‍తో పోల్చటం ఘోరమైన అవమానం. భారత్‍తో సన్నిహిత సంబంధాల ప్రస్తావన తేవటం అన్నది భారత సార్వభౌమత్వాన్ని సాధించాలని చేసే ప్రయత్నం.

త్వరలో నాకు పరిస్థితి తీవ్రత అర్థమయింది.

రజాకార్లు అసలైన సమస్య. గ్రామాలపై రజాకార్ల దాడుల గురించి ప్రత్యక్ష సాక్షుల ద్వారా నిజాలు గ్రహించాను. భారత ప్రభుత్వంతో  కల సరిహద్దు గ్రామాలపై వారి దాడుల గురించి తెలుసుకున్నాను. ఈ దాడుల సమయంలో ప్రజలపై సామూహిక పన్నులు విధించారు రజాకార్లు. దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడ్డారు. హత్యలు చేశారు. కాంగ్రెసుకు కానీ కమ్యూనిస్టులకు కానీ సానుభూతి వ్యక్తం చేసే గ్రామాలపై దాడులు చేసేందుకు రజాకార్లకు – పనికిరాని చిన్న కారణం కూడా – పనికివచ్చేది. ఆయా గ్రామాలపై దారుణమైన దాడులు చేసేవారు. ప్రజలను రాక్షసంగా హింసించారు. ఆయుధాలు ఝుళిపిస్తూ, నినాదాలు చేస్తూ గ్రామాలపై దాడులు చేసేందుకు ట్రక్కులలో వేగంగా పరుగు పరుగున వెళ్ళే రజాకార్లను నేను చూశాను.

నగరంలో మత ఛాందసత్వం తీవ్రంగా కలిగిన  ముస్లింలు, అవసరాలు అనేకం ఉన్న ముస్లింలు – రజాకార్ల సభ్యులుగా సాయుధ సైన్యంలో చేరేందుకు బారులు కట్టేవారు. వీరిలో భారత్ నలుమూలల నుంచి వచ్చిన ముస్లింలు, పాకిస్తాన్ నుంచి, అరేబియా నుంచి వచ్చిన ముస్లింలు కూడా ఉన్నారు.

ప్రభుత్వం ఆయుధాల తయారీకి సిద్ధమవుతోంది. పెద్ద ఎత్తున ట్రక్కులను కొంటోంది. రజాకార్లు, పోలీసులు వేగంగా ప్రయాణించేందుకు వీలుగా మోటర్ల తయారీకి ఆర్డర్లు జారీ చేసింది ప్రభుత్వం. గోవాను కొనేందుకు చర్చలు సాగుతున్నాయి. హైదరాబాదు సైన్యాధికారి ఎల్. ఎద్రూస్ ఆయుధాలు కొనేందుకు యూరప్ దేశాలు చెకోస్లొవేకియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్ళాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here