నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-25

1
10

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

మొదటి దశ చర్చలు:

[dropcap]జ[/dropcap]నవరి 10న, నేను నా ప్రథమ కర్తవ్యం గురించి ఆలోచించటం ఆరంభించాను. రెండు ప్రధానాంశాల విషయాల్లో  లాయక్ అలీతో స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవటం వైపు దృష్టి సారించాను. యథాతథ ఒప్పందం వల్ల కలిగే చిక్కులు ఏమిటి? రెండు వైపులా యథాతథ ఒప్పందం సరిగ్గా అమలు అయ్యేట్టు చూడటం ఎలా? అన్న విషయాల గురించి అవగాహనకు రావాలి.

నేను హైదరాబాద్‍లో అడుగుపెట్టిన జనవరి 5వ తేదీ నుండి సెప్టెంబర్ 13న పోలీస్ చర్య ఆరంభమయ్యే వరకూ, భారత్ హైదరాబాద్‍ల నడుమ చర్చల ద్వారా సయోధ్య సాధించాలన్న ప్రయత్నంలో నాలుగు స్పష్టమైన దశలు కనబడతాయి.

జనవరి 10 నుంచి జనవరి 31 వరకు జరిగిన చర్చలను మొదటి చర్చల దశగా భావించవచ్చు. ఈ సమయంలో యథాతథ ఒప్పందాన్ని అమలు పరిచేందుకు లాయక్ అలీని ఒప్పించే ప్రయత్నాలు నేను చేశాను.

ఫిబ్రవరి 1 నుంచి మార్చి 29 వరకు చర్చలలో రెండవ దశగా భావించవచ్చు. ఈ సమయంలో భారత సమాఖ్య, హైదరాబాద్‍ల నడుమ శాశ్వత సంబంధాల సాధనకు సరైన ఓ ప్రాతిపదికను ఏర్పాటు చేసేందుకు ఒప్పించాలని ప్రయత్నించాను, విఫలమయ్యాను.

ఏప్రిల్ 1 నుంచి జూన్ 19 నడుమ కాలాన్ని మూడవ దశగా భావించవచ్చు. ఈ దశలో సర్ జాన్ వాల్టర్ మాంక్టన్ సహాయంతో దీర్ఘకాలిక ప్రభావం చూపే రాయితీలను హైదరాబాద్‍కు ఇస్తూ ఓ ఒప్పందానికి రావాలని లార్డ్ మౌంట్‍బాటెన్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

నాలుగవ దశలో ఇత్తెహాద్ కబంధ హస్తాల నుండి తప్పించుకుని ఏదో ఓ ఒప్పందం చేసేసుకోవాలని  నిజామ్ బలహీన ప్రయత్నాలు చేశాడు. ఆయన కూడా విఫలమయ్యాడు.

ప్రతి ఒక్క దశలో ఏదో ఓ ఒప్పందం కుదరకుండా మోకాలడ్డింది ఇత్తెహాద్.

హైదరాబాద్‍లో నేను సాధించాల్సింది సున్నితమైనది మాత్రమే కాదు, చాలా కఠినమైనది కూడా. నేను సాధించాల్సిన లక్ష్యం ఎలాంటిదో, యథాతథ ఒప్పందం పట్ల భారత ప్రభుత్వ వైఖరి నేపథ్యంలోంచి చూస్తే బోధపడుతుంది. ఓ పవిత్ర గ్రంథాన్ని చదివినట్టు అన్ని పక్షాలు ఈ యథాతథ ఒప్పందాన్ని క్షుణ్ణంగా పఠించాయి. ఈ విషయం గురించి వి. పి. మీనన్ వ్యాఖ్యానించాడు:

“కనీసం ఒక సంవత్సరమైనా దక్షిణ భారతంలో మతపరమైన శాంతిని యథాతథ ఒప్పందం సాధిస్తుందన్నది నెహ్రూ నమ్మకం. ఈ ఒప్పందం ఆవేశాలను తగ్గిస్తుందని, హృదయాలను కరిగిస్తుందని, యథాతథ ఒప్పంద కాలం పూర్తయ్యే లోగా నిజామ్ కూడా భారత్‍లో భాగమయ్యేందుకు సిద్ధపడతాన్నది లార్డ్ మౌంట్‍బాటెన్ నమ్మకం. యథాతథ ఒప్పందం కాలంలో తాము శక్తిని సమకూర్చుకుని, భారత్ సైన్యాలను హైదరాబాద్ వదిలి వెళ్ళేట్టు చేసి, స్వతంత్రాన్ని సాధించేందుకు సిద్ధమయ్యేందుకు తయారీలు చేసేందుకు లభించిన సమయం ఇది అన్నది నిజామ్, అతని సమర్థకుల విశ్వాసం. హైదరాబాద్ ప్రభుత్వ విశ్వసనీయత పట్ల సర్దార్‍కు అపనమ్మకం.”

బహుశా మొత్తం దౌత్య చరిత్రలో ఇంతవరకూ ఏ దౌత్యాధికారికి కూడా నాకు అప్పజెప్పినట్టు  అస్పష్టమైన, సందిగ్ధపూర్వకమైన దౌత్య కార్యం నిర్వహించే  బాధ్యతను ఎవ్వరూ ఎవరికీ  ఎప్పుడూ అప్పజెప్పలేదేమో! నా విధి ఏమిటో నాకు స్పష్టంగా చెప్పలేదు.  విధుల నిర్వహణ సూత్రాలను ఇవ్వలేదు. యథాతథ ఒప్పందంలోని ఓ ఉపవాక్యం ఒక్కటే నేను హైదరాబాద్‍లో ఉండే అర్హతను ఇచ్చింది. ఆ ఉపవాక్యం ‘యథాతథ ఒప్పందం సక్రమంగా అమలు జరిగేందుకు భారత ప్రభుత్వం హైదరాబాద్‍కూ , నిజామ్ ఢిల్లీకూ    తమ ప్రతినిధులను పంపాలి. తమ విధి నిర్వహణలో ఈ ఏజంట్లకు అన్ని సౌకర్యాలను అందజేయాలి.’

ఈ ఒప్పందంలో నా విధి నిర్వహణ పరిధుల ప్రస్తావన లేదు. హైదరాబాద్‍లో నా బాధ్యతలేమిటో నిర్ణయించటం గురించి ఎవరూ ఏమీ ఆలోచించలేదు. అధికారికంగా నా కర్తవ్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థ బాధ్యతలు భారత ప్రభుత్వానివి అని నిజామ్ అంగీకరించాడు. దీని ప్రకారం, గతంలో రెసిడెంట్‍కు ఎలాంటి అధికారం ఉన్నదో, భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఈ మూడు విషయాలలో నాకూ అలాంటి అధికారాలే ఉంటాయి. నిజామ్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసేట్టు చూడడం నా బాధ్యత. భారత ప్రభుత్వం, హైదరాబాద్‍ల నడుమ సహాయ సహకారాల సంబంధాలను నెలకొల్పేందుకు నా దౌత్య ప్రతిభనంతా నేను ప్రదర్శించాలి. నిజామ్ ఆలోచనలో మార్పు సాధించాలి.

స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవాలని నిజామ్ ఆలోచిస్తున్నాడన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసు. యథాతథ ఒప్పందానికి నిజామ్ ఆమోదం తెలపటంలో  ప్రధాన ఉద్దేశం భారత్‍తో తలపడే శక్తి సంపాదించేందుకు తయారీ సమయం కోసమే అని అందరికీ తెలుసు. గాంధీజీ, సర్దార్‍లు నాకు స్పష్టంగా చెప్పారు, 1948 మార్చి లోగా ఒక శాశ్వత ఒప్పందం అయ్యేట్టు చూడాలని; ఆ తరువాత ఒప్పందం సాధించాలని. దీన్ని బట్టి నాకు అర్థమైనదేంటంటే, హైదరాబాదులో నా ప్రధాన బాధ్యత నిజామ్ ప్రభుత్వం భారత్‍తో తలపడేందుకు సైన్యాన్ని సమీకరిస్తున్నా, భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలు చేపడుతున్నా, ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఆ సమాచారాన్ని వెంటనే భారత ప్రభుత్వానికి తెలపాలి.

ఇదే కాక, హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితుల గురించి సాధికారమైన సమాచారాన్ని సేకరించటం, ముఖ్యంగా రజాకార్ల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటం కూడా నా బాధ్యతల్లో ఒకటి. ఇవే కాక, నా ఉద్యోగ విధులకు మానవత్వ కోణం కూడా ఉంది. పెచ్చుమీరిపోతున్న రజాకార్ల దుశ్చర్యల వల్ల, అత్యాచారాల వల్ల భయభ్రాంతులైన ప్రజలకు,   వారి పరిస్థితిపై  భారత ప్రభుత్వం  కన్నేసి ఉంచిందన్న విశ్వాసాన్ని కలిగించటం కూడా నా బాధ్యతే.

ఒక విషయం పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏజంట్ జనరల్‍గా నేను ఏ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన క్రింది స్థాయి ఉద్యోగిని కాను. ఒక వేళ అలా నేను రాష్ట్ర స్థాయి మంత్రిత్వ శాఖ అధికారుల కన్నా తక్కువ స్థాయి ఉద్యోగి వంటి వాడినయితే సర్దార్ నాకీ బాధ్యత అప్పజెప్పేవారు కాదు. నేను ఇలాంటి తక్కువ స్థాయి బాధ్యతను స్వీకరించటాన్ని గాంధీజీ ఆమోదించేవారు కాదు. నేను కూడా నాకు ప్రమాదాన్ని, అనవసర చిక్కులను తెచ్చిపెట్టే బాధ్యతలను స్వీకరించేవాడిని కాదు.

నేను కాంగ్రెసులో పనిచేశాను. వారి ఆలోచనా విధానం నాకు తెలుసు. గాంధీజీ, సర్దార్ లకు నా పట్ల నమ్మకం ఉంది. హింస ద్వారా విజేతగా నిలవాలన్న ఆలోచచనతో దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ పనితీరుతో నేను రాజీ పడలేకపోయానన్న విషయం వారికి తెలుసు. 1947లో, పలు కారణాల వల్ల దేశ విభజనను ఆమోదించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులను విశ్లేషిస్తే దేశ విభజన సరైన నిర్ణయం అనిపిస్తుంది. అయితే, దేశ విభజన తరువాత హింస ద్వారా విజేతగా నిలవాలన్న భావనను ఏ భారతీయ ముస్లిం ప్రదర్శించినా నేను భరించలేనన్న విషయమూ వాళ్ళకు తెలుసు.

భారతదేశం, ఒకే దేశంగా మనగలగాలంటే, భారతదేశంలోని ముస్లింలు అంతా ఈ దేశానికి చెందిన వారమనీ, ఈ దేశంతో విడదీయరాని వారసత్వం తమదనీ అంగీకరించాలి. తాము ప్రత్యేకం అన్న భావన రానీయకూడడు. పాకిస్తాన్ పట్ల ఎలాంటి విధేయతను, సమర్థతను చూపకూడదు. దేశంలోని ఇతరుల పట్ల ఎలాంటి వైరి భావనను ప్రదర్శించకూడదు. ఇది నాకన్నా బలంగా సర్దార్ భావన. కాబట్టి, నా ఆలోచనల గురించి ఇంత తెలిసీ నన్ను హైదరాబాద్ పంపించారంటే, నా అభిప్రాయాలను పరిగణనలోకి తప్పకుండా తీసుకునే ఉంటారు.

అందుకే ‘ముందు మున్షీ వచ్చాడు, వెనుక భారత్ సైన్యం వస్తుంది’, అంటే నేను అడ్వన్స్ గార్డ్‌ లాంటివాడినని ,   ఓ పత్రిక వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘హైదరాబాద్ పై ఆధిక్యం సాధించటం కోసం హైదరాబాద్‍లో ఉన్న అంతర్గత గూఢచారి లాంటి వాడు మున్షీ’ అని భారత్ దృక్కోణం పట్ల ఏ మాత్రం సానుభూతి లేక భారత్‍ని ద్వేషించే ఓ బ్రిటీష్ కాలమిస్ట్ రాశాడు. గ్రీకు పురాణంలో ట్రాయ్ నగరాన్ని గెలుచుకునే ఓ పెద్ద గుర్రం బొమ్మలో సైనికులు దాగి నగరంలోకి రహస్యంగా ప్రవేశించిన ‘ట్రోజన్ హార్స్’ లాంటి వాడినని వ్యాఖ్యానించాడు. నేను ట్రోజన్ హార్స్ లాంటి వాడినో కానో కానీ, నా జీవితం, నా పని, నా దృక్కోణాలు మాత్రం అందరికీ స్పష్టంగా తెలుసు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here