నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-36

0
10

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

మార్చ్ నెల ఆరంభంలో లాయక్ అలీ, సర్ వాల్టర్ మాంక్టన్, మొయిన్ నవాజ్ లతో కూడిన చర్చా బృందం ఢిల్లీ వెళ్ళింది. మౌంట్‌బాటెన్‌తో మార్చ్ 2న జరిగిన సమావేశంలో అలవాటయిన రీతిలోనే చర్చలు సాగేయి. లాయక్ అలీ, గవర్నర్ జనరల్‍ల నడుమ జరిగిన చర్చల నివేదికపై ఇరువురూ సంతకాలు చేశారు. మంత్రిత్వ శాఖలకు ఆ చర్చల నివేదికను సమర్పించిన తరువాత  ఎవ్వరూ దాని విషయం  ప్రస్తావించలేదు.

చర్చలో లాయక్ అలీ తన పట్టు వదలలేదు. హైదరాబాద్ భారత్‍లో విలీనమయ్యే ప్రస్తక్తి లేనే లేదు. హైదరాబాద్‍లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం  ఏర్పాటు కాదు. హిందూ మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తి లేనే లేదు. రజాకార్ల అకృత్యాలకు సంబంధించిన వార్తలన్నీ అబద్ధాలు. స్వచ్ఛంద కార్యకర్తల దళం ఏర్పడిందే హైదరాబాద్ ముస్లింల జీవితాలు ప్రమాదంలో ఉండటం వల్ల. రజాకార్ల సంస్థను నిషేధించాలన్న మౌంట్‍బాటెన్ సూచనకు సమాధానం మౌనమే!

గవర్నర్ జనరల్ కార్యాలయంలోని వారు లాయక్ అలీ, సర్ వాల్టర్ మాంక్టన్‍ల ప్రభావంలో పడ్డారు. హైదరాబాదులో ఎలాంటి సమస్యా లేదనీ, సమస్యలన్నీ హైదరాబాదులో ఉన్న ఏజంట్ జనరల్ సృష్టి అనీ వారు నమ్మారు. అనవసరంగా తనపై నేరారోపణ జరిగితే బాధపడేవాడిలా ప్రవర్తించాడు లాయక్ అలీ. సరిహద్దులు దాటి రజాకార్లు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలపై మద్రాసు, బొంబాయి, మధ్య ప్రాంతాల మంత్రులతో స్వయంగా మాట్లాడేందుకు లాయక్ అలీ సిద్ధమే కానీ, నియమాల ప్రకారం చర్చలన్నీ ఏజంట్ జనరల్ ద్వారా జరగాలి కాబట్టి లాయక్ అలీ నిస్సహాయుడు. అతనేం చేస్తాడు? అన్న అభిప్రాయం అందరిలో కలిగించాడు.

అయితే, లాయక్ అలీకి అవసరమైనప్పుడు నేను మంచివాడినే. నాతో జరిపిన అనంతమైన చర్చలలో హైదరాబాదులో సగం సగం నిష్పత్తిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను పదే పదే ప్రస్తావించాడు. ఎలాంటి చర్యలు చేపట్టకుండా మాటిమాటికీ అదే మాట మాట్లాడుతూండటంతో విసిగి ఓసారి “నిజంగా మీకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉంటే, ఇన్ని మాటలెందుకు, అమలుపరిచి చూపరాదా?” అన్నాను. ఢిల్లీలో, వెంటనే, నేను యాభై శాతం నిష్పత్తిలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమోదం తెలిపానన్నట్టు ప్రచారం సాగింది.

ఢిల్లీలో హైదరాబాదు చర్చా బృందం పర్యటన సంతోషంగా ముగిసింది. హైదరాబాద్ చర్చల నుండి విరమించలేదని న్యూఢిల్లీలో వాళ్ళు సంతోషించారు. చర్చల వల్ల తన సైనిక శక్తి పెంచుకునేందుకు మరింత సమయం చిక్కిందని హైదరాబాదు వాళ్ళు సంతోషించారు. యథాతథ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‍కు ఇచ్చిన 20 కోట్ల సెక్యూరిటీస్‌ను ఉపయోగించమని హామీ ఇచ్చాడు లాయక్ అలీ.

కానీ, మౌంట్‍బాటెన్‍తో జరిగిన చర్చల వివరాలను ప్రచురించలేదు. మార్చ్ 5న సర్దార్‍కు గుండెపోటు వచ్చింది. ఆయన ఆస్పత్రికి పరిమితం అయ్యారు. అంత ఉక్కు మనిషి కూడా ఒత్తిడి ప్రభావానికి గురయ్యారు.

ఈ చర్చలు సాగుతున్న సమయంలో నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. లాయక్ అలీతో చర్చల వల్ల లాభం ఉండదనీ, ఆయన కావాలని కాలయాపన చేస్తున్నాడనీ సర్దార్ గ్రహించారు. అందుకని యథాతథ ఒప్పందం కాలపరిమితి మార్చ్ నెలాఖరుతో పూర్తయిన తరువాత కఠినంగా వ్యవహరించాలని నాతో చెప్పారు. హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంఘటనల జాబితా తయారు చేయమని ఆయన మీనన్‍నూ, నన్నూ ఆదేశించారు. రజాకార్లను నిషేధించాలని ఒత్తిడి చేయాలన్నారు. ఒకవేళ లాయక్ అలీ అందుకు ఒప్పుకోకపోతే సరిహద్దులను కట్టుదిట్టం చేయాలనీ, రజాకార్ల దురాగతాలు హైదరాబాద్ సరిహద్దులు దాటకుండా అడ్డుకోవాలనీ సూచించారు.

రాష్ట్ర మంత్రిత్వ శాఖ  సైనిక సలహదారు హిమ్మత్‍సింగ్‌జీని వెంట తీసుకుని నన్నూ, మీనన్‍నూ మౌంట్‍బాటెన్‍ను కలిసి విషయాలు వివరించాలని కోరారు.

మార్చ్ 6న మేజర్ జనరల్ హిమ్మత్‍సింగ్‍జీని వెంట తీసుకుని నేనూ, మీనన్ మౌంట్‍బాటెన్‍ను కలిశాము.

మార్చ్ 6న జరిగిన చర్చలలో నేను హైదరాబాదులో, పరిసర ప్రాంతాలలో దిగజారుతున్న శాంతిభద్రతల విషయం ప్రస్తావించాను. గ్రామాలలో నెలకొన్న భయాందోళనల పరిస్థితిని, గ్రామ ప్రజల దుస్థితిని, రజాకార్లు జరుపుతున్న దారుణ మారణకాండ, దోపిడీలు, దొంగతనాల గురించి మౌంట్‍బాటెన్‍కు తెలిపాను. హైదరాబాద్ పర్యటించినప్పుడు తాను స్వయంగా చూసిన అనేక విషయాలను మేజర్ జనరల్ హిమ్మత్‍సింగ్‍జీ తెలిపారు. హైదరాబాద్ సైనిక శక్తిని పెంచుకుంటూ యుద్ధానికి సన్నద్ధమవటం గురించి వివరించారు. రెండు నెలలుగా నిరంతరం జరుగుతున్న చర్చల ఫలితంగా నాకు అర్థమైనదేమిటంటే, చర్చల విషయంలో నిజామ్ నిజాయితీగా లేడనీ, యథాతథ ఒప్పందం కాలపరిమితి పూర్తవటం కోసం కాలయాపన చేస్తున్నట్లనిపిస్తున్నదన్న విషయాన్ని తెలిపాను.

మౌంట్‍బాటెన్‌తో నేను నిర్మొహమాటంగా మాట్లాడేను. హైదరాబాదులో నెలకొని ఉన్న పరిస్థితుల అసలు స్వరూపాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెడితే నేను నా విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించనట్లవుతుంది. అయితే ఉన్నదున్నట్లు మౌంట్‍బాటెన్‍కి చెప్పిన తరువాత ఆయనకు నేను నచ్చలేదనిపించింది. భవిష్యత్తులో ఆయన నా మాట వింటారనిపించలేదు. తరువాత కాంప్‍బెల్-జాక్సన్ ద్వారా నా అభిప్రాయం సరైనదేనని తెలిసింది.

సర్దార్ అనారోగ్యం కారణంగా, యథాతథ ఒప్పందాన్ని నిజామ్ ఉల్లంఘించిన విషయాలను నిజామ్‍కు తెలిపి, సరైన చర్యలు చేపట్టమని కోరటాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలని నేను, మీనన్ నిశ్చయించాము. ఈలోగా, రజాకార్లను అదుపులో పెట్టాల్సిన ఆవశ్యకతను లాయక్ అలీతో గట్టిగా చర్చించాలని అనుకున్నాను. రెండు మూడు వారాలలో సర్దార్ ఆరోగ్యం మామూలయిపోతుందని ఆ సమయంలో మేము అనుకున్నాము.

నేను బొలారం తిరిగి వచ్చిన తరువాత లాయక్ అలీ ప్రవర్తనలో మార్పు గమనించాను. ఆయనలో గతంలో కన్నా ఆత్మవిశ్వాసం అధికంగా కనిపించింది. గతంలో వాగ్దానం చేసినట్తు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు. రజ్వీ ఆ సమావేశంలో పాల్గొననన్నాడు. రామానంద తీర్థను జైలు నుంచి విడుదల చేస్తేనే చర్చల్లో పాల్గొంటామని కాంగ్రెస్ పట్టుపట్టింది. రామానంద తీర్థను జైలు నుంచి విడుదల చేసేందుకు లాయక్ అలీ సిద్ధంగా లేడు. సమావేశాల ఏర్పాటు, చర్చలు వంటివన్నీ శుష్క వాగ్దానాలు. వాటిని అమలుపరచటంలో లాయక్  అలీ చిత్తశుద్ధిని కనబరచలేదు.

లాయక్ అలీ కనబరుస్తున్న ఈ రకమైన ఆత్మవిశ్వాసం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. బహుశా నేను మౌంట్‍బాటెన్‍కు తెలిపిన విషయాలు లాయక్ అలీతో చర్చలలో ఆయన ప్రస్తావించకపోవటం నన్ను ఆయన నమ్మటం లేదన్న అభిప్రాయాన్ని కలిగించి ఉంటుంది. అలాగే మౌంట్‍బాటెన్‍తో నెమ్మదిగా సాగుతున్న చర్చలు కూడా చర్చలు ఇంకా దీర్ఘకాలం సాగుతున్నాయన్న నమ్మకం కలిగించి ఉంటుంది. సర్దార్ ఆరోగ్యం దెబ్బ తినటం కూడా వారికి దైవం తమ వైపుందన్న నమ్మకాన్ని కలిగించి ఉంటుంది.

లాయక్ అలీ, మొయిన్ నవాజ్‍లతో మళ్ళీ చర్చలు ఆరంభించాను. ఈ చర్చలలో రజాకార్లతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాను. రజాకార్ల వల్ల కలుగుతున్న భయాందోళలు తొలగితే, సరిహద్దులలో శాంతిభద్రతలు చక్కబడతాయి. అందువల్ల సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్న భారత ప్రభుత్వ సైనికులలో నెలకొన్న ఉద్విగ్నతలు తగ్గుతాయి. తద్వారా చర్చలు ఫలవంతం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పాను.

ఈ విషయాన్ని నేను పదే పదే నొక్కి చెప్తుండటం వల్ల చివరికి లాయక్ అలీ నుంచి నిర్మొహమాటమైన సమాధానం వచ్చింది. రాజ్యంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల స్వచ్ఛందంగా రజాకార్లలో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఒప్పుకున్నాడు లాయక్ అలీ. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా రజాకార్ల కార్యకలాపాలపై నియంత్రణ విధించటం కుదరదని అన్నాడు. రజాకర్లను ఎదుర్కునే శక్తి రాష్ట్ర పోలీసుకులకి కలిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నుంచి సైన్యానికి సంపూర్ణమైన ఆయుధ సామగ్రి, మద్దతులు లభించిన తరువాతే రజాకార్లపై నియంత్రణ సాధ్యమౌతుందన్నాడు. అప్పుడు పదివేలపైన రజాకార్లు సైన్యంలో భాగం అవుతారు. కాబట్టి సైన్యానికి రజాకార్లకు  నడుమ ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రసక్తి ఉండదని, సమస్య పరిష్కారం అవుతుందనీ చెప్పాడు.

సర్దార్ అనారోగ్యం నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, హైదరాబాద్ పోలీసులు, సైన్యాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లాయక్ అలీ ఆశించిన స్థాయిలో ఆయుధాలు, ఇతర సామగ్రిని అందజేసేందుకు ఒప్పుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని లాయక్ అలీకి అనిపించినట్టుంది.

అందుకే మా మధ్య చర్చలు అవాస్తవం అనిపించాయి. గత పక్షంలో, ముఖ్యంగా ఫిబ్రవరి నెల చివరి పక్షంలో, హైదరాబాదు పరిస్థితులలో నెలకొన్న మార్పులు మాచర్చల్లో  చోటు చేసుకోలేదు.

మా మధ్య స్నేహపూర్వకంగా జరిగిన చివరి చర్చ ఇది. చర్చ సారాంశాన్ని మేము రాసి, సంతకాలు చేశాము. తరువాత రోజో, ఆ తరువాత రోజో  నేను ఢిల్లీ ప్రయాణమయ్యాను. గతంలో ఒప్పుకున్న వాటికి భిన్నంగా ఏ కొత్త విషయాన్ని ఒప్పుకోలేదు లాయక్ అలీ. అందుకు నేను సర్దార్‍కు అందించిన నివేదికలో, ప్రతి అంశాన్నీ  లాయక్ అలీ తిరస్కరించాడని వ్యాఖ్యానించేందుకు వెనుకాడలేదు.

అయితే లాయక్ అలీలో ఏర్పడిన నూతన విశ్వాసం వల్ల ఆయన తన ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం లభిస్తుందన్న ఆశలతో ఉన్నాడు. ప్రతి రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నానో అడిగేవాడు. తన ప్రతిపాదనలపై జరిగిన చర్చల ఫలితాన్ని అడిగేవాడు.

***

ముందు నుయ్యి, వెనుక..

ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో దిగజారిన హైదరాబాద్ పరిస్థితి అర్థం కావాలంటే, హైదరాబాదులో కలిగిన మార్పుల పర్యవసానాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి నెల చివరలో, కలకత్తాలో ఆగ్నేయాసియా యువత సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని జరిపింది కమ్యూనిస్ట్ సంస్థలయిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ యూత్ (ప్రపంచ ప్రజాస్వామ్య యువ సమాఖ్య), ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ (అంతర్జాతీయ విద్యార్థి సమాఖ్య)లు. పైకి అమాయకంగా కనబడే ఈ సమావేశం ముసుగులో ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఉన్న కమ్యూనిస్టు నేతలు ఓ విప్లవాత్మకైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో, చైనా, బర్మా, మలయా, ఇండోనేషియా కమ్యూనిస్టు నాయకులు అందరూ సమైక్యంగా అమలుపరచాల్సిన కార్యక్రమం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇంత వరకూ భారతీయ కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) అమలు పరుస్తున్న పద్ధతిని విసర్జించి కొత్త పద్ధతిని స్వీకరించాల్సి వచ్చింది. ఈ సమావేశంలో భారతీయ సామ్యవాదులను విమర్శించారు. వారు ప్రజాస్వామ్య విప్లవానికి ద్రోహం చేశారని దూషించారు. నెహ్రూ ప్రభుత్వాన్ని యునైటైడ్ కింగ్‍డమ్, అమెరికాల తొత్తుగా అభివర్ణించారు. నెహ్రూ ప్రభుత్వానికి కమ్యూనిస్టుల సమర్థనను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. భారత రాజ్యంగం ముసాయిదా ప్రతి ప్రతిచర్యాత్మకనీ, అప్రజాస్వామికమనీ విమర్శించారు.

ఈ నిర్ణయం హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ దృష్టిలో మార్పుకు కారణమయింది. రహస్యంగా అందిన సూచన ప్రకారం, ప్రస్తుతం కమ్యూనిస్టులకు పట్టు ఉన్న ఆంద్ర ప్రాంతాన్ని ‘సోవియటీకరణ’ చేయాలి, ఆ తరువాత మొత్తం భారతదేశాన్ని ‘విముక్తం’ చేయాలి.

ఈ లక్ష్యం నెరవేరేందుకు ఒక కొత్త పాలసీని స్వీకరించారు. రజాకార్లను తమ వైపు తిప్పుకుని గ్రామాలలో సోవియట్ తరహా నియంత్రణ రజాకార్ల సహాయంతో సాధించాలి. తిరుగుబాటు గెరిల్లా యుద్ధాల ద్వారా మద్రాసు పరిధిలోని కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలపై; తెలంగాణ లోని నల్గొండ, వరంగల్ జిల్లాలపై సంపూర్ణాధికారం సాధించాలి.

దీని ఫలితం ఫిబ్రవరి నెల నడుమ నుంచి హైదరాబాదులో కనపడటం ప్రారంభమయింది. కమ్యూనిస్టులు రాష్ట్ర కాంగ్రెస్‍ను, నెహ్రూ ప్రభుత్వాన్ని తీవ్రంగా దూషిస్తూ విస్తృత ప్రచారం ఆరంభించారు. వారి ప్రకారం యథాతథ ఒప్పందం – నిజామ్, పటేల్ సంయుక్తంగా చేసిన కుట్ర. రాష్ట్ర కాంగ్రెస్ అప్రజాస్వామిక తిరుగుబాటుదారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే నెహ్రూ ప్రభుత్వం తమ శత్రువు అన్న విషయంలో కమ్యూనిస్టులదీ, రజాకార్లదీ ఏకాభిప్రాయం.

ఫిబ్రవరి నెలాఖరు కల్లా, కాంగ్రెస్‌తో నటిస్తున్న స్నేహ ప్రవర్తనను కమ్యూనిస్టులు వదిలేశారు. కొన్ని వారాల క్రితం వరకూ  స్నేహితులైన కాంగ్రెస్ కార్యకర్తలు, వారి సమర్థకులు ఇప్పుడు శత్రువులయ్యారు. వారిపై దాడులు చేశారు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టుల ప్రభావం హైదరాబాద్ నగరం వరకూ విస్తరించింది. హైదరాబాద్ దక్షిణ జిల్లా అయిన ఉత్రఫ్ బాల్టా వరకూ చురుకుగా పని చేసే కమ్యూనిస్టు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

మార్చ్ నెలలో నేను – రజాకార్లు, కమ్యూనిస్టు కార్యకర్తలు జరుపుతున్న అత్యాచారాల వివరాలు సేకరించాను. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది. ఒక తెలుగు మాట్లాడే తెలుగు జిల్లా తరువాత మరో తెలుగు జిల్లాను, రజాకార్లను వ్యతిరేకిస్తున్న ముసుగులో కమ్యూనిస్టులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

ఈ సమయంలో హైదరాబాద్ ప్రభుత్వం విడుదల చేసిన ‘హైదరాబాదులో కమ్యూనిస్టుల నేరాలు’ అన్న నివేదిక పరిస్థితిని స్పష్టం చేస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here