నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-38

0
9

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ని[/dropcap]జామ్ రాజ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రజాకార్లను అదుపులో పెట్టకపోతే, తెలుగు జిల్లాల్లో, ప్రాంతాలలో కమ్యూనిస్టులు తిరుగులేని రీతిలో పట్టు సాధిస్తారు, శక్తిమంతులవుతారు. ఇదే సమయానికి నిజామ్ ప్రభుత్వం బలహీనమవుతుంది. చివరికి ఆంధ్ర ప్రాంతం సంపూర్ణంగా కమ్యూనిస్టుల వశమవుతుంది. ఇది జరుగుతున్న సమయంలో ఎడతెగకుండా సాగుతున్న మౌంట్‍బాటెన్ చర్చలు భారత్ ప్రభుత్వాన్ని ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో నిర్వీర్యం చేస్తాయి. ఈ చర్చలు సాగుతున్న సమయంలో నిజామ్ ప్రభుత్వం సైన్యాన్ని బలపరుచుకుంటుంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారు చేస్తుంది. సానుభూతిపరులైన విదేశీయుల సహాయం పెంచుకుంటుంది. ఇంగ్లాండ్ లోని కన్జర్వేటివ్ పార్టీని తన వైపు తిప్పుకుంటుంది. సమయం చూసుకుని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహాయం కోరుతుంది.

ఇలా దక్షిణ భారతం మొత్తం అభద్రతా భావానికి గురవుతూ ఆందోళన చెందుతున్న సమయంలో, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించగల ఏకైక వ్యక్తి అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు. కాబట్టి, నిజామ్‍ను తీవ్రంగా హెచ్చరించవలసిన సమయం ఆసన్నమయిందని నేనూ, మీనన్ నిశ్చయించుకున్నాము.

యథాతథ ఒప్పందాన్ని నిజామ్ ఉల్లంఘించిన సంఘటనలన్నీ పొందుపరిచి నేను ఓ ఉత్తరం తయారు చేశాను. మీనన్ దానికి మెరుగులు దిద్దాడు. ఆ ఉత్తరంలో నిజామ్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇవ్వనున్న 20 కోట్ల అప్పును ఉపసంహరించుకోమన్న విజ్ఞప్తితో పాటు యథాతథ ఒప్పందం ప్రకారం నిజామ్ ప్రభుత్వం ‘యధాతథం’   ఒప్పందం ప్రకారం  తాను చేపట్టవలసిన కార్యక్రమాలను వెంటనే  చేపట్టవలసిందిగా కోరాము. రక్షణకు సంబంధించిన ఒప్పందాలను పరిశీలించేందుకు ఒక జాయింట్ కమీషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాల్సిందని కోరాము. ఆగస్టు 15, 1947 కన్నా ముందు ఉన్న పోలీసు వ్యవస్థ శక్తి, సంస్థ, ఆయుధాల వివరాలు అందజేయాలని కోరాము. రజాకార్లను నిషేధించాలని, భారత కరెన్సీపై నిషేధాన్ని తొలగించాలని, బంగారం, పల్లీలు, ఇతర నూనె దినుసుల ఎగుమతిపై విధించిన నిషేధాజ్ఞలను ఉపసంహరించాలని, విదేశీ వార్తల కోసం యునైటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికాతో ఒప్పందం ఒకవేళ చేసుకుని ఉంటే, దాన్ని వెంటనే రద్దు చేయాలనీ కోరాము. ఉత్తరం చివరలో ఇలా రాశాము:

“హైదరాబాదులో ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్లు, సరిహద్దుల్లో కమ్యూనిస్టుల కార్యకలాపాలు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. హైదరాబాద్ రాజ్యంలో శాంతి కొరకు, సరిహద్దులకు ఇరువైపులా శాంతిభద్రతల సాధన కొరకు ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్ సంస్థను మూసివేయాలి. ఇత్తెహాద్‍ను వెంటనే నిషేధించి కార్యకలాపాలను అరికట్టకపోతే హైదరాబాద్   ప్రమాదంలో పడటమే కాదు, పొరుగున ఉన్న సెంట్రల్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాసు వంటి ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడతాయి.

కాబట్టి యథాతథ ఒప్పందాన్ని ఘనత వహించిన ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు పరచాలని అభ్యర్థిస్తున్నాను. ఒప్పందం ప్రకారం ముందుగా ఇత్తెహాద్‍ను నిషేధించాలి. ఈ విషయంలో ఇప్పటికే నిజామ్ తీసుకున్న నిర్ణయాలను, ఇకపై అమలు పరచబోయే నిర్ణయాలను తెలపాలని భారత ప్రభుత్వం కోరుతోంది.”

మేము రాసిన ఈ ఉత్తరానికి సర్దార్ ఆమోద ముద్ర వేశారు. ఆయన సూచనను అనుసరించి, పండిట్‌జీకి కూడా ఈ ఉత్తరం చూపించాము. ఆయన కూడా ఆమోదించారు.

హైదరాబాద్‌లో లాయక్ అలీ – ఢిల్లీ నుండి నా రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్నాడు. ఆయన ప్రతిపాదనలను సర్దార్ ఆమోదించిన వార్త మోసుకొస్తానని ఆయన ఎదురుచూస్తున్నాడు. అంతకు ముందు రోజే నేను హైదరాబాద్ ఎప్పుడొస్తున్నానని అడిగాడు.

మార్చ్ 26న నేను హైదరాబాద్ రాగానే తిన్నగా లాయక్ అలీ ఆఫీసుకు వెళ్ళి మీనన్ ఇచ్చిన ఉత్తరాన్ని అందించాను. రాష్ట్ర మంత్రివర్గం ఆ ఉత్తరాన్ని అందించే అనుమతిని నాకు ఇచ్చిందని చెప్పాను. నా మాటలు అంటీ ముట్టనట్టు ఉండడం గమనించాడు లాయక్ అలీ. ఆయన వెంటనే కవర్ చింపి ఉత్తరం చదివాడు. ఆయన ముఖం మాడిపోయింది. ఆయనకు అందులోని విషయాలు నచ్చలేదని స్పష్టంగా తెలుస్తోంది.

నేను ఆయనను వదిలి వచ్చేస్తుంటే వెళ్ళవద్దని అభ్యర్థించాడు. ఆయనను అలా హఠాత్తుగా వదిలి వెళ్ళటం నాకూ నచ్చలేదు. అందుకని ఆయన ఆగమనగానే నేనూ ఆగాను. ఒకటి రెండు నిమిషాల పాటు ఏమనాలో తెలియనట్టు మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి అడిగాడు, ఆ ఉత్తరానికి పండిట్‌జీ ఆమోదం తెలిపారా? అని.

“ఇది భారత ప్రభుత్వ ఉత్తరం. కాబట్టి ఈ ఉత్తరానికి సర్దార్, పండిట్‍జీ ఇద్దరి ఆమోదం ఉంటుంది” అన్నాను.

“ఇంత హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకు సంభవించింది?” అడిగాడు.

“నిజామ్ కనుక భారత ప్రభుత్వానికి స్నేహితుడయితే, దక్షిణ భారతాన్ని అశాంతికి గురి చేస్తూ, ముస్లింలను భారత్‍కు వ్యతిరేకంగా కూడగడుతున్న రజాకార్లను అదుపులో పెట్టాలి.”

మళ్ళీ గతంలో జరిగిన చర్చే జరిగింది. చివరికి ఉత్తేజితుడై అన్నాడు లాయక్ అలీ –

“నిజామ్ ప్రభువు తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు లక్షల మంది ముస్లింలు హైదరాబాద్ స్వతంత్ర్యం కోసం తమ ప్రాణాలు ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నారు. నన్ను ఇప్పుడే కాల్చి చంపండి.”

“అలాంటిదేమీ లేదు. చాలా కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ జీవించి ఉంటావు” అంటూ నేను అతడిని వదిలి వచ్చేశాను.

ఎప్పటిలాగే, ఇల్లు చేరాగానే, నేను మా మధ్య జరిగిన సంభాషణ వివరాలను రాశాను.

వి.పి. మీనన్ మార్చ్ 23న రాసిన ఉత్తరాన్ని నేను మార్చ్ 26న అందజేశాను. ఆ ఉత్తరం ప్రభావం వల్ల తాత్కాలికంగా నిజామ్‍కు నిజానిజాలు అర్థమయ్యాయి. అది  అతడిని భూమిపైకి దింపింది.

మార్చ్ 29న, లాయక్ అలీ, రజ్వీ, మరికొందరు ఇత్తెహాద్ నాయకులు సమావేశమయ్యారు. ఈ ఉత్తరంలోని విషయాలకు ఎలా స్పందించాలో చర్చించారు. ఆ సమావేశంలో చివరికి వారంతా కలిసి, భారత్ – కశ్మీరు విషయంలో పరాజయం పాలవక తప్పదని, కాబట్టి హైదరాబాద్‍పై ఎలాంటి చర్యనూ తీసుకునే ధైర్యం చేయదన్న నిశ్చయానికి వచ్చారు. ఒకవేళ హైదరాబాద్ విషయంలో భారత్ ప్రభుత్వం ఎలాంటి చర్యను తీసుకున్నా, భారతదేశంలోని ముస్లింలంతా కలిసికట్టుగా హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారని అనుకున్నారు. సర్దార్ ఎలాగో త్వరలో  మరణిస్తాడు, సర్దార్ కనుక మరణిస్తే ఫలితం లేని చర్చలు చేస్తూనే ఉంటాడు మున్షీ అని అనుకున్నారు.

మార్చ్ నెల అయిపోయింది. భారత్‍లో సంపూర్ణంగా విలీనమయ్యేందుకు సర్దార్ విధించిన గడువు పూర్తయిపోయింది. హైదరాబాద్‍తో ఏదో ఓ రకమైన ఒప్పందం ఏర్పాటు చేసేందుకు గాంధీజీకి నేను ఇచ్చిన మాట గడువు కూడా పూర్తయింది.

మార్చ్ 23న రాసిన ఉత్తరం అందుకున్నప్పటి నుంచీ లాయక్ అలీ, మొయిన్ నవాజ్, రజ్వీలు పరిస్థితిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. నిజామ్ ఒంటరి వాడయ్యాడు. పాలకుల రక్షణ కోసం సిద్ధంగా ఉండే దీన్ యార్ జంగ్ ఎల్లవేళలా నిజామ్ వెన్నంటి ఉండేవాడు. చివరికి సర్ వాల్టర్ మాంక్టన్ కూడా నిజామ్‍ను కలవగలిగేవాడు కాదు. గతంలోలా ప్రతి సమాచార  పత్రం నిజామ్‍కు అందించే పద్ధతి మారింది. నిజామ్‍కు లాయక్ అలీ మౌఖికంగా వార్తలు చెప్పటం ఆరంభించాడు. ఏం జరుగుతోందో చెప్పేవాడు. నిజామ్ పాల్గొనే చర్చలకు రోజూ హాజరయ్యే హోష్‌కు  కూడా కింగ్ కోఠీకి రావద్దన్న ఆదేశాలు అందేయి. నిజామ్ ఆరోగ్యం బాగాలేదన్న సాకు చూపారు.

భారత్‍కు వచ్చిన సర్ వాల్టర్ మాంక్టన్‍ను నేను మార్చ్ 29న కలిశాను. గతంలో ఎలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడో మాంక్టన్ ఇప్పుడూ అలాగే ఉన్నాడు. మార్చ్ 23 ఉత్తరం గురించి ఇద్దరం చర్చించాం. ఆ ఉత్తరం అతడికి అయోమయం కలిగించింది. భారత్-హైదరాబాద్‍ల నడుమ దిగజారుతున్న సంబంధాలు అతడికి ఆందోళన కలిగించాయి.

మొట్టమొదటి సారిగా మాంక్టన్ నన్ను అడిగాడు, ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని. విలీనం అన్న మాట లేకుండా భారత్ హైదరాబాద్ సంబంధాలను 15 ఆగస్ట్ 1947 కన్నా ముందరి స్థాయికి తేవటం కుదురుతుందా? ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వం అని సమాధానమిచ్చాను నేను.

హైదరాబాద్ అతి వేగంగా సైనిక శిబిరంగా మారిపోతూండటం నాకు ఆందోళన కలిగించింది. రజాకార్లు, పోలీసులు, పెద్ద సంఖ్యలో తమ సభ్యుల సంఖ్య పెంచుకోవటం ప్రారంభించారు. కొత్త కొత్త మిలటరీ బ్యారక్‍లు నిర్మిస్తున్నారు. సికిందరాబాద్ కంటోన్మెంట్‍ నుంచి అనేక వస్తువులు పద్ధతి ప్రకారం దొంగిలించటం జరుగుతోంది. ఇంతే కాదు, ఒక బ్రెన్‍గన్ తయారీ ఫాక్టరీ కూడా నిర్మితమైంది.

భారత్‍తో ‘విలీనం’ అన్న ఆలోచననే సంపూర్ణంగా విస్మరించారు. యథాతథ ఒప్పందం కాగితం ముక్కలా మిగిలిపోయింది. ఆ ఒప్పందం చివరికి ఎలా అయిందంటే, హైదరాబాద్‍కు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయకపోవటం భారత్ తప్పు అయినట్టయింది. ఒక లక్ష సంఖ్య దాటిన రజాకార్లు రాజ్యంలో ప్రజల జీవితాన్ని నియంత్రించటం ఆరంభించారు. ఎప్పటిలాగే దోపిడీలు, హత్యలు, దాడులు కొనసాగించారు. ఏప్రిల్ 1947 నుంచి మార్చ్ 1948 వరకూ 250 గ్రామాలను దోచారు, తగులబెట్టారు. 4000 ఇళ్లను బూడిద చేశారు. 500 మందిని చంపేశారు. 450 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అయితే ఇదంతా తప్పుడు సమాచారమని హైదరాబాద్ రేడియో ప్రకటిస్తూనే ఉంది.

నిజామ్ ప్రభుత్వం సైన్యం సంఖ్య, పోలీసు సంఖ్యను పెంచింది. భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన బ్రిటీష్ సైనికాధికారులను, నిజామ్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయించటం కోసం నియమించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి హైదరాబాద్ లోనే తయారవసాగాయి. కలకత్తా నుండి దొంగతనంగా ఆయుధాలు, మందుగుండులను హైదరాబాద్ రవాణా చేసేందుకు ఓ మాజీ బ్రిటీష్ అధికారిని నియమించారు. విదేశాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. భారత్ వ్యతిరేక ప్రచారం చేసేందుకు పాకిస్తాన్, యు.కె., యూ.ఎస్. లలో ప్రచార సంస్థలను నియమించారు.

రాజ్యంలో చట్ట వ్యతిరేక చర్యలు అధికమయ్యాయి. తెలంగాణా గ్రామాలలో హత్యలు చేస్తూ, తగులబెడుతూ, దోస్తూ కమ్యూనిస్టులు పలు ప్రాంతాలలో సోవియట్ తరహా సంఘాలు ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయంతో రజాకార్లు ఏదో ఓ కుంటి సాకు చూపి ప్రజలపై దాడులు చేస్తున్నారు. కమ్యూనిస్టులను నియంత్రించకుండా వదిలేస్తే, త్వరలోనే తెలంగాణా గ్రామాలపై వారు పట్టు సాధిస్తారు. ఇప్పటి లాగే నిస్సహాయులైన ప్రజలపై రజాకార్ల దాడులను కొనసాగిస్తే ప్రజలు నాశనమైపోతారు.

విషమించిన పరిస్థితుల వల్ల ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి సరిహద్దులు దాటి భారతదేశానికి చెందిన ప్రాంతాలకు పారిపోతున్నారు. సరిహద్దు ప్రాంతాలపై రజాకార్ల దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు సరిహద్దుల వద్ద కాపలా కాస్తూ రజాకార్ల దాడులను అడ్డుకోవాల్సి వస్తోంది. మరో వైపు అక్రమ ఆయుధాల రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. నెల నెలా ఢిల్లీతో ఫలరహితమైన చర్చలు కొనసాగుతుంటే నేను  చేజారుతున్న పరిస్థితిని నిస్సహాయంగా చూస్తూండాల్సి వస్తోంది.

నా పరిస్థితి మరింత జటిలమయింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకన్నా ముందు రజాకార్లు ప్రత్యక్షమవుతుండటంతో, లాయక్ అలీని తప్ప మరెవ్వరినీ కలిసేందుకు నేను దక్షిణ సదన్ వదిలి వెళ్ళేవాడిని కాదు. కానీ నన్ను కలవటానికి అందరూ దక్షిణ సదన్‍కు వస్తూండటంతో జరుగుతున్న విషయాలు తెలుస్తూండేవి. నాకున్న పరిమిత పరిధిలో నిజామ్, లాయక్ అలీ, రజ్వీల వార్తలు తెలుసుకుంటూండేవాడిని.

రాజ్యంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతోంది. వేల సంఖ్యలో కార్యకర్తలు జైళ్ళల్లో ఉన్నారు. బిందు, మెల్కొటే, ఎం. రామచంద్రరావు వంటి వారు అప్పుడప్పుడు ఏవేవో కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ అప్పటికే సరిహద్దు ప్రాంతాలపై పట్టు కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.

ప్రజలు ఆత్మవిశ్వాస రహితులయ్యారు. భయంతో వణుకుతూ, ప్రాణాలు అరచేత పట్టుకుని భారత ప్రభుత్వం తమ రక్షణకు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం వారిని రక్షిస్తుందన్న విశ్వాసాన్ని పెంచటంలో నేనే రకంగాను సహాయపడలేకపోతున్నాను.

బొంబాయి సరిహద్దు ప్రాంతమైన షోలాపూర్‍లో మిలిటరీ అధికారుల వసతి కోసం ఇళ్లు వెతుకుతున్నారన్న వార్తలు అందుతున్నాయి. నిజామ్ బలగాల కమాండర్ ఇన్ చీఫ్ ఎల్. ఎద్రుస్, సైనికాధికారులను పిలిచి యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పాడు. సైనిక చర్య జరుగుతుందన్న వార్తలతో వాతావరణం నిండిపోయింది. చివరికి భారత ప్రభుత్వం తప్పనిసరిగా రంగంలోకి దూకుతుందని ప్రజలు భావించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here