నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-41

1
14

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

మాంక్టన్ సూత్రం – దాని గతి

[dropcap]వి. [/dropcap]పి. మీనన్ మార్చ్ 23న రాసిన ఉత్తరానికి లాయక్ అలీ ఏప్రిల్ 5, 1948న సమాధానం ఇచ్చాడు. అయితే ఆయన ఆ ఉత్తరాన్ని పండిట్‍జీకి రాశారు. ఆయన భారత ప్రభుత్వాన్ని తప్పు పట్టాడు. యథాతథ ఒప్పందాన్ని అమలు పరచటంలో భారత ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ఆరోపించాడు. ఆ ఆరోపణ ద్వారా నిజామ్ ప్రభుత్వంపై ఉన్న విమర్శలను వివరించాలని ప్రయత్నించాడు.

అసలైన అంశాల విషయంలో ఆయన పట్టు వదలలేదు. భారత్‍లో విలీనమయ్యే ప్రసక్తి లేనే లేదు. స్టేట్ ఫోర్సెస్ పథకం నిజామ్‍కి వర్తించదు. భారత్‍తో సంతృప్తికరమైన ఒప్పందం జరిగేవరకూ రజాకార్ల ప్రశ్న తేనేకూడదు. యథాతథ ఒప్పందాన్ని నిరాకరించారు.

ఈ సమయంలో వాల్టర్ మాంక్టన్ నిజామ్‍కూ, లాయక్ అలీకూ ఓ ప్రతిపాదన చేసినట్టున్నాడు. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేని విధంగా ఇత్తెహాదేతర ముస్లింలు, హిందువువులతో ఓ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తప్పదని స్పష్టంగా చెప్పినట్టున్నాడు.

అయితే ఆయన సలహాను నిజామ్ పాటిస్తాడన్న భ్రమలేవీ నాకు లేవు. స్పష్టంగా విషయాలను అర్థం చేసుకోగల మాంక్టన్ తన సూచనను నిజామ్ అమలుపరుస్తాడని అమాయకంగా ఎలా నమ్మాడో అర్థం కాలేదు. ఒకవేళ నిజామ్ అతడి సలహాను పాటించి ఇత్తెహాద్‍కు చెందని ముస్లింలతో, హిందువులతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, రజ్వీ, లాయక్ అలీలు నిరుద్యోగులు అవుతారు.

వాల్టర్ మాంక్టన్ ఢిల్లీ చివరి ప్రయాణం మార్చ్ 23 ఉత్తరాల వల్ల కలిగిన సంచలనం సద్దుమణిగి పోయిందన్న నమ్మకాన్ని రజ్వీకి, లాయక్ అలీకి కలిగించింది. రాష్ట్ర మంత్రివర్గం, ఏజంట్ జనరల్ ప్రమేయం లేకుండా ఇది జరిగిందని వారు భావించారు.

ఏప్రిల్ 9న నేను రాష్ట్ర మంత్రిత్వ శాఖకు ఓ పత్రం సమర్పించాను. దానిలో, ఆర్థికంగా హైదరాబాద్ బలహీనతలను వివరించి, హైదరాబాద్‍పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు పాటించవలసిన పద్ధతులను పొందుపరిచాను. ఇదే సమయంలో నేను అక్రమ రవాణాను కూడా గమనిస్తూనే ఉన్నాను. భారతదేశంతో కనుక యుద్ధం చేయవలసి వస్తే అవసరమయ్యే ఆయుధ సామగ్రి, ఆయుధాల అక్రమ రవణాను స్థానిక ప్రభుత్వాలు అదుపులో పెట్టడం ఇప్పటికే పరిస్థితిని సంకటంలోకి నెట్టింది. సరిహద్దు ప్రాంతాలలో ప్రజల భావనలు భారత్ సమర్థన దిశలో ఉండడంతో, అక్రమ రవాణను ప్రజలు అడ్డుకోవటం కూడా నిజామ్ పరిస్థితిని జటిలం చేసింది.

ఏప్రిల్ నెలలో మద్రాసులోని హైదరాబాద్‍కు చెందిన ప్రాంతం ‘పార్తియాల్’ స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. భారత భూభాగం గుండా సైన్యాన్ని నడిపించి ఆ ప్రాంతాన్ని తిరిగి తన అదుపులోకి తెచ్చుకోవాలని నిజామ్ ప్రభుత్వం ఆరాటం ప్రదర్శించింది. నిజామ్ సైన్యం భారత భూభాగం గుండా ప్రయాణించేందుకు అనుమతిని నిరాకరించింది భారత ప్రభుత్వం.

ఈ పరిస్థితి ఉద్విగ్నతను తగ్గించేందుకు వాల్టర్ మాంక్టన్ మరో సూత్రాన్ని తయారు చేశాడు. భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందం గురించి కానీ, శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించనవసరం లేదు. ఈ సూత్రం ప్రకారం:

  1. రజాకార్ల బహిరంగ సభలను, ప్రదర్శనలను నిషేధించటం ద్వారా నిజామ్, రజ్వీని అదుపులో పెట్టాలి.
  2. ప్రభుత్వంలోకి అభ్యుదయ భావాల వ్యక్తులను ఆహ్వానించాలి.
  3. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి.
  4. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో పాటు, ఆ పరిషత్‍కు జవాబుదారీ అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.

ఈ పథకానికి మౌంట్‍బాటెన్ వెంటనే ఆమోదం తెలిపాడు. పండిట్ జీ కూడా ఆమోదించారు. సర్దార్ కూడా ఆమోదించారు. అయితే, ఆమోదిస్తూ, సర్దార్ ఓ మాట అన్నారు, ఒకవేళ ఈ విషయాలన్నిటినీ నిజామ్ అమలు పరిచేట్టు మౌంట్‍బాటెన్ చూస్తే, హైదరాబాద్ విలీనం ప్రస్తక్తి తాను మరిచిపోతానని అన్నారు. అదీ సర్దార్ హాస్య చతురత!

కొన్నాళ్ళు మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణం ఆలోచనపై నడిపాడు లాయక్ అలీ. నిజామ్ స్వయంగా పన్నాలాల్ పెట్టీని ఆహ్వానించి, ప్రజల శ్రేయస్సు కోసం తానేదైనా చేస్తానని హామీ ఇచ్చాడు. లాయక్ అలీ సైతం ముస్లిం, ముస్లిమేతరులు 50:50 శాతం ఉండేట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో పన్నాలాల్ సహాయాన్ని కోరాడు. ఈ ఏర్పాటుకు సర్దార్ ఆమోదం కూడా ఉందని అన్నాడు. పన్నాలాల్ సమ్ముఖంలో సర్దార్‍తో ఫోనులో మాట్లాడి, సర్దార్ ముఖతః విన్న తరువాత కానీ ఈ ఒప్పందానికి సర్దార్ ఆమోదం అబద్ధం అని పన్నాలాల్ నమ్మలేదు.

మాంక్టన్ పథకం గురించి సంపూర్ణంగా అర్థం చేసుకున్న రజ్వీ నిర్మొహమాటంగా మాట్లాడేడు. రజాకార్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నాడు:

“ఒక్క భారత సైనికుడు కూడా సరిహద్దులు దాటి హైదరాబాదులో అడుగుపెట్టినా సరే, నా రజాకార్లు సరిహద్దులు దాటి మద్రాసులో అడుగుపెట్టి, హైదరాబాద్ కోసం వందల ఏళ్ళు యుద్ధం చేస్తారు..

మీకు తెలుసు భారత ప్రభుత్వం బ్రాహ్మణుల, బనియాల (వైశ్యులు) ప్రభుత్వం. ముందు ‘విలీనం’ అంటూ కేకలు పెట్టారు. అది కుదరక ఇప్పుడు బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అంటూ కేకలు పెడుతున్నారు. తెలివైన ఏడుపు ఇది. ఒక్కసారి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడితే, మజ్లిస్, రజాకర్లను అంతం చేయటం; భారత్‍లో హైదరాబాద్‍ను విలీనం చేయటం పెద్ద పని కాదు. మీరే వాళ్ళ పథకాలను భంగం చేశారు.”

ఈ ఉపన్యాసం తరువాత రజ్వీకి ‘ముజాహిద్-ఎ-ఆజామ్’ అన్న బిరుదునిచ్చారు. ‘గొప్ప పవిత్ర యుద్ధవీరుడు’ అని అర్థం.

ఆ రోజే అనుకుంటాను, బే ఆఫ్ బెంగాల్ అలలు అతని అభిమాన పాలకుడి పాదాలను కడుగుతాయన్న ప్రకటన చేసినట్టున్నాడు ‘ముజాహిద్-ఎ-ఆజామ్’.

ఏప్రిల్ 13,1948 దినపత్రికలో ఈ వార్త ప్రచురితమయింది.

అయితే ఈ ఉపన్యాసంలో రజ్వీ నన్ను మరిచిపోలేదు.

“మీ అందరికీ తెలుసు, వాళ్ళ వీళ్ళ మాటలు విని పండిట్‍జీ హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సుముఖంగా లేడు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆరాటపడుతున్నాడు. హైదరాబాద్ సమస్యను – సమస్యలతో నిండి ఉన్న ప్రపంచంలో మరో సుదీర్ఘ సమస్యలా చేయకుండా త్వరగా పరిష్కరించాలని మౌంట్‍బాటెన్ కూడా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సమయంలో మున్షీ అభిప్రాయం ఏమిటి? మున్షీ ఎటువైపంటే, ఏ వైపూ లేడు. ఇదే జరిగితే ఆయన ప్రాధాన్యం పోతుంది. మున్షీ లాంటి రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం తాను ఏ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నానని ప్రకటిస్తాడో ఆ హైదరాబాద్ రాష్ట్ర ప్రయోజనాలను ఈ క్లిష్టమైన సమయంలో త్యాగం చేసేందుకు సిద్ధపడటం, అత్యంత శోచనీయమైన విషయం. ఇంతకన్నా గొప్ప విషాదం ఇంకోటి ఉందా?” అన్నాడు.

కొన్ని రోజుల తరువాత పండిట్ జీ ఉపన్యాసంపై వ్యాఖ్యానిస్తూ రజ్వీ ఇలా అన్నాడు:

“మహాత్మాగాంధీ హత్య భారత ప్రజల అభీష్టాన్ని స్పష్టం చేస్తుంది. ముస్లింలను సంపూర్ణంగా నిర్మూలించాలన్న, ఊచకోత కోయాలన్న ఆరెస్సెస్, హిందూ సభల ఉద్దేశం స్పష్టం అయింది. ప్రజల అభీష్టం మేరకు పండిట్ జీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ హైదరాబాదులో మాత్రం ప్రజాభీష్టం పనికిరాదు. ఏ ప్రజాభీష్టం ప్రకారం హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు కోసం పండిట్ జీ ఒత్తిడి తెస్తున్నాడో, ఆ ప్రజాభీష్ట ప్రకారం భారత్‍లో ముస్లింల రక్తం ఏరులై పారింది. ఇప్పుడు ఆ ప్రజల ప్రేరణ ననుసరించే హైదరాబాదులోనూ ముస్లింల రక్తం చిందుతోంది.”

తన సూత్రాన్ని అమలు పరచమని నిజామ్‍కు సలహా ఇచ్చి వాల్టర్ మాంక్టన్, ఏప్రిల్ 19న ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. నిజంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే తిరిగి వస్తానని అని వెళ్ళాడంటారు.

కానీ రజ్వీని అదుపులో పెట్టటం నిజామ్ వల్ల కాలేదు. ఒకవేళ నిజామ్, లాయక్ అలీ, మొయిన్ నవాజ్, దీన్ యార్ జంగ్‍లు ఇత్తెహాద్‍ను అదుపులో పెట్టాలని అనుకున్నా, సైన్యం, పోలీసులలో ఇత్తెహాద్ సమర్థకులు అధికంగా ఉండటంతో అది సాధ్యం కాదు. ఇత్తెహాద్ మద్దతుదార్లు లేని వ్యవస్థ లేకపోవటంతో ఇత్తెహాద్‍ను అదుపులో పెట్టడం కుదరదు.

మాంక్టన్ పథకం కూడా భ్రమ అని తేలిపోయింది.ఇత్తెహాద్ మద్దతుదారు అయిన హిందువు తప్ప మరో హిందువు నిజామ్ ప్రభుత్వంలో భాగం అయ్యేందుకు సుముఖంగా లేడు. ఇత్తెహాద్‍కు వ్యతిరేకంగా మాట్లాడిన మరుక్షణం ప్రభుత్వంలో తమకు స్థానం ఉండదని ప్రతి హిందువుకు తెలుసు.

వాల్టర్ వెళ్ళిన తరువాత నిజామ్, లాయక్ అలీలు తమ సమాధానం ఇచ్చారు. మాంక్టన్ నాలుగు సూత్రాల పథకాన్ని వారు తిరస్కరించారు. హైదరాబాదు వ్యవహారాలు తమకు తెలుసని, అర్థం పర్థం లేని మాటలు ఢిల్లీలో వాళ్ళు మాట్లాడి లాభం లేదని అన్నారు.

ఏప్రిల్ 22న జారీ చేసిన ఫర్మాన్ ద్వారా మాంక్టన్ పథకానికి తమ స్పందనను ప్రకటించాడు నిజామ్. రాజ్యంలో ప్రజలందరూ సమానమనీ, మరో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అవసరం లేదనీ, అది హైదరాబాదుకు ‘విషం’ లాంటిదనీ ప్రకటించాడు. అన్ని వర్గాల ప్రజలకూ తన ప్రభుత్వంలో స్థానం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

తియ్యగా మాట్లాడినా, లాయక్ అలీ మాటలు పదునుగా ధ్వనించాయి. హైదరాబాద్ చట్టసభకు ఇచ్చిన ఉపన్యాసంలో ఆయన విలీనం ప్రసక్తి లేదని ప్రకటించాడు. చిన్న చిన్న సంఘటనలను పెద్దవి చేసి భయంకరంగా చూపిస్తున్నాయి భారత పత్రికలు అని ఆరోపించాడు. హైదరాబాదులో ఎలాంటి సమస్య లేదన్నాడు. హైదరాబదు అసలు సమస్య అనవసరమైన దుష్ప్రచారమనీ, అనవసరంగా సాధించిన ఆర్థిక దిగ్బంధనమనీ అన్నాడు. తమ కోరిక న్యాయబద్ధమైనదని అన్నాడు. ఒకవేళ తమపై ఒత్తిడి తెస్తే, దాన్ని తమ సంపూర్ణ శక్తితో ఎదిరిస్తామనీ, ఆ పై నిర్ణయం విధి చేతుల్లో ఉంటుందనీ అన్నాడు. మాంక్టన్ పథకం ప్రస్తావనే ఆయన తేలేదు.

మరోవైపు సైనిక పరంగా సన్నద్ధంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నాడు నిజామ్. సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. స్టేట్ ఫోర్సెస్ పథకం ప్రకారం హైదరాబాద్‍కు 7,000 మంది సైన్యం ఉండవచ్చు. కానీ అనుమతి లేకుండా, అక్రమంగా, ఈ సంఖ్యను 1947లో 13,000కు పెంచారు. ఏప్రిల్ 1948 కల్ల రెగ్యులర్ల సంఖ్య 22,373 అయింది. మరో 7,000 మంది శిక్షణ పొందుతున్నారు. అదనంగా కస్టమ్స్ కానిస్టేబుల్స్ అన్న పేరు మీద 4870 మంది శిక్షణ పొందుతున్నారు. ఇంకా మూడు దళాలు ఏర్పాటు చేయాలన్నది నిజామ్ లక్ష్యం.

పోలీసుల సంఖ్య కూడా 38,000లకి పెంచారు. వారిలో 12,000 మంది వద్ద ఆధునిక ఆయుధాలున్నయి. అదనంగా 15,000 హోమ్, సివిల్ గార్డ్స్ ఉన్నారు. సాయుధులైన రజాకార్ల సంఖ్య 50,000 నుంచి లక్ష వరకూ ఉంటుంది.

రాష్ట్రంలో 8 ఆయుధ తయారీ కర్మాగారాలు, ఆయుధాల తయారీలో మునిగి ఉన్నాయి. పెద్ద ఎత్తుల పెట్రోలు నిల్వలను జమ చేశారు. రోజుకు 35,000 గాలన్ల పరిమాణంలో పవర్ ఆల్కాహాల్ తయారువుతోంది. 22,000 మంది సైనుకులుండే బ్యారక్‍లకు అదనంగా, 25,000 సైనికులు ఉండగలిగే బ్యారక్‍ల నిర్మాణం జరుగుతోంది.

హైదరాబాద్, బీదర్‍లలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి. వైమానిక దళం శిక్షణ సాగుతోంది. ఆయుధాలను ఆకాశ మార్గాల ద్వారా అక్రమంగా హైదరాబాదుకు తెచ్చేందుకు సాహసికుడు సిడ్నీ కాటన్‍ను నియమించారు. జూన్ కల్లా పాకిస్తాన్ నుండి ఆకాశ మార్గం ద్వారా అక్రమంగా ఆయుధాల రవాణా జోరందుకుంది.

సరిహద్దు వద్ద భారత్ ఎంత జాగరూకత వహించినప్పటికీ, భారత్ నలుమూలలా ఏర్పడిన గూఢచార వ్యవస్థ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, యుద్ధ వాహనాలు, పరికరాలు, పెట్రోలు, స్టీలు, ప్రసార వ్యవస్థకి అవసరమైన వస్తువులు, రసాయనాలు, విస్ఫోటక పదార్థాలు, వాహనాల భాగాలను అక్రమంగా హైదరాబాదుకు తరలిస్తోంది. హైదరాబాద్‍కు అక్రమ రవాణా కోసం సిద్ధపడిన వారందరికీ ఆర్థిక సహాయం లభిస్తోంది.

హైదరాబాదులోకి అరబ్బులను పెద్ద ఎత్తున తెచ్చేందుకు ‘మకల్లా నవాబ్’తో ఒప్పందం జరిగిందనీ అంటారు. మధ్య ఆసియా దేశాలతో ఆయుధాల ఒప్పందాలు జరిగాయనీ, ఆయుధాలను ‘మకల్లా’ వద్ద జమ చేశారనీ అంటారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here