నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-42

2
10

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

పండిట్‍జీ పలుకు

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 24న, బొంబాయిలో నేను పండిట్‍జీని కలిశాను. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బొంబాయి వచ్చారు. జనవరి నెల నుంచి నేను పండిట్‍జీని పలు సందర్భాలలో కలిశాను. ఎప్పుడు కలిసినా అయన నాతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కానీ ఎప్పుడూ అంటీ ముట్టనట్టు ఉండేవారు. నాతో ఆయన ఎప్పుడూ హైదరాబాద్ సమస్యను చర్చించలేదు. సర్దార్‍ కు , మౌంట్‍బాటెన్‍లకు ఆయన ఆ సమస్యను వదిలేశారు. ఏదైనా ప్రధాన అంశం ఉంటే తప్ప ఆయన హైదరాబాదు వ్యవహారాల్లో  జోక్యం చేసుకునేవారు కాదు.

కానీ ఈసారి నేను ఆయనకు హైదరాబాద్ పరిస్థితిని సంపూర్ణంగా వివరించాను. తగిన చర్యలు సత్వరమే చేపడతామని అన్నారు.

రామాచారి, రామకృష్ణారావు, పన్నాలాల్ పిట్టీ, రంగారెడ్డి, ధూత్ లను నేను పండిట్‍జీకి పరిచయం చేశాను. వాళ్లు పండిట్‍జీతో చాలాసేపు మాట్లాడేరు. హైదరాబాదు  పరిస్థితిని వివరించారు.

ఎ.ఐ.సి.సి.లో జరిగిన ఓ ఆంతరంగిక సమావేశంలో, హైదరాబాద్ పట్ల కనబరుస్తున్న అలసత్వం పట్ల, నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్రమైన విమర్శలు కురిపించారని తెలిసింది. నేను దౌత్య ప్రతినిధిని కావటంతో సమావేశంలో పాల్గొనలేదు.

అన్ని విమర్శలకు పండిట్‍జీ సూటిగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటలు అందరికీ సంతృప్తిని కలిగించాయి. ఆయన హిందీలో మాట్లాడేరు. కానీ ఆయన ఉపన్యాసం సరిగా అర్థం కాలేదో, లేక తప్పుడు నివేదికలు అందాయో గానీ, హైదరాబాద్ సమస్యకు రెండే పరిష్కారాలున్నాయని, యుద్ధమో, విలీనమో, అని ఆయన అన్నట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. దేశమంతా ఉత్తేజితమయింది పండిట్‍జీ మాటలతో.

పండిట్‍జీ మాటల వార్త అందుకున్న మౌంట్‍బాటెన్ నిశ్చేష్టుడయ్యాడని కాంప్‍బెల్ జాన్సన్ అంటాడు. వ్యాఖ్య పరిణామాల గురించి పండిట్‍జీని ఆలోచించమన్నాడు మౌంట్‍బాటెన్. ఫలితంగా పండిట్‍జీ ఉపన్యాసం సరైన పాఠాన్ని ప్రకటించారు. “భారత ప్రభుత్వానికి అందుతున్న సూచనలకు భిన్నంగా నిజామ్ ప్రభుత్వం రజాకార్ల దుశ్చర్యలను సమర్థిస్తుంటే, దాన్ని భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేక చర్యగా   భావించాల్సి ఉంటుంది” అన్నారు పండిట్‍జీ.

ఏప్రిల్ 26న బొంబాయి జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మరోసారి పండిట్‍జీ హైదరాబాద్ విషయంలో భారత ప్రభుత్వ ఆలోచనను వివరించారు. “హైదరాబాదులో ప్రజల ప్రాణాలకు రజాకార్ల కార్యకలాపాల వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లినా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైన వ్యతిరేక కార్యకలాపాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమయింది. హైదరాబాద్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను అరికట్టకపోతే, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది”.

హైదరాబాద్‍కు చెందిన నాయకులు కూడా బొంబాయిలో కలిశారు. పలు చర్చల తరువాత వారిలో అధికులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ హైదరాబాదులో  హిందువులు అధికంగా గల సభ ఏర్పడితే, జన సంఖ్య ఆధారంగా చట్ట సభ ఏర్పాటయితే, రజాకార్లపై నిషేధం విధిస్తే, ప్రభుత్వంలో చేరేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు.

వారికి నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాను. వారు విధించిన ఏ షరతునూ కూడా నిజామ్ కానీ ఇత్తెహాద్ కానీ అంగీకరించరని చెప్పాను. అయితే డెహ్రాడూన్‍లో సర్దార్‍ని ఒకసారి కలవమన్నాను. వాళ్ళు ఆయనను కలిసినప్పుడు హైదరాబాద్ గురించి అనవసరంగా కంగారు పడవద్దనీ, ఆ వ్యవహారాలు తాను చూసుకుంటానని వారికి హామీ ఇచ్చారు సర్దార్. ఆయన ఆత్మవిశ్వాసం వారిపై కూడా ప్రభావం చూపించినట్టుంది, సర్దార్‍ను కలిసిన తరువాత వారి ఉద్విగ్నతలు మటుమాయం అయ్యాయి. వారు సంతోషంగా కనిపించారు.

ఏప్రిల్ నెలాఖరు లోగా, అంతర్జాతీయ స్థాయిలో భారత వ్యతిరేక ప్రచారం సాగించే వ్యవస్థను నిజామ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ సెప్టెంబర్ వరకూ పని చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేసిన క్లాడ్ స్కౌట్, హైదరాబాద్ సమాచార వ్యవస్థ అధికారి. ఇంగ్లండ్‍లో ప్రచార వ్యవస్థ చూసేందుకు ఓ శక్తివంతమైన ఏజంట్‍ను నియమించారు. పలు అంతర్జాతీయ ప్రచార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.

ఏప్రిల్ నెలాఖరు నుంచి నిజామ్ ప్రభుత్వ అతిథి గృహం ‘గ్రీన్‍ల్యాండ్స్’లో విదేశీ జర్నలిస్టులు, ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ బస్ చేశారు. వాళ్ళకు రాచమర్యాదలు జరిగాయి. అందమైన అమ్మాయిలు అతిథి మర్యాదలు చేసేవారు. విదేశీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పర్యటన కార్యక్రమాలు నిర్వహించారు. వారు నిజామ్ ప్రభుత్వ సమాచార వ్యవస్థ ప్రతినిధులు.

కొందరు విదేశీ కరెస్పాండెంట్లు నన్ను కలిశారు. భారత ప్రభుత్వ దృక్కోణాన్ని ఎంతో ఓపికగా విన్నారు. నేను ఇచ్చిన రుచి లేని టీ త్రాగారు. అయితే గ్రీన్‍లాండ్స్‌లో వారికి అందే ఖరీదైన, నాణ్యమైన షాంపేన్ ప్రభావం ముందు నేనిచ్చిన రుచీ పచీ  లేని టీ వెలతెలపోయింది. వారంతా ఇత్తెహాద్ దృక్కోణాన్ని నమ్మారు. భారత ప్రభుత్వం హైదరాబాద్ సార్వభౌమత్వాన్ని దౌర్జన్యంగా హరించాలని చూస్తోందని నమ్మారు.

న్యూ స్టేట్స్‌మన్, నేషన్ పత్రికలకు చెందిన కింగ్‍స్లే మార్టిన్ మాత్రమే ఇతరులందరి కన్నా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి పరిస్థితులను కళ్ళారా చూశాడు. హైదరాబాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిప్పులు కక్కే రచన చేశాడు.

“తన చుట్టూ చేరిన బాధ్యతారహితులు, మూర్ఖుల సలహాల వల్ల, ముఖ్యంగా చర్చిల్ లాంటి వెర్రి మద్దతుదార్ల వల్ల [గతంలో బ్రిటీష్ పాలన గురించి ఏ మాత్రం అవగాహన లేనివాడు, ప్రస్తుత పరిస్థితుల గురించి ఏ మాత్రం పరిచయం లేనివాడు], చరిత్రలో ఎప్పుడూ అనుభవించని స్వాతంత్రాన్ని  సాధించాలని నిజామ్ తహతహలాడుతున్నాడు. స్వయంగా స్వతంత్ర రాజ్యంగా నిలవాలని ప్రయత్నించాడు. విఫలమయ్యాడు. ఓ సముద్రతీరాన్ని సామ్రాజ్యంలో భాగం చేసుకోవాలని ప్రయత్నించాడు. దెబ్బ తిన్నాడు. బ్రిటీష్ పాలనలో ఎలాంటి అధికారాలు ఉన్నాయో, అవే అధికారాలిచ్చేందుకు సర్దార్ సిద్ధమయ్యాడు. కాని ఆ ఒప్పందం చేసుకోవటానికి ఆలోచించాడు. సార్వభౌమత్వం సాధించాలని ప్రయత్నిస్తున్నాడు నిజామ్.”

భారతీయ దృక్కోణం పట్ల విదేశీ విలేఖరులు ప్రదర్శిస్తున్న వ్యతిరేక భావన ఊహించినదే. ఓ విదేశీ జర్నలిస్టును ఈ విషయమై ప్రశ్నించాను. అతను ఇచ్చిన ఆసక్తికరమైన వివరణ ఇది:

“హిందువుల పట్ల మాకు సానుభూతి ఉంది. ముస్లింలను అర్థం చేసుకోగలము. ముస్లింలు మాతో కలిసి భోజనం చేస్తారు. సహాయం కోసం మమ్మల్ని అభ్యర్థిస్తారు. కానీ మాకు తగ్గట్టు తనని మార్చుకోవాలని హిందువు ఎంత ప్రయత్నించినా, హిందువు మాకు అర్థం కాదు. అతడు పైకి ఎలా ఉన్నా తన హృదయంలో మమ్మల్ని చులకన చేస్తున్నాడన్న భావన మాకు కలుగుతూంటుంది. మాకు అతని పద్ధతులు తక్కువ స్థాయివి  అనిపిస్తాయి. అతను మా పద్ధతులు తక్కువ స్థాయివని అంటాడు. మేము చాలా సమర్థులం అనుకునే రంగాలలో కూడా హిందువు మాకన్నా ముందుకు సాగగలడని మాకు అనిపిస్తుంటుంది”.

***

ఏప్రిల్ నెలాఖరు కల్లా, రజాకార్ల సమస్య జాతీయ స్థాయిలో ప్రమాదకరమైన సమస్యగా పరిణమించింది.

ఏప్రిల్ నెలలో, భారత ప్రభుత్వం తన డిమాండ్లను సాధించటంలో నిజాయితీగా వ్యవహరిస్తున్న సమయంలో, భారత్‍తో రాబోయే యుద్ధంలో తమను సమర్థించే వారి కోసం అన్వేషణ ఆరంభించింది ఇత్తెహాద్. ఆ సమయంలో ఇత్తెహాద్ సంప్రదించిన వారిలో అజ్ఞాతవాసంలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకుడు మఖ్దూం మొయినుద్దీన్ ఒకరు.

4 మే 1948న నిజామ్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ సంస్థలపై విధించిన నిషేధాజ్ఞలను ఎత్తివేసింది. నారాయణ రెడ్డితో సహా ఇతర కమ్యూనిస్టు నేతలపై జారీ అయిన అరెస్టు వారెంట్లను నిజామ్ ప్రభుత్వం ఉపసంహరించింది.

నిజామ్ ప్రభుత్వపు ఈ చర్య, ఇత్తెహాద్‍లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇత్తెహాద్ పత్రిక ‘ది డైలీ మీజాన్’, హఠాత్తుగా కమ్యూనిస్టుల పట్ల తన ధోరణిని మార్చింది. ఇంతవరకూ గ్రామాలలో జరుగుతున్న అత్యాచారాలకు కమ్యూనిస్టులు బాధ్యులు అని ప్రకటిస్తూ వచ్చిన ఇత్తెహాద్ హఠాత్తుగా ఈ అత్యాచారాలన్నిటికీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలను బాధ్యులను చేయటం ఆరంభించింది. భారత ప్రభుత్వం నుంచి హైదరాబాదును కాపాడటం కోసం కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారు కాంగ్రెస్ కన్నా రజాకార్లకు సన్నిహితులయ్యారు.

మరో ఇత్తెహాద్ మద్దతుదారైన పత్రిక కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎత్తివేయటం పట్ల ఆశ్చర్యం ప్రకటించింది. చివరలో ‘ఇలాంటి చర్య తీసుకోవటం వెనుక ఏవైనా ప్రత్యేక కారణాలు ఉండే అవకాశాలున్నాయి’ అని వ్యాఖ్యానించింది. కమ్యూనిస్టులను ఉద్దేశించి ఓ ఇత్తెహాద్ నాయకుడు – “కనీసం కమ్యూనిస్టులకు ఓ ఆదర్శం అంటూ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకు అది కూడా లేదు” అని వ్యాఖ్యానించాడు.

ఇదే సమయానికి తాము గతంలో అవలంబించిన విధివిధానాలను శీర్షాసనం వేయిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఓ పత్రాన్ని విడుదల చేసింది. భారత ప్రభుత్వం పెట్టుబడీదారీ ప్రభుత్వం కాబట్టి, అది కోరుతున్న విలీనం కానీ, భాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు  కానీ కుదరవని, వాటిని వ్యతిరేకించారు కమ్యూనిస్టులు. అయితే, గతంలో తమ ఆదర్శానికి ఇప్పటి మార్పు భిన్నం కాదని నిరూపించేందుకు వారు ఓ ప్రతిపాదన చేశారు. అసలైన స్వాతంత్రం సాధించేకన్నా ముందు భూస్వామ్య వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలని తీర్మానించారు. ఓ నివేదిక ప్రకారం కమ్యూనిస్టులు, నిజామ్ ప్రభుత్వంతో ఓ అవగాహనకు వచ్చారు. రజాకార్లకు మందుగుండు, పేలుడు సామగ్రి పశ్చిమ బెంగాల్ నుంచి అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలందాయి.

ఇదే కమ్యూనిస్టుల లక్షణం. ఆ క్షణంలో వారి దృక్కోణం ఏమిటో, అదే ప్రజల అభిప్రాయం అన్నట్లు ప్రచారం చేస్తారు. వాళ్ళకు ఏది లాభమో, అదే ప్రజల అభీష్టం అన్నట్టు నమ్మిస్తారు. ప్రస్తుతం వారి మారిన వ్యవహారం ప్రకారం వారి ప్రచార ధోరణి మారింది. హైదరాబాద్, భారత ప్రభుత్వంలో విలీనమవటం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. అది  ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేయటం. ఇది విప్లవ చైతన్యాన్ని అణచివేయటం. భారత సైన్యం కనుక హైదరాబాదులో ప్రవేశిస్తే, అది ప్రజా ఉద్యమాన్ని అణచి వేసేందుకే. కాబట్టి ఏయే గ్రామాలలో ప్రజా ప్రభుత్వాలు – అంటే భయపెట్టి, బెదిరించి, చంపి, దోపిడీలు చేసి, ఏర్పాటు చేసిన చిన్న సోవియట్లు – ఏర్పడ్డాయో, అక్కడి కార్యకర్తలు భారత సైన్యాన్ని ప్రాణాలొడ్డి అడ్డుకోవాలని కమ్యూనిస్టు నేతలు కార్యకర్తలకు ఉద్బోధించారు.

కమ్యూనిస్టు పార్తీ ఇప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజామ్ ప్రభుత్వంతో చేతులు కలిపింది. భారతదేశంలో అజ్ఞాతవాసంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు సరిహద్దులు దాటి హైదరాబాద్ వచ్చి చేరారు. భారత భూభాగం నుండి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, హైదరాబాదులో స్వేచ్ఛగా తిరగసాగారు. వీరు నిజామ్ ప్రభుత్వం లోని మంత్రులతో, అధికారులతో స్నేహం చేస్తూ నిజామ్‍తో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తమ ప్రతినిధిని నిజామ్ ప్రభుత్వంలో చేర్చుకోవాలని ఆశించారు. అందువల్ల నిజామ్ ప్రభుత్వంలోకి చొచ్చుకుపోయి, తమ గుప్పెట్లోకి తెచ్చుకునే వీలుంటుందని ఆశించారు.

నిజామ్ ప్రభుత్వంలో కలవటం వల్ల ఇప్పటికే తమ  అధికారం ఉన్న ప్రాంతాలపై పట్టు పెంచుకునే వీలు కమ్యూనిస్టులకు చిక్కింది. అలాగే, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే వీలు దొరికింది. ఏప్రిల్ తరువాత, తమ ఆధిక్యం ఉన్న ప్రాంతాలలో, కమ్యూనిస్టులు, ధనవంతుల భూములు, పశువులు, ధాన్యాలను, తమ సమర్ధక గ్రామీణ  కార్యకర్తలకు   పంచారు. గ్రామాల  దోపిడీల ద్వారా లభించిన ధనంతో కమ్యూనిస్టుల బొక్కసాలు నిండాయి. నివేదిక ప్రకారం ఒక్క జూలై నెలలోనే 40 దోపిడీ కార్యక్రమాలు జరిపారు కమ్యూనిస్టులు.

తాము 3000 పైగా గ్రామాలను విముక్తం చేశామని కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇది అతిశయోక్తి. కానీ వారు ఆధిక్యంలో ఉన్న ప్రాంతాల సంఖ్య 2,000ల కన్నా తక్కువ ఉండదు.

కమ్యూనిస్టుల ఆశ ఏమిటంటే, నిజామ్ ప్రభుత్వం ఇలాగే స్నేహపూరిత ఒప్పందం చేసుకోవాలన్న భారత్ ప్రయత్నాలను తిప్పి కొడుతుంటే, ఏదో ఓ రోజు హైదరాబాదులో శాంతిభద్రతలు దెబ్బతింటాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. హైదరాబాద్ ప్రభుత్వం పతనమవుతుంది. అలాంటి పరిస్థితులలో హైదరాబాద్ – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు దక్కుతుంది.

జరుగుతున్న ఈ తతంగాన్నంతా చూస్తున్న నాకు, ఢిల్లీలో ఓ కాగితం ముక్కపై నిజామ్ సంతకం సాధించటం  కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న వారు, ఈ కమ్యూనిస్టుల ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలని  ఆలోచిస్తున్నారో అన్న ఆలోచన కలిగింది.

నిజామ్ కొత్త ఒప్పందాన్ని అమలు పరుస్తాడన్న నమ్మకం ఎవరిస్తారు? యథాతథ ఒప్పందం లోని ప్రతి అంశాన్ని ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా ఉల్లంఘించిన నిజామ్‍ను ఏ ఒత్తిడి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం చేస్తుంది? హిందువులకు న్యాయం జరిగేట్టు ఎవరు చూస్తారు? భారత్‍తో స్నేహంగా ఉండేట్టు ఎవరు చూస్తారు? తమ ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్‍తో విలీనం చేయకుండా ఎవరు అడ్డుకుంటారు?

ఇలాగే ఒప్పందాలను ఉల్లంఘిస్తూపోతే, దక్షిణ భారతం అల్లకల్లోలమై ప్రమాదంలో పడకుండా ఉంటుందా? హైదరాబాదులో ఛాందసులయిన ఇత్తెహాద్ అధికారంలోకి రాకుండా పట్టుదలతో ప్రయత్నిస్తున్నా,  కమ్యూనిస్టులు భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‍పై పట్టు సాధించకుండా అడ్డుకునే శక్తి ఏది?

ఈ సమయంలోనే బెదిరింపుల ద్వారా ఆంధ్రాను  సోవియట్ మార్చాలన్న  ప్రయత్నాలను కమ్యూనిస్టులు కొనసాగించారు.

ఆ సమయంలో భారత ప్రభుత్వం కశ్మీరులో సైనిక చర్యలు చేపడుతోంది. అది పాకిస్తాన్‍తో యుద్ధంగా పరిణమించే అవకాశాలున్నాయి. ఇది భారత ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. పాకిస్తాన్‍తో యుద్ధం సంభవిస్తే అంతర్గతంగా సంభవించే పరిణామాలు, ఇతర విస్తృతమైన పర్యవసానాల గురించి భారత ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here