నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-46

1
11

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

మౌంట్‍బాటెన్‌కు వీడ్కోలు

[dropcap]ని[/dropcap]జామ్ అతని అనుచరుల గురించి నా అంచనాలు సరైనవేనని, వారి పట్ల నా అపనమ్మకం నిజమని మరుసటి రోజు నిరూపితమైంది.

15వ తారీఖున సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు ఒప్పందాన్ని నిజామ్ ఆమోదించిన శుభవార్త తెలుపుతానని లాయక్ అలీ హైదరాబాద్ ప్రయాణమయ్యాడు.

లాయక్ అలీ చెప్పిన సమయానికి ఢిల్లీలో ఉన్న అధికారులంతా ఉద్విగ్నతతో టెలిఫోన్ దగ్గరే ఉండి, దాని వైపు చూస్తూ కూర్చున్నారు. బొలారంలో నేను కూడా అలానే కూర్చున్నాను. అత్యంత ప్రాధాన్యం కలిగిన 7గంటల 30 నిమిషాల సమయం వచ్చింది, వెళ్లిపోయింది. ఆ తరువాత నిజామ్ నుంచి సందేశం అందింది – ‘నాకు మరింత సమయం కావాలి. నేను నా మంత్రిమండలి సలహా పొందాలి’ అని.

16వ తారీఖు సాయంత్రం నిజామ్ మౌంట్‍బాటెన్‍కు టెలిగ్రామ్ పంపాడు. ఇప్పుడు ప్రతిపాదించిన ఒప్పందంలో కొన్ని మార్పులు చేస్తేనే ఆయన ఆమోదిస్తాడు. ఆ నాలుగు అదనపు మార్పులను కూడా నిజామ్ సూచించాడు.

  1. నియోజక వర్గాలను నిర్ణయించే నిజామ్ శక్తికి సంబంధించిన పదాలను లాయక్ అలీకి  తెలియకుండా, ఆయన ఆమోదం లేకుండా ‘ఫర్మాన్’ మలి ప్రతి నుంచి తొలగించారు.
  2. ఫర్మాన్ రాతప్రతిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో చర్చించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న వాక్యాలను చొప్పించారు
  3. హైదరాబాద్ వ్యాపార, ఆర్థిక ద్రవ్య సంబంధిత స్వేచ్ఛకు  ఖచ్చితమైన పదాలతో నిర్ద్వంద్వంగా హామీ ఇవ్వాలి.
  4. ఈ ఒప్పందంలో ఏదైనా అంశం గురించి వివాదం సంభవిస్తే మధ్యవర్తిత్వానికి సంబంధించిన సౌకర్యం ఏర్పాటు గురించి ఉండాలి.

ఇప్పటికే రాజ్యంగ చట్టసభలో హిందూ ముస్లింలు 60:40 నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఉండాలన్న ఆలోచనను న్యూఢిల్లీ వదులుకుంది. ప్రభుత్వోద్యోగులలో, ప్రభుత్వంలో హిందువుల ప్రాతినిధ్యం అధికంగా ఉంటుందన్న ఎలాంటి హామీ కూడా నిజామ్‍కు ఆమోదయోగ్యం కాదు.

నిజామ్ ప్రతిపాదించిన ఈ విషయాలు ఒక రకంగా మౌంట్‍బాటెన్, వాల్టర్ మాంక్టన్‍ల నిజాయితీని ప్రశ్నించినట్టయింది. లాయక్ అలీకి తెలియకుండా ఒప్పందం మలిప్రతిలో మార్పులు చేశారని అనటం వారి నిజాయితీని ప్రశ్నించినట్టే. తనకు తెలియకుండా, తన ఆమోదం లేకుండా ఈ రెండు మార్పులు తాను హైదరాబాద్ బయలుదేరిన తరువాత జరిగాయన్నాడు లాయక్ అలీ. ఈ ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు మౌంట్‍బాటెన్. “ఈ మార్పులు ఎవరు చేశారు? హైదరాబాద్ వాళ్లు కాదు. భారత్ వాళ్ళు అసలే మార్చలేదు” అన్నాడు మాంక్టన్, మౌంట్‍బాటెన్‌కు పంపిన సందేశంలో.

19న వాల్టర్ మాంక్టన్ నిజామ్‍ను, లాయక్ అలీని కలిశాడు. నిజామ్ లేవనెత్తిన అంశాలకు మౌంట్‍బాటెన్ ఇచ్చిన సమాధానాలను ఆయన వారికి అందజేశాడు. నిజామ్ సూచించిన సవరణలు అంత ప్రాధాన్యత ఉన్నవి కావు. వాటి వల్ల చర్చలకు భంగం చేయాల్సిన అవసరం లేదని వారనుకున్నారు. వ్యాపార, ఆర్థిక, ద్రవ్య అంశాల స్వతంత్రం గురించి భారత ప్రభుత్వం సానుభూతిగా వ్యవహరిస్తుంది. యథాతథ ఒప్పందంలో మధ్యవర్తిత్వానికి సంబంధించిన వివరాలున్నాయి. అయితే పరస్పర సుహృద్భావ వాతావరణాన్ని మించిన మధ్యవర్తిత్వం ఇంకొకటి లేదు.

వాల్టర్ మాంక్టన్ ఎంత ప్రయత్నించినా నిజామ్ దృక్పథంలో కానీ, ఇత్తెహాద్ ప్రవర్తనలోని ఎలాంటి మార్పును సాధించలేకపోయాడు. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించటం ద్వారా పాకిస్తాన్‍తో తమ ఆర్థిక వ్యవస్థను మిళితం చేయవచ్చని ఇత్తెహాద్‍లు ఆలోచించారు. భారత్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని తలపెట్టినా మధ్యవర్తిత్వం నియమాన్ని ప్రయోగించి ఐక్యరాజ్యసమితి (యు.ఎన్.ఓ) కానీ ఇంక ఏదైనా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గాని రంగంలోకి దించటం ద్వారా భారత్ చర్యలను అరికట్ట వచ్చని ఆలోచించారు. నిజానికి హైదరాబాదు స్వాతంత్రం వారికి కావాలి. దాన్ని ఎలాగయినా సాధించాలన్నది పథకం. హైదరాబాదుకు భారత్‍తో సంబంధం ఉందన్న భ్రమలో భారత్‍ని ఉంచి స్వతంత్రం సాధించాలన్నది వారి లక్ష్యం.

చర్చలలో పాల్గొంటున్న వారిలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిపై అనవసరమైన ఆరోపణలు చేశారని నిజామ్ గ్రహించాడు. అందుకని తన ఆరోపణలు ఉపసంహరించుకున్నాడు. అయితే తాను చేసిన నాలుగు సూచనలను ఆమోదించాలని అనటమే కాదు, అయిదవ సూచనను కూడా జోడించాడు. ఒకవేళ భారత్ దేశమంతా అత్యవసర పరిస్థితి సంభవించినా, హైదరాబాదులో ఎట్టి పరిస్థితులలో భారత సైన్యం ఉండే వీలు లేదు.

జూన్ 17న పండిట్‍జీ పత్రికా సమావేశం నిర్వహించారు. జరుగుతున్న చర్చల వివరాలు ముఖ్యంగా ప్రజలందరి ముందు ఉంచారు. ఇకపై ఎలాంటి చర్చలు జరపమని అన్నారు. ఎప్పుడయితే ఒప్పందానికి ఆమోదం తెలిపారో, అదే చివరిది అన్నాడు.

జూన్ 19న వాల్టర్ మాంక్టన్ భగ్నహృదయంతో ఢిల్లీకి వీడ్కోలు చెప్పాడు. నిజామ్‍తో అతని చివరి సమావేశం గురించి నాకు తెలిసింది. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, వారిద్దరి వ్యక్తిత్వాలకు సరిగ్గా సరిపోతుంది.

వాల్టర్‍కు వీడ్కోలు తెలిపిన తరువాత “నువ్వు త్వరగా వెనక్కి వస్తావని ఆశిస్తున్నాను” అన్నాడు నిజామ్.

“నేను తిరిగి వచ్చే సమయానికి మీరు ఇంకా నిజామ్ గానే ఉంటారని ఆశిస్తున్నాను” అని సమాధానం ఇచ్చాడు వాల్టర్ మాంక్టన్.

వాల్టర్ మాంక్టన్ లాంటి అత్యుత్తమ సలహాదారు ఎవ్వరికీ లేడు. నిజామ్‍లా, ఉత్తమ సలహాలను త్రోసిపుచ్చి స్వీయ నాశనానికి పాల్పడేవారూ లేరు.

హైదరాబాదు వ్యవహారాలకు వాల్టర్ మాంక్టన్ దూరమవటం నాకు సంతోషం కలిగించింది. ఆయన ఇత్తెహాదులకు అడ్డుకట్ట వేయలేకపోయాడు కానీ వాళ్ళకు రక్షణను ఇవ్వగలిగాడు. ఇత్తెహాద్ తన కర్మ ఫలితాలను అనుభవించటంలో ఆయన అడ్డుగా నిలిచాడు. మా వ్యక్తిగత పరిచయం నాకు ఆయనపై గౌరవాన్ని పెంచింది.

ఇత్తెహాద్‍ల కోసం హైదరాబాదు ప్రయోజనాలను త్యాగం చేయవద్దని నిజామ్‍కు మౌంట్‍బాటెన్ ఓ లేఖ రాశాడు. ఇంకా ఇత్తెహాద్‍లను ఎదిరించి నిజామ్ నిలబడగలడని మౌంట్‍బాటెన్ నమ్మాడు. ఇత్తెహాద్‍లపై ఆధిక్యాన్ని సాధించే చివరి అవకాశాన్ని నిజామ్ పోగొట్టుకున్నాడని మౌంట్‍బాటెన్‍కు తెలియదు.

ఎందుకని ఏదో ఓ రకంగా ఒప్పందం సాధించాలని లాయక్ అలీ ఆత్రపడ్డాడు? 14న అన్నిటికీ ఆమోదం తెలిపి, తరువాత ఎందుకని మాట మార్చాడు? ఆ రోజు జరిగిన సంఘటనలతో సన్నిహిత సంబంధం ఉన్న వారందరినీ సంప్రదించటం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికాను. నేను సంప్రదించిన వారిలో ఢిల్లీలో లాయక్ అలీతో పాటుగా ఉన్న ఆయన సెక్రటరీ జహీర్ అహ్మద్ కూడా ఉన్నారు.

జిన్నా ప్రోద్బలంతో లాయక్ అలీ మాట మార్చాడని ఓ నీలి వార్త ప్రచారంలోకి వచ్చింది. మరో కథనం ప్రకారం 14 రాత్రి, ఢిల్లీ నుంచి ప్రయాణమయ్యే కన్నా ముందు లాయక్ అలీకి భగవంతుడి నుంచి సందేశం అందింది.

అయితే నిజం అనిపించిన వివరణ వేరే ఉంది. చర్చలు, ఒప్పందాలకు లాయక్ అలీ ఆమోదం తెలుపుతుండటం వంటివన్నీ మౌంట్‍బాటెన్ భారత్ విడిచివెళ్ళే సమయం వరకు కాలయాపన చేసే సాధనాలు. ఎందుకంటే మౌంట్‍బాటెన్‍తో చర్చలు విఫలమయితే, మౌంట్‍బాటెన్‍తో పాటు వాల్టర్ మాంక్టన్ కూడా దూరమవుతాడు. వీరిద్దరిలో ఎవరినీ శత్రువులుగా మార్చటం ఇత్తెహాద్‍కు ఇష్టం లేదు.

ఏది ఏమైనా భారత్ ఓ భయంకరమైన, సర్వనాశనకారి అయిన ప్రమాదం నుంచి తప్పించుకుంది. భారత్ పై దయచూపిన దైవానికి సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను.

జూన్ 19న నేను మౌంట్‍బాటెన్‍కు వీడ్కోలు తెలిపేందుకు కలిశాను. ఆయన నాతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించాడు.

ఆయన మన దేశానికి చేసిన సేవ గురించి నేను నా అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా వివరించాను. సుదీర్ఘమైన బ్రిటీష్ పాలన చరిత్రలో భారత్‍కు ఉన్న ఉత్తమమైన స్నేహితుడు అతడు. ఆయన లేకపోతే అధికార బదిలీ ఇంత సులభంగా జరగటం వీలయ్యేది కాదు. భారత్-బ్రిటన్ దేశాల నడుమ ఇప్పుడున్నటు వంటి స్నేహపూర్వక సంబంధాల ఏర్పాటు వీలయ్యేది కాదు.

ఆయన కూడా నిర్మొహమాటంగా నాతో మాట్లాడేడు. లాయక్ అలీతో ఆయన జరిపిన చర్చల వివరాలు చెప్పాడు.

“మున్షీ, నా జీవితంలో నేను ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఆశ్చర్యం కలిగించే కుదుపులు అనుభవించాను. కానీ హైదరబాద్ వాళ్ళు దెబ్బకొట్టినట్టు నన్నెవరూ దెబ్బ కొట్టలేదు” అన్నాడు.

ఇది నాకు నా మాట చెప్పే అవకాశాన్నిచ్చింది. “గత మార్చ్ లోనే నేను మీకు చెప్పాను, ఈ వ్యవహారాలలో నిజామ్ ప్రభుత్వం నిజాయితీగా లేదని. ఇప్పుడు …. మీరు అదే గ్రహించారు” అన్నాను.

అయితే మౌంట్‍బాటెన్ కనుక మరింత కఠినంగా ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే, వాల్టర్ మాంక్టన్‍ను అంతగా నమ్మకపోయి ఉంటే, హైదరాబాద్ విలీనం మార్చ్ నెలలోనే సాధ్యమయ్యేది. అలా మేమిద్దరం వీడ్కోళ్లు తెలుపుకున్నాము.

జూన్ 21న మౌంట్‍బాటెన్ భారత్ వదిలి వెళ్ళాడు.

ఆయన భారత్ వదిలి వెళ్తూ నిజామ్‍కు చివరి సందేశం పంపాడు. సందేశం చివరలో హెచ్చరిక కూడా ఉంది.

‘10. మీ స్థాయిలో ఉన్న పాలకుడు అంతిమ  నిర్ణయం తీసుకునే వ్యక్తిగత బాధ్యత నుంచి తప్పించుకోలేడని మీకు తెలుసు. నాకూ  తెలుసు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం బాధ్యత మీదంటే మీదే. చరిత్ర మిమ్మల్ని హైదరాబాదుకు అత్యంత లాభకరమైన ఒప్పందాన్ని తిరస్కరించిన వాడిలా గుర్తుంచుకుంటుందా?  నిష్పాక్షికంగా చూస్తే ఈ ఒప్పందం హైదరాబాదుకు చాలా లాభకరం. ఇలాంటి ఒప్పందం ప్రతి ఆలోచించదగ్గ వ్యక్తి విమర్శకు గురవుతుంది. లేక, దక్షిణ భారతంలో శాంతి సాధించినవాడిలా, మీ రాష్ట్రాన్ని, మీ వంశాన్ని, మీ ప్రజలను కాపాడినవాడిలా గుర్తుంచుకుంటుందా అన్నది కాలం నిర్ణయిస్తుంది. రెండవదే జరిగితే, మీరు భారత్‍తో స్నేహం సాధిస్తారు.

11.ఇది నేను మీకు ఇచ్చే చివరి సలహా. మీకు నిజమైన స్నేహితుడిని నేను.

మౌంట్‌బాటెన్

భారత గవర్నర్ జనరల్.’

ఈ సందేశానికి నిజామ్ సమాధానం ఇచ్చాడు.

‘18 జూన్‍న మీరు పంపిన టెలిగ్రామ్‍ను ఇప్పుడే అందుకున్నాను. అందుకు మీకు కృతజ్ఞతలు. నేను నా ప్రభుత్వం మా నిర్ణయాన్ని మార్చుకోలేము. ఈ విషయం మీకు వాల్టర్ మాంక్టన్ చెప్పే ఉంటాడు. అదనంగా నేను మీకు ఈ విషయం తెలిపాను. దైవం మీకు శుభం కలిగించుగాక. మీరు క్షేమంగా ఇంగ్లండ్ చేరాలని ప్రార్థిస్తున్నాను.

నిజామ్’

జూన్ 19న సెక్రటేరియట్ స్థాయిలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నేనూ పాల్గొన్నాను. హైదరాబాద్ పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారా సమావేశంలో.

మే 28న లాయక్ అలీతో కలిసి డిన్నర్ చేసిన తరువాత అతనితో నా సంబంధాలన్నీ తెగిపోయాయి. మౌంట్‌బాటెన్ వెళ్ళిపోయిన కొద్ది రోజుల తరువాత హైదరాబాద్ విదేశీ వ్యవహారాల మంత్రి సెక్రటరీ జహీర్ అహ్మద్ నన్ను కలిసేందుకు వచ్చాడు.

“మీ మీద నమ్మకం ఉండబట్టే మిమ్మల్ని కలవడానికి వచ్చాను” అంటూ ఆరంభించాడు.

“హైదరాబాద్ సమస్య మీ ద్వారానే పరిష్కారమవుతుందని నేను చెప్తూనే ఉన్నాను. కానీ నా మాటలు ఎవరూ వినలేదు” అన్నాడు.

“జహీర్, మీరు హైదరాబాదులో ఇత్తెహాద్ పాలనను కొనసాగించే అతి చక్కని అవకాశం మౌంట్‍బాటెన్ ప్రతిపాదనలను తిరస్కరించటంతో కోల్పోయారని మీకు తెలుసు”

“మాకు సహాయం చేయండి. కేవలం నాలుగు అంశాల విషయంలోనే భేదాభిప్రయాలున్నాయి. మీరే ఈ సమస్యను పరిష్కరించగలరు”

నేను మొహమాటం లేకుండా చెప్పాను:

“నా అభిప్రాయాలు మీకు తెలుసు. ఒప్పందం జరిగే అనేక విషయాలకు నేను వ్యతిరేకిని. నా ప్రభుత్వం కనుక ఈ ఒప్పందలను ఆమోదించి ఉంటే నేను ఆ విషయలకు కట్టుబడి ఉండేవాడిని. కానీ నాకు మొదటి నుంచి తెలుసు, మీరు ఈ  ఒప్పందాన్ని అమలుపరచరని. యథాతథ ఒప్పందం కన్నా మీ పై నిబంధనలు పాటించటం ఈ కొత్త ఒప్పందంలో కష్టతరం అయితే, మూడు కేంద్ర అంశాలకు ఎలాంటి షరతులు లేకుండా ఆమోదం తెలిపి, భారత్‍లో విలీనానికి ఒప్పుకుంటేనే నేను మీకు సహాయం చేయగలను”

మరుసటి రోజు సర్దార్ నుంచి ఫోన్ వచ్చింది. సర్దార్ సంతోషంగా ఉన్నారు.

“మున్షీ.. ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? ఏమంటున్నాడు నిజామ్?”

“నిజామ్ బాగానే ఉన్నాడు” అన్నాను.

జహీర్ సూచనలను నేను సర్దార్‌కు చెప్పాను.

“పరిష్కారం?” అన్నారు సర్దార్, ఆ పదం ఎప్పుడూ విననట్టు. “ఏం పరిష్కారం?” అడిగారు.

ఆయన హాస్యంగా ప్రశ్నించటం ఆయన మంచి మూడ్‍ను సూచిస్తుంది. ఇప్పుడు ఆయనకు జరుగుతున్న విషయాలపై తనకు పట్టున్నట్టు తెలిసి ఉంటుంది.

“మౌంట్‍బాటెన్ పరిష్కారం” అన్నాను.

“నిజామ్‍కు చెప్పండి, మౌంట్‍బాటెన్ పరిష్కారం ఇంగ్లండ్ వెళ్లిపోయిందని” అన్నారు నవ్వుతూ వ్యంగ్యంగా.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here