నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-47

0
8

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]హై[/dropcap]దరాబాదులో పెద్ద ఎత్తున ప్రాణత్యాగం గురించి, భారత ప్రభుత్వానికి ఎదురు నిలబడటం గురించి ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలకటం కొనసాగినా, వారిలో నిరుత్సాహం పెరగటం మొదలయింది. బీదర్‍లో లింగాయత్‍ల పట్ల వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా లింగాయత్‍లలో ఆగ్రహం కలిగించింది. మంత్రివర్గంలో లింగాయత్‍ల ప్రతినిధి మల్లికార్జునప్ప నాతో ఫోన్‍లో మాట్లాడేడు. మంత్రివర్గం నుంచి వైదొలగమని లింగాయత్‍లు తనను కోరుతున్నారని చెప్పాడు.

వ్యాపార వ్యవహారాల మంత్రి జోషి ఎంతో దూరాన ఉన్న ప్రమాదాన్ని కూడా పసిగట్టగలడు. మౌంట్‍బాటెన్‍తో చర్చలు విఫలమైన రోజే  ఆయన సర్దార్ పటేల్‍ను ఇంటర్వ్యూ కోరుతూ సందేశం పంపాడు. అయితే సర్దార్ అతడిని కలిసేందుకు నిర్మొహమాటంగా తిరస్కరించారు.

30వ తారీఖున జోషీ నన్ను కలిశాడు. “సర్దార్ నాకు  ఇంటర్వ్యూకోసం   సమయం ఇవ్వటం లేదు. ఈ టెలిగ్రామ్ చూడండి. నిజామ్ ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోమని నా మనస్సాక్షి గోల పెడుతోంది. నేను రాజీనామా చేస్తున్నానన్న విషయం చెప్పేందుకు సర్దార్‍ని కలవాలి. నేను సర్దార్‍ను కలిపే ఏర్పాట్లు చేయాలి మీరు.”

“సర్దార్‍ని కలవాలని ఎందుకనుకుంటున్నారు?” అడిగాను నేను. “మీరు రజ్వీ మనిషి. మీరు రజ్వీ లాంటి దుష్టులతో స్నేహం చేస్తున్నారని సూచనప్రాయంగా అనగానే, తిన్నగా వెళ్లి, నేను మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నానని రజ్వీకి ఫిర్యాదు చేశారు. వారితోనే కలిసి ఉన్నారు. మీకు నేను ఎందుకని సహాయం చేయాలి?”

“దయచేసి నన్ను కలవమని సర్దార్‍కు ఉత్తరం రాయండి.”

“నేను ఎందుకని రాయాలి? హైదరాబాదు ప్రజలపై జరిగిన భయంకరమైన అత్యాచారాలలో మీరు రజ్వీతో భాగస్వామి. ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్య ఉంటేనే నేను సర్దార్‍తో ఇంటర్వ్యూ ఏర్పాట్లు చేయగలను.”

జోషిలో నిరాశ స్పష్టంగా కనిపించింది.

“నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను.”

“నేను నమ్మను” అన్నాను.

“నేను ఇవాళే రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసి మిమ్మల్ని కలుస్తాను. ఈ విషయం సర్దార్‍కి చెప్పండి.”

రాత్రి 9 గంటల 30 నిమిషాలకు జోషి నాకు తన రాజీనామా పత్రం చూపించాడు. ప్రస్తుతం తన ఫాక్టరీ ఉన్న జాల్నాకు వెళ్తున్నాననీ, తిరిగి రాగానే రాజీనామా పత్రాన్ని అందజేస్తానని చెప్పాడు.

జూలై 21 ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఆయన జాల్నాలో తన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకున్నాడు. ధనమంతా బొంబాయికి పంపేశాడు. ఇప్పుడిక రాజీనామాకి సిద్ధం అన్నాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉంది అన్నాడు. తనను హత్య చేయవచ్చు అన్నాడు. తన రాజీనామా విషయాన్ని అణచిపెడతారన్నాడు. తన రాజీనామా పత్రంతో పాటు పర్బనీలో జరిగిన అకృత్యాలను నిరూపించే సాక్ష్యాలను నేను నా దగ్గర భద్రంగా దాచగలనా? తనకేమయినా అయితే నేను వాటిని బహిర్గతం చేయగలానా? అని అడిగాడు.

అతడి రాజీనామా పత్రం ఆసక్తికరమైనది.

“నేను హైదరాబాదుకు, హైదరాబాదు పాలకుడికి విధేయుడను. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నేను మత సామరస్యం సాధించేందుకే ఈ పదవిని స్వీకరించాను. అందుకే ప్రాణాలు త్యాగం చేసయినా నా శక్తినీ, సమయాన్ని శాంతి సాధన కోసమే వినియోగించాలనుకుంటున్నాను. ప్రజల నడుమనే నా స్థానం.

ప్రతి ముస్లిం సోదరుడి పెదిమలపై ‘యుద్ధం’ అన్న పదమే వినిపిస్తోంది. నేను ఏ జిల్లాలో పర్యటించినా దయనీయమైన స్థితిలో, జాలిగొలిపే వదనాలతో హిందువులు కనిపించారు. తమ బంధువులను, ఆస్తులను కోల్పోయిన గాథలతో, తమ ప్రాణాలు, ఆస్తులు ప్రపమాదంలో ఉన్నాయన్న భయంతో ఉన్నవారే కనిపించారు. మానభంగాలు, దోపిడీలు నిత్యకృత్యాలయ్యాయి” ఇలా సాగింది అతని రాజీనామా పత్రం.

జోషీ రాజీనామా పత్రం లాయక్ అలీకి కోపం తెప్పించింది. తమ పడవ మునిగిపోతోందని లాయక్ అలీకి తెలుసు. ఆ విషయం అందరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి ఢిల్లీ రేడియో ఈ విషయాన్ని ప్రకటించింది.

జూలై 4న నిజామ్ బ్రిటన్ ప్రధాని అట్లీకి ఉత్తరం రాశాడు. బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటీష్ కామన్‍వెల్త్ ప్రజలు జోక్యం చేసుకుని తనని కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ ఉత్తరంలో అభ్యర్థించాడు. ఇదే సమయానికి నిజామ్ వైఖరిని విమర్శిస్తూ పండిట్‍జీ బ్రిటీష్ ప్రధానికి లేఖ రాశారు. నిజామ్ వ్యవహారాలలో తాను సహాయం చేయలేననీ, అతని కోరికను మన్నించలేనని బ్రిటీష్ ప్రధాని నిజామ్‍కు సమాధానం ఇచ్చాడు. భారత్‍కు సంబంధించిన వ్యవహారాలలో బ్రిటన్ లేబర్ ప్రభుత్వం గౌరవనీయంగానే వ్యవహరించింది.

దాంతో సైనిక యుద్ధానికి హైదరాబాదు తయారీపై ముసుగు తొలగిపోయింది. హైదరాబాద్ నగరం యుద్ధ శిబిరంలా మారింది. గోవా నుంచి ఆయుధాలు భూమార్గంలో, కరాచీ నుంచి ఆకాశమార్గంలో ఆయుధాల సరఫరా వేగవంతమయింది. కరాచీ నుంచి హైదరాబాదుకు ఆయుధాలు చేరవేసే విమానాల ప్రయాణాలు తీవ్రమయ్యాయి. స్టెన్ గన్లు, వాటికి సంబంధించిన మందుగుండు సామాగ్రి సర్వత్రా కనిపించసాగాయి. ఎన్నో ప్రమాదాలను తట్టుకుని ఆర్యసమాజ్ అధ్యక్షుడు నారాయణరావు అతని అనుచరులు ఈ విమానాల కదలికలు, అవి చేరవేస్తున్న ఆయుధాల వివరాలు, ఆ ఆయుధాల గమ్యాలు వంటి విషయాలను సేకరించారు.

హైదరాబాదును ఇతర ప్రపంచంతో కలిపే బేగమ్‌పేట విమానాశ్రయ నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఆ సమయంలో హైదరాబాదు డబ్బు మంచినీళ్ళలా ప్రవహించింది. లండన్ లోని పలు వ్యాపారస్థులకు, పాకిస్తాన్‍కు లక్షల రూపాయలు చేరాయి. లండన్ లోని పాకిస్తాన్ హైకమీషనర్‍కు ఒకటిన్నర మిలియన్ స్టెర్లింగ్‌లు బదిలీ అయ్యాయి. లాయక్ అలీకి అందుబాటులో ఉన్న అపరిమితమైన ధనం రజాకార్లకు నిధులు సమకూర్చటంలోనే కాదు, అనేకులు విదేశాలు ప్రయాణించి, అంతర్జాతీయంగా హైదరాబాదుకు సమర్థనను సాధించటం కోసం కూడా ఉపయోగపడింది. ఒకరు ఈజిప్టు వెళ్తే, మరొకరు ఇరాక్ ప్రయాణించారు.

పయనీర్ మాజీ సంపాదకుడు, భారత ప్రభుత్వ పౌర సంబంధాల శాఖ అధికారి అయిన డెస్మండ్ యంగ్, అపరిమితమైన నిధులతో అమెరికా ప్రయాణమయ్యాడు. హైదరాబాదుకు అమెరికాలో మద్దతు సాధించటం అతని పని. అతని ప్రభావంతో అమెరికా పత్రికల్లో భారత్ వ్యతిరేక రాతలు వెల్లువయ్యాయి. భారత హైదరాబాద్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి తీసుకువచ్చేందుకు పలు రకాల ప్రచార సంస్థలు, అమెరికాలో పలువురు ప్రముఖుల సహాయం హైదరాబాదుకు లభించింది.

భారత్ – హైదరాబాద్‍ల నడుమ సామరస్య పూర్వకమైన ఒప్పందం సాధించాలని ప్రయత్నించిన ఢిల్లీ ఏజంట్ జనరల్ జైన్ యార్ జంగ్‍ను ‘గద్దార్’ (మోసగాడు)గా ప్రకటించి, దూషించటం ప్రారంభించింది ఇత్తెహాద్. దీని అర్థం అతడి హత్య. ఇంత కాలం ఇత్తెహద్‍ల అకృత్యాలను తిరస్కరిస్తూ, తన తీయటి చిరునవ్వుతో నా నివేదికలను కొట్టి పారేసిన జైన్ యార్ జంగ్, ఇప్పుడు ఇత్తెహాద్‍ల దౌష్ట్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించబోతున్నాడు.

ఇత్తెహాద్‍కు చెందని పలువురు ముస్లిం పెద్దలు లాయక్ అలీని కలిసి, భారత్ ప్రభుత్వంతో విలీనం కావాలని నిజామ్‍కు సలహా ఇవ్వాలని అభ్యర్థించారు. ఇది జరగకపోతే, సైనిక చర్య జరగవచ్చని వారు వెలిబుచ్చిన భయాలను లాయక్ అలీ కొట్టి వేశాడు. “ఒకవేళ భారత ప్రభుత్వం హైదరాబాదుకు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక చర్యను తలపెట్టినా, హైదరాబాదు సైన్యంలో చేరేందుకు 100,000  మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. బొంబాయిపై బాంబుల వర్షం కురిపించేందుకు దక్షిణ అరేబియాలో వందకి పైగా బాంబర్లు సిద్ధంగా ఉన్నారు” అన్నాడు.

అప్పటికి పీకాక్ ఎయిర్‍బోర్న్ డివిజన్ ఇంకా చలామణీలో ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here