నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-5

1
9

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]స్వ[/dropcap]తంత్ర రాజ్యాలు ఏర్పర్చుకున్న రాజపుత్రులు, సుల్తానులకు చిక్కకుండా తమ అనుచరులతో పారిపోయినవారు. వీరు అంత సులభంగా చేర వీలులేని ప్రాంతాలలో ఢిల్లీ సుల్తానులకు దూరంగా రాజ్యాలు ఏర్పరుచుకున్నారు. వీరు ఏర్పర్చిన చిన్న చిన్న రాజ్యాలలో వంశపారంపర్యంగా రాజపుత్రులు రాజ్యం చేశారు. వీరికి విధేయులుగా ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ రాజపుత్రులతో తమ అదృష్టాన్ని జతపరుచుకుని రాజ్యాలలో నివసించారు. ఓర్చా, దలేయా, సంధార్, సిక్కిం  రాజ్యాలు ఇలాంటివే.

1935 నాటికి భారత్ లో మొఘలుల కన్నా ముందునుంచి ఉన్న ఏకైక రాజ్యం కలాత్. తుర్కుల రాజ్యాలలో లాగా, వీరు తమ రాచరికాన్ని సర్దారులతో కలసి నిర్వహించేవారు.

మొఘలులను వ్యతిరేకించి ఏర్పడిన ఏకైక రాజ్యం శివాజీ మహరాజ్‍ది. అత్యంత వీరోచితంగా పోరాడుతూ, రాజకీయ చతురతతో శివాజీ ఏర్పర్చిన రాజ్య సార్వభౌమత్వాన్ని అతని వారసులు మొఘలుల సహాయం కోసం వారి ఆమోదంతో రాజ్యానికి గుర్తింపు సాధించటంతో అంతమయింది. శివాజీ రాజ్యం రెండు ముక్కలయింది. వీటిలో ‘సతారా’ ముంబయి ప్రాంతంతో కలిసిపోయింది. అంటే, 1935 సంవత్సరంలో  శివాజీ సామ్రాజ్యానికి ఆనవాళ్ళుగా మిగిలింది కోల్హాపూర్ మహరాజ్ మాత్రమే.

మిగతా రాజ్యాలన్నీ మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత,  బ్రిటీష్ వారి నిర్ణయాల వల్ల ఏర్పడినవి.

మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, పలు రాజ్యాలలో మొఘల్ ప్రతినిధులుగా వ్యవహరించిన వారు స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పడిన రాజులు, మొఘలుల పతానానంతరం చెలరేగిన అల్లకల్లోల పరిస్థితుల వల్ల అదృశ్యమయిపోయారు. ఈ అల్లకల్లోలాను దాటుకుని, బ్రతికి బట్టకట్టింది హైదరాబాద్‍కు చెందిన నిజామ్ ఒక్కడే! మొఘలుల గవర్నరులు, జాగీర్దారులు కొందరు మధ్యభారత్, గుజరాత్, సట్లెజ్ వంటి ప్రాంతాలలో సంస్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ముస్లిం రాజ్యాలు. బ్రిటీష్ వారు  భారత్‍లో అడుగుపెట్టక పోయి ఉంటే, మరాఠాలు ఈ ప్రాంతాలన్నింటినీ మరాఠా సామ్రాజ్యంలో కలిపేసుకుని ఉండేవారు. ఎందుకంటే ఈ ప్రాంతాలలో రాజులు ఇస్లామీయులు అయినా, అధిక సంఖ్యలో ప్రజలు హిందువులు.

అలాగే సిఖియాలు, హోల్కారులు , గయిఖ్వాడ్‍లు ఎన్నడూ సర్వస్వతంత్రులు కారు. వారు అనుభవించిన ఏ మాత్రం స్వతంత్ర్యమైనా అది బ్రిటీషు వారి మద్దతు వల్లనే సాధ్యమయింది. బ్రిటీష్ వారి మద్దతు లేకపోతే రాజ్‍పుతానా, మధ్య భారత్, గుజరాత్ వంటి బలమైన ప్రాంతాలపై వీరు అధికారం నెరపగలిగేవారు కాదు. ఎందుకంటే, ఆ ప్రాంతాలలో నివసించే ప్రజల భాషలు, సంస్కృతులకు భిన్నమైన భాష, సంస్కృతులు పాలకులవి.

దక్షిణ భారతదేశంలోని హిందూ రాజ్యమైన మైసూరు రాజ్యాన్ని 1881 సంవత్సరంలో బ్రిటీషువారు రాచరిక రాజ్యంగా ఏర్పాటు చేశారు. 1911లో బనారస్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.

మొఘలుల పతనం, లాహోర్ లోని సిక్కుల రాజ్యాన్ని బ్రిటీష్ వారు నాశనం చేయటంతో బహ్వాల్ పుర , జమ్మూలతో కలిపి పంజాబ్ రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది. రంజిత్ సింగ్‍కు సామంతుడు, జమ్మూ పాలకుల వంశానికి చెందిన గులాబ్ సింగ్ పంజాబ్ రాష్ట్రాలకు కశ్మీరును జోడించాడు. ఈ రాష్ట్రాలన్నీ బ్రిటీష్ వారి రక్షణలో ఉన్నాయి. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. బ్రిటీష్ వారు పంజాబ్‍ను గెలుచుకునే కన్నా ముందు సట్లెజ్ ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలు కావు.

గుజరాత్, సౌరాష్ట్రలలో ఉన్న మూడు వందల ఇరవై పై చిలుకు చిన్న రాజ్యాలు; బరోడాకి చెందిన గైక్వాడ్‍లకు ముల్కగిరి కప్పం చెల్లించేవి. ఈ చిన్న చిన్న రాజ్యాలు ఓ మోస్తరు స్వాతంత్ర్యాన్ని అనుభవించగలిగాయి. ఇందుకు కారణం వాటన్నింటిని తన అదుపులో ఉంచుకున్న  రాజు వాటిని రాజ్యాలుగా ఏర్పాటు చేయలేకపోయాడు కాబట్టి. బ్రిటీష్ వారు పశ్చిమ భారత్ పై ఆధిక్యం సాధించినప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలను కప్పం చెల్లించే బాధ నుంచి తప్పించారు. కానీ, ఈ రాజ్యాలపై పాలనాధికారాలను  రాజు పేరిట బ్రిటీష్ వారే తమ గుప్పిట్లో ఉంచుకున్నారు.

పెద్ద రాజ్యాలలోని భూస్వాములకు బ్రిటీష్ వారు కాస్త స్వతంత్రం ఇచ్చినా, చిన్న చిన్న రాజ్యాలలో భూస్వామ్య/జమీందారీ వ్యవస్థను బ్రిటీష్ వారు కొనసాగించారు.

దీన్ని బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ట్రావెన్‍కోర్, ఉదయపూర్, నేపాల్, కోల్హాపూర్‍తో సహా కొన్ని రాజపుత్ర రాజ్యాలు తప్పించి 1935 నాటికి భారతదేశంలో ఉన్న ఇతర ఏ రాజ్యం కూడా స్వతంత్ర రాజ్యం కాదన్నది.

బ్రిటీష్ రెసిడెంట్, లేక ఏజంట్ల సహాయంతో రాజ్యాధికారాన్ని నిలుపుకుంటూ పాలిస్తున్న రాజుల విధేయత ప్రాధాన్యాన్ని  బ్రిటీష్ వారు గుర్తించారు. 20వ శతాబ్దంలో, దేశమంతా జాతీయ భావనలతో ఉత్తేజితమవుతున్నప్పుడు బ్రిటీష్ వారు ఓ కొత్త రాజ్యాంగ సూత్రాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యపాలనలో స్వతంత్రాన్ని అనుభవిస్తున్న   రాజ్యాలు సార్వభౌమత్వంతో సమానం. వారితో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకున్న ఒప్పందాలు ఇప్పటికీ వర్తిస్తాయి. కానీ ఎక్కడయితే బ్రిటీష్ వారి లక్ష్యాలు దెబ్బతినే వీలుందో అక్కడ సర్వ అధికారాలు బ్రిటీష్ వారివే. ఈ సూత్రాన్ని రాజులంతా సంతోషంగా స్వీకరించారు. దీన్ని వారు స్వతంత్ర వ్యవహారాల నిబంధన ప్రకటనగా భావించారు.

1935 కన్నా ముందు భారతీయ రాజుల స్టాండింగ్ కమిటీ (ఆలోచన సభ) ఓ అత్యాశపూర్వకమైన ప్రకటన చేసింది. భారతీయ రాజులు  బ్రిటీష్ రాచరికంతో సమానమైన హోదాను కోరారు. అలాంటి సమానమైన హోదా ఉంటే తప్ప ఈస్ట్ ఇండియా కంపెనీతో వీరు చేసుకున్న ఒప్పందాలకు భద్రత ఉండదు [ఎందుకంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానాన్ని బ్రిటీష్ రాణి ఆక్రమించింది  కాబట్టి, రాణితో సమాన స్థాయి ఉంటే తప్ప ఒప్పందాలు చెల్లవు – అనువాదకుడు].

రాజులు చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే  బ్రిటీష్ వారికి భారత రాజకీయాలలో ద్విపాత్రాభినయం చేసే వీలు కలుగుతుంది. ఎక్కడెక్కడ వారి ప్రయోజనాలు దెబ్బతినే వీలుందో అక్కడ బ్రిటీష్ ఆధికత్యం అన్న భావనను ప్రదర్శించవచ్చు. అదే సమయానికి ఇతర రాజులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలన్న ప్రజల కోరికను కాదని తమ స్వాతంత్ర్యాన్ని నిలుపుకునేందుకు ప్రోత్సహించవచ్చు.

1926 మార్చి 26న లార్డ్ రీడింగ్ నిజామ్‍కు రాసిన లేఖలో ఈ సర్వసార్వభౌమ సూత్రాన్ని నిర్వచించాడు. ‘భారతదేశంలో బ్రిటీష్ వారి సార్వభౌమత్వం తిరుగులేనిది. కాబట్టి ఏ భారతీయ రాజు కూడా బ్రిటీష్ వారితో సమాన స్థాయిలో చర్చించే హక్కును  కోరే వీలు లేదు.’ సార్వభౌమత్వం సర్వోత్తమం!

ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, 19వ శతాబ్దం నుండి అధికారాన్ని భారతీయులకు అప్పగించేవరకూ బ్రిటీష్ వారు అమలు పరిచిన ఈ సార్వభౌమత్వ సూత్రంలో కాస్త మంచి కూడా ఉందనిపిస్తుంది. రాజకీయంగా బ్రిటీష్ వారు ఇండియాను, భారతీయుల భారత్ నుంచి వేరు చేసినప్పటికీ, దేశం  పాలనా రంగంలో, ఆర్థిక రంగంలో ఏకమవటంలో ఎంతగానో తోడ్పడింది. ఈ రెండు భారత్‍ల నడుమ పాలనలో ఉన్న తేడాను అధిగమించేందుకు తమ అధికారాన్ని కాపాడుకోవాలనే బ్రిటీష్ వారి ఆలోచన తోడ్పడింది. సర్వసార్వభౌమత్వం వల్ల 20వ శతాబ్దంలో భారత్‍కు లాభం కలిగింది. అయితే ఈ సూత్రం వల్ల వివిధ రాజ్యాల రాజులు జాతీయ భావనల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ రకంగా పాలనాపరంగా భారత్ ఐక్యంగా ఉన్నా, రాజకీయ విభేదాలు మాత్రం అనేకం ఏర్పడ్డాయి. కానీ, ఈ విభేదాలు సృష్టించేవారి అడ్డు తొలగగానే, ఐక్యతను సమర్థించేవారు వెంటనే తమ శక్తిని ప్రదర్శించగలిగారు.   1948-50 నడుమ, అంటే కేవలం రెండేళ్ళలో దేశాన్ని రాజకీయంగా, ఆర్థికంగా ఏకం చేసే వీలు ఈ ఐక్యత భావన వల్లనే సాధ్యమయింది.

1935లో ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ చట్టం వల్ల, భారతదేశంలోని రాజులంతా బ్రిటీష్ రాణి ప్రతినిధులైన గవర్నర్ జనరల్ పరిధిలోకి వచ్చారు. ఇది రాజులకు సామంతులకు నడుమ ఉన్న సంబంధం లాంటిది. 1947లో సామంతులను పట్టి ఉంచిన రాజు భారత్‍ని వదిలి వెళ్తున్నప్పుడు, ఇంత కాలం ఈ సామంతులంతా అణచిపెట్టి ఉంచిన స్వతంత్ర కాంక్షను నెరవేర్చుకునే ఆశ కలిగింది. తాము స్వతంత్రులవటం సులభం అనుకున్నారు.

భారతీయ రాజుల బ్రిటీష్ సమర్థన ఆధారంగా , ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతుల ఆధారంగా ఆయా రాజ్యాలలో బ్రిటీష్ వారు  వారి వ్యాపారాలను విస్తరించ  వచ్చని బ్రిటీష్ వారు ఆశపడ్దారు. కానీ వారంతా భారతదేశమంతా ప్రజలలో రగులుతున్న స్వతంత్ర కాంక్ష, జాతీయ భావనలను పరిగణనలోకి తీసుకోలేదు.

(వచ్చే వారం ‘పగటి కలలు’)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here