నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-52

0
13

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]నే[/dropcap]ను దుర్గాదాస్‌కు ఫోన్ చేశాను. నా రచన ఢిల్లీలో పెద్దలకు బాగా నచ్చిందని చెప్పాడు. ఈ రచన వల్ల నా ప్రతిష్ఠ పెరిగిందన్నాడు. రాష్ట్ర మంత్రి  వర్గం గురించి మాట్లాడాడు. జిన్నా త్వరలో మరణిస్తాడన్న నీలివార్తలు ఢిల్లీలో చెలరేగుతున్నాయని చెప్పాడు.

ఎన్.కె.రావు, పండిత్ నరేంద్రజీలు వచ్చారు. కొందరు ప్రముఖ కాంగ్రెస్ నాయకులపై ఉన్న సస్పెన్షన్ ఆర్డరును రద్దు చేయాల్సిన ఆవశ్యకతను వివరించాను.

మీర్జాకు కూడా ఫోను చేశాను. లాయక్ అలీ చెప్పిన మాటలను విన్న నిజామ్, ఆయన ఢిల్లీ వెళ్లటం పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేశారని మీర్జాతో అన్నాడట. అబద్ధాలు చెప్పటంలో లాయక్ అలీ దిట్ట.

సాయంత్రం జోషి వచ్చాడు. ఆయన లాయక్ అలీని కూడా కలిశాడు. అదే పాత కథ. ఎలాగయినా సమస్యకు పరిష్కారం చూడమని అన్నాడట.

అయ్యంగారు వచ్చి కలిశాడు. సంజీవిని కలసి మాట్లాడానన్నడు.

ఆగస్టు 20, 1948.

ఉదయమే నంద వచ్చి కలిశాడు. ఈ సమస్య సంపూర్ణంగా పరిష్కారమయ్యే వరకూ ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నట్టు చెప్పాడు. ఆయన నిర్ణయం పట్ల అభినందన తెలిపాను. పరిస్థితి విషమించినప్పుడు మనం మన కర్తవ్యాన్ని నిర్వహించటం మన బాధ్యత అని చెప్పాను.

ఇది రహస్యంగా ఉండాల్సిన సమయం కాబట్టి స్టేట్స్ మినిస్ట్రీ మాతో ఎలాంటి సమాచారం పంచుకోవటం లేదు.

మా పరిస్థితి ఎలా ఉందంటే, ఓడిపోతామని తెలిసి కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్న నిరాయుధుల్లా ఉంది. నగరంలో నెలకొన్ని ఉన్న ఉద్విగ్నతా పూర్వకమైన పరిస్థితుల వల్ల నా దగ్గర ఉన్న ఉద్యోగుల పై ఒత్తిడి అధికంగా ఉంది. అయినా సరే వారంతా అసాధారణ ధైర్యం ప్రదర్శిస్తున్నారు.

వనపర్తి రాజును కలిశాను. ప్రిన్స్ ఆఫ్ బేరార్ సెక్రటరీ రాజు మహబూబ్ కరణ్‍ను కలిశాను.

నాతో మిస్టర్ W డిన్నర్ చేశాడు. ఆయన రాజకీయాలలో స్వయంగా కొత్త దారులు వెతుకుతున్నాడు. లాయక్ అలీ, ఎల్ ఎద్రూస్, కాసిమ్ రజ్వీ లతో పాటు నాతో స్నేహంగా ఉంటున్నాడు. ఒక వేళ హైదరాబాదుపై సైనిక చర్య సంభవిస్తే రజాకార్లు కమ్యునిస్టులతో చేతులు కలుపుతారనీ, వారు  శక్తి దక్షిణాన బలవంతులవుతారనీ  ఆయన నమ్ముతున్నాడు. కమ్యూనిస్టులతో స్నేహం ఆయనను మనకు వ్యతిరేకుడిగా ఉండేట్టు చేస్తోంది. హైదరబాదులో ఓ ముస్లిం నాయకత్వం క్రింద ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసి దౌత్యపరంగా గొప్ప జయం సాధించమని నన్ను అభ్యర్థించాడు. ఆయన మాటలలో అంతర్లీనంగా ఓ బెదిరింపు కూడా ఉంది. ఒకవేళ భారత్ కశ్మీర్ సమస్య కోసం, నాగాల సమస్య కోసం, హైదరాబాద్ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితిని శరణువేడితే, ప్రపంచ దేశాలు మద్దతును ఉపసంహరించుకుంటాయని అన్నాడు. ఆయన కొన్ని కమ్యూనిస్టు పత్రాలను సేకరించాడు. వాటిని మేజర్ సింగ్ ద్వారా నాకు పంపుతానన్నాడు.

అయ్యంగార్ కూడా హైదరాబాదులోనే ఉండాలని నిశ్చయించుకొన్నాడు. ఆయన ధార్మికుడు. మేము దైవం, యోగతో సహా పలు ధర్మపరమైన ఇతర విషయాల గురించి చర్చించుకునేవారం.

సాయంత్రం బెంగుళూరులో ఉన్న రాజాజీకి టెలిగ్రామ్ పంపాను. గోపాలస్వామి అయ్యంగార్‍తో, హైదరాబాదు ఐక్యరాజ్యసమితి తలుపు తట్టటం వల్ల కలిగే పరిణామాల గురించి చర్చించాను. మన పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నాడు అయ్యంగార్.

యథాతథ ఒప్పందాన్ని వ్యతిరేకించకుండా, ఐక్యరాజ్యసమితికి హైదరాబాదు సమస్య పరిష్కారం బాధ్యతను అప్పగించాలని, అందువల్ల భారత్ సైనిక చర్యను చేపట్టే వీలుండదని వాల్టర్ మాంక్టన్, లాయక్ అలీకి సలహానిచ్చినట్టు నాకు తెలిసింది. మౌంట్‌బాటెన్ ప్రతిపాదనను కొన్ని మార్పుచేర్పులతో ఆమోదించమని ఐక్యరాజ్యసమితి భారత్‍పై ఒత్తిడి తేవచ్చు. మరో వైపు, హైదరాబాద్ ప్రతిపాదనలను కనుక ఐక్యరాజ్యసమితి తిరస్కరిస్తే, గత్యంతరం లేక, మౌంట్‍బాటెన్ ప్రతిపాదనలకు హైదరాబాద్ ఆమోదం తెలపవచ్చు. ఒకవేళ యథాతథ ఒప్పందాన్ని కనక హైదరాబాద్ తిరస్కరిస్తే ఇది సాకుగా, భారత సేనలు హైదరాబాదులో ప్రవేశించవచ్చు.

నాకు తెలిసి  మరో దృక్కోణానికి పాకిస్తాన్ మద్దతు లభించింది. యథాతథ ఒప్పందాన్ని తిరస్కరించి, సాంకేతిక సమస్యను పరిష్కరించకపోతే ఐక్యరాజ్యసమితి హైదరాబాద్ ప్రతిపాదనలను స్వీకరించకపోవచ్చు. అప్పుడు సమస్య అంతర్జాతీయం అవుతుంది కాబట్టి పాకిస్తాన్ హైదరాబాద్‍కు సహాయం చేసే వీలుంటుంది. ఇందువల్ల హైదరాబాద్‍పై భారత్ తలపెట్టే ఎలాంటి సైనిక చర్య అయినా ఆలస్యం అవుతుంది. ఒకవేళ సైనిక చర్య చేపట్టినా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ అప్రదిష్ఠ పాలవుతుంది.

హెజాజ్, ట్రాన్స్- జోర్డాన్, ఈజిప్టు రాజుల దగ్గరకు సిడ్నీ కాటన్ విమానాలతో దూతలను పంపేందుకు తీవ్రమైన ప్రయత్నాలు  ఆరంభమయ్యాయి.

***

డైరీ ఈ రకంగా కొనసాగింది.

ఆగస్టు 21, 1948

సర్దార్‍తో టెలిఫోన్ ద్వారా మాట్లాడేను. హైదరాబాద్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించటానికి వ్యతిరేకంగా, హైదరాబాద్‍పై సైనిక చర్యను వ్యతిరేకిస్తూ, జహీర్ అహ్మద్ సలహా ఇచ్చాడన్న వార్త వ్యాపించింది. ఇది యథాతథ ఒప్పందాన్ని రద్దు చేసినట్టు అవుతుంది. ఈ విషయాల గురించి సర్దార్‌తో చర్చించారు. హైదరాబాద్‌లో పోస్ట్, టెలిగ్రాఫ్ కార్యాలయాలను మూసి వేయటం సర్దార్‍కు ఇష్టం లేదు. బలహీనులను, దుర్బలులను పద్ధతి ప్రకారం పంపించేస్తూ ఈ కార్యాలయాలు ఎలాగయినా పని చేసేట్టు చూడమన్నారు.

బిషప్ వైటేకర్‌కు మిషన్‌కు ఔషధాల సరఫరా అందటం లేదన్న ఫిర్యాదు విషయంలో బిషప్‍కు తంతి పంపాను. నిజానికి హైదరాబాదుకు ఔషధాలు తెచ్చే ఆర్డరు తీసుకున్న ఎడ్వర్డ్స్, వింతగా, వాటిని తీసుకుని రాలేదు. ఈ విషయమై బిషప్ వైటేకర్ అది మన తప్పు అయినట్టు ఫిర్యాదు చేస్తున్నాడు, విదేశీ పాత్రికేయులతో.

నాకు సమాధానంగా బిషప్ ఉత్తరం రాశాడు. ఎడ్వర్డ్స్ పొరపాటు వలన మందులు తమకు అందలేదని, దాన్లో నా తప్పేమీ లేదని క్షమాపణలతో సమాధానం ఇచ్చాడు.

ధూత్, మేము MAZ అని పిలిచే కాంట్రాక్టర్ నన్ను కలిశారు. కాంట్రాక్టర్ బంధువు, ఒకప్పటి నిజామ్ ఆఫీసరు, నవాబు అయిన జుల్ ఖాదర్ జంగ్ నన్ను కలవాలని అనుకుంటున్నాడట. ఆయన నిజామ్‍తో మాట్లాడేడట. నిజామ్ అయోమయంలో ఉన్నాడనీ, అధైర్యంగా ఉన్నాడని అంటాడతను. నిజామ్ తన ప్రమేయం లేకుండా లాయక్ అలీ ఎలా చెప్తే అలా చేస్తున్నాడని, అతడి ఆటలో భాగమయ్యాడని అంటాడు MAZ.

సర్దార్, సత్యనారాయణ సిన్హా, జి.డి బిర్లా లతో ఫోనులో మాట్లాడాను. ఐక్యరాజ్యసమితికి హైదరాబాద్ ప్రస్తావనను నివేదించటం మన పథకంపై ఎలాంటి ప్రభావం చూపించదని  అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

కాస్త జ్వరంగా ఉంది.

గనేరీవాల్ వచ్చాడు. ఓ ముస్లిం పార్టీని ఏర్పాటు చేయటం గురించి చర్చించాడు. ఎప్పటిలాగే నిజామ్‍కు సంబంధించిన గాథలు మోసుకు వచ్చాడు. రాజాజీ నిజామ్‍కు ఉత్తరం రాసినట్టు తెలిసింది. ముదలియార్ కూడా లాయక్ అలీకి ఉత్తరం రాశాడు. రజాకార్ వ్యతిరేక ఉర్దూ పత్రిక ‘ఇమ్రోజ్’ పత్రిక ఎడిటర్, ధైర్యశాలి అయిన షోయబుల్లాహ్ ఖాన్, రజ్వీని తీవ్రంగా, ధైర్యంగా విమర్శించాడు. మన్జూర్ జంగ్, అతని స్నేహితులు విడుదల చేసిన ప్రకటన పత్రంలో షోయబుల్లాహ్ ఖాన్ సంతకం చేశాడు. ఈ ప్రకటన రజ్వీకి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

‘రాజ్యానికి వ్యతిరేకింగా లేచిన హస్తాలను కత్తిరిస్తానని’ ప్రకటించాడు. అంతేకాదు, రాజ్యానికి వ్యతిరేకంగా లేచిన హస్తాలనే కాదు, ఆ హాస్తాలను నియంత్రించే వారి హస్తాలను కూడా  నరికేస్తానని అన్నాడు. రజ్వీ ఉద్దేశంలో షోయబుల్లాహ్ ఖాన్ లాంటి వారి వెనుక ఉన్నది నిజామ్.

‘ఇమ్రోజ్’ ఎడిటర్ షోయబుల్లాహ్ ఖాన్‌ను కాల్చారు. అతని చేతులను కత్తిరించారు. ఈ దాడిలో అతని తోడల్లుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఫాసిస్టుల పద్ధతిలో తమను వ్యతిరేకించిన వారి అడ్డు తొలగిస్తున్నారు రజాకార్లు.

మన్జూర్ జంగ్, అక్బర్ అలీలను అరెస్టు చేశారు. జైలుకు పంపించారు (ఈ వార్త పొరపాటు అని తరువాత తేలింది). ఇలాంటి చర్యలు ఇస్లామీయులలో రజాకార్ల వ్యతిరేక ప్రదర్శనను అంతం చేసింది.

హైదరాబాద్ వ్యతిరేక ప్రచారాన్ని సమర్థించినట్టయితే, ఇమ్రోజ్ సంపాదకుడు షోయబుల్లాహ్ ఖాన్‌కు పట్టిన గతే పడుతుందని, ఇత్తెహాద్‌ను వ్యతిరేకించే  ఉర్దూ పత్రికలన్నింటికీ ఉత్తరాల ద్వారా, ఫోన్ లోనూ బెదిరింపులు అందేయి. ఐక్యరాజ్యసమితి తలుపులు తట్టే చర్యను వ్యతిరేకిస్తారని  అనుమానమున్న కాంగ్రెస్ కార్యకర్తలని కూడా అరెస్టు చేశారు.

నవాబ్ జుల్ ఖాదర్ జంగ్ లంచ్‍కని వచ్చాడు. అతని బంధువు MAZ అతడికి ఆహ్వానం అందేట్టు చూశాడు. హైదరాబాద్‌లో నాకు కలసిన వారిలో సమర్థుడు, స్పష్టమైన ఆలోచనలు కలవాడుగా అనిపించాడతడు. నిజామ్ తరఫునో, దీన్ యార్ జంగ్ తరఫునో నాతో ప్రధానమైన అంశాలు చర్చించేందుకు వచ్చాడాయన. ఒకవేళ హైదరాబాద్, భారత్‍లో విలీనమైతే అసిఫా వంశం ప్రతిష్ఠ అలాగే కొనసాగుతుందా , ఇతర ఉన్నత స్థానాలలో ఉన్న ముస్లింల పరపతి అలాగే ఉంటుందో లేదో కనుక్కోటానికి వచ్చాడు. ఈ విషయం అడిగాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని తొలగించి, కొత్త మంత్రివర్గాన్ని నియమించటంలోని పరిస్థితులు, సాధక బాధకాలు చర్చించాడు.

ఆగస్టు 23, 1948

దక్షిణ సదన్‍పై నిఘా ఉందని ఓ కాంట్రాక్టర్ నాతో చెప్పాడు. బొలారంలోని ఓ మసీదులో ఆగస్టు 16న ఓ సమావేశం జరిగిందనీ, దాన్లో నన్ను చంపిన వాడికి రూ. 5000/- బహుమతిగా ఇస్తామని రజాకార్ల కేంద్ర కార్యాలయం ప్రకటించిందని కూడా చెప్పాడు.

మైసూర్ మహారాజా, చక్రవర్తి రాజగోపాలాచారిలు నిజామ్‍కు రాసిన ఉత్తరాన్ని మైసూరు రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ చాందీ పట్టుకుని వచ్చాడు. ఆ ఉత్తరం కేవలం వారి  ఆశలకు సంబంధించినది. నిజామ్ సైతం పవిత్రమైన భావాలను వ్యక్తపరిచే ఓ ఉత్తరాన్ని ఆ సాయంత్రం రాజగోపాలచారికి పంపేడని తెలిసింది. ఆయన మాంక్టన్‍కు కూడా ఓ ఉత్తరం రాశాడు.

పిక్చర్ పోస్ట్ పాత్రికేయుడు నాతో మధ్యాహ్న భోజనం చేశాడు. పలు విషయాలను నాతో చర్చించాడు.

పన్నాలాల్ వచ్చాడు. షోయబుల్లాహ్ ఖాన్ హత్య ఉదంతం తరువాత మంత్రివర్గంలో మార్పు గురించి చర్చించేందుకు అలీ యావర్, ఇతరులు అంత సుముఖంగా లేరని చెప్పాడు.

‘దేవల్ దేవి’ నవల రాసి విసుగొచ్చింది. కాబట్టి వార్తా పత్రికలు చదువుతూ, ఉత్తరాలు డిక్టేట్ చేస్తూ సమయం గడిపాను.

సాయంత్రం గనేరీవాల్ వచ్చాడు. ఆయన దీన్‍ను కలిశాడు. దీన్ తరఫున మాట్లాడేందుకు జుల్ ఖాదర్ వచ్చాడన్న నా ఊహ సరైనదే. గనేరీవాల్ జుల్ ఖాదర్‍ను కూడా కలిశాడు. నేను మాట్లాడిన విధానం జుల్ ఖాదర్‍కు నచ్చిందని చెప్పాడట. ఆయన త్వరలో నిజామ్‍ను కలుస్తాడట. ఒకటి రెండు రోజులలో నిజామ్‍తో మాట్లాడిస్తానన్నాడు.

ఆ రాత్రి ఆలస్యంగా నిద్రించాను. అమ్మ బాగా గుర్తుకు వచ్చింది.

అర్ధరాత్రి దాటిన తరువాత ఎవరో కాంపౌండ్ వాల్ దగ్గర పాకుతున్నారని  గార్డులు అనుమానించారు. ప్రమాద ఘంటికను మ్రోగించారు. ఎవరో పరిగెత్తి పారిపోయారు.

ఏమీ కాలేదు. ఉదయం నాలుగుకల్లా అంతా ప్రశాంతమైపోయింది.

ఆగస్టు 24, 1948

ఉదయమే, నన్ను హత్య చేస్తే రూ. 5000/- ఇస్తామని ఇత్తెహాద్ ప్రకటించిన వార్తకు సంబంధించిన పరిశోధన ఫలితాన్ని నా ముందుంచారు రాజు, అయ్యంగార్లు. స్టేట్స్ మినిస్ట్రీకి ఈ విషయం తెలపాలని అన్నారు. నేనే ఆలోచించాను. ఎందుకంటే, ఈ ప్రకటనకు నేను బెదిరానని వారు భావించవచ్చు. కానీ తమ పరిశోధన నమ్మదగ్గదనీ, ఈ విషయం స్టేట్స్ మినిస్ట్రీకి తెలియజేయటం ఆవశ్యకమనీ రాజు అన్నాడు.

గనేరీవాల్ జుల్ ఖాదర్ ప్రయత్నంలో జోక్యం చేసుకోవటం నాకు సందిగ్ధం కలిగించింది. ఎందుకంటే, గనేరీవాల్, వీరి వ్యతిరేక జట్టుకు చెందినవాడు. దీన్, జుల్ ఖాదర్‍లతో ఆయన కలవటం భవిష్యత్తులో దురదృష్టకర పరిణామాలకు దారితీయవచ్చని అనిపించింది.

గైక్వాడ్‍కు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ పాఠక్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. నేను ఎలాంటి ధనాన్ని ఆశించకుండా సహాయం చేసిన విషయం ‘ఫ్రీ ప్రెస్’లో వచ్చింది. దాన్ని ‘మీజాన్’ ప్రచురించింది. కొందరిని సంతృప్తి పరచటం కష్టం.

‘దేవల్ దేవి’ రాశాను. ఇంతలో రాసే మూడ్ పోయింది.

ఉద్గిర్‍లో జరిగిన అత్యాచారాల వార్తలు అందాయి.

వనపర్తి రాజు వచ్చాడు. ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీ ఆమోదం లభించటం వల్ల అతడిని ఇంగ్లండ్ పంపించాలని లాయక్ అలీ భావిస్తున్నాడు. పాస్‍పోర్ట్ కోసం నాకు అభ్యర్థన పత్రాన్నిచ్చాడు. లాయక్ అలీ మాటను మన్నించలేనని అన్నాను.

గార్డులను బదిలీ చేయటం గురించి కెప్టెన్ రామ్‍చంద్, మేజర్ సింగ్‍లతో చర్చించాను. పునరమరిక ఆరంభమయింది.

మీనన్ సమాధానాన్ని లాయక్ అలీకి తెలిపాను. మీనన్ సమాధానం విశేషంగా ఉంది. నా నవలకు సంబంధించిన చారిత్రక అంశాల విషయంలో సహాయం చేసేందుకు మోయిన్ నవాజ్ ప్రొఫెసర్ ఖాద్రిని పంపించారు. అమీర్ ఖుస్రూ, దేవల్ దేవి, మాలిక్ కాఫర్ గురించి ఇంకా అనేక ఇతర విషయాలు చర్చించాం.

MAZ నన్ను కలిశాడు. కాస్త ప్రాముఖ్యత గల సమాచారాన్ని నాకు అందించాడు. అతడితో నేను గనేరీవాల్ విషయాన్ని ప్రస్తావించాను. అతడు కూడా గనేరీవాల్ జోక్యాన్ని నిరసించాడు.

MAZ చెప్పిన విషయాలివి:

జిన్నా నుంచి ఆదేశాలు అందుకుంటున్న లాయక్ అలీని తొలగించి ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న ఆలోచనతో, ఆశలతో దీన్ యార్ జంగ్ ఉన్నాడు. లాయక్ అలీ భారత్‍తో ఎలాంటి ఒప్పందం చేసుకోవటం జిన్నాకు ఇష్టం లేదు. కాబట్టి మౌంట్‍బాటెన్‍తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి గతంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తావనకు వచ్చింది. గతంలో లాయక్ అలీ జిన్నా సలహాను కోరినప్పుడు, తన సలహాను అమలుపరిస్తేనే ఇస్తానని జిన్నా అన్నాడు. ఆయన మాటను పాటిస్తానని లాయక్ అలీ జిన్నాకు మాట ఇచ్చాడు. ఇది తెలిసిన నిజామ్ చుట్టూ ఉండేవారు, లాయక్ అలీ జిన్నా నుంచి ఆజ్ఞలు అమలుపరచటం, దేశానికి ద్రోహం చేయటమేనని భావించారు.

రజ్వీకి కూడా లాయక్ అలీ పట్ల కోపం ఉంది. సైనిక కార్యకలాపాలలో ఎల్ ఎద్రూస్ సలహాలను పాటించటం రజ్వీకి ఇష్టం లేదు. రజ్వీకి, దీన్‌కి నడుమ చర్చలు సాగుతున్నాయి. ఇత్తెహాద్‍లో రజ్వీ వ్యతిరేకులు కొందరున్నారు. షోహబుల్లాహ్ ఖాన్ హత్య పట్ల వారికి అభ్యంతరాలున్నాయి. ఆగ్రహం ఉంది. అసంతృప్తి ఉంది. వీరు నిజామ్‌తో సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. నాలుగయిదు రోజుల్లో ఏం జరుగుతుందో స్పష్టమవుతుంది.

రాంపేట రాజుతో డిన్నర్ చేశాను. ఆంగ్లేయుల ప్రభావం కల రాజు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. భారత్ పైదరాబాదును రక్షించటం కోసం ఎదురుచూస్తున్నాడు.

అమ్మతో టెలిఫోన్‍లో మాట్లాడాను. అమ్మకు భయంగా ఉంది. నన్ను చంపిన చంపిన వారికి బహుమతి ప్రకటించిన విషయం అమ్మకు తెలియదనుకుంటాను.

బుచ్‍తో మాట్లాడాను. నా తలకు విలువ కట్టిన విషయం స్టేట్స్ మినిస్ట్రీకి తెలియాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం పట్ల ఎలాంటి అపార్థాలుండవని హామీ ఇచ్చాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here