నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-53

0
10

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

ఆగస్ట్ 25, 1948

‘దేవల్ దేవి’ రాయలేకపోయాను. ఊహలు రావటం లేదు. W వచ్చాడు. ఎప్పటి లాగే చర్చించుకున్నాం. రజ్వీ అతడిని ప్రభావితం చేశాడు. కమ్యూనిస్టుల గురించే అధికంగా ఆలోచిస్తున్నాడు. కమ్యూనిస్టులతో రజ్వీ వేరుపడేట్టు చేయటం దౌత్యపరంగా గొప్ప విజయం సాధించినట్టు అవుతుందని అనుకుంటున్నాడు. రజ్వీని కమ్యూనిస్టులకు దూరం చేయటమే కాదు, రజాకార్లందరూ సైన్యంలో చేరేట్టు చేయాలని, సైనిక చర్య జరిగితే కమ్యూనిస్టులతో ఉన్న ప్రమాదాన్ని భారత ప్రభుత్వానికి తెలియజెప్పాలనీ, ఇలా కమ్యూనిస్టులపై విజయం సాధించాలని అతను నిరంతరం కమ్యూనిస్టుల గురించే ఆలోచిస్తున్నాడు. అతనికిదంతా వ్యక్తిగతమైన సాహస చర్యలా అనిపిస్తోంది. లాయక్ అలీ, రజ్వీలు – అమెరికాలో అతడు తమ స్నేహితుడిగా ఉంటాడని, అవసరమైతే సహాయంచేస్తాడని  అతడికి గౌరవ మర్యాదలు చేశారు. ఇలా ప్రపంచంలో పలు ప్రాంతాలు తిరిగే పాత్రికేయులు పలు వ్యవహారాలపై, మనుషులపై చాలా ప్రభావం చూపుతారు.

ప్రొఫెసర్ హాది హసన్ నాతో కలిసి లంచ్ చేశారు. ఆయన హబీబ్‍కు మిత్రుడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడు. అలీఘర్ విశ్వవిద్యాలయంలో వైద్య కళాశాల నిర్మాణానికి ఒక్కడే 47 లక్షల రూపాయలు సేకరించినట్టు చెప్పుకుంటాడు. ఆయన సంభాషణలు చతురంగా ఉంటాయి. పర్షియా కవులలా పొగుడుతాడు. హైదరాబాద్ అంటే అతనికి ఇష్టం. హైదరాబాదులో జరుగుతన్న వ్యవహారాలు ఆయనకు నచ్చటం లేదు. హైదరాబాదు వ్యవహారాలు చక్కబడిన తరువాత హైదబాదులో ఉండమని ఇష్టపడతానంటాడు. ఆయన పర్షియన్ కవిత్వాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అప్పుడప్పుడు తాను పర్షియా లోకి అనువదిస్తున్న ‘శకుంతల’ కావ్యం లోంచి కవితలను చదివి వినిపిస్తూంటాడు. 30వ తారీఖున మళ్ళీ లంచ్‍కి వస్తాడాయన.

ఎన్.కె. రావు కూడా ఉన్నాడిక్కడ. అంతగా విషయాలేమీ లేవు.

ఆగస్ట్ 26, 1948

లాయక్ అలీ పిలవటంతో 24 సాయంత్రం ఎస్. ఎం. రజ్వీ, జైన్ యార్‍లు వచ్చారు.

సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోమని నిజామ్ రాజాజీకి టెలిగ్రామ్ పంపాడు. తాను ఏ మాత్రం రాజీ పడకుండా, ఇతరులను జోక్యం చేసుకోమని టెలిగ్రామ్‍లు పంపటం నిజామ్ పద్ధతి. ఐక్యరాజ్యసమితికి అభ్యర్థన పంపాడు. అంటే ప్రస్తుతానికి ఏమీ జరగదని అర్థం.

సాయంత్రం ధూత్ వచ్చాడు.

ఆగస్ట్ 28, 1948

MAZ కలిశాడు. లాయక్ అలీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్న దీన్, రజ్వీల నడుమ జరిగిన సంభాషణను జుల్ ఖాదర్ నాకు చెప్పాడు.

న్యూఢిల్లీ నుంచి ఎస్.ఎం రజ్వీ ఏవో పత్రాలు పట్టుకుని వచ్చాడట. భారత ప్రభుత్వం పంపిన ఉత్తరాల్ని కాబినెట్ ముందుంచాడట. భారత ప్రభుత్వంపై నేరారోపణ చేస్తూ ఆ ఉత్తరాలకి సమాధానం పంపారట. ఎస్.ఎం. రజ్వీ ఏవో ప్రతిపాదనలను కూడా ప్రస్తావించాడట. కానీ అవన్నీ రాతపూర్వకంగా అందుకోయాలని లాయక్ అలీ కోరాడట.

కళ్లు కాస్త సమస్యగా ఉన్నాయి. ఎన్.కె. రావు ఓ సంస్కృత పండితుడిని తీసుకుని వచ్చాడు. ఆయన భాగవతం నుంచి కొన్ని శ్లోకాలు చదివి వినిపించాడు. బుచ్‌తో మాట్లాడాను. కలరా టీకా తీసుకున్నాను. రాత్రికి జ్వరం వచ్చింది.

ఆగస్ట్ 30,1948

సర్దార్ నుంచి, మీనన్ నుంచి వచ్చిన ఫోన్ల రహస్యం తెలియలేదు. జైన్ ద్వారా ఏదో ప్రాముఖ్యం కల సమాచారం పంపినట్టున్నారు. దాని విషయం ఇక్కడేమీ తెలియలేదు.

నిన్న జుల్ ఖాదర్ నిజామ్‍తో రెండు గంటలు మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటలు చెప్పి నాపై అభిప్రాయం చెప్పమని నిజామ్ అతడిని అడిగాడు. అతడికి నివేదికను సమర్పించి నన్ను కలవమని అన్నాడు జుల్ ఖాదర్. గతంలో రెసిడెంట్లలా నేను అతడిని నెలకొకసారి కలవటం లేదని జుల్ ఖాదర్‍తో నిజామ్ ఫిర్యాదు చేశాడు. నా గురించి లాయక్ అలీ ఇచ్చిన నివేదికలను కూడా నిజామ్ జుల్ ఖాదర్‍కు ఇచ్చాడు. నేను ఓ రెండు మూడు సార్లు నిజామ్‍తో ఫోనులో మాట్లాడితే నన్ను ఆహ్వానించే వీలవుతుందని నిజామ్ అన్నాడు.

లాయక్ అలీ పాకిస్తాన్ వారు చెప్పినట్టు ఆడుతున్నాడని నిజామ్‍తో చెప్పాడు జుల్ ఖాదర్. వీలయినన్ని అంశాలను ఎవరితోనూ ప్రస్తావించకుండా దాచాలని అనుకుంటున్నట్టున్నాడు నిజామ్. కానీ, నేను ఏదో కారణం సృష్టించుకుని నిజామ్‍ని కలవాలని జుల్ ఖాదర్ నాకు కబురు పంపించాడు. అది కుదరదని నేను సమాధానం ఇచ్చారు

నేను సలహా కోసం సర్దార్‍కు ఫోను చేశాను. నిజామ్‌ను కలవద్దని సర్దార్ ఆదేశించారు. నన్ను కలవాలనుకుంటే నిజామ్ నన్ను పిలవాలని అన్నారు సర్దార్. ఇదే విషయం జుల్ ఖాదర్‍తో చెప్పాను.

డాక్టర్ హాది హసన్ నాతో లంచ్ చేశాడు.

ఇటాలియా నన్ను కలిశాడు. హైదరాబాదు, భారత్‍లో విలినమవటానికి తాను వ్యతిరేకినని ‘మీజాన్’ పత్రికలో ప్రచురించిన ఇంటర్వ్యూ అబద్ధమని చెప్పాడు. ఇత్తెహాద్ కార్యవర్గం రహస్య సమావేశంలో రజ్వీ ఇచ్చిన ఉపన్యాసం వివరాలను శాస్త్రి, నాకు అందజేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం, నిజామ్ ప్రభుత్వాల నడుమ సంబంధాల సమాచారాన్ని కూడా నాకు అందచేశాడు. ప్రస్తుతం లాయక్ అలీ ఒక కీలుబొమ్మ లాంటి వాడేననీ, లాయక్ అలీ పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మ అనీ చెప్పాడు. అంతేకాదు, పలు సందర్భాలలో గులామ్ రసూల్ తిన్నగా వి.పి.తో మాట్లాడేడని కూడా చెప్పాడు.

రాజు, వెంకట్‌వర్ధన్‌లు రేపటి నుంచి సెలవు మీద వెళ్తున్నారు. అందుకని అందరం కలిసి డిన్నర్ చేశాం.

‘సౌండ్ సైలెంట్’ నుంచి నివేదిక అందింది. చాలా ప్రాముఖ్యత గల నివేదిక.

నిజామ్ సైన్యంలో ఓ ఉన్నతాధికారి, అతడిని ‘సౌండ్ సైలెంట్’ అంటాము, అతడు మాకు సమాచారాన్ని అందిస్తుంటాడు. అతను ఒకటో రెండో సార్లు నన్ను కలిశాడు. నా కోరిక మీద ఆయన హైదరాబాద్ సైన్యం వివరాలు, శక్తులు, బలహీనతల గురించి ఓ నివేదిక తయారు చేశాడు. ఆ నివేదికను మన మిలటరీ అధికారులు కూడా బాగా ప్రశంసించారు.

ఆగస్ట్ 31, 1948

హైదరాబాద్‍ను పూర్తిగా దిగ్బంధనం చేయటమో లేదా సైనిక చర్య తీసుకోవటమో ఏదో ఒకటి సత్వరం నిర్ణయం తీసుకోవాలని  సర్దార్‍కు సమాచారం పంపాను.

ఒక స్వతంత్ర పార్లమెంట్ సమావేశాలు ఎంత సంరంభంగా ఆరంభమవుతాయో నిజామ్ చట్టసభ సమావేశాలు కూడా అలాగే ఆరంభమయ్యాయి.

నా రచన ‘పృథ్వీవల్లభ్’ ఆధారంగా నిర్మించిన సినిమా ‘ప్రీమియర్ షో’కు షోహ్రాబ్ మోడీ ఆహ్వానం పంపాడు. శుక్రవారం బొంబాయి వెళ్ళేందుకు చార్టర్డ్ ఫ్లయిట్ బుక్ చేసే విషయమై ఫోన్ చేసి మాట్లాడేను.

పార్లమెంట్‌లో సర్దార్ ఇచ్చిన అద్భుతమైన సమాధానాలను రేడియోలో విన్నాను. హైదరాబాద్‌పై త్వరలో చర్య తీసుకుంటామని అన్నారు. హైదరాబాదు సభ్యులు ఐక్యరాజ్యసమితికి వెళ్ళేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా “అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. మద్రాసు జమీందార్లు తమ జమీందారి బిల్లు కోసం ఐక్యరాజ్యసమితికి వెళ్ళేందుకు ఎలాంటి   సౌకర్యాలు కల్పిస్తామో, హైదరాబాద్ సభ్యులు ఐక్యరాజ్యసమితి వెళ్ళేందుకు అలాంటి  సౌకర్యాలు కల్పిస్తాము” అన్నారు.

నేను ఆయన సమాధానాలు విన్నానని నిర్ధారించుకునేందుకు నాకు సర్దార్ ఫోను చేశారు. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని, రెండు రోజుల కోసం కూడా బొంబాయి వెళ్లవద్దని సూచించారు.

సికిందరాబాద్ స్టేషన్‍లో పడి  ఉన్న కొన్ని వస్తువుల గురించి హెచ్.ఎం. పటేల్‍కు ఫోన్ చేశాను. ఆ వస్తువులను మేము తీసుకుందుకు వీలుగా ఆజ్ఞలు జూరీ చేస్తానన్నారు. వైర్‌లెస్ ద్వారా అందిన రాజాజీ ఉత్తరాన్ని నిజామ్‍కు పంపాము. రజాకార్ల నిషేధం, సికిందరాబాదులో భారత్ సైన్యం ఉండేందుకు అనుమతి ఇవ్వటం అనే రెండు నిబంధనలకు ఒప్పుకుంటే నిజామ్ స్థానానికి ప్రమాదం లేదని హామీ ఇస్తానని రాశారా ఉత్తరంలో రాజాజీ. ఈ అంశాలకు నిజామ్ ఆమోదం తెలపడు.

నెలంతా ధ్యానంలో, జపంలో గడిపాను. నా అశాంతిని అదుపులో పెట్టటంతో పాటు ధ్యానం వల్ల నా జీర్ణక్రియ, నిద్రలు మెరుగుపడ్డాయి. ఈ నెలలో నేను భగవద్గీత 12వ అధ్యాయాన్ని పఠించాను. ముఖ్యంగా శాంతికి సంబంధించిన అంశాలను మరింత శ్రద్ధగా చదివాను.

‘నిజామ్’ కథ మరొకటి విన్నాను. రెసిడెంట్ ఆయనని నెలకొకసారి కలిసేవారు. ఒకసారి మధ్యాహ్నం రెండు గంటలకు తనను రెసిడెంట్ కలిసేందుకు అనుమతి నిచ్చాడు నిజామ్. మధ్యాహ్నం రెండు గంటల కన్నా నాలుగు గంటలకయితే సౌకర్యంగా ఉంటుందని ప్రధాని నిజామ్‍కు సూచించాడు. “అమ్మో వద్దు. నాలుగు గంటలకయితే అతనికి ‘టీ’ ఇవ్వాల్సి ఉంటుంది” అన్నాడు నిజామ్.

ఒక నివేదిక ప్రకారం ఆయన ఎనిమిది కోట్ల విలువగల వెండిని రాష్ట్రానికి ఇచ్చాడు. ఇతర విలువైన వస్తువులు, బంగారంతో సహా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‍లో ఉన్నాయి. ఎవరో ఇటీవలే ఆయన ఐశ్వర్యం గురించి ప్రస్తావిస్తే, “ధనమా? నేను చాలా పేదవాడిని” అన్నాడు.

సెప్టెంబర్ 1, 1948

W నన్ను కలిశాడు. చాలా బాధ పడుతున్నాడు. నిజామ్ ఫోటో తీసుకునేందుకు అతడికి అనుమతి నివ్వనందుకు బాధపడుతున్నాడు. ఇంతకాలం అతడిని అన్నీ అందంగా, ప్రశాంతంగా  ఉన్న ప్రాంతాలకే తీసుకెళ్ళారు. బుధవారం, రజాకార్లు, కొందరు సైనికులు దోపిడీ చేసిన గ్రామానికి తీసుకెళ్లారు. అది చూసి ఆయన చలించిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం పట్ల నిరసనను ప్రదర్శిస్తున్నాడు. అతడిని వదిలించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అతడి దృష్టి రాజకీయం పైనే ఉండటం వారికి నచ్చలేదు.

డైలీ టెలిగ్రాఫ్‍కు చెందిన డగ్లస్ బ్రౌన్, డైలీ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ‘పోట్టర్’లు నన్ను కలిశారు. మేము రెండు గంటల సేపు మాట్లాడుకున్నాం. జరుగుతున్న సంఘటనలను మన దృక్పథంలో వివరించాను. అయితే, బ్రౌన్ మాత్రం భారత వ్యతిరేక దృష్టితో ఉన్నాడని స్పష్టమవుతోంది. రెండు మూడు సందర్భాలలో భారత్ అణగద్రొక్కుతోందని అన్నాడు. టైమ్స్, లైఫ్ పత్రికల ఫొటోగ్రాఫర్లు తీసిన ఛాయాచిత్రాలు భారత్‍ను వదిలివెళ్ళకుండా నేను అడ్డుపడ్డానని వాళ్ళు భావిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయి ప్రచారంలో హైదరబాద్‍కు చక్కని వ్యవస్థ ఉంది.

సెప్టెంబర్ 6, 1948

నిజామ్ సందిగ్ధంలో పడ్డాడు.

నిజామ్ మీర్జాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. లాయక్ అలీ, ఎద్రూస్‍ల పట్ల దీన్  అసంతృప్తితో వున్నాడు.

చట్టసభ అధ్యక్షుడు శ్రీపత్ రావు నుంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆరంభ ఉపన్యాసానికి ఆహ్వానం అందింది. నేను వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను.

‘దేవల్ దేవి’ రచన సరిగా రావటం లేదు. రొటీన్ రచన  పద్ధతి వల్ల  కథ పేలవంగా అనిపించేట్టు చేసింది. మొత్తం తిరిగి రాయాలి. మొత్తం ‘దేవల్ దేవి’ పూర్తి చేశాకా, ఓ వారం కూర్చుని మొత్తం నవలను తిరగ రాస్తాను. అమ్మతో నేనన్నట్టు నేను అందమైన వనంలో ఒంటరిగా, ‘అశోకవనంలో సీత’ లా ఉన్నాను.

జరుగుతున్న సంఘటనలను సర్దార్‍కు నివేదించాను. బుచ్‍తో మాట్లాడాను. భారత్‍ను నాజీ జర్మనీతో, నన్ను ‘రిబ్బెన్‌ట్రాప్’తో (జర్మనీ రష్యాపై దాడి చేయదన్న ఒప్పందంపై సంతకం చేసిన జర్మన్ ఈయన. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జర్మనీ రష్యాపై దాడి చేసింది. ‘రిబ్బెన్‌ట్రాప్’ను – చెప్పిందొకటి చేసినదొకటికి ప్రతీకగా వాడుతారు. సం//) పోలుస్తూ హైదరాబాదు‍ను శాంతి సౌఖ్యాల భూమిగా వర్ణిస్తూ డైలీ టెలిగ్రాఫ్‌కు చెందిన బ్రౌన్ ఓ టెలిగ్రామ్ పంపాడు. విదేశీ పాత్రికేయులకు ఖరీదైన అతిథి సత్కారాలు అందుతాయని, అవసరమైతే వారికి ‘తోడు’ కూడా అందజేస్తారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.

వనపర్తి రాజా వచ్చారు. కొన్ని రోజులు ఇంగ్లండ్ వెళ్ళాలనుకుంటున్నారాయన. బుచ్‍తో మాట్లాడేను. హైదరాబాద్ వ్యవహారం కోసం రామస్వామి ముదలియార్, మోతీలాల్ సెతల్వద్‍లను ఐక్యరాజ్యసమితికి పంపాలని సూచించాను. హైదరాబాద్ వ్యవహారంలో సహాయం అవసరమౌతుందేమోనని బి.ఎన్. రావుని అప్పుడే హైదరాబాద్ రావద్దని చెప్పానని చెప్పారు ఆయన.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here