నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-66

0
11

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]పో[/dropcap]లీస్ చర్య వల్ల కొందరు వ్యక్తులు విచిత్రంగా  నష్టపోయారు. వారిలో ప్రథమ స్థానం ఏజంట్ – జనరల్, అతనితో కలసి పని చేసిన ఉద్యోగులది.

టైఫాయిడ్ బారిన పడ్డాను. అయినా సరే విశ్రాంతి తీసుకునే బదులు  చురుకుగా కార్యకలాపాలలో పాల్గొనటం నా వయస్సులో వారిని  తీవ్రంగా దెబ్బ తీసే అంశం . అక్టోబర్ 8 వరకూ జ్వరం నన్ను వదలలేదు. అంతకాలం డాక్టర్లు బయట ప్రపంచంతో నా సంబంధాన్ని నిలిపివేశారు. ఆ తరువాత నేను కోలుకునేసరికి ఒక నెల పట్టింది. చెవి దెబ్బన్నది, ముఖ్యంగా ఎడమ చెవి.

అక్టోబర్ 8 వరకూ నేను కలసిన ఒకే వ్యక్తి స్వామీ రామానంద తీర్థ. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. హైదరాబాద్ లో  కాంగ్రెస్ పార్టీని పునర్నిర్నించేందుకు వెళ్తున్నాడు. ఆయన నా సలహా అడిగాడు. గతాన్ని మరచిపోమని, అందరినీ క్షమించమని సూచించాను. కాంగ్రెస్ లోని విభిన్నమైన దళాలు, రామాచార్, రామకృష్ణారావుల దళాలను కూడగట్టుకుని హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేయమన్నాను. నా సలహా, మా ఇద్దరి మిత్రత్వాన్ని దెబ్బతీసింది. హైదరాబాద్ చేరుతూనే ఆయన, రామాచార్, రామకృష్ణారావుల దళాలకు చెందిన 500 మంది కాంగ్రెస్ సభ్యులకు బహిష్కరించాడు.

కొందరు సైన్యాధికారులు నా పట్ల కోపంగా ఉన్నారు. విజయం సాధించారు కాబట్టి, వారు హైదరాబాదులోకి దూసుకువచ్చి, నిజామ్‍ను తొలగించి, నిజామ్ పాలనను సంపూర్ణంగా అంతం చేయవచ్చని భావించారు. భారత సైన్యానికి లొంగిపొమ్మని నిజామ్‍కు నేనిచ్చిన సలహా వారి ఆశలను భగ్నం చేసింది.

సెప్టెంబరు కల్లా హైదరాబాదులో సైనిక ప్రభుత్వం స్థిరపడింది. వారు ఏజంట్ జనరల్ అధికారులను, ఉద్యోగులను పనికిరానివారిగా, పనిలేని వారిగా, దాదాపుగా శత్రు సంస్థలా భావించటం ఆరంభించారు. నేను బొంబాయి ప్రయాణం అవగానే, నా కారుని స్వాధీనం చేసుకున్నారు. అందమైన గ్రంథాలయం, విలువైన సామాన్లు, ఇతర వస్తువులు, చారిత్రిక, సాంస్కృతిక విలువ కల వస్తువున్లెనో  దక్షిణ్ సదన్‍లో, ఏజంట్ జనరల్ ఆఫీసులో ఉన్నాయి. వాటన్నింటినీ వెంటనే తొలగించి రెసెడెన్సీ భవంతిలోని చిన్న గదుల్లో కుక్కేసారు.

 పోలీసు చర్య కన్నా ముందు కొన్ని చారిత్రక విలువ ఉన్న  దస్తావేజులు, వస్తువులు, రికార్డులు, పుస్తకాలను దక్షిణ కమాండ్ ద్వారా నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపి మంచి పని చేశాను.

గత జనవరి నుంచీ నా ఉద్యోగులు పడ్డ కష్టాలు, అనుభవించిన ప్రమాదాలను పనికిరానివిగా భావించారు. నాతో పని చేసిన ఉద్యోగులు చాలా చక్కగా పని చేశారనీ, వారికి తగ్గ గుర్తింపు లభించాలని నేను సర్దార్‍ను అభ్యర్థిస్తూ లేఖ రాశాను. కానీ నేను హఠాత్తుగా అనారోగ్యానికి గురి కావటం వల్ల హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాంతో నేను రాసిన ఉత్తరం రాష్ట్ర మంత్రిత్వ శాఖ ఆర్కైవ్స్‌లో ఉండిపోయింది.

దక్షిణ్ సదన్ నుండి బొంబాయి లోని నా ఇంటికి ఉన్న టెలిఫోన్ సంభాషణను రహస్యంగా వినటం మొదలుపెట్టారు. హైదరాబాదు లోని నా సెక్రటరీ నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఫోను వాడేవాడు. మా సంభాషణను రహస్యంగా వినటం గతంలో నేను చేసిన పాపాలకు ఫలితం లాంటిది అన్న మాట!

చుట్టు ద్వేషించే వారి నడుమ, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటూ నాతో పని చేసిన ఉద్యోగులు క్యాంపులో నివసించారు. హైదరాబాదు భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక, గతంలో అనేక ప్రమాదాలను ఎదుర్కుంటూ కూడా సమర్థవంతంగా పని చేసినందుకు అభినందనలు అందుకుంటామని, గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. కానీ వారిని నేను కలసినప్పుడు నా హృదయం బాధతో క్రుంగిపోయింది. కానీ హైదరాబాదు అధికారులు నాతో పని చేసిన వారినిబయటివారిగా , శత్రులుగా చూశారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు  వెళ్ళేందుకు ఎలాంటి సహాయం చేయలేదు. వారి మానాన వారిని వదిలేశారు.

హైదరాబాదులో కొత్తగా ఏర్పడిన పాలన వ్యవస్థలోని వారికీ, నా సెక్రటరీకి నడుమ ఎందుకని భేదాభిప్రాయాలు పొడచూపాయో, ఇందులో నా కార్యదర్శి ఎంత వరకూ కారణమో నాకు తెలియదు కానీ, ఆరంభం నుంచీ పాలనాధికారులు నా ఉగ్యోగులను పట్టించుకోలేదు. వారితో ఏమీ చర్చించలేదు. అసలు వారిని పాలనా వ్యవస్థలో ఓ భాగంగా పరిగణించలేదు. ఏజంట్-జనరల్ కార్యాలయాన్ని రద్దు చేయాలనీ, మూసేయాలని ఎలాంటి ఆదేశాలూ లేవు. కాబట్టి ఉద్యోగులు కార్యాలయం వదిలి వెళ్ళలేరు. దాంతో అన్ని అవమానాలు సహిస్తూ, బాధలను అనుభవిస్తూ, వారు కార్యాలయాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు.

మిలిటరీ గూఢచర్య అధికారి, మేజర్ నందా చక్కగా పని చేశారు. సైన్యంతో హైదరాబాదుకు వచ్చిన మిలిటరీ అధికారి కన్నా మేజర్ సింగ్ గొప్ప పని చేశారు. ఆయన  పనికి గుర్తింపు లభించాలి. గూఢచార అధికారి వెంకట్ వర్ధన్ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటూ ఎంతో విలువైన పని చేశారు.

జ్వరం వల్ల ఏజంట్ జనరల్‌కు ఇతర ప్రపంచంతో సంబంధం తెగిపోవటంతో ఎంతో విలువైన పని చేసిన వీరంతా పనికిరాని వారు, పని లేనివారు అయ్యారు, భారత ప్రభుత్వం దృష్టిలో.

నా వద్దకు మేజర్ నందా డిప్యుటేషన్ మీద రావటాన్ని పౌరకార్య సంబంధిత ఉద్యోగంగా పరిగణించారు. మేజర్ సింగ్‍ను అతడి రెజిమెంట్‍కు పంపేశారు. సర్దార్‍కు, రాష్ట్ర మంత్రివర్గానికి, రక్షణ మంత్రిత్వ శాఖకూ, వీరిని అభినందించి, సముచితంగా సత్కరించాలని కోరుతూ పలు లేఖలు రాశాను. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

జనవరి 1948లో నిజామ్ ప్రభుత్వం, హైదరాబాద్ రెసిడెన్సీలో ఉన్న ఏజెంట్ జనరల్ ఆఫీసును బలవంతాన తరలించింది. నేను అప్పటికే నా ఆధీనంలో ఉన్న బొలారం మిలిటరీ భారక్స్‌లో నా కార్యాలయాన్ని ఏర్పాటు చేశాను. పోలీసు చర్య తరువాత నా కార్యాలయం తిరిగి రెసిడెన్సీలో ఏర్పాటుయింది. ఇంప్రూవ్‍మెంట్ బోర్డు రెసిడెన్సీలో నా పాత కార్యాలయాన్ని  తిరిగి ఇస్తున్నట్టు తెలిపింది. అక్టోబరు 17 కల్లా ఆ కార్యాలయాన్ని అందజేయాలని నిశ్చయించింది.

నవంబర్‍లో ఈ రెసిడెన్సీలో కార్యాలయానికి స్థలం ఇచ్చిన ఆదేశాలు రద్దయ్యాయి. నవంబర్ 10న నా ఉద్యోగులు జాలిగొలిపే టెలిగ్రాం పంపారు.

“రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసిన మిలటరీ ప్రభుత్వం, రెసిడెన్సీలోని  ఏజంట్ జనరల్ కార్యాలయానికి స్థలం ఇవ్వకపోవటమే కాకుండా స్టాప్ క్వార్టర్స్‌ను కూడా పోలీసులకు కేటాయించింది. మన ఆఫీసు మూసివేయబోతున్నారన్న వార్తాపత్రిక కథనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రధాన కార్యాలయం మూసివేసినా ట్రెజరీతో సహా ఇతర  కొందరు ఉద్యోగులు ఇంకొంత కాలం ఉంటారన్న విషయాన్ని వారు పరిగణనలోకి తీసుకోలేదు. నెలల తరబడి ఎన్నెన్నో  కష్టాలు అనుభవిస్తున్న మాకు, ఈ చర్యలు మరింత నిరాశ కలిగిస్తున్నాయి.”

నేను ఈ విషయం స్టేట్స్ మినిస్ట్రీతో మాట్లాడాను. దాంతో నా ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది.

కీలకమైన సమయంలో నా ఉద్యోగులు ఉత్తమ రీతిలో బాధ్యతలను నిర్వహించిన రీతిని పరిగణన లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాను. పలు సందర్భాలలో ఉత్తరాల ద్వారానో, వ్యక్తిగతంగా కలవటం ద్వారానో ఉద్యోగులకు సౌకర్యాలు అందేట్టు చేయగలిగాను.

నేను కోలుకున్న తరువాత, మాథేరాన్ నుంచి వచ్చిన సర్దార్‌ను కలిశాను. నా ఉద్యోగులతో  వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్దార్‌కు నిరాశగా వివరించాను.

పలు వార్తాపత్రికలు నాపై బాధ్యతా రహితమైన, అర్థరహితమైన ఆరోపణలు చేస్తూ వార్తలు రాశాయి. నా పై జరుగుతున్న ఈ దాడికి బాధతో, కోపంతో సర్దార్‌కు ఉత్తరం రాసింది నా భార్య. అక్టోబర్ 8 న సర్దార్ ఆమెకు సమాధానంగా ఉత్తరం రాశారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here