నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-71

0
12

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ము[/dropcap]ఘల్ సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో, నిజామ్ గౌరవాన్ని నిలిపి అతడికి అండగా నిలిచిన వారిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. బ్రిటీష్  అధికారం ముందు నిజామ్ బలహీనుడిగా నిలిచినప్పుడు నిజామ్ అంతర్గతంగా శక్తివంతుడయేందుకు హిందూ ముస్లింల ఐక్యత వల్ల  కానీ,  వీరి నడుమ విభేదాలు సృష్టించం వల్ల కానీ సాధ్యమయింది. పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి హిందూ ముస్లింలను కలపటమో, విడదీయటమో సంభవించింది. ఈ రకంగా అటూ ఇటూ మారుతూ ఆడే సమతౌల్యపుటాట వల్ల నిజామ్ ఈ రెండు మతాలను సమదృష్టితో చూసినట్టు అనిపించేది. కానీ నిజామ్ అధికంగా హిందువులనే నమ్మకస్థులుగా భావించాడు.

దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ముస్లిం వేర్పాటువాదం ఈ సమతౌల్యాన్ని దెబ్బతీసింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం హైదరాబాద్. దీనికి ఏడవ ఉస్మాన్ అధిపతి. తన రాచరికాన్ని రక్షించుకునేందుకు ఆయన ముస్లిం మత ఛాందసవాదాన్ని వాడుకున్నాడు. అందుకే రాష్ట్రం వెలుపల నుంచే కాదు, ఇతర దేశాలలోని ముస్లింలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్ వైపు ఆకర్షితులయ్యారు. ఇలా వచ్చిన వారికి, మిలిటరీలో కాని, పౌర సంబంధిత ఉద్యోగాలలో కాని చేరిన వారికి స్థానికులపై ఎలాంటి ప్రేమ, అవగాహనలు లేవు. వారు హిందువులను తమకన్నా తక్కువ వారిగా, పరాయి వారిగానే భావించారు. ఫలితంగా, ఎప్పుడయితే నిజామ్ హైదరాబాదుని ముస్లిం రాజ్యంగా మలచాలని నిర్ణయించాడో,  శక్తిమంతులయి, కీలక స్థానాల్లో ఉన్న వీరు నిజామ్‍కు అండగా నిలిచారు. ఒక దశాబ్దంగా సాగిన మతపరమైన  ఉద్విగ్నతల సమయంలో వీరు ముస్లిం లీగు విధానాలను తుచ తప్పకుండా అమలుపరిచే వారిలో అగ్రగణ్యులుగా నిలిచారు.

పాకిస్తాన్ ఏర్పాటు అయి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందువుల మతోన్మాదం ఆగిపోయింది. భారత్‍లో ఉండిపోయిన ముస్లింలలో మతోన్మాదం పైకి అణగిపోయినట్టు కనిపించింది.

దేశంలో సంభవిస్తున్న ఈ మార్పులు హైదరాబాదులో ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన ఇస్లాం ఛాందసవాదులపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

బౌర్బన్లు, స్టూవార్టులు (యూరప్ రాజవంశాలు) లాగే వీరు కూడా గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. స్థానిక ముస్లింలతో కూడిన ఇత్తెహాద్‍కు అండగా నిలిచారు. పతనమవుతున్న రాష్ట్ర వ్యవస్థను ఆధారం చేసుకుని మతపరమైన ఛాందస భావాలు కల ఆధునిక సంకుచిత (ఫాసిస్టు) వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది వీరి లక్ష్యం. వీరి స్వరం కాశిం రజ్వీ. వీరి ప్రధాన లక్ష్యం, పాకిస్తాన్ సహాయం లేకుండా హైదరాబాదులో ఇస్లాం ఆధిక్యాన్ని సాధించటం, ఆపై దక్షిణ భారతంలో, తరువాత మొత్తం భారతదేశంపై ఇస్లాం ఆధిత్యతను సాధించటం.

ఒకవేళ వీరి ప్రయత్నాలు సఫలీకృతం అయి ఉంటే, దేశమంతా హిందువుల మనోభావాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపించి ఉండేది. దేశంలో ప్రజాస్వామ్యం సంపూర్ణంగా దెబ్బతినేది. ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే వైపు భారత్ ప్రయాణం ఆగిపోయేది. ఇత్తెహాద్‍లు అంతమవటం దేశాన్ని ఈ ప్రమాదం నుంచి తప్పించింది.

హైదరాబాద్‌లో మతపరమైన సమస్య, సంస్థానాధీశుల సమస్యతో మిళితమైపోయింది. ఈ విషయంపై అందరి దృష్టిని ప్రసరింప చేసి, ఈ రెండు సమస్యలను వేరు చేసి చూపించింది ప్రొఫెసర్ ‘కూప్‍లాండ్’. మతపరమైన సమస్య, ఒకే కేంద్ర ప్రభుత్వం నీడన ముస్లింలు, హిందువులతో అధికారాన్ని పంచుకోవటానికి సంబంధించినది. రాజ్యం భారతదేశంలో మిళితమైపోయిన తరువాత, సంస్థానాధీశుల స్థితిగతులకు సంబంధించినది సంస్థానాధీశుల సమస్య. హైదారాబాదులో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్న నిజామ్ అభిలాష, ప్రయత్నాలు సంస్థానాధీశుల సమస్య.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here