నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-8

2
7

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

హైదరాబాదుకి నా రాక:

[dropcap]అ[/dropcap]ది 20 డిసెంబర్, 1947.

“మున్షీ! నువ్వు హైదరాబాద్ వెళ్తావా?” భారతదేశ ఉప ప్రధానమంత్రి, రాష్ట్ర వ్యవహారాల మంత్రి అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అడిగారు.

ఆ సమయంలో నేను ‘టీ’ తాగుతున్నాను. నేను ఆశ్చర్యపోయాను. ఆ ప్రశ్నను నేను ఊహించకపోవటంతో ఉలిక్కి పడ్దాను. “యథాతథ ఒప్పందం ప్రకారం మనం హైదరాబాదుకు ఒక ఏజెంట్‌ను పంపించాల్సి ఉంటుంది” అన్నారు.

ఈ విషయాన్ని నేను సీరియస్‍గా తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశం అని నాకు అర్థమవుతోంది. ఇది చాలా ప్రాముఖ్యం వహించే విషయం. గత కొన్ని నెలలు ఉత్తేజకరమైనవి. దేశ విభజన ఘాతుకం నుంచి దేశం ఇంకా తేరుకోలేదు. ప్రాణాలు అరచేత పట్టుకుని మిలియన్ల సంఖ్యలో వచ్చిన ప్రజలకు  ఇంకా నివాసాలు  ఏర్పాటు చేయటం పూర్తికాలేదు.  అనేకులు ఇంకా సరిహద్దులు దాటి దేశంలోకి వస్తున్నారు. రాజ సంస్థానాలు దేశంలో విలీనవమటం ఇంకా సంపూర్ణం కాలేదు. జునాగఢ్ సమస్య పూర్తి కాలేదు. కశ్మీరు పరిస్థితి అనంతమైన ఉద్విగ్నతను కలిగిస్తొంది. సర్దార్ మాటల్లో చెప్పాలంటే ‘భారత్ గర్భంలోని కేన్సర్ లాంటి వ్రణం హైదరాబాదు’.

ఎడతెగకుండా సాగుతూ, ఎలాంటి ఫలితాలనివ్వని చర్చలతో విసిగి, హైదరాబాద్, భారత్‍లు – నవంబర్ 29న యథాతథ ఒప్పందం చేసుకున్నాయి. రాజ్యంగ సభలో ప్రసంగిస్తూ సర్దార్, ఈ యథాతథ ఒప్పందం కాలంలో సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఇదే సమయంలో, తన చుట్టూ కొత్తగా చేరిన సలహా మండలి ప్రోద్బలంతో, బ్రిటీష్ వారు 15 ఆగస్ట్ 1947న భారత్‍ వదిలి వెళ్ళటంతో – నిజామ్ సర్వస్వతంత్రుడయ్యాడని విశ్వసిస్తూ, తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలని దృఢనిశ్చయంతో ఉన్నాడు.

రజాకార్ అనే తీవ్రవాద లక్షణాలున్న ఓ ముస్లిం మత సంస్థకు భయపడి వందల సంఖ్యలో కుటుంబాలు నిజామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇతర భారత ప్రాంతాలలో తల దాచుకున్నాయి. నిజామ్‍తో యథాతథ ఒప్పందం చేసుకోవటం వల్ల భారత ప్రభుత్వం హైదరాబాదుపై పట్టు కోల్పోయిందని దేశమంతా అనుకోసాగింది.

జరుగుతున్న పరిణామాల పట్ల, మనుషుల వ్యవహారాల పట్ల మహాత్మాగాంధీ అసంతృప్తిగా ఉన్నారు. ఆ కాలంలో ఢిల్లీ ఒక  గాలివార్తలకు నిలయంలా వుండేది . ఎంతటి అసంభవమైన గాలి వార్తనయినా ప్రజలు నిజమని నమ్మేసే పరిస్థితులుండేవి.

1928లో బార్డోలీ సత్యాగ్రహ కాలం నుంచీ ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‍తో సాన్నిహిత్యం ఉంది. ఆయన గాంధీ ప్రారంభించిన పౌర నియమోల్లంఘన ఉద్యమానికి శక్తినిచ్చి, కొన్ని వందల ఏళ్ళుగా బ్రిటీషు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రతిష్ఠను దెబ్బతీశారు. బొంబాయి చట్టసభలో స్వతంత్ర అభ్యర్థిగా ఆ కాలంలో నేను బార్డోలికి వెళ్ళాను. అక్కడి పరిస్థితిని నా కళ్లతో చూశాను. అప్పుడే సర్దార్ పటేల్ ప్రభావాన్ని, శక్తినీ నేను చూశాను. ఏ రకంగా తన రాజకీయ నైపుణ్యంతో భారత చరిత్రను మలుపు తిప్పగలరో అవగాహన చేసుకున్నాను. ఉద్యమాన్ని నడిపించే శక్తీ, ధైర్యాలే కాదు, ప్రజలకు స్ఫూర్తినిచ్చే శక్తి ఆయనకు ఉంది. పరిస్థితిలో నిజానిజాలు గ్రహించగలిగే దృష్టితో పాటు, అందరూ తాను అనుకున్న విధంగా కార్యం నిర్వహించేటట్టు చేయగల ప్రతిభ ఆయనలో ఉంది.

ఆ సమయం నుంచి మేము ఒకరి వైపు మరొకరం పరస్పర అభిమానం వల్ల ఆకర్షితులమయ్యాము. బొంబాయికి నేను గృహ మంత్రిగా ఉన్నప్పుడు నా ప్రధాన శక్తి సర్దార్. 1940-41 లో యెరవాడ జైలులో ఇద్దరం కలిసి ఉన్నాం. నా ఆరోగ్యం పాడయినప్పుడు ఒక మాతృమూర్తిలాగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. అలా మేము ఒకరికొకరం స్వభావ సిద్ధంగా సన్నిహితులమయ్యాము.

సర్దార్ నేతృత్వంలో పని చేయటమనేది ఆనందకరమే కాదు, ఒక అరుదైన గౌరవం కూడా. ఆయన తెలివైన వాడే కాదు, అధికారిగా సహృదయుడు. తన స్నేహితుల బలహీనతలను చిరునవ్వుతో భరిస్తారు. వారి వైఫల్యాలలో, కష్టాలలో వారికి అండగా నిలుస్తారు. అయితే, ఎవరైనా సర్దార్‍తో తలపడితే, వారు దైవాన్ని ప్రార్థించాల్సిందే. దైవం ఒక్కడే వారికి సహాయం చేయగలడు.

మా ఇద్దరి నడుమ చక్కని  అవగాహన ఉంది. అందుకే, ఆయన హైదరాబాదు మాట ఎత్తగానే, నేను హైదరాబాద్ వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. నాకు ఈ బాధ్యత స్వీకరించాలని లేదు. అందుకే తప్పించుకునే మార్గం అన్వేషించాను. ప్రస్తుతం నా ఆలోచనంతా రాజ్యంగ సభ చుట్టూ తిరుగుతోంది. రాజ్యాంగ సభను  వదిలి దూరం వెళ్ళాలని లేదు. ఆ ఆలోచనే బాధ కలిగిస్తోంది. కానీ, నేను హైదరాబాద్ వెళ్ళాలని కోరుకుంటున్నారు సర్దార్  కాబట్టి నా  కర్తవ్యం  హైదరాబాదులోనే ఉంది.

“నేను ముందుగా బాపు (గాంధీ)ని సంప్రదించాలి. నేను ఒకవేళ వెళ్తే, రాజ్యంగ సభ సభ్యుడిగానే వెళ్తాను. ఎలాంటి జీతం తీసుకోను” అన్నాను.

“బాపును సంప్రదించు” ఒప్పుకున్నారు.

అదే రోజు సాయంత్రం మహాత్మా గాంధీని కలిసాను. మహాత్ముడికి నా బలహీనతలు బాగా తెలుసు. నేను గుడ్డిగా ఎవరినీ అనుసరించనని ఆయనకు తెలుసు. బాపూజీ సూచనను ఆమోదించని సందర్భాలలో నేను ఆయనతో, “బాపూ, మీ సత్యం మీది. అది చాలా గొప్ప సత్యం కావచ్చు. కానీ నా సత్యం నాకుంది. అది చిన్నది కావచ్చు. నేను సత్యం అనుకున్న దాన్ని నన్ను అనుసరించనివ్వండి” అంటూంటాను. ఆయన మాట పాటించని నా స్వేచ్ఛను ఆయన ఎలాంటి మాత్సర్యం లేకుండా ఆమోదించేవారు. అది ఆయన గొప్పతనం.

ఆయనకు సర్దార్ ప్రతిపాదన చెప్పాను. ఆయన ఆ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా ఆమోదించటమే కాదు, కాదనే అవకాశం నాకు ఇవ్వలేదు.

“అది కేవలం నిన్ను నమ్మి అప్పగిస్తున్న పని కాదు. అది నీ ధర్మం”

“కానీ.. అది కఠినమైన పని” అని వ్యతిరేకించబోయాను.

“నాకు తెలుసు. పని కఠినమైనదే. కానీ నువ్వు సాధిస్తావు. నీలాంటి వాళ్ళే కఠినమైన పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తే, ఇక మనం అడుగు ముందుకు వేసేదెలా?”

బాపూకు నా పై ఉన్న నమ్మకం నా శక్తి. కానీ హైదరాబాద్ సమస్య ఎంత కఠినమైనదో, ఎంత తీవ్రమైనదో, ఎంత ప్రధానమైనదో ఆలోచించినప్పుడల్లా ఏదో నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది.

నా మనసులోని సంశయాలు తెలుసుకున్నట్టే అన్నారు బాపు – “రజ్వీ జట్టు నిన్ను ఇష్టపడదు”.

“అది నిశ్చయం. నాకు తెలుసు” సమాధానం ఇచ్చాను.

కానీ నా నిర్ణయం పై అది ఎలాంటి ప్రభావం చూపించదు.

విధి నాతో వింత ఆటలాడుతున్నట్లు అనిపించింది. మూసీ నది ఒడ్దున నిజామ్ ప్రమాదకరమైన   ఆటలాడుతున్నాడు. ఆ నది ఒడ్డున ఉత్తేజకరమైన నా భవిష్యత్తు ఉన్నట్టు అనిపించింది. మరుసటి రోజు ఉదయం బొంబాయికి ప్రయాణమయ్యే సమయానికి నేను ఓ నిర్ణయానికి రాలేదు.

మరుసటి రోజు ఫోను మ్రోగింది. ఢిల్లీ నుంచి సర్దార్ మాట్లాడుతున్నారు.

“హైదరాబాదు ఎప్పుడెళ్తున్నావు?”

“నేను నిన్ననే వచ్చాను. ఇంకా నిర్ణయించుకోలేదు”

“ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ ప్రయాణమవ్వాలి. రేపు ఢిల్లీకి రా. అన్నీ మాట్లాడుకుందాం.”

సర్దార్ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన చేయమన్న పని చేసేందుకు ఆలోచించటం, జంకటం అర్థం లేనిదనిపిస్తుంది. టెలిఫోన్‍లో ఆయన సూటిగా నాలుగు  ముక్కలే మాట్లాడేరు.

మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం నుంచి తిన్నగా సర్దార్ దగ్గరకు వెళ్ళాను.

“మీరు నిశ్చయించారా?” అడిగాను.

“నిశ్చయించటానికి ఏముంది? నువ్వు ఎంత త్వరగా వీలయితే, అంత త్వరగా హైదరాబాద్ వెళ్ళాలి. అందుకు అవసరమైన వ్యవహరాలన్నీ మీనన్ చూస్తాడు” అన్నారు.

“నిజామ్ నన్ను ఏజంట్‍గా ఆమోదిస్తాడా? మీరు నన్ను నియమించిన తరువాత నిజామ్ వ్యతిరేకతని పరిగణన లోకి తీసుకుని మీ నిర్ణయాన్ని రద్దు చేసుకోవటం అసహ్యంగా ఉంటుంది”

నాకు తెలుసు, హైదరాబాదులో భారత ఏజంట్ జనరల్‌గా నా నియామకాన్ని ఎవ్వరూ సంతోషంగా స్వీకరించరని, హర్షంతో ఆమోదం తెలపరని.

పదేళ్ళ క్రితం, నేను బొంబాయి గృహ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో సత్యాగ్రహం చేసేందుకు వెళ్తూ ‘షోలాపూర్’ వద్ద ఆగే ఆర్యసమాజిస్టులపై చర్యలు తీసుకోమన్న నిజామ్ అభ్యర్థనను నేను త్రోసిపుచ్చాను. నిజామ్ రాష్ట్రంలో మత పాలన స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతో కాలం నుంచి కష్టాలు అనుభవిస్తున్న హిందువులపై కఠిన చర్యలు తీసుకోవటం నా బాధ్యత కాదు. 1942లో నేను కాంగ్రెస్‌ను వదిలి, ముస్లిం లీగ్ దమనకాండను వ్యతిరేకిస్తూ అవిభక్త భారత్ – అఖండ హిందూస్థాన్ కోసం ఉద్యమం చేపట్టాను. నా స్నేహితుడు జిన్నాకు ఎంతో కోపం వచ్చింది నా మీద. నిజామ్‍కు ఈ విషయం తెలియకుండా ఉండదు.

కానీ సర్దార్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సర్దార్ ఒకసారి ఒక మాటంటే, దానికి కట్టుబడివుంటారు. మాట మార్చరు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే, ఎలాంటి పరిస్థితులలో కూడా దానికి కట్టుబడి ఉంటారు. అమలుపరుస్తారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here