నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-9

0
11

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]డి[/dropcap]సెంబరు 25న నన్ను హైదరాబాద్‌కు ఏజెంట్ జనరల్‍గా నియమించినట్లు వెలువడిన ప్రకటన నిజామ్‌కు రుచించలేదు. ఆయన మౌంట్‌బాటెన్‍తో మాట్లాడేరు. ఏజంట్ జనరల్‍గా హైదరాబాదు వచ్చేవాడు కేవలం వ్యాపార సంబంధిత వ్యవహారాలకు మాత్రమే పరిమితమవ్వాలి తప్ప ఇతర విషయాలలో జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే రాష్ట్ర మంత్రిత్వ శాఖ నిజామ్ ప్రతిపాదనను అంగీకరించలేదు.  యథాతథ ఒప్పందం ప్రకారం ఏజంట్ జనరల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రసార శాఖ వ్యవహారాలను నియంత్రిస్తాడు. కాబట్టి నిజామ్ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని వివరించింది.

మరుసటి రోజు, రాజ్యాంగ సభ సభ్యుడు శ్రీ వి.పి. మీనన్, అదనపు కార్యదర్శి శ్రీ. పి.సి.దేశాయ్‌లు  నాతో – 2, విండ్సర్ పాలెస్‌లో నేను ఏజంట్ జనరల్‌గా నియమితుడనయిన విషయం గురించి చర్చించారు. ఆ కాలంలోని ప్రభుత్వాధికారులందరి లోకి ప్రతిభావంతుడు, కార్యదక్షుడు వి.పి. మీనన్. వివిధ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే కార్యంలో సర్దార్ పద్ధతులను అమలు చేసే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నాడు. జాన్ మిల్టన్ కవితలో అన్నట్టు ‘గ్రీకు పురాణాలలో అత్యంత శక్తిమంతుడైన అట్లాంటిస్ తన భుజాల మీద అనేక రాజ్యాల భారాన్ని మోస్తున్నట్లు’, మీనన్, భారతీయ సంస్థానాలను భారతదేశంలో మిళితం చేసి దేశ సమైక్యతను సాధించే కఠినమైన ప్రయత్న భారాన్ని తన భుజ స్కందాలపై మోస్తున్నాడు.

మీనన్‌కు కూడా నేను హైదరాబాదులో ఎక్కడ ఉండాలి, నా బాధ్యత లేమిటి అన్న విషయంలో స్పష్టమైన అవగాహన లేదని నాకు తరువాత అర్థమయింది. నేను హైదరాబదులో ఎక్కడ ఉండాలి అని అడిగినప్పుడు ‘బొలారం రెసిడెన్సీ’లో అని సమాధానం ఇచ్చాడు.

ఆ కాలంలో హైదరాబాదులో రెండు నివాస భవనాలుండేవి. ఒకటి హైదరాబాదులో. రెండవది హైదరాబాదుకు పది కిలోమీటర్ల దూరంలో, బొలారంలో.

“నాతో పని చేసే ఇతర ఉద్యోగులులెవరు?”

“మీకు ఒక ఆఫీసర్‍ని ఇస్తాము. ఇతరులను అక్కడ స్థానికంగా మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది.”

“నాకేమైనా పాత రికార్డులు, సూచనలు..”

“పాత రికార్డులు టైపు అవుతున్నాయి. కొన్ని రోజుల్లో మీకు పంపిస్తాను.”

ఇతర విషయాలు ఎలాగున్నా, నేను జనవరి 5, 1948 నాటికి హైదరాబాద్ చేరాలన్న విషయంలో మాత్రం మీనన్ స్పష్టంగా ఉన్నాడు.

మరుసటి రోజు నేను లార్డ్ మౌంట్‌బాటెన్‌ను కలిశాను. అందగాడు, అత్యంత చొరవ కలవాడు అయిన మౌంట్‌బాటెన్‌కు ఎదుటివారిని పొగడడంలో తనదైన ప్రత్యేక పద్ధతి ఉండేది. నాకు అప్పజెప్పిన బాధ్యత అత్యుత్తమ రాజకీయ నాయకుడు నిర్వహించాల్సిన బాధ్యత అని, దాన్ని నాకు అప్పజెప్పినందుకు తనకు సంతోషంగా ఉందనీ అన్నాడు. గతంలో జరిగిన చర్చల గురించి చెప్పాడు. హైదరాబాదులో నా పని మూడు నాలుగు నెలలకు మించి ఉండదనీ, ఈ సమయంలో నిజామ్ భారత్‍లో కలిసిపోయేందుకు ఒప్పుకుంటాడనీ అనుకుంటున్నానని అన్నాడు. “ఇప్పుడు నిజామ్ నిస్సహాయుడు” అన్నాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు దాని హింసాత్మక సైన్యానికి నాయకుడయిన ఖాశిం రిజ్వీ నిజామ్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని, దక్కనులో ముస్లింల ఆధిక్యతను నిలపాలని కంకణం కట్టుకున్నాడనీ చెప్పారు. అయితే నిజామ్ రాజ్యంలో సలహాదారుగా ఇంకా సర్ వాల్టర్ మాంక్‌టన్ ఉండటం గుడ్డిలో మెల్ల వంటిదని అన్నాడు. “నిజామ్ హైదరాబాదు వదిలి ఢిల్లీలో నివాసం ఏర్పరుచుకోగానే భారత్‍లో విలీనమయ్యే ఒప్పందాన్ని ఆమోదించి సంతకం చేస్తాడు. ఆ తరువాత రిజ్వీ సంగతి చూసుకోవచ్చు” అన్నాడు.

నేను ఆయనను వదిలి వెళ్ళేముందు తనకూ, వాల్టర్ మాంక్‌టన్‍కు నడుమ ఉన్న దీర్ఘకాల స్నేహం గురించి చెప్పాడు. ఇప్పుడు విండ్సర్ డ్యూక్, ఒకప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు తాను సేనానాయకుడికి సహోద్యోగిగా ఉన్నప్పుడు, వాల్టర్ మాంక్‍టన్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు న్యాయ సలహాదారుగా ఉన్నప్పటి నాటిది తన స్నేహం అని చెప్పాడు.

న్యాయవాదిగా సర్ వాల్టర్ ఖ్యాతి నాకు తెలుసు. బొంబాయి హైకోర్టులో ప్రైవీ కౌన్సిల్‌లో వేసే దావాలలో న్యాయవాదిగా, సలహాదారుగా, ఆయనకున్న ప్రఖ్యాతి నాకు తెలుసు. ప్రైవీ కౌన్సిల్‍కు అప్పీలు చేసిన కొన్ని కేసులను నేను నిర్వహించినప్పుడు, ఆయన ఎంతో గొప్పగా వాదించటం చూశాను.

తరువాత భారత ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూను కలిసాను. రాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాలను నాకు వివరించారు. “హైదరాబాద్ భారత్‍లో కలవక తప్పదు. భారత్ నుంచి హైదరాబాద్ తప్పించుకుని పోలేదు” అన్నారు. ఆయన ఆశాభావం నాకు ఉత్సాహన్నిచ్చింది. ఏప్రిల్ నెలాంతానికల్లా, భారత్‌లో విలీనమయ్యే ఒప్పందంపై నిజామ్ సంతకతో తిరిగి వస్తానన్న విశ్వాసం నాకు కలిగింది.

బొంబాయి వెళ్ళేముందు గాంధీని మరోసారి కలిశాను. “ఈ సమస్యను పరిష్కరించటంలో నీ ప్రతిభా నైపుణ్యాలను సంపూర్ణంగా వినియోగిస్తానని వాగ్దానం చెయ్యి” అన్నారాయన.

వాగ్దానం చేశాను. కానీ “ఎంత కాలం ఈ చర్చలు కొనసాగాలి? అనంత కాలం చర్చలు సాగుతూ ఉండాలా?” అడిగాను.

ఆయన నవ్వారు. నా ఆలోచనలను పసిగట్టినట్టున్నారు. “ఓ మూడు నాలుగు నెలలు పడుతుందేమో” అన్నారు.

“ఒకవేళ చర్చలు విఫలమైతే? అప్పుడేం చేయాలి?”

“అప్పుడు సమస్యను పరిష్కరించి వివాదాన్ని అంతం చేయాల్సి ఉంటుంది” నర్మగర్భితంగా అన్నారు.

వీడ్కోలు పలుకుతూ ఆయన నా వెంట సుధీర్ ఘోష్‍ను తీసుకువెళ్ళమన్నారు. సుధీర్ ఘోష్ గాంధీ విధేయుడని నాకు తెలుసు. “తప్పకుండా తీసుకువెళ్తాను” సమాధానం ఇచ్చాను.

నన్ను హైదరాబాద్‌కు ఏజంట్ జనరల్‌గా నియమించటం పట్ల దేశమంతా హర్షం వ్యక్తమయింది.

ఢిల్లీకి చెందిన ఓ ప్రధాన వార్తాపత్రిక, నన్ను ఏజంట్ జనరల్‍గా నియమించటం ‘హైదరాబాదులోని పరిస్థితికి  రాష్ట్ర మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రాధాన్యాన్ని నిరూపిస్తుంది. హైదరాబాదు విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని నిరూపిస్తుంది’ అని వ్యాఖ్యానించింది.

అయితే ఓ వైపువారి దగ్గర మంచి పేరుండటం వల్ల మరో దృక్కోణం కలవారి దృష్టిలో కూడా మనకు మంచి పేరుంటుందన్న నమ్మకం లేదు. డాక్టర్ ఆర్.సి.మజుందార్, కలకత్తా లోని తన స్నేహితుడికి నన్ను హైదరాబాద్ పంపిస్తున్న విషయం చెబితే, “అయ్యో నిజామ్, ఆయనను తలచుకుంటే జాలి వేస్తుంది” అన్నాడట.

“ఎందుకని?” అడిగాదు డాక్టర్ మజుందార్.

“నిజామ్ పని అయిపోయింది” అన్నది సమాధానం.

హైదరాబాదులో సంచలనం కలిగించింది ఈ వార్త. “ఈ సైతాన్ హైదరాబాదు ఎందుకు రావాలి?” అని ఓ మంత్రి మరో మంత్రిని అడిగాడట. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు ఖాశిం రిజ్వీ ఆగ్రహోదగ్రుడయ్యాడు.

బొంబాయిలో నా స్నేహితులు ఆనందించారని వేరే చెప్పనక్కరలేదు. వారు సంబరాలు చేసుకున్నారు. నన్ను అభినందించారు. నాపై ఉన్న గురుతర బాధ్యత, దాని సంక్లిష్టతను  కొందరే అర్థం చేసుకున్నారు. నన్ను అభినందించిన వారు, నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నేను బాల్డ్విన్  మాటలతో సమాధానం ఇచ్చాను. “నాకు మీ అభినందనలు కాదు, మీ ప్రార్థనలు కావాలి”.

పారిపోయిన పిట్టలను వలవేసి పట్టడం ఎంత కష్టమో నాతో పని చేసే ఉద్యోగులను ఎంచుకోవటం అంత కష్టమయింది. మద్రాసు ముఖ్యమంత్రి ఓ.పి. రామస్వామి – అతని వద్ద పరిశ్రమల అధికారిగా ఉన్న భారతీయ పౌర ఉద్యోగ వ్యవస్థకు చెందిన ఎం.టి.రాజును నా దగ్గరకు పంపాడు. ఈయన ఇప్పుడు ఆంధ్ర గృహశాఖ కార్యదర్శిగా ఉన్నారు. కొత్తగా భారతీయ రాజ్యపాలన వ్యవస్థలో చేరిన రఘుపతి ఒరిస్సా నుండి నాతో వచ్చి చేరాడు. ఈయన సికిందరాబాద్ సైన్యంలో ఉన్నప్పటి నుంచీ నాకు బాగా తెలుసు.

నేను హైదరాబాద్ వెళ్ళేముందు అనేకులను కలిశాను. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామానంద్ తీర్థ, మెల్కోటెలను కలిశాను. నేను బొంబాయి లైఫ్ అష్యూరెన్స్ కంపెనీలో పని చేసినప్పుడు నా సహోద్యోగి, నిజామ్ ప్రభుత్వంలో ఉప ప్రధాని అయిన పింగళి వెంకట రామారెడ్ది నాకు కొన్ని విషయాలు చెప్పారు. మద్రాసులో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎల్. ఎన్. గుప్తను కలిశాను. హైదరాబాదు పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. ఇలా నేను సేకరించిన సమాచారం ద్వారా హైదరాబాదులో తుఫాను నా కోసం ఎదురుచూస్తున్నదని దాన్ని  ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు అర్థమయింది.

1948 సంవత్సరం ఆరంభం కల్లా సుధీర్ ఘోష్, ఇంకో రాష్ట్ర  మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి హైదరాబాదు చేరుకున్నారు. మాకు ఎలాంటి నివాస స్థలాన్ని ఇచ్చేందుకు నిజామ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. సుధీర్ హైదరాబాద్ రెసిడెన్సీలో ఉండటం ఆరంభించాడు. వెంటనే గొడవ ప్రారంభయింది. హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ వెంటనే సుధీర్ రెసిడెన్సీ వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సర్దార్‌ను కోరాడు. ఈ మీర్ లాయక్ అలీ నా క్లయింట్ ఒకప్పుడు.

లార్డ్ మౌంట్‌బాటెన్, నిజామ్‍ల నడుమ టెలిగ్రామ్‍లు బాణాల్లా అటూఇటూ ప్రయాణంచేశాయి. భారత ప్రభుత్వానికి చెందిన ‘దక్కన్ హౌస్’లో ప్రస్తుతం భారత సైన్యాధికారి ఉంటున్నాడు. జనవరి 15 కల్లా ఆయన దక్కన్ హౌస్‍ను ఖాళీ చేస్తాడు. అంతవరకూ నన్ను బొలారం రెసిడెన్సీలో ఉండనివ్వాలని మౌంట్‌బాటెన్ నిజామ్‍ను అభ్యర్థించాడు. ఈ బొలారం రెసిడెన్సీని ఇప్పుడు దక్షిణాన రాష్ట్రపతి నిలయంగా వాడుతున్నాము.

కొన్ని రోజుల కోసమయినా సరే బొలారం రెసిడెన్సీ కానీ హైదరాబాద్ రెసిడెన్సీ కానీ నన్ను వాడనిచ్చేందుకు నిజామ్ ఇష్టపడలేదు. ఇది ఒప్పందానికి వ్యతిరేకం. రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేస్తే భారత్  ఏజంట్ జనరల్‍కు బ్రిటీష్ రెసిడెంట్‌తో సమానమైన హోదా ఇచ్చినట్లవుతుంది. కాబట్టి ఈ పదకొండు రోజులు నేను లాయక్ అలీ అతిథిగా ఉండాలన్నాడు. అలా కాకపోతే, ‘మన కష్టపడి ఇటీవలె సాధించిన  సంతోషకరమైన సంబంధాలు దెబ్బతింటాయి’ అన్నాడు నిజామ్.

ఢిల్లీ, బొంబాయి, హైదరాబాదుల నడుమ ఎడతెగని టెలిఫోను చర్చలు సాగాయి.  హైదరాబాదులో అలజడి చెలరేగింది. “రెసిడెన్సీలో ఉండటానికి భారత ప్రతినిధికి ఎన్ని గుండెలుండాలి? భారత్ ప్రభుత్వం నుండి వీచే గాలులను కూడా హైదరాబాద్ వైపు రానివ్వను” అని గర్జించాడు ఖాశిం రిజ్వీ ఓ సభలో. “మున్షీ రెసిడెన్సీలో ఉండటాన్ని  వ్యతిరేకించటమే కాదు, రెసిడెన్సీ ఇటుకలన్నీ పీకి మూసీలో విసిరేస్తాం” అన్నాడు. ‘స్వతంత్ర హైదరాబాద్ జిందాబాద్’ అన్న నినాదాలతో ఆ సమావేశం ముగిసింది.

ఈ రకంగా సాగిన వాదప్రతివాదాలు, చర్చలు, నా ఆఫీసు ప్రతిష్ఠను దిగజార్చాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వం అనుమతితో నేను హైదరాబాదులో ఉన్న నా ఆఫీసర్లకు, హైదరాబాదులోని ప్రముఖులను రెసిడెన్సీలో పార్టీకి పిలవమని సూచనలిచ్చాను. అదే రోజు రాత్రి, అంటే జనవరి 5 రాత్రి, మీర్ లాయక్ అలీ, అతని తోటి వారందరినీ డిన్నర్‍కు పిలవమని చెప్పాను.

లాయక్ అలీకి ఇది దుఃఖ కారణమయింది. నన్ను ఆయనకు అతిథిగా ఉండమని, సమస్యలన్నీ దాంతో సమసిపోతాయని అభ్యర్థించాడు. ఇది మన వ్యక్తిగత విషయం కాదన్నాను నేను. చివరికి, లార్డ్ మౌంట్‌బాటెన్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాలను పురస్కరించుకుని, పెద్ద మనసుతో నిజామ్, నేను బొలారం రెసిడెన్సీలో జనవరి 5 నుండి 15 వరకూ ఉండేందుకు అనుమతించాడు. ఈ అనుమతి కేవలం ఆ పదకొండు రోజులకు మాత్రమే!

ఈ సమస్య పరిష్కారం కాగానే నేను ఏర్పాటు చేసిన పార్టీలను రద్దు చేయమని లాయక్ అలీ ఒత్తిడి చేశాడు. అప్పటికి అందరికీ ఆహ్వానాలు వెళ్లిపోయాయి కాబట్టి పార్టీలను రద్దు చేయటం కుదరదని చెప్పాను. చివరికి మేమిద్దరమూ ఓ ఒప్పందానికి వచ్చాము. నేను ఇవ్వాలనుకున్న పార్టీని బొలారం రెసిడెన్సీలో ఇవ్వాలి. రాత్రి ఇచ్చే డిన్నర్ నేను కాక, లాయక్ అలీ నన్ను ఆహ్వానిస్తూ ఇచ్చే డిన్నర్‍గా మారుతుంది.

జనవరి 3 న రఘుపతి నేను కలిశాము. నాలుగో తారీఖున ఓ పొడుగైన యువ సైన్యాధికారి నా దగ్గరకు వచ్చాడు. ఆయనను నా ADC (Aide-De-Camp), వ్యక్తిగత కార్యదర్శి  గా నియమించారని చెప్పాడు. ధోతీలో ఉన్న ఏజంట్ జనరల్‍కు ADC గా ఉండడం అతడికి ఇష్టంగా లేదని అతని ముఖ కవళికలను, ప్రవర్తనను బట్టి అర్థం చేసుకున్నాను. అతడికి నా దగ్గర పని చేయటం ఇష్టం లేదని, అతడిని వెనక్కి పంపేయమంటూ మాటలు ఆరంభించాడు. బొంబాయి గవర్నర్‌కు ADC గా ఉండే అవకాశం లభించిందని తనను పోనీయమని అన్నాడు. ఒకవేళ అతను నాతోనే ఉండాలంటే మాత్రం అతనికి పెద్ద   స్థాయి జీతం ఇస్తానని వాగ్దానం చేయాలన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here