నూకలు!!

0
9

[Kate Chopin కథ, ‘The Story of an Hour’కి యథేచ్ఛా శైలిలో శ్రీ సముద్రాల హరికృష్ణ చేసిన అనుసృజన.]

[dropcap]వి[/dropcap]శాలాక్షి గారు హృత్సంబంధ అనారోగ్యంతో నగరంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు గల హాస్పిటల్‌లో కార్డియాలజిస్టుని సంప్రదించి, మందులు తీసుకుని అప్పుడే ఇంటికి వచ్చారు, చెల్లెలు శ్యామల, సహాయంతో.

ఆమె భర్త కేశవరావు ఏదో అవసరమైన పని మీద ఢిల్లీ వెళ్ళారు.

విషయం తెలిసి, తిరిగి వచ్చేస్తున్నాను వెంటనే రాజధానిలో అని ఫోను చేసి చెప్పారు-భార్యతో, మరదలితో మాట్లాడి!

ఫ్లైట్ లో వచ్చేసేవారే కానీ, “మీకు అంతగా పడదు ఆ విమానం జర్నీ, నేను కూడా పక్కన లేను, రైల్లోనే రండి, నాకు బాగానే ఉన్నది” అని విశాలాక్షి మరీమరీ చెప్పటంతో, రైలు ప్రయాణం ఎన్నుకున్నారు.

***

తెల్లవారింది!

ఆమె చెల్లెలు ఎట్లా చెప్పాలా ఆ వార్త అని మథనపడి, చివరకు అరకొర వాక్యాల్లో చెప్పేసింది:

“అక్కా! ఒకటి చెప్పాలి, నువ్వు ధైర్యంగా ఉండి వినాలి మరి. బావగారు వస్తున్న రైలు, రాత్రి ప్రమాదానికి గురి అయిందట! ఆ ప్రమాదంలో వారూ.. చెక్ చేశాం పోయినవారి లిస్ట్‌లో ఈయన పేరు ఉందిట!

ఆయన స్నేహితులు, రైల్వేలో పనిచేసి నాయన ఉన్నారే రామారావు గారు, ఆయన కనుక్కుని చెప్పారు” అనగల్గింది!

అంతే, విశాలాక్షి గారికి ప్రపంచం తలకిందులైనట్టూ, ఏదో స్తబ్ధత ఆవరించినట్లూ అనిపించింది.

వినగానే తరుముకొచ్చిన దుఃఖం, ఒక పెను కెరటంలా ముంచివేసింది ఆమెను.

ఉద్వేగం కాస్త  తగ్గగానే, కాస్సేపట్లో ఆమె తమాయించుకున్నది, మానసికంగా!

ఆమె మంచి స్వతంత్ర భావాలున్న ఆలోచనా పరురాలు, చదువుకున్న వ్యక్తి. ఎంత ఆపేక్షలూ, ఆప్యాయతలు, కలతలూ ఉన్నా, మనసులో దాచుకునే గుంభన స్వభావం!

తేరుకున్న తరువాత, చెల్లెలిని కూడా కింది ఫ్లోర్ లోని హాల్లోకి పంపించేసింది.

రూమ్‍లో తాను ఒక్కతే! ఏసీ శబ్దం తప్ప ఏమీ లేదు!

తన పడక్కుర్చీలోకి జారిపోయింది, అలవాటుగా!

కిటికీ లోంచి, ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, అందులోని కొత్త చిగుళ్ళతో చెట్లూ కనిపిస్తున్నాయి ఆమెకు.

వసంతం ప్రవేశిస్తోంది. లోకంలో ఏది జరిగినా, తనకు  పట్టన్నట్టు, కేటాయించిన సమయంలో యథావిధిగా!

కింద రోడ్డు మీద, రోజూ వచ్చే పూల రామయ్య అరుస్తున్నాడు, తన సహజమైన రాగంలో,”జాఆఆజి పూలూ..” అని!

రేడియోలో, పాత పాట, అందునా ఆమెకు ఇష్టమైన పి.లీల కంఠం లోంచి వస్తోంది, ఎవరింట్లో నుంచో, “తీయని ఊహలు హాయిగా సాగే వసంత గానమె హాయీ..” అంటూ!

ప్రపంచం అంతా మాములుగానే సాగుతోంది, తనకే ఈ దుఃఖం!

అధిగమించగలనా అనుకొని, అధిగమించాలి, తప్పదు అని కూడా అనుకున్నది, విశాలాక్షి!

ఆ ఏకాంతంలో కిటికీ లోంచి కనిపిస్తున్న అదే దృశ్యాన్ని చూస్తూ కూచున్నది.

ఇక ఏమీ ఆలోచన చేసే స్థితిలో లేదు ఆమె.

***

పది పదిహేను నిమిషాల వ్యవధిలో సర్దుకుని, మామూలు ఆలోచన ఆరంభమై, ఎదురుగా నిలదీసినట్లు ప్రశ్నిస్తున్న వాస్తవాన్ని ఎదుర్కొనే దారి లోకి మళ్ళింది.

తన భర్త గురించి, తమ సాహచర్యం గురించి, అసంకల్పితంగా సాగిపోతున్నాయి, ఆలోచనలు!

ఎన్ని సంవత్సరాలు గడిపాను ఆ వ్యక్తితో! దశాబ్దాలే!

అనుభవాల కలనేతగా దొర్లి పోయింది జీవితం! అన్నీ  తీపివీ లేవు, అన్నీ చేదువి అనీ లేదు. మొత్తం మీద సాఫీగానే జరిగింది.

అదొక రకం తత్త్వం, కేశవరావుది.

ఎన్ని విషయాల్లో తమ ఇద్దరికీ, అభిప్రాయ భేదాలు! ఎన్ని సామరస్యాలు, ఎన్ని సంధులు,!

అయినా, ఎప్పుడూ, ప్రేమభరమైనవే అతని దృక్కులు, నా పట్ల,!

ప్రశంసా పూర్వకంగా, నిష్పాక్షికంగా తన జీవితంలో అతని పాత్రను తలచుకొంటూ, అనుకున్నది!

స్నేహమే ప్రధానంగా నడిపిన దాంపత్యబంధం అనుకోవచ్చు మాది, అనుకొన్నది, ఒక తృప్తితో!!

***

ఆలోచనల్లో మునిగిపోయిన విశాలాక్షికి, ఎవరో పిలిచినట్లు అయింది.

మెల్లిగా లేచి చూస్తే, తలుపు దగ్గర చెల్లెలు శ్యామల, చెకప్‌కి వచ్చిన నర్సూ!

చెల్లెలిని లోపలకి రమ్మని పిల్చి, నర్సుని పని అవగానే థాంక్స్ అని చెప్పి త్వరగా పంపించేసింది.

***

వెంటనే శ్యామల అన్నది, “అక్కా, నువ్వు ఇట్లా ఒక్కదానినే ఉండొద్దు, ఇంకా బుర్ర పాడవుతుంది. నన్నూ నీ కూడానే ఉండనీ, కొన్ని రోజులైనా.”

విశాలాక్షి నవ్వి, “పిచ్చిదానా, నా గురించి ఏమీ భయపడవాకు! నేను బాగానే ఉన్నాను. మనకిష్టం లేవని అయ్యేవి ఆగిపోతాయా?! అనుకున్నామని అన్నీ మనకు అనుకూలంగా జరిగి తీరుతాయా?! తప్పదు, నేను వాస్తవం తెలుసుకొని, అంటే ఆయన ఇంక ఎప్పటికీ రారని బాగా గుండెలో ముద్రించుకుని బతకాల్సిందే!! నాకా విషయం ఈ అర పూటలో అవగతమై పోయిందిలే!

నా గురించి దిగులు పడవాకు!

ఆయన తన పని అర్ధాంతరంగా ముగించుకొని, నా కోసం తిరుగు ప్రయాణం కట్టటమేమిటో, ఈ దుర్ఘటన జరగటమేమిటో?!

నన్ను చూడటానికి బయలుదేరిన ఆయన, నాకు శాశ్వతంగా కనుమరుగవటం!

విచిత్రం అనాలో విషాదం అనాలో, ఏమోతెలియదు.

అయినా తప్పదు, జీవించాలి…! ఇంకా ఉన్నాం కాబట్టి!” అన్నది విశాలాక్షి, సగం పైకి అన్నట్టు, సగం తనలో తాను అనుకొని తనకే ధైర్యం చెప్పుకుంటున్న ధోరణిలో!!

అక్క  నిబ్బరం చూసి, ఒకింత ఆశ్చర్య పోయింది, చెల్లెలు శ్యామల!

ఆమె పూర్తి ఏకాంతం కోరుకుంటోంది అని గ్రహించి, “సరే ఇక్కడే ఉంటాను నేను, నర్సు లక్ష్మితో పాటు! ఏదైనా అవసరం అయితే, వెంటనే పిలు,” అన్నది శ్యామల, గది నుంచి బయటకు వస్తూ!!

***

శ్యామల, లక్ష్మి ఇట్లా గది నుంచి బయటకు వచ్చారో లేదో, కింద మారు తాళంచెవి ఎప్పుడూ తన దగ్గర ఉంచుకునే కేశవరావు, తలుపు తీసుకుని ప్రయాణ బడలికతో లోపలికి రావటం చూశారు.

శ్యామల ఒక్కసారి, ఆశ్చర్యంతో, ఆనందంతో, ఒకింత భయంతో, “బావగారూ”, అన్నది బిగ్గరగా, మెట్లు దిగి, ఆయన దగ్గరకు వస్తూ!

“రైలులో రాలేదమ్మా ముందు, బుక్ చేసినా! మీ అక్క కెట్లా ఉన్నదో అని ఆదుర్దాతో, అది కాన్సిల్ చేసి, మొదటి ఫ్లైట్‌లో బయల్దేరి వచ్చేశాను”, అని ఆయన తాపీగా అంటున్న మాటలకు, అవాక్కై నిల్చుండి పోయింది ఆమె!

నర్సుకి ఇదంతా ఏమిటో అర్ధం కాక చూస్తోంది, పైనుంచే!

చెల్లెలి గొంతు పెద్దగా వినిపించడంతో, విశాలాక్షి గారు కూడా బయటకు వచ్చారు, ఏమిటో హడావిడి అని!

సరాసరి ఆమె చూపు కింద తలుపు దగ్గర సూట్ కేసు టేబుల్ మీద పెడుతున్న భర్త కేశవరావు మీద పడింది!

అంతే, ఆనందమో, విస్మయమో, గుండె తట్టుకోలేని వేగంగా కొట్టుకోవటమో, కారణం తెలియదు, ఆమె నేలకు ఒరిగిపోయింది, ఒక్కసారిగా!!

ఆమె ఏదో అనబోయింది, కానీ ఆలస్యమైంది, ఆ లోపే!

ఆ మాటేదో, లోపలే ఇంకి పోయింది!

నర్సు పరిగెత్తి వచ్చి పట్టుకోబోయింది కానీ, ఆమె వల్ల కాలేదు!

సమయం ఆమె కంటే ముందుండి పోయింది ఆ క్షణంలో!!

విశాలాక్షి గారి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది!

***

కాస్సేపటికి వచ్చిన డాక్టర్ చెప్పిన మాట, గుండెపోటు వల్ల పోయారని!!

పోయారనుకున్న భర్తను ప్రాణాలతో చూసిన ఆనందోద్వేగం కారణం కావచ్చు!!

ఈ గుండె, విషాదాన్నైనా, ఆనందాన్నైనా మితిలో ఉంటేనే తీసుకోగలదు, బహుశా!!

***

ప్చ్.. నూకలున్నంత వరకే బతుకు,ఏ మనిషికైనా,ఈ భూమ్మీద!

అంతే!

అదంతే మరి, అనాదిగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here