నొప్పించక తానొవ్వక..

2
15

[బాలబాలికల కోసం ‘నొప్పించక తానొవ్వక..’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]రో[/dropcap]జులు గడుస్తున్నకొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. మా చిన్నతనంలో రేడియో వుంటేనే గొప్ప. తర్వాత టీవీ, కలర్ టీవీ, అనేక ఛానల్స్, సోషల్ మీడియాలు అబ్బబ్బబ్బ.. మాలాంటివాళ్ళం మాటల్లో కూడా అందుకోలేనంత స్పీడ్‌గా దూసుకెళ్తోంది టెక్నాలజీ. అంటే మనుషుల విజ్ఞానం పరిధులు పెరుగుతున్నాయి, వాటిని తట్టుకోవటానికేమో! తరాలు మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటలు పెరుగుతున్నాయి. వాళ్ళ తెలివితేటలకి మెచ్చుకోకుండా వుండలేక పోతున్నాము. పెద్దవారయి వీరింకెన్ని కొత్త విషయాలు కనిబెడతారో అనిపిస్తుంది.

ఇంత ఉపోద్ఘాతం చెప్పినప్పుడు అసలు కథ కూడా చెప్పాలి కదా. రోనన్ అమృత మనవడు. ఏడేళ్ళవాడు. వుండేది అమెరికాలో. అమ్మమ్మ అమృత మాత్రం ఇండియాలో. అమృతకి చదువంటే చాలా ఇష్టం. ఆడవాళ్ళ అభ్యుదయం అంటే ఇంకా ఇష్టం. కష్టపడి పైకొచ్చిన మహిళ. అందుకే దొరికిన అవకాశాలని ఉపయోగించుకుని అనేక స్కూళ్ళూ, కాలేజీలు స్ధాపించి అనేకమంది విద్యార్ధులకు ఉన్నత విద్యని అందిస్తోంది.

విద్యావేత్త కదా. ఆన్‌లైన్ అవకాశాలు బ్రహ్మాండంగా వున్నాయాయే. మనవళ్ళని కూడా అనేక విధాల ప్రోత్సహిస్తూ ఇక్కడినుంచే వాళ్ళకేవో పోటీలు పెడుతూ, వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకి కొన్ని డాలర్లు బహుమతి ఇస్తూ వుంటుంది. మనవళ్ళేం తక్కువ తిన్నారా. అన్ని బహుమతులూ వాళ్ళవే. అలా చిన్న మనవడు రోనన్ గెలుచుకున్న బహుమతులలో వంద డాలర్లు వెంటనే ఇవ్వలేకపోయింది అమృత తన పని ఒత్తిడులలో.

రోనన్‌కి మాత్రం అమ్మమ్మ తనకి ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాలో గుర్తుంది. ఇంతలో క్రిస్మస్ వచ్చింది. రోనన్‌కి లెగోలంటే చాలా ఇష్టం. అమ్మా, నాన్నా ఎన్ని కొనిపెట్టినా వాడికి తృప్తి వుండదు. క్రిస్మస్‌కి లెగోలు కొనుక్కుంటానన్నాడు అమ్మతో. అప్పటికే వాళ్ళకి క్రిస్మస్ బహుమతులన్నీ తెచ్చిన తల్లి “ఇప్పటికివి చాల్లే, ఫిబ్రవరిలో నీ పుట్టినరోజు వస్తోంది కదా, అప్పుడు కొనుక్కుందువుగాని” అంది. కానీ చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సినవి వెంటనే అందుబాటులోకి రావాలి.. అందుకే అమ్మకి చెప్పాడు – “అయితే అమ్మమ్మ నాకివ్వాల్సి హండ్రెడ్ డాలర్స్ లోంచి కొనుక్కుంటాను” అని. “నీ దగ్గరుంటే కొనుక్కో” అని అమ్మ పర్మిషన్ ఇచ్చింది. అమ్మమ్మ ఇంకా ఇవ్వలేదు. పనిలో బిజీగా వుంది. అక్కడికీ అమ్మకి చెప్తూనే వున్నాడు అమ్మమ్మకి రిమైండ్ చెయ్యమని. వాడికో ఆలోచన తట్టింది. “పోనీ అమ్మా, నువ్వు నాకో 60 డాలర్ల లోన్ ఇవ్వు. అమ్మమ్మ ఇవ్వగానే నీకిచ్చేస్తాను. మార్కెట్‌లో కొత్త లెగో వచ్చింది” అన్నాడు అమెరికన్ వ్యవస్థలో పెరుగుతున్న రోనన్. మొత్తానికి వాడికి కావాల్సిన లెగో కొనుక్కున్నాడు.

లెగోతో ఆడుకుంటున్నాడుగానీ వాడి మనసంతా అమ్మకి తీర్చాల్సిన అప్పు మీదే వుంది. ఒకవేళ అమ్మమ్మ తనకి డబ్బు పంపించకపోతే అమ్మకి లోన్ ఎలా రీపే చెయ్యాలి. అమ్మ అడగదుగానీ తను ఇచ్చేస్తానని ప్రామిస్ చేశాడు గనుక ఇవ్వాలి. ఈ అమ్మమ్మకేమిటి ఎంత పనిలోవున్నా తనకివ్వాల్సిన డబ్బులు గుర్తు రావా. అయినా అమ్మమ్మని కూడా అనకూడదు. ఇదవరకంతా వెంటనే ఇచ్చేది. అయినా అమ్మని అడగమంటే అడగదెందుకని. వాళ్ళమ్మే కదా. రోనన్ అడుగుతున్నాడని చెప్పచ్చు కదా. తనకి హెల్ప్ చెయ్యచ్చుకదా. ఇంక అమ్మని కూడా డైరెక్ట్ గా అడిగి లాభంలేదు. వెంటనే తట్టింది వాడికో ఐడియా.

అమ్మ ఏమైనా గుర్తు పెట్టుకోవాలంటే ఒక స్లిప్ మీద రాసి ఫ్రిజ్ మీద అతికిస్తుంది. ఆ పని కాగానే అది తీసేస్తుంది. అంతే. ఒక స్లిప్ తీసుకుని ‘నేను మా మమ్మీకి అరవై డాలర్ల అప్పు తీర్చాలి’ అని రాసి అమ్మ చూసే చోట అంటించాడు. అమ్మ చూసి నవ్వుకుంది గానీ ఏమీ అనలేదు. మర్నాడు ఇంకో స్లిప్ ఇంకో చోట. అమ్మ నవ్వే సమాధానం. అలా రెండు రోజులు గడిచింది.

ఆ రోజు అమ్మమ్మకి ఖాళీ దొరికింది. మనవళ్ళతో తీరిగ్గా మాట్లాడింది. రోనన్‌కి తను ఎప్పుడూ ఇచ్చేటట్లు అసైన్‌మెంట్ ఇచ్చింది ఒక కథ రాసి పంపమని. తప్పులు లేకుండా రాస్తే ఇరవై డాలర్ల బహుమతి అని కూడా చెప్పింది. రోనన్ ఉత్సాహంగా సరేనన్నాడు.

ఫోనందుకున్న కూతురు చెప్పింది రోనన్ తన దగ్గర అప్పు చేసి లెగోలు కొనుక్కోవటం, ఆ డబ్బు తీర్చటానికి అమ్మమ్మని అడగమని అమ్మకిచ్చే రిమైండర్ల గురించి. పిల్లల తెలివితేటలకి మురిసి ముచ్చటపడ్డ అమ్మ, అమ్మమ్మ, కొంచెంసేపు నవ్వుకున్నారు.

అమ్మమ్మకి నొప్పించక తానొవ్వక అనే సామెత గుర్తొచ్చింది రోనన్ తెలివితేటల గురించి వింటే.

(డా. అమృతలత గారి మనవడి తెలివితేటలు ఆవిడ స్వీయ చరిత్ర ‘నా ఏకాంత బృందగానం’లో చదివి, ముచ్చటపడి.. ఆవిడ పర్మిషన్ తో ఈ కథ పంపుతున్నాను..).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here