నువ్వు ముసలిదాని వైనప్పుడు!

2
6

[విలియం బట్లర్ ఈట్స్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of William Butler Yeats’s poem ‘When you are old’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ప్రే[/dropcap]యసీ.. నీ జుట్టు నెరిసిపోయి
ముసలిదానివైపోయినప్పుడు.,
నువ్వు పూర్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు..
లేదా మత్తులో జోగుతున్నప్పుడు..
నా ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని..
మెల్లిగా చదవడం మొదలు పెట్టు.
చదువుతూ.. ఒక కల కను.
ఒకప్పటి నీ కళ్ళల్లో ఉన్న మెత్తటి చూపుల్ని..
వాటి లోతైన నీడలతో సహా మళ్ళీ చూడు!
అప్పట్లో ఎంత మంది నీ సంతోషకరమైన క్షణాలను..
నీ అందాన్ని ప్రేమించి ఉంటారో కదా?
ఆ ప్రేమ నిజమో.. అబద్ధమో ఎవరికి తెలుసు?
బహుశా చాలామంది నిన్ను ప్రేమించే ఉంటారు!
కానీ.. నీలోపలి పవిత్రమైన ఆత్మను మాత్రం
అమితంగా ప్రేమించిన మనిషి ఒకడు ఉండేవాడు!
నిత్యం నీ లోపల నిండిపోతూ..
విషాదాలతో చిన్నబోతూ వాడిపోయే
నీ ముఖంతో సహా నిన్ను ప్రేమించాడు.
అతడు నీకు మెరిసిపోతున్న కడ్డీల పక్కకి వంగిపోయి..
కొద్ది విచారంగా.. గొణుగుతూ..
ఎలా ప్రేమ తనలోంచి ఎగిరిపోయిందో..
దూరాన ఉన్న పర్వతాల మీద కెలా చేరుకుందో..
మెల్లిగా తన ముఖం ఎలా నక్షత్రాల గుంపులో దాక్కున్నదో..
నీ నుంచి తను ఎలా దూరమైపోయాడో మెల్లిగా చెప్తాడు విను!
ప్రేయసీ పుస్తకాన్ని తీసుకో.. మెల్లిగా చదువు!

~

మూలం: విలియం బట్లర్ ఈట్స్

అనుసృజన: గీతాంజలి


డబ్ల్యూ.బి. ఈట్స్ గా ప్రసిద్ధికెక్కిన విలియం బట్లర్ ఈట్స్ ఐర్లాండ్‌కు చెందిన కవి, నాటకకర్త, రచయిత. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి సాహితీవేత్తలలో ఒకరు. 1923లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. ది వైల్డ్ స్వాన్స్ ఎట్ కూల్ (1919), మైఖేల్ రోబర్టెస్ అండ్ ది డ్యాన్సర్ (1921), ది టవర్ (1928), ది వైండింగ్ స్టెయిర్ అండ్ అదర్ పోయమ్స్ (1933), లాస్ట్ పోయమ్స్ అండ్ ప్లేస్ (1940) ప్రసిద్ధ రచనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here