న్యాయసమరం చేసిన ధీరవనితలు

0
9

[dropcap]హా[/dropcap]లీవుడ్‌లో అన్ని రకాల బయోపిక్స్ నిర్మిస్తారు. రచయితలు, చిత్రకారులు, నటులు, క్రీడాకారులు – ఇలా అనేక రంగాలలోని వారి బయోపిక్స్ వచ్చాయి. కానీ న్యాయం కోసం పోరాటం చేసిన వారి బయోపిక్స్ అరుదు. అలాంటి ఇద్దరు స్త్రీల కథలు ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. మొదటిది ‘ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్’ (2018). అమెరికా సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి రూత్ బేడర్ గిన్స్ బెర్గ్ తన కెరీర్ ప్ర్రారంభంలో గెలిచిన కేసు కథ ఇది. సోనీ లివ్‌లో అందుబాటులో ఉంది. రెండవది ‘ఎరిన్ బ్రాకొవిచ్’ (2000). సాధారణ మహిళ అయిన ఎరిన్ బ్రాకొవిచ్ ఒక పెద్ద కంపెనీ చేసే జల కాలుష్యాన్ని బయటపెట్టిన కథ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

రూత్ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించినపుడు మహిళా న్యాయవాదుల సంఖ్య తక్కువ. మన ‘మంచిమనసులు’ సినిమాలో సావిత్రి న్యాయవాదిగా నటించింది కానీ అప్పట్లో నిజంగా ఎంతమంది ఆడవారు న్యాయవాదులుగా ఉన్నారనేది ప్రశ్నార్థకమే. న్యాయశాస్త్రం చదువుకున్నా రూత్‌కి మొదట్లో న్యాయవాదిగా ఉద్యోగం దొరకలేదు. సొంతంగా ప్రాక్టీసు పెట్టుకునే స్తోమత లేదు. ఆమెకి ఉద్యోగం దొరకకపోవటానికి ముఖ్య కారణం ఆమె స్త్రీ కావటమే. ఎరిన్ చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుని, తల్లి అయి, విడాకులు తీసుకుని, వేరే పెళ్ళి చేసుకుని, అది కూడా విడాకులతో ముగిసి, ముగ్గురు పిల్లలతో దిక్కులేని స్థితిలో ఉండగా ఆమెకి అనుకోకుండా ఒక జల కాలుష్యం కేసు గురించి తెలుస్తుంది. కాలుష్యం వల్ల జబ్బుపడిన ఒక ఊరు మొత్తానికి ఆమె ప్రతినిధిగా నిలుస్తుంది. రూత్, ఎరిన్ తమ కేసుల్లో అసాధారణ విజయం సాధించి చరిత్రలోనో, వార్తల్లోనో నిలిచారు కాబట్టి వారి మీద బయోపిక్స్ నిర్మించారన్నది నిజమే. కానీ ఇవి స్ఫూర్తిని అందిస్తాయి. స్వార్థం కోసం కాకుండా ఉన్నతాశయాలతో కృషి చేస్తే అందులోనే తృప్తి ఉంటుంది.

‘ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్’లో లింగవివక్షకి వ్యతిరేకంగా రూత్ చేసిన జీవితకాల పోరాటానికి నాంది ఎలా జరిగిందనేది చూపించారు. ఆమె న్యాయశాస్త్రం చదువుకునేటపుడు ఆమెతో పాటు మరో ఇద్దరో ముగ్గురో యువతులు మాత్రమే ఉంటారు. మిగతా అందరూ మగవారే. ఆడవారికి వేరుగా టాయిలెట్లు కూడా లేని పరిస్థితి. అయితే తమకు న్యాయశాస్త్రం అభ్యసించే అవకాశం రావటమే మహద్భాగ్యంగా భావించి యువతులందరూ సర్దుకుపోతారు. రూత్‌కి అప్పటికే పెళ్ళయి ఒక కూతురు ఉంటుంది. ఆమె భర్త కూడా లా చదువుతుంటాడు. ఆమెకి సీనియర్. అతనికి క్యాన్సర్ సోకుతుంది. అతను వెళ్ళాల్సిన తరగతులకి కూడా రూతే వెళ్ళి అతని చదువుకి సాయపడుతుంది. అతను ఆమె సాయంతో క్యాన్సర్‌ని జయించి లాయర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. రూత్ మంచి మార్కులతో లా డిగ్రీ సంపాదించినా ఆమెకి ఉద్యోగం రాదు. ఆడవారికి అప్పట్లో సెక్రటరీ ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు వచ్చేవి కావు. రూత్ గత్యంతరం లేక ప్రొఫెసర్‌గా మారుతుంది. తనకిష్టమైన ‘చట్టము – లింగవివక్ష’ అనే విషయం బోధిస్తుంటుంది.

ఆమె బోధించేటపుడు ఒక కేసు ప్రస్తావన వస్తుంది. ఒక స్త్రీ తన భర్తను చంపిన కేసు అది. గృహ హింసకు గురైన భార్య భర్తను బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టగా అతను చనిపోతాడు. ఆ కేసులో జ్యూరీ (న్యాయ నిర్ణేతలు) సభ్యులందరూ మగవారే ఉంటారు. ఆమెని దోషిగా నిర్ణయించి శిక్ష వేస్తారు. జ్యూరీలో మహిళలు ఉండి ఉంటే తీర్పు వేరేలా ఉండేదని భార్య తరఫున లాయర్లు అంటారు. అమెరికా రాజ్యాంగం పౌరులందరికీ సమన్యాయం జరగాలి అన్నప్పుడు చట్టాలు  అన్ని విషయాల్లోనూ దాన్ని పాటించాలి కదా అనేది వాదన. మహిళల మీద కేసులుంటే మహిళలు జ్యూరీలో ఉండాలి. అలా కానప్పుడు లింగవివక్షకి చట్టబద్ధత లభించినట్లే అని రూత్ అంటుంది.

ఆమె భావాలను గ్రహించిన రూత్ భర్త ఆమెకి ఒక కేసు గురించి చెబుతాడు. మారిట్జ్ అనే వ్యక్తి ఉద్యోగం చేసుకుంటూ వృద్ధురాలైన తన తల్లిని చూసుకోవటానికి ఒక నర్సుని పెట్టుకుంటాడు. నర్సు ఖర్చుకి పన్ను మినహాయింపు వెసులుబాటు ఉండటంతో దాని కోసం ప్రయత్నిస్తాడు. అయితే పన్ను చట్టం ప్రకారం స్త్రీలు, భార్య చనిపోయిన పురుషులు, విడాకులు పొందిన పురుషులు మాత్రమే దీనికి అర్హులు. అంటే భార్య ఉద్యోగం చేస్తుంటే ఆమెకి నర్సు ఖర్చుకి పన్ను మినహాయింపు ఉంటుంది. లేదంటే ఆమె ఇంట్లో ఉండి వృద్ధులకి సేవ చేయాలి. భార్య చనిపోవటం కానీ, విడాకులు తీసుకోవటం కానీ జరిగతే తప్ప పురుషుడు వృద్ధులకి సేవ చేయాల్సిన అవసరం లేదు అని ఉద్దేశం. మెలిక ఏమిటంటే మారిట్జ్ బ్రహ్మచారి! సాంకేతికంగా అతను మినహాయింపుకి అనర్హుడు అని అనటంతో కోర్టుకు వెళతాడు. కోర్టువారు కూడా అదే మాట అంటారు. తమ కుటుంబంలోని పెద్దవారికి సేవ చేయాలి అంటే అందరు పురుషులు పెళ్ళి చేసుకునే తీరాలి అన్నట్టు అయింది. ఆడవారు పెళ్ళి చేసుకోకపోయినా పరవాలేదు. అంటే లింగవివక్ష తలకిందులు అయింది. ఇక్కడ వివక్షకు గురైనవాడు మగవాడు. ఇందులో వేరే కోణం కూడా ఉంది. సేవ అనేది ఆడవారే చేయగలరు, అది వారి ప్రకృతి ధర్మం అని చెప్పినట్టయింది. ఏదైతేనేం ఒక మగవాడికి దీని వల్ల అన్యాయం జరిగింది. పై కోర్టుకి వెళితే జడ్జిలు మగవారే ఉంటారు కాబట్టి ఈ కేసులో లింగవివక్ష జరిగిందని తీర్పు రాబట్టటం సులువు అవుతుంది అని రూత్ గ్రహిస్తుంది. ఒకసారి చట్టాలలో అసలు లింగవివక్ష ఉందని నిరూపిస్తే, ఆ తీర్పు ఆధారంగా ఆడవారి మీద లింగవివక్షను ఎండగట్టటం తేలిక అవుతుంది. ఈ అద్భుతమైన ఆలోచనతో రూత్, ఆమె భర్త రంగం లోకి దిగుతారు.

లాయర్‌గా పుస్తకజ్ఞానమే కానీ అనుభవం లేని రూత్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఒక సీనియర్ మహిళా లాయర్ ని కలుస్తుంది. ఆమె “ముందు ప్రజల ఆలోచనా సరళిని మార్చాలి. అప్పుడే చట్టాలు మారతాయి” అంటుంది. చట్టాలు మారిస్తే ప్రజల ఆలోచన మారుతుంది కదా అంటుంది రూత్. ఆ తర్వాత రూత్‌కి అర్థమయ్యేదేమిటంటే తరాలు మారే కొద్దీ ప్రజల ఆలోచనా విధానం మారుతూనే ఉంటుంది. తదనుగుణంగా చట్టాలను మార్చాలని ప్రభుత్వానికి, కోర్టుకి గుర్తు చేయటమే తన పని. అప్పటికే ఎదిగిన తన కూతురు కొందరు పోకిరీలను ఎదిరించే సంఘటన ఆమెలో ఈ గ్రహింపు కలిగిస్తుంది. ఒక పోకిరీ రూత్‌ని, ఆమె కూతుర్ని ఈవ్ టీజింగ్ చేస్తుంటే రూత్ “మాట్లాడకుండా పోదాం పద” అంటుంది. ఆమె కూతురు మాత్రం వాడిని “బుద్ధి లేదా వెధవా?” అంటుంది. రోజులు మారాయని రూత్‌కి అర్థమౌతుంది. దానితో పాటే చట్టాలు మారాలి.  ఇంట్లో మాత్రం తల్లీ కూతుళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ‘టు కిల్ ఎ మాకింగ్ బర్డ్’ పుస్తకంలో నాయకుడైన లాయరు హత్యని సమర్థించటం తప్పు అంటుంది రూత్. కాదు, ఒకోసారి అన్యాయం జరిగినపుడు హింసే సమాధానం అంటుంది కూతురు. అప్పటి పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని ఆమె వాదన. నిజమే! ధర్మం అనేది దేశ కాలాలతో పాటు, పరిస్థితులపై కూడా ఆధారపడుతుంది.

పై కోర్టుకి వెళ్ళినపుడు ప్రభుత్వం తరఫు లాయరు సమాజంలో మార్పు పేరుతో రూత్, ఆమె భర్త మారిట్జ్‌ని పావుగా వాడుకుంటున్నారని అంటాడు. రూత్ తడబడుతుంది. చిత్రంలో నాటకీయత కన్నా సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రశంసనీయం. ఒక జడ్జి “ఆడవారు సేవ చేయాలి, మగవారు ఉద్యోగం చేయాలి అని సిద్ధాంతాలు చేస్తున్నామని మీ బాధ కదా! కానీ ఈ చట్టం ఆడవారికి ఉద్యోగం చేసే వెసులుబాటు కల్పిస్తుంది కదా” అంటాడు. “కానీ మగవారికి సేవ చేసే యోగ్యత లేదని అనటం తప్పు కదా” అంటుంది రూత్. ఆమె భర్త “భార్య దూరమైన భర్తలకి యోగ్యత ఉంది, ఇతర మగవారికి లేదు అనటం నిర్హేతుకం” అంటాడు. చివర్లో రూత్ మాట్లాడే మాటలు ఆమె గుండె లోతుల్లోంచి వస్తాయి. స్త్రీగా తాను తెలుసుకున్న చరిత్ర, ఎదుర్కొన్న అనుభవాలు, గమనిస్తున్న మార్పులు రంగరించి తడబడకుండా తన వాదన వినిపిస్తుంది. చరిత్ర గమనాన్ని మార్చే శక్తి జడ్జీలకి ఉందని గుర్తు చేస్తుంది. దానితో చారిత్రాత్మక తీర్పు వెలువడుతుంది. తర్వాత ఆ తీర్పు చట్టాలలోని లింగవివక్షకి గొడ్డలిపెట్టుగా మారింది.

అమెరికా సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి రూత్ బేడర్ గిన్స్ బెర్గ్

సినిమాలో అసలు కథ మారిట్జ్ కేసే. కానీ మొదట్లో రూత్ భర్త క్యాన్సర్ బారిన పడటం, ఆమె అతనికి బాసటగా నిలబడటం వంటివి చేర్చటంతో కథ పలచబడినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో ఆ భాగాన్ని మరింత పకడ్బందీగా వ్రాసి ఉంటే బావుండేది. మారిట్జ్ కేసు రాగానే చిత్రం ఆసక్తికరంగా మారుతుంది. మారిట్జ్ కింది కోర్టులో ఓడిపోయాడు కాబట్టి ఆశ వదులుకుంటాడు. రూత్ అతన్ని నిరాశ పడవద్దని చెబుతుంది. “జడ్జి తీర్పులో తప్పుందా?” అంటే “కాదు. చట్టంలోనే తప్పుంది” అంటుంది రూత్. రూత్ కాస్త పొట్టిగా ఉంటుంది. పిట్ట కొంచెం, కూత ఘనం అన్నట్టు ఆమె సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి స్థాయికి ఎదిగింది. 2020లో ఆమె మరణించింది. ఆమె బతికి ఉండగానే ఈ చిత్రం నిర్మించారు కాబట్టి ఆమె నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. రూత్‌గా ఫెలిసిటీ జోన్స్ నటించింది. ఎక్కడా అతివిశ్వాసం ప్రదర్శించకుండా నటించింది. ఎవర్నీ నిలదీయదు. తర్కంతోనే గెలుస్తుంది. నెమ్మదస్తులైన వారందరూ ఆమెని చూసి ప్రేరణ పొందవచ్చు.

ఇక ‘ఎరిన్ బ్రాకొవిచ్’ సినిమా విషయానికి వస్తే ఎరిన్ రూత్‌కి వ్యతిరేకం. కాలేజీ డిగ్రీ లేదు. నోరు వేసుకుని పడిపోయే రకం. చిన్నవయసులోనే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని, భర్తలు సరైనవారు కాకపోవటంతో విడాకులు తీసుకుంటుంది. ఆమెకి ముగ్గురు పిల్లలు. సాధారణంగా విడాకుల కేసుల్లో భర్తలు పిల్లలను వదులుకోలేక వారి సంరక్షణలో పాలుపంచుకుంటారు. ఎరిన్ విషయంలో ఆమె మాజీ భర్తలెవరూ పిల్లలని పట్టించుకోరు. దీనిని బట్టి వారు ఎంత స్వార్థపరులో తెలుస్తుంది. ఈ విషయాలేవి సినిమాలో చూపించరు. మాటలను బట్టి తెలుస్తుంది. కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది గొప్ప స్క్రీన్ ప్లే లక్షణం. పిల్లలను పోషించుకోగలిగితే చాలు అనుకుంటుంది ఎరిన్. రెండుసార్లు విడాకులయ్యాయి కాబట్టి ఆమెని చులకనగా చూసేవారు కూడా ఉంటారు. ఆమె వస్త్రధారణ కూడా ఒంపుసొంపులు చూపే విధంగా ఉంటుంది. పైగా ఆమెకి కోపం వస్తే బూతు మాటలు మాట్లాడుతుంది. ఆమె విడాకులని బట్టి, వస్త్రధారణని ఆమె గుణగణాలని నిర్ధారించటం సబబేనా? జీవితంలో మోసపోయిన ఆమెలో ఉండే ఉక్రోషాన్ని ఆమె స్వభావంగా ముద్రవేయటం న్యాయమేనా? ఇవి ఆలోచింపజేసే విషయాలు. నా మటుకు నాకు ఆమె వస్త్రధారణ ఇబ్బంది కలిగించింది. అది నా అభిప్రాయం. వ్యక్తి స్వేచ్ఛను కాదనటానికి నేను ఎవరిని?

ముగ్గురు పిల్లల తల్లి అయిన ఎరిన్ చేసే ఉద్యోగం ప్రయత్నాలతో సినిమా మొదలవుతుంది. ఆమెని డిగ్రీ గానీ, అనుభవం గానీ లేకపోవటంతో ఉద్యోగం దొరకదు. ఇంతలో ఆమె కారుకి ఆక్సిడెంట్ జరిగి ఆమెకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆక్సిడెంట్ చేసినవాడు ఒక డాక్టరు. తప్పు అతనిదే. ఎడ్ మాస్రీ అనే లాయర్ సాయంతో ఎరిన్ కేసు వేస్తుంది. అటు వైపు లాయరు ఆమెకి రెండుసార్లు విడాకులయ్యాయని, ఆమె మాజీ భర్తలు ఆమెని పట్టించుకోరని, అందుకే పథకం వేసి డబ్బు రాబట్టటానికి డాక్టర్ని ఇరికించిందని వాదిస్తాడు. మరో మగవాడి మోసానికి బలైపోతున్నాననే కోపంతో ఎరిన్ బూతుమాటలు వాడుతుంది. కేసులో ఓడిపోతుంది. ఆ తర్వాత పై కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నా కోర్టులో ఆమె ప్రవర్తన నచ్చక ఎడ్ ఆమెని వదిలించుకోవాలని చూస్తాడు. చివరికి ఆమె ‘నాకు పరిహారం ఎలాగూ రాలేదు, చిన్న ఉద్యోగం ఇవ్వమ’ని ఎడ్‌ని అతని ఆఫీసులో అందరి ముందు బెదిరిస్తుంది. అంతలోనే ఎవరికీ వినపడకుండా ‘నా పని నచ్చకపోతే తీసేయ్, కానీ ఉద్యోగం మాత్రం ఇవ్వు అంటుంది’. ఇది ఆమె స్వభావానికి అద్దం పడుతుంది. ఆమెకు కావలసిందల్లా గౌరవంగా బతికే అవకాశం, తన పిల్లల్ని పోషించుకునే చిన్నపాటి సామర్థ్యం.

ఉద్యోగంలో చేరాక ఎడ్ ఒకసారి ‘నీ దుస్తులు ఇతర ఉద్యోగినులకి ఇబ్బందిగా ఉన్నాయి’ అంటే ‘నేను ఎలాంటి బట్టలు వేసుకుంటానన్నది నా ఇష్టం. నువ్వు కట్టుకునే టైలు నాకు నచ్చలేదు. కాస్త చూసుకో’ అంటుంది. ఎరిన్ పిల్లలను చూసుకోవటానికి చిన్న జీతం మీద ఒకామె ఒప్పుకుంటుంది. ఎరిన్ ఆమె ఇంట్లో పిల్లల్ని దిగబెట్టి, సాయంత్రం తిరిగి తీసుకువెళ్ళేలా ఒప్పందం. ఒకరోజు తనకేదో పని ఉందని ఆమె ఎరిన్ రాకముందే పిల్లల్ని ఇంట్లో దింపేసి వెళ్ళిపోతుంది. పక్కింట్లో ఉండే జార్జ్ పిల్లలని ఆడిస్తాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నంతలో బతుకుతుంటాడు. దృఢమైన వ్యక్తిత్వం గల ఎరిన్ అంటే అతనికి ఇష్టం. పిల్లలంటే ఇష్టమని, వారిని చూసుకుంటానని అంటాడు. మగవారి మీద నమ్మకం లేని ఎరిన్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది.

ఒక పెద్ద ఎలెక్ట్రిక్ కంపెనీ హింక్లీ అనే ఊళ్ళో తమ ప్లాంట్‌కి దగ్గర్లోని ఇల్లు కొనాలని ప్రయత్నిస్తుంది. సరైన ధర రాకపోవటంతో డోనా జెన్సెన్ అనే ఆ ఇంటి యజమాని ఎడ్‌ని లాయర్‌గా పెట్టుకుంటుంది. ఆ పనిలో సాయం చేయమని ఎరిన్‌ని అడుగుతాడు ఎడ్. ఆ పత్రాలలో మెడికల్ రిపోర్టులు ఉండటంతో విషయం అర్థం కాక ఎరిన్ డోనాని కలుస్తుంది. కంపెనీ వ్యర్థజలాలలో క్రోమియమ్ ఉండటంతో భూగర్భజలాల్లో క్రోమియమ్ చేరిందని, తమ కుటుంబానికి ఆరోగ్య సమస్యలు రావటంతో వైద్య పరీక్షలు కంపెనీయే చేయించిందని, ఆ డాక్టరు వారి ఆరోగ్య సమస్యలకి క్రోమియం కారణం కాదని చెప్పాడని డోనా చెబుతుంది. ఇప్పుడు ప్లాంట్‌కి కొత్త రోడ్డు వేయటానికి స్థలం కోసం ఆ కంపెనీ తన ఇల్లు కొంటానని అంటోందని, సరైన ధర ఇవ్వట్లేదని అంటుంది. ఎరిన్ మరింత పరిశోధన చేస్తుంది. ప్లాంట్ లోని ఎంజిన్లు వేడెక్కినపుడు చల్లబరచటానికి నీళ్ళు వాడతారని, ఎంజిన్ భాగాలకు తుప్పు పట్టకుండా ఆ నీళ్ళలో క్రోమియమ్ కలుపుతారని, కంపెనీ క్రోమియమ్-6 అనే ప్రమాదకరమైన రకాన్ని చట్టం అనుమతించిన దాని కన్నా ఎక్కువ మోతాదులో వాడిందని తెలుస్తుంది. ఆ వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలవటం వల్ల ఆ ఊళ్ళో చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో క్యాన్సర్, గర్భస్రావం లాంటి తీవ్రమైన సమస్యలు కూడా ఉంటాయి. ఊరివాళ్ళకి పరిహారం ఇప్పించటానికి ఎరిన్, ఎడ్ పోరాటం చేస్తారు. బైబిల్లో చెప్పిన డేవిడ్, గొలైయత్ కథలా వారిద్దరూ తమ కంటే ఎంతో శక్తివంతమైన కంపెనీని ఓడిస్తారు. మొదటిసారి ఎరిన్ దూరం నుంచి కంపెనీ ప్లాంట్ ని పరిశీలనగా చూస్తుంటే ‘నేను ఇంత పెద్ద కంపెనీని ఎదుర్కోగలనా’ అనే భావం పలుకుతుంది. అయినా అన్యాయం మీద పోరాటం చేయటానికి చిన్నా పెద్దా తేడా ఉండకూడదు.

ఎరిన్, ఎడ్‌ల స్నేహం హృద్యంగా ఉంటుంది. కేసులో ఒడిదుడుకులు వచ్చినపుడు ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. ఒక దశలో ఎరిన్ పరిశోధన చేస్తానని ఎడ్ అనుమతి తీసుకుని, దాని కోసం తిరుగుతూ కొన్నాళ్ళు ఆఫీసుకి రాదు. తిరిగి ఆఫీసుకు వచ్చే సరికి ‘నీ ఉద్యోగం పోయింది’ అంటారు సహోద్యోగులు. ‘అలా రోజుల తరబడి వెళ్ళిపోతే ఎలా?’ అంటాడు ఎడ్. తిరిగి ఆమెకి ఎలా ఉద్యోగం వచ్చిందనేది తమషాగా ఉంటుంది. అనుభవం గల ఎడ్ వేసే వ్యూహాలు అర్థం కాక ఎరిన్‌కి కోపం వస్తూ ఉంటుంది. ఎరిన్ సంభాషణా చాతుర్యం ఎడ్‌కి కొత్తగా ఉంటుంది. పరిహారంలో ఎడ్ కి 40 శాతం దక్కుతుందని తెలిసి డోనా, ఆమె భర్త తటపటాయిస్తుంటే ఎరిన్ ‘మీకు అన్యాయం జరిగితే మీ పరిహారంలో ఈ జోకర్‌కి 40 శాతం వస్తుందని తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ ఒకవేళ కేసు ఓడిపోతే ఈయనకి ఏమీ రాదని తెలిశాక అతను కూడా నష్టపోయే అవకాశం ఉందని అర్థమైంది’ అంటుంది. దాంతో వాళ్ళు ఒప్పుకుంటారు. ఎరిన్ అందరితో కలుపుగోలుగా ఉండి వారికి తమపై నమ్మకం కలిగేలా చేస్తే, ఎడ్ చట్టపరమైన వ్యవహారాలు చూసుకుంటాడు. వృత్తిపరంగా ఎంత సామర్థ్యం ఉన్నా సానుభూతి కూడా ఉండాలని ఎరిన్ నిరూపిస్తుంది. ఊరివాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు ఆమెకి కంఠతా వచ్చేస్తాయి. వారికి మేలు చేయాలనే అమె తపన మనసుకి హత్తుకుంటుంది.

ఎరిన్, జార్జ్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఆమె ఉద్యోగంలో ఊపిరి సలపకుండా ఉంటుంది. పిల్లల భారమంతా అతని మీద పడుతుంది. అతనిలో అసంతృప్తి పెరుగుతుంది. పైగా ఆమెకి బెదిరింపులు వస్తుంటాయి. జార్జ్ ఆమెని ఉద్యోగం మానేయమంటాడు. ‘జీవితమంతా మగవారి అవసరాలకి అనుగుణంగా నడుచుకున్నాను. ఇప్పుడు ఎందరికో సాయం చేయగలిగే అవకాశం వచ్చింది. వారందరూ నాకెంతో గౌరవం ఇస్తున్నారు. దాన్ని వదులుకోను’ అంటుంది. అతని అహం దెబ్బ తిని అమెని వదిలి వెళ్ళిపోతాడు. మగవాడు పనిచేస్తే ఆడది ఇంట్లో ఉన్నప్పుడు, ఆడది పనిచేస్తే మగవాడు ఇంట్లో ఎందుకు ఉండకూడదు? పిల్లలు తన పిల్లలు కాకపోవచ్చు. కానీ పిల్లలంటే ఇష్టమేగా! అంత అహం ఎందుకు? అమెరికా లాంటి దేశాల్లో ఏ తప్పూ చేయనంత వరకూ ఎవరు ఎలా బతుకుతున్నారో పట్టించుకోరు. అయినా జార్జ్‌కి పురుషాహంకారం అడ్డువచ్చింది. ఎరిన్ ఎనిమిదేళ్ళ కొడుకు తల్లి ఉద్యోగంలో తలమునకలై ఉండటంతో తల్లి మీద అలుగుతాడు. చివరికి అతనికి ఒక చిన్న అమ్మాయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోందని, ఎరిన్ ఆమెకి పరిహారం కోసం ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. ‘వాళ్ళమ్మే ఆ ప్రయత్నం చేయవచ్చుగా’ అంటాడు. ‘వాళ్ళమ్మ కూడా జబ్బుపడింది’ అంటుంది ఎరిన్. ఈ సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది.

పెద్ద కంపెనీలు తమ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటాయో చూస్తే రక్తం మరుగుతుంది. చట్టాల్లో లొసుగులని వాడుకుంటాయి. తప్పు జరిగిందని ప్రజలకి తెలిసిన తర్వాత ఒక సంవత్సరం లోపల వ్యాజ్యం వేయాలి. అందుకని ఒక సమావేశం పెట్టి నీళ్ళలో క్రోమియమ్ ఉంది, కానీ పెద్దగా నష్టమేమీ లేదు అని చెబుతారు. ఇలా ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాతే డోనా ఇల్లు కొనటానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. దాంతో ఎరిన్, ఎడ్‌ల పని ఇంకా కష్టమౌతుంది. డోనాకి, ఆమె భర్తకి వచ్చిన జబ్బులుకి ఎన్నో కారణాలు ఉండొచ్చని కంపెనీ వారు బుకాయిస్తారు. కంపెనీ తెలిసే తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నించిందని నిరూపించటానికి నానాతంటాలు పడతారు. ఇందులో కూడా ఎరిన్ సహృదయమే వారికి తోడ్పడుతుంది. ఎలా అన్నది చూడాల్సిందే.

ఆధారాలు సంపాదించటానికి ఎరిన్ జల మండలికి వెళ్ళినపుడు అక్కడ ఒకే ఒక నిర్వాహకుడు ఉంటాడు. అతనితో సరస సంభాషణలాడి అతన్ని ఏమారుస్తుంది ఎరిన్. తన ఒంపుసొంపులు చూపిస్తుంది. మగవాడి బలహీనతని వాడుకోవటం ఆమెకి తెలుసు. ‘Ends justify the means’ (ఏం పని చేశామన్నది ముఖ్యం కానీ ఎలా చేశామన్నది ముఖ్యం కాదు) అనే నానుడి గుర్తు వస్తుంది. దీనిని అన్వయించుకోవటం ఎవరికి వారు చేయాల్సిన పని. పరిస్థితి చేయిదాటితే బయటపడగలమనే ధైర్యం ఉండాలి. ఎరిన్ మామూలుగా తన భుజాలని, క్లీవేజ్‌ని, కాళ్ళని ప్రదర్శిస్తూ ఉంటుంది. అందరూ చూడాలనే ఆమె కోరిక. అదో ఆనందం! ముఖ్యమైన మీటింగులకి మాత్రం కోటు వేసుకుంటుంది. పరిశీలనగా చూస్తే ఇది గమనించవచ్చు. నిజ జీవితంలో ఎరిన్ ఎప్పుడూ తన కారులో ఒక కోటు పెట్టుకుంటుందట, ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే వెసుకోవటానికి. ఎవరైనా నా జోలికొస్తే వారికి బుద్ధి చెప్పటం తెలుసు అంటుంది.

‘ప్రెటీ వుమన్’ చిత్రంతో స్టార్ అయిపోయిన జూలియా రాబర్ట్స్ ఎరిన్‌గా నటించి ఆస్కార్ గెలుచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో సంఘర్షణని, ఊరివాళ్ళ పట్ల సానుభూతిని, న్యాయవ్యవస్థపై తనకొచ్చే కోపాన్ని అద్భుతంగా అభినయించింది. ఎడ్‌గా ఆల్బర్ట్ ఫిన్నీ నటించాడు. ఎరిన్ లాంటివారికి ఆమడ దూరం ఉండే అతను ఆమెతో కలిసి పనిచేయటం తమాషాగా ఉంటుంది. అతనికి ఉత్తమ సహయనటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. మన నటుల్లో కైకాల సత్యనారాయణ ఈ పాత్రకి పూర్తి న్యాయం చేసి ఉండేవారు. చిత్రానికే ఆయువుపట్టు లాంటి డోనా పాత్రలో మార్జ్ హెల్గెన్ బెర్గర్ నటన ఆకట్టుకుంటుంది. తాము వాడే నీళ్ళలో క్రోమియమ్-6 ఉందని, అది అత్యంత ప్రమాదకరమని, డాక్టర్ చేత కంపెనీ అబద్ధం చెప్పించిందని అమెకి తెలిసే సన్నివేశం గుండెని బరువెక్కేలా చేస్తుంది. వెంటనే ఆమె బయట స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో ఆడుకుంటున్న తన కూతుళ్ళ దగ్గరికి పరుగెత్తి వెళుతుంది, వారికి బయటకు రమ్మంటూ. అప్పుడు మనలో రేకెత్తిన భావాలే ఎరిన్ ముఖంలో ప్రతిబింబిస్తాయి.

దర్శకుడు స్టీవెన్ సోడెర్బర్గ్ కి ఉత్తమ దర్శకుడి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. అదే సంవత్సరం అతను దర్శకత్వం వహించిన ‘ట్రాఫిక్’ చిత్రం కూడా విడుదలయింది. ఆ చిత్రానికి కూడా అతనికి ఉత్తమ దర్శకుడి నామినేషన్ వచ్చింది. ఇలా ఒకే దర్శకుడికి రెండు నామినేషన్లు రావటం అరుదు. చివరికి ‘ట్రాఫిక్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్నాడు. ‘ఎరిన్ బ్రాకొవిచ్’ చిత్రం కూడా అందుకు ఒక కారణమని చెప్పుకోక తప్పదు. స్క్రీన్ ప్లే రచయిత్రి సుసానా గ్రాంట్‌కి కూడా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఫొటోగ్రఫీ మనం మామూలుగా చూసే చిత్రాల్లోని ఫొటోగ్రఫీ కన్నా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కొట్టొచ్చినట్టుగా ఉంటుంది. ఎరిన్ లాగే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here