ఓ బస్సు ప్రయాణం

0
8

[అనంతపురం నుంచి కడపకి జరిపిన ఓ బస్సు ప్రయాణం అనుభవాలని అందిస్తున్నారు శ్రీ ప్రమోద్ ఆవంచ.]

[dropcap]అ[/dropcap]నంతపురం టవర్ క్లాక్ ఉదయం ఆరున్నర గంటలు. రాత్రి తొందరగా తినడం వల్ల ఆకలిగా అనిపించింది. కడప వెళ్ళడానికి ఉదయం ఐదింటికే లేచి, అన్ని కార్యక్రమాలు ముగించుకొని, ఆరున్నరకు బయటపడ్డాను. అప్పటికే భానుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సన్నద్దం అవుతున్నాడు. టవర్ క్లాక్ కూడలిలో నిలబడి ఉన్న నన్ను చల్లగాలి ఒక్కసారి అలా తాకి ఇలా వెళ్ళిపోయింది. అప్పటికి నాకు తెలియదు, ఆ రోజుకి నేను ఆస్వాదించే చల్లని గాలి అదే చివరిదని.

క్లాక్ టవర్ ఆనుకొని హైదరాబాద్ వెళ్ళే దారిలో ఒక పెద్ద వంతెన దానిపై విశాలమైన రోడ్డు. సంవత్సరం క్రితం నేను వచ్చినప్పుడు ఆ వంతెన లేదు. ఆ బ్రిడ్జి మూలంగా ఆ ప్రాంతమంతా అందంగా కనిపిస్తుంది.. సప్తగిరి సర్కిల్, శ్రీ కంఠం సర్కిల్, టవర్ క్లాక్ సర్కిల్.. అనంతపురంలో, ఈ మూడు ‌సర్కిల్స్ చాలా ముఖ్యమైనవి, ఏ ఊరికి వెళ్ళాలన్నా ఏదో ఒక సర్కిల్‌ని తాకకుండా వెళ్ళలేం.

ఆకలౌతుంది, ఒకసారి బస్సు ఎక్కిన తరువాత ఎక్కడో టిఫిన్‌కి ఆపుతారు, కానీ అంత వరకు నాకు ఆగే ఓపిక లేక, టవర్ క్లాక్ నుంచి బస్టాండ్ వెళ్ళే దారిలో టిఫిన్ తిని, బస్టాండుకి ఏడున్నరకి చేరుకున్నాను. అక్కడ అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఉరవకొండ డిపోకి చెందిన కడప బస్సు ఎక్కాను. అనంతపూర్ నుంచి కడపకు నాన్ స్టాప్ బస్సులు లేవు. టికెట్ తీసుకొని కూర్చున్నాను. ఉరవకొండ నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పెన్నాహోబిలం, జల్లిపల్లె, ముద్దల్, కూడేరు మీదుగా అనంతపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి నయనపల్లి ఎ.కొండాపురం దాటాక పెద్ద టౌన్ తాడిపత్రి. తాడిపత్రిలో, బస్సు పాసింజర్లతో  నిండిపోయింది. సీటుకి, సిటీకి మధ్యలో చాలా మంది నిలబడే ఉన్నారు. కిటకిటలాడే బస్సులో కూర్చోవడం ఇబ్బందితో పాటు, కొంత చికాకుగానూ ఉంటుంది. పైగా ముఖానికి తగిలే వేడి గాలి. తాడిపత్రి దాటాక, రెండు ఊర్లు వస్తాయి అవి ఒకటి తెల్ల ప్రొద్దుటూరో అది ఏంటో నేను సరిగ్గా చూడలేదు, కానీ ఆ తర్వాత ఊరు ఆర్.కొండాపురము.

ఇదే ఊర్లో తొమ్మిదిన్నరకు ధాబా లాంటి హోటల్ ముందు టిఫిన్ కోసం బస్సు ఆపాడు డ్రైవర్. సీటు దొరకక నిలబడ్డ వాళ్ళు ఎవరూ దిగకపోగా, దిగే వాళ్ళకు అడ్డంగా కదలకుండా నిలబడి ఉన్నారు. అందరినీ దాటుకుంటూ ఎలాగో అలాగ కిందికి దిగి, ఒక నీళ్ళ బాటిల్ కొనుక్కుని తాగాను. ఆ తరువాత టీకాతాత్పర్యం కూడా సేవిస్తూ చుట్టూ చూసాను. అప్పుడే ఉరవకొండ డిపోకి చెందిన, కడపకు వెళ్ళే ఇంకో బస్సు కూడా టిఫిన్ కోసం అక్కడే ఆగింది, ఆ బస్సు దాదాపు ఖాళీగా ఉంది. అదే నేనెక్కిన బస్సు మాత్రం నిండిపోయి ఉంది. కండక్టర్, డ్రైవర్ గార్లు, ఇంకొంత మంది పాసింజర్లు టిఫిన్ చేసాక బస్సు బయలుదేరింది. దాదాపు మూడు కిలోమీటర్లు పోయాక కండక్టర్‌కి ఒక ఫోన్ వచ్చింది, అది మాతో పాటే టిఫిన్‌కి ఆపిన ఇంకో బస్సు కండక్టర్‌ది, “మీ బస్సులో వచ్చిన ఒక పాసింజర్‌ను వదలేసి వెళ్లిపోయారు, నేను నా బస్సులో ఎక్కించుకొని వస్తున్న, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఆగండి”, అనీ. దాంతో మా కండక్టర్ తనకున్న బేస్ వాయిస్తో, డ్రైవర్‌ని బస్సు ఆపమని చెప్పాడు.

ఒక్కసారిగా కరీంనగర్ పోయేటప్పుడు సిద్దిపేట ధాబా దగ్గర నాకు జరిగిన సంఘటన మస్తిష్కంలో గిర్రున తిరిగింది. అప్పుడు నా పరిస్థితి అంతే, అందరూ ఎక్కారనీ, నన్ను వదిలేసి పోయిన సంఘటన. ఆ ధాబాకు చెందిన ముస్లిం సోదరుడు నన్ను అయిదు కిలోమీటర్లు తన బైక్ మీద తీసుకెళ్లి బస్సు దగ్గర దింపాడు. ముందే ఫోన్ చేయడంతో, దాదాపు ఇరవై నిమిషాలునా కోసం ఆ డ్రైవర్ బస్సును ఆపాడు. ఇక్కడా అంతే మా కండక్టర్‌కి ఫోన్ రాగానే డ్రైవర్‌కి చెప్పి, బస్సును పక్కకు ఆపించాడు.

తొమ్మిదిన్నరా పదింటికే ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ బస్సు కోసం వెయిటింగ్లో సహనాన్ని కోల్పోయిన పాసింజర్లు తలా ఒక రకంగా కామెంట్స్ చేస్తున్నారు. నా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ముద్దనూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమల దగ్గర రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తాడట. డ్యూటీకి టైం అవుతుందని కండక్టర్ మీద అరుస్తున్నాడు. అందరూ ఎక్కారా లేదా అని చూసుకోకుండా ఎలా వస్తావు అనీ అచ్చమైన రాయలసీమ మాండలికంలో కోపంగా అన్నాడు. ఇంకొన్ని మాటలు అన్నాడు కానీ నాకు అవి అర్థం కాలేదు. అటు పక్కన లేడీస్ సీట్ లో కూర్చున్న ఒక మహిళ “మా చెల్లెలు చనిపోయింది, నేను అర్జంటుగా నెల్లూరు వెళ్ళాలి”, అని అరుస్తుంది.ఇక్కడి నుంచి నెల్లూరు ఎట్లా వెళుతుందన్న డౌట్ వచ్చింది. నా డౌట్‌ని పటాపంచలు చేస్తూ, ఎర్రగుంట్లల దిగి, అక్కడి నుంచి ప్రొద్దుటూరు పోయి, ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వెళుతాని తన పక్కనున్నామెకు చెపుతోంది. సీటు దొరకక నిలబడ్డ వాళ్ళతో సహా చాలా మంది తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ, కండక్టర్‌ని నిలదీస్తున్నారు. అదే స్థానంలో మీరు ఉంటే, అలాగే అంటారా అంటూ కాస్త గట్టిగానే సమాధానం ఇస్తున్నాడు కండక్టర్.

ఇదే సంఘటన నా విషయంలో జరిగినప్పుడు కూడా పాసింజర్లు, డ్రైవర్‌ని ఇలాగే తిట్టారేమోనని అనిపించి, డ్రైవర్, కండక్టర్ల మీద జాలి, గౌరవం పెరిగింది. పాపం ఆ ఎండలో వేడికి గంటల తరబడి ప్రాణాలను పణంగా పెట్టి బస్సు నడిపే డ్రైవర్లు, పాసింజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక, డబ్బుల లెక్కల్లో, తేడాలు వస్తే జేబు నుంచి డబ్బులు వేసే, కండక్టర్లకు ఈ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదే. ఈ మాటల యుద్ధం మద్యలోనే ఆ బస్సు వచ్చి ఆగింది, హడావుడిగా మా బస్ ఎక్కిన ఆ పాసింజర్ తన సీటు దగ్గరకు వెళ్ళి,తన లగేజీనీ తడిమి చూసుకొని, హమ్మా అంటూ ఊపిరి పీల్చుకుని కూర్చుంది. ఆ తరువాత కండక్టర్‌తో సహా మిగితా వాళ్ళంతా ఆమె వైపు గుర్రుగా చూస్తూ, సలహాలు, సూచనలతో పాటు తిట్ల దండకాలు చదివారు. తిట్లు అంటే మామూలు తిట్లే.

ఆ తర్వాత మంగపట్నం, దాని తర్వాత ముద్దనూరు స్టాప్ వచ్చింది, అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలమల రాయలసీమ థర్మల్  పవర్ ప్లాంట్ ఉంటుంది. దాదాపు వెయ్యీయాబై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆ ప్లాంటులో, దాదాపు పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఆ విద్యుత్ సరఫరా అవుతుందని, నా పక్కన కూర్చున్న వ్యక్తి చెప్పాడు. అతను అక్కడ దిగిపోయాడు.

“చెల్లెలు చనిపోయింది, పదేళ్ల క్రితం మా చెల్లెలు మిందె మీదినుంచి పడి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి, అప్పటి నుంచి మంచాన పడింది, ఈ మధ్య కాన్సర్ గడ్డ అయి,ఇవాళ పొద్దున్న చనిపోయింది. నేను తాడిపత్రిలో మా ఆడబిడ్డ ఇంటికి వచ్చాను. వార్త తెలిసి హడావుడిగా బయలుదేరాను” అంటూ కంట తడి పెట్టింది, నెల్లూరు వెళ్ళే ఆ మహిళ. “నా తోడ బుట్టింది ఒకతే చెల్లెలు, దాని రాత అట్ల రాసిండు దేవుడు” అంటూ వుంటే, ఆ బాధను ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుందన్న ఆతృత ఆమెలో కనిపించింది. వృద్దాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న తన ముఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ, “పాపం చాలా కష్టాలు పండది నా చెల్లెలు, ఓకే కడుపున పుట్టిన మా ఇద్దరి బతుకుల్లో ఇంత తేడానా”, అంటూ వాపోయింది. బాధ అనిపించింది.

ఒక్కసారిగా మా అన్నయ్య కూతురు జయశ్రీ జ్ఞాపకం వచ్చింది. తాను అంతే, నల్గొండ మోత్కూరు దగ్గర తన అత్తగారింట్లో, మిద్దె మీద నుంచి నిద్ర మబ్బులో కింద పడి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ సంఘటన జరిగి ముప్పై ఏళ్లు అయ్యింది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా పెరిగిన నాకు చాలా బాధ కలిగింది. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు మేనమామల దగ్గర పెరిగి ఒక స్టేజికి వచ్చారు.

ముద్దనూరు తరువాత చిలుమకూరు దాని తర్వాత ఎర్రగుంట్ల. అక్కడ నెల్లూరు వెళ్ళే మహిళ దిగింది. ఆ తరువాత బస్సు చాలా వరకు ఖాళీ అయ్యింది. ఎర్రగుంట్ల ఊరు దాటాక వచ్చే తిప్పలూరు గ్రామంలో రోడ్డు పక్కన కొంచెం దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం అద్భుతంగా ఉంది. కొత్తగా కట్టారేమో నాకైతే చాలా నచ్చింది. “చూసి మురవడానికే గానీ ఏముంది సార్”, అంటూ ఖాళీ అయిన నా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అన్నాడు. “ఎందుకు ఏమయింది” అన్న నాకు తన గోడును వెళ్ళబోసుకున్నాడు.

అతని తమ్ముడు వాళ్ళ గ్రామానికి సర్పంచ్ అట, ఇరవై లక్షల రూపాయలు, రెండు రూపాయల వడ్డీకి తెచ్చి గ్రామ అభివృద్ధి  పనులు చేసాడట, రెండు సంవత్సరాలు అయ్యింది, ఒక్క పైసా ప్రభుత్వం ఇయ్యలేదు. అడగంగా, అడగంగా ఇటీవల ఎనిమిది లక్షల  రూపాయలు మంజూరు చేసారు. ఇంకా ఆ పన్నెండు లక్షలకు ఎన్ని సంవత్సరాలు ఆగాలో అంటూ వాపోయాడు. “నిజంగా అభివృద్ధి పనులకు ఎంత ఖర్చయిందో చెప్పండి సార్” అని అడిగాను. “ఓ పది లక్షలు అయి ఉంటుంది సార్” అంటూ బదులిచ్చాడు.

“అంటే మిగితా పది లక్షలు మీకు ప్రాఫిట్ కదా” అని అన్నాను. “అదేంది సార్ పది లక్షలకే అట్లా అంటరు, ప్రభుత్వానికి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గర బంధువు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఏడు వేల అయిదు వందల కోట్ల కుంభకోణం చేస్తే ఎవరూ అడగరు గానీ, ఏదో చిన్నోళ్ళం ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తే ప్రతి ఒక్కరూ అడగెటోళ్ళే” అని అంటుంటే, ఏం మాట్లాడాలో తెలియక నోరు వెళ్ళబెట్టాను. అతను ఇంకా కొనసాగిస్తూ, “ఒక పక్క చేసిన పనులకు డబ్బులు ఇవ్వరు, కానీ మీటింగులకు జనాలను పోగెయ్యాలంట. జనాలు పని వదిలి పెట్టి రావాలంటే, రోజుకు అయిదు వందల రూపాయలు, ఒక క్వాటర్ బాటిల్, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం ఏం లేదా అని అడుగుతరు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్.. మీరే చెప్పండి”, అన్నాడు. నేను మౌనంగా నిజమేనన్నట్లుగా తల ఊపాను.

ఎర్రగుంట్ల తరువాత  స్టాపులు రెండే అవి కమలాపురం, వల్లూరు. చివరిగా కడప. అలా అనంతపురం నుంచి పన్నెండు స్టాపులలో, అంతకు ముందు అనంతపురంతో సహా కలుపుకొని ఆరు స్టాపులు. అంటే ఉరవకొండ నుంచి కడపకు పద్దెనిమిది బస్ స్టాపులు. అనంతపురం నుంచి నాలుగున్నర గంటల ప్రయాణం.. చివరిగా కడప పట్టణంలో అడుగు పెట్టాను.

💐💐🙏🙏

Bus Image courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here