ఓ చిన్న పొరబాటు

0
7

[dropcap]“అ[/dropcap]మావాస్య దగ్గరికి వచ్చింది కనుక చీకటి చిక్కబడింది. వెలుగెట్లా… అని విచారిస్తూ కూర్చున్నా పొద్దుపొడుపుతో తప్ప వెలుగు రాదు. మరి చీకటిని తట్టుకోవడం ఎలా? మొదట ఓ ప్రమిదను చూసి, ఇంత నూనె వేసి, వత్తి అందుంచి వెలిగించి చూడు. వెలుగు ప్రారంభమౌతది. చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా (చిన్న, చితకా అని ఉండదు) నీకు మార్గం చూపుతది. నీ నడక సుగమం అవుతది. పని చేసే తత్వం ఎప్పుడూ ఎవరినీ తక్కువ చేయదు, చెడుపదు, కించపరచదు. నీ కాళ్ళపై నిన్ను స్థిరంగా నిలుపుతది. కానీ పని చేస్తున్నట్టు నటించడం (సోమరితనం) ఉంది చూశావ్, అది మనల్నే కాదు మొత్తం సమాజాన్నే చెరుపుతది.” అన్న దగ్గర ఆగాడు రాములు.

రాములు పోలీస్ ఎస్.ఐ.గా నౌకరీలో చేరి ఇది ఐదో ఏడు. నౌకరీలో చేరిన సంవత్సరం ఓ ఏడాది పాటు పని… పని… అని ఉరుకులు పరుగులు తీశాడు. చేతనైనంతగా న్యాయం చేసేందుకు చాలా ఆరాటపడ్డాడు మనస్పూర్తిగా. తన ఎదురుగా న్యాయం జరగకుంటే బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నడుస్తున్న నడకకు అవే ఎక్కువ. అలాంటప్పుడు పై అధికారులపైన కోపం వచ్చేది. అసహనం కలిగేది. కానీ తన కోపమే తన శత్రువు అన్నది పోలీసు వ్వవస్థన నేర్చుకోవలసిన మొదటి సంగతి. దాన్ని ఆలస్యంగానైనా గుర్తెరగడం మూలాన, తనను తాను తమాయించుకొని నిలదొక్కున్నాడు. పోలీస్ నౌకరీ ఎలా చేయాలో కాలం గడుస్తున్నకొద్దీ కొంచం కొంచం అర్థమైంది. అది మొదలు ఒంటరిగా ఏమీ చేయలేక ఆ న్యాయాన్యాయాల దారిని దాని ఖర్మకు వదిలేసి దారిన పడ్డాడు.

***

పి.సి 104 ఓ జంటను పోలీస్ స్టేషన్‌కు అపరాత్రి అవుతుండగా పట్టకొచ్చాడు. అంతకు ముందుగానే మయూరి లాడ్జీపై రైడ్ చేసి ఐదారుగురిని తోలుకొచ్చారు. రైటర్ ఆరామ్‌‌గా కూర్చుని పాన్ నముల్తూ వివరాలు ఈ రాసుకునేందుకు సమాయత్తమయ్యాడు. అతను సీట్లో కూర్చోనగానే ఒకరు లోనికి వచ్చి నంగిగా నేల చూపులు చూస్తూ నిల్చున్నారు. స్టేషను ఉక్కపోతేగాక మనిషికున్న భయం వల్ల చెమటల్తో వళ్ళంతా తడిసినట్టుంది.

ఒకసారి నిల్చున్న శాల్తీని ఆపాదమస్తకం చూసి తలొంచుకొని నిర్వికారంగా

“నీ పేరు?” అని అడిగాడు రైటర్.

“అంతమ్మ” అంది తల దించుకొనే, సిగ్గుతో మాత్రం కాదు.

“నీవు ఏ కంపెనీ నుంచి వచ్చినవ్?” అడిగాడు.

“అంతమ్మట అంతమ్మ… నీ పేరా?” అని సణుక్కున్నాడు రాసుకుంటూ.

ఒక సారి ఆమె వైపు మళ్ళా చూశాడు. వయస్సు పాతికేళ్ళు పైన ఉంటాయి. కాస్తో కూస్తో మంచిగా బ్రతికిన దానిలా కొద్దో గొప్పో చదువరిలా కూడా అనిపించింది. బాగా ఏడ్చినట్టుంది. కళ్ళు ఉబ్బి కనిపిస్తున్నాయి. మనిషి చామనచాయే అయినా కాస్తో కూస్తో కళ గల మొహమే. అవయవ నిర్మాణం మాత్రం ఆవిడ అందాలని ఇనుమడింపచేసేలానే ఉంది. పద్ధతిగా చెంగు మెడ చుట్టూరా కప్పకొని నిలుచుంది. తల పూర్తిగా ఎత్తే ప్రయత్నం మాత్రం చేయలేదు. మాటడనూ లేదు. ఇది కంపెనీ కేసు కాదు అనిపించింది రైటర్‌కి. అయినా పోలీసు దాష్టికంతో…

“ఊ చెప్పు” అడిగాడు పెద్దగా.

“నన్ను నమ్మండి. నేనే కంపెనీ నుంచీ రాలేదు” అంది కళ్ళు తుడుచుకుంటూ.

“మరి అక్కడెందుకున్నావ్? సెంటర్ సంగతి నీకు తెలీదా?”

“మా ఊరి అతణ్ణి నమ్మి బాగా బ్రతకొచ్చనని చెబితే వెంట వచ్చాను. వచ్చి వారం దినాలు అయింది. నాలుగో నాడు బయటకెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఏం చేయాలో తోచక కొట్టు మిట్టాడుతున్నప్పుడు ఈయన నాపై జాలిపడి మీ ఊరు చేరుస్తాను రమ్మనమన్నాడు.”

“ఎవరీయన…?” అడిగాడు అతడినే చూస్తూ.

చెప్పింది.

“మా ఊరోడు కాదు. కానీ మొహం తెల్సిన మనిషే. మా ఊళ్ళో చాలా సార్లు కనిపించాడు. ఊళ్ళోని చిల్లర కొట్లకు బెల్లం, పటికి, నవాసారం వేస్తుంటాడు. అవసరాన్ని బట్టి చిల్లర సరుకులూ తెస్తాడు. పేరు మూర్తి. ఈయన్ని మూర్తి అయ్యగారని మా దగ్గర పిలుస్తారు. నేను కనబడ్డాక ‘ఇక్కడున్నావేం పోరి’ అని అడిగి మా ఊరి నుంచే వస్తున్నాననీ అక్కడ మీ వాండ్లు మీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళావని అనుకంటున్నరనీ, రేపో మాపో వస్తావనీ అనుకోవడం విన్నాను అని చెప్పాడు. అయితే ఇంటికే పోతే బాగనిపించింది. బస్టాండ్‌కి బయలుదేరాను. చివర బస్సు వెళ్ళిపోతే ఆ లాడ్జిలో ఉంచాడు. తలో మంచం తీసుకుని పడుకున్నాము… అంతకు మించి ఆయనకూ నాకే సంబంధం లేదు. ముఖం తెల్సినోడే. అతన్నే మీరు పిలిచి అడిగి తెలుసుకోవచ్చు” అంది ఎగతడుతున్న ఏడుపు ఆపుకొని.

నిజమే కావచ్చునని అన్పించింది రైటర్‌కు. ఈ వృత్తిలో ఉన్న వారి లక్షణాలు ఆ పిల్ల దగ్గర బొత్తిగా కన్పించలేదు. పైగ తానంటే బెదురు బెరుకు స్పష్టంగా కనిపించినయి.

“మూర్తి ఎవరు?” అని అరిచాడు జనాంతికంగా.

“నేనే సార్!” అంటూ వచ్చాడు ఒకడు. వయసు యాభై ఏండ్లు పైనుంటాయి. బట్టతల. మీసాలకు మాత్రం రంగేసుకొని ఉన్నాడు. వయస్సున్న వాడిలా కనబడేందుకు కావలసిన హంగు ఆరాటం అతనిలో కనిపించింది. ఊళ్ళో తిరిగే వానిలా వాలకం కనిపించింది.

అయినా “ఈవిడెవరు? ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?” అని అడిగాడు రైటరు.

“నేను చిల్లర సరుకు ఊళ్ళపోతంటా ఏస్తుంటా సార్. అంచేత తరచూ వ్యాపార నిమిత్తం ఆ ఊరు వెళ్ళినప్పుడు ఏ పచారీ కొట్టు దగ్గరో, తోవనో చాలా సార్లు కనిపించింది. ఇక్కడ కనిపించగానే మోసపోయి ఇక్కడికి వచ్చినట్టు అర్థమైంది. మొఖం తెల్సిన పోరిగదా వాళ్ళ ఊరికే చేరుద్దామనిపించి బస్ స్టేషన్‌కే వెళ్తే బస్సు లేదు, వెళ్ళిపోయింది. రాత్రి గడపాలి కనుక అక్కడ ఆగాము. అక్కడెంత మొత్తుకున్నా గానీ మమ్మల్నిలా పట్టుకొచ్చారు.”

“నువ్వేం వ్యాపారం చేస్తుంటావ్?”

“కిరాణా కొట్లకు చిల్లర సరుకులు వేస్తుంటా సార్.”

“అంటే నీది ఖరీదు కొట్టా?”

“కాదు సార్.”

“మరి…”

“నేను కొని అక్కడికి చేరుస్తుంటాను. వారు అదనంగా చెప్పిన పచారీ సరుకులను కూడా వ్రాసుకుని…” అంటుండగా హెచ్.సి స్టేషన్‌లోకి రావడం; మూర్తిని చూసి “ఏం మూర్తన్నా ఇటొచ్చినవ్?” అని పలకరించాడు దాపు కొచ్చి భుజాన చెయ్యేస్తూ…

“నీకేమన్నా ఈయన తెలుసునానే? లాడ్జి నుంచి పట్టుకొచ్చిన్రులే” అన్నాడు రైటరు హెడ్‌ను చూస్తూ రాత ఆపి.

“గదేందే?” అన్నాడు హెడ్డు అదోలా మొఖం పెట్టి.

జరిగింది మళ్ళా చెప్పిండు మూర్తి ప్రాధేయపడ్తున్నట్టు ముఖం పెట్టి.

“ఈయన సారా ‘మామలా’ల కాడ్నించి తెలుసు. ఆగం మనిషి కాదు. నిఖార్సయినోడు. రైడ్ ఇన్‌ఛార్జ్‌గా ఉండేటోడు. ఆఁ! రాజకీయాలలోని రంకాటన సారా ‘మామలా’లు పోయినయి గదా. బ్రతుకు తెరువుకు ఏదో వ్యాపారం చేసుకోవాల గదా. కేసు రాయకు. వీరిని ప్రక్కన ఉంచు. నేను వచ్చినంక సారుతో మాట్లాడతా” అని మూర్తి వైపు తిరిగి “బేఫికర్‌గ ఉండన్న నే చెప్పిన కద” అని బయటికి నడిచాడు. రైటర్ తల ఊపి కాగితంపై వివరాలను వ్రాయటం ఆపి మూర్తినీ, అంతమ్మనీ బయట చెట్టు క్రిందకుపోయి కూర్చోమని చెప్పి “నెక్ట్స్…” అన్నాడు కాగితం ఖరాబు అయినందుకు కాస్త చిరాకు పడుతూ. పి.సి 122 పట్టుకొచ్చిన జంటనున్న ఆవిడ దగ్గిర కొచ్చింది.

“నీ పేరు…?”

“శ్రీమతి….” అంది.

కిసుక్కున నవ్వి “నువ్వు శ్రీమతివేలేనమ్మా. అసలు పేరుంటుది కదా, అది చెప్పు. నువ్వు ఏ మతి వైతే నాకెందుకూ?” అన్నాడు.

“నా పేరే అది సారూ” అంది నెమ్మదిగా.

“ఓర్నీ… గట్టనా” అంటూ ఆమె వైపు ఓరగా చూసి ఉలిక్కిపడ్డాడు. రాస్తున్న కలం ఆగిపోయింది.

“అరె! నువ్వ పేష్కర్‌గారి పోరివి కదూ. ఈ పొద్దు పెళ్ళి చూపులంటిరి కదా. నువ్వు ఈడున్నవేంది. గీడికెట్లొచ్చినావు?” అన్నాడు సీటు నించి లేచి. దగ్గరకు రమ్మని, “ఏడుస్తావెందుకు? కళ్ళు తుడుచుకో. అసలేం జరిగిందో చెప్పు?” అని సముదాయిస్తూ అడిగాడు.

బెక్కుతూ కళ్ళు తుడుచుకోవడం ఆపుకొని “నా ఖర్మ గిట్టరాసుంది. ఏం బతుకాయే?” అని “పొద్దుగాల పెళ్ళి చూపులయినంక పెళ్ళికొడుకు నాతో మాటాడాలన్నాడు. మా నాయన సరేనన్నాడు. బయటకి పోయి మాటాడుకుంటే ఏవన్నా అభ్యంతరమా అడిగిండు నన్ను చూడొచ్చినోడు.”

కాసేపు తటపటాయించి తలవూపాడు మా నాన్న.

“వాడేమో నన్ను పార్కు దగ్గరికి తీసుకొచ్చిండు. గాడ చెట్టు నీడన కూర్చుని మాట ముచ్చట చేస్తుంటే ఈ పోలీసులు పట్టకొచ్చిన్రు. పెళ్ళికొడుకు ఏం చెపుతున్నా వాళ్ళు విన్పించుకోలేదు. నాకెంతో అయోమయంగాయింది. పెద్దగ ఏడుపుబట్టే.”

“నకరాలు చేస్తన్నావేందిరా. నడువ్.. అని మెడపట్టి తోసుకొచ్చిన్రు. దెబ్బలూ కొట్టిన్రు.” అని పెద్దగా ఏడ్చింది పాపం.

“ఎవరు ఎవరు తీసుకొచ్చింది?” అన్నాడు రైటరు.

రైటరు నోరు చేసుకోనడం విని అప్పుడే లోపలికొస్తున్న ఎస్.ఐ. “ఏం రైటరూ నోరు లేస్తున్నది. పతివ్రతలను ఏరతన్నావా? బేగి రాత పని పూర్తి చెయ్యి. విచారణ సంగతి నీకెందుకు? కోర్టు చూసుకుంటుంది” అని ఆగి అదోలా చూసి “పొద్దుటే కోర్టుకి పంపాలి. చక చకా కేసులు రాయి” అన్నాడు.

అట్టగే నిల్చున్న రైటరు నెమ్మదిగా ఒక అడుగు కదిపి, “అది కాదు సారూ, ఈ పోరి మా ఇంటి ప్రక్కనున్న పేష్కారీ కూతురు” అని చెప్పబోయే సరికి…

“ఆగు.. అంతా మంచోళ్ళమనే చెబుతారు. మంచిగానే కన్పిస్తారు. నువ్వు నీ డ్యూటీ చెయ్. వచ్చిన నాలుగు కేసులూ పొద్దుటికి కోర్టుకి పంపు. నకరాలు పోక కాగితాల పని పూర్తి చెయ్” అని రైటర్ చెప్పబోయింది వినకుండగానే జీపెక్కి వెళ్ళిపోయాడు.

‘వాని పై ఆఫీసరు వీడికి అక్షింతలేసినట్టుంది. గరమ్ గున్నాడు.’ నెత్తి గోక్కుని సీటున కూర్చుని “నెక్ట్స్…” అన్నాడు.

ఓ పోరి ఎదురుగా వచ్చి నిలబడింది.

“పేరు…?” అడిగాడు.

“అనసూయ.”

అంత బాధలోనూ నవ్వొచ్చింది రైటర్‌కి. త్రిమూర్తుల్ని పసిపోరల్ని చేసిన మహాసాధ్వి అనసూయ. ఆ పేరుతో ఈ కేసేమిటో అన్పించి నెమ్మదిగా తలెత్తి చూసిండు. కారా కిళ్ళీ నములుతూ, నిర్లక్ష్యంగా కనిపించింది. “అమ్మో! ఇది పక్కాగా అదే” అనుకొని “ఏ కంపెనీ?” అని అడిగాడు.

“రంగాజమ్మ కంపెనీ” అంది.

ఉలిక్కిపాటుగా చూశాడు రైటర్.

రంగాజమ్మ అంటే ఎ.ఎస్.పి. గారి సొంత ఇలాఖా కంపెనీ. ఈయన ఉన్నంత వరకూ రంగాజమ్మ కంపెనీ పై ఈగ వాలకూడదని లోగడ చెప్పిన మాట గుర్తు వచ్చి ‘అసలేందీ యేళ? అన్నీ తిరకాసు కేసులే ఎదురవుతున్నాయ్. అసలు కాగితంపై కలం పెట్టి కేసు రాసే వీలే కనబడ్డం లేదు’ అని “నువ్వు ఫో” అని ఆమెను గదిమి “నెక్స్ట్” అన్నాడు తిక్క లేచిన వాడిలా.

ఇంకొకావిడ లోపలికొచ్చింది నెమ్మదిగా.

“నీ పేరు…?” ఎదురుగా ఆగిన శబ్దానికి తలెత్తిక.

“రజియా”

‘ఏం పేరు పెడతార్రా బాబూ ఈ ముం…లకి’ ఏడవలేక అనుకుని

“మన కంపెనీ ఏంది?” అన్నాడు.

రజియా మెలికలు తిరిగిపోతూ పెద్దగా నవ్వింది. దాని నవ్వు పాడుగాను వ్రాస్తున్న కాగితం నిండా కిళ్ళీ తుంపర్లే. దాంతో మాలావు కోపం వచ్చి “ఇదేంది… తిక్కగుందా?” అంటూ లేచాడు.

“మనదే కంపెనీ అన్నందుకు నవ్వొచ్చింది సాబ్” అంది దగ్గరకొస్తూ. ‘నలభై ఏండ్ల వయస్సుంటది. ఇంకా ఇప్పుడు దేనికిదేం పోయే కాలం. పొద్దుకాల ఎవరి మొహం చూశానో’ అనుకొని “దూరం… దూరం…” అని కాగితాలు మార్చి వివరాలు వ్రాసుకున్నాడు.

***

రైటరుసాబ్ ఎంత తల బద్దలు కొట్టుకున్నా తెల్లారి కోర్టుకి పంపటానికి ఓ కేసు తప్ప మిగల్లేదు.

అన్నీ పుకడా కేసులే. కొన్ని లోపలివి. కొన్ని కేసులకు పనికిరానివి. అయినా ఎస్.ఐ. ముఖం కందగడ్డలా చేసుకుని చూశాడు. పెదవి మాత్రం విప్పలేదు.

***

మూడోనాడు…

ట్యాంకుబండ్ దగ్గర నీళ్ళ నుంచి ఓ ఆడ శవాన్ని బయటకి తీస్తుంటే కబురొచ్చి డ్యూటీకెళ్ళాడు రైటర్. తీరా చూస్తే ఆ పిల్ల పేష్కారి కూతురు. కుటుంబమంతా వచ్చి ఒక్కటే ఏడుపు గుండెలవిసేలాగా. కోర్టున జరిమానా కట్టాక ఇక బ్రతుకెందుకని పోరడు అట్నుంచి అటే పారిపోయాడట. ఈ పోరేమో ఇంటికి రాక దీంట్లో దూకి ఇట్టాగైంది. ఎంత చిన్న పొరపాటిది. అసలిది పొరపాటా? దీనికింత పెద్ద బలిదానమా? డ్యూటీ కొచ్చిన రైటరు చతికలపడి చాలా సేపు ఏడ్చాడు. బాగా తెల్సిన పోరామె.

ఎస్.ఐ నిజంగా అతడి పైనున్న ఒత్తిడిని పక్కనుంచి నిజమేమిటని అరక్షణం ఆలోచించి ఉంటే? డ్యూటీన ఉండి డ్యూటీనే చేస్తున్నట్టు ఉండడం తప్ప ఇది సక్రమంగా డ్యూటీ నిర్వర్తించడం అవుతుందంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here