ఓ స్త్రీ!!!!

3
11

[dropcap]ఉ[/dropcap]పాధ్యాయినిగా ఆ విద్యాలయంలో చేరి ఐదేళ్లు అవుతున్నాయి. పిల్లలకు బోధించే నా విషయం సంస్కృతం అయినా, ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు ‘పరీక్ష సమన్వయకర్త’ అంటే ‘ఎగ్జామినేషన్ కో-ఆర్డినేటర్’ని కూడా. విద్యాలయంలో పిల్లల్ని మన సబ్జెక్ట్ చదివించటంతో పాటూ వారి వారి నైపుణ్యాని బట్టి అదనపు బాధ్యతలు ఆప్పగించుతూ ఉంటుంది యాజమాన్యం. అనుభవము పెరుగుతున్నకొద్దీ ఆదాయం పెంచక పోయినా బాధ్యతలు మాత్రం పెంచుతూ పోతారు.

ఆ రోజునుంచే అర్ధ-వార్షిక పరీక్షలు మొదలవుతున్నాయి మా విద్యాలయంలో. వందలాది పిల్లల్ని పరీక్షలకు సిద్ధం చేస్తూ, ఇంట్లో అన్నీ పనులూ చేసుకోవటం అంటే రోజు అష్టావధానం కంటే ఏ మాత్రం తక్కువ కాదు. అనూషని బడికి తయారు చేయటం మావారి డ్యూటీ. ఆ రోజు ఒక పక్క కాఫీ తాగుతూ, వంట చేసుకుంటూ, ముగ్గురి టిఫిన్ బాక్సులు సర్దుతూ, నోటికి బాగా వచ్చిన దేముడి స్తోత్రాలన్నీ చదివేసుకుంటున్నాను. స్తోత్రాలు పూర్తి చేసుకుని దేముడికి దీపం పెట్టుకునేంతలో మావారు పిలిచారు. ఈసరికి అనూష కూడా పాలు తాగి స్కూలు బస్సు కోసం వేచి ఉంటుంది ప్రతిరోజూ. ఏమైందని అడిగితే చెప్పారు అనుషకి ఒళ్లు వెచ్చగా ఉందని. ఉస్సూరుమంది నా ప్రాణం. అదృష్టవశాత్తు ఆ రోజు చిన్న పిల్లలకు పరీక్షలు మొదలవటం లేదు. అందుచేత అనూషని బడికి పంపకపోయినా పరవాలేదు. కానీ ఇంట్లో తనకి తోడు ఎవరు ఉంటారు??? ఎంతో అనివార్యం ఐతే కానీ పరీక్షలప్పుడు ఉపాధ్యాయులు సెలవ పెట్టరాదు. మావారికి కూడా ఆ రోజు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉండింది. తను సెలవ పెట్టలేను అన్నారు. ఏం చేయటానికి తోచటం లేదు. ఇంతకు మునుపు, అవసరమైన పనికి బయటకు వెళ్లినప్పుడు కొన్ని సార్లు అనూషని ఇంట్లో ఉంచి ఇల్లు తాళం వేసి వెళ్లటం అలవాటు ఉంది. తనకి ఇప్పుడు ఎనిమిది ఏళ్లు. ఐనా జ్వరంతో ఉన్న పిల్లని ఏ తోడు లేకుండా ఎలా ఉంచి వెళ్లటం. అనూషని అడిగితే పాపం బంగారు తల్లి, నా బాధ అర్థం చేసుకుందేమో నన్ను వెళ్లి రమ్మంది.

పదకొండు గంటలకు పరీక్ష అయిపోతుంది. పన్నెండు గంటలకు నేను తిరిగి రాగలను. ఎనిమిదన్నర వరకు ఎలాగూ మా వారు ఉంటారు. అప్పుడు పని పిల్ల వచ్చాక తను ఆఫీస్‌కి వెళ్తారు. పది వరకు తను తోడు ఉంటుంది. అటు పై ఇంకో రెండు గంటలు ఒక్కర్తి ఉండాలి. అని పి‌ల్లకి నా మనసుకి నచ్చ చెప్పి, పక్క ఇంటి వారికి కొంచెం చూసుకో మని చెప్పి ఎలాగో ఏడుంపావుకల్లా నా బడికి చేరి హాజరు వేశాను.

ఆఫీస్ రూమ్ లాకర్లో క్రిందటి రోజు సిద్ధం చేసి ఉంచుకున్న ప్రతి తరగతి పరీక్ష ఫైల్స్ తీసి పరీక్ష నిర్వాహకులైన అధ్యాపకులకి అందే విధంగా ఉంచుకున్నాను. పరీక్ష నిర్వాహకుల చార్ట్ ఇంక పిల్లల సీటింగ్ అమరికకు చెందిన చార్ట్‌లు బైట నోటీస్ బోర్డు పై ఒకటి అధ్యాపకుల రూమ్‌లో ఒకటి పిన్ చేశాను. పిల్లలు, నిర్వాహకులు రావటం మొదలెట్టారు. అందరూ ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లి పోయారు. సరిగ్గా పావు తక్కువ ఎనిమిది గంటలకు ఒక గంట మోగింది. విద్యాలయం సర్దుమణిగింది. అన్నీ గదుల్లో పిల్లలు తమ స్థానాల్లో కూర్చున్నాక రెండో గంటకి నిర్వాహకులు ప్రతి సీటు పర్య వేక్షించి జవాబు పత్రాలు, ప్రశ్న పత్రాలు జత చేసి పంచి పెట్టారు. ఐదు నిమిషాల తరువాత ప్రతి సీట్ దగ్గర్కు వెళ్లి వారి జవాబు పత్రం పై తమ వివరాలు సరిగ్గా రాసేరో లేదో చూసి సంతకం పెట్టాక నిర్వాహకులు కొంత ఊపిరి తీసుకో వచ్చు. కానీ ఆ తరవాత కూడా వారు చాలా మెలుకువుగా ఉండాలి.

అప్పటి వరకు అంతా సక్రమంగా సమయానికి జరిగాక, పిల్లలు పరీక్ష పత్రాల పై దాడి మొదలు పెట్టాక నేను కూడా నా స్థానానికి వచ్చి కూర్చుని నిమిషం పాటు కళ్లు మూసుకుని తల వెనక్కి వాల్చాను. వెంటనే కళ్లముందు అనూష మొహం వచ్చింది.

నా మొహం పై భావం చూసి ఏమైందని అడిగింది తోటి ఉపాధ్యాయిని శైలజ. చెప్పింది విన్నాక “అయ్యో పాపం, వెంట తీసుకు రవాల్సింది కదా, ఇక్కడే ఏ బెంచ్ పైనో పడుకునేది కదా” అంది. “ఏమో ఇంట్లో ఉంటే సరిగ్గా రెస్టు తీసుకుంటుంది కదాని ఒక పారాసేటమాల్ డోస్ ఇచ్చి వచ్చాను. పన్నెండెంటికి ఇంట్లో ఉంటాను కదా” అన్నాను. మరో గంటకి నిర్వాహాకులకి పదేసి నిమిషాలు విశ్రాంతి ఇవ్వటానికి అప్పటి వరకు ఖాళీగా ఉన్న అధ్యాపకులు లేచారు. అలవాటుగా ఎవరి పనులు వారు చేసుకు పోతున్నారు, ఇక ఫరవాలేదని అనుకునేంతలో పదో తరగతిలో వెంటనే పిలుస్తున్నారని ప్యూను వచ్చి చెప్తే వెళ్లాను. ఆ రూములో తొమ్మిదవ తరగతి విద్యార్థి చీటితో పట్టుపడ్డాడు. వాడు రాస్తున్న పత్రం లాక్కుని మరో కొత్త పత్రం ఇచ్చి నిర్వాహకుడి పక్కనే మరో బెంచ్ పై కూర్చోపెట్టీ మళ్లీ మొదటి నుంచి రాయమని చెప్పి మొదటి పత్రం వాడి చీటీతో పాటు జత పరిచి నా అలమరలో పెట్టాను. ఇదంతా అయ్యేసరికి పరీక్ష పూర్తి అవటానికి అరగంట మిగిలింది. సరిగ్గా పదీ ఇరవై ఐదుకి ఒక వార్నింగ్ గంట ఆ తరవాత మరో ఐదు నిమిషాలకు పెద్ద గంట కొట్టే సరికి పిల్లలు బిలబిల మంటూ బైటకి వచ్చేశారు. క్రమబద్ధంగా విద్యాలయx నుంచి గోల చేయకుండా బయటకు వెళ్లటానికి మూడు అంతస్తుల మెట్ల దగ్గర ఒకొక్క అధ్యాపకులు తయారై ఉన్నారు. నేను నా టేబుల్ పై ఒకొక్క నిర్వాహకులు వచ్చి అందిస్తున్న పరీక్ష-పత్రాల్నితీసుకుని వారి వారి సంతకము రిజిస్టర్‌లో పెట్టించుకుంటూ ఆ కట్టల్ని యథా స్థానంలో పేర్చుకుంటున్నాను. ఒక అరగంటలో ఆ పని పూర్తి అయింది. ప్రతి కట్టని క్రమానుసారంగా సిద్ధం చేసి వాటిపై వాటి తరగతి/విభాగం వివరాలు రాసి అవి దిద్దవల్సిన ఉపాధ్యాయులకి అందించాను. కాసేపటికి నా టేబుల్ ఖాళీ అయ్యాక తలెత్తి చూస్తే శైలజ ఇంకా నిలబడి ఉంది. ఏమైందని అడిగితే, తనకి రావాల్సిన పరీక్ష పత్రాలు ఇంకా అందలేదన్నది. “అదేమిటి అన్నీ ఇచ్చేశానుగా. టేబుల్ పై ఇంకేమీ లేవుగా.” అంటూ పరీక్ష్ రిజిస్టర్ తీసి చూశాను. నిజమే. అందరూ తమ కట్టలు అందుకుని సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఒక్క శైలజ కాలం ఖాళీగా ఉంది. నా గుండె జారీ పోయింది. ఎంత వెతికినా ఆ కట్ట దొరకలేదు. ఇంకా విద్యాలయములోనే ఉన్న అందరు అధ్యాపకుల్ని పిలిపించాను. పొరపాటున ఒకరిది ఒకరు తీసుకున్నారేమోనని. వారి దగ్గర లేదన్నారు. అప్పటికి ఇంకా సేల్ఫోనులు ప్రచారలోకి రాలేదు. అప్పటికే ఇంటికి చేరి పోయిన ఉపాధ్యాయులకి ఫోను చేసి చూశాను. ప్రయోజనం లేక పోయింది. కొంతమంది ఇంకా ఇళ్లకి చేరలేదు. ఆర గంట వేచి ఉండి వారికి కూడా ఫోను చేసాను కానీ ఫలితం లేక పోయింది. ఇంకా ఒక్కరు మిగిలారు. ఆవిడ ఇంటికి ఫోను చేస్తే ఎవరో ఎత్తి ఆవిడ విద్యాలయం నుంచి తిన్నగా, అర్జెంట్ పని మీద పక్క ఊరుకి బస్సు ఎక్కి వెళ్లిపోయారని తెలిపారు. ఆవిడ మన ప్రధానోపాధ్యాయురాలికి దూరపు బంధువ అని గుర్తు వచ్చింది. కొత్తగా ఉద్యోగంలో చేరింది. వెంటనే ఆవిడకు ఫోను చేసి విషయం వివరించాను. మా పిల్ల పరిస్థితి విన్నపం చేసుకుని ఆ పూటకి ఇంటికి వెళ్లటానికి అనుమతి తీసుకున్నాను. ఈ తతంగం అంతా అయి టైమ్ చూసుకుంటే రెండు అవుతున్నది. పన్నెండు కల్లా ఇంటికి వెళ్లవల్సిన దాన్ని రెండైపోయింది. మర్నాడు శనివారం పరీక్ష లేదు కాబట్టి పదింటికి వచ్చి సోమవారానికి కావల్సినవి సిద్ధం చేసుకోవచ్చు. నేను శైలజ అన్నీ లాక్ చేసుకుని బైలుదేరాము. నేను పరుగులాంటి నడకతో ఇంటికి చేరీ తాళం తీసి తీయటంతో బెక్కి బెక్కి ఏడుస్తున్న అనూష నన్ను చుట్టుకు పోయింది. నుదుటి పై చేయి పెడితే మండి పోతున్నది. అప్పటి వరకు ఆపుకు ఉంచిన నాకు కూడా దుఃఖం పొంగుకు వచ్చింది. నాకు అంత ఆలస్యం అవటంతో, పిచ్చి తల్లి భయపడిపోయి జ్వరం ఎక్కువ అయిపోయింది. టెంపరేచరు చూస్తే నూట మూడు దాటింది. ఎలాగో నాలుగు ముద్దలు చారన్నం పెట్టి వెంటనే మరో పెరాసేటమాల్ డోస్ వేసి చన్నీళ్లతో ఓళ్లూ నుదురూ తుడిస్తే ఒక అరగంటకి జ్వరం తగ్గు ముఖం పట్టింది.

అనూష మెల్లగా నిద్రలోకి జారుకుంది. అప్పటికి కానీ నాకు నా నీరసం తెలిసి రాలేదు. ఇంత చారు అన్నం తిని నేను కూడా అనూష పక్కలో ఒళ్లు తెలియకుండా పడి ఉన్నాను. ఒక్క సారిగా ఉద్యోగం మీద ఎక్కడలేని విరక్తీ వచ్చేసింది. ముందూ వెనకా చూసుకోకుండా ఆ బస్సు ఎక్కి వెళ్లి పోయిన నీరజ పై చాలా కోపం వచ్చింది. అన్ని ఏళ్ళు వచ్చి అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారో తెలీదు జనాలు. పిల్లని సరిగ్గా చూసుకోలేని ఈ పాడు ఉద్యోగం ఎందుకు నాకు. పోనీ జీతాలు ఏమైనా బాగుంటాయా అంటే అదీ లేదు. పరీక్షలు అయిపోంగానే రాజీనామా ఇచ్చేయాలని అన్న నిర్ణయానికి వచ్చేశాను.

పాఠశాలలో వందలాది పిల్లలకు ఏడాది అంతా పాఠాలు చెప్పటమే కాదు, వాళ అడ్డ దిడ్డం నోట్సులు దిద్దుకుంటూ, అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా అటు పిల్లల తల్లిదండ్రులు, ఇటు యాజమ్మాన్యం చేత మాటలు పడాలి. విద్యాలయంలో ఉన్నంత సేపూ వారి బాధ్యత మాదే. ‘భావి రాష్ట్ర పౌరులగా పిల్లల్ని తీర్చి దిద్దవ ల్సిన బాధ్యత మాదే’ అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ మా జీతాల దగ్గరకు వచ్చేసరికి అంత అంత మాత్రమే. పిల్లల నోట్సులు, పరీక్ష పత్రాలు దిద్దీ-దిద్దీ నా కళ్లకి కళ్లజోడూ వంటికి స్పొండిలైసిస్ మాత్రం తెచ్చుకున్నాను. ఉపాధ్యాయినిగా నా కెరీర్ మొదలుపెట్టక మునుపు, ప్రతి ఏడాది రెండు నెలలు వేసవి సెలువలు, క్రిస్మస్ సెలవలు, పండగ సెలవలూ. ఇవన్నీ చూసి ఒక గృహిణికి గానీ తల్లికి గానీ ఇంతకు మించిన వృత్తి లేదు అన్న అపోహ ఉండేది.

సాయంత్రానికి అనూషకి జ్వరం బాగా తగ్గింది. మర్నాడు శనివారం పిల్లలకు పరీక్ష లేదు కానీ మేము హాజరు అయి పన్నెండు దాకా ఉండి రావాలి, రేపు ఇలా కాదు అనూషని వెంట తీసుకు వెళ్లి అక్కడే కూర్చోపెట్టుకోవచ్చు. సాయంత్రం మా ప్రధానోపాధ్యాయురాలికి ఫోను చేసి కనుక్కుంటే నా అనుమానం నిజమైంది, విద్యాలయం నుంచి బస్సు స్టాండుకి నేరుగా వెళ్లే తొందర్లో తన పరీక్ష పత్రాల్తో పాటూ శైలజ పత్రాల కట్ట కూడా పట్టుకు వెళిపోయింది. నీరజ కావాలని చేసిన పని కాక పోయిన తన అజాగ్రత్త వల్ల నేను శైలజ ఎంత కష్ట పడ్డాము. అంతే పరీక్షలు ఐన వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేదామన్న నిర్ణయం ఇంకా బలపడింది. అసలు ఆ నీరజ ప్రధానోపాధ్యాయురాలికి బంధువు కాబట్టి సరి పోయింది లేక పోతే యాజమాన్యం కనీసం ఒక క్షమాపణ ఉత్తరం అయినా రాయించుకోవాలి న్యాయంగా. మళ్లీ సోమవారం దాకా శైలజకి సమయం వృథాగా పోతుంది. జరిగిన దానికి ఆవిడ కనీసం పశ్చాత్తాపమైనా చెందిందో లేదో!! నేను రావటం ఆలస్యం అయి అనూష జ్వరం మెదడుకి వెళ్ళి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తల్చుకుంటేనే భయం వేసింది.

ఆ రోజు ఆఖరి పరీక్ష కూడా అయిపోయింది. పిల్లలూ అధ్యాపకులందరు వెళిపోయారు శైలజ నాకు తోడుగా ఉండి పోయింది. పరీక్ష సామగ్రి అంతా సర్దుకుంటూ నా రాజీనామా విషయం చెప్పాను శైలజకి. “తొందర పడుతున్నావేమో ఆలోచించు మరోసారి” అంది తను. “లేదు శైలూ, పిల్ల కొంచెం పెద్దయ్యే దాకా ఇంట్లో ఉంటేనే మంచిదనిపిస్తునది..” అంటూ అల్మెరాకి తాళం వేస్తున్న సమయంలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు నన్ను వెతుక్కుంటూ. నేను వారిని గుర్తు పట్టలేక పోయాను కానీ వాళు వచ్చి వంగి నా పాదాలకు దణ్ణం పెట్టారు.

నేను తెల్ల పోయి చూస్తుంటే “మమ్మల్ని మర్చి పోయారా టీచర్? నేను అశోక్, తను రవీంద్ర. టీచర్ మీరు దగ్గర ఉండి, సంస్కృతం శ్రద్ధగా చదువుకుని బోర్డు పరీక్షల్లో మార్క్స్ ఇంకా ర్యేంకు ఎలా ఇంప్రూవ చేసుకోవచ్చో చెప్పి దగ్గరుండి మాకు సాయం చేయటం వల్లే మాకు టెన్త్‌లో మంచి క్లాసు వచ్చింది మేడమ్. ఇది చెప్పటానికే మిమ్మల్ని వెతుక్కుంటూ వాచ్చాము. ఇప్పటికైనా గుర్తు పట్టారా మమ్మల్ని? మాకే కాదు టీచర్ మా బాచ్ అందరికీ సంస్కృతంలో తొంభై శాతం మార్కులు వచ్చాయి.” అంటూ వాళ్ళు అలా కృతజ్ఞతలు చెప్తుంటీ నాకు సంతోషంతో నోట మాట రాలేదు. ఒక మిఠాయి పాకెట్టు కూడా అందించారు. అప్పటి వరకు ఉన్న నిస్పృహ పోయి నాకు గాలి లో తేలి పోతునట్లు అనుభూతి చెందాను. ఇన్నాళ్లూ అంత కష్టపడి నందుకు ఇంత గౌరవమూ గుర్తింపూ చాలు. ఆ క్షణంలో ప్రతి ఆనందాన్ని డబ్బుతో కొలవలేమన్న విషయం అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. శైలజ నా వైపు కళ్లు ఎగరేస్తూ చిరునవ్వుతో చూస్తోంది ‘ఇప్పుడు ఏమంటావు, నిజంగా రాజీనామా ఇస్తావా?’ అని అడిగినట్టు అనిపించింది ఆ చూపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here