సన్నని సూదిలా గుచ్చుకునే వ్యథ “అక్టోబర్”

    2
    4

    [box type=’note’ fontsize=’16’] ” చాలా జాగ్రత్తగా గమనిస్తే కాని, చాలా విశేషాలు కంటపడక పోయే ప్రమాదం వున్న layered narrative దీనిది” అంటూ “అక్టోబర్” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

    [dropcap]ఆ[/dropcap]ర్సన్ వెల్స్ 1941 లో తీసిన క్లాసిక్ చిత్రం “సిటిజన్ కేన్” గుర్తుందా? పెద్ద భవంతిలో కోటీశ్వరుడు చార్లెస్ ఫోస్టర్ కేన్ “రోజ్‌బడ్” అన్న పదం పలికి శాశ్వతంగా కనుమూస్తాడు చిత్రం ప్రారంభంలో. మిగతా కథంతా ఆ రోజ్‌బడ్ యేమై వుంటుంది అని పలు రకాలుగా పలు వ్యక్తులు సాగించే బాహ్య (external) అన్వేషణ. కాగా “అక్టోబర్”లో “డాన్ యెక్కడ?” అని ఆరా తీస్తూ ప్రమాదవశాత్తు శివులి మూడో అంతస్తునుంచి జారిపడి కోమాలోకెళ్ళిపోతుంది, దాదాపు మొదట్లోనే. ఆ తర్వాత కథానాయకుడిలో జరిగే ఆంతరిక (internal) ప్రయాణమే/అన్వేషణే ఇందులో కథ. అప్పటిదాకా ఆమె గురించి యెక్కువ ఆలోచించని, ఆమె అంతరంగాన్నెప్పుడూ సూక్ష్మంగా గ్రహించని డాన్ లో మాత్రం పెద్ద మార్పే వస్తుంది, జీవితాన్నే మార్చేసే విధంగా. అది క్రమంగా అతన్ని ప్రేమను, జీవితాన్నీ అర్థం చేసుకునే పరిణతి అతనిలో తెస్తుంది. చాలా కాలం పాటు నిలిచిపోయే చిత్రమే ఈ “అక్టోబర్”.

    అప్పటి దాకా వాణిజ్య చిత్రాలు మాత్రమే తీస్తుండిన షూజిత్ సర్కార్ 2005లో “యహాఁ” తో చిత్ర రంగంలో ప్రవేశించాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రాలు “వికీ డోనర్”, “పికూ”, “పింక్” లు. మూడవది రచన మాత్రమే, దర్శకుడు అనిరుధ్ధ రాయ్ చౌధరి. అయితే “అక్టోబర్” తో అతను ఇంకాస్త ముందుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే కాని, చాలా విశేషాలు కంటపడక పోయే ప్రమాదం వున్న layered narrative దీనిది. కాసేపు నాకే అనుమానం వచ్చింది ఇదేమన్నా సంతోష్ శివన్ చిత్రమా అని. నిజంగా సినెమాని సినెమాగా చూసి ప్రేమించేవాడికి ఇది ఫుల్ మీల్సే.

    డాన్ (వరున్ ధవన్) వొక అయిదు నక్షత్రాల హోటెల్లో అప్రెంటీస్ మీద వుంటాడు. అతనితో పాటే సహ విద్యార్థులు కూడా. ఆ శిక్షణా కాలంలో యెలాంటి మచ్చా రాకుండా చూసుకుంటే చేతికి పట్టానే కాక మంచి ఉద్యోగావకాశాలు కూడా వుంటాయి. కాని పక్షంలో పట్టా రాకపోవడమే కాదు, మూడు లక్షలు చెల్లించాల్సి వస్తుంది, ఆ మచ్చ వున్నందువల్ల ఉద్యోగావకాశాలకీ గండి పడుతుంది. మిగతా వాళ్ళందరూ వొళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నా, డాన్ మాత్రం నిర్లక్ష్యంగా, తిక్కతిక్కగా వుంటాడు. కోపమెక్కువ. మాట పడడు. వయసుకు తగ్గ పరిణతి రానివాడు. అందరూ స్నేహితులే కాబట్టి ఇతని మీద కోపం వున్నా, అతను ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు అందరూ అతన్ని వెనకేసుకొచ్చి ప్రమాదం నుంచి కాపాడుతుంటారు. వాళ్ళల్లో శివులి వొకతె. నెమ్మది, వోర్పు, సహనం, స్నేహం, తెలివితేటలు అన్నీ వుండి బాస్ కి ఫేవరెట్. తనకు పారిజాతాలంటే (శివులి పూలు) చాలా ఇష్టమని ఆమెకా పేరు పెట్టింది వాళ్ళమ్మ. అక్టోబర్ మాసంలో కొంత కాలం మాత్రమే పూచే ఆ పూలు సేకరించి దగ్గర పెట్టుకుంటుంది. అవి గదిలో నేలపాలై కనబడగా సోఫాలో అడ్డంగా పడుకున్న డాన్ ని అడుగుతుంది. నేను పడేయలేదంటాడు నిర్లక్ష్యంగా. పోనీ యెత్తి పెట్టొచ్చుగా అంటుందామె. ఇది యెందుకు వివరిస్తున్నానంటే డాన్ body language అతని మానసిక పరిస్థితికి తగ్గట్టుగా చూపడమే కాకుండా అతని మీద ఆమెకు వున్న ప్రత్యేక శ్రధ్ధ వాచ్యంగా కాకపోయినా చూచాయిగా వ్యక్తపరచడానికి. అతను అర్థం చేసుకుంటేనే కదా ప్రతిస్పందించేది. ఇలా వుండగా వొక రాత్రి పార్టీలో ఆమె పిట్టగోడెక్కి కూర్చోబోతూ ప్రమాదవశాత్తు ఆ మూడో అంతస్తునుంచి కిందపడి స్పృహ కోల్పోతుంది. ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆమె కోమాలోకెళ్ళిపోయింది, చాలా తీవ్రమైన గాయాలయ్యాయి, ICUలో వుంచాలి, యే విషయమూ నిర్ధారణగా చెప్పలేమంటారు డాక్టర్లు. అందరూ చూడటానికి వెళ్ళినట్టే డాన్ కూడా వెళ్ళి ఆమెను చూసి వస్తాడు. ఆ తర్వాత రూంలో స్నేహితులు మాటల మధ్యలో అంటారు చనిపోవడానికి క్షణం ముందే ఆమె డాన్ యెక్కడున్నాడని ఆరా తీసిందీ అని. అది విన్న డాన్ కి మనసు యేదోలా అయిపోతుంది. నన్ను తలచుకుందా? యెందుకు? చెప్పడానికి ఆమె స్పృహలో లేదు.  స్లోగా సాగే కథనం మనసు పెట్టి చూడకపోతే అతనిలో పరిణామం యెంత సూక్ష్మంగా చూపించాడో తెలియకుండా పోతుంది. ఆ రోజు నుంచి అతడు రోజూ ఆసుపత్రి డ్యూటి. యెవరూ చెప్పకుండానే అన్నీ నెత్తినేసుకుని కావలసిన వ్యక్తిలా మసలుతాడు. శివులి బాబాయి ప్రాణాలకు భరోసా లేనప్పుడు ఇంత ఖరీదైన వైద్యం అవసరమా అని నిరుత్సాహపరుస్తున్న వేళల్లో డాన్ శివులి తప్పకుండా బతుకుతుంది, అంత తొందరగా వోటమి వొప్పేసుకుంటామా అంటాడు. తల్లి (తను IIT Professor, single mother) కూడా నా దగ్గర దాచుకున్న సొమ్ము వుంది, ఇన్సురెన్సు కూడా వుంది, వైద్యం చేయిద్దామంటుంది. నెమ్మదిగా ఆ బాబాయి కూడా మళ్ళీ కనపడడు చివరివరకూ. రోజూ ఆసుపత్రికి వెళ్ళడం, కోమాలో వున్న ఆమెతో మాట్లాడడం, ఆమెకు స్పృహ లేదని తెలిసినా, హోటెల్ కి సెలవలు బాగా పెట్టడం, పనిమీద శ్రధ్ధ పోవడం వీటన్నిటి మధ్యా ఆమెమీద అతని ప్రేమ క్రమంగా పెరగడం చూస్తాము. అక్కడి డాక్టర్లతో వివరంగా మాట్లాడుతూ వుండడం, రోజూ శివులి మంచం కింద వేలాడుతూ వున్న మూత్రపు సంచిని గమనిస్తూ వుండడం, యెవరూ లేనప్పుడు అర్జంటుగ మందులవసరమైతే మిత్రుల దగ్గర ఇరవైవేలు అప్పు చేసి తీసుకు రావడం, ఇలా యెన్నని చెప్పాలో, యెక్కడితో ఆపాలో తెలీదు. మొదట్లో ఆ అయిదు నక్షత్రాల హోటెల్లో పనితీరు కొంత వివరంగా, తర్వాత ఆసుపత్రి ICUలో వివరాలు మరికొంత వివరంగా చెప్పినా దర్శకుడు యెక్కడా మూల వస్తువుని విస్మరించలేదు. ఈ సినెమాలో ఆర్థర్ హేలీ “హోటెల్” లాగా, రాబిన్ కూక్ “కోమా” లాగా వివరణలకు పోతే సినెమా డాక్యుమెంటరి అవుతుందేమోగాని సూదిలా గుచ్చుకునే వో అపురూపమైన కథగా వుండబోదు. అతని షిఫ్టులు కూడా స్నేహితులు చేసి పెడతారు, కాని ఇతన్ని కోప్పడతారు నీ కెరీరు చూసుకోవా అని. బాస్ కూడా వార్నింగు ఇస్తాడు, అతని ఇంటికి కూడా ఫిర్యాదు వెళ్తుంది. డాన్ తల్లి కొడుకును నచ్చచెబుదామని వస్తుంది, కాని ఇక్కడి పరిస్థితులు చూసి అతన్ని యేమీ అనలేక తన కడుపులో బాధ శివులి తల్లికి చెప్పి వెళ్ళి పోతుంది. శివులి తల్లి కూడా అపరాధభావనతో ఇక మా వ్యవహారాలు మేము చూసుకుంటాము నువ్వు నీ పని మీద శ్రధ్ధ పెట్టు అంటుంది డాన్‌తో. ప్రపంచం తల్లకిందులైనా డాన్ మాత్రం దీక్షగా తనపని చేసుకుంటూ పోతాడు. వైద్యానికి స్పందించో, డాన్ సేవలకు స్పందించో మరొకటో శివులిలో కొంత మార్పు వస్తుంది. ఇంకాస్త ఆరోగ్యం బాగా అయ్యింది అనిపించుకుని ఆమెను డిస్చార్జ్ చేస్తారు. ఇప్పుడు డాన్ డ్యూటి ఆ ఇంట్లో. మళ్ళీ పారిజాతాలు పూసే వేళ కూడా వచ్చింది. కాని ఈ సారి శివులి దక్కకుండా పోతుంది. ఆమె కుటుంబం ట్రిచి కి మారిపోతారు. శివులి యెంతో ఇష్టపడ్డ ఆ ఇంట వున్న పారిజాతం చెట్టును జ్ఙాపకంగా డాన్ తన వెంట తీసుకెళ్తాడు.

    జులాయి, పోకిరి, బాధ్యతారహితుడైన డాన్ జీవితాన్నీ, ప్రేమనూ అర్థం చేసుకున్న క్రమం చాలా సూక్ష్మంగా వుంది. అలాగే కాకుండా ఇష్టసఖి దగ్గరే వున్నా, వదలని ఆ యెడబాటు, ఆమె అనారోగ్యము, చివర్న ఆమె మృత్యువు కలిగించే వ్యథ సన్నని సూదిలా గుచ్చుకుంటూనే వుంటుంది అతనికీ, ప్రేక్షకుడికీనూ.

    గాఢమైన ప్రేమకథా చిత్రాలు నేను యెన్ని చూశాను? అందులో మరువలేనివి యెన్ని? 80లలో చూసిన అరవిందన్ “చిదంబరం” ఇప్పటికీ వెంటాడుతూనే వుంది. ఇది యెన్నేళ్ళో వెంటాడబోతూ వుంది. చిదంబరంలో కనీసం శంకరన్ చివర్న శివగామిని చిదంబరం గుడి మెట్ల దగ్గర చూస్తాడు. ఇందులో వీళ్ళ యెడబాటు శాశ్వతం. ప్రేమకు అదనంగా చిదంబరంలో guilt వుంటే అక్టోబర్ లో grief వుంది. రెండూ వెంటాడేవే, వేధించేవే.
    కొత్తగా వచ్చిన బనితా సంధు బాగా చేసింది. తల్లి పాత్రలో గీతాంజలి రావు, డాన్ గా వరున్ ధవన్ కూడా బాగా చేశారు. వరున్ ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఇది చేయగలిగినందుకు. కాని యెందుకో నా మనసు ఇది చెప్పకుండా వుండలేకపోతున్నది. లోతైన ఈ పాత్రను విక్కి కౌషల్ గాని, రాహుల్ భట్ గాని మరొకరు గాని చేసుంటే ఇంకా బాగుండేది అని. మూడుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న అవిక్ ముఖోపాధ్యాయ సినెమేటోగ్రఫీ అందంగా, మారుతున్న రుతువుని బట్టి ఢిల్లీ ని, ప్రకృతిని బాగా పట్టుకుంది. పాటలు, శంతను మొయిత్రా సంగీతమూ బాగున్నాయి. జుహి చతుర్వేది రచన, షూజిత్ సర్కార్ దర్శకత్వం యెప్పటిలానే అద్భుతంగా వుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here