ఒక దీపశిఖలో పెక్కు కరదీపాలు

0
9

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఇది. రచన పాండ్రంకి సుబ్రమణి. [/box]

[dropcap]రా[/dropcap]ములయ్య గురించి విన్నానే గాని అతణ్ణి నేరుగా చూసెరగను. కారణం – మేమిద్దరమూ ఒకే బ్లాక్ బిల్డింగులో పని చేయడం లేదు. అంతకు ముందెప్పుడూ చేసి ఎరుగం. అందులో ఐదొందల మంది మధ్య పని చేసేటప్పుడు వచ్చీ పోయే వారందరినీ పొల్లుపోకుండా గుర్తుపెట్టుకోడం అంటే మాటలా – ఎంతమంది పేర్లు గుర్తుంచుకుంటాం – ఎంతమంది ముఖారవిందాలను మనసున ముద్ర వేసుకుంటాం – కాని చాలా రోజుల తరవాత రాములయ్యను సరాసరి చూడటం తటస్థించింది. ఎలాగని – మా ఎన్‌ఫోర్సుమెంటు సెక్షన్‌కి ట్రాన్స్‌ఫరయి వచ్చాడు. అతడు వచ్చి చేరకముందే చాలా మంది స్టాఫ్ అతడి గురించిన బయోడేటా ఇచ్చేసారు. మంచి వర్కర్ అన్నారు. చిత్తశుద్ధితో కర్తవ్య నిర్వహణ చేసే మనిషిని కితాబునిచ్చారు, కాని దానితో బాటు మరొకటి జోడించారు. అది విన్న తరువాతనే నాకు కంపరం వంటిది కలిగింది. రాములయ్య తీక్ష్ణ మనోభావాలు గల వ్యక్తట. వేగం కంటే ఉద్వేగం ఎక్కువట. అలా కంపరం కలగడానికి మరొక కారణమూ ఉంది. అతడి ప్రక్క సీటే నాది. అందులో అతడికి అప్పగించేబోయే టాస్క్ సెన్సిటివ్ టైపు. అది కావాలని – ఇది కావాలని – అది జరగలేదని – ఇది జరగలేదని తూనీగల గుంపులా క్షేత్ర స్థాయి స్టాఫ్ వస్తుంటారు. హడావిడి చేస్తుంటారు. ఉద్వేగపరుడాయె – వాళ్ళందరికీ ఇతగాడు ఎలా సమాధానపరుస్తాడో మరి.

కాని ఆశ్చర్యం – రాములయ్య వచ్చిన తరవాత – అతడి అసలు రూపం చూసిన తరవాత నాలోని అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నుదుట పేరుకు తగ్గట్టు నిలువు రామనామం – మధ్య సావిడితో కుదురుగా దువ్వుకున్న జుత్తు. మంచి బాలలు బుద్ధిమతులు జుత్తు అలాగే నున్నగా దువ్వుకుంటారని నా చిన్న ప్రాయంలో మా పెద్దమ్మ నా తలకు తైలం పూస్తూ తెగ హడావిడి చేసేది. నేనేమో కుర్ర బుద్ధితో సినీ హీరోలను కాపీ కొట్టడానికి జుత్తు చిందర వందరగా ఎగిరేలా దువ్వటానికి ప్రయత్నించే వాడిని. ఆమెగారు గాని బ్రతికుండి రాములయ్యను చూస్తే బుగ్గలు రెండూ చిదిమి అక్కున చేర్చుకునేదే. ఇంకొకడుగు ముందు కేసి చెప్పాలంటే – మా పెద్దమ్మ చివరి రోజుల వరకూ నాపైన పిర్యాదు చేస్తూనే పోయింది, నుదుట బొట్టు చాలా చిన్నదిగా పెట్టుకుంటానని – కనిపించనే కనిపించని రీతిన- మొత్తానికి రాములయ్య మా పెద్దమ్మకు నచ్చే మంచి బాలుడేనేమో!

కాని అతడి రొటీన్ వ్యవహారం చూస్తుంటే వ్యవహారం అలా సాగదేమో! ఆరోజు నేనలా క్యాంటీను వైపు వెళ్తున్నప్పుడు క్లబ్బు కార్యదర్శి కోదండం ఎదురు వచ్చాడు, నా గురించీ నా బాగోగుల గురించో ప్రస్తావించలేదు. సరాసరి కొత్తగా చేరిన మా సెక్షన్ మేట్ రాములయ్య గురించే ప్రస్తావించాడు.

“మీ సెక్షన్‌లో ఆన్యువల్ అకౌంటు వర్క్ స్టార్ట్ చేసేసారేమిటి? దానికి ఇంకా టైముందిగా!” అన్నాడు.

నేను నిజంగానే నివ్వెరపాటుతో చూసాను, అటువంటిదేమీ లేదే-అన్న మొఖభావాన్ని ప్రదర్శిస్తూ.

“మరి మీ సెక్షన్ స్టాఫ్ రాములయ్య ఒక్క హాలీడే కూడా తప్పిపోకుండా ఆఫీసుకి వచ్చి వెళ్తున్నాడు. రికార్డులు తెగ వేగంతో అప్‌డేడ్ చేస్తున్నాడన్నది తెలియదా?”

తల అడ్డంగా తిప్పాను.

“నేనొకమాట అంటాను. మరేమీ అనుకోవు కదా!”

మరొక మారు తల అడ్డంగా తిప్పాను ఏమీ అనుకోనని.

“మీ సెక్షన్ సూపర్‌వైజర్ మాట అటుంచు-అతడెప్పుడూ మేనేజిమెంటు వేపే ఉంటాడు. యూనియన్ మీటింగులకు రమ్మంటే జడుసుకుంటాడు. మరి మీకేమయిందయ్యా! అంతే వేగంగా యుద్ధ ప్రాతిపదికన ఆరంభించేసారు! మీకెవరికైనా గోల్డ్ మెడల్ ఇస్తానన్నారా!” ఆ మాటంటూ కోదండం విసురుగా మరుచూపు లేకుండా వెళ్లిపోయాడు.

నాకు నిజంగానే ఖంగు తిన్నట్లయింది. జూన్‌లోనో జూలైలోనే ముగించవలసిన ఆన్యువల్ అకౌంట్సు వర్క్స్ జనవరిలోనే ఆరంభించేసాడా మా సెక్షన్ మేట్ రాములయ్య!

నేనిక నిలవలేక పోయాను. క్యాంటీను వేవు సాగకుండా వెనక్కి తిరిగి సరాసరి రాములయ్యను కన్‌ఫ్రంట్ చేసాను – “ఎప్పుడో ఆరంభించవలసిన ఆన్యువల్ వర్క్ ఇప్పుడే ఆరంభించి త్వరత్వరగా పూర్తి చేసి పై అధికారుల చూపులో మా అందరినీ చులకన చేసి మా కొంప మంచాలని చూస్తున్నావా! అసలు మాకెవరికీ వేళ్ళకు చన్నీళ్ళలా దొరికే ఓ.టీ లేకుండా చేసి తీరాలన్న పట్టుదలతో వచ్చావా యేవిటి? ఇదేనా కష్టమూ నష్టమూ సహోద్యోగులతో పంచుకోవలసిన లక్షణం? అసలు ఆన్యువల్ వర్కు ఆరంభించమని సర్క్యులర్ ఎప్పుడొచ్చిందని? అంటే మేనేజిమెంట్ చెంచా మన సెక్షన్ సూపర్‌వైజర్‌తో నువ్వు కూడా కలసిపోయావన్న మాట!” అన్నాను.

రాములయ్య చెదరలేదు. తగ్గలేదు. నవ్వే కళ్లతో చూసాడు సర్వజ్ఞత సాధించిన జ్ఞానిలా. మళ్లీ నాకు మా పెద్దమ్మ ముఖం గుర్తుకొచ్చింది. రాములయ్యలాగే మనిషన్న వాడు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండాలనేది ఆ మహాతల్లి.

“చూడు సుబ్రహ్మణ్యా! నేనెన్నటికీ మన సూపర్‌వైజర్‌తో చేరను. మీతోనే కలసి ఉంటాను. ఇక విషయానికి వస్తే మనం పెళ్ళయిన వాళ్లం. పెళ్లాం బిడ్డలు గలవాళ్లం. ప్రతిదానికీ పై అధికారుల నుండి ఆదేశాలు సలహాలూ ఎదురు చూడకూడదు. ఇంకా చెప్పాలంటే మనకున్న అనుభవంతో మనమే కొన్నిటిని మనకు మనంగా అదుపులోకి తీసువాలి. ఇక రెండవది. నేనిప్పుడు బేసిక్ అప్డేషన్ వర్క్స్ మాత్రమే ఆరంభించాను – పని పూర్తిగా ఏప్రిల్ లోపున ఐపోయినా నేను పేపర్స్ అన్నిటినీ మీతో బాటే సబ్‌మిట్ చేస్తాను. సరేనా!”

“మరి దానికెందుకు ఇంత తొందర?”

“నాదొక విధమైన అలవాటు- చిన్నపాటి వేగిరపాటు- డూ యూ మైండ్?”

ఎలా బదులివ్వాలో తెలియక వెనక్కి తిరిగాను. మొత్తానికి అతడి మాట జలపాతంలా దూకుడుగా వచ్చి నాకెక్కడో తగిలినట్లనిపించింది.

రాములయ్య మాలా మందు పుచ్చుకోడు. మందు పార్టీలకు రాడు. కనీసం మంచి నాన్ వెజ్ దొరుకుతుంది, రమ్మంటే కూడా రాడు. త్రేతాయుగంలో ఉన్నట్టు అటువంటిదంతా దుష్ట సాంగత్యం అనుకుంటాడు. కావున ఆ రోజు పెళ్లి కాబోయే ఒక మిత్రుడిచ్చిన మందు పార్టీలో పాలు పంచుకుని కడుపార చికెన్ రోస్ట్ మటన్ రోస్ట్ ఆరగించి స్పార్కిలింగ్ లిక్కర్ తీసుకుని దారి మధ్యలోనే ఉన్న రాములయ్య ఇంటికి వెళ్లాలని మేం ముగ్గురమూ-అంటే నేనూ, ప్రకాశ కుమార్, వేదమూర్తీ తీర్మానించాం.

రాములయ్యది ఇండిపెండెంటు ఇల్లు. అప్పట్లో ఇంటి స్థలం కాస్తం చౌక ధరకు లభించడం వల్ల ఊరి పొలిమేరన కట్టుకున్నాడు. ఇంటి వైశాల్యం ఆరు వందల స్క్వేర్ ఫీట్సుకి పైనుండదు. కాని ఇంటి ముందూ ఇంటి చుట్టూ బోలెడంత ఖాలీ స్థలం. చుట్టూరా ఎడాపెడా పెంచిన చెట్లూ చేమలూను. అప్పుడప్పుడు వాళ్ల పెరట్లో పెంచిన ఆకుకూరలు వండి తెచ్చి మాకు మహపసందుగా ఫీలవుతూ మధ్యాహ్న వేళ ఇస్తుంటాడు. ఇందులో అతడంత మానసికంగా ఫీలవడానికేముందో నాకు బోధపడేది కాదు. ఆకుకూరలు మార్కెట్టులో దొరకవా! ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధమైన వెర్రి – వేపకాయంత వెర్రి.

మేం వెళ్లేటప్పటికి రాములయ్య యమ బిజీగా ఉన్నాడు. మాకు ఆశ్చర్యం కలిగించింది అతడు బిజీగా ఉండటం కాదు. ఎందుకంటే అతడెప్పుడూ బిజీయే – కాని అతడి భార్యామణి-కూతురూ కొడుకూ కూడా అదే రీతిన బిజీగా కనిపించారు. విశాలమైన వాళ్ళింటి ఆవరణలోకి ప్రవేశించి ముగ్గురమూ తలెత్తి చూసాం. మేడింటి బాల్కనీలో ఏదో విచిత్రమైనదేదో చేస్తున్నట్టున్నారు. నవ్వు ముఖంతో మాకు ఎదుర్కోలు పలికిన రాములయ్యను అడిగాం ఏమిటీ హడావిడని.

“ఇది కొంచెం సీరియస్ మేటర్. మీకు అర్థమవుతుందో లేదో గాని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ఏడాది వర్షాలకు వరదలు రాక్షస అలలను తోడుతీసుకుని తీవ్రమైన రీతిన రావచ్చట. వరద నీటిమట్టం ఎంత పైకైనా వెళ్ళొచ్చంటున్నారు. అటువంటి విపత్తు జరగదనే అనుకుంటాను. కాని కీడెంచి మేలెంచమన్నారుగా! అందుకుని ముఖ్యమై వంటింటి సామగ్రిని ఎక్స్‌ట్రా పడకల్నీ బాల్కనీ గదికి చేరవేస్తున్నాం. వరదలు ముంచుకు వస్తే రేపు మేం అక్కడేగా ఉండాలి!” ఆ మాట విన్నంతనే ముగ్గురమూ దిగ్భాంతికి లోనయాం. ఇంతటి ముందుచూపా! ఇతడికేదో కంపల్సప్ మెంటల్ డిసార్డర్ ఉన్నట్లుంది.

“అంతలావు వర్షాలు వస్తాయని నీకెవరు చెప్పారు?” ముగ్గురమూ ముక్త కంఠంతో అడిగాం.

“మీరు పత్రికలు పూర్తిగా చూడటం లేదేమో! గత పది సంవత్సరాల యావరేజ్ వర్షపాతాన్ని విభజించి వాతావరణ శాఖవారు రేడియో ద్వారా పత్రికల ద్వారా ప్రకటన ఇచ్చారు” అన్నాడు.

ఆ మాట విని – ‘ఓరి నీ జిమ్మడా! వాళ్ళ వాక్కునా వేదవాక్కుగా తీసుకుంటున్నావు!’ అని మనసున అనుకుంటూ పైకి ఇలా అన్నాను -“వాళ్ల ప్రకటనను అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదు రామా! వాళ్లు ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయంటారో అప్పుడు ఎండలు మల మల మండిపోతుంటాయి. ఎప్పుడెప్పుడు ఎండలు కాస్తాయంటారో అప్పుడు వర్షాలు ఎడాపెడా బాదేస్తుంటాయి. ఒక వేళ వాళ్ళంటున్నట్టు వర్షాలు వచ్చినా తలపై కట్టుని దాటుకుంటూ ప్రవహించవు. ఇదంతా కట్టిపెట్టి టీవీ ప్రోగ్రాములు చూస్తూ ఈ పూట హాయిగా గడుపు. మరొకటి నీ భయంకరమైన బుద్ధుల్ని నీ పిల్లలకు అంటనీయకు” అంటూ నేను ప్రకాశ్ కుమార్‌నీ, వేదమూర్తినీ బయల్దేరదీసాను. మరి కొంతసేపు అక్కడే ఉంటే రాములయ్య భార్య మాకు కాఫీయో లేక టీయో ఇస్తుందని మాకు తెలుసు. కాని వాటిని తీసుకోవడం మాకు ససేమిరా ఇష్టం లేదు, అది గాని తాగితే పార్టీలో తీసుకున్నదంతా ఒక్కపెట్టున దిగిపోతుందిగా.

ఆ యేడు వర్షాలు చుట్టపు చూపులా వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయాయి. కాని జనం ఏ మాత్రమూ ఎదురు చూడని విధంగా వాతావరణంలో మట్టుకు తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతగా అంటే – ఆకాశంలోకి తలెత్తలేనంతగా, దుర్వాసుడు వంటి మహర్షి ఎవరో శాపం విడిచినట్టు చెరువులూ దొరువులూ వంకలూ కాలువలూ ఎండిపోయాయి. బోరు బావులు అడుగంటిపోయాయి. నాలాలు నీటి చుక్కల్ని చిందించలేక బిక్కముఖాలు వేయనారంభించాయి. రైతులు కొందరు పశువులకు మేత ఇవ్వలేక, మళ్ళకు సాగునీరు అందివ్వలేక చుట్టుపక్కల సంతలకు వెళ్లి నాలుగు కాళ్ళప్రాణుల్ని అమ్ముకుంటున్నారు. ఆ లోపల నీరు కటాబొటిగా వస్తూన్న కుళాయిల వద్ద ఆడాళ్ళ మధ్య కుమ్ములాటలు ఆరంభమయాయి-వాటర్ వార్స్ లా.

ఇది చాలదని మా ఇంట్లో ఒకటే పోరు -మా ఆవిడేమో మంచివి, పచ్చటి కాయగూరలు తెమ్మని-పిల్లలేమో మంచి చేపలు తెమ్మని గోలగోల. కొన్ని విషయాలు తప్పవు కదా! నెత్తిన టోపీ వేసుకుని తెల్లటి నిండు చేతుల జుబ్బా తొడుక్కుని బైట ధరలు మరీ ఎగిసి పడుతాయని వారపు సంతకు బయల్దేరాను. నాకు షాక్ తిన్నంత పనయింది. నేను గేటు దగ్గరకి చేరుకునే ముందే  ప్రకాశ్ కుమార్, వేదమూర్తి ఇద్దరూ ఖాళీ సంచులతో తిరిగొస్తున్నారు. నన్ను చూసి నేను అడక్కుండానే ఫిరంగి మ్రోగించారు “కూరగాయల బళ్లు ఇంకా రాలేదుట. వస్తాయన్న గ్యారంటీ కూడా లేదట. కూరగాయల బళ్ళను మధ్యలోనే అటకాయించి ఊరి జనం కొనుక్కుపోతున్నారంట. బహుశః కరువు వ్యాపిస్తుందేమో!”

నేను బదులివ్వలేదు. చుట్టూ పరకాయించి చూస్తూ అడిగాను – “మరి మన రాములయ్య వచ్చినట్టు లేడే!” అని.

దానికి వాళ్ళు బదులిచ్చారు – “అదే మాకూ ఆశ్చర్యంగా ఉందోయ్. కాయగూరలు కనుక్కోవడానికి అతనెక్కడకు వెళ్తున్నాడో! గత వారం రోజులుగా వస్తూ పోతున్నాం. అతడు ఒక్కసారిగా కూడా కనిపించలేదంటే నమ్ము”.

అప్పుడు నా మనసున ఒక వింతైన ఆలోచన చెణుక్కుమంది. “ఇప్పుడు చీకట్లో దోబూచులాటెందుకు? అదిగో షేర్ ఆటో వెళ్తుంది. అందులోకి ఎక్కి తిన్నగా రాములయ్య ఇంటికి వెళదాం. కొత్త ఆలోచనలతో వింతైన పనులు ఏవేవో చేస్తుంటాడు. తెలుసుకుని వద్దాం. బీ క్విక్!” అంటూ వాళ్ల జబ్బలు అందిపుచ్చుకుని షేర్ ఆటో వేపు నడిపించాను.

షేర్ ఆటోనుండి దిగి వీధి మలుపు తిరిగామో లేదో గాని, మా ముగ్గురినీ నివ్వెరపాటు అట్టహాసంతో చేతులు చాచి ఆహ్వానించింది. రాములయ్య వాళ్ల ఇంటి ముందు పెద్దపాటి వరుస క్యూ కట్టి ఉంది. ఏమయి ఉంటుందబ్బా అనుకుంటూ ముగ్గురు మా కళ్ళు విప్పార్చి చూసాం. అందరూ స్త్రీలే – ప్లాస్టిక్ బిందెలు పెట్టుకుని నిల్చున్నారు. వడిగా నడచి స్పాట్ దగ్గరకు చేరాం. రాములయ్య దంపతులు వాళ్లిద్దరి పిల్లలూ కలసి యిరు ప్రక్కలా ఉన్న బావుల్లోంచి నీళ్లు తీసి పోస్తున్నారు. నాకప్పుడు ఆశ్చర్యానికి మించిన ఆశ్చర్యం కలిగింది. ఊరంతటా బావులూ చెరువులూ దొరువులూ అడుగంటి పోయినప్పుడు వీళ్ల బావుల్లో మాత్రం నీళ్ళెలా ఊరుతున్నాయి! అదీను అంతమందికి ఎలా పోసివ్వగలుగుతున్నారు! మేం వెంటనే ఆలయ ప్రవేశం – సారీ – ఆవరణ ప్రవేశం చేయలేదు. దూరంగా చూస్తూ నిల్చున్నాం. మరి కొద్దిసేపట్లో నీటి సరఫరా ఆపుచేసి ఇంటి గేటు మూస్తున్నప్పుడు మేం “హల్లో రాములయ్యా!” అంటూ స్నేహభావంతో పలికి ముక్తకంఠంతో అడిగాం – “నీటి దానమా! అంటే ప్రాణదానమేనన్న మాట! పోతే మాకు తెలియని బ్రహ్మరహస్యం మాకు దాపరికం లేకుండా చెప్పాలి. చెప్తావా మిత్రమా!”

భార్యాభర్తలిద్దరూ నవ్వు ముఖాలతో తలలూపారు.

“ఊరంతా ఎండిపోతున్నప్పుడు మీ బావుల్లో మాత్రం ఇంతటి నీటిపొంగు ఎలా వస్తూందో!”

“సింపుల్ అడ్వాన్స్ యాక్షన్”

“అంటే?” అన్నట్టు చూసాం ప్రశ్నార్థకంగా.

“అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్-అంటే-మాకున్నది మిగులు భూమే కదా! నలువైపులా ఇంకుడు గుంతలు సైంటిఫిక్ రీతిన తవ్వాం. నేల పై నుండి నీటిని, చివరకు చెట్టు పైనుండి రాలే నీటి చుక్కల్ని సహితం పోనివ్వకుండా ఒడుపుగా ఛానలైజ్ చేసి నీటి గుంతల్లోకి పోనిచ్చాం, నాలుగు సంవత్సరాలుగా మేం రెయిన్ హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాం”

“ఇంతటి నిర్మాణాత్మకమైన యోచన ఎవరిచ్చారో!”

“ఇంకెవరు-ఎప్పుడూ హెచ్చరికలు జారే చేసే మన వాతావరణ శాఖ నిపుణులే” అంటూ మా ముగ్గరి చేతుల్లోనుంచి ఖాళీ సంచుల్ని అందుకుని పెరడు వేపు వెళ్ళి సంచుల నిండా బెండకాయలూ, గుత్తి వంకాయలూ టమోటాలూ, ములంకాడలూ నింపుకుని వచ్చి మా చేతికి ఇచ్చాడు. మాకు ఆశ్చర్యానందాలతో నోట మాట రాక “వెళ్ళొస్తాం” అని కదలబోయాం.

అప్పుడు మరొకసారి మమ్మల్ని ఆపాడు రాములయ్య. ఆపి వాళ్ల ఇంటికి కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్లాడు, మరి కాసేపటికి పెద్దపాటి పోలిథిన్ సంచిలో ఆరు పెద్ద చేపల్నుంచి అందిచ్చాడు. మాకు బుర్రలు తిరిగినంత పనయింది. ఇంటి ఆవరణలో చేపల కొలనా! అందులో చేపల వేటా! చేపల్ని అందిచ్చి, అదే నవ్వు ముఖంతో అన్నాడు- “మా ఇంటి ఇద్దరి నలుసులకూ చేపలంటే చాలా ఇష్టం. ఒకరోజు చేపల్లేవంటే వాళ్ళకు ముద్ద దిగదనుకో! కావున-మాకు చాలినంత ఖాళీ స్థలం ఎలాగూ ఉందిగా – గట్టి కంచె కట్టి లోతైన కొలను తవ్వి రొయ్యల్నీ చేపల్ని పెంచుతున్నాం. ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పడు చేతి వాటంగా అందుకుని వండుకుంటాం. ఇంటికి వచ్చి పోయే బంధువులకీ వండి పెడ్తుంటాం. మరొకసారి గాని వస్తే రొయ్యలు పట్టి ఇస్తాం. ఈజిట్ ఓకే!”

నాకు మాట రాక గొంతు గద్గదికమై అతడి రెండు చేతుల్నీ అంది పుచ్చుకుని గొణిగినట్లన్నాను-“అన్నిటి కన్నా మేలైన విషయం ప్రతి ఉదయం పూటా భార్యాబిడ్డలతో కలసి వాడలోని స్త్రీలకు తాగు నీరివ్వడం”.

“నిజం చెప్పాలంటే… మేం ఒక పూట కాదు. రెండు పూటలా ఇస్తున్నాం. ఎలాగంటే-ఉదయం పూట అందరికీ యిస్తే -సాయంత్రం పూట మాత్రం గర్భిణీ స్త్రీలకు, వృద్ధ స్త్రీలకు బావినీళ్లు పోసిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉదయపు ఎండల్లో జనం తొక్కిడిలో నిబ్బరంగా నిల్చోలేరుగా!”.

ఆ మాటతో నేను పరవశుడినయి రాములయ్యను అమాంతం కౌగలించుకున్నాను.

పురుషార్థాలు నాలుగు. ధర్మం-కామం-అర్థం-మోక్షం. వీటిలో దేనికితడు అర్హుడవుతాడు? దేనికేమిటి-నాలుగింటికీ పరిపూర్ణంగా అర్హుడే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here