కాజాల్లాంటి బాజాలు-88: ఒక గొప్ప భారతీయ పాకశాల

2
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య బైటకి ఎక్కడికీ వెళ్లకపోవడంతో టైము గడవడానికి ఇంట్లోనే ఏదోరకంగా కాలక్షేపం చేసుకునే క్రమంలో టీవీ చూడడం ఎక్కువయింది. వార్తలూ, సీరియల్సూ చూడడం అలవాటు లేకపోవడం వల్ల చూసిన సినిమాలే చూడడం విసుగొచ్చి, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా ల్లాంటి వాటికి డబ్బులు కట్టి వాటిలో ఏమున్నాయా అని చూడడం మొదలెట్టేను.

కొన్ని పేర్లు చూసి వదిలేస్తే మరికొన్ని ఓ పదినిమిషాలు చూసి మార్చేస్తూ ఏదో నా కాలక్షేపం నేను చేసుకుంటుంటే ఫ్రెండ్స్ కొంతమంది రాసిన “ఒక గొప్ప భారతీయ పాకశాల” అనే సినిమా గురించి చదవడం జరిగింది. నాకెందుకో అసలు వంటిల్లనే పేరంటేనే లోపల్నించి ఒక విధమైన బాధ వచ్చేస్తుంది. పాకశాల పేరు పెట్టినా అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు అక్కడ చేసేవి వంటలే కదా! అసలే నాకు పని గండమాయె. ఎప్పుడు వంటింట్లోకి వెళ్ళవలసొచ్చినా ఎంత తొందరగా అందులోంచి బైట పడదామా అని ముందే లెక్కలు వేసుకుని మరీ వంటింట్లోకి అడుగు పెడతాను. అలాంటిదాన్ని మళ్ళీ ఆ వంటింటి గురించే సినిమా అంటే ఎందుకు చూస్తానూ….చూడలేదు.

కానీ మళ్ళీ రెండ్రోజుల తర్వాత ఇంకెవరో ఆ సినిమాని ఇంకా పొగిడేసేరు. అసలు సినిమా అంటే నా అభిప్రాయంలో ఎలా వుండాలంటే చూసిన కాసేపూ మనసుకి హాయి అనిపించేలా వుండాలి. పాటలు, సంభాషణలు అర్థమయేలా వుండాలి. తిట్లూ, శాపనార్థాలూ వుండకూడదు. సినిమా చూసేక మనకి ఒక మంచి కల వచ్చిన ఫీలింగ్ రావాలి. అంతేకానీ అక్కడకూడా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చెయ్యాలీ, చపాతీలు మృదువుగా వుండాలంటే పిండి ఎలా కలపాలీ అన్నవి చూపిస్తానంటే ఎలా చూడనూ!

కానీ ఒక్కొక్కసారి మన రోజులు బాగులేకపోతే అలాంటివి చూడక తప్పని పరిస్థితులు వస్తాయి.. అదెలాగంటే.. ఈమధ్యనే మా ఆడపడుచు కొడుకు పెళ్ళయింది. కొత్తకోడలు కొత్త మోజుతో మొగుడికి ఇష్టమైనవన్నీ వండిపెట్టేద్దామని ముచ్చటపడిపోయి సదరు భర్తగారిని.. అదే మా ఆడపడుచు కొడుకుని అడిగిందిట అతని ఇష్టాలు చెప్పమనీ. ఈ మహానుభావుడు కొత్తగా వచ్చిన మొగుడి పదవికి మురిసిపోయి, భార్యకి తనమీదున్న ప్రేమకి ఉబ్బిపోయి బూరెలు చేసి పెట్టమన్నాడుట. పాపం అప్పటిదాకా కాలేజీ, ఆఫీసూ తప్ప వంటలు చెయ్యడంరాని ఆ పిచ్చిపిల్ల మొగుడి కోరిక తీర్చడానికి ముచ్చటపడిపోయింది. కానీ, ఆ బూరె లనేవి ఎలా చేస్తారో తెలీక స్వంత అత్తగారిని అడగడానికి భయపడిందో ఏమో.. నాకు ఫోన్ చేసి ఎంతో ప్రాధేయపడుతూ, “పెద్దమ్మగారూ, బూరెలు ఎలా చేస్తారండీ!” అనడిగింది.

నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్దంత పనయింది. చెప్పానుగా.. అసలే పనిగండమని.. అందుకని నేను చేసే వంటలన్నీ సులభంగా ఉడకబెట్టి, పోపేసుకునేవే చేసేస్తుంటాను. ఇప్పుడీ అమ్మాయి అడిగిన దానికి ఏం చెప్పాలో తెలీక, ఒక్కసారి బూరెల రుచిని గుర్తు తెచ్చేసుకుని, నా తెలివినంతా ఉపయోగించేసి ”బూరెలెంతసేపమ్మా… సెనగపప్పు ఉడకబెట్టేసి, బెల్లం కలిపేసి, ఉండలు చేసి, దోసెపిండిలో ముంచి నూనెలో వేయించైడమే..” అని ఒక్క ముక్కలో చెప్పేసి ఫోన్ పెట్టేసేను.

కానీ నాకు అనుమానమే.. ఈ బూరెలనేవి నేనూ పెళ్ళైన కొత్తల్లో ఒకసారి ప్రయత్నించి ఘోరంగా ఫెయిలయినదాన్నే. మొదటిబూరె నూనె మూకుట్లో వేసేటప్పటికే అది ఆవేశపడిపోయి, లోపలి పూర్ణమంతా బైటకి చీదేసి, మొత్తం నూనెనంతా నల్లగా చేసేసింది. అప్పట్నించీ నేను బూరెలు చెయ్యడం అనే భావనని కాశీలో వదిలేసినట్టు భావించుకుని తృప్తి పడిపోయేను. కానీ ఇప్పుడీ కొత్త పెళ్ళికూతురు అదే బూరెల గురించి అడగడంతో నా పెద్దరికానికి అవమానం జరిగిపోతుందనిపించింది. అందుకని మళ్ళీ ఆ అమ్మాయి ఆ బూరెలు చేసే ప్రక్రియలో ఏమైనా అనుమానాలొస్తే ఫోన్ చేసేస్తుందని భయపడిపోయి యూ ట్యూబ్ లోకి వెళ్ళి బూరెలు చేసే వీడియోలన్నీ క్షుణ్ణంగా చూసెయ్యడం మొదలెట్టేను. ఇదిగో ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లోనే నేను వంటింటినీ, వంటలవీడియోలనీ చూసేది.

ఇలా అనుకోకుండానూ, తప్పనప్పుడూ వంటలు చూస్తాను కానీ కేవలం సినిమా అంతా వంటిల్లూ, వంటలూ చూపిస్తానంటే భరించడం కష్టం కదా!

అలాగని వంటిల్లు నాకేదో నిషిధ్ధమైన ప్రదేశమనుకునేరు.. అబ్బే.. నాకు వంటిల్లంటే చాలా భక్తీ, శ్రధ్ధా వున్నాయి. మన పెద్దవాళ్ళు మనం తినే ఆహారాన్ని ఎంత శ్రధ్ధగా, శుచిగా, నియమంగా చెయ్యాలో స్పష్టంగా చెప్పేరు. అలా చెప్పడమే కాకుండా అలా వండిన పదార్థాలను ముందు భగవంతునికి నివేదించి ఆ తర్వాతే ఆ ఆహారాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించమని చెప్పేరు. అంతేకాకుండా మా తాతగారు పూజ చేసుకునే రోజుల్లో దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టేక, ఆ దీపం కొండెక్కే లోపలే ఇంటి యజమాని భోజనం పూర్తి చెయ్యాలని చెప్పేవారు. ఆయన అలాగే చేసేవారు. అప్పుడేదో చాదస్తం అనుకునేదాన్ని కానీ ఇప్పుడాలోచిస్తే అన్నం పాడవకుండా తినమని చెప్పడానికి మన పెద్దవాళ్ళు అలాంటి నియమం పెట్టేరేమో అనిపించింది.

నాకు రకరకాలుగా వండటం రాకపోయినా ఇష్టంగా వంట చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో అందరూ తృప్తిగా తినాలని వండే అమ్మలను చూస్తే ఆనందం. అతిథులకి ఆప్యాయంగా వండి వడ్డించే అన్నపూర్ణలంటే ఆరాధన. అడుగడుగునా ఇంటాబయటా కడుపుచూసి అన్నం పెట్టే అమ్మలున్న మన దేశంలో ఆ అన్నం వండే వంటిల్లు ఎంత గొప్పదో ఒకరు చెప్పాలా!

ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా, శ్రధ్ధగా వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి మరీ ఇంట్లోవారికి వడ్డించే గొప్ప సంస్కృతి మనది. మనం తినే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం వుంటుందని గట్టిగా నమ్మేవాళ్ళలో నేనూ వున్నాను. కానీ ఆ వంట, భోజనం అయిపోయేక ఇంక దాని గురించి ఆలోచించను. అలాకాకుండా ఏకంగా వంటింటిమీదే సినిమా అంటే అందులో ఏముంటుందా అనిపించింది. అదీకాక సినిమా పేరు కూడా “ఒక గొప్ప భారతీయ పాకశాల” అని వుండేటప్పటికి ఇలాగే మన భారతదేశంలోని వంటిళ్ళలోని మంచి విషయాలు చూపిస్తారేమో…… చూసి తీరవలసిందే అనుకుంటూ ఓ శుభముహూర్తాన చూడడం మొదలెట్టేను.

ఆ సినిమా గురించి నేనేమీ విమర్శించబోవటంలేదు. ఎందుకంటే ఎవరి భావాలు వాళ్ళవి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు సినిమాలో చూపించేరు. కానీ నాకు అర్ధంకాని విషయమేమిటంటే ఈ చిత్రంలో ఒక మహిళ వంటింట్లో నానా పాట్లూ పడుతుంటుంది. ఆ హింస నుంచి తప్పించుకుందుకు ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి, స్వతంత్రంగా ఆమె కిష్టమైన వ్యాపకం కల్పించుకుంటుంది. సంతోషం.. ఎవరు కాదంటారూ…. అమె జీవితం.. ఆమె ఇష్టం..

కానీ ఆర్థికస్వాతంత్ర్యం వస్తే స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ వచ్చేస్తుందన్నట్లు చాలామంది చెప్తారు. కానీ వాళ్లకి తెలీదా… ఎంతోమంది ఆర్థికంగా సంపాదించుకుంటున్న స్త్రీలు కూడా వాళ్ల జీతమంతా భర్త చేతుల్లో పెట్టి, బస్సుకి డబ్బులు కూడా అతన్నే అడిగి తీసుకునేవారనీ! ఇలా అందరినీ ఒకే రాటకి కట్టేసినట్టే ఈ చిత్రానిక్కూడా ఆ చిత్రం తీసినవాళ్ళు ఆ పేరు పెట్టడంలో చాలా పెద్ద తప్పు చేసేరు.

దేశంలో ఎక్కడో ఒకచోట ఈ సినిమాలో చూపించినలాంటి వంటిల్లు వుంటే వుండి వుండవచ్చు. “ఒక గొప్ప భారతీయ పాకశాల..” అనే పేరుతో తీసిన సినిమాలో ఇలాంటి వంటింటిని చూపిస్తే ఇంక మొత్తం భారతదేశంలోని వంటిళ్ళన్నీ ఇలాగే వుంటాయని తెలీనివాళ్ళు అనుకోరా! అసలు ఇప్పటికే భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువనీ, పురుషాధిక్య సమాజం వల్ల మహిళలు అణచివేయబడుతున్నారనీ వస్తున్న సినిమాలు చూసిన ఇతర దేశాలవాళ్ళు అదే నిజమనుకుంటున్నారు. ఇలాంటి పేర్లు అంటే ఎక్కడో ఒకచోట వున్నదాన్ని దేశమంతా వున్నట్టు పేరు పెట్టడం వల్ల మనలని మనమే కించపరుచుకుంటున్నట్టు కాదా!

ఆ సినిమాతో నాకెలాంటి విభేదం లేదు… ఉన్నదల్లా.. ఆ సినిమాపేరు తోనే..అసలే సినిమా అనేది చాలా ప్రభావం వున్న మాధ్యమం. ఎక్కడో ఒకటి రెండుచోట్ల వున్న విషయాన్ని తీసుకుని సినిమా తీసేసి, మొత్తం సమాజమంతా అలాగే వుందన్నట్టు పేరు పెడితే ఈ సమాజం గురించి తెలీనివాళ్ళు అదే నిజమనుకుంటారు. అలాగే ఈ సినిమా చూసినవాళ్లందరూ ఇండియాలో వంటిల్లు అంత దరిద్రంగానూ వుంటుందనుకుంటారు. ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారూ! ఆ సినిమాకి “ఒక గొప్ప భారతీయ పాకశాల” అనే పేరు పెట్టకుండా ఉండవలసింది. ప్చ్..

మీరు ఏ కులంవారైనా, ఏ మతంవారైనా ముందు భారతీయులు. మన భారతీయతని మనం గౌరవిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here