కాజాల్లాంటి బాజాలు-104: ఒక గుర్తింపు..

0
7

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]“ఏ[/dropcap]విటో స్వర్ణా, అంతా డల్‌గా ఉంటోంది. ఏ పనీ చెయ్యబుధ్ధవటం లేదు. ఎవరితోనూ మాట్లాడబుధ్ధెయ్యడం లేదు. అలా శూన్యంలోకి చూస్తూండిపోవాలనిపిస్తోంది.” అంది నా స్నేహితురాలు రమ ఫోన్ చేసి.

నాకు ఒక్కసారి చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చేయి.

రమ నా చిన్నప్పటి ఫ్రెండ్. స్కూల్‌కే కాదు వేరే ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఏదైనా కొత్తచోటికి వెడితే రమ మొహమాటంగా వెనక ఉండిపోయేది. ఇద్దరి తరఫునా నేనే మాట్లాడి పని జరిపించేదాన్ని. ఎవరు ఏ పని చెప్పినా అంకితభావంతో చేసే రమంటే నాకెంతో ఇష్టం. ఎమ్.ఎ. చదివింది. అయినా కూడా ఎక్కడా ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంటి బాధ్యతనంతా మీద వేసుకుని మంచి ఇల్లాలనిపించుకుంది.

వాళ్ళాయన సత్యమూర్తి చాలా మంచాయన. పిల్లలిద్దర్నీ చక్కగా సెటిల్ చేసుకుని అన్ని బాధ్యతలూ పూర్తి చేసుకున్నారు ఇద్దరూ.

అలాంటి రమ దగ్గర్నించి ఇలాంటి ఫోన్ కాల్ రావడం చూసి ఆశ్చర్యపోయేను.

ఏమైందనడిగితే.. “ఇలా కాదు. ఎల్లుండి ఎక్కడైనా బైట హోటల్లో కలిసి మాట్లాడుకుందాం” అంది.

వాళ్ళింట్లోనూ, మా ఇంట్లోనూ కాకుండా ఎవరో కొత్తవాళ్లని కలుస్తున్నట్టు హోటల్లో కలవడమేంటో నా కర్థం కాలేదు. అప్పటికి ఊరుకుని రమ చెప్పిన టైమ్‌కి హోటల్‌కి వెళ్ళగానే నేనడిగిన మొదటి ప్రశ్న అదే..

“ఏంటోనే.. ఈమధ్య ఇల్లంటే చిరాకు వచ్చేస్తోంది. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. ఏం చెయ్యాలో ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. అందుకే ఇంటికి కాకుండా ఇక్కడికి రమ్మన్నాను.”

“మీ ఆయనతో ఏవైనా గొడవ పడ్డావా!”

తల అడ్డంగా ఊపింది.

“పిల్లలు ఏవైనా సమస్యలు తెచ్చేరా!”

“ఊహు..” అంది టేబుల్ మీద స్పూన్‌తో కొడుతూ.

“నీ హెల్త్ ఏవైనా..” ఆదుర్దాగా అడిగేను.

“శుభ్రంగా రాయిలా ఉన్నాను..” అంది విసుగ్గా.

“మరేమైందే..” విసుక్కున్నాను.

“ఏవిటోనే.. పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ అయిపోయేయి. ఆయన ఉద్యోగం గోలలో ఆయనుంటారు. నాకేనే అంతా ఖాళీగా అనిపిస్తోంది.”

“నువ్వు కూడా ఏదైనా వ్యాపకం పెట్టుకో..”

“నేనా.. ఈ వయసులోనా. అయినా నాకేం వచ్చనీ.. చదువుకున్న చదువు ఎప్పుడో మర్చిపోయేను. సంగీతంలాటి వేమీ రావాయె. తెల్లారిలేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు.”

“నీకేం లోటనే.. మంచి మొగుడు, ఎంచక్కటి పిల్లలూ..”

“ఏం పిల్లలో.. వాళ్ళకి నాతో మాట్లాడ్డానికే టైమ్ ఉండట్లేదు. వాళ్ళని అనేం లాభంలే.. వాళ్ల ఉద్యోగాలూ, సంసారాలూ అలాంటివి.”

“పోనీ, మీ ఆయనతో పెట్టుకో ఏదైనా కాలక్షేపం..”

నా మాటని మధ్యలోనే ఆపేసింది.

“ఏవిటి పెట్టుకునేదీ! పిల్లల బాధ్యత తీరింది కదాని నాకు కాస్త బైటకి తిరగాలనిపిస్తుంది. ఆయన ఆఫీసుకి తప్ప ఇంక బైటకెక్కడికీ వెళ్ళరు. పోనీ ఇంట్లోనైనా ఏవైనా కబుర్లు చెపుతారా అంటే ఆయనో పెద్ద ఇంటలెక్చువల్. అన్నీ కాశ్మీర్ సమస్యలూ, ఉక్రెయిన్ వార్ గురించే తప్పితే మామూలు విషయాలు మాట్లాడరు. టీవీలో న్యూస్, డిస్కషన్స్ తప్పితే సినిమాలు, సీరియల్సూ చూడరు. నేనేమో మామూలు ఇల్లాలిని. అవన్నీ నాకెక్కడ తెలుస్తాయీ..

నాకేమో మనుషులూ, వాళ్ల మాటలూ కావాలి. మామధ్య ఏవైనా మాటలంటూ ఉంటే పిల్లల గురించి తప్పితే ఇంకేమీ రావు. ఎలా కుదురుతుంది చెప్పూ! రోజు గడవటం లేదే.”

“ఇంత సోషల్ మీడియా ఉందికదా.. అన్నింట్లోనూ అకౌంట్లు పెట్టేసుకో. బోల్డుమంది ఫ్రెండ్స్ అవుతారు.”

“అమ్మో. ఆ ఫ్రెండ్స్, గ్రూప్స్ అంటే నాకు భయమే.. ఏ పేరుతో ఎవరు ఫ్రెండ్ అని వస్తారో..ఏంటో..”

నేను తల పట్టుకున్నాను.

“పోనీ, నీకు తెలిసినవాళ్లతోనే ఫ్రెండ్షిప్ పెంచుకో. వాళ్లతో బైటకెళ్ళు. ఊళ్ళు తిరుగు.”

“నాకంటూ నాకు ఎవరు తెలుసే.. ఒక్క నువ్వు తప్ప. నీకేమో ఇల్లూ ఉద్యోగం, బోల్డు పనులూను. ఇంకెవరితో మాట్లాడదామన్నా సత్యమూర్తి భార్య అంటున్నారు. సందీప్, శ్రేయాల అమ్మ అంటున్నారు. ఫోన్ ఎత్తి నా పేరు చెపితే ఎవరికీ నేను తెలీటంలేదు. నా పేరు నేనే మర్చిపోయినట్టున్నానే..”

నా కర్థమైపోయింది.

పి.సత్యవతిగారు రాసిన కథలోలాగ ఈ ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయింది. పెళ్ళైన ముఫ్ఫై అయిదేళ్ళకి రమకి తన అస్తిత్వం ఏమిటన్న ఆలోచన వచ్చింది.

నేరుగా పాయింటుకొచ్చేసేను.

“నువ్వు ఇదివరకు చెయ్యాలనుకున్నవి, సంసారంలో పడి ఆ ఆలోచనను పక్కకి పెట్టేసినవీ ఏమైనా ఉన్నాయా..”

“నామొహం.. చదువుకున్నన్నాళ్ళూ మంచి మార్కులకోసం పడీ పడీ చదివేను. పెళ్ళైంది. ఆ చదువూ ఎందుకూ పనికిరాక అటకెక్కింది. ఇన్నేళ్ళూ నా మొగుడూ, నా పిల్లలూ అనుకుంటూ వాళ్లకేం కావాలో చూసేను కానీ నాకేం కావాలనే ఆలోచనే ఎప్పుడూ రాలేదే..”

నాకు రమని చూస్తే జాలేసింది. ఇన్నాళ్ళూ తనమీద ఆధారపడ్డ పిల్లలు స్వతంత్రులయ్యేరు. రమకి తను ఒంటరి దయిపోయేనన్న ఫీలింగ్ వచ్చింది. ఓపికున్నన్నాళ్ళూ తమ గురించి అసలు ఆలోచనేదే లేకుండా ఇంటికే అంకితమయిపోయే చాలామంది ఇల్లాళ్లకి పిల్లలు పెద్దవాళ్లయేక వచ్చే సమస్య అదే. అది అలా ఎక్కువయితే మంచిది కాదు. తనకంటూ రమ ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలి. తప్పదు. కానీ తనంటూ తను ముందుకు దూసుకెళ్ళి ఏదీ చేసే తత్వం కాదు రమది. ఏం చెయ్యడం!

నాకు ఒక్కసారి వదిన గుర్తొచ్చింది. ఈ రమని వదినకి అప్పగిస్తే. వదినకి బోల్డు వ్యాపకాలు. ఎంతమంది ఉంటే అంతమందికీ పనులు అప్పగించేసి, నేర్పుగా చేయించుకునే తెలివితేటలున్నాయి వదిన దగ్గర. అలాగని తనకోసం చేయించుకోదు. అవసరమైనవాళ్లకి అండగా ఉంటూ, ఎందరినైనా కలుపుకుపోతుంటుంది.

“సరే రమా, రేపు నిన్ను మా వదినకి పరిచయం చేస్తాను, రమా అనే పేరుతోనే సుమా.!” అన్నాను నవ్వుతూ.

“మీ వదినగారేం చేస్తుంటారూ!” అడిగింది రమ.

“ఏం చెయ్యదని అడుగు. రేపు సాయంత్రం రెడీగా ఉండు వెడదాం.”

ఆ మర్నాడు రమని వదినకి పరిచయం చేసేను.

నెల్లాళ్ళు గడిచేయి. మధ్యమధ్యలో వదినని రమ గురించి అడుగుతున్నానే కానీ రమ దగ్గర్నుంచి మటుకు ఒక్క ఫోన్ కూడా లేదు. చూసీ చూసీ నేనే ఒకరోజు రమ ఇంటికి ఫోన్ చేసేను. వాళ్ళాయన తీసేరు.

“రమ బిజీగా ఉందండీ. తన మొబైల్ నంబర్ ఇస్తాను. దానికి కాల్ చెయ్యండి.” అంటూ నంబర్ ఇచ్చేరు.

ఆశ్చర్యపోయేను. ఇదివరకు ఎప్పుడూ రమ దగ్గర మొబైల్ లేదు. “నాకెందుకే.. నాకెవరు చేస్తారనీ.. పిల్లలు లాండ్ లైన్‌కే చేస్తారు కదా” అనేది.

బిజీగా ఉందన్నారు కదా వాళ్ళాయన కాసేపాగి చేద్దామనుకుంటుంటే రమ దగ్గర్నుంచే ఫోన్ వచ్చింది.

“స్వర్ణా, మీ వదిన ఎంత గొప్పవారే.. ఎంత బాగా మాట్లాడతారో.. ఆవిడతో మాట్లాడుతుంటే భలే ఉత్సాహం వచ్చేస్తుందే.. నేనిప్పుడు అస్సలు ఖాళీగా లేను తెల్సా.. ఈ నెల్లాళ్ళలో ఎన్ని చోట్లకి వెళ్ళేనో.. ఎంతమందిని కలిసేనో.. అందరూ ఎంత కలిసిపోయి మాట్లాడుతున్నారో. ముఖ్యంగా వదిన అందరినీ ఎంత బాగా కలుపుకుపోతోందో.. నాలో నాకే తెలియని ప్రత్యేకతలు వదిన భలే పట్టేసేరు కదే.. ఇప్పుడు నాకెంత బాగుందో.. హాయిగా ఇంకొకరిమీద ఆధారపడకుండా నాకు కావల్సినవి, నచ్చినవి చేసుకుంటున్నాను. ఎంచక్కటి వదినని పరిచయం చేసేవు. చాలా థాంక్స్ స్వర్ణా.. అన్నట్టు ఈ మొబైల్ నంబర్ నాదే. నా పేరుమీద సేవ్ చేసుకో..” అంటూ ఫోన్ పెట్టేసింది.

ఆ మొబైల్ నంబర్‌ను రమ పేరుతో సేవ్ చేసుకుంటుంటే ఇంకా ఎంతమంది ఇల్లాళ్ళు తమ పేర్లు చెప్పుకునే ఇలాంటి చిన్న చిన్న గుర్తింపుల కోసం తపన పడతారో కదా అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here