[box type=’note’ fontsize=’16’] “గాలి.. నీరు.. ఆకాశం..భూమి.. నాలుగు పంచభూతాలను ఆలింగనం చేసుకొని చేసిన ప్రయాణమది. రెండు జీవితాలకు సరిపడా అనుభవాన్ని అందించింది” అంటూ తమ కోల్‌కతా, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ పర్యటన గురించి వివరిస్తున్నారు కోవెల సంతోష్‌కుమార్. [/box]
[dropcap]రో[/dropcap]జూ హడావిడిగా కనిపించే ప్రపంచాన్ని.. ఎవరికి వారుగా తిరిగే మనుషులను విడిచిపెట్టి.. ఇంటర్నెట్లు.. ఫేస్‌బుక్కులు.. వాట్సాప్‌ల గోల అందుబాటులోకి రాని.. లేని ఒక నూతన ప్రపంచానికి వెళ్తే ఎలా ఉంటుంది? సముద్రమట్టానికి ఆరువేలు.. ఏడువేలు.. పద్నాలుగు వేల అడుగుల ఎత్తున.. మబ్బులకు పైన కొండల్ని తొలిచి.. ఏర్పాటుచేసిన సన్నని దారుల్లో ప్రయాణం చేస్తుంటే ఏ రకమైన అనుభూతి కలుగుతుంది? ఒకటే ప్రయాణం.. వంద రకాల అనుభవాలు.. అనుభూతులు.. కొండలే తప్ప మైదాన ప్రాంతాలు తెలియని జనం.. తాము పండించిన పంటలు తప్ప పెద్దగా మరేమీ తినని జనం.. వేల అడుగుల ఎత్తు నుంచి జలపాతాలు దుముకుతున్నా తాగునీటి కోసం నిరంతరం తారట్లాడే లోకం.. పొద్దున్నే చదువుల కోసం కొండల అంచుల నుంచి కిందకు.. పైకి ట్రెకింగ్ చేసే బాలబాలికల జీవనం.. నగరమా.. పట్టణమా.. గ్రామమా.. అన్న తేడా తెలియని సమాజం.. వాళ్లకు అదే స్వర్గం.. అదే నరకం.. మబ్బులతో సహవాసం.. బండరాళ్లతో చెలగాటం.. నిరంతరం ప్రాణాలతో పోరాటం.
గాలి.. నీరు.. ఆకాశం.. భూమి.. నాలుగు పంచభూతాలను ఆలింగనం చేసుకొని చేసిన ప్రయాణమది. రెండు జీవితాలకు సరిపడా అనుభవాన్ని అందించింది. జూన్ నెలలో వారం రోజులపాటు సాగిన ప్రయాణం ఒక కొత్త ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి అపూర్వమైన అనుభవాన్ని కల్పించింది. జనరల్‌గా టూర్ అంటే.. కొండలు.. గుట్టలు.. సముద్రాలు.. బీచ్‌లు.. గుళ్లు గోపురాలు.. షాపింగ్‌లు.. ఇవే అనుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇంతకు మించిన అనుభూతి కలుగుతుంది. 2018 జూన్ రెండో వారంలో నా కుటుంబం.. నా ఆత్మబంధువు, వ్యాపారవేత్త వీరభద్రుడు సూద కుటుంబంతో కలిసి డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ వెళ్లడానికి ప్రణాళిక వేసుకొన్నాం. మొత్తం తొమ్మిదిమంది. సాధారణంగా పెద్ద ట్రిప్పే.. డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ గురించి విన్నప్పుడు, నెట్‌లో కన్నప్పుడు మాకు తెలిసింది కొంతే.. హిమాలయాలు, టేకు తోటలు.. పోడు వ్యవసాయం.. చల్లని ప్రదేశం.. సరదాగా గడిపేసి వచ్చేయవచ్చన్నదే తెలిసింది. కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురైన అనుభవం మరచిపోనిది. పూర్తిగా తెలియని ప్రదేశం కాబట్టి ముందుగానే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగానే అవసరమైన రవాణా ఏర్పాట్లు చేసుకొన్నాం. జూన్ 15న కలకత్తాకు చేరుకోవడం ద్వారా మా ప్రయాణం మొదలైంది.
కలకత్తా
జూన్ 15 ఉదయాన్నే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఎయిర్ విమానాశ్రయం నుంచి బయలుదేరాం. సుమారు రెండున్నర నెలల ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల చౌక ధరకే టిక్కెట్లు దొరకడం.. తద్వారా మా పిల్లలను తొలిసారి విమానం ఎక్కించే అవకాశం రావడం.. మధ్యతరగతి వ్యక్తిగా కొంత సంతోషమే. రెండు గంటల పదిహేను నిమిషాల వ్యవధిలో కలకత్తా విమానాశ్రయంలో దిగాం. అక్కడ ముందుగానే బుక్ చేసుకున్న కారులో.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న హోటల్‍కు బయలుదేరాం. 15, 16 రెండు రోజుల పాటు మేం కలకత్తాలో పర్యటించడం కోసం రోజుకు రూ.2వేల చొప్పున తొమ్మిది మంది ప్రయాణం చేయడానికి కారు బుక్ చేసుకొన్నాం. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కి.. హోటల్ నుంచి కలకత్తాలో చూడాల్సిన ప్రదేశాలు చూపించి 16 సాయంత్రం రైల్వేస్టేషన్‌లో దింపడం వరకు పాకేజీ మాట్లాడుకోవడం జరిగింది. ఉదయం పది గంటలకల్లా హోటల్‍కు చేరుకొన్న మేం కాస్త రిఫ్రెష్ అయి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని బయలుదేరాం. హైదరాబాద్ వాతావరణంతో పోలిస్తే కలకత్తా ఎండలతో మండుతున్నది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో బీభత్సంగా ఉన్నది. నిమిషానికో వాటర్ బాటిల్ ఖాళీ అవుతున్నది. కారులో ఏసీ ఉన్నా దాని పరిస్థితి మారలేదు. కోల్‌కతా కాస్మోపాలిటన్ సిటీ.. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒకటి. ఇక్కడ చూడతగిన ప్రదేశాలు అంటే చారిత్రకమైనవే ఎక్కువ. నగరం విపరీతంగా విస్తరించడం.. జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం.. వాహనాల రొద.. వెరసి గ్లోబల్ వార్మింగ్ ప్రభావం విస్తృతంగా కనిపించింది. మనం మరచిపోయిన అంబాసిడర్ కార్లు కలకత్తా నగరం అంతటా విపరీతంగా కనిపించాయి. కలకత్తాలో సాగిన రెండు రోజుల ప్రయాణం తూర్పు భారతదేశంలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి కూడా పనికొచ్చింది. కలకత్తాలో ముందుగా మేం హౌరా వంతెన మీదుగా ప్రయాణించాం. హుగ్లీ నదిగా మారిన గంగమ్మ మీదుగా నిర్మించిన ఈ వంతెనపై దిగి చూసే పరిస్థితి లేదు. వంతెనపై రద్దీగా ఉండటంతో కారులోంచే డెబ్భై ఐదేండ్లనాటి ఆ వంతెన నిర్మాణాన్ని పరిశీలిస్తూ సాగాం. నిస్సందేహంగా హౌరా వంతెన ఒక అద్భుత నిర్మాణం. పూర్తిగా ఉక్కుతో 1936లో ప్రారంభమై 1942లో పూర్తయిన ఈ సస్పెన్షన్ వంతెన 1943లో రాకపోకల కోసం ప్రారంభమైంది. ఇప్పుడు దీనికి సమాంతరంగా మరో వంతెనను కూడా నిర్మించారు. హౌరా, కలకత్తా నగరాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ వంతెన కలకత్తా నగరానికి ఆయువు పట్టు. ఈ వంతెనను హౌరా రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. బ్రిటిష్ వాళ్లు తమ సౌకర్యం కోసం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను ఎంతగా చూసినా సరిపోదు. భారతదేశంలో అతి పెద్దదైన రైల్వే కాంప్లెక్స్ ఇది. 1851లో (సుమారు 160 ఏండ్ల క్రితం) నిర్మించిన రైల్వే స్టేషన్ ఇది. రోజుకు దాదాపు పది లక్షల మంది ప్రయాణికులు ఈ ఒక్క రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తారు.. లోపలికి వెళ్తారు. 23 ప్లాట్‌ఫాంలపై 687 రైళ్లు తిరుగుతుంటాయి. ఎంత అద్భుతమైన రైల్వేస్టేషన్ అంటే.. చెప్పనలవికాదు. ఈ స్టేషన్ బయటి నిర్మాణం.. రెడ్‌బ్రిక్‌తో ఎప్పుడో 160 ఏండ్ల క్రితం చేసిన ఈ స్టేషన్ నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. స్టేషన్ బయటి నిర్మాణ రూపం లోపల స్తంభాలు.. గదులు.. ఏదో రాజమహల్‌ను తలపిస్తాయి. అపరిమితమైన రద్దీతో ఎంత చిరాకు కలిగినా.. చరిత్రను అధ్యయనం చేసేవారికి నాటి ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రాభవం తెలుసుకోగోరు వారికి అమితానందం కలిగిస్తుంది. హౌరా స్టేషన్ ప్రాంగణంలోనే రైల్వే మ్యూజియం ఉన్నది. భారతీయ రైల్వే చరిత్రను ఈ మ్యూజియం విప్పి చెప్తుంది. ప్రపంచంలో అతి పెద్ద నెట్‌వర్క్ ఉన్న వ్యవస్థ మన రైల్వేలది. పొగబండి దగ్గరి నుంచి రైల్వేల్లో పరిణామ క్రమంగా వచ్చిన మార్పులు ఈ మ్యూజియంలో ప్రతిఫలిస్తాయి. హౌరా స్టేషన్ ముందు రోడ్డు ఇరుకుగా ఉండటం.. దాన్ని విస్తరించే ప్రయత్నాలు జరుగకపోవడం ఇక్కడ ట్రాఫిక్ రద్దీకి కారణం.. మేం మండే ఎండల్లో ట్రాఫిక్ రద్దీలోనే.. చెమటలు కక్కుతూ.. పదుల కొద్దీ బాటిళ్ల ద్వారా నీళ్లు తాగుతూ.. చూడాలని ఉండీ.. చూడలేని చిరాకులో.. ఆపసోపాలు పడుతూనే వీటన్నింటినీ చూస్తూ హౌరా వంతెన దాటాం. మధ్యాహ్నానికి మేం ప్రసిద్ధ కలకత్తా కాళి ఆలయానికి చేరుకొన్నాం. కారును కొద్ది దూరంలో ఆపుకొని ఆలయం దాకా నడిచివచ్చాం.
‘పులి చంపిన లేడి నెత్తురు.. ఎగరేసిన ఎర్రని జెండా.. రుద్రాళిక నయన జ్వాలిక.. కలకత్తా కాళిక నాలుక.. కావాలోయ్ నవ కవనానికి’ అంటూ శ్రీశ్రీ రాసిన మాటలతో కలకత్తా కాళిక నాలుక తెలుగునాట ప్రసిద్ధమైందే.. హేతువాదులు.. సామ్యవాదం.. నాస్తిక వాదం గురించి మాట్లాడేవారు అవసరానుకూలంగా ఆస్తికవాదాన్ని కూడా ప్రస్తావిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. నాడు బెంగాల్‌లో కమ్యూనిస్టుల రాజ్యం ఉన్నది కాబట్టి అక్కడి కాళికను కూడా కమ్యూనిస్టుగా మార్చేశారు.. సరే ఇదంతా ఇక్కడ అప్రస్తుతం. ఆలయంలోకి చెప్పులతో వెళ్లలేం. చెప్పులు విడిస్తే నిప్పుల కుంపటిపై కాలుపెట్టినట్టే. ఏం చేసేది? అంతా చెప్పులతోనే నడిచి వెళ్లి.. దగ్గరలో పూజసామగ్రి అమ్మే షాప్‌లో చెప్పులుంచి ఆలయంలోకి ప్రవేశించాం. కలకత్తా కాళికను దర్శించుకోవడం జీవితంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నేను దశమహావిద్యలపై రచన ప్రారంభించడానికి ముందునుంచే అమ్మవారి దర్శనం గురించి తహతహలాడాను. రచన పూర్తయి విడుదలయ్యాక కానీ నాకు అమ్మవారి దర్శనం లభించలేదు. ఆలయంలో అమ్మవారి దర్శనం గర్భాలయంలోకి ప్రవేశించి చూడవచ్చు. మూలమూర్తిని స్పర్శించే అవకాశం కూడా ఉన్నది. అమ్మవారి గర్భాలయం భూమికి నాలుగైదు అడుగులు కిందుగా ఉంటుంది. కింది నుంచి నిర్మాణమైన పీఠంపై నాలుక బయటకు పెట్టిన కాళిక ముఖము మాత్రమే దర్శనమిస్తుంది. ఆమె దర్శనం శరీరంలో అనిర్వచనీయమైన చైతన్యాన్ని ఉత్తేజితం చేస్తుంది. విప్పారిన కన్నులు.. విస్తరించిన నాలుక.. శత్రు స్తంభనకు ప్రతీకలు. ఆమె దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఫోర్సెస్ ఆమడదూరం పారిపోతాయి. ఆమె నాలుక ద్వారా వచ్చిన గంగాజలాన్ని స్వీకరించడం ద్వారా ఆమె అనుగ్రహానికి పాత్రులమవుతాం.
కలకత్తా కాళిక (కాళీఘాట్) ఆలయం దగ్గర పార్కింగ్ దగ్గరి నుంచి ప్రధానార్చకుల దాకా దోపిడి ముఠాల్లాగానే వ్యవహారం సాగుతుంది. అరగంట పార్కింగ్ చేయండి.. రెండు వందల రూపాయలంటారు. అధికారిక పార్కింగ్ అంటే అదీ కాదు.. వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలుండవు. కూపన్ ఇవ్వరు. క్యాబ్ డ్రైవర్లు.. ఏజెంట్లు మిలాఖత్ అవుతారు. నోటికి ఎంత వస్తే అంత లాగుతారు. ఇతర రాష్ట్రాలవారైతే దోపిడీకి అంతుండదు. ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం అర్చకుల వ్యవహారానికి చికాకు కలుగుతుంది. గంగా జలానికి డబ్బులు.. అమ్మవారిని స్పర్షించడానికి డబ్బులు.. తీర్థానికి డబ్బులు.. అర్చకుడు భుజం మీద చేయి వేసినందుకు డబ్బులు.. బొట్టు పెట్టినందుకు డబ్బులు.. అందినకాడికి దండుకోవడమే అక్కడ పని. మనం ఎంతమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. అంతే సంగతులు.
భోజనం..
కాళీఘాట్ నుంచి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 1.30 గంటలయింది. అక్కడే దగ్గరలో ఉన్న హోటల్‍కు వెళ్లాలని భావించాం. దగ్గరలో మంచి హోటల్ ఎక్కడ ఉందని అడిగితే.. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఓ హోటల్ జాడ చెప్పారు. అప్పటికే దాహంగా ఉన్న మేం.. రోడ్డుపై సోడా బండి కనిపిస్తే పదేసి రూపాయలిచ్చి మసాలా సోడా తాగి దాహం తీర్చుకొన్నాం. అక్కడి నుంచి హోటల్‍కు వెళ్లి భోజనం ఆర్డరిచ్చాం. మా మిత్రుడి కుటుంబం మాంసాహారం కోసం పక్కనున్న మరో సెక్షన్‌లోకి వెళ్లింది. మిగిలిన మేమంతా శాకాహార భోజనానికి ఆర్డరిచ్చాం. ఒక ప్లేట్ మీల్స్ ఖరీదు 60 రూపాయలు. కొద్దిసేపటికి మాకు భోజనం వచ్చింది. అన్నం దొడ్డు బియ్యంతో వండింది. దాల్ (పప్పు) పేరుతో ఇచ్చిందేమిటంటే.. మనం పప్పు ఉడికించిన తర్వాత మిగిలిన నీటిని విడిచేస్తామే.. దాన్ని పప్పు కట్టు అంటాం.. అది.. అంత పలుచని నీళ్లుగా ఉన్నది. కూర అది కూడా కందిపప్పు కాదు.. పెసరపప్పుతో కూడింది. అలుగడ్డ (బంగాళాదుంప) కూర. మజ్జిగ అలియాస్ పెరుగు అడిగితే కానీ ఇవ్వరు. అది కూడా నీళ్ల మజ్జిగ. ఉప్పు కారాలుండవు.. సాంబార్ ఉంటుంది కానీ.. అది కూరో.. సాంబారో తెలియదు. బెంగాల్ ఆహారంతో ఇది తొలి అనుభవం. ఇక్కడి నుంచి బెంగాల్ యావత్తూ మాకు దాదాపు ఇదేరకమైన ఆహారం లభించింది. పాపం.. మాంసాహారులైన మా మిత్రుడు వీరభద్రుడి కుటుంబం కూడా సంతృప్తిగా భోజనం చేయలేకపోయింది. హైదరాబాదీ దమ్ బిర్యానీ రుచుల ముందు అవేం ఆనుతాయి చెప్పండి? ఆ భోజనం మా అబ్బాయికి ఫుడ్‌పాయిజన్‌కు కారణమైంది. వాంతులతో రాత్రి దాకా అల్లాడిపోయాడు. లంఖణాలతో ఇబ్బంది పడ్డాడు.
బంగాళాదుంప
ఇక్కడ బంగాళాదుంప అంటే ఆలుగడ్డ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ ఆలుగడ్డ మన దేశంలో పుట్టిన ప్రాడక్ట్ కాదు. బ్రిటిషోడు దిగుమతి చేసిన కూరగాయ. బంగాళాదుంప అనేది శరీరానికి సాలిడ్ ఫుడ్. కొలెస్ట్రాల్‌ను అధికంగా ఇచ్చేది. ఈస్టిండియా కంపెనీ మొదట బెంగాల్‌లో పాగా వేసిన తర్వాత.. తన సైన్యానికి ఇతర సిబ్బందికోసం దీన్ని తీసుకొచ్చింది. ఆలు వంటి ఘన ఆహార పదార్థాన్ని తినడం ద్వారా ఎక్కువ సేపు శక్తితో ఉండవచ్చన్నది బ్రిటిష్ వాళ్ల ఆలోచన. 18వ శతాబ్దంలో తొలుత ఓడల ద్వారా అలుగడ్డలను దిగుమతి చేసుకొనేవారు. ఆ తర్వాత బెంగాల్‌లోనే పండించడం మొదలుపెట్టారు. బెంగాల్ నుంచే ఆలుగడ్డ దేశమంతటా విస్తరించింది. అందుకే దానికి బంగాళాదుంప అన్న పేరు ఖాయమైంది కూడా. తూర్పు ఉత్తర భారతాల్లో రొట్టెలతోపాటు బంగాళాదుంప, ఉల్లిపాయే ప్రధాన ఆహారంగా ఉంటుంది. మాకు బెంగాల్ ప్రయాణంలో మిగతా కూరగాయలు అక్కడక్కడా పంటపొలాల్లో.. కూరగాయల దుకాణాల్లో కనిపించినప్పటికీ.. వంటల్లో మాత్రం ఈ బంగాళాదుంప మాత్రమే ప్రధాన కూరగాయగా వడ్డించారు. ఇక అన్నం సంగతి. మనం మామూలుగా అయితే కంచంలో పుష్టిగా అన్నం వడ్డించుకొని అన్ని రకాల వంటకాలతో కలిపి తింటాం. అక్కడ అన్నం ఒక చిన్న గిన్నెడు తింటే.. కడుపు నిండిపోతుంది. ఎందుకంటే అంత దొడ్డుబియ్యం. లేకుంటే చైనా ఫుడ్ తినాల్సి వస్తుంది. అంతకుమించి మార్గాంతరం లేదు.
విక్టోరియా మహల్..
కాళీఘాట్ నుంచి బయలుదేరిన మేము.. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతానికి విక్టోరియా మహల్‌కు చేరుకొన్నాం. అక్కడ ప్రవేశానికి 30 రూపాయల టిక్కెట్. తొమ్మిది మందికి టిక్కెట్లు తీసుకొని లోపలికి బయలుదేరాం. గేటు వద్ద టిక్కెట్లు కలెక్ట్ చేసుకొనే ఓ మహిళ మా ముఖాలను.. భాషను చూసి తెలుగువాళ్లమని గుర్తుపట్టింది. ‘మీరు తెలుగువారా’ అని ప్రశ్నించగానే తెలుగుభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. ‘అవునండీ మేం తెలుగువాళ్లమే.. హైదరాబాద్ నుంచి వస్తున్నాం’ అని చెప్పాను. ‘మీరు తెలుగువాళ్లేనా.. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు?’ అని అడిగా.. మాది అనంతపురం. చాలా ఏండ్ల క్రితమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఉద్యోగం’ అన్నది. ఆమెతో మరింత సంభాషించి ఉత్సాహంగా విక్టోరియా మహల్ లోపలికి వెళ్లాం. విక్టోరియా మహారాణి స్మృతిలో ఆమె మనుమడు నిర్మించిన రాజ ప్రాసాదమిది. మహల్ నిర్మాణం బ్రిటిష్ వాళ్ల వైభవాన్ని అద్భుతంగా చాటుతుంటే.. మహల్ లోపల ఉన్న చిత్రాలు.. చిహ్నాలు.. వస్త్రాలు.. ఫిరంగులు.. కత్తులు.. కటార్లు.. ఒక్కొక్కటి దేశానికి సంబంధించి ఒక్కో చారిత్రక సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. దాదాపు ఆరు శతాబ్దాల అఖండ భారత చరిత్రను విక్టోరియా మహల్ తన గోడలపై లిఖించుకొన్నది. భారతదేశ జాతీయోద్యమాన్ని విరాట్ వామనుడిలా ప్రతిఫలింపజేస్తుంది. ఈ మహల్‌లో ఒక గంట గడిపితేనో.. రెండు గంటలు గడిపితేనో చూడటం పూర్తయ్యేది కాదు.. ఈ మహల్‌ను సాధారణ పర్యాటక భవనంగా నిర్మాణాన్ని.. దాని కౌశలాన్ని చూసి రాలేం. భారతీయులుగా మనం తెలుసుకొనితీరాల్సిన ఎన్నెన్నో అంశాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఒక పూటతోనే చూడటం అయిపోయేది కాదు. ఇక్కడ ప్రతి అంశాన్ని మనసుతో చూడాలి. ప్రతి చిత్రం మనతో మాట్లాడుతుంది. ఆ మాటల్ని ఆకళింపు చేసుకోవాలి. భవనం ముందు నుంచి చూస్తే సుమారు 338 అడుగుల వెడల్పుతో అసాధారణ నిర్మాణ వైచిత్రి మనల్ని అడుగు కూడా కదలనీయదు. గోడలపై ఉన్న బ్రిటిష్ రాజముద్రలు.. శిల్పాలు.. చూస్తూ కదలడం మాకు కష్టతరమే అయింది. ముందుగా దాని నిర్మాణ విశేషాలను తెలిపే శిలాఫలకం ఉన్నది. అది చదివితే విక్టోరియా మెవెూరియల్ గురించిన ఆనుపానులన్నీ అవగాహనకు వస్తాయి. ముందే చెప్పినట్లు సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన మహా ప్యాలెస్.. బ్రిటిష్ మహారాణి విక్టోరియా మరణానంతరం ఆమె స్మృత్యర్థం అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ అపూర్వ నిర్మాణాన్ని తలపెట్టారు. 1901లో విక్టోరియా రాణి కన్నుమూసింది. అదే సంవత్సరం విక్టోరియా మెవెూరియల్‌కు పునాది పడింది. అప్పటికి దేశానికి రాజధానిగా కలకత్తా నగరమే ఉన్నది. రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఆర్కిటెక్చర్‌తో నిర్మాణమైన ఈ భవనం కలకత్తాలో కొత్తగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందనడంలో సందేహం అక్కరలేదు. రాణీ మార్గ్ (క్వీన్ వే) లో హుగ్లీ నదీ తీరంలో దీన్ని నిర్మించారు. తాజ్‌మహల్ నిర్మాణానికి వినియోగించిన మాకరానా తెల్లని మార్బుల్ రాయినే విక్టోరియా మెవెూరియల్ నిర్మాణానికి ఉపయోగించారు. 1906 జనవరి 4న శంకుస్థాపన జరిగిన ఈ భవన నిర్మాణం మొత్తం కోటీ అయిదు లక్షల రూపాయలతో 1921 వరకు సాగింది. 1921లో ప్రజలకోసం దీన్ని తెరిచారు. దీని నిర్మాణం మధ్యలో ఉండగానే కింగ్ జార్జి 5 భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్టు ప్రకటించాడు.
మహల్‌లోకి అడుగు పెట్టిన మరుక్షణం ఈ చరిత్రనంతా అందులోని ప్రతి చిత్రం.. శిల్పం.. పుస్తకం.. వస్త్రం.. ఆయుధం.. విడమర్చి చెప్తూ వస్తుంటాయి. బ్రిటిష్ రాజసింహాసనంపై కూర్చున్న మహారాణి విక్టోరియా స్వాగతం చెప్తుండగా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మాకు ప్రధాన ద్వారమే అబ్బురంగా కనిపించింది. అక్కడ శిలాఫలకాన్ని చదువుతుంటే ఆశ్చర్యమేసింది. 338/228 అడుగుల పొడవు, వెడల్పులతో 184 అడుగుల మేర ఎత్తుగా నిర్మించిన భవనమిది. భవనం పైన గుమ్మటమే 16 అడుగుల ఎత్తున ఉన్నది. దానిపైన దేవదూత శిల్పాన్ని ఉంచారు. ముందుభాగంలో వివిధ భంగిమల్లో పిల్లలను అక్కున జేర్చుకొన్న మాతృమూర్తి శిల్పాలు మూడున్నాయి. ఈ మూడు శిల్పాలూ మూడు అద్భుతాలు.
ఇక భవనంలోకి అడుగుపెట్టాక ఒక్కో గ్యాలరీ ఒక్కో చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిందనే చెప్పాలి. లోపల మొత్తం 25 గ్యాలరీలు ఉన్నాయి. వీటిలో రాయల్ గ్యాలరీ, నేషనల్ లీడర్స్ గ్యాలరీ, ఆయుధాల గ్యాలరీ, పోర్ట్రయిట్స్ గ్యాలరీ, శిల్పాలు, సెంట్రల్ హాలు, పెయింటింగ్స్, బుక్స్.. ఇలా మరికొన్ని.. వీటిలో అన్నింటిలోకీ గొప్పది.. అద్భుతమైన చిత్రం ప్లాసీ యుద్ధం. 1757లో బెంగాల్ నవాబ్‌కు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన యుద్ధాన్ని కండ్లకు కట్టినట్లుగా ప్రతిఫలింపజేసిన పెయింటింగ్ ఇది. ఒక గోడ మొత్తం పనోరమా ఫొటో తీసినట్టుగా అద్భుతంగా వేసిన పెయింట్ ఇది. ఏనుగులు.. గుర్రాలు.. సైనికులు.. ఫిరంగులు.. యుద్ధ సన్నివేశాన్ని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేసిన చిత్రమిది.
ముందుగా ప్రవేశించగానే మనకు కనిపించేది ఆయుధాల గ్యాలరీ.. నాటి ఫిరంగులు.. రాకెట్ లాంచర్లు, కత్తులు కటార్లు.. మందు గుండ్లు.. ఇలా.. అనేకానేక అస్త్ర సంపద మనకు కనిపిస్తుంది. అందులోనుంచి మరో అడుగు ముందుకు వేస్తే.. అఖండ భారత మ్యాప్‌తో కొత్త గ్యాలరీ ప్రారంభమవుతుంది. ఈస్టిండియా ప్రవేశానికి ముందు అనేకానేక రాజ్యాలు, సంస్థానాల సమాహారంతో కూడిన అఖండ భారతం దర్శనమిస్తుంది. అక్కడి నుంచి భారత దర్శన యాత్ర ప్రారంభమవుతుంది. ఈస్టిండియా వచ్చేనాటికి బెంగాల్‌లోని గ్రామాల జనజీవన విధానాన్ని చిత్రాలు, పెయింటింగ్‌లు, కృత్రిమ నిర్మాణాల ద్వారా ఏర్పాటుచేశారు.
ఆనాటి జమీందారుల వేషధారణ, వివిధ వృత్తుల వారి వేషధారణ, సామాన్యుల వేషధారణలు.. వృత్తుల్లో నిమగ్నమైన వారి చిత్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. ఆనాడు జమీందారులు, సైనికులు వాడిన దుస్తులను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాతలు, సంస్కర్తలైన రాజారామ్‌మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహామహుల చిత్రాలు.. జీవిత విశేషాలు, దస్తూరీలను ఇక్కడ భద్రపరిచారు. రాజారామ్‌మోహన్‌రాయ్ నిలువెత్తు చిత్రపటం అపూర్వం. ఆ పక్కనే కొద్ది దూరంలో విద్యాసాగర్ చిత్రపటం కనిపిస్తుంది. అక్కడి నుంచి భారత స్వాతంత్య్రోద్యమ గాథలను అక్కడి చిత్రపటాలు మనకు విడమర్చి చెప్తాయి. ఇందులో ప్రథమంగా చెప్పుకోవలసింది 1857 సిపాయిల తిరుగుబాటు.. ఇందుకు సంబంధించిన పెయింటింగ్స్ మనకు దర్శనమిస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది వందేమాతర ఉద్యమం. జాతీయోద్యమాన్ని ఉత్తేజపరిచిన వందేమాతర గీతాన్ని రచించిన బంకించంద్ర చటోపాధ్యాయ స్వదస్తూరీతో రాసిన వందేమాతర గీతం ప్రతి విక్టోరియా మెవెూరియల్‌లో మనం చూడవచ్చు బెంగాలీ లిపిలోని ఈ ప్రతిని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బంకించంద్రుడి చిత్రంతోపాటు ఆయన ఉత్తరాలు, దస్తూరీ, వందేమాతర ఉద్యమం తాలూకు సన్నివేశాలు విక్టోరియా మెవెూరియల్‌లో దర్శనమిస్తాయి.
ఆ తర్వాత చెప్పుకోవలసింది మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఠాగూర్‌కు సంబంధించిన ప్రతి అంశం మనకు విక్టోరియా మెవెూరియల్‌లో కనిపిస్తుంది. ఠాగూర్‌ను అధ్యయనం చేయడానికి ఇది సాధికారికమైన ప్రదేశమని చెప్పడానికి సంకోచమక్కరలేదు. ఠాగూర్‌కు సంబంధించిన అనేక పత్రాలు, దస్తూరీ, ఆయన వేసిన పెయింటింగ్‌లు.. రాసిన కవిత్వం.. వంటివి ఇక్కడ ప్రత్యేకంగా పొందుపరిచారు. ప్రపంచ ప్రసిద్ధమైన శాంతినికేతనాన్ని ఆయన స్థాపించడానికి ముందు దాని ఉద్దేశాన్ని వివరిస్తూ రాసిన పత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
(ఇంకా ఉంది)