ఒక ప్రయాణం ఇలా కూడా

3
10

[dropcap]కొం[/dropcap]పలు మునిగిపోతున్నట్టు, రైల్వే ఫ్లాట్‌ఫారం మీద పరుగులాంటి నడకతో వచ్చిన శేఖరం, ఓ కూలీతో “తమ్ముడూ యెస్ పద్నాలుగు బోగీ ఎక్కడో చూడు. ఇప్పటికీ రెండు సార్లు అటూ ఇటూ బొంగరంలా తిరిగేసాను. కానీ కనబడి చావలేదు” అన్నాడు.

“భలే వారే, ఇది జన్మభూమి రైలు కాదండీ. అదిగోండి ఆ పక్క ఫ్లాట్‌ఫామ్ మీద ఉంది. ఈ ఒక్క రోజు మార్చారు. లేదంటే ఎపుడూ ఈ ఎనిమిదో నెంబర్ లోనే పెట్టేవారు” అని చెప్పడంతో అసహనంగా పళ్ళు కొరుకుతూ అక్కడినుండి ఆ ఫ్లాట్‌ఫామ్ వైపు నడిచాడు.

శేఖరానికి ఎవరినైనా సరే, వరుస పెట్టి పిలిచే అలవాటు ఉంది. అంటే ఏవండీ, ఆంటీ, అంకుల్ అని కాకుండా, అన్నయ్యా అనో, తమ్ముడూ అనో, బాబాయ్, పిన్నీ ఇలా అన్నమాట. ప్రస్తుతం ఓ ముఖ్యమైన పనిమీద విజయవాడ వెళ్ళాల్సి రావడంతో, పొద్దున్నే విశాఖ నుండి బయల్దేరే జన్మభూమి రైలు ఎక్కాడు.

“హమ్మయ్య” అని కూర్చుని కాస్త నీళ్ళు తాగి కుదుట పడ్డాడు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, “తమ్ముడూ ఎనబై ఒకటి సీట్ నెంబర్ ఎక్కడ” అడిగిందామె.

“ఇదిగో నా పక్క సీటే అక్కా, కూర్చో.” చెప్పాడు పరమానందంగా.

ఆమె కూర్చుని, నుదుటన పట్టిన చెమట తుడుచుకుంటూ, “నువ్వు అక్క అంటుంటే, అచ్చంగా మా సొంత తమ్ముడు బాబీగాడు పిలిచినట్టు అనిపిస్తోంది నాకు” అంది.

“నాకూ అంతే అక్కా, మా అక్క లక్ష్మి పిలుస్తున్నట్టే ఉంది” చెప్పాడు ఉబ్బితబ్బిబైపోతూ.

కాసేపటికి “ఇదిగో ఇడ్లీ తింటావా తమ్ముడూ” అడిగింది హాట్ క్యారియర్ ఓపెన్ చేసి.

సరే అందామనుకునే లోపే “వెధవ కక్కుర్తికి పోయి, ముక్కూ మొహం తెలియని వాళ్ళు పెట్టేవి తినకండి” అని భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి “వద్దులే అక్కా. నేను తినేసే వచ్చాను.” చెప్పాడు.

దాంతో ఆమే వాటిలో కొన్ని ఇడ్లీలు తినేసింది.

తర్వాత, శేఖరానికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి, ఆమె వంకే తినేసేలా చూడటం గమనించిన శేఖరం, ‘ఊర శునకంలా ఆ చూపులూ వాడూనూ. వీళ్ళకి వేరే పనీ పాట ఉండదనుకుంటాను’ అనుకున్నాడు మనసులో.

ఆ తర్వాత, రైలు కదిలిన కొద్ది సేపటికి,శేఖరానికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి, చిన్నగా నవ్వి “నా పేరు గిరి, వైజాగ్‌లో ఉంటాను. ఇదిగోండి ఈ చక్కరకేళీ తినండి” అంటూ అందించాడు.

శేఖరానికి వాడు ఎందుకు తనని ఇంతగా కాకా పడుతున్నాడో అర్థం అయింది. ‘బహుశా ఆమెకి నేను నిజంగానే తమ్ముడ్ని అనుకుంటున్నట్టు ఉన్నాడు దరిద్రుడు’ అని మనసులో అనుకుని, తప్పదన్నట్టు శేఖరం కూడా పేరు చెప్పి మాట కలిపాడు. తర్వాత అతను చదివేసిన పత్రిక ఇచ్చి “చదవండి, హాస్య కథలు బావున్నాయి” చెప్పాడు గిరి.

“వద్దు” అన్నాడు శేఖరం. ఇంతలో అన్నవరం వచ్చింది.

“తమ్ముడూ, నాకు తెలిసిన మా ఊరాయనే. పాపం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. ఒక్క క్షణం వెళ్ళి పలకరించేసి వస్తానుండు” అంటూ ఆమె రైలు దిగింది. ఆమె కిందకి దిగి అతనితో మాట్లాడటం కిటికీలోంచి శేఖరం గమనిస్తున్నాడు. ఎదురుగా కూర్చున్న గిరి కూడా ఆ పక్కనే ఉల్లిపాయ్ సమోసాలు కొంటూ కనిపించాడు. ఇంతలో ఆమె గిరిని పిలిచి ఏదో చెప్పగానే, గిరి జేబులోంచి కొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆమె శేఖరం వంక చూసింది.

‘గిరి మంచి వ్యక్తిలా ఉన్నాడు. అతను కష్టాల్లో ఉన్నాడని ఆమె చెప్పగానే, గిరి సాయం చేసినట్టున్నాడు. గ్రేట్’ అనుకున్నాడు మనసులో.

గిరి రైలు ఎక్కి తన సీట్లో కూర్చుని, “ఏవిటీ మీ అక్కయ్య గారు ఇంకా రాలేదా” అడిగాడు.

“బహుశా వాష్ రూమ్‌కి వెళ్ళారేమో” చెప్పాడు శేఖరం.

తర్వాత మరి కొద్దిసేపటికి, “మీ అక్కయ్య” అడిగాడు గిరి కాస్త కంగారుగా.

ఆ మాటలకి గిరి పక్కన కూర్చున్న ఒకతను, “ఇంకెక్కడ అక్క‍, ఎప్పుడో చెక్కేస్తేను. ఇందాక మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తితో కలిసి వెళ్ళిపోయింది.” చెప్పాడతను.

“ఆ… అంటే ఆమె మీ అక్క కాదా” అడిగాడు గిరి అయోమయంగా.

 శేఖరం కాస్త తేలిగ్గా  “కాదు” అని చెప్పి తన ఫోన్‌లో మునిగిపోయాడు..

“అలాగా, మరి ఆవిడ మిమ్మల్ని తమ్ముడూ అంటే, మీరు ఆమెని అక్కా అని ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా  పిలుచుకు చచ్చారు కదా. పైగా ఇందాక నేను రైలు దిగినప్పుడు, వాళ్ళ ఊరాయనికి ఏదో కష్టం వచ్చిందని ఓ వెయ్యి ఇమ్మంది. రైలు ఎక్కాక తమ్ముడితో, అంటే మీతో చెప్పి ఇప్పిస్తానని అంది” చెప్పాడు గిరి బిక్క మొహంతో.

“అలాగా” ఆవదం తాగిన మొహం పెట్టాడు శేఖరం.

“ఏమోనండి ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం” చెప్పాడు ఒకతను.

“మోసాల్లో రోజు రోజుకీ కొత్తదనం పెరిగిపోతోంది” అన్నాడు గిరి పక్కన కూర్చున్న వ్యక్తి.

“అయినా ఆవిడ, ఇతని పేరు చెప్పి డబ్బు ఇమ్మనగానే మీరు ఇచ్చేయాలా? కాస్త ఆలోచించనక్కరలేదూ! అయినా మొదట్నుండీ మీరు ఆమెని కక్కుర్తిగా చూడటం, లబలబలాడిపోవడం నేనూ చూశాను. బహుశా అది గమనించే ఆవిడ మిమ్మల్ని ఇలా బురిడీని చేసింది.” చెప్పింది ఒకావిడ గిరి వంక చీదరగా చూస్తూ.

“ఇతని సంగతేవిటో, ఇతని అక్క సంగతేవిటో పోలీసులని పిలవండి, వాళ్లే చెబుతారు” చెప్పాడు మరో వ్యక్తి.

“డబ్బులు ఇస్తావా లేక పక్క స్టేషన్‌లో దించి పోలీసులకి అప్పజెప్పమంటావా” అడిగాడు గిరి కోపంతో ఊగిపోతూ.

“పక్క స్టేషన్‌లో దించితే నేను వెళ్లాల్సిన సమయానికి విజయవాడ వెళ్ళలేనే” అని బిక్కచచ్చిన మొహంతో డబ్బులు ఇచ్చేసాడు శేఖరం.

వరస కలిపి పిలిచే అలవాటు అన్ని వేళలా మంచిది కాదనీ, ముంచే ప్రమాదం ఉందనీ, కనీసం కొద్దో గొప్పో పరిచయం ఉన్నవాళ్లని అలా పిలిచినా పర్వాలేదు కానీ, కొత్త వారిని అలా వరస పెట్టి పిలవడం,మన వివరాలు చెప్పడం లాంటివి అంత మంచిది కాదని, భార్య లలిత చెప్పిన మాటలు గుర్తొచ్చాయ్. దాంతో కాస్త అసహనంగా మొహం పెట్టి ‘అనుభవం అయితే కానీ నాకు తత్వం బోధపడలేదు’ అనుకున్నాడు మనసులో.

ఆ తరువాతి స్టేషన్లో గిరి దిగిపోయాడు. అదే సీట్లోకి ఒక అమ్మాయి వచ్చి కూర్చుని, “అన్నయ్యా, రాజమండ్రి ఎన్ని గంటలకు వస్తుంది” చిన్న చిరునవ్వుతో శేఖరం వంక చూస్తూ అడిగింది .

ఆ వరస వింటూనే, ఎవరో కర్రతో బుర్ర బద్దలు కొట్టబోతున్నట్టు తుళ్లిపడ్డాడు. వెంటనే మౌనంగా లేచి, మరో సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.

ఆమెకి ఏం అర్థం కాక తెల్ల మొహం వేసుకుని చూస్తుండిపోయింది.

ఇంతలో అతని భార్య లలిత ఫోన్ చేయడంతో లిఫ్టు చేసి “చెప్పు లలితా” అన్నాడు

“ఏవండీ, రైల్లో వరస కలిపి పిలిచి, ఆ తరువాత మత్తు మందు కలిపిన ఇడ్లీలు పెట్టి, వారి సామానుతో దిగిపోయే ఓ మాయలేడినీ, ఆమె సహాయకుడినీ ఇప్పుడే అన్నవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారట. ఆమె కూడా మీరెక్కిన ట్రైన్ లోంచే దిగిందట. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి” చెప్పి ఫోన్ పెట్టేసిందామె.

“అంటే, ఆమె అసలు పథకం ఇడ్లీలు పెట్టి, సామానుతో ఉడాయించడం అన్నమాట. అది కుదరకపోవడంతో ఇలా వెయ్యికి నామం పెట్టిందన్నమాట. ఇంకా నయం, ఆమె పెట్టిన ఇడ్లీలు తిన్నాను కాదు, నా వస్తువులతో పాటు నా ఖరీదైన లాప్‌టాప్ కూడా పోయేది” అని కాస్త ఊరట చెంది వెనక్కి జారబడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here