లోపలి వ్యక్తుల అలజడి – ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’

0
6

[dropcap]మ[/dropcap]న లోపల ప్రతి ఒక్కరిలో మరొకరు ఉంటారు. సమాజం ఆశించినట్టు బ్రతికేది బయటి మనిషి, తన కోసం, తన కుటుంబం కోసం, తాను నమ్మిన విలువల కోసం బ్రతకాలనుకుని, అలా బ్రతకలేని మనిషి మన లోపల ఉండిపోతాడు.

చాలా సందర్భాలలో ఒత్తిడులకు లోనైన లోపలి మనిషి బండబారిపోయి స్పందించడం మానేస్తాడు. ఎదుటివారి కోసం బ్రతికే బయటి మనుషులు సమాజంలో నిత్యం ప్రబలే ఒరవడులలో కొట్టుకుపోతారు. సున్నితత్వాన్ని, సహానుభూతిని లోపలి వ్యక్తిలోనే ఉంచేసి; కపటం, నటన, నిస్సిగ్గుతనం, ఏదీ పట్టనితనం పైకి తెచ్చుకుని కాలం వెళ్ళబుచ్చుతారు.

అలాంటి వ్యక్తులకూ ఏదో ఒక సందర్భంలో తమలోని లోపలి మనిషిని పైకి తేవాల్సి వస్తుంది. తమకెదురైన అనుభవాలో, కుటుంబంలో వారికి ఎరుదైన ఓ సమస్యో, లేక అత్యంత సన్నిహితులకు సంభవించిన ఘటనో వారిని మేల్కొలుపుతుంది. అప్పుడు లోపలి వ్యక్తులలో అలజడి రేగుతుంది. తమని తాము తరచి చూసుకోవడం ప్రారంభిస్తారు. బయటి మనిషి, లోపలి మనిషి ఒకరే అవడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి వ్యక్తుల కథల సంపుటే పలమనేరు బాలాజి రాసిన ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు…’ అనే పుస్తకం.

ఈ పుస్తకంలో పలమనేరు బాలాజి 2014 – 2018 మధ్య వ్రాసిన 12 కథలున్నాయి. ఈ సంపుటి లోని కథలన్నీ ఆలోజింపజేసేవే! కొన్ని కథలు వేదన కలిగిస్తాయి, కొన్ని కథలు ప్రశ్నిస్తాయి. కొన్ని పాత్రలు సజీవమూర్తులుగా మారి పాఠకుల మనసులో తిష్ట వేసుకుంటాయి. కొన్ని ఘటనలు తమ తమ జీవితాలలో జరిగినవే అనిపిస్తాయి.

ఇవి మానవ సంబంధాల కథలు. ఇంటింటి కథలు. భార్యాభర్తల కథలు. తల్లిదండ్రులు – పిల్లల కథలు. అప్పుల కథలు, వడ్డీల కథలు. నిస్సహాయుల కథలు. సమాజంలోని చేదు వాస్తవాలని చాటే కథలు. దాచేస్తే దాగని సత్యాల కథలు.

***

తల్లికి ఒంట్లో బాగోలేకపోతే, సాయంగా ఉండేందుకు కూతుర్లిద్దరూ వస్తారు. తనకి కొద్దిగా అనారోగ్యం కలిగితే కూతుర్లిద్దరూ తమ సంసారాలనీ, భర్తలనీ, అత్తగార్లని విడిచిపెట్టి రావడం తల్లికి ఇష్టం ఉండదు. తల్లి భయాలను చిన్న కూతురు సమాధానపరుస్తుంది. ‘జీవితం అంతేనేమో! ఏ కాలానికి తగిన విధంగా అలా మనుషుల్ని మారుస్తుందేమో! కాలం, జీవితం, సమాజం కొందర్ని అలా చురుగ్గా మారుస్తాయేమో’ అనుకుంటుందా తల్లి – ‘కొన్ని ప్రేమలు – కాసిన్ని దుఃఖాలు‘ కథలో.

పల్లెల్లో వృత్తులు చేసుకునేవారికి ఉపాధి కరువై వలసపోతే బోసిపోయిన గ్రామంలో మిగిలిపోయిన గుర్రప్ప ఒక్కో ఇంటినీ చూసుకుంటూ ఆ ఇళ్ళల్లోని మనుషులను తలచుకుంటాడు ‘పెద్దోళ్ళు‘ కథలో. “భార్యకి సాయం చేయడమంటే చీకట్లో తోడు రావడం లేదా ఆడదాని కష్టాన్ని అర్థం చేసుకోవడం” అంటుంది గుర్రప్ప భార్య ఓ సందర్భంలో. కుల రాజకీయాలు గ్రామాలలో జీవితాలని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ కథ చెబుతుంది.

మీరేమంటారు?‘ కథలో భర్త చనిపోయిన ఓ మహిళ ఊరి కట్టుబాట్లకు వెరవకుండా, భర్త అవయవాలను అవసరమున్న వారికి ఇచ్చేసి, శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తుంది. ఇది ప్రశంసనీయమైన చర్యే అయినా, ఆమె అలా చేయడానికి పురికొల్పిన పరిస్థితులను తెలుసుకుంటే ‘ఎవరైనా ఏమంటాం’, ‘ఏమనగలం’ అనిపిస్తుంది. “మాటలతో నటించేవాళ్ళు ఎందరో, కాని నిజానికి నిజంగా మనుషుల్ని ప్రేమించేది కొందరే” అంటుందీ కథ.

వర్కింగ్ ఉమెన్ జీవితాలలోని ఒత్తిడులను ప్రస్తావించిన రెండు కథలలో ఒకటి – ‘ఏమైందో, ఏమిటో?‘. ఆదరాబాదరగా బస్సెక్కడానికి వచ్చి, ఆ ప్రయత్నంలో క్రింద పడిపోతుందో మహిళ. రోజూ చేసే ప్రయణాల్లో చావు ఎప్పుడొస్తుందో తెలియదు అంటుందామె. అయితే ‘అసలు మరణం’ ఏమిటో ఈ కథలో ఆమె చాలా స్పష్టంగా చెబుతుంది. రెండవ కథ – ‘ఏమవుతుంది?‘. గ్రీష్మ అనే ఆవిడ ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలతో సతమతమవుతుంటూంది. ఆఫీసులో శాడిజం చూపించే బాస్, ఇబ్బంది పెట్టే కొలీగ్స్, ఇంట్లో బాధ్యతలు పంచుకోని భర్తా, పిల్లలు! కానీ ఒక రోజు ఆఫీసు నుంచి బస్‌లో ఇంటికి వెళ్తున్నప్పుడు మహిళా కండక్టర్ తన కూతురుతో చెప్తున్న మాటలు గ్రీష్మకి ఓ మార్గం చూపుతాయి. ‘ప్రయత్నిద్దాం, ఏమవుతుంది’ అనుకుంటుంది.

‘వీళ్ళెవరో మీకు తెలుసా?‘ కథ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనకెందుకు అనుకుని తప్పించుకోకుండా కాస్త బాధ్యత తీసుకుంటే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుందని చెబుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు కనీస మానవత్వం మరిచి పర్సులు, సెల్‌ఫోన్‌లు దొంగిలించడం హేయమని చెబుతుంది.

‘ఏనుగుల్ని చూసినవాడు‘ కథలో ఏనుగుల్ని చూడాలనుకున్న భాస్కర్ అనే పిల్లవాడు వాటికే బలైపోవడం విషాదం! అయితే జనాలు ఏనుగుల్ని ఏమీ చేయలేదని తెలిసాకా అటవీ అధికారుల మొహాల్లో కనబడిన నిశ్చింత సమాజాన్ని ప్రశ్నిస్తునే ఉంటుంది.

మంచి రోజులు‘ కథ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోనిది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు నిల్చున్నవారిలో – వేరేవారి ఖాతాలలో నగదు డిపాజిట్ చేసేందుకు, వారి నుంచి కొంత డబ్బు తీసుకుని గంటలకు గంటలు క్యూలో నిలబడిన పేదవారుంటారు. తనకు అప్పిస్తాడన్న నమ్మకంతో ఓ ఆసామిని తృప్తి పరిచేందుకు కుటుంబంతో సహా వచ్చి క్యూలో నిలబడతాడో వ్యక్తి. తన ముందు నిలబడిన వ్యక్తి డబ్బు తీసుకుని నిలబడ్డాడని తెలిసి నివ్వెరపోతాడు. పెత్తందారీ సంబంధాలను ఈ కథ వ్యక్తీకరిస్తుంది.

ప్రేమికులైన ఇద్దరు భార్యాభర్తలవుతారు. మొదట కళ్ళు, మనసులు మాట్లాడుకున్నా, చివరికి సత్యం త్వరగానే గ్రహిస్తారు – మాట్లాడుకోవాల్సింది మనుషులని! ఒకరికొకరు దూరమవుతారు, అదృశ్యం అవుతారు. సో-కాల్డ్ డెవెలప్‌మెంట్ అంటే ఏమిటో ‘సూపర్ మార్కెట్‘ అనే ఈ కథ ప్రస్తావిస్తుంది. వేర్వేరు ఊర్లలో ఉన్నవారిలోనే కాకుండా, ఒకే ఇంట్లో ఉంటున్నవారిలో కూడా మనసుల మధ్య దూరాలు ఎందుకు పెరుగుతున్నాయో చెబుతుంది.

‘ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు’, ‘ఖాళీ కప్పులు’, ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’ – ఈ మూడు కథలలో- ఇంటిపనులలో భార్యకి సాయం చేయని భర్తల అంతరంగాల అలజడి గోచరిస్తుంది. ‘మనిషికి ఆలోచన అవసరం మాత్రమే కాదు, నిత్యావసరం, అత్యవసరం కూడా‘ అంటుంది ‘ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు‘ కథ. అన్నీ తెలిసిన శ్రీమతి ఊరెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన భర్తకి – తన ఇంటికే తానొక అపరిచితుడిలా వెడుతున్నానని అనిపిస్తుంది.

చాలా ఫైల్స్, కాగితాలు, వస్తువులూ ఏమిటేమిటో సర్దుకుంటూ ఎప్పటికప్పుడు సమయం లేదనుకుంటూనే కాలం గడిపేసిన ఓ భర్తకి – సర్దుకోవాల్సింది ఫైల్స్, కాగితాలూ, వస్తువులూ కాదని తెలుస్తుంది ‘ఖాళీ కప్పులు‘ కథలో.

ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు‘ కథలో భర్త ఓ సాయంత్రం త్వరగా ఇంటికి వస్తాడు. అప్పటికింకా భార్యా కూతురు ఇంటికి చేరరు. ఎన్నడూ లేని విధంగా ఆ పూట ఇల్లంతా కలయతిరుగుతాడు. అన్నీ కొత్తగా కనిపిస్తాయి. అందంగా కనిపిస్తాయి. ఒకింతసేపు ఇంట్లో నింపాదిగా ఒక్కడే తనతో తాను ఉన్నందుకు ప్రపంచం కొత్తగా కనబడుతుందతనికి. భార్యని అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. కుటుంబంలో వ్యక్తులు సన్నిహితమవ్వాలంటే ఏం చేయాలో ఈ మూడు కథలూ సూచిస్తాయి.

***

ఈ పుస్తకంలోని కథల్లో రచయిత ప్రముఖంగా ప్రస్తావించినది ఎవరికీ ‘తీరుబడి’ లేకపోవడాన్ని, సెల్‌ఫోన్ల మితిమీరిన వాడకాన్ని! టు జి, త్రి జి, ఇప్పుడు ఫోర్ జి స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్‌లు, ఫేస్‌బుక్, చాటింగ్, వీడియో షేరింగ్స్ చేసుకుంటూ – జనాలు తోటివారితో మాట్లాడడమే మానేస్తున్నారనీ; సామాజిక మాధ్యమాలలో మెసేజ్‌లు పంపడంతో తమ సామాజిక బాధ్యత తీరిపోయిందనుకునేవాళ్ళు ఎక్కువైపోయారని రచయిత అంటారు. మాట్లాడాలంటే మనిషి ఉండాలి, మాట్లాడాలంటే మనసు ఉండాలి; మనుషులు, మనసులు మొదటగా దొరికేవి ఇళ్ళల్లోనే అని ఈ కథలు చెబుతాయి.

తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

***

ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు (కథా సంపుటి)
రచన: పలమనేరు బాలాజి
ప్రచురణ: స్వచ్ఛత ప్రచురణలు, బెంగుళూరు
పేజీలు: 158, వెల: రూ 100
ప్రతులకు: శ్రీమతి గండికోట వారిజ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010
ఇంకా నవోదయ, ప్రజాశక్తి, నవతెలంగాణ, నవచేతన, విశాలాంధ్ర బుక్ హౌజ్ శాఖలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here