కాజాల్లాంటి బాజాలు-35: ఒకరోజు యేమయ్యిందంటే…

3
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఏం[/dropcap]టో ఈ మధ్య నాకు పరిశీలన ఎక్కువైందో లేకపోతే అసలు మనుషులే ఇలా మారిపోయేరో కానీ ఎక్కడికి వెడితే అక్కడ ఒక్కొక్కరకం కొత్త అనుభవం ఎదురౌతోంది.

నిన్న నేను బీపి చూపించుకుందుకు డాక్టర్ దగ్గర కెళ్ళినప్పుడు ఒక తమాషా జరిగింది. నేను వెళ్ళేటప్పటికే అక్కడ కొంతమంది కూర్చుని వున్నారు. నేను కూడా బుధ్ధిగా వరసలో కూర్చున్నాను. నా ముందు నడివయసు మగవాళ్ళు యిద్దరున్నారు. వాళ్ల తర్వాత నేనే కదా అనుకుంటూ వాళ్ళెప్పుడు వెడతారా అని చూస్తూ కూర్చున్నాను.

వాళ్ళలో యెవరు పేషంటో, యెవరు మరొకరికి సాయం వచ్చేరో తెలీదు కానీ, యిద్దరి చేతుల్లోనూ రిపోర్టులూ, ఎక్స్‌రేలూ కనిపిస్తున్నాయి. సరే.. వాళ్ళ వరస రాగానే యిద్దరూ లోపలికెళ్ళారు. బహుశా వాళ్ళకి వాల్యూమ్ కంట్రోల్ లేదేమో, వాళ్ళు లోపల మాట్లాడుకున్న మాటలన్నీ వద్దనుకున్నా స్పష్టంగా బైటకి వినిపిస్తున్నాయి.

డాక్టర్ రిపోర్టులూ గట్రా చూసేరనుకుంటాను.. యెప్పట్నించీ యిలా వుందీ.. అని అడిగేరనుకుంటాను.. “ఎప్పట్నించంటేనండీ.. చాల్నాల్నించండీ..”

“అదే యెన్ని రోజుల్నించి..”

“ఎన్ని రోజులంటేనండీ.. అదే మా పెద్ద గేదె యీనింది సూడండీ..”

“అబ్బ.. బావా.. ఆవూ, గేదే కాదు. డేట్ చెప్పు..” పక్కనున్న మనిషి గొంతనుకుంటాను, వినిపించింది.

“డేటంటే.. అదేరా మరీ.. ఎప్పుడంటే.. అదే మా తమ్ముడి గుంటడికి పంచె కట్టిపియ్యలా.. అప్పటి సంది..”

“అబ్బ.. డేట్ బావా..”

“అదే చెపుతుండాగదయ్యా.. ఆ .. గురుతొచ్చింది.. అదయ్యాకనే కదా మా మరదలు కూతురికి వోణీ పంక్సనుంటే యెళ్ళింది.. వోణీ పంక్సనుకి నేనెందుకే అంటే యినలా.. గదేటి బావా.. గట్లంటవు.. నీకన్న నాకెవరుంటిరి.. నువు రాకపోతె పంక్సను కేన్సిలు సేసేత్తానంది గదూ..”

“అబ్బ బావా డేట్ చెప్పు..”

“మరి గదేకద సెపుతుండాను.. నా మరదలి కూతురి వోణీ పండగెప్పుడయిందో నీ కెరుకనే గదా.. నువు సెప్పొచ్చు గద..అదయినంకనే గద.. మనూరి పంతులిగోరి అమ్మాయి లగ్గమయిందీ..”

“బావా..డేట్ బావా”

“అరె.. ఇన్ని సెపుతున్నా గింకా నీకు డేట్ గురుతురాలా.. పోనీ.. మన పక్కింటి పంకజానికి గా రోజే గద పిల్ల బుట్టింది.. గాడపిల్లని ఆరందరూ వూ యిదయిపాతాంటే యెల్లి ఆల్లకి నచ్చజెప్పిన కాద..”

“అబ్బ..బావా..”

“ఇదిగో.. నువ్వట్లా తెలీనట్లుంటే యెట్లా.. గప్పుడేగదా.. మీ అక్క సేసిన ఆక్కూరపప్పు మూడుసార్లు యేసుకున్నవు. అంత యాద్ మర్సితె యెట్లా.. ఆ డాకటేరుకి సరిగ్గా సెప్పందే నాకు మంచి మందులెట్లిస్తడు సెప్పు.. గిన్ని సెప్పినా కదా.. ఆ డేట్ ఇంకా గురుతురాలే?”

అలాగ సుమారు ఓ పావుగంటసేపు మా ప్రమేయం లేకుండానే ఆ డేటేమిటో తెలుసుకునే మార్గాలన్నీ మా చెవుల్లో పడుతూనే వున్నాయి. మా బుర్రంతా ఫంక్షన్లతోటీ, వంటకాలతోటీ నిండిపోయింది తప్పితే డేటు మటుకు తెలీలేదు.

తర్వాత వెళ్ళాల్సింది మేమే.

లోపల డాక్టర్ గారు మేం వెళ్ళేసరికి యెలా వుంటారో అని భయపడుతూ వెళ్ళిన మాకు ఆయన చిద్విలాసంగా కనిపించారు. హూ.. రోజూ పొద్దున్నలేచి ఇన్నిరకాల మనుషులతో వేగుతున్న ఆయనకి చెయ్యెత్తి దండం పెట్టాలనిపించింది.

సరే, డాక్టర్ దగ్గర పనయ్యాక మైన్ రోడ్ లో ఉన్న బేకరీకి వెజ్ పఫ్స్ కొనుక్కుందామని వెళ్ళేను. అక్కడ నాకు కావల్సినవి చూసుకుంటుంటే ఒకాయన ముఫ్ఫై సంవత్సరాలుండొచ్చు, వచ్చారు. అక్కడ కౌంటర్ ముందున్నాయనతో యేదో మాట్లాడి, ఇంకక్కణ్ణించి మొబైల్‌లో మాట్లాడడం మొదలెట్టారు. ఇదిగో యిలా..

ఇట్నుంచి..–బంగారం…నువ్వు చెప్పిన కేక్ అయితే రెండురోజుల ముందర ఆర్డరివ్వాల్ట. రేపటికైతే యివ్వలేడుట..

అట్నుంచి—

సాయంకాలానికా.. అడుగుతానుండు.. బాబూ, రేపు సాయంకాలానికి యివ్వగలవా..

కుదర్దుట బంగారం..

————

యే బేకరీ కెళ్ళినా అంతేనేమో..

——-

సరే అడుగుతా.. బాబూ.. పోనీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావాలి రేపటికి ఇస్తావా… ఆ ఇస్తాడుట బంగారం

—————-

కింద చాక్లెట్ పైన బ్లాక్ ఫారెస్టా.. అడుగుతానుండు.. ఏం బాబూ… ఉహు.. కుదర్దుట బంగారం.. కిందా పైనా ఒక్కటే చేస్తాడుట..

బంటీకి చాక్లెట్ కావాలి సరే మరి నీకు బ్లాక్ ఫారెస్ట్ కావాలి కదా బంగారం..

————

నో.. నో.. స్వీటీ.. నువ్వు సద్దుకోవడవేవిటీ.. పోనీ మొత్తం బ్లాక్ ఫారెస్టే తీసేసుకుంటా..

—————-

నిజవే ననుకో.. బర్త్ డే బంటీదే ననుకో..అయినా సరే.. నీ యిష్టం కన్నానా..

మరి పైన క్రీమ్ యేం వేయించనూ..బాబూ.. పైనాపిల్ క్రీమా.. ఓకే బంగారం..

————————

ఏంటీ.. పైన చోటా భీమ్ బొమ్మా.. వద్దొద్దు బంగారం.. నీకు టైటానిక్ అంటే యిష్టం కదా.. షిప్ బొమ్మ పెట్టమంటాను..

——————————-

బెలూన్లు పువ్వుల్లా కట్టేసి వున్నవే తెస్తాను.. మళ్ళీ నువ్వు వూదడం అదీ కష్టం కదా బంగారం..

———————-

ఆ.. అలాగే.. వచ్చేటప్పుడు టైలర్ దగ్గరున్న నీ బ్లౌజ్ తేవాలి కదా! గుర్తుందిరా బంగారం..

———-

నాకింక బుర్ర తిరిగిపోయింది.. ఆ బంగారం యెవరోకానీ యే బంగారం పూలతో పూజ చేసిందో అనుకుంటూ షాప్ బైట కొచ్చేసేను.

అక్కణ్ణించి మెడికల్ షాప్ కి వెళ్ళే పనున్నాకానీ ఇంక ఇవాల్టికి నా బుర్రకి ఈ డోస్ చాల్లెమ్మనుకుంటూ ఇంటికొచ్చేసేను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here