ఒకే పానవట్టము మీద ఉన్న రెండు శివలింగములు

0
11

[‘ఒకే పానవట్టము మీద ఉన్న రెండు శివలింగములు’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు.]

[dropcap]2[/dropcap]024 జనవరి 22 న రామమందిరములో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగి గర్భగుడిలో అయోధ్య రాముడు కొలువై పూజలందుకుంటున్నాడు. ఆ శుభవేళ నుంచి మనము పులకరించి పరవశించిపోతున్నాము. 1949 తవ్వకాలలో లభించిన బాలరాముడి విగ్రహం కూడ ఉత్సవమూర్తిగ గర్భగుడిలో ప్రతిష్ఠింపబడాలన్న ప్రజాభీష్టం మన్నింపబడింది. గర్భగుడిలో రెండు మూలవిరాట్టులు ఆమోదము. ఈ సందర్భముగ 150 సంవత్సరాల క్రితం రాజవరం అనే గ్రామములో ఒకే పానవట్టము మీద రెండు శివలింగములు ఆమోద సంఘటన గురించి చెప్పాలనిపించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలము విశిష్టత జగద్విదితము. కోనసీమ తిరుపతిగ ఈ మండల గ్రామమైన వాడపల్లి ఇప్పుడు  విశ్వ ఖ్యాతి. ఏడు శనివారముల వ్రత దీక్ష మనోరథము  సిద్ధింపచేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి అద్భుతమైన దేవాలయమున్న గ్రామము. రెండవ తిరుపతిగ అతిశయోక్తి కాదు, శనివారము నాడు తిరుపతిని తలపించే అలౌకికానుభూతి అనుభవైద్యేకముగ విశ్వవ్యాప్తమైన మాట నిజము.

ఆత్రేయపురం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు కూడా విశేషమైన ఖ్యాతి కలిగి ఉన్శాయి. ఆత్రేయపురంలో అత్రి మహాముని తపస్సు చేసాడు. ఆత్రేయపురం పూతరేకు ప్రపంచ ఆహార ప్రసిద్ధ తినుబండారపట్టికలో చేరింది. భాగవతములో శుకమహర్షి పేర్కొ న్న ఖట్వాంగముని ఆత్రేయపురం సమీప గ్రామము కట్టుంగలో ముక్తి పొంది ఆ గ్రామము పేరును ధ్వనించేపస్తున్నాడని నమ్ముతున్నారు. స్వామి వెలిశారు అని స్వయంభువు శివలింగము ఖ్యాతిగ పిలువబడుతున్న సమీప గ్రాము వెలిచేరు, బ్రహ్మసూత్ర శివలింగము, రెండు ధ్వజస్తంభాల వేణుగోపాలస్వామి ఆలయమున్న ఊరుగ పేరవరం దర్శనీయ దేవాలయాల పట్టికలో చేరాయి.

పేరవరం ఎదురు గ్రామము రాజవరం. ఒకే పానవట్టము మీద రెండు శివలింగములు కలిగి వాడపల్లి వేంకటేశ్వర స్వామితో బాటు దర్శనీయమై యాత్రికులను రాజవరం ఆకర్షిస్తుంది. మహిమాన్వితమైన వృత్తాంతము కలిగి ఉంది.

రావులపాలెం.. ఆత్రేయపురం.. బొబ్బరలంక బస్సురూటులో బొబ్బరలంకకు ముందు గ్రామము పేరవరం. పేరవరానికి ఎదురుగ రాజవరం. రెండు గ్రామాలను కాటన్ కాలువ విడదీయుట వలన వంతెన నిర్మించుకున్నారు. వంతెన దాటితే అర కిలోమీటరు నడక దూరంలో శివాలయం ఉంది.

రాజవరం గురించి తెలుసుకోవాలి. ఆకాశవాణిలో వార్తలు చదివిన కందుకూరి సూర్యనారాయణ స్వగ్రామమిది. ఆయన తండ్రి కందుకూరి రామభద్రరావు గారు ప్రముఖ కవి. ఈ గ్రామానికి తొలి పంచాయతీ అధ్యక్షులు. అంతేకాదు ప్రముఖ స్వాతంత్య్ర యోధులు అయ్యగారి సుబ్బారావుగారి స్వగ్రామమిది. రాజవరం గ్రామపంచాయతీ అధ్యక్షులుగ సుబ్బారావుగారు కూడ పేరుగాంచిన వారు. గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యమున కనుగుణముగ తీర్చిదిద్దిన తీరు నేటికి ఆదర్శము. ప్రకాశం పంతులుగారి అనుచరులు. 96 సంవత్సరములు జీవితచరిత్ర ఆయనది. అజాతశత్రువు. కందుకూరి, జొన్నలగడ్డ, అయ్యగారి యింటి పేర్లు కుటుంబీకులు గ్రామ పెద్దలుగ నేటికీ ఆ గ్రామము వారి చేత విశేషమైన ఆదరణ గౌరవము పొందుతున్నారు. రెండు కుటుంబాలకు ఈ ఆలయ చరిత్రతో సంబంధం ఉంది.

రాజవరంలో శివాలయం ఊరు పుట్టినప్పటినుంచి ఉంది. సుమారు 150 సంవత్సరాలపైబడిన రెండు శివలింగములతో సంఘటన మాత్రం నేడు జరిగిన సంఘటనగ తరాల చరిత్ర. ఊరు పుట్టుక నాటినుంచీ ఉన్న శివాలయానికి కందుకూరివారు అనువంశిక ధర్మకర్తలు.

స్వాతంత్య్ర యోధులు సుబ్బారావుగారి తండ్రి అయ్యగారి పట్టెయ గారు. భూస్వామి. శివభక్తుడు. శివసాక్షాత్కారము లభించింది. ఉదయం సాయంకాల సమయాలు శివస్తోత్రములు మైమరచి చేసేవారు. కందుకూరి వారికి బంధువులు. అయ్యగారి పట్టెయ గారికి శివాలయం ప్రాణమైపోయింది.

కందుకూరి వారింటి కుటుంబపెద్ద కాశివెళ్ళారు. 1880 ప్రాంతము కావచ్చు. అప్పటికింకా కాశివెళ్ళి తిరిగి రావడం పునర్జన్మ వంటిది అనకపోయినా విశేషమైన స్పందన ఉండేదిట. మేళ తాళములతో ఆహ్వానము. గంగచెంబులు పంచడం, కాశీ సమారాధన ఆహ్లాదకరమైన బంధుమిత్ర సమాగము కోలాహలం ఉండేవి. ఆయన కాశీనుంచి శివలింగము తెచ్చారు. సంపన్న గృహస్థు పైగా గుడికి ధర్మకర్త. కాశీయాత్రను చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు.

దేవాలయములో పాత శివలింగమును తొలగించి కాశీనుంచి తెచ్చిన  శివలింగాన్ని నూతనంగ వ్రతిష్ఠించదలచానన్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించారు. గర్భగుడిలో రెండు మూలవిరాట్టులు ఉండకూడదు. అందుచేత పాతది పెకలించి నదిలో నిమజ్జనము చేయడానికి కాశీనుంచి తెచ్చిన నూతన శివలింగము ప్రతిష్ఠింపబడాలన్న నిర్ణయాలయ్యాయి.

సుబ్బారావు గారి తండ్రి పట్టెయ గారు తను నిత్య జీవిత ఆరాధనలో పెనవేసుకొన్న శివలింగము దూరము కావడంతో ఆలోచన, వేదనకు గురయ్యారు. ఊరు పుట్టిన ప్పటినుంచి తెలియని కాలము నుంచి లింగరూపుడై విశ్వేశ్వర నామధేయముగ స్వామి మహిమాన్వితుడు. ఆవేదనతో తపించి విలపిస్తున్న ఆయన సాక్షాత్కరించిన శివస్వరూపమే అనిపించారట. “మీరెంత ప్రయత్నించిన నా స్వామిని పానవట్టం నుంచి తొలగించలేరు” అని ధ్యాన ముద్రలో మునిగి పోయారు.

గ్రామ ప్రజలు విస్తుపోయారు, జనం అద్భుతమైన శివస్వరూపముగ పట్టెయ గారిని భావించి శివాఙ్ఞగ పాతశివలింగమును తొలగించలేదు. అతిశయోక్తియేమో తెలియదు. పెకలించలేక పోయారట. అందుచేత ఏక కాలములో రెండు శివలింగములతో అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామిగ ఒకే పానవట్టము శివాలయమయింది.

అన్నపూర్ణ సహితుడై ఒకే పానవట్టం మీద రెండు శివలింగములకు ఆర్చనాదికాలుతో బాటు కల్యాణ వేడుక కూడ నిర్వహిస్తారు. పట్టెయ గారి శివలింగముగ కీర్తనీయమయింది. శిధిలమైన దేవాలయాల పరిరక్షణలో నూతనంగ విగ్రహావిష్కరణగ ఆది నుంచి ఉన్న మూలవిరాట్టు నిరాకరణ నిమజ్జనం సంప్రదాయము ఐఛ్చికము కావాలి తప్ప తప్పనిసరిగా పూజార్హం అవుతాయని అని చెప్పడం ఈ వ్యాస ముఖ్యోద్దేశము.

అయ్యగారి సుబ్బారావుగారి కుమారులు పట్టెయ గారు విశ్రాంత ఇంజనీరోద్యోగి. అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. రాజవరం లోనే ఉన్నారు. 80వ పడిలో ఉన్నారు. వారి నుంచి సేకరించిన విషయమిది. వారి పెదనాన్న అయ్యగారి నరసింహం గారు నూజివీడు సంస్థానోద్యోగి. తరచు ఈ విషయం ప్రస్తావన చేసేవారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here