ఒక్క పుస్తకం-1

16
5

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం’ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

1

[dropcap]ప్ర[/dropcap]తీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా యన్.టి.ఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభమై పది రోజుల పాటు నిరాటంకంగా కొనసాగింది. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, చెన్నైయ్, ఇతర ముఖ్యమైన పట్టణాల నుండి తరలి వచ్చిన బాగా పేరున్న బుక్ పబ్లిషర్స్, దాదాపు 210 మంది పుస్తక విక్రయదారులు, సుమారు 330 స్టాల్స్ ద్వారా తమ పుస్తకాలను సందర్శకులకు అందుబాటులో వుంచారు. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం గం2-30ని నుండి రాత్రి 8-30 వరకు, శని ఆదివారాలు, ఇతర శలవు దినాల్లో మధ్యాహ్నం గం.12-00ని నుండి రాత్రి 8-30ని వరకు సందర్శకులను ఒక్కొక్కరికి రూ 5/- ప్రవేశరుసుముతో అనుమతిస్తారు. అదే విద్యార్ధులకైతే గుర్తింపు కార్డు చూపిస్తే ఏ రుసుమూ లేకుండా ఉచితంగా అనుమతిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ బుక్ ట్రస్టు, ఓపెన్ యూనివర్శిటీ, బ్రటిష్ మరియి ఆక్స్ ఫెర్డ్ బుక్ కౌన్సిల్స్ తమ తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఒక స్టాల్‌లో వారణాసి నుండి వచ్చిన సంస్కృత భాషా పుస్తకాలు, ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు, ఉంచారు.

నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్‌లో మనదేశంలో వాడుకలో వున్న దాదాపు 30 భాషల్లో ముద్రించబడిన పుస్తకాలను ఉంచారు. మూడు సంవత్సరముల పైబడి వయసున్న పిల్లల మేధస్సును పెంపొందించే పుస్తకాలను కూడా ఉంచారు. పిల్లలు సైన్స్, మాథమెటిక్స్ సబ్జెక్టులను సులభతరంగా త్వరితగతిన నేర్చుకోడానికి గాను ప్రత్యేకమైన ప్రాక్టికల్ గేమ్స్ కిట్‌లను కూడా ఉంచారు.

ఒక స్టాల్‌లో ఉర్దూ, తెలుగు, గుజరాతీ, హిందీ మరియు ఇతర భాషల్లో ముద్రించబడిన భగవద్గీత పుస్తకాలను ఉంచారు.

సందర్శకుల ఆకలి తీర్చడానికి టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దప్పిక తీర్చడానికి కూల్ డ్రింక్ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, తోపుడు బండ్లపై కొబ్బరి బోండాలు, పానీ పూరీలు దర్శనమిస్తున్నాయి. ఎవరికి ఇష్టమైంది వారు తింటూ, తాగుతూ సంతుష్టులవుతున్నారు సందర్శకులు.

ఒక ప్రక్కగా చిన్న వేదిక, ఎదురుగా నూటికి పైగా కుర్చీలు, వేదిక పైన అరడజను కుర్చీలు, ఒక టీపాయ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి రోజూ సాయంత్రం ఆ వేదిక పైన ప్రముఖ రచయితలు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు, లేదా రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఐదారు కొత్త పుస్తకాలు వేదిక ముందు, ఆసీనులైవున్న పాఠకుల కరతాళధ్వనుల మధ్య ఆవిష్కరించబడుతున్నాయ్.

ఈ బుక్ ఫెయిర్ చూస్తుంటే సర్వం ఇంటర్నెట్, ఆన్‌లైన్ మయమైపోయిన ఈ రోజుల్లో ఇంకా ముద్రించబడిన పుస్తకాలు చదివే పాఠకులు వున్నారని అనిపించకమానదు. ముఖ్యంగా నూతనంగా రచనా రంగంలోకి అడగిడుతున్న రచయితలకు, రచయిత్రులకు బుక్ పబ్లిషర్స్‌కు పుస్తక విక్రయదారులకు ఇదొక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించి ముందుకు నడిపించే ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

ఆ రోజు ఆదివారం. శలవు దినం కావడం వల్ల సందర్శకులు తండోపతండాలుగా వచ్చారు. జన సందోహంతో ఆ ప్రాంగణమంతా కిటికిట లాడుతుంది. సాయంత్రం 7-00 గంటలు కావస్తుంది. యల్.ఇ.డి బల్బులు, ఫడ్ లైట్లు వెదజల్లే కాంతి పుంజాలతో ఆ ప్రాంతమంతా ధగ ధగ లాడుతుంది. సందర్శకుల తాకిడితో స్టాల్స్ అన్నీ కళ కళ లాడుతున్నాయ్.

మొత్తానికి ఒక తిరునాళ్ల, ఒక జాతర ఒక పండుగను తలపిస్తుంది ఈ బుక్ ఫెయిర్.

2

బయటి కొచ్చి చూస్తే, యన్.టి.ఆర్ స్టేడియం ప్రవేశ ద్వారానికి ప్రక్కగా అందరికీ ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఒక బ్యానర్ కట్టబడి వుంది. ఆ బ్యానర్ పై వ్రాసి వున్న విషయం అటుగా మెయిన్ రోడ్ పై వెళ్తున్న అనేక మంది మనస్సుల్లో ఒకింత ఆసక్తిని రేపుతున్న మాట నిజం. ఆ విషయం ఇదే.

“ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది.” ఇప్పుడే కొనండి, వెంటనే చదవండి. మీ జీవితంలో అనూహ్యమైన, ఆనందమైన మార్పును ఆహ్వానించండి.

దొరుకు స్థలం- స్టాల్ నెంబర్ 123

 అలా ఆ ప్రకటనకు ఆకర్షితులై లోపలికి ప్రవేశించి, వెతుక్కుంటూ 123వ స్టాల్ దగ్గరకు వచ్చిన చాలా మందిలో ముగ్గురు వ్యక్తులే మన కథకు మూలం.

అందులో మొదటి వ్యక్తి… సుమారు 40 సంవత్సరాలు వయసు, అందమైన గుండ్రటి ముఖం, బంగారు రంగు దేహఛాయ, కుదురుగా అమర్చబడిన ఒత్తుగా పెరిగిన నల్లని తలజుట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం, మీసం, స్కైబ్లూ కలర్ టైట్ జీన్స్ ప్యాంట్, టోమాటో రెడ్ కలర్ కాలరున్న లెమన్ యెల్లో కలర్ టీషర్ట్, కాళ్లకు వైట్ కలర్ ఆదిదాస్ షూస్, భూజానికి వ్రేలాడుతున్న ఇటుకరాయి రంగు లాప్ టాప్ బ్యాగు, చూడగానే నవతరానికి ప్రతీకగా నిలిచే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపంచాడు….

ఇక రెండో వ్యక్తి… సుమారు 27 సంవత్సరాలు వయసు, చామనఛాయి శరీరం, అందమైన ముఖకవళికలు, మాసిన గడ్డం, తైలసంస్కారంలేని పక్షి గూడులాంటి తలజుట్టు, రంగు వెలిసిన నల్లరంగు ప్యాంటు, వన్నెతగ్గిన తెల్లరంగు షర్టు, అరిగిపోయిన పాదరక్షలు, నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ, దైనందిక జీవితంలో ఏ మాత్రం క్రమశిక్షణ పాటించని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించాడు.

ఇక మూడోవ్యక్తి. సుమారు 22 సంవత్సరాల వయస్సు, అందం ఆకర్షణ సమపాళ్లలో మేళవించి, చెదిరిపోని చిరునవ్వులు చిందించే కోల ముఖం, నవనవలాడుతున్న లేత పసుపు రంగు మేనిఛాయి, నున్నగా దువ్విన తల జుట్టు, వెనుక వేలాడుతున్న పోనీ టైల్ జడ, ఆకుపచ్చరంగు లెగ్‌ఇన్, రోజ్ కలర్ కుర్తా, హైహీల్స్, చేతిలో తెల్లరంగు వ్యాలెట్, ఏ మాత్రం హంగు ఆర్భాటం లేకుండా తయారై, వినయవిదేయతలు ఉట్టిపడే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించింది.

3

ఆ ముగ్గురూ తలో వైపు నుండి 123వ నంబరు స్టాల్‌లో ప్రవేశించి తమకు కావలసిన పుస్తకం కోసం నింపాదిగా వెతుక్కుంటూ ఆ పుస్తకం ఉన్న చోటికి చేరారు. చూడగా, అక్కడ వారికి కావలసిన పుస్తకం ఒకే ఒక్క ప్రతి వుంది. ఉన్న ఆ ఒక్క పుస్తకాన్ని తీసుకోనేందుకు ముగ్గురూ ఒకే సారి ఆ పుస్తకంపైన చేయివేశారు…. చేయి తీయకుండానే ముగ్గరూ ఒకరి ముఖంవైపు మరొకరు 50 సెకన్ల పాటు తీక్షణంగా చూసుకున్నారు.

తరువాత రెండవ, మూడవ వ్యక్తులు కరెంటు షాక్ తగిలినట్లు తమ చేతులను ఉన్నపళంగా వెనక్కి లాగేసుకున్నారు. మొదటి వ్యక్తి చిరునవ్వు చిందిస్తూ “సారీ అండీ ఒకటే వున్నంట్లుంది. అయినా ఒక సారి స్టాల్ మేనేజరును అడిగి వస్తాను. మీరు ఇక్కడే వుండండి” అంటూ ఆ పుస్తకాన్ని తీసుకొని మేనేజరుగారితో ఏదో మాట్లాడి తిరిగి వచ్చాడు.

“ముద్రించిన పుస్తకాలన్నీ అయిపోయాయట తిరిగి ముద్రిస్తున్నారట. రేపు స్టాల్లో పెడతామని చెప్పాడు” అని మిగతా యిద్దరితో చెప్పాడు.

“అన్నట్లు…. ఈ పుస్తకంలో ఏదో వుంది. అందుకే అంత గిరాకీ. మీకు అభ్యంతరం లేకపోతే… అలా బయటకు వెళ్లి టీ తగుతూ… అసలు ఇందులో ఏముందో చూద్దాం…. ఓకేనా?” అని అడిగాడు.

ఒక్కసారి ఒకరి ముఖం ఒకరు చూసుకొని “సరే రండి” అంటూ తలాడించారు మిగతా ఇద్దరు.

‘గుడ్’ అంటూ ఆ మొదట వ్యక్తి పుస్తకానికి డబ్బు చెల్లించి బయటకు నడిచాడు. మిగతా ఇద్దరూ మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించారు.

4

అలా బయటకు వచ్చి ఎదురుగా వున్న టీస్టాల్ ముందు ఓపెన్ ప్లేస్‌లో వున్న టెబిల్ దగ్గర కూర్చున్నారు. బేరర్‌ని పిలిచి ముగ్గురికీ కొన్ని స్నాక్స్, టీ ఆర్డర్ చేశాడు ఆ మొదట వ్యక్తి.

“అన్నట్లు… నేనెవరో చెప్పనే లేదు కదూ… నా పేరు సదానంద్… మరి మీ పేర్లు తెలుసుకోవచ్చా?” అడిగాడు మొదటి వ్యక్తి…

“నా పేరు శ్రీకాంత్” చెప్పాడు ఆ అబ్బాయి.

“నా పేరు శ్రీలక్ష్మి” చెప్పింది ఆ అమ్మాయి.

“గుడ్…. మొత్తానికి ఈ పుస్తకం కోసం మన ముగ్గురం ఒకరి నొకరం కలుసుకోగలిగాం. ఇప్పటి వరకు మన ముగ్గురం ఒకరికొకరం అపరిచితులం… ఇక నుండి సుపరిచితులం. కాబోతున్నాం… అవునా?” అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు సదానంద.

“అవునండి” అని కొంచెం నిరుత్సాహంగా సమాధాన మిచ్చారు… విషయం అర్థకాని, శ్రీకాంత్, శ్రీలక్ష్మి.

“గుడ్… నిజానికి… వృత్తిరీత్యా, వ్రవృత్తి రీత్యా మన ముగ్గురులో తేడా వుండవచ్చు. సామాజికంగా, ఆర్థికంగా మనలో ఎక్కువ తక్కువలు వుండవచ్చు. మన అలవాట్లు, మన అభిప్రాయాలు, భిన్నంగా వుండవచ్చు. కాని…. ముగ్గురిలో ఒకే ఒక కామన్ ఫ్యాక్టర్…” అంటూ సదానంద్ ఏదో చెప్పబోతున్న సమయంలో, బేరర్, స్నాక్స్, టీ చేబిల్ పై వుంచాడు. శ్రీకాంత్ , శ్రీలక్ష్మి… ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అనే మీమాంసలో పడ్డారు. తీసుకొండంటూ… సైగ చేశాడు సదానంద్ అందరూ స్నాక్స్ తినడం మొదలెట్టారు.

“గుడ్… ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ పుస్తకంలో ఏదో విశేషం ఉందనీ… అది, మన జీవితాలను ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుస్తుందనే నమ్మకం. ఆ నమ్మకమే…. ఇప్పుడు మన ముగ్గుర్ని కలిపింది” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు సదానంద్.

కళ్లప్పగించి చూస్తుండిపోయారు శ్రీకాంత్, శ్రీలక్ష్మి.

“గుడ్… ఏ క్షణం అయితే మన ముగ్గురం కలసి ఒకే సారి ఈ పుస్తకం పై చేతులు వేశామో… ఆ క్షణమే… నా సిక్త్స్ సెన్స్ నాకు చెప్పింది. ఇక పై మన ముగ్గురం కలిసి ఒక్కటిగా నడుస్తూ గొప్ప కార్యాక్రమాలు చేయబోతున్నామని. మన ముగ్గురి కోసం ఓ బంగారు భవిష్యత్ ఎదురు చూస్తుందని తెలియజేసింది. అందుకే మీ ఇద్దరితో ఇంత వివరంగా మాట్లాడు వలసి వచ్చింది” అంటూ టీ త్రాగడం పూర్తి చేశాడు సదానంద్.

ఆ మాటలు శ్రీకాంత్, శ్రీలక్ష్మి మనసుల్లో ఒకింత సంతోషాన్ని నింపాయి. తొందర తొందరగా టీ త్రాగారు. టేబిల్ పై కొంచెం ముందుకు వంగి కుతూహలంతో శ్రద్ధగా వినడం మొదలెట్టారు.

5

“గుడ్… ముందుగా నా గురించి మీకు చెప్తాను. మాది తూర్పు గోదావరి జీల్లా…. కోనసీమలోని అమలాపురం.

రాజమండ్రి దాటిన తరువాత గోదావరి నది రెండు పాయలుగా చీలుతుంది. అందులో ఒకటి గౌతమిగోదావరి, మరొకటి వశిష్ట గోదావరి. తిరిగి గౌతమి రెండు పాయలుగా చీలుతుంది. ఒకటి గౌతమి, మరొకటి నీలరేవు. అలాగే వశిష్ట కూడా రెండు పాయలుగా చీలుతుంది. ఒకటి వశిష్ట, మరొకటి వైనతేయ. ఈ నాలుగు పాయలు వేరు వేరు చోట్ల బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నాలుగింటి మధ్యన వున్న సారవంతమైన డెల్టా సముద్ర తీరం వెంట సుమారు 170 కి.మీ… అంటే 110 మైళ్లు పొడువున విస్తరించి వుంటుంది. ఈ నాలుగు పాయల మధ్యన ఉండే ప్రాంతాన్ని కోనసీమ అంటారు.

దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర ప్రకృతి సౌందర్యాన్ని ఆహ్లదకరమైన వాతావరణాన్ని తలపింపజేస్తుంది కోనసీమ. కోనసీమ అందలను వర్ణించాలంటే మాటలు చాలవు. ముఖ్యంగా ఆ కొబ్బరి, అరటి, కలబంద తోటల సోయగాలు, వరి పొలాల సొగసులు, నేలపై పచ్చదనాన్ని ఆరబోసినట్లుంటాయ్. ప్రశాంతంగా ప్రవహించే పంటకాలువలు, అక్కడక్కడా వాటి పై నిర్మించబడిన చిన్న చిన్న వంతెనలు, మనుషులను, వస్తువులను ఒక చోట నుండి మరో చోటకి చేరవేసే తెరచాప పడవలు,లాంచీలు, పెర్రీబోట్లు… అదనపు శోభను చేకూరుస్తుంటాయ్.

ఇకపోతే కోనసీమలోని దేవాలయాల గూర్చి, చేప్పుకోవాలంటే… అయనవిల్లి సిద్ధి వినాయకస్వామి దేవాలయం, అంతర్వేది నరసింహస్వామి దేవాలయం, అప్పనపల్లి బాల బాలాజీస్వామి దేవాలయం, మందపల్లి శనేశ్వర స్వామి దేవాలయం, మురముళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం, పలివెల శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర స్వామి దేవాలయం, ర్యాలీ జగన్‌మోహినీ కేశవ స్వామి దేవాలయం, వానపల్లి శ్రీ పల్లాలమ్మ అమ్మవారి దేవాలయం… ఎంతో చారిత్రాత్మకమైనవి.

అంతటి సుందరమైన ప్రాంతం కాబట్టే ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట సినిమాల కోసం, టెలీ సీరియల్స్ కోసం ఘాటింగ్‌లు జరుగుతూనే వుంటాయ్.

నిండైన వృక్ష సంపదతో కలుషిత రహిత స్వచ్ఛమైన ప్రాంతం కాబట్టే… ‘కోనసీమలో గాలి భోంచేసి బతికేయెచ్చు’ అనే నానుడి ప్రచారంలో వుంది.

కోనసీమలోని పట్టణాలలో రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం, రాజోలు, ముమ్మడివరం… ముందు వరుసలో వుంటాయ్.

అంతటి ప్రాచుర్యాన్ని సంతరించుకున్న ప్రాంతంలో… అదే… కోనసీమలో పుట్టి పెరగడం… నా అదృష్టం.. పూర్వజన్మ సుకృతం.”

6

“మా కుటుంబ నేపధ్యం వ్యవసాయం. ఆ ఏరియా మొత్తంలో మాదే అత్యధిక ధనిక కుటుంబం. మా నాన్నాగారు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అత్యధిక పంట దిగుబడులు సాధించి రాష్ట్ర స్థాయిలో ముడు సార్లు ఉత్తమ రైతు ఆవార్డును గెలుచుకున్నారు. ప్రత్యేకంగా కొబ్బరి తోటల సాగులో రికార్డు స్థాయిలో ఉత్పత్తులు సాధించినందుకు ఢిల్లీలో మనదేశ అధ్యక్షులు, నగదు బహుమతి, ప్రశంసాపత్రంతో మా నాన్నగారిని సత్కరించారు. వ్యవసాయ రంగంలో తను లాభాలు సాధించడమే కాకుండా, తన తోటి రైతులకు కూడా లాభదాయకమైన వ్యవసాయం చేయిస్తున్నారు.

నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్లు. మాది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. మా పెద్దన్నయ్య ఊర్లోనే వుంటూ వ్యవసాయంలో ఆస్తిపాస్తుల విషయంలో కుటుంబ నిర్వహణలో నాన్నగారికి చేదోడు వాదోడుగా వుంటారు.

మా రెండో అన్నయ్య చిన్నప్పటి నుండి ప్రజాసేవకు అంకితమై రాజకీయాల్లో ఎప్పుడూ తలమునకలై వుంటారు. ఇప్పటికి మూడు సార్లు యమ్.ఎల్.ఎ.గా గెలిచారు. జిల్లా స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.

మా పెద్ద చెల్లెలు వాళ్లు వైజాగ్‌లో వుంటారు. బావగారు విశాఖపట్నం జిల్లా కలెక్టరు.

మా రెండో చెల్లెలు వాళ్లు కాకినాడలో వుంటారు. బావగారు తూర్పు గోదావరి జిల్లా సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.

ఇక నా విషయానికి వస్తే…. అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసాను. చిన్నప్పటి నుండి నాటికలు వ్రాయడం, నటించడం, దర్శకత్వం వహిండం, నా వ్యాపకం, అన్నదమ్ముల్లో చిన్నవాణ్నిని ఏమో… అందరూ నన్ను గారాబంగా చూసేవారు. నా అభిమతాన్ని ఎవరూ కాదనే వారు కాదు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here