ఒక్క పుస్తకం-5

14
6

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం’ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఐదో భాగం. [/box]

23

కొంచెం సేపు నిశ్శబ్దం తాండవించింది. వాతావరణం వేడెక్కింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ

“ఆ! శ్రీలక్ష్మీ… ఇప్పుడు నీ వంతు… మరి నీ గురించి కూడా మేము తెలుసుకోవాలి కదా! చెప్పు…” అన్నాడు సదానంద్.

వ్యక్తిగత విషయాలు ఎంతవరకు చెప్పవచ్చు… అసలు చెప్పాలా… వద్దా అనే మీమాంసలో ఉంది శ్రీలక్ష్మి. అర్థం చేసుకున్న సదానంద్…

“పరవాలేదు. చెప్పు శ్రీలక్ష్మీ…” అంటూ ప్రోత్సహించాడు.

శ్రీలక్ష్మి చెప్పడం మొదలెట్టింది. సదానంద్, శ్రీకాంత్‌లు వినడంలో నిమగ్నమయ్యారు.

“మాది ఒక చిన్న కుటుంబం. అమ్మ, నేను, తమ్ముడు. తమ్ముడు పుట్టిన సంవత్సరంలోపే మా నాన్న మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలు ఈ భూమ్మీద వున్నాడో లేదూ కూడా తెలియదు. ఆయన రూపం కూడా నాకు సరిగా గుర్తు లేదు. తిరిగి వస్తాడనే ఆశ లేనే లేదు. దాదాపు మరిచిపోయాం. కానీ, అమ్మకు, పైకి చెప్పదు కాని, ఏదో ఒక మూల చిన్ని ఆశ… ఎప్పటికైనా తిరిగి వస్తాడేమో అని. మగ దిక్కు లేని సంసారం మాది. ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో అని అమ్మానాన్నల తరపు బంధువులు ఒక్కొక్కరిగా మాతో బంధాలు తెంచేసుకున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సింది మా అమ్మ గురించి. భర్త అండ లేకపోయినా, బంధువుల నుండి సహకారం అందకపోయినా, దిగులుతో కృంగిపోకుండా, ధైర్యాన్ని కూడగట్టుకుని, నన్ను తమ్ముడ్ని తీసుకుని మా ఊరు వదిలి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది.

ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఎప్పుడో సరదాగా నేర్చుకున్న టైలరింగ్‌తో స్త్రీలకు దుస్తులు కుట్టడం, ఇస్తరాకులు కుట్టడం, ఊరగాయులు పచ్చళ్ళు పెట్టడం లాంటి వ్యాపకాలను పెట్టుకుంది. రోజంతా కష్టపడ్డా వచ్చే చాలీ చాలని ఆదాయంతో నన్నూ, తమ్ముడ్ని చదివిస్తూ సంసారాన్ని భారంగా నడిపిస్తుంది.

ఇతరుల విషయాలను అంతగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ గుట్టుగా జీవిస్తున్న మా అమ్మను ఈ సమాజంలో సగటు మహిళలు ఎదుర్కుంటున్న సాధారణ సమస్యలు ఇబ్బంది పెడుతునే వుండేవి. పైగా భర్త దగ్గర లేని వయసులో ఉన్న స్త్రీ పడే ఇబ్బందులు వర్ణణాతీతం.

నిజానికి మానవులు వేరు, మృగాలు వేరు. కాని మానవ మృగాలు కూడా వున్నాయ్. అంటే మృగ లక్షణాలను పుణికిపుచ్చుకున్న మానవులు. అలాంటి మానవ మృగాలు మహిళలను లొంగదీసుకోడానికి అనునిత్యం అవకాశాల కోసం ఎదురుచూస్తూనే వుంటాయ్. ఆ మృగాలు ఏ రూపంలోనైనా వుండవచ్చు. వాటికి వావివరసలు వుండవు. వయో భేదాలు వుండవు. ఆ కామాంధుల కళ్ళకు ఒక స్త్రీ విలాసవస్తువులా కనబడుతుంది.

కేవలం శృంగార సుఖాన్నందించే యంత్రంలా గోచరిస్తుంది. ఆరు నెలల పసిపాప నుండి అరవై దాటి మదుసలివరకు ఈ మృగాల బారిన పడినవాళ్ళే.

అలాంటివారి గుచ్చి గుచ్చి చూసే చూపుల  నుండి తప్పించుకుంటూ వారి ఆగడాలను ఎదుర్కుంటూ జీవనయానం సాగించడం ఓ మహిళకు కత్తి మిద సాము లాంటిది. అందుకు ఎంతో ధైర్యం, మనోనిబ్బరం కావాలి. అవి మా అమ్మ దగ్గర పుష్కలంగా ఉన్నాయ్.

ఆ మాటకొస్తే అబలలపై అత్యాచారాలకు యుగయుగాల చరిత్ర వుంది.

ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కృత యుగంలో తప్ప మిగతా మూడు యుగాల్లో అవి జరిగినట్లు మనకు దృష్టాంతాలున్నాయ్.

ధర్మం మూడు పాదాల మీద నడిచిన త్రేతా యుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, రావణాసురుడు మారువేషంలో వచ్చి, రామలక్ష్మణులు లేని సమయంలో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళాడు.

ధర్మం రెండు పాదాల మీద నడిచిన ద్వాపర యుగంలో ద్రౌపదిని జుట్టుపట్టుకుని నిండు కౌరవ సభలోకి ఈడ్చుకుని వెళ్ళి వివస్త్రని చేయడానికి ప్రయత్నించాడు దుశ్శాశనుడు.

పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినప్పుడు వారు మత్స్య దేశాధిపతి విరాటరాజు కొలువులో చేరారు. అప్పుడు ద్రౌపది, సైరంధ్రి పేరుతో రాణివాసపు స్త్రీలకు జడలు వేసి పూలు పెట్టే పనిలో వుంటూ రాణీగారికి ప్రధాన పరిచారికగా ఉండేది. ఆ సమయంలో రాణిగారి తమ్ముడైన కీచకుడు ద్రౌపదిని తనతో శృంగారం చేయమని బలవంతపెట్టాడు.

ధర్మం ఒంటిపాదం మీద నడుస్తున్న కలియుగంలో అబలలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. ఈ మధ్యనే పేపర్లో చూశాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని మహిళపై 2012లో 24,923, 2013లో (నిర్భయ చట్టం వచ్చిన ఏడాది) 33,707, 2014లో 36,735, 2015లో 34,210, 2016లో 38,947 అత్యాచారాలు, లైంగిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సరాసరి వందకు పైగానే. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. ఇది చాలా తీవ్రమైన సంక్లిష్ట సమస్య.

ప్రభుత్వాలు మహిళా భద్రత కోసం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసు శాఖ ద్వారా ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.

మనుషుల మనసుల్లో మార్పు రానంతవరకూ మహిళలకు ఈ కష్టాలు తప్పవు. భయభ్రాంతులతో బ్రతుకులు వెళ్ళదీయాల్సిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శిక్షలను కఠినతరం చేస్తూ మరో కొత్త చట్టం తెచ్చింది. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అన్ని పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లు, కేసుల దర్యాప్తు కోసం సుశిక్షుతులైన సిబ్బంది, కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తీర్పుపై అప్పీళ్ళను ఆరు నెలలోనే పరిష్కరించడం, లైంగిక నేరగాళ్ళపై నిఘా పెట్టడం లాంటి ముఖ్యాంశాలను ఈ చట్టంలో పొందుపరిచారు.

ఇక శిక్షల విషయానికొస్తే,

  • 12 ఏళ్ళ లోపు బాలికపై అత్యాచారానికి కనిష్టంగా 20 ఏళ్ళు, గరిష్టంగా మరణించేంతవరకు జైలు శిక్ష లేదా మరణశిక్ష
  • 12 ఏళ్ళ లోపు బాలికపై గ్యాంగ్ రేప్‌కు మరణించేంతవరకు జైలు శిక్ష లేదా మరణశిక్ష
  • 16 ఏళ్ళ లోపు బాలికపై అత్యాచారానికి కనిష్టంగా 20 ఏళ్ళు, గరిష్టంగా మరణించేంతవరకు జైలు శిక్ష
  • 16 ఏళ్ళ లోపు బాలికపై గ్యాంగ్ రేప్‌కు మరణించేంతవరకు జైలు శిక్ష లేదా మరణశిక్ష
  • మహిళలపై అత్యాచారానికి కనిష్టంగా 10 ఏళ్ళు, గరిష్టంగా మరణించేంతవరకు జైలు శిక్ష

విచారణను వేగవంతం చేయడానికి దర్యాప్తు పూర్తి చేయడానికి రెండు నెలలు, కోర్టు విచారణకు రెండు నెలలు, శిక్షలపై అప్పీళ్ళ పరిష్కారానికి ఆరు నెలల గడువు విధించారు.

ఈ సందర్బంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి గారు చెప్పిన మాటలు గమనార్హం:

ఇంట్లోనూ, బయట మహిళలను గౌరవించడంలో సమాజ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురాకుండా కఠిన చట్టాలు మాత్రమే మహిళలపై జరుగుతున్న నేరాలను నిషేధించలేవు.”

నిజమే కదా మరి!

24

రోజులు గడిచిపోతున్నాయ్. మా చదువులు కుంటుబడ్డాయ్. అతి కష్టం మీద, లేటుగా, నేను ఇంటర్మీడియట్ పాసయ్యాను. తమ్ముడు తొమ్మిదో తరగతి పాసయ్యాడు. శక్తికి మించిన శ్రమ చేస్తున్న అమ్మ ఆరోగ్యమ్ క్షీణించడం మొదలైంది. ఇంటి పరిస్థితులను చూసి నేను చదవడం ఆపేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి ఎంతో కొంత సంపాదించి అమ్మ మోస్తున్న సంసార భారాన్ని కొంత తగ్గించాలని నిర్ణయించుకున్నాను. స్వతహాగా మంచి తెలివితేటలున్న తమ్ముడిని బాగా చదివించి ప్రయోజకుడ్ని చేయాలని నా మరో ఆశ. నా మనసులోని ఆలోచనని అమ్మకు చెప్పాను. చదువు ఆపేసి ఉద్యోగం చేస్తానన్నాను. ససేమిరా… అంది అమ్మ. అతి కష్టం మీద ఒప్పించగలిగాను.

వెంటనే ఉద్యోగం చూసుకోవడం మొదలుపెట్టాను. ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదివినవారే నిరుద్యోగులుగా రోడ్ల పై తిరుగుతూ ఉద్యోగాల అన్వేషణలో వున్నారు.  ఇక నేను చదివిన ఇంటర్మీడియట్‌తో ఏం ఉద్యోగం వస్తుంది? అయినా సరే పట్టుదలతో ఒక వారం రోజులు అదే పనిగా ఆఫీసుల చుట్టూ తిరిగాను. వృథా ప్రయాసే అయింది. అలగే మొక్కవోని విశ్వాసంతో ప్రయత్నాలను ముమ్మరం చేశాను. ఈ ప్రహసనంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు మానవ మృగాల నుండి ఎదురయ్యే సమస్యలను నేనూ ఎదుర్కోక తప్పలేదు. మా అమ్మ పెంపకంలో నేర్చుకున్న జాగ్రత్తలతో ఏ ఇబ్బందికి గురి కాకుండా నెట్టుకొస్తున్నాను. రోజూ నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి అమ్మ నా కోసం నిరీక్షిస్తూ ఉండేది. నన్ను చూడగానే, “ఆ! వచ్చావా! రా … తల్లీ రా!” అంటూ సంతోషంగా స్వాగతించేది. ఎందుకంతే ఇంటి నుండి బయటకు వెళ్ళిన అమ్మాయిలు ఎప్పుడు తిరిగి వస్తారో… వచ్చినా ఏ పరిస్థితుల్లో వస్తారో… అని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సిన రోజులు మరి.

25

ఒక రోజు మెయిన్ రోడ్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద బంగారం కొట్టుకు ముందు.. ‘సేల్స్ గరల్స్ కావలెను’ అనే బోర్డు వ్రేలాడదీసి వుంది. ఆ జాబ్‍కు నేనేమైనా సరిపోతానేమో చూద్దామనుకుని లోపలికి వెళ్ళాను. దాదాపు ఓ డజను మంది సేల్స్ గరల్స్ ఎదురుగా వున్న బంగారు ఆభరణాల కొనుగోలుదారులతో మాట్లాడుతున్నారు. ఒకేచోట అన్ని రకాలైన బంగారు నగలను నా జీవితంలో నేను చూడలేదు. కరెంటు దీపాల వెలుగుల్లో ధగ ధగా మెరిసిపోతున్నాయ్. అలా చూసుకుమ్టూ షో రూమ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ప్రొప్రయిటర్ గారితో ఇంటర్‍కమ్‌లో మాట్లాడి అటెండర్‌తో నన్ను వేరే రూమ్‌లో వున్న ప్రొప్రయిటర్ దగ్గరకి పంపించాడు. చూడ్డానికి చాలా మంచివాడిలా, మర్యాదస్తుడిలా అనిపించాడు. నా గురించి, నా కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.  నా సమాధానాలకు సంతృప్తి చెంది నాకు ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. జీతం నెలకు ఏడువేల రూపాయలు. అదనమ్గా సేల్స్‌పై ప్రోత్సాహకాఅలు వుంటాయని చెప్పారు. మండుటెండలో దాహార్తితో త్రాగునీటికి కోసం వెతుకుతుంటే ఒయాసిస్‌కి బదులు జలాశయమ్ కనిపించినంత సంతోషాన్ని ఆ సమయంలో నేను రుచి చూశాను.

ఇంటర్‌కమ్‌లో సేల్స్ సూపర్‌వైజర్‌ని తన క్యాబిన్‌లోకి రమ్మని పిలిచాడు ప్రొప్రయిటర్. మరు నిముషంలో ఒక అందమైన స్త్రీమూర్తి హుందాగా నడుచుకుంతూ క్యాబిన్‌లోకి వచ్చింది.

“ఆ! సుజాతా… ఈ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. మన షో రూమ్‌లో సేల్స్ గరల్‌గా చేరబోతోంది. ఒకసారి షో రూమ్ అంతా చూపించి, మనవారందరికీ పరిచయం చెయ్. ఆ! డ్యూటీ గురించి వివరంగా చెప్పు. శ్రీలక్ష్మీ… నువ్ సుజాతతో వెళ్ళు…. వీలైతే… రేపటి నుంచే డ్యూటీలో చేరు” చెప్పాడు ప్రొప్రయిటర్.

“అలాగే సార్” అంటూ సుజాత గారితో బయటకు వచ్చాను. సుజాత నవ్వులు చిందిస్తూ మిగతా సెల్స్ గరల్స్‌కు, ఆఫీసు స్టాఫ్‌కి నన్ను పరిచయం చేసింది

“శ్రీలక్ష్మి! ఇక్కడ అందరం ఒక కుటుంబంలా ఉంటాము. ఇక నుండి నువ్ కూడా ఈ కుటుంబంలో ఒక సభ్యురాలివి. మేమమ్తా నీకు అండగా వుంటాం. యాజమాన్యం కూడా చాలా మంచిది. ఇక్కడ నువ్ చాలా సంతోషంగా వుద్యోగం చేసుకోవచ్చు” అని చెప్పింది సుజాత. ఆ మాటలు వింటుంటే చాలా ధైర్యం వచ్చింది నాకు. ఆమె చాలా సహాయకారి వ్యక్తిత్వం కలిగినదిగా అనిపించింది. ఎందుకో… ఆమెను… అక్కా అని పిలవాలనిపించింది.

“అక్కా! ఈ రోజు నీ పరిచయం దొరకడం నా అదృష్టం అక్కా… ఇక నుండి నీ మార్గదర్శకత్వంలో బాగా కష్టపడి పనిచేస్తానక్కా!”

“అలాగే… నీకేం పరవాలేదు. నీకే కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా నాతో చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను.”

“థ్యాంక్స్… అక్కా”

“పరవాలేదులే… ఆ! మనకి వారానికి ఆరు రోజులు డ్యూటీ. ఉదయం పదిన్నర కల్లా ఇక్కడ ఉండాలి. ఒక్క అరగంటలో మేనేజ్‌మెంట్ ఇచ్చే చీరె, జాకెట్ ధరించాలి… అదే మన యూనిఫాం… చూశావుగా మా అందరిలా… నువ్ కూడా కొద్దిగా మేకప్ వేసుకుని… పదకొండు కల్లా నీ స్థానంలో వుండాలి. రాత్రి ఏడు గంటల దాకా డ్యూటీ చేయాలి. కొందరు సేల్స్ గరల్స్ ఉదయం పదకొండున్నరకల్లా వచ్చి – పన్నెండు గంటలకు వారి స్థానాల్లో వుంటారు. వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల దాకా డ్యూటీ చేస్తారు. మనకు మధ్యలో ఒక అరగంట లంచ్ టైమ్. అందుకు ప్రత్యేకమైన టైం అంటూ వుండదు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య కొనుగోలుదారులకు ఇబ్బంది కలగకుండా మనలో మనం సర్దుకుపోతూ లంచ్ పూర్తి చేయాలి. సరేనా…” వివరంగా చెప్పింది సుజాత.

“చాలా బాగుందక్కా… రేపు ఉదయమే వస్తానక్కా!”అని చెప్పి శలవు తీసుకుని ఇంటికి చేరాను.

విషయమంతా అమ్మకి చెప్పాను. చాలా సంతోషించింది. ఆ రాత్రి తృప్తిగా, హాయిగా వేరే ఆలోచనలు లేకుండా నిద్రపోయాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here