ఒక్కపూట భోజనం..

2
12

[dropcap]“ఇం[/dropcap]కాస్త డెప్తు ఉండాలయ్యా కథలో, ఇది సరిపోదు” అన్నాడు మాధవరావు సోఫాలో వెనక్కి వాలుతూ.

“మనం కథని ఇంకా సాగదీసి డెప్తుకు వెళితే ప్రేక్షకులు బోరుగా ఫీలవుతారు, దాంతో ఫీల్ గుడ్ పోయే ప్రమాదం ఉంది సార్” అన్నాడు రచయిత సుందర్ వినయంగా.

ప్రముఖ సినిమా నిర్మాత మాధవరావు ఇంట్లో సుందర్ రాసిన కథ మీద చర్చలు జరుగుతున్నాయి. ఐదు గంటలుగా స్టోరిలో వున్న విషయాల మీద చర్చిస్తున్న ఇద్దరు ఒక కొలిక్కి రాలేకపోయారు.

“అబ్బో తొమ్మిదవుతోంది. నాకు డిన్నర్ టైం అవుతోంది. మనం మళ్లీ కలుద్దాం సుందర్, మార్పులు చేర్పులు చేసుకొని తీసుకురా, అప్పుడు ఆలోచిద్దాం” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు మాధవురావు. ఈ రోజు కూడా పని కాలేదన్న నీరసం, అసంతృప్తితో రోడ్డున పడ్డాడు సుందర్.

రాత్రి తొమ్మిది గంటల వేళ రోడ్డు మీద వాహనాలు ఇళ్లకు చేరడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు తను ఎల్బీనగర్ వెళ్లాలి. మణికొండ నుండి ఎల్బీనగర్ దాదాపు ఇరవై కిలోమీటర్ల పైనే, జేబులో చూసుకున్నాడు ఐదు రూపాయలు ఉన్నాయి.

నిర్మాత ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతాడా అనే ధైర్యంతో వచ్చాడు, కాని నిరాశే ఎదురైంది. అప్పుడే ఆకలి నీరసం మొదలయ్యాయి. రెండు రోజులుగా సరైన తిండిలేక ఆ నీరసం ఎక్కువైంది. అలా నడుస్తూ ఓ టీకొట్టు దగ్గర ఆగి “టీ ఎంత” అని అడిగాడు. “ఏడు రూపాయలు” చెప్పాడు టీ షాపు కుర్రాడు

తన దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి, ఓవైపు ఓపిక లేక కాళ్లు లాగుతున్నాయి, కాసేపాగితే పడిపోయెలాగున్నాడు. మరోవైపు డబ్బుల్లేక టీ తాగితే ఏనుకుంటాడోనని ఆత్మాభిమానం. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ పక్కనే నిలబడ్డాడు సుందర్. పావుగంట తరువాత “అన్నా టీ కావాలా” అని అడిగాడు టీ షాపు కుర్రాడు. ఏం చెప్పాలో తెలిక అటూ ఇటూ తలూపాడు సుందర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ..

***

సుందర్‍ది విజయవాడ దగ్గర పల్లెటూరు. చూడడానికి చిన్న గ్రామమైనా ఆలోచనల్లో ఉన్నతంగా వుండేది ఆ గ్రామం. సుందర్ తండ్రి ఆ ఊరి పెద్ద, ఆయన మాటకు గ్రామంలో మంచి విలువుండేది. వాళ్ల ఇంటికి ఎవరొచ్చిన భోజనం చేసి వెళ్లాల్సిందే. అదొక నియమంలా ఉండేది. ఆ ఊరి గుడిలో ప్రతి రోజు సాయంత్రం రామాయణ భారత భాగవతాల గురించి, పురాణాల గురించి పండితులతో చర్చలు సాగేవి. అవన్ని శ్రద్దగా వింటూ పెరిగాడు సుందర్.

ఆ ఊరి పంచయతి ఆఫీసులో ఏర్పాటుచేసిన లైబ్రరీకి రోజు చెల్లితో కలిసి వెళ్లి పేపర్లు పుస్తకాలు చదివేవాడు సుందర్. తండ్రి పుస్తక పఠనంను ప్రోత్సహించేవాడు. కొడుకును ఒళ్లో కూచోబెట్టుకొని మంచి విషయాలను బోధించేవాడు.

“చూడు నాన్నా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నువ్వు నమ్మిన సిద్దాంతాన్ని వదులుకోకు, ఇచ్చిన మాట చేసిన వాగ్దానం మరువకు, డబ్బును కాదు తెలివిని నమ్ముకో. ఏదో ఒక రోజు నీ తెలివితేటలే నిన్ను గొప్పవాడిని చేస్తాయి. ఒక్కపూట అన్నం పెట్టిన వాళ్లనైనా సరే! జీవితంలో మర్చిపోకు, నిజాయితీతో బ్రతుకు. కష్టాల్లో వున్నవానికి నీ చేతనైన సహాయం చెయ్యి” అని తండ్రి చెప్పిన మాటలను తారక మంత్రంగా గుర్తుపెట్టుకున్నాడు సుందర్.

కాలానికి ఏది అడ్డుకట్ట వేయలేదు. ఉన్నట్టుండి ఓరోజు హాఠాత్తుగా సుందర్ తండ్రి మరణించాడు. పదిహేడేళ్ల వయసులో వున్న సుందర్‌ను తండ్రి మరణం బాగా కుంగదీసింది. తెలిసి తెలియని వయసులో వున్న సుందర్‌ను ఏమార్చి తండ్రి చేసిన అప్పులు ఉన్నాయంటూ ఆస్తులు లాక్కున్నారు దాయాదులు. చివరకు రెండు ఎకరాల భూమి మిగిలింది. ఆర్థికంగా ఎంత ఇబ్బందిగా వున్న చదువులో మాత్రం చురుకుగా వుండే సుందర్ దూర విద్యలో డిగ్రీ, ఎం.ఎ. తెలుగు సాహిత్యం పూర్తి చేసాడు.

స్క్రిప్టు రైటింగులో దూరవిద్యలో కోర్సులు చేసాడు. తెలుగు సాహిత్యం మీద మంచి పట్టు సంపాదించాడు. అప్పటికే చిన్నచిన్న కథలు కవితలు రాసేవాడు. అక్కడే వుంటే తనకు ఎదుగుదల లేదని తల్లిని చెల్లిని ఒప్పించి ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్‍కు చేరుకున్నాడు.

***

టీ గ్లాస్ తెచ్చి చేతిలో పెట్టడంతో ఈ లోకంలో కొచ్చాడు సుందర్. ఏదో చెప్పబోతున్న సుందర్ ను ఆపి “చాయ్ తాగన్నా పైసల్ అద్దులే” అన్నాడు టీ షాపు కుర్రాడు.

ఇంకా తన అసహాయతను ఆపుకోలేని సుందర్, “తమ్ముడు నాకు బాగా ఆకలేస్తోంది, సరిగా తిని రెండు రోజులైంది, బిస్కట్లు వుంటే ఇస్తావా” అని అడిగాడు.

ఆ మాటలతో ఆశ్చర్యపోయాడు టీ షాపు కుర్రాడు. ప్లాస్టిక్ కుర్చీ పక్కకు జరిపి దాని మీద కూర్చొమ్మని సైగ చేశాడు. లోపల నుండి ఒక టిఫిన్ బాక్స్ బయటకు తీసి “తినన్నా” అంటూ సుందర్ చేతికిచ్చాడు.

“మరి నీకు?” అన్నాడు సుందర్ నీరసంగా.

“నేను ఇంటిబోయి తింటాలే అన్నా, నువ్వు తిను” అన్నాడు కుర్రాడు

అందులో అన్నం కూరా వున్నాయి. ఇంక ఏం ఆలోచించకుండా గబ గబ తినేశాడు సుందర్. ఆకలి రుచి ఎరగదు – నిద్ర సుఖమెరగదు అని తను ఎక్కడో రాసుకున్న కొటేషన్ గుర్తొచ్చింది సుందర్‍కు. మళ్లీ టీ తెచ్చి సుందర్ చేతిలో పెట్టి మాట కలిపాడు టీ షాపు కుర్రాడు.

“పైసల తిప్పలు నాగ్గూడ దెలుసన్న, నేన్ బీ మస్తు కష్టపడ్డ, ఇగ ఊర్ల పని ఏం లేదని మా మావ తీస్కచ్చి గీ దందా బెట్టిచ్చిండు. దార్లబడ్డంక బిడ్డనిచ్చి పెండ్లిజేసిండు. గిప్పటికైతే మంచిగున్నది.” అన్నాడు.

“నీ పేరేంటి?” అడిగాడు సుందర్

“మల్లేశం”

“నువ్వు తినే అన్నం నాకు ఇచ్చావు, మరి నీకు?”

“అద్దంటాంటే పొద్దుగూకి తినుమని నా భార్య తెచ్చిత్తది, గీ దందాల తినుడేడైతదన్న” అంటుండగా మల్లేశం భార్య అక్కడకు వచ్చింది.

“గీమే నా భార్య” అంటూ పరిచయం చేసాడు మల్లేశం.

వాళ్లిద్దరికి థాంక్స్ చెప్పి బయలుదేరుతుండగా బలవంతంగా చేతిలో పది రూపాయలు పెట్టాడు మల్లేశం. వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక రెండు చేతులతో దండం పెట్టి రోడ్డు మీదకొచ్చాడు.

తన అసమర్థతకు నిస్సహయతకు తనకు తానే నిందించుకుంటూ బస్టాప్ వేపు నడుస్తూ ఆలోచిస్తున్నాడు – ‘వచ్చి సంవత్సరం దాటింది, ఏమీ చెయలేకపోయాను. ఇక ఇక్కడ ఉండటం కంటే ఊరు వెళ్లిపోవడమే బెటరు. అక్కడే ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. ఉన్న భూమిని సాగుచేసుకుంటూ అమ్మ చెల్లితో ప్రశాంతంగా ఉండొచ్చు’ అనుకున్నాడు.

అప్పుడు మల్లేశం మాటలు ఫ్లాష్‌లా గుర్తుకొచ్చాయి. ‘తను ఊర్లో బతకలేకే ఇక్కడికొచ్చాడు. తనకున్న పరిధిలో టీ స్టాల్ పెట్టి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు తనేం చేయాలి, ఇక్కడ వుండడం కరెక్టా ఊరు వెళ్లడం మంచిదా అంతా గందరగోళంగా వుంది’ ఆలోచిస్తూ బస్టాప్ చేరుకున్నాడు.

టైం చూస్తే రాత్రి పది అవుతోంది, జేబులో పదిహేను రూపాయలు ఉన్నాయి, అవి బస్ టికెట్‍కు సరిపోవు, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న సుందర్ ముందు కారు వచ్చి ఆగింది.

“అన్నా ఎన్క టైర్ల గాలుందా జరజూడు, బండూగుతాంది” అన్నాడు కారు డ్రైవర్.

“గాలి బానే వుంది” అన్నాడు సుందర్ టైర్లను చూసి.

“ఓకే టాంక్యు అన్నా” అనుకుంటూ కారును ముందుకు నడపబోతున్న డ్రైవరుతో

“బ్రదర్ కొంచెం లిప్టు ఇస్తావా ప్లీజ్, ఇప్పుడు బస్సులు కూడా రావు” అని రిక్వెస్టు చేసాడు సుందర్.

“ఎక్కడికి బోవాలె?” అడిగాడు డ్రైవర్

“ఎల్బీనగర్”

“మేము తార్నాక దాక బోతాం, కావాలంటే ఎక్కు” అన్నాడు డ్రైవర్

మరుక్షణంలో డ్రైవర్ పక్క సీట్లో వున్నాడు సుందర్, కారు ముందుకు కదిలింది. తెల్ల బట్టలతో సుమారు యాభై ఏళ్ల పైన వయసున్న పెద్దాయన వెనక సీట్లో కూచుని ఫోన్లో ఎవరితోనో గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన కోపం నశాళానికి అంటినట్టుంది, గట్టిగా ఓ అరుపు అరిచి ఫోన్ పెట్టేసాడు. కారులో కూర్చున్నప్పుడు సుందర్‍ను అతడు గమనించలేదు.

ఒక్కసారిగా కారులో కొత్త మనిషిని చూసిన ఆయన “అగో! గీనెవర్ర యాదిగా” అన్నాడు కోపంతో అరిచినట్టుగా.

“బస్సుల్లేవని బతిమిలాడితే ఎక్కిచ్చిన పటేలా”

“అరేయ్ యాదిగా, నిన్ను ఎములాడ రాజన్న గుడికి దీస్కపోయి నున్నగ గుండు గొట్టిచ్చి, గుండుకు గంధం బెట్టిత్తర గప్పుడు సక్కగైతవ్, ఎవల్ని బడితె ఆల్లను ఎక్కిత్తవేందిర బండి” అనగానే సుందర్ గుండెలో రాయిపడింది, మధ్యలో ఎక్కడ దిగమంటారోనని, యాది వేపు చూశాడు, ఏమి కాదన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు యాది.

“అవ్ తమ్మి యాడికిబోవాలే” మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెడుతూ అడిగాడు ఆ వ్యక్తి

“ఎల్బీనగర్” చెప్పాడు సుందర్

“నీ పేరేంది?”

“సుందర్”

“నా పేరు ఎర్కెనా?”

“లేదు సార్” అన్నాడు సుందర్ వినయంగా.

“అయితే ఇను. నర్సింగ్, అందరు నర్సింగం అన్నా అంటరు. తార్నాకలా మనకు మస్తు పేరున్నది.” “అయితే నాకేమన్నా ఉద్యోగం వుంటే ఇప్పిచ్చండి సార్” అన్నాడు సుందర్

“ఏం అనుకోకు తమ్మి. గిప్పుడు నేను మస్తు పరేషన్ల వున్న, ఒగడు పన్జెస్తానని మధ్యల వుండి నన్ను ఇర్కిచ్చి పైసల్ దీస్కొని పత్తా లేకుంట పీకిండు, గాడు దొర్కాలే లాగుల ఎల్కలు జొర్రగొట్టి ఉర్కియాలనున్నది కొడుకును, కాని దొర్కతలేడు, ఏం జెయ్యాలె జెప్పు” అన్నాడు నర్సింగ్ అసహనంగా.

“ఏంటి సార్ ప్రాబ్లం?” అంటూ ఉత్సుకతగా అడిగాడు సుందర్

“ఇగో తమ్మి ఒగడు మధ్యల వుండి అంత వాడు జేత్తా అంటే ఓ కాడ పని ఒప్పుకున్న, బయానా గూడ తీస్కున్న, ఆనికి గూడ బయానా ఇచ్చిన మరి గదంత రాసి ఆడు పని ఒడగొట్టాలే గదా, ఆడు పైసల్ దీస్కొని పత్తకు లేకుంట బోయిండు, ఫోన్ జెత్తే ఎత్తడు, ఆని తానికి బోతే దొర్కడు, ఇగొ గిప్పుడు గూడ గాని తానకే బొయాత్తనం” అన్నాడు నర్సింగ్.

“ఏం రాయాలి సార్?” అన్నాడు సుందర్.

“పెద్ద బట్టల షాపు నుంచి కాంట్రాక్ట్ తెచ్చిన, ఆళ్లయి షానా షాపులున్నాయి. వాటి గురించి ముచ్చట మంచిగా రాసి, దాన్ని పేపర్లల్ల టీవిలల్లా ఎయ్యాలే, చౌరస్తాలల్లా పెద్ద బోర్డులు పెట్టాలే”

“ఓ.. బట్టల షాపుకు యాడ్ చేయాలా?” అన్నాడు సుందర్

“గదే.. గదే..”

“నాకివ్వండి సార్, నేను రాసి పెడతాను”

“నువ్వు రాస్తావా తమ్మి?” అన్నాడు నర్సింగ్ ఆశ్చర్యంగా.

“నేను చదువుకున్నది అదే సార్, నేను రాస్తాను”

“ఇగో.. సుందరం తమ్మి, గానికి పైసలిచ్చి మోసపోయిన, నీకు మాత్రం ముందుగాల పైసలియ్య, ఇగో.. ఎల్బినగర్ బోవాలన్నావు గదా, మా యాదిగాడు నిన్ను మీ ఇంటికాడ దించుతడు గంతే”

“అలాగే సార్” అన్నాడు సుందర్.

సుందర్ వ్యక్తిగత విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నాడు నర్సింగ్. ఇంటి దగ్గర కారు దిగుతూ “ఇగో తమ్మి గిదే మా ఇల్లు రేప్పొద్దుగాల్ల ఏడు గంటలకు రా, మాట్లాడుకుందాం, ఏమంటవ్, మరిసిపోకు” అని జేబులో నుండి విజిటింగు కార్డు తీసిచ్చాడు నర్సంగ్.

“అలాగే సార్” అని చెప్పి యాదితో కలిసి కారులో వెళ్లిపోయాడు సుందర్.

***

“ఏమయ్యో లేస్తుంటివా బారెడు పొద్దెక్కింది” అంటున్న భార్య మాటతో నిద్ర లేచాడు నర్సింగ్. అప్పటికే ఎనిమిది గంటలు దాటింది. లేస్తూనే ముఖం కడుక్కుని భార్య ఇచ్చిన టీ తాగుతూ మొదటి అంతస్తు వరండాలోకి వచ్చాడు నర్సింగ్. కిందకి చూస్తే గేటు ముందు ఎవరో నిలబడి ఉండడం చూసి అప్పుడే అటుగా వెళ్తున్న యాదితో “అరేయ్ యాదిగా గేటు దగ్గర ఎవర్రా నిలవడ్డది?” అన్నాడు నర్సింగ్.

“నిన్నరాత్రి కారులో రాలేదా పటేలా, గాయినే, నీ కోసమే అచ్చిండు, రమ్మంటివి గదా” అన్నాడు యాది.

“అవురా.. మర్సెపోయిన యాల్ల పొద్దుగాల రమ్మంటిగదా ఇప్పుడొచ్చిండు” అన్నాడు నర్సింగ్

“ఏడు గంటలకే అచ్చిండు పటేలా” అన్నాడు యాది.

“అరేయ్! మరి మిద్దె మీద కూసోవెట్టక కిందనే నిలబెట్టినవేమ్రా, జెల్దిబోయి పైకి తోల్కరాపో” అని కిందకి పంపించాడు యాదిని.

“తమ్మి ఏమనుకోకు కింద నిలవెట్టినని, మా యాదిగానికి తెల్వక గట్లజేసిండు. ఆడు మా బిడ్డ లెక్క, సిన్నప్పటి సంది మా కాడనే వున్నడు. కూసో తమ్మి” అని కుర్చీ చూపించాడు నర్సింగ్.

సుందర్ కూర్చున్న తరువాత యాది టీ తెచ్చి ఇచ్చాడు, అప్పుడే నర్సింగ్ భార్య అక్కడకు వచ్చింది.

“ఇగో తమ్మి.. గీమే మా ఇంటిది లచ్చిందేవమ్మ, నాకు లచ్మిదేవి లెక్క, గీమేను జేస్కున్నంక నాకు అదృష్టం బట్టింది” అన్నాడు నర్సింగ్.

ఆమెకు నమస్కారం చేసాడు సుందర్.

“ఏమన్న తిన్నవ బిడ్డా?” అని అడిగింది లచ్చిందేవమ్మ.

“చూసావా తమ్మి మా లచ్చిందేవమ్మ ఎప్పుడు ఎదుటోళ్లకడుపే జూస్తది. ఇగో తమ్మికి నాష్ట పంపియి” అని నర్సింగ్ అనగానే, “గట్లనే” అనుకుంటూ లోపలికి వెళ్లింది లచ్చిందేవమ్మ.

యాదిని పిలిచి బట్టల షాపు యాడుకు సంబంధించిన పేపర్లు తెప్పించాడు నర్సింగ్.

“సూడు తమ్మి, గివే గా పేపర్లు, బాగా సదివి మంచిగ రాయాలే, తమ్మి, ముందుగాలనే జెప్తానా, బయాన అయితే ఇయ్య, నువ్వు రాసింది ఆళ్లకు నచ్చితే అప్పుడు పైసలిస్త” అన్నాడు నర్సింగ్.

“పర్లేదు సార్, భోజనం పెట్టండి చాలు” అన్నాడు సుందర్.

“గట్లైతే నాటుకోడి పులుసే బెట్టిత్త, నువ్వైతే రాయి” అనగానే చిరునవ్వు నవ్వాడు సుందర్.

“సూడు తమ్మి, నేనైతే పెద్దగ సదువుకోలే, ఒగన్ని నమ్మి తెల్వక గీ పని నెత్తికి సుట్టుకున్న, నువ్వె నా ఇజ్జత్ కాపాడాలే, ఇగ నువ్వు ఏం జేస్తవో ఏందో” అన్నాడు నర్సింగ్.

“పర్లేదు సార్, నేను రాసి పెడతాను, మీరు ఇబ్బందిపడకండి” అని ఆ పేపర్లను ఒకటికి పదిసార్లు చదవుకున్నాడు. బట్టల షాపుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో వుంది. ఒకటికి రెండుసార్లు ప్రిపెరై, స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాడు. ఆ రోజంతా అక్కడే కూచొని పేపరుకు రేడియోకు యాడ్స్ తయారుచేసాడు సుందర్.

నాలుగైదు వెర్షన్లు స్క్రిప్టు రాసుకొని చివరకు రెండు ఫైనల్ వెర్షన్లు సెలక్టు చేసుకున్నాడు. అప్పటికి రాత్రి తొమ్మిదయింది. ఆ పేపర్లను నర్సింగ్‍కు ఇచ్చాడు సుందర్. వాటిని చూసి ఆనందంతో ఊగిపోయాడు నర్సింగ్.

“మస్తూ సాయం జేసినవ్ తమ్మి” అంటూ భోజనానికి ఇంట్లోకి తీసుకెళ్లాడు.

చేతులు కడుక్కొని కింద కూర్చున్నాడు సుందర్.

“గదేంది తమ్మి కింద కూసున్నవ్, బల్ల మీద తిందాం రా” అన్నాడు నర్సింగ్.

“వద్దు సార్, ఎక్కడికెళ్లిన కింద కూచొబెట్టి భోజనం పెడతారు, నాకు ఇలాగే అలవాటైపోయింది. మనసుకు పెద్దవాళ్లమైన డబ్బుకు పేద వాళ్లం సార్” అన్నాడు సుందర్ బాధతో.

“ఊకో తమ్మి, పైసతోని దిమాక్ రాదు, దిమాక్ తోనే పైస సంపాయిస్తం” అంటూ నర్సింగ్ కూడా సుందర్‍తో కలసి కిందే భోజనానికి కూర్చున్నాడు. ఎన్నో రోజుల తరువాత తృప్తిగా భోజనం చేసాడు సుందర్.

***

చిన్న చిన్న మార్పులు చేర్పులతో సుందర్ రాసిన యాడ్స్ ఓకే అవడంతో, టీవి యాడ్సు కూడా సుందర్ తోనే రాపించాడు నర్సింగ్. దాన్ని కూడా చాలెంజింగుగా తీసుకొని టీవి యాడ్సు స్క్రీప్టు రాసి ఒప్పించాడు సుందర్.

దాంతో సుందరుపై నమ్మకం పెరగడంతో యాడ్ తీపించే పనిని కూడా సుందర్ భుజాలపై మోపాడు నర్సింగ్. షూటింగ్, ఎడిటింగ్ ఎక్కడా పొరపాటు జరగకుండా ఫైనల్ కాపి వచ్చేవరకు పట్టుదలగా ఆ పనిని పూర్తిచేసాడు సుందర్. దాంతో నర్సింగ్ ఎంతో ఆనందపడిపోయాడు.

నెల రోజుల తరువాత నర్సింగ్ ఇంట్లోని హాల్లో కూర్చొని వున్నాడు సుందర్. లోపల నుండి హాల్లోకొచ్చాడు నర్సింగ్. బ్యాగును టేబులు మీద పెట్టి సుందర్‍కు ఎదురుగా వున్న కుర్చోలో కూర్చున్నాడు. బ్యాగు ఓపెన్ చేసి వంద ఐదు వందల రూపాయల కట్టలు టేబులు మీద కుప్పగా పెట్టాడు.

“సూడు తమ్మి, గీ పైసలు బట్టల షాపోళ్లు ఇయ్యాలనే ఇచ్చి పోయిండ్రు. నువ్వు నా ఇజ్జత్ కాపాడినవు, నన్ను నిలబెట్టినవు తమ్మి. నువ్వు మస్తు కష్టపడ్డవు నేను జూసిన, ఆన్నే దిన్నవ్ ఆన్నే పన్నవ్” నర్సింగ్ చెప్పెది బొమ్మలా వింటున్నాడు సుందర్.

“నీ తాన దిమాక్ ఉన్నది, నా తానా పేరున్నది పైసున్నది, ఇద్దరం కలిసి గీ పన్జెసినం, గిండ్ల నీ వాటా నువ్వు తీస్కొ తమ్మి” అన్నాడు నర్సింగ్.

“వద్దు సార్, నేను డబ్బు కోసం పని చేయలేదు. మీకు ఆ రోజే చెప్పాను నాకు డబ్బు వద్దని, కేవలం మీ కోసం పని చేసాను, మీరు నాకు అన్నం పెట్టారు అది చాలు” అన్నాడు సుందర్ నిశ్చయంగా

“సూడు బిడ్డా, నువ్వు పన్జెసినవ్, నీ కష్టం మాకెందుకు, వద్దు, పైసలు తీస్కో” అంది లచ్చిందేవమ్మ తలుపు పక్కన నిలబడి.

“వద్దమ్మా, తల్లిలా ఆదరించారు, నా కడుపారా భోజనం పెట్టారు అది చాలు” అన్నాడు సుందర్.

“సరే బిడ్డా సోంచాయించు” అనుకుంటూ లోపలికెళ్లింది లచ్చిందేవమ్మ.

“ఇగ సూడు తమ్మి, వున్న విషయం జేప్తానా, నీ లెక్కనే నేన్ బీ మస్తు కష్టపడ్డ, జిందగిల వున్న పనంతజేసిన పెండెత్తిన, కొట్టం ఊడ్చిన బర్లుగడిగిన, ఎడ్లకాసిన, అన్ని పనులు జేసిన, గప్పుడు నా జిందగిలకు గీ లచ్చిందేవమ్మ అచ్చింది. మస్తు తెలివికల్లది, సదువుకున్నది, నియతుగ ఉండుడు సంపాయించుడు బతుకుడు గురించి మంచిగ జెప్పింది. నన్నే మార్చేసింది నా లచ్చిందేవమ్మ. గప్పటిసంది ఎట్ల పైకి రావాలని ఆలోచించిన మస్తు కష్టపడ్డ ఇగో వున్నంతల గీడిదాకచ్చిన, కాని ఎవన్ని మోసం జేయలే. ఎవ్వని కడుపుగొట్టలే. ఎవ్వని రూపాయి తినలే, గిప్పటిదాక నియ్యతుగ వున్న నియ్యతుగ బతికిన” అంటూ డబ్బుల కట్టలను సుందర్ ముందుకు జరిపి.. “నీ ఇష్టం వున్న కాడికి ఎంతైతే అంత తీసుకో తమ్మి, మిగిలిందే నేన్ దీసుకుంటా” అన్నాడు నర్సింగ్.

“మీకు మాటిచ్చాను డబ్బివ్వకున్నా పని చేసిపెడతానని, మాట తప్పలేను సార్, నన్ను క్షమించండి” అన్నాడు సుందర్ ఆ డబ్బుల కట్టలను నర్సింగ్ వేపు తోస్తూ

“మరి దీనికి పరిష్కారం ఎట్ల తమ్మి?” అన్నాడు నర్సింగ్.

“అయితే ఓ పని చేద్దాం సార్, ఈ డబ్బుతో చిన్నయాడ్ ఏజన్సీ ఆఫీసు పెడదాం, సరిపోకపోతే మీ డబ్బు కొంచెం పెట్టండి, నేను పని చేసి పెడతాను, మీకున్న పలుకుబడితో ఆర్డర్సు తీసుకురండి. ఆఫీసు మొత్తం మీ పేర పెట్టుకొండి, పని చేసినందుకు నాకు జీతం ఇవ్వండి చాలు.” అన్నాడు సుందర్.

తర్జనబర్జనల తరువాత ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి ఆఫీసు పెట్టడానికి నిర్ణయించుకున్నారు.

***

లక్ష్మి నర్సింగ్ యాడ్స్ పేరుతో ఆఫీసు ఓపెన్ చేసారు. తను ఉంటున్న రూము నుండి ఆఫీసుకు షిప్ట్ అయ్యాడు సుందర్. నర్సింగ్ తెచ్చే యాడ్సుకు పక్కగా ప్రణాళికలు రచించి క్రియేటివ్‌గా యాడ్సు తయారుచేసేవాడు. సుందర్‌కు కావలసిన భోజన వసతులన్ని నర్సింగ్ ఇంటి నుండే ఆఫీసుకు వచ్చేవి. ఇక అదే లోకమైంది సుందరుకు. లేచింది మొదలు పడుకునే వరకు యాడ్సు పని తప్ప బయటి ప్రపంచాన్ని మరచిపోయాడు సుందర్. బయటి యాడ్ ఏజన్సిల కన్నా తక్కువ రేటుకే క్రియేటివ్‍గా యాడ్సు చేసేవాడు.

దాంతో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది సంస్థ. సుందర్‍కు పరిచయాలు పెరిగాయి, సంస్థ టర్నోవరూ పెరిగింది. అయినప్పటికి నెల జీతానికే పని చేస్తున్నాడు సుందర్. సంస్థ ఎదుగుదలతో నర్సింగ్ కూడా ఆనందంగా ఉన్నాడు. తను రాసిన స్టోరీని ఇంకా మెరుగులు దిద్ది తనకున్న పరిచయాలతో ఒక మంచి నిర్మాణ సంస్థ ద్వారా సినిమా ప్లాన్ చేసాడు. ఆ సినిమా రిలీజై స్టోరీ పరంగా సుందర్‍కు మంచి పేరొచ్చింది. దాంతో సుందర్‍కు అమాంతం ఆఫర్స్ పెరిగాయి.

“సార్, మన సంస్థకు మంచి పేరుంది. వర్క్ చేసే టీం వుంది. మీక్కూడా సంస్థలో అన్ని విషయాలపై అవగాహన వుంది. ఇక సంస్థకు పెద్దగా నా అవసరం లేదు, నేను కూడా ఈ ఒక్క పనితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. సినిమాలకు రాయమని అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నేను బయటికి వెళ్లిపోదాం అనుకుంటున్నాను” అని నర్సింగ్‍ను కూచొబెట్టి సావదానంగా చెప్పాడు సుందర్.

“నువ్వు జెప్పింది నిజమే తమ్మి. కన్న బిడ్డలెక్క గీ ఆఫీసును పైకి దీస్కచ్చినవ్. నువ్వు గూడ పైకి రావాలే గదా, ఎన్ని రోజులని ఈడనే వుంటవు, పని మంచిదైతే సంతోషంగ పో తమ్మి” అంటూ సుందర్‍ను వదులుకోవడానికి మనసులో ఎంత బాధున్నా భుజం తట్టి ప్రోత్సహించాడు నర్సింగ్.

సుందర్ బయటికి వెళ్లిపోయే రోజు ఇంటికి భోజనానికి పిలిచి, దగ్గురుండి భోజనం వడ్డించారు నర్సింగ్ దంపతులు. సుందర్‍కు బట్టలు పెట్టి సొంత కొడుకే తన దగ్గర నుండి వెళ్లిపోతున్నట్లుగా ఏడ్చేసారు నర్సిగ్ లచ్చిందేవమ్మలు. వారి ఔదార్యానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సుందర్.

“సార్ మీరు జాగ్రత్త, ఎప్పుడు యే అవసరం వున్నానాకు ఫోన్ చేయండి” అని వారికి మరోసారి ధన్యవాదాలు చెప్పి వారి నుండి వీడ్కోలు తీసుకున్నాడు సుందర్.

***

సినిమాలకు స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాడు సుందర్. అనతికాలంలోనే మంచి స్ర్కిప్టు రైటర్‍గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిజీ స్ర్కిప్టు రైటర్ అయిపోయాడు. దాంతోపాటు డబ్బు పేరు రాసాగాయి. మంచి కారు ఇల్లు సమకూర్చుకున్నాడు. తల్లిని చెల్లిని తన దగ్గరకే తీసుకొచ్చేసాడు. పొద్దున బయటికొస్తే యే రాత్రికో ఇల్లు చేరేవాడు సుందర్. అలా చూస్తుండగానే ఐదు సంవత్సరాలు గడచిపోయాయి.

ఓ రోజు మణికొండ మీద నుండి వెళుతుండగా టీ షాపు మల్లేశం కనిపించాడు. కారు యూ టర్న్ తీసుకొని టీ షాపు పక్కన ఆపి, టీ షాపులోకి వెళ్లి “తమ్ముడు టీ ఇస్తావా?” అని అడిగాడు సుందర్

టీ ఇచ్చిన మల్లేశ్ సుందర్‍ను గుర్తించలేదు. టీ తాగుతూ మల్లేశంను గమనించాడు సుందర్. మల్లేశంలో మునుపటి ఉత్సాహం లేదు, ముఖమంతా పీక్కుపోయి ఉంది. నిద్రలేనట్టుగా కళ్ళు వాలిపోయి ఉన్నాయి. ఏమైందో అర్థం కాలేదు సుందరుకు, టీ తాగిన సుందర్ రెండు వేల నోటు మల్లేశం చేతిలో పెట్టాడు.

“ఇంత పెద్ద నోటుకు చిల్లర లేదు సార్” అంటూ తిరిగి ఇవ్వబోయాడు.

“చిల్లర వద్దులే నువ్వే ఉంచుకో”

“అద్దు సార్” అని మల్లేశం తిరిగి ఇవ్వబోతుండగా, “నన్ను గుర్తు పట్టలేదా మల్లేశ్” అని అడిగాడు సుందర్.

“లేదు సార్” అన్నాడు మల్లేశ్ సుందర్‍ను పట్టి పట్టి చూస్తూ

“ఓ రోజు నాకు, ఇక్కడే నువ్వు తినాల్సిన అన్నం నాకు పెట్టావు, చార్జీలకు లేవంటే పది రూపాయలిచ్చావు” అన్నాడు సుందర్.

అయినా గుర్తించలేకపోయిన మల్లేశ్‍కు ఆ రోజు జరిగిన విషయాలన్ని గుర్తుచేసాడు.

“అన్నా మీరా, ఎట్లున్నారన్నా?” అన్నాడు మల్లేశ్ ఆ రోజు జరిగన సంగతులను గుర్తుచేసుకుంటూ.

“చూస్తున్నావుగా చాలా బాగున్న, నువ్వెలా వున్నావు మల్లేశ్?” అడిగాడు సుందర్.

“అంతా అయిపోయిందన్నా, నా జీవితమే పోయింది” అంటూ భోరున విలపించాడు మల్లేశ్.

“ఏమైంది మల్లేశ్?” అంటూ భుజాలు పట్టుకొని ఊపూతూ అడిగాడు సుందర్.

“ఓ రోజు రాత్రి షాపు బంజేసి నేను నా భార్య ఇంటికి పోతాంటే, స్పీడ్‍గా వచ్చిన కారు నా భార్యను గుద్దేసి పోయింది. తల రోడ్డుకు తగిలి పెద్ద దెబ్బ తాకింది. ప్రైవేటు దవాఖాన్ల షెరికు జేసినం, నేను దాసుకున్న పైసలు మా మావ ఇచ్చిన పైసలు అన్ని బెట్టిన, మస్తు పైసలు ఖర్చయినయి. కాని బాగ్గాలే, ఆపరేషను జెయ్యాలే. ఇంకా లక్షలు గావాలే అంటాండ్రు. ఏం జెయ్యాల్నొ సమజైతలేదు, ఇగ గీ షాపు గూడ అమ్మకానికి బెట్టిన అన్నా” అంటూ తన్నుకొస్తున్న బాధను ఆపుకోలేక సుందర్ మీద పడి ఏడవసాగాడు.

ఒకసారిగా సుందర్ గుండె బరువెక్కింది, తన కళ్ళలో నీళ్లు తిరిగాయి.

సినిమాల్లో గుండె బరువెక్కె సీన్లు ఎన్నో రాసినా ఏనాడు చలించని సుందర్ ఈ రోజు తనకు అన్నం పెట్టిన వ్యక్తి తీవ్రమైన కష్టానికి చలించిపోయాడు. మల్లేశం భార్య యే హాస్పటల్‍లో వుందో కనుక్కొని మల్లేశంను తీసుకొని ఆ హాస్పటల్‍కు వెళ్లాడు. డాక్టర్సుతో మాట్లాడాడు, తనకు తెలిసిన వారి ద్వారా హాస్పటల్‍కు ఫోన్ చేయించాడు. అవసరమైన డబ్బు కట్టాడు. ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేయించాడు.

“మల్లేశం నువ్వేం భయపడకు, అన్ని నేను చూసుకుంటాను” అని అన్ని జాగ్రత్తలు చెప్పి తోడుగా తన వాళ్లను వుంచి వెళ్లాడు సుందర్. మల్లేశంకు మాత్రం ఇదంతా ఓ కలలా వుంది.

అర్జంటు పనిమీద అమెరికా వెళ్లిన సుందర్‍కు ఆపరేషన్ సక్సెస్ అయిందన్న ఫోన్ కాల్‍తో మనసు కుదుటపడింది.

***

సుందర్ బయటకు వెళ్లిన తరువాత నర్సింగ్ తన దగ్గరి బంధువులు, స్నేహితులను గుడ్డిగా నమ్మి సంస్థలో పెట్టుకోవడం వల్ల, సంస్థ లాభాల బాట నుండి మెల్లగా నష్టల ఊబిలో కూరుకుపోయింది. సంస్థలో ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకోసాగారు. కొందరు వచ్చిన డబ్బును పక్కదారి పట్టించారు. మరికొందరు సంస్థ కొచ్చే ఆర్డర్స్‌ను దారి మళ్లించారు. దాంతో సంస్థ పూర్తిగా దివాళా తీసింది. నర్సింగ్ అప్పుల పాలయ్యాడు. దాంతో ఆఫీసు ఇల్లు వేలం పాటకు వచ్చాయి. నర్సింగ్ జీవితం మెల్లగా రోడ్డు మీదకు వచ్చింది. తన అనుకొని నమ్మిన వాళ్లే తనను మోసం చేయడం తట్టుకోలేకపోయాడు నర్సింగ్.

***

విశాలమైన గ్రౌండులో షామియానా కింద వేసిన కుర్చీలన్ని వేలం పాట పాడటానికి వచ్చిన వ్యక్తులతో నిండిపోయాయి. ఆ వచ్చిన వారిలో నర్సింగ్ స్నేహితులు బంధువులు కూడా వున్నారు. విచార వదనంతో షామియానా కింద ఓ పక్కగా కూర్చున్నారు నర్సింగ్ దంపతులు. వారి పక్కనే కూర్చొని వున్నాడు యాది. ఏకధారగా కారుతున్న కన్నీటిని తన కొంగుతో ఆపడానికి ప్రయత్నిస్తుంది లచ్చిందేవమ్మ, తనలో బద్దలైన అగ్నిపర్వతాన్ని ఆమె కన్నీరు చల్లారుస్తుందా అన్నట్టు అతను మౌన మునిలా కూర్చున్నాడు. నమ్మకానికి మోసం, మంచికి చెడు చెయ్యడమే సమాధానమేమో అని అతని నిర్వేదం చెపుతోంది.

అప్పుడే రయ్యి రయ్యి మంటూ కాన్వాయిలా కార్లు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించాయి. అందులోంచి బిలబిలమంటూ మనుషులు దిగారు. వెనక నుంచి నర్సింగ్ భుజం మీద మృదువుగా ఓ చెయ్యి పడింది. అసహనంగా తిరిగి చూసాడు నర్సింగ్. ఆశ్చర్యం, ఆనందం అన్ని కలగలసిన మోముతో “తమ్మి” అన్నాడు. ఒక్కసారిగా సుందర్‍ను ఆలింగనం చేసుకొని చిన్నా పిల్లాడిలా భోరున విలపించాడు.

“నువ్వు నన్ను మర్చిపోయినవనుకున్న తమ్మి, మల్లచ్చినవా, జిందగి బార్బాద్ అయింది, బతుకు రోడ్డు మీదకొచ్చింది, నువ్వు పెంచిన సంస్థ కూలిపోయింది” తమ్మి అంటూ రోదించసాగాడు.

“ముఖ్య గమనిక, డిఫాల్టర్ వడ్డీతో సహా మాకు రావలసిన మొత్తాన్ని చెల్లించినందున వేలం పాటను నిలిపివేయడం జరిగింది. కావున గమనించగలరు” అని వేలం పాట పాడే మైకులో ప్రకటన వినపడగానే సుందర్ వైపు ఆశ్చర్యంగా చూసాడు నర్సింగ్.

చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలిపాడు సుందర్.

“తమ్మి ఈ ముచ్చట నీకెట్ల ఎరుకైంది?” అడిగాడు నర్సింగ్.

యాది వైపు చూసాడు సుందర్.

***

“గియ్యాల మస్తు కుషిగున్నది తమ్మి, సచ్చినోన్ని బతికిచ్చినవ్ మళ్ల పాణంబోసినవ్. గీ గుండె లోపలికి జొర్రినవ్ తమ్మి నువ్వు, ఒకపూట అన్నం బెట్టినందుకు గింతకనం జేత్తర తమ్మి” అన్నాడు నర్సింగ్ పెరుగును అన్నంతో కలుపుతూ.

“మీరు పెట్టింది అన్నం మాత్రమే కాదు సార్, ఒక జీవితాన్ని నిలబెట్టారు, మీరు నీళ్లు పోసి పెంచిన మొక్క ఈ రోజు వృక్షమైంది. అది మీకు నీడనివ్వకపోతే ఎందుకు సార్?” అన్నాడు సుందర్, లచ్చిందేవమ్మ పోసిన పచ్చిపులుసును పప్పుతో కలుపుతూ

“మంచి వాళ్లకు మంచే జరుగతది, నువ్వు సల్లగుండాలే బిడ్డా” అంటూ వంటింట్లోకి పోయింది లచ్చిందేవమ్మ.

“నీకు మంచి సంబంధం జూసి పెండ్లి జేయ్యాలే తమ్మి, నువ్వు పది మంది పొట్టెగాళ్లను కనాలే, గాళ్లతో నేనాడుకోవాలి” అన్నాడు నర్సింగ్ పెద్దగా నవ్వుతూ.

“సార్, మరీ పది మంది పిల్లలా?” అంటూ ఆ నవ్వుతో జత కలిసాడు సుందర్.

“అవు తమ్మి, నీ అసొంటి పది మంది బిడ్డలు పుడితే ఎంత మంది నాలాంటోళ్లకు ఫాయిదా అయితది, నీకు కష్టమైతే నాకియ్యి తమ్మి నేను సాదుకుంటా” అన్నాడు నర్సింగ్ ఉత్సాహాంగా.

అక్కడున్న యాది లచ్చిందేవమ్మ సుందర్ ముఖాల్లో చిరునవ్వులు వెలిసాయి.

***

అక్కడంతా సందడిగా వుంది, షాపు ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనివాళ్లంతా హడావిడిగా తిరుగుతున్నారు. షాపంతా పూలతో అలంకరణలు చేసి ఉన్నాయి. బ్రాహ్మణులు పూజ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. పెద్ద పడవలాంటి కారు వచ్చి ఆగింది షాపు ముందు. సూటు బూటు ధరించి వున్న సుందర్ కారులోంచి దిగాడు. వెనకే మల్లేశం, అతని భార్యా దిగారు. ఎందుకు ఇక్కడికి వచ్చామో వాళ్లకు అర్థం కాలేదు. షాపు బోర్డు చూసిన మల్లేశం భార్య ఆశ్చర్యపోయింది. బోర్డు చూడమన్నట్టుగా మల్లేశంను చెయ్యితో తట్టి కళ్ళతోనే సైగ చేసింది. బోర్డు చూసిన మల్లేశంకు నోట మాట రాలేదు.

‘మల్లేశం కాఫీ షాపు’ అని బోర్డుపైన రాసి వుంది. అలాగే స్థాణువులా నిలబడిపోయాడు ఆ బోర్డు చూసిన మల్లేశం.

“పద మల్లేశ్” అన్న సుందర్ మాటతో ఈ లోకంలో కొచ్చాడు మల్లేశం.

పూర్ణకుంభంతో బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ సుందర్, మల్లేశం, అతని భార్యను వారు షాపులోకి తీసుకెళ్లారు.

మల్లేశంతో రిబ్బను కట్ చేయించాడు సుందర్. మల్లేశంకు అతని భార్యకు ఇదంతా అయోమయంగా వుంది. షాపు పేపర్స్ మల్లేశం చేతిలో పెట్టాడు సుందర్. ప్రశ్నార్థకంగా చూసారు మల్లేశం, అతని భార్య.

“ఇక నుండి ఇది నీ షాపు, నువ్వే ఓనరువు. ‘మల్లేశం కాఫీ షాప్’ అని ఒత్తి పలుకుతూ, ఎలా వుంది” అని అడిగాడు.

వెంటనే భార్యభర్తలు సుందర్ కాళ్లమీద పడిపోయారు, వారి కన్నీటితో సుందర్ కాళ్లను కడిగారు. వాళ్లను ఓదార్చడం సుందర్ వల్ల కాలేదు.

“ఒక్కపూట అన్నం బెట్టినందుకు గింత సాయం జేత్తరా అన్నా?” అన్నాడు మల్లేశం కళ్లలో ఉబికివస్తున్న నీటిని తుడుచుకుంటూ గద్గదమైన స్వరంతో.

“తమ్ముడు, నువ్వు చేసింది చిన్న సహాయం కాదు, ఆ రోజు నా ఆకలి విలువకు నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే, ఇది నా కృతజ్ఞత” అన్నాడు సుందర్.

***

తన జీవితంలో జరిగిన ఎత్తుపల్లాలు, తనకు సంబంధించిన వ్యక్తులు, తను సాధించిన సక్సెస్‍ను ఉదహరిస్తూ ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేసాడు సుందర్. ఆ పుస్తకం పెద్ద సక్సెస్ అయింది. పుస్తకం కాపీలు పెద్ద ఎత్తున అమ్ముడుపోయాయి. ఆ డబ్బును కూడా అనాథ పిల్లలకు డొనేట్ చేసాడు సుందర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here