ఒలికిలో పాడి ఆవు

2
7

[dropcap]అం[/dropcap]దమైన పుష్పాలంకరణతో, విద్యుద్దీపాల కాంతితో సభాభవనం చూడముచ్చటగా ఉంది. హాలు నిండా జనం. నిర్వాహకులు అతిథుల కోసం ఎదురు చూస్తూ వారికి స్వాగతం చెప్పటానికి ద్వారం దగ్గరే నిలబడి ఉన్నారు. పెద్దలంతా అలవాటుగా అనుకున్న సమయానికంటే పావుగంట ఆలస్యంగానే వచ్చారు. సభ ప్రారంభమయింది. అది చిన్న పట్టణం కావటం వలన, ఇటువంటి కార్యక్రమాలు కాస్త అరుదుగా జరగటం వలన, నిర్వాహకులకు ఊరిలో ఉన్న పేరు వలన చాలామంది వచ్చారు. యథావిధిగా అతిథులను స్వాగతించటం, దీపారాధన, ప్రార్థన మొదలైనవన్నీ పూర్తి అయిన తరువాత వేదిక పైన ఆసీనులైన పెద్దలు, పుర ప్రముఖులు అందరూ ఒకరి తరువాత ఒకరు మాట్లాడారు. అందరి మాటల సారాంశం దాదాపు ఒకటే. అందరూ ప్రశంసించినది, పొగడ్తలతో ముంచెత్తినది ఒక వ్యక్తినే. ఆ వ్యక్తి పేరు వసంత్. చిరునవ్వులు చిందిస్తూ దర్పంగా కూర్చొని, పొగడ్తల వలన కలిగిన ఆనందాన్ని పెద్దగా బయటకు కనుపించనీయకుండా జాగ్రత్త పడుతున్నాడతడు.

అందరి ప్రసంగాలూ పూర్తయ్యాయి. ఇక చివరిగా వసంత్ మాట్లాడాలి. వినయంగా తల్లిదండ్రుల పటానికి నమస్కరించి, తనను పెంచి పెద్ద చేసిన తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక సత్కార్యానికి తాను ఇస్తున్న విరాళాన్ని (ఐదు లక్షలు) ప్రకటించాడు. సభా భవనం కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది. తన తల్లిదండ్రులకు చదువంటే చాలా ఇష్టమని, తనకు పెద్ద చదువులు చెప్పించి ఇంత వాడిని చేసిన వారి జ్ఞాపకార్థం ఏటా ఆ ఊరి కళాశాలలో ప్రథమ స్థానాన్ని పొందిన విద్యార్థులకు తాను ఇచ్చిన విరాళం పైన వచ్చిన వడ్డీతో బహుమతులు ఇవ్వాలని నిర్వాహకులను కోరుతూ ప్రసంగాన్ని ముగించాడు. సభ తరువాత ఏర్పాటుచేసిన విందులో కూడా పాల్గొన్న వారందరూ వసంత్ గొప్పతనాన్ని పలుమార్లు పొగిడారు. అతని తల్లిదండ్రుల అదృష్టానికి మనసులో కొంచెం అసూయపడిన వారు కూడా లేకపోలేదు.

ఇంత కోలాహలంగా జరిగిన సభలో నిశ్శబ్దంగా ఒక మూల కూర్చుని అంతా చూసి, విని, విరక్తిగా నవ్వుకుంటూ బయటకు నడిచిన వ్యక్తి మాత్రం ఒక్క వెంకటరామయ్యే. వెంకటరామయ్య వసంత్ తండ్రికి ప్రాణ స్నేహితుడు. అతని కుటుంబ విషయాలన్నీ బాగా తెలిసిన వ్యక్తి. తన స్నేహితుడు చివరలో మానసికంగా ఎంత కృంగిపోయాడో వెంకటరామయ్యకి తెలుసు. తనకి ఫోన్ చేయటానికి కూడా తీరిక లేనట్లుగా ఉండే కొడుకును గురించి వసంత్ తండ్రి పరంధామయ్య బాధపడేవాడు. ఎప్పుడైనా చూడటానికి వచ్చినా సూటిపోటి మాటలతో తల్లిదండ్రుల మనసులను గాయపరిచేవాడు. వారు తనకింకా ఎంతో చేయవలసినది చేయలేదని గోల చేసేవాడు. అతని భార్య సరేసరి. ఉన్నవీ, లేనివీ కల్పించి భర్తకు చెప్పటం, గౌరవం లేకుండా అత్తమామలను విసుక్కోవటం – ఇవన్నీ భరిస్తూ, లోకవిరుద్ధమైన, విడ్డూరమైన ఈ పరిస్థితులను గురించి ఎవరికీ చెప్పకోలేక తమలో తామే కుమిలిపోయేవారు ఆ దంపతులు. వారు ఒకరికొకరు చెప్పుకున్నా, ఓదార్చుకున్నా కూడా కొడుకు, కోడలు దృష్టిలో అది తప్పే. వాళ్లు మాత్రం వచ్చే పోయే వాళ్ళందరి దగ్గరా తామేదో వాళ్లని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడేవారు. తమ దగ్గరకు రమ్మంటే రామని అంటున్నారని ఫిర్యాదు చేసేవాళ్ళు.

“కొడుకు కోడలు ఇంత ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళవచ్చుకదండీ? ఈ వయసులో కష్టపడుతూ ఇక్కడ ఉండటం దేనికి?” అంటూ ఆ వచ్చిన వాళ్ళు ఉచిత సలహాలను ఇచ్చేవారు. పరంధామయ్య పోయిన తరువాత సీతమ్మ పరిస్థితి మరీ అధ్వానంగా తయారయింది. భర్త, తను పరిస్థితులను అర్థం చేసుకుని ముందే నిర్ణయించుకుని ఉండటం వలన ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్ళటానికి సీతమ్మ అసలు ఇష్టపడలేదు. ‘అసలు కంటే వడ్డీ ముద్దు’ అన్నట్లుగా మనుమలు, మనుమరాళ్ళని చూడాలని ఆ వృద్ధులు తపించిపోయేవారు. వాళ్ళూ తొంగి చూసిన పాపాన పోలేదు. ఆఖరికి తాత, నాయనమ్మలు పోయినప్పుడు కూడా రాలేదు. విషబీజాల ప్రభావం సామాన్యమైనదా మరి! నిజానికి ఆత్మగౌరవంతో, గుట్టుగా ఉన్నదానితో కాలం వెళ్ళబుచ్చారే కానీ సీతమ్మ, పరంధామయ్యలు కొడుకు మీద ఆధారపడి బ్రతకలేదు. అతనికి అప్పులు మిగల్చలేదు సరి కదా తామున్న ఇల్లు వారసత్వంగా చెందేలా చేసే వెళ్లారు. పెద్ద కోరికలు లేకపోవటం, ఆరోగ్యాలు మంచివి కావటం వారి అదృష్టం. వృద్ధాప్య సమస్యలు తప్ప పెద్ద అనారోగ్య సమస్యలేవీ లేకుండానే సుమారు 90 సంవత్సరాలు జీవించి కన్నుమూసారు ఆ దంపతులు. ఉన్నన్నాళ్ళు ఒక్క మంచి మాట కోసం, ఆప్యాయత కోసం తపించారే గానీ సంతానం నుండి వారేమీ కోరలేదు. ఇవాళ వసంత్‌ని అందరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే వెంకటరామయ్య గుండె కలుక్కుమంది. ‘బతికుండగా మజ్జిగచుక్క గతిలేదు కానీ ఒలికిలో కట్టరా పాడావుని’ అన్నట్లుంది అనుకున్నాడు మనసులో. మనసులోని బాధ పేలవమైన చిరునవ్వుగా పెదవుల పైకి పాకింది. సన్నని నీటిపొర ఆయన  కళ్ళను కమ్మివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here