ఒళ్లు వంగని వాడికి తిండి లేదు

0
12

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]అం[/dropcap]డిబ అనే గిరిజన గ్రామంలో అధిక సంఖ్యాకులు కాయకష్ట బాగా చేసి జీవనం సాగిస్తున్నారు. అడవిలో కట్టెలు సేకరించడం, కరక్కాయలు, నల్లజీడి పిక్కలు, అడ్డాకులు, తేనె ఇలా సేకరించి సంతల్లో విక్రయించి ఆ సొమ్ముతో ఇంటికి కావలసిన దినుసలు కొనుక్కుంటారు. ఆ గ్రామంలో ఎర్రయ్య అనే గిరిజనుడు ఏ పనీపాటా చేయకుండా సోమరిపోతులా అందరి ఇళ్లకు వెళ్లి అన్నం, అంబలి తెచ్చుకుని బ్రతికేస్తున్నాడు. ఏదైనా పని చేసుకోరా అని ఎందరు చెప్పినా వినలేదు. గంజాయి పీల్చడంలో వాడు దిట్ట. కొందరు యువకులను చేరదీసి వారికి గంజాయి పీలిస్తే మజాగా ఉంటుందని చెప్పి వాళ్లను పాడుచేయడం ప్రారంభించాడు.

ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు రత్నం వీడిని బాగా గమనించాడు. ఒకనాడు అతణ్ణి పిలిచి “నాతో వస్తావా? నీకు మంచి మాంసం భోజనం పెట్టిస్తాను” అని చెప్పాడు. వాడు సరేనని ఆ ఉపాధ్యాయునితో వెళ్లాడు.

“నాకు పిల్లలకు ఇవ్వమని ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చింది. వాటిని ఒక బస్తాలో సర్దుదాము. తర్వాత వాటిని మన గ్రామానికి తీసుకెళ్లాలి” అని చెప్పగా, వాడు “ముందు భోజనం పెట్టించండి” అని కోరాడు.

“సరేలే! ఇద్దరం తిందాం కలిసి ఒక అరగంట తర్వాత, మంచి భోజనం హోటల్‌ నీకు చూపిస్తాను రా” అని తీసుకెళ్లాడు. అక్కడ చాలా రద్దీగా ఉంది. ఎంతో సేపు వేచి చూస్తేగాని వారికి బల్ల దొరకలేదు కూర్చోడానికి. తర్వాత వారిద్దరూ భోజనం చేశారు. “ఇక్కడ రోజూ భోజనం చేస్తే బాగుంటుంది” అన్నాడు ఎర్రయ్య!

“అలానే నేను ఆ హోటల్‌ యజమానితో మాట్లాడతాను, నీకు పని ఏదైనా ఇవ్వమని” అని చెప్పాడు ఉపాధ్యాయుడు.

“ఐనా నాకు గంజాయి త్రాగడం తప్ప ఏ పనీ తెలియదు” అన్నాడు ఎర్రయ్య.

“అలాగా? ఆ హోటల్‌ యజమాని ఏ పని ఇస్తాడో కనుక్కుందాం పద” అని అతడికి బోధపరిచాడు ఉపాధ్యాయుడు.

‘వీడికి ఒళ్లు వంగదు. వీడిని దారిలో పెట్టాలి’ అని అనుక్కున్నాడు ఆయన. హోటల్‌ యజమానికి వీడి గురించి అంతా వివరంగా చెప్పాడు ఉపాధ్యాయుడు.

“ఒరే ఎర్రన్నా! నువ్వు ముందుగా ఈ కత్తితో ఆ కర్రలు ముక్కలు చేయి. తర్వాత వాటిని వంటగదిలో వండుతున్న వారికి ఇవ్వాలి. సాయంత్రం కూరగాయలు తరగాలి. పప్పు రుబ్బాలి. గంజి జాగ్రత్తగా వుంచి ఆవుకు పెట్టాలి” అని చెప్పాడు.

“ఇన్ని పనులు నేను చేయాలా?” అని ప్రశ్నించాడు ఎర్రయ్య.

“అలాగయితే నీకు రెండు పూటలా భోజనం పెడతాను. వంద రూపాయలు జీతంగా ఇస్తాను” అనగా అందుకు ఒప్పుకున్నాడు.

ఉపాధ్యాయుడు తన గ్రామం వెళ్లి అందరికీ ఎర్రన్న గురించి చెప్పాడు.

“అవును సార్‌! ‘ఒళ్లు వంగిన వాడికే తిండి దొరుకుతుంది’. ఒళ్లు వంచని వాడికి పస్తులే మరి” అన్నారు.

కొన్ని నెలల తర్వాత ఎర్రన్న గ్రామానికి తిరిగి వచ్చాడు. తన దగ్గరున్న డబ్బులతో గ్రామంలో ఒక భోజనం హోటల్‌ తెరిచాడు. తనతోపాటు గంజాయి త్రాగిన యువకులను పిలిచి వారికి పని విలువ గురించి చెప్పాడు.

వారితో ‘ఒళ్లు వంగిన వారికే తిండి ఉంటుందిరా! తిండికి అర్హత మీకు అప్పుడే కలుగుతుంద’న్నాడు. గ్రామంలో అందరూ ‘ఒళ్లు వంగిన వారికే తిండి’ అని ఈ మాటల్ని సామెతగా చెప్పసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here