ఓం నమః శివాయ-2

0
14

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Om Namah Shivaya’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు. ఇది రెండవ భాగం.]

[dropcap]తు[/dropcap]ర్కియా రాజధాని అంకారాలో రెండు నెలల క్రితం జరిగిన పురాతత్వ శాస్త్రజ్ఞుల సమావేశంలో ప్రొ. రావత్ ప్రత్యేక అతిథి. అక్కడికి వచ్చిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ నిర్దేశకుడు డా. ఫయాజ్ అహ్మద్ రిజ్వి తనుగా వెతుక్కుని వచ్చి ప్రొ. రావత్‌ను ఆత్మీయంగా పలకరించారు. తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. అదే రకమైన ఆహ్వానం సింధ్ ఖాయర్పుర్ విశ్వవిధ్యాలయ చరిత్రకారుడు ప్రొ. జాఫర్ ఇమామ్ నుండి కూడా వచ్చింది.

అంకారా నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రొ. రావత్ దాని గురించి మరచిపోయారు. కానీ ఆయనే ఆశ్చర్యపడేలా ఒకే వారంలో ఆయనకు ఖాయర్పూర్ విశ్వవిద్యాలయం నుండి విశేష వరస ఉపన్యాసాల గురించి ఆహ్వానం వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమీషన్ కూడా వెంటనే వీసా మంజూరు చేసింది. దానితో పాటే పాకిస్తాన్ లోని ఏ పురాతత్వ స్థలానికైనా ఆ ప్రాంతపు లేదా దేశపు అనుమతి అవసరం లేకుండా వెళ్ళవచ్చన్న అనుమతి పత్రం కూడా వచ్చింది. భారతీయ శాస్త్రజ్ఞుడికి అత్యంత అదృష్టం ఉంటేగానీ ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి రావచ్చేమో! ఉత్సాహవంతులైన ప్రొ. రావత్ ఈ అవకాశాన్ని వదులుకుంటారా?

పాకిస్తాన్‌కు వెళ్ళిన ఆయన మొహంజొదారో, చాన్హుదారోలలో నాలుగు రోజులు గడిపారు. ఉపన్యాసాలు ఆరంభమయ్యేది అక్కడి వారం సెలవు శుక్రవారం తరువాత  శనివారం నుండి. అంతలో తమ శిష్యుడికి రెండు సార్లు వాట్సప్ మెసేజ్ పంపారు. ఈ ఉపన్యాసాల తరువాత లాహోర్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి, ఇస్లామాబాద్ కైద్-ఎ-ఆజం విశ్వవిద్యాలయం నుండి ఆహ్వానాలు వచ్చాయి, ‘నాకు నమ్మశక్యం కావడం లేదు’ అని మెసేజ్‌లో పేర్కొన్నారు. ‘ఆ దేశం మారుతోందేమో: వచ్చిన అవకాశాలను వదులుకోకండి’ అని ఆదిత్య బదులిచ్చాడు.

రాత్రి ఎనిమిదిన్నరకు ప్రొ. రావత్ నుండి కాల్ వచ్చింది. పాకిస్తాన్‌కు వెళ్ళినాక ఇదే మొదటి అంతర్జాతీయ కాల్ అని చెప్పి ప్రారంభించారు. ఆయన తన భార్యకు కూడా కాల్ చేయలేదా అని ఆదిత్య అనుకున్నాడు. కానీ తరువాత ప్రొ. రావత్ గారు ప్రారంభించిన విషయం అతడిని కట్టిపడేసింది.

“వేరే వేరే కోణాలనుండి తీసి నువ్వు పంపిన శివలింగం చిత్రాలను నేను కూలంకషంగా పరిశీలించాను. అది ఆ స్థలానిదే అని నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా మనం లక్నో వాళ్ళ నుండి సరైన సమాచారాన్ని తీసుకుందాం. దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు కనిపెట్టిన అవశేషాలు తొమ్మిది వేల సంవత్సరాల కంటే పురాతనమైనవి. సిందు-సరస్వతి నాగరికత నగర నిర్మాణం మొదలయ్యింది ఇక్కడినుండే అని మనకు నమ్మకం కలిగింది. ఇక మనకు దొరికిన సాక్ష్యాలను సరైన రీతిలో ప్రదర్శించగలిగితే ప్రపంచం కూడా నమ్ముతుంది. దాని గురించి ఆలోచించకు. దానితో పాటు ఈ శివలింగం గురించిన మన లెక్క సరిగ్గా ఉన్నట్లయితే ఏమవుతుందో ఊహించావా?” ప్రశ్న వేసి మాటలు ఆపారు ఆయన. ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆదిత్యకు స్ఫురించలేదు. ఆయన తరువాతి మాటల కోసం సహనంతో కాచుకున్నాడు.

“శివుడి ఆరాధన కనీసం తొమ్మిది వేల సంవత్సరాల నుండి ఆగకుండా నడిచి వస్తోంది అన్న విషయం నిరూపించబడుతుంది. ఇది మన సనాతన ధర్మం యొక్క ప్రాచీనతను ప్రపంచానికి చాటుతుంది. దీనికి పోలిస్తే యూదు, పార్సీ మతాలు కాలమాన దృష్టిలో ఎంత కొత్తవి అని ప్రపంచానికి తెలుస్తుంది. అంతే కాదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించు. సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రకారం శివుడు సుమారు పదిహేను వేల సంవత్సరాల క్రితం ఇంకెక్కడినుంచో భూమికి వచ్చాడు. ఇంకో అయన ప్రవీణ్ మోహన్ ప్రకారం శివలింగం అంటే శివుడి జననేంద్రియం కాదు. అదొక అంతరిక్ష వాహనం. శివుడు అన్యలోకంలోని బుద్ధిజీవి. ఆయన ఏదో కారణానికి తన అంతరిక్ష వాహనంలో ఇక్కడికి వచ్చాడు అని ప్రవీణ్ మోహన్ దక్షిణ భారతంలోని అతి ప్రాచీన శివాలయాల్లో దొరికే ఆధారాలనే ఉదహరించి చెప్తారు. ఆ అంతరిక్ష వాహన ఆకారంలోనే శివలింగం అనే పూజార్హమైన ఒక వస్తువు పుట్టుకొచ్చింది అని ఆయన వాదన. నీకు దొరికిన శివలింగం అడుగు భాగం చూడు మన రాకెట్లను పోలుతుంది..”

ఆదిత్య డంగైపోయి వింటున్నాడు.

“..దాన్ని జాగ్రత్తపరచు. నేను తిరిగి రాగానే దాన్ని లక్నోకు నేనే స్వయంగా తీసుకువెళ్ళి, దాని కాలనిర్ణయం చేయిస్తాను. చాలా మటుకు మనం అనుకున్న విధంగానే సాహ్ని వాళ్ళు కూడా చెప్తారు. కానీ దానికో వైజ్ఞానిక ముద్ర పడాలి అంతే. అది దొరికేదాకా ఈ విషయం ఎవరితోనూ అనవద్దు. అలాగని నీహారికకు కూడా చెప్పు. సాహ్ని వాళ్ళ రిపోర్టు కోసం కాచుకుందాం. ఇంతలోనే నువ్వు నీ పరిశోధన గురించిన వివరాలతో వ్యాసం రెడీ చెయ్యి. ముందు నెలలో ఢిల్లోలో జరిగే సమావేశం దాన్ని ప్రస్తుతపరచడానికి సరైన వేదిక. వ్యాసం యొక్క సినాప్సిస్ ఇప్పుడే తయారు చెయ్యి. ప్రొ. విష్ణు నారంగ్ గారికి మెయిల్ చెయ్యి. నాకు కాపీ పెట్టు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను.” అంటూ ప్రొ.రావత్ ముగించారు.

ఆ రాత్రి ఆదిత్య, నీహారికల చర్చలకు అంతే లేకుండా పోయింది.

కానీ మరుసటి రోజు సాయంత్రం వచ్చిన వార్త సన్నివేశాన్నే మార్చేసింది.

సింధ్ ప్రాంతపు మధ్యయుగపు రేవు పట్టణపు దగ్గరి అవశేషాలను సందర్శించడానికి వెళ్ళిన ప్రొ.రావత్ కుప్పకూలిన రాతి చప్టాతో పాటే తనూ అరవై అడుగుల క్రిందికి పడి చనిపోయారు. ఈ ప్రమాదం వార్త అధికృతంగా పాక్ హై కమీషన్ ద్వారా భారత ప్రభుత్వానికి, ఆయన భార్య డా. సుధీరా రావత్‌కు చేరింది.

తయారు చేస్తున్న వ్యాసాన్ని ల్యాప్‌టాప్ నుండి తీసేసి, దాని గురించి మరచిపోవాలని బయలుదేరిన ఆదిత్యను నిలవరించింది ప్రొ. విష్ణు నారంగ్. చాలా తక్కువగా మాట్లాడే ఆయన ఇంతే చెప్పారు. “యువర్ రిసర్చ్ పేపర్ ఈస్ అ ఫిట్టింగ్ ట్రైబ్యూట్ టు యువర్ గురు”.

***

కానీ, ఈ రోజు జరిగిందేమిటి? తను తన వ్యాసంలో చర్చించి తన అన్వేషణను విద్వాంస జగత్తుకు అధికృతంగా పరిచయం చేసిన కొన్ని గంటల్లోనే తను, తన గురువుగారు కనీసం తొమ్మిది వేల సంవత్సరాల పురాతనం అని నమ్మిన శివలింగం కేవలం ఒక వెయ్యి రెండువందల సంవత్సరాలంత ప్రాచీనం మాత్రమే అని ప్రపంచం స్థాయిలో నమ్మకమైన ఒక సంస్థ అధికృతంగా ప్రకటించింది.

‘నా అన్వేషణను కంప్యూటర్ కనికట్టు అని అప్పుడే హేళన చేసిన పండితులు, మాధ్యమాలు ఇక నన్ను ఆడుకుంటాయి. నేను, నా జట్టు ఎంతో శ్రమపడి, అతి ప్రాచీనం అని ప్రపంచం ముందు పెట్టదలచిన వస్తువులన్నీ గంగావళి నది వరదల్లో కొట్టుకుపోయి సముద్రంలోకి విసిరేసిన వస్తువులు మాత్రమే: అక్కడ ఏ  ప్రాచీన నగరమూ లేదు అని దేశంలోని పురాతత్వ శాస్త్రజ్ఞులు, మాధ్యమాలు నన్ను గేలి చేస్తారు. నా వ్యాసాన్ని, ఇస్తాంబుల్ మరీన్ ఆర్కియాలజీ సంస్థ నివేదికను చదివే నా సహోద్యోగులు ఇక మమ్మల్ని ఏడిపించక మానరు. ఈ పరిస్థితుల్లో నేను ఏ మొహం పెట్టుకుని అసోసియేట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూకి వెళ్ళగలను? నాదే కాదు. ఇప్పుడే ప్రారంభమైన నీహారిక పురాతత్వ శాస్త్ర అధ్యాపక వృత్తికి కూడా ఇది ఇబ్బందికరమే కదా! మా ఇద్దరి శ్రమ కూడా సముద్రపు నీటిలో కడిగినట్టయింది. పాపం! నీహారికది సంవత్సరంన్నర సర్వీసును వృథా చేయించాను!’ అనుకుంటూ ఆదిత్య తలకాయ పట్టుకుని రాత్రంతా కూర్చున్నాడు.

అయిందయ్యింది! పదిన్నరకు తనకోసం కాచుకునే విద్యార్థులను నిరాశ పరచడం ఇష్టం లేక స్నానం చేసి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుండి చెకౌట్ చేసి ఏర్పోర్ట్ చేరుకున్నాడు. విమానం గాల్లోకెగరగానే సీటుకు ఆనుకుని కళ్ళు మూసుకున్న ఆదిత్య మెదడులో అనేక ప్రశ్నలు!

శివలింగాన్ని ఇస్తాంబుల్ సంస్థకు చేర్చే బాధ్యత తీసుకున్నది డా. సుధీరా రావత్. ఆమె తన గురువు ప్రొ. రావత్ భార్య. తను కూడా పురాతత్వ శాస్త్రజ్ఞురాలు. అలాగయితే ఆ నివేదిక మొదటి చేరాల్సింది ఆమెకు. కానీ బిబిసి చేసిన నివేదికలో ఆమె ప్రస్తావనే లేదు. ఆమెకు కాకుండా ముఖ్యమంత్రికి చేరిందెలాగా? సుధీరాగారికి కాకున్నా అర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మాధ్యమాలకు చేరవలసిన వార్త రాజకీయ నేత నుండి బయటికి రావడం ఎలాగ?

ఇంటికి రాగానే ఫోన్ మోగింది. అటువైపునుండి ప్రొ. సుధీరా రావత్. “బాధపడద్దు. కెరియర్లో ఇవన్నీ సహజమే” అంటూ ఓదార్చింది. “నాకెందుకో ఆ ఇస్తాంబుల్ సంస్థ నివేదికను నమ్మబుద్ధి కావడం లేదు” అన్నాడు ఆదిత్య.

“నేను ఒప్పుకుని తీరాలి” సుధీరా రావత్ గారి మృదువైన గొంతు. ఒక నెల క్రితమే తన భర్తను కోల్పోయిన ఆ శాస్త్రజ్ఞురాలి మాటను అంత తీసివేయలేకపోయాడు అదిత్య.

ప్రమాదవశాత్తు పతిని పోగొట్టుకుని వ్యాకులంలో మునిగిన డా. సుధీరా రావత్ తన బాధను పక్కకు పెట్టి ఆదిత్యకు సహాయ పడడానికి ముందుకు వచ్చారు. దానివలన తన పతి ఆత్మ శాంతిస్తుందన్నారు. ఆ శివలింగాన్ని పాట్నాకు కానీ, కోపన్‌హాగన్‌కు కానీ పంపేది వద్దు అనుకుని ఆసక్తి కోల్పోయిన ఆదిత్యను ఓదార్చి ధైర్యం నింపి తామే స్వతః తమ పరిచయస్తులైన శాస్త్రజ్ఞుల సహాయంతో తుర్కియాలోని ఇస్తాంబుల్ సంస్థకు పంపారు. దానికి కావలసిన అనుమతిని కూడా ఆమే కష్టపడి తీసుకున్నారు. అక్కడి నుండి వచ్చిన నివేదిక ఆమెను కూడా నిరుత్సాహపరచింది. కానీ తను దాన్ని ఒప్పుకోవాలి.  తన పతి కల ఇలా మట్టిపాలైనందుకు చాలా బాధపడ్డారు. కానీ అంత తన నిరాశ, బాధల్లోనూ ఆదిత్యను ఓదార్చే తల్లి హృదయంతో ఆదిత్యకు సాంత్వన పలికారు.

***

ఆదిత్యకు ఆశ్చర్యమేసేలా, రాష్ట్ర వైచారిక, లౌకిక ముఖ్యమంత్రి అత్యత్సాహంగా మాధ్యమాలతో పంచుకున్న వార్త ఇంకా సహోద్యోగుల వరకూ వెళ్ళలేదు. వాళ్ళు బిబిసి వార్తలు కూడా చూసినట్టు లేరు. ఆదిత్య కూడా దాని గురించి మాట్లాడలేదు. ఆ రోజు తరగతులను సహజంగా నడపడానికి ప్రయాస పడాల్సివచ్చింది. నీహారిక వద్ద నుండి ఏ రకమైన సమాచారమూ రాలేదు. తనకందిన చేదు వార్తను ఆమెకు ఫోన్ చేసి చెప్పాలని కూడా అనిపించలేదు ఆదిత్యకు.

మధ్యాహ్నం లంచ్ వద్దనుకుని విచారంగా కూర్చున్న ఆదిత్య చేంబర్లోకి హెచ్.ఓ.డి ప్రొ. డేవిడ్ లాజరస్ వచ్చి “ఓహో! సెమినార్ ముగించి వచ్చావా?” అంటూ వంకర నవ్వు నవ్వి “రేపు ఇంటర్వ్యూ ఉంది కదా? వెళతావా?” అంటూ ప్రశ్నించారు. అడిగిన వరస చూస్తే “ఎందుకు వెళ్తావయ్యా?” అన్నట్టు అనిపించింది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన వార్త ఆయనకు తెలిసిపోయిందని అనిపించింది.

ఆ క్షణం నీహారికతో మాట్లాడాలని అనిపించింది. ఇంతవరకూ ఆమెకు ఈ వార్త అందలేదా? ఒకవేళ అందుండకపోతే తెలపాల్సిన బాధ్యత తన మీద ఉందనిపించింది. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అరగంట తరువాత కాల్ చేసినా మళ్ళీ అలాగే వచ్చింది. ఆదిత్య కంగారు పడసాగాడు. ఈ వార్తల మధ్య ఆమెకేమైనా అయిందా?

ఆమె డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి ఆమె ఛేంబర్ ఇంటర్‌కామ్‌కు ఇవ్వమంటే ఆమె రెండు రోజులు సెలవు పెట్టి ఊరెళ్ళినట్టు వార్త వచ్చింది. ఈ రెండూ ఆదిత్యలోని గాబరాను మరింత పెంచాయి.

ఇక తప్పదనుకుని నేరుగా నారాయణ కల్యాణపుర్ గారికే ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ తీసుకుని నీహారిక ఈ రోజే వచ్చిందనీ, తనతో పాటు ముంబైనుండి వచ్చిన ఒక యువకుడితో కల్సి బీచ్ వైపు వెళ్ళిందని చెప్పారు. ఆ  యువకుడు ఎవరని అడిగితే “ తెలీదయ్యా! తన వయస్సే ఉంటుంది. పాత పరిచయం అనింది” అన్నారు.

ఆదిత్య ఆ రోజు రాత్రి కూడా నిద్రపోలేదు.

మరుసటి రోజు లేచాక ఏం చెయ్యాలో తోచలేదు. ఇంటర్వ్యూకు వెళ్ళరాదని క్రితం రాత్రే నిర్ణయించుకోవడం జరిగింది. సెలవు పెట్టి, తనకిష్టమైన ఏదో ఫ్యాంటసీ పుస్తకాన్ని చదువుతూ గడపాలని నిశ్చయించుకున్నాడు. వాస్తవాలన్నీ తనకు ఇలా ఎదురు తిరిగినప్పుడు ఫాంటసీల్లోనే కాలం గడపడం మంచిది అనుకుని నవ్వుకున్నాడు.

***

స్నానం చేసి బయటకు వస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. టవల్ చుట్టుకునే తలుపు తీసేసరికి నీహారిక, ఆమెతో పాటు ఒక ఆకర్షణీయంగా కనిపించే యువకుడు కనిపించారు. ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తూనే వారిని లోపలికి ఆహ్వనించి, కూర్చోమని చెప్పి, దుస్తులు ధరించి రావడానికి బెడ్రూంలోకి వచ్చాడు.

బట్టలు మార్చుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. యువకుడి తొడ పైన తను తీసుకోవడం మరచిపోయిన వార్తా పత్రిక కనిపించింది. “టీ తాగారా సార్?” అని నీహారిక అడిగింది. “అయ్యింది” అని చెప్పి “మరి మీది?” అని అడిగాడు ఆదిత్య. నీహారిక నవ్వింది. “ఈ రోజు టీ కాదు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అక్కర్లేదనిపిస్తోంది. సంతోషంతో కడుపు నిండిపోయింది” అన్నది. ఆమె మొహం కాంతితో వెలిగిపోతోంది.

ఆదిత్యకు అంతు దొరకని ఆశ్చర్యం. ఆమె వైపే అబ్బురపడుతూ చూశాడు. “మన శివలింగం కథ..” అని నీహారిక తన మొహం పైన ఇనుమడించిన చిరునవ్వుతో ఆరంభించింది. “ఆ.. ఇస్తాంబుల్..” అంటూ ఆదిత్య ఏదో అనబోయేంతలో “ఆ సంస్థ నమ్మకమైన సంస్థ సార్! అది చెప్పింది కరెక్టే!” అని గంభీరంగా  అనింది.

ఆమె ఏం చెపుతోందో ఆదిత్యకు అర్థమే కాలేదు. మనసంతా వ్యాకులమైంది. అది నిన్న మధ్యాహ్నం హెచ్.ఓ.డి. అన్న మాటలకంటే చేదుగా అనిపించసాగింది. అదేమీ పట్టించుకోకుండా నీహారిక కొనసాగించింది. “తమకు దొరికన దాన్ని అక్కడి విజ్ఞానులు సరిగ్గానే పరీక్ష చేసి, ఫలితం తెలియజేశారు. ఎందుకంటే అక్కడికి మనం పంపింది వెయ్యిన్ని రెండువందల సంవత్సరాలంత ప్రాచీనమైన, గుజరాత్ సముద్ర తీరంలో దొరికిన శివలింగమే” అన్నది.

“వాట్!” అని అరచాడు ఆదిత్య. నీహారిక పక్కన కూచున్న యువకుడి వైపు తిరిగి చూసింది. అతడు ఒకసారి గొంతు సరిచేసుకుని “నేను అనిరుద్ధ్ గంగొళ్ళి. నీహారిక కాలేజ్ సహపాఠిని. ఇప్పుడు ‘రా’లో పని చేస్తున్నాను. రా అంటే మీకు తెలుసు కదా! రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. నా గురించి ఇంత చాలు. ఇప్పుడు నేరుగా విషయానికి వస్తాను. ప్రొ. హితేశ్ రావత్ గారి మరణం ఆకస్మికమైనది కాదని మాకు అనుమానం కలిగింది. దర్యాప్తు ప్రారంభించాము. ఆయన పాకిస్తాన్ వెళ్ళడానికి అరేంజ్ చేసిన అక్కడి ఆర్కియాలజిస్ట్ ఫయాజ్ అహ్మద్ రజ్వితో మన దేశంలోని ఇద్దరు క్రితం మూడు నెలల నుండి టచ్‌లో ఉన్నారని కాల్ డిటెయిల్స్ వలన తెలిసింది. ఆ ఇద్దరూ మీకు తెలిసినవారే. మన పురాతత్వ శాస్త్రజ్ఞులైన ప్రొ. ఇషాక్ హబీబ్ అన్సారి, పెద్దగా హడావిడి చేసే రిపోర్టర్ తీస్తా పాటణ్‌కర్. వీరిద్దరూ సో కాల్డ్ లిబరల్-ప్రోగ్రెసివ్ గొంతులమని చెప్పుకోవడం మీకు తెలుసు. ఆ ఫోన్ కాల్స్ గురించి కూపీ లాగితే మాకు తెలిసిందేమంటే గంగావళి కయ్య వద్ద మీరు సముద్రభాగంలో చేస్తున్న అన్వేషణ పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసింది. ఈ పాకిస్తాన్‌కు తమదంటూ ఏ చరిత్ర లేదు. అంతా మనది లేదా ఆఫ్ఘనిస్థాన్ చరిత్రల నుండి దొంగిలించిందే. వాళ్ళకి సింధు-సరస్వతి నాగరికతల గురించి ఏ మాత్రమూ అభిమానం లేదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం కూడా ప్రపంచంలోని ఒక అతి పురాతన నాగరికతకు తమ దేశం పుట్టిల్లు అని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే. తమ దేశం భారతదేశం కంటే ప్రాచీనమైనది, చారిత్రకంగా వారు పురాతనమైన వారు అని చెప్పుకోవడానికి. మీరు చేస్తున్న పరిశోధన వాళ్ళ ఈ గొప్పలకు గండి కొడుతుంది అని వారు కంగారు పడ్డారు. అందుకే దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు రెండు రకాల దశల ప్లాన్ వేశారు. అందులో మొదటిది ప్రొ. రావత్ గారిని లేపేసి మిమ్మల్ని విహ్వలుల్ని చేయడం. అందుకే కపట ప్రేమ చూపించి, ఆయనను అక్కడికి రప్పించి చంపేశారు. ఆ సమయంలో మీరు ఈ శివలింగం గురించి ప్రొ. రావత్ గారికి పంపిన మెయిల్‌ను హ్యాక్ చేసి రెండో దశ ప్రారంభించారు. అదేమిటంటే మీకు దొరికిన ఆ శివలింగం ప్రాచీనమైనది కాదు, ఇక్కడిది కూడా కాదు అని ప్రపంచాన్ని నమ్మించడం. దాని ద్వారా మీ పరిశోధనను ఆపేయ్యడం. వాళ్ళ మెయిల్స్‌ని హ్యాక్ చేసినప్పుడు మాకు దొరికిన సమాచారం ఇది. శివలింగాన్ని లక్నోకు బదులు, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వగలిగిన ఇస్తాంబుల్ సంస్థకు పంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. పాకిస్తాన్‌కు తుర్కియాకు మంచి సంబంధాలున్నాయి. తుర్కియా ఎప్పుడూ ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్‌ను బలపరుస్తుంది. ఇంతా చేసి తుర్కియాలో భూకంపం వచ్చినప్పుడు ఆదుకుంది భారతదేశమే అయినా వారు మన సమర్థనకు రారు. ఈ శివలింగాన్ని కాలనిర్ణయం కోసం ఇస్తాంబుల్‌కు పంపడానికి మిమ్మల్ని ఒప్పించాల్సిన బాధ్యతను వారు ప్రొ. సుధీరా రావత్‌కు అప్పజెప్పారు.”

“ఆఁ!” ఉలిక్కి పడ్డాడు అదిత్య. అతడి ముంజేతిని చిన్నగా తట్టాడు అనిరుద్ధ్. “ఇది మీరు నమ్మడం కష్టం అని తెలుసు. కానీ జరిగింది మాత్రం ఇదే. ప్రొ. రావత్ గారు చాలా నిజాయితీపరులు. తోడుగా దేశభక్తుడు. కానీ సుధీరా రావత్ గారు అలా  కాదు. ఆమె వామపంథీయురాలు. వాళ్ళంతా తమ నుదుటికి ఒక అందమైన పట్టీ అంటించుకున్నారు, తాము లిబరల్-ప్రోగ్రెసివ్ అని. ఆమె తిరిగేదంతా వారితోనే. ఇది ప్రొ. రావత్ గారికి నచ్చేది కాదు. కానీ దాన్నే పెద్దది చేసి కాపురాన్ని చెడగొట్టుకోవడం ఆయనకు ఇష్టముండేది కాదు. సుధీరాగారికి కూడా ఆయనకున్న పేరు తెలుసు. దాన్ని పోగొట్టుకోవడానికి ఆమె తయారుగా లేరు.” ఒకసారి ఆ యువ అధికారి ఇద్దరివైపు చూశాడు. మళ్ళీ కొనసాగించాడు. “ట్రాజెడీ అంటే మన అకెడమిక్ ఫీల్డ్‌లో వాళ్ళే ఉన్నారు. ఈ క్షేత్రాలన్నీ ఇంకా వాళ్ళ పట్టులోనే ఉన్నాయి. ఈ విషయాలు పాకిస్తాన్ వాళ్ళకు తెలుసు. సుధీరాగారికి వామపక్షాలు అధికారంలో ఉన్న ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవిని ఎర చూపారు. ఆ పని చేసింది ఇక్కడి వాళ్ళైన ప్రొ. ఇషాక్ హబీబ్ అన్సారి, తీస్తా పాటణ్‌కర్. వాళ్ళతో ఆమెకు ముందునుండి మంచి సంపర్కమే ఉండింది. ఆమెకు ఆ ఎర చూపి పని చేయించుకుంటూనే తన భర్త హత్యను ఆమెనుండి కప్పి పుచ్చారు వీళ్ళు. అది ప్రమాదమని నమ్మించేశారు.”

ఆదిత్యకు ఇప్పుడు విషయం కొంచెం కొంచెంగా అర్థమవ్వసాగింది. తన గురువుగారి గురించి బాధపడ్డాడు. గురుపత్ని విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. దాన్ని పక్కకు పెట్టి, తన ఇంకో సందేహాన్ని ముందుంచాడు. “వాళ్ళకు మన విశ్వవిద్యాలయాల్లో పదవి ఎలా ఇప్పిస్తారు? ప్రభుత్వం అనుమతిస్తుందా?”

అనిరుద్ధ్ నవ్వేశాడు. “అందుకే అన్నాను. వామపంథీయులు కాని, వాళ్ళకు సౌకర్యంగా ఉన్న రాష్ట్రాలలో కానీ అధికారం ఉన్న రాష్ట్రాలలో ఆ అవకాశం ఉంది. వీళ్ళ ఈ ప్రస్తావనకు ఆ రాష్ట్రాలు సంతోషంగా ఒప్పుకుంటాయి. అదీగాక, మీడియా వాళ్ళు కూడా వీళ్ళవైపే ఉన్నారు. ఏ స్థానానికైనా, చివరికి రాజ్యసభ సభ్యత్వానికైనా ప్రొ. సుధీరాగారు అత్యంత అర్హమైన వ్యక్తి అని అన్ని చోట్ల సృష్టించడానికి ప్రయత్నిస్తారు. విజయం కూడా సాధించగలరు” నిజాయితీగా పని చేస్తున్న ఆ యువకుడి మొహంలో ఒక విషాదమైన పరిహాసం కనిపించింది.

ఆదిత్య మాటలుడిగి కూర్చుని వినసాగాడు.

అనిరుద్ధ్ కొనసాగించాడు. “పాకీలు, మనదేశంలోని వాళ్ళ స్నేహితుల తంత్రం తెలిసాక మేము ఒక ప్రతి తంత్రం తయారు చేశాము. దీన్నంతటినీ మీ నుండి దాచాము. ఇలా రహస్యాన్ని దాచడంలో నా పాత క్లాస్మేట్ అయిన నీహారిక చాలా సహాయపడింది. మిమ్మల్ని మరుగులో పెట్టింది దేనికంటే మీరు ఈ ప్రాజెక్టుకు లీడర్ కాబట్టి, మిమ్మల్ని ఈ విషయంలో చాలా మంది అడుగుతుంటారు కాబట్టి. అప్పుడు మీరు నోరు జారి ఏదైనా చెప్పేస్తే అనే భయం మాకుండింది. దేశం కోసం చేస్తున్న ఈ విషయాన్ని మీరు అన్యథా భావించరని మాకు తెలుసు. అదీ కాకుండా మీకొక సర్‌ప్రైజ్ ఇవ్వలని నీహారిక అనుకోవడం కూడా” అనిరుద్ధ్ నవ్వసాగాడు. నీహరిక కూడా సన్నగా నవ్వింది. ఆదిత్య మొహం కూడా తేలికయింది. అనిరుద్ధ్ ముందుకు సాగాడు. “కాబట్టి, శివలింగాన్ని ఇస్తాంబుల్‌కు పంపడానికి ప్రొ.సుధీరా మిమ్మల్ని ఒప్పించగానే మేమిద్దరం ప్లాన్ చేశాము. మీరు ఆ శివలింగాన్ని భద్రపరచడానికి నీహారిక ఇంట్లో వదిలిపెట్టడం మాకొక వరంగా మారింది” అంటూ నీహారిక వైపు చూశాడు. అప్పుడు నీహారిక ప్రారంభించింది. “మీ శివలింగాన్ని లక్నోకు పంపరాదనుకున్నాం. ఇక్కడి లోగుట్టులు ఎలా ఉన్నాయో తెలీదు. అందుకే దాన్ని అతి రహస్యంగా, సిబిఐ ద్వారానే, కోపెన్‌హాగెన్‌కు పంపాము. సోమనాథ్ వద్ద దొరికిన శివలింగాన్ని సుధీరాగారి ద్వారా ఇస్తాంబుల్‌కు పంపాము”

తన తొడ పైన పెట్టుకున్న వార్తాపత్రికను చాపుతూ అనిరుద్ధ్ అన్నాడు. “నిరాశలో ఉన్న మీరు నిన్నటి నుండి ప్రపంచంలో ఏం జరుగుతున్నది అని గమనించలేదు. నిన్న సాయంత్రం కొపెన్‌హాగెన్ మరీన్ ఆర్కియాలజి సంస్థ నివేదిక వచ్చింది. మీ శివలింగం తొమ్మిది వేల సంవత్సరాలంత పురాతనమైనది. ఇప్పటి దాకా దొరికిన శివలింగాలలోకెల్లా పాతది.  నివేదిక వివరాలు ఈ రోజు పేపర్లో ఉన్నాయి చూడండి.”

ఆదిత్య ఆత్రంగా పేపర్ తీసి చూశాడు.”శివలింగం ఉత్త పన్నెండు వందల సంవత్సరాలంత పాతది అని ముందుగా ప్రకటించిన సెక్యులర్ ముఖ్యమంత్రి ఇప్పుడు మౌనవ్రతం పట్టారు. ఇషాక్ హబీబ్ అన్సారి గ్యాంగ్ పిన్ డ్రాప్ సైలెన్స్. ప్రొ. సుధీరా గారి పరిస్థితి తెలియదు. ప్రొ. హితేశ్ రావత్ గారి మరణం గురించిన వార్తను ఈ రోజు సాయంత్రం మన విదేశ వ్యవహారాల మంత్రి ప్రెస్ మీట్‌లో చెప్తారు. తరువాత ఏమవుతుందో చూడాలి” అంటున్న అనిరుద్ధ్ తన మాటల వైపు దృష్టి పెట్టని ఆదిత్యను చూసి మాటలు ఆపాడు.

అసలు శివలింగం గురించిన నివేదిక పూర్తిగా చదివిన ఆదిత్య పేపర్ నుండి తలెత్తి, కన్నీళ్లతో “దీనికి మన ప్రొఫెసర్ బలైపోవడం బాధగా ఉంది. దీనికి కారణం నేనే. నా అన్వేషణే ఆయనను బలి తీసుకుంది” అంటూ బాధ పడ్డాడు.

కొన్ని నిమిషాల వరకు అక్కడ మౌనం రాజ్యమేలింది. దాన్ని భంగపరుస్తూ అనిరుద్ధ్ అన్నాడు. “ఇలా కాకుండా ఉండాల్సింది. ప్రొఫెసర్ గారు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది. పాకిస్తాన్ నుండి అంత ఘనంగా ఎందుకు ఆహ్వానం వచ్చింది, దాని వెనుక ఏముంది అని ఒక్కసారైనా ఆయనకు అనిపించక పోవడం ఆశ్చర్యకరమే”

మళ్ళీ కొన్ని క్షణాల మౌనాన్ని భంగం చేసింది ఆదిత్య  “మరి వాళ్ళకు శిక్ష..”. తలాడించాడు రా అధికారి. “ఆయన హత్య జరిగింది పాకిస్తాన్‌లో, పాకిస్తానీయుల నుండి. మనమేం చేయబోయినా వాళ్ళ మొండితనం వలన ఏం ఉపయోగం ఉండదు. ఐసిజెకు వెళ్ళినా అక్కడ వాళ్ళు సహకరించరు. మనం వేరే దారి వెతుక్కోవాలి. ఇటీవల జరుగుతున్న భయోత్పాదకుల హత్యల గురించి చదివే ఉంటావు. ఏదో జరగక మానదు. వెయిట్ చేద్దాం” అన్నాడు. మళ్ళీ కొన్ని క్షణాల మౌనం. రా అధికారి చెప్పిన మాటలను ఆదిత్య జీర్ణించుకున్నాడని అర్థమయ్యాక నీహారిక అంది. “ఈ రోజు పదకొండు గంటలకు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా? తయారవ్వు మరి.”

ఆదిత్య మొహం లోని అనుమానం కనిపించి అనిరుద్ధ్ అన్నాడు “ ధైర్యంగా వెళ్ళండి. ఈ రోజు పేపరు నీ ఫైలులో పెట్టుకోండి. మీ పేరు, ఫోటో ఉన్నాయి. మీ హెచ్.ఓ.డి గురించి ఎక్కువగా వర్రీ కాకండి. ఆయనేం చేయలేడు. అంతా శివలింగం ప్రభావం.”

ఆదిత్య ఏం మాట్లాడలేదు. నీహారికనుండి భరోసా కూర్చే మాట వచ్చింది.”మన సంవత్సరంన్నర శ్రమ ఈ రోజు ఫలిస్తోంది. ఈ రోజు  సాయంత్రం వేళకు దేశానికంతటికీ మన అన్వేషణ గురించిన వార్త అందుతుంది. చరిత్ర కూడా తిరగ రాయడం జరుగుతుంది” అంటూ గోడవైపు వెళ్ళి, అక్కడ ఉన్న శివ పార్వతుల ఫోటో ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకుని నిలబడింది. “ఓం నమః శివాయ” అన్న మూడు పదాలు చిరుగంటల నినాదంలా అక్కడ మ్రోగాయి.

మంత్రముగ్ధుడిలా అటువైపే చూస్తున్న ఆదిత్యను మేల్కొలిపింది యువ రా అధికారి గొంతు: “ఇదంతా మీకు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి చెప్పాను. ఇక నేను బయలుదేరుతాను. ఇక మీ పనులలోకి మీరు వెళ్ళండి. ఈమె ఏమో శివపార్వతులకు నమస్కరించింది. మీరు కూడా దణ్ణం పెట్టుకోండి. సాష్టాంగ ప్రణామం చేస్తే మరీ మంచిది. చరిత్రను మలుపు తిప్పే మీ అన్వేషణ ప్రపంచానికి తెలియాలి అనే మీ ఆశ నెరవేరినట్లే. దానితోపాటే నీహారికది ఒక ప్రైవేట్ ఆశ ఉన్నట్టుంది చూడండి. అదేమిటో కనుక్కుని నెరవేర్చండి. శివపార్వతుల కృప మీ పైన ఉండుగాక!” అని లేచి ఆదిత్య చేయి పట్టుకుని, నీహారిక వైపు చేయి ఊపాడు. “బై” అంటూ తలుపు వైపుకు తిరిగాడు. “కొంచెం టీ..” అన్న ఆదిత్య మాటను ఆపుతూ “నేనిప్పుడు హెడ్ ఆఫీసుకు వెళ్ళాలి. నా ఫ్లైట్ టైమ్ అవుతోంది. మరోసారి వచ్చినప్పుడు నీహారిక వంట రుచి కూడా చూసి వెళతాను.” అంటూ తలుపును తన వెనకే వేసుకుని మెట్లు దిగుతూ కనుమరుగయ్యాడు.

ఆదిత్య క్షణకాలం పాటు మాటల్లేకుండా నుంచున్నాడు. నీహారిక గుర్తుకొచ్చి ఆమె వైపు తిరిగేంతలో కాలింగ్ బెల్ మోగి అతడిని తలుపు వైపు తీసుకెళ్ళింది. అనిరుద్దేమైనా చెప్పడం మరచిపోయాడా? తొందర తొందరగా వెళ్ళి తలుపు తీస్తే కనిపించింది చిరునవ్వుతో కొరియర్ బాయ్. నవ్వుతూ ప్యాకెట్ అందించాడు. ఆశ్చర్యంగా దాని వైపు చూస్తున్న ఆదిత్యకు కనిపించిన సెండర్ అడ్రెస్ చూసి గుర్తుకొచ్చింది. తన ‘సోనీ చిన్నూ’ పార్సెల్ అది.

సౌత్ ఏసియా విశ్వవిద్యాలయం గెస్ట్‌హౌస్ వాళ్ళకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుని కొరియర్ బాయ్‌కి పైకే ధన్యవాదాలు చెప్పి అతడు ఇచ్చిన కాయితం పైన సంతకం చేశాడు.

తలుపు మూసి ఆత్రంగా ప్యాకెట్ విప్పాడు ఆదిత్య. సోని చిన్నూ చేతికి వచ్చింది. అంతా సరిగ్గా ఉందా అని తిప్పి చూశాడు. ఎవరో దాని పైన చేయి వేసినట్టు కనిపించింది. మొన్న రాత్రి షార్ట్‌వేవ్ పైనున్న బ్యాండ్ సెలెక్టర్ ఇప్పుడు ఎఫ్.ఎం. పైన ఉండింది. ఇంతకంటే ఇంకేమి కనిపించకపోవడంతో దాన్ని ఆన్ చేసి వాల్యూం పెంచాడు. మరుక్షణంలోనే సోనీ చిన్నూ పాడనారంభించింది. “..ఆప్ యూహీం అగర్ హమ్సె మిల్తె రహే దేఖియే ఏక్ దిన్ ప్యార్ హోజాయెగా..” తనకిష్టమైన మహమ్మద్ రఫీ పాట. ఎన్నో ఏళ్ళైనా ఇంకా వినాలనిపించే లవ్ సాంగ్. ఆదిత్య మొహం పైన చిరునవ్వు విరిసింది.

అక్కడ తను ఒంటరిగా లేడు అని గుర్తుకొచ్చి తల ఎత్తాడు. మూడడగుల దూరంలో నిలుచున్న నీహారిక మొహం పైన సౌమ్యమైన చిరునవ్వు. అదేదో మోహక శక్తి తననాకర్షించినట్టు అటువైపే చూసిన ఆదిత్యకు ఆమె కలువకళ్ళు కూడా పాడుతున్నట్టనిపించింది.

(సమాప్తం)

కన్నడ మూలం: శ్రీ ప్రేమశేఖర్

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here