ఊపిరి పూలు

6
9

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘ఊపిరి పూలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]రునాడు జరగనున్న సెమిస్టర్ పరీక్షకోసం శ్రద్ధగా చదువుకుంటున్నాడు సుబ్రహ్మణ్యం. సబ్జెక్ట్ ఏమీ అర్థం కావడంలేదు. చదవగా చదవగా మెదడులో ముద్ర పడుతోంది.  అలా ముద్ర పడినవి వ్రాసే ఈ మూడేళ్ళలో చాలా సబ్జెక్టులు పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇప్పుడు చివరి సంవత్సరం. ఈ సంవత్సరం సబ్జెక్ట్ లతో పాటు గతంలో ఫెయిలయిన సబ్జెక్టులు కూడా పాసయ్యి ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఊరికి వెళ్ళాలి. లేకపోతే నాన్నకు, ఊళ్ళోవాళ్ళ చూపులకు సమాధానం చెప్పలేం. అసలు తను ఇంజనీరింగు చదవగలనో లేదో అని చూడకుండా కొంత పొలం అమ్మి మరీ ఫీజు కట్టి ఇంజినీరింగులో చేర్చారు నాన్న ఊర్లో గొప్ప కోసం. ఇప్పుడు తాను పాసవ్వడానికి ఎన్నో తిప్పలు పడాల్సివస్తోంది. దిగులుగా అనుకుంటున్నాడు సుబ్రహ్మణ్యం.

‘ఏరా సుబ్బూ!, ఏంటి ఆలోచిస్తున్నావు?” అడిగాడు రూమ్మేట్ శ్రీరామ్.

“థెర్మోడైనమిక్స్ చదువుతున్నానురా! అర్థం కావడంలేదు అయినా అలా చదువుకుంటూ పోతున్నాను ఈలోగా ఏవో ఆలోచనలు” చెప్పాడు.

శ్రీరామ్ దగ్గరకు వచ్చి థియరీని వివరంగా చెప్పి “ఏమీ ఆందోళన పడకు. చదివేది ధ్యాసపెట్టి చదువు. పరీక్షలో నీది నాదీ ప్రక్క ప్రక్క నెంబర్లే కాబట్టి అవసరమయినప్పుడు నేను సాయం చేస్తాను” అన్నాడు.

అతడి మాటలు ఎంతో భరోసా ఇచ్చాయి సుబ్రహ్మణ్యానికి. కాస్త కంగారు తగ్గింది. శ్రీరామ్ చాలా తెలివైనవాడు. బాగా చదువుతాడు. మొదటనుండి తనకు చదువులో సహాయపడుతూనే ఉన్నాడు. ఎంతగా అంటే పరీక్షలో అతని వెనుకనే కూర్చున్న తనకు, తను వ్రాసేది బాగా కనిపించాలని పెద్దగా తాటికాయలంత అక్షరాలతో వ్రాయడం అలవాటు చేసుకున్నాడు. దానితో ఎక్కువ ఎడిషినల్ షీట్లు అవసరమయి అడుగుతుంటే ఇన్విజిలేటర్లు విసుక్కునే వారు. ఇంతంత అక్షరాలు వ్రాస్తే ఎన్ని పేపర్లూ సరిపోవురా నీకు అని. అతని పట్ల కృతజ్ఞతా భావంతో మనసంతా నిండిపోయింది సుబ్రహ్మణ్యానికి.

అలా శ్రీరామ్ సహకారంతో ఎలాగోలా ఇంజనీరింగు పూర్తిచేసాడు సుబ్రహ్మణ్యం. మొదట ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో వచ్చింది. సరిపడే ఆస్తి, ఉద్యోగం ఉండటంతో మంచి సంబంధమే వచ్చి పెళ్ళి కూడా అయ్యింది.

శ్రీరామ్‌కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగం విడిచిపెట్టి సొంతంగా మంచి పరిశ్రను పెట్టాడు. తెలివైన వాడు కావడంతో బాగా విజయవంతం అయింది.

సుబ్రహ్మణ్యం వాళ్ల ఊర్లో రొయ్యలు సాగు బావుండడంతో అతని తండ్రి తమ పొలాన్ని చెరువులుగా తవ్వి రొయ్యలసాగు చేయసాగాడు. కొన్నాళ్ళకు ఆయనకు ఒంట్లో బాగోలేక పోవడంతో, సుబ్రహ్మణ్యాన్ని ఊరికి వచ్చి సాగు చూసుకోమని ఒత్తిడి చేయడంతోనూ, అదీకాక తనకు కూడా వ్యవసాయం అంటే కొంత ఇష్టం ఉండటం వల్లా ఉద్యోగం వదిలి ఊరికి వచ్చేసాడు.

శ్రీరామ్ మరిన్ని కొత్త పరిశ్రమలు పెడుతూ మరింతగా ఎదిగి సంపన్నుడయ్యాడు.

సుబ్రహ్మణ్యానికి రొయ్యల సాగు బాగా కలిసివచ్చింది. బాగా లాభాలు వచ్చాయి. ఉన్నఊర్లోనే ఇల్లు కట్టుకుని, అందివచ్చిన పొలాలు కొనుక్కుని బాగా స్థిరపడ్డాడు. సుబ్రహ్మణ్యానికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొంతకాలానికి తండ్రి కాలం చేసాడు.

శ్రీరామ్ వీలున్నప్పుడు సుబ్రహ్మణ్యం వాళ్ల ఊరికి వచ్చి అతనితో కొన్నిరోజులు గడిపి వెళుతుండేవాడు. కొత్త కంపెనీ ఏదయినా పెడితే నాకూ వాటా ఇవ్వరా అంటూండేవాడు సుబ్రహ్మణ్యం సరదాగా! శ్రీ రామ్‌కి ఒక కొడుకు కూతురు కలిగారు.

ఓ రోజు ఫోన్ చేసి “నేను కొత్త పరిశ్రను ప్రారంభిస్తున్నాను. వాటా అడిగావుగా నీ పెట్టుబడి అయిదు లక్షలు, పెట్టగలవా?” అన్నాడు శ్రీరామ్. “సంతోషంగా” అంటూ తను చెప్పిన అయిదు లక్షలు వెళ్లి ఇచ్చివచ్చాడు సుబ్రహ్మణ్యం.

ఇది జరిగిన కొన్నాళ్ళకు హఠాత్తుగా ఒక దుర్వార్త తెలిసింది సుబ్రహ్మణ్యానికి, శ్రీరామ్ గుండెనొప్పి రావడంతో హఠాత్తుగా చనిపోయాడని. వెళ్ళి కుంటుంబాన్ని పరామర్శించి వచ్చాడు. శ్రీరామ్ పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉండడంతో తన భార్య వ్యాపార వ్యవహారాలన్నీ ఎవరో బంధువులను అప్పగించి నడిపిస్తోంది. కొంత కాలానికి శ్రీరామ్ కొడుకు సందీప్ అమెరికా చదువుకోవడానికి వెళ్ళిపోయాడు.

కాలం గడుస్తోంది. సుబ్రహ్మణ్యం కొడుకు డిగ్రీ చేసి తనకి ఇష్టముయిన సైనిక శిక్షణలో చేరాడు. అమ్మాయి తన అభిరుచి మేరకు జర్నలిజం కోర్స్ చేస్తోంది.

ఇప్పుడు చెరువులు గతంలోలాగా లాభసాటిగా లేవు. వరుసగా అంతుచిక్కని తెగుళ్ళతో వరుసగా నష్టాలు వస్తున్నాయి. అయినా ఏదో ఆశతో కొనసాగించడంతో, నష్టాలు పెరిగి అప్పుల్లో పడ్డాడు.

ఆ రోజు చెరువు దగ్గర మకాంలో కూర్చున్ని దీర్ఘంగా అలోచిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. చుట్టూ చెరువుల్లో ఎయిరేటర్లు నీటిని చిలుకుతున్నాయి. చెరువులన్నీఅలజడిగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం మనసులో కూడా అదే అలజడి. అతనిని డబ్బుపోతుందన్న భయం కన్నా, తమ ఊరివాళ్ళు వెనుక మాట్లాడుకునే మాటలే ఎక్కువ కలవర పెడుతున్నాయి. “డబ్బొచ్చినప్పుడు జాగ్రత్త పడకుండా గొప్పలకు పోయి ఇల్లూ పొలాలు కొనేసాడు. ఇప్పుడు అన్నీ అమ్మితేగానీ అప్పులు తీరవంట. ఇంకా కొడుకు, కూతురూ పెళ్లిళ్లు చేయాలి. ఏం పెట్టి చేస్తాడూ!” అంటూ ఉన్నవీ లేనివీ చెప్పుకుంటున్నారు.

ఇంతలో “అయ్ గారూ! ఓసారి ఇటు రండి!” అన్న జీతగాడు మహేషు పిలుపు వినిపించి గట్టుమీద నడుచుకుంటూ వెళ్లేసరికి చెరువులోంచి మేత ట్రే నెమ్మదిగా లాగుతున్నాడతను. ట్రే నీటి పైకి తేలుతుండగా దాంట్లోని రొయ్యలు కొన్ని నీట్లోకి చెంగున దూకేసాయి. మిగిలిన వాటిని పట్టుకుని చేతికి ఇచ్చాడు. వాటిని పరిశీలించి చూస్తే కొనప్రాణంతో ఉన్నాయి. “మళ్లీ తెగులు తగిలేసిందిరా మహేషూ! వెంటనే పట్టెయ్యాలి. లేకపోతే మొత్తం చనిపోతాయి. మనుషుల్ని పురమాయించు” అని చెప్పాడు సుబ్రహ్మణ్యం ఆందోళనగా.

అప్పుడు మొదలు పెట్టి రాత్రయ్యేసరికి మొత్తం పట్టుబడి పూర్తిచేసి తూకం వేసి కంపెనీకి పంపించేశారు. అంతా అయ్యింతర్వాత స్కూటరు స్టార్ట్ చేసుకొని ఇంటికి చేరుకున్నాడు. ముఖంలో ఆందోళన గమనించి “ఏం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది” అంది భార్య దేవి. స్నానం చేసి అన్నం తిని పడుకోబోతూండగా చెప్పింది “ఏమండీ! అన్నట్టు మీ స్నేహితుడు శ్రీరామ్ భార్య ఫోన్ చేశారు. వాళ్ళబ్బాయి సందీప్ రేపు మనింటికి వస్తున్నాడని చెప్పారు” సుబ్రహ్మణ్యం వింటున్నాడు కానీ బుర్రలోకి ఆమె చెప్పిన మాట ఎక్కలేదు. ఇప్పుడు సరుకు అమ్మగా వచ్చింది పోను, ఇంకా ఎంత బాకీ ఉంటుందోనని లెక్క వేసుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూ నిద్రలోకిజారిపోయాడు.

మరునాడు ఉదయం వచ్చాడు సందీప్. అతడితో కాసేపు కుశలప్రశ్నలయ్యాకా, శ్రీరామ్‌కీ తనకూ ఉన్న స్నేహం విషయాలు గుర్తుచేసుకుని చెబుతూ బాధకు గురయ్యాడు సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత కొంచెం తేరుకుని సందీప్ ముచ్చట్లూ, వాళ్ళమ్మగారి క్షేమమూ అడిగి తెలుసుకున్నాడు. తాను అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు సందీప్. తరువాత మాటల్లో అడిగాడు సందీప్.

“అంకుల్ మీరు మా నాన్నకు అయిదు లక్షలు ఇచ్చారు కదా!”

సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోతూ, నేను ఎవరితోనూ అనలేదు ఈ అబ్బాయికి ఎలా తెలిసింది అనుకుంటూ “అవన్నీ ఇప్పుడెందుకు? వాడేదో కంపెనీ పెడతానంటే నా పెట్టుబడి పెట్టాను. బావుంటే వాడే ఇచ్చేవాడు కదా! వదిలెయ్ సందీప్” అన్నాడు ఇబ్బందిగా.

“లేదు అంకుల్ ఇప్పుడు మా పరిస్థితి బానే ఉంది. మీ డబ్బు ఇవ్వాలనే వచ్చాను. అన్నట్లు ఇచ్చి చాలాకాలం అయ్యింది కదా! వడ్డీతో కలిపి మొత్తం పదిలక్షలు అయ్యింది.” అంటూ ఒక చెక్ వ్రాసి ఇచ్చాడు.

సుబ్రహ్మణ్యం కాస్త ఇబ్బందిగానే తీసుకుని అడిగాడు “మా ఇద్దరి మధ్య జరిగినది ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. ఎలా నీకు ఎలా తెలిసింది సందీప్?”.

సందీప్ తన బ్యాగ్ లోంచి ఒక డైరీ తీసి ఒక పేజీ తెరిచి ఇచ్చాడు. దాన్ని చేతిలోకి తీసుకుని చూసాడు సుబ్రహ్మణ్యం. అక్కడ వ్రాసి ఉంది. ‘సుబ్రహ్మణ్యం పెట్టుబడి – 5 లక్షలు’ అని, తనని పరీక్ష గట్టెక్కించడం కోసం ఎప్పుడూ రాసే తాటికాయలంత అక్షరాలతో. ఆ అక్షరాల్నిఒక్కసారి ప్రేమగా చేతులలో తడిమి చూసుకున్నాడు సుబ్రహ్మణ్యం. అతని మూసిన కన్నుల నుండి జలా జలా రాలిన కన్నీళ్లు, బొట్లు బొట్లుగా జారి శ్రీరామ్ రాసిన అక్షరాల్నిఅభిషేకించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here