[box type=’note’ fontsize=’16’] సొంత ఊరు అందించే భరోసాని, ధైర్యాన్ని వివరించే కన్నెగంటి అనసూయ రచించిన కథ “ఊరి దస్తూరి“.[/box]
వాళ్ళు రోడ్డు మీదికి వచ్చి నిలబడ్డ కొద్దిసేపటికే షేరింగ్ ఆటో వచ్చి వాళ్ల ముందు ఆగింది.
“జంటుయ్యూ..టేసన్కి ఎల్లద్దా..” బాచుపల్లిలో రోడ్డుకి ఒక పక్కగా నిలబడి డ్రైవర్ని అడిగాడు వీరేషు.
“నిజాంపేట్ .. మోర్.. దగ్గరాగుద్ది..” అదే యాసలో బదులిచ్చాడు ఆటో డ్రైవర్.
“అక్కడికదెంత దూరంలే.. నాల్గడుగులే. ఎక్కండి నడుద్దారి. ” అంటూ క్షణంలో ఎనక్కి తిరిగి కాస్తంత ఎడంగా నిలబడ్ద వాళ్లిద్దరి వైపూ చూస్తూ.. “ రండెక్కండి..” అన్నాడు వెనక్కొచ్చి చెల్లెలూ, బావగార్ల చేతుల్లో ఉన్న కర్రల బాగ్‌లు అందుకుని వాళ్ళిద్దరూ ఆటోలో కూర్చోవటానికి వీలుగా అప్పటికే సీట్లలో కూర్చున్నోళ్లని చూసి మరి కొంచెం లోపలికి జరగండన్నట్టుగా కళ్లతోనే సైగ చేస్తూ..
దాంతో వెనక కూర్చున్నోళ్లంతా అప్పటిదాకా ఖాళీగా హాయిగా కూర్చున్నారేమో, జరగటానికి ఇష్టం లేదన్నట్టు ముఖం అదోలా పెట్టినా డ్రైవర్ కూడా వెనక్కి తిరిగి ఇటే చూస్తూండే సరికి ఇక తప్పదన్నట్టుగా సర్ధుకుని లోపలికి జరిగారు. వాళ్ల కాళ్ల మధ్యగా బేగ్గుల్ని ఆటో లోపలికంటా దూర్చేసి వాళ్లిద్దరివైపూ చూస్తూ “ ఆ.. కాళీ వచ్చింది. ఇప్పుడెక్కండి…” అన్నాడు తను ముందు ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోటానికెళ్తూ.
వాళ్లిద్దరి పట్లా ఆత్మీయతతో కూడిన అతని తీరు చూస్తే ఈ ఊరు మాది, ఈ ఆటోల సంగతి మీకు తెలవదన్నట్టుంది.
“ఎక్కూ..” అన్నాడు సూరిబాబు పెళ్లాం వైపు చూస్తూ , ఆవిడ ఎక్కటానికి వీలుగా దారిస్తూ..
చెంగు నడుం చుట్టూ లాక్కుని కుడి చేత్తో ఆటో రాడ్ పట్టుకుని జాగ్రత్తగా ఆటో ఎక్కి లోపలికి సర్ధుక్కూర్చుంది లక్ష్మి భర్త కూర్చోవటానికి వీలుగా లోపలికి జరుగుతూ..
సూరిబాబు ఆటో ఎక్కి భార్యపక్కనే కూర్చుంటూ..
“ సెప్తే నీక్కాదేటి? నువ్వెందుకొత్తం? ఎంత అయిద్రాబాదులో అయిదారేల్లనుంచి ఉంటే మాత్రం టేసన్కెల్లి బండెక్కలేననుకున్నావా?” పరుషంగా అన్నాడు అప్పటికే ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న బామ్మర్ధి వీరేష్ని చూస్తా..
రైట్ ఇండికేటర్ ఇచ్చాడేమో.. కుయ్ కుయ్ మని శబ్ధం చేసుకుంటూ.. నిండు చూలాల్లా మెల్లగా బయలుదేరింది..ఆటో.
“అదేటది? నువ్వొద్దంటే మాత్రం ఒక్కల్లనీ అలా ఎలా వదిలేత్తాను.? ఇదివరకైతే ఆటోగానీ, బస్సుగానీ ఎక్కితే తిన్నగా తీస్కెల్లి టేసన్ ముందాపేది. సులాగ్గా లోపలికి దూరేసేవోల్లం. ఇప్పుడలాక్కాదు. మెట్రో రైలొచ్చాకా దిగి అయిదారడుగులు నడవాలి. అయ్యన్నీ మీకు తెలుత్తాయేటి? అయినా మిమ్మల్నిక్కడ వదిలేసి ఇంటికెల్తే మీ సెల్లి కూడెడద్దా..?” వేళాకోళం ఆడాడు వీరేషు కదిలిన ఆటోలోంచి ముందుకి చూస్తూ..
ఆటోలో ఉన్నాళ్ళంతా లక్ష్మినీ, లక్ష్మి చేతులకున్న గోరింటాకునీ , మెడలో ఇంతలావున పసుప్పచ్చగా ఉండి అప్పుడప్పుడే నల్లబడుతున్న సూత్రాల తాడునీ మార్చి మార్చి చూస్తూ “ కొత్తగా పెళ్లయినట్టుంది..” అనుకున్నారు మనసులో.
అవును. వాళ్లకి అంతకు రెండు వారాల ముందే పెళ్లైంది. చెల్లెలు లక్ష్మి పెళ్ళయ్యాకా వీరేషు మరో నాల్రోజులు అక్కడే ఉండి అన్నీ చక్కబెట్టి తిరిగి వచ్చేస్తూ..
“అయిద్రాబాదు రా బావా..! ఓ వారం రోజులు అటూ ఇటూ తిరిగొద్దురుగాని. పెద్దోల్లు ఆనీమూనని ఇమానాలెక్కెల్లి యాడేడికో తిరిగొత్తారు. నేన్లేపోతే ఏరే ఇసయం. నేనున్నాగదా. రండి. మా సెల్లిని తీసుకెల్దామని సేలా సార్లే పెయత్నం సేసేను. కానీ మాయమ్మే వద్దంది. పెల్లయ్యాకా వత్తది లేరా..! కంగారేవుంది. అంతగా అయితే ఈల్లకీ అక్కడే ఏదో పనుంటే సూద్దుగానీ. ఎదర ఎన్నన్ని కరుసులున్నాయో..! ఉట్టిట్టిగా తిరిగితే పెళ్ళినాటికి యాడ్నించి తెత్తా.? అయ్యీ ఇయ్యీ అన్నీ పెల్లికే కరుసుజెయ్యచ్చంటా మాయమ్మే ఎల్లొద్దంది. మా సెల్లికిస్టమే. మాయమ్మే పడ్నియ్యలేదు.
వచ్చి నాల్రోజులున్నారనుకో.. నచ్చితే ఏదో ఒకపార్టుమెంటు అక్కడే సూత్తాను. వాచ్‌మెన్‌గా ఉంటానే ఇస్త్రీ చేసుకోవచ్చు. పేంటుకీ,సొక్కాకి అయిదేసి రూపాలు. సీరన్నా, దుప్పటన్నా అయితే పదేసి. కాపలా కాత్తానే ఇస్త్రీ సేసుకోవచ్చు. ఇక ఆడాల్లంటావా? ఇల్లల్లో ఏదో పని ఉంటానే ఉంటది.. నీ ఇస్టం.. నువ్వాలోచిచ్చుకో..” అని కాసేపు అలాగే అతనికేసి చూసి.. ఎంతకీ సూరిబాబు ఏమ్మాట్తాడకపోయేసరికి ఏదో అనుమానం తగిలి మళ్ళీ తనే..
“అసలకయితే రండిద్దరూ..! ఉంటం, ఉండకపోటం అక్కడికొచ్చాకా సూడచ్చు. నువ్వూ అంటే టికెట్లు తీయిత్తాను. ” అన్న వీరేష్‌ని తరుముకుంటా వచ్చింది.. వాళ్లమ్మ.. రత్తాలు.
“టిక్కట్టూ గిక్కట్టూ ఏవక్కల్లెద్దు. పెద్దాపురం మరిడమ్మ గుడికీని, అన్నారం సత్నారాయణసామి గుడికీ మొక్కుకున్నాను. ఆల్లమ్మక్కూడా ఏయేయో పూజలూ, పునస్కారాలూ ఉన్నాయన్జెప్పింది. మొక్కుకుందంట. అయ్యన్నీ అయ్యాకా వత్తే వత్తార్లే. వద్దామనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే బయల్దేరొచ్చు. ఆమాత్తరం దానికి ముందే తీత్తమెంతుకు? జనరల్ బోగీల్లో ఎక్కొచ్చు…”
ఎప్పుడూ రత్తాల్దే పై మాటేమో..మరి మాట్లాడలేదు వీరేషు.
“..సిన్నా, సితకా ఏవైనా పన్లు ఉంటే నువ్వు సేసేసుకోవే అమ్మా..! అయ్యన్నీ అయ్యేదాకా ఉంటే అక్కడ అపార్టుమెంటులో సార్లు కోపం సేత్తారు. కార్లయ్యీ తుడుత్తానుగదా..మట్తట్తేసి ఉండుంటాయ్. తీసేసినా తీసెయ్యొచ్చు. సచ్చినంత పన”ని ఎక్కడికక్కడ సర్ధుబాట్లు చేసేసి పెళ్ళాన్ని తీసుకుని బయల్ధేరి వచ్చేశాడు హైదరాబాద్ కి వీరేషు.
వాళ్ళు వచ్చేసిన వారానికే వస్తున్నామని ఫోన్జేసాడు సూరిబాబు.
దాంతో.. కమిటీ వాళ్లనడిగి టెర్రస్ మీద గదిలో సామాన్లన్నీ పొందిగ్గా ఒక పక్కగా సర్ది అందులో మంచవేసి తన చెల్లెలూ, బావా ఉండటానికి అనువుగా తయారుచేసాడు
వాళ్ళుండే వారం రోజులూ పిల్లలిద్దర్నీ నిజాంపేటలో వాచ్‌మన్‌గా పన్జేస్తున్న అన్నగారింటికి పంపేస్తానని భూదేవంటే వద్దని వారించారిద్దరూ. అందరూ ఒకచోటే పడుకుందామనీ, పిల్లల్లేకపోతే సరదా ఏముంటది పంపద్దనీ బ్రతిమలాడారిద్దరూ. కొత్తగా పెళ్లయినోళ్లలాగే మొహమాటంగా ఏదో అంటార్లే, వాళ్ళలా అన్నంత మాత్రాన పిల్లలుంటే ఇబ్బందని మౌనంగానే పట్తించుకోలేదు భార్యాభర్తలిద్దరూ.
అయినా ఒప్పుకోలేదు వీళ్ళు.
వాళ్లున్న ఆ వారం పది రోజులూ పగలంతా భూదేవిని అపార్ట్‌మెంట్లో పన్లు చూసుకుంటూ ఉండమన్జెప్పి వాళ్లిద్దర్నీ లుంబినీ పార్కూ , ఎన్టీయార్ గార్డెన్సూ, చార్మినారు, గోల్కొండా, రామోజీ ఫిల్మ్ సిటీ అన్నీ తిప్పి,తిప్పి చూపించేడు వీరేషు.
పిల్లలకి శెలవు రోజైతే వాళ్లనీ వెంటబెట్టుకెళ్ళిపోయేవాడు. పగలంతా సిటీలో తిప్పి , అలా తిప్పుతూనే రాత్రయ్యే సరికి ఏవొండాలో పెళ్ళానికి పురమాయించేవోడు.
ఒకనాడు కోడిమాంసవనీ, మరోనాడు రొయ్యలనీ, ఎండుసేపలనీ ఏనాడూ కూరగాయల్తో భోజనవెట్తలేదు బావకి వీరేషు. దానికి తోడు ఒకనాడు రాత్రి ఆ చుట్టుపక్కలా అపార్టుమెంటుల్లో పన్జేసే ఆంధ్రా నుంచొచ్చినోళ్లనందర్నీ పిలిచి మందు కూడా తెప్పించేడు.
సూరిబాబు వద్దన్నా వీరేషు ఇన్లేదు. అదో మర్యాదనుకున్నాడు.
తిరిగిన ఆ వారం రోజులూ కొత్త కొత్త వస్తువుల్ని వేటినైనా లక్ష్మి కాస్తంత ఆసక్తిగా చూసేసరికి
“నచ్చితే కొనుక్కో. ” అని సూరిబాబు గుసగుసలుగా అనటం వీరేషు గమనిస్తానే ఉన్నాడు.
భర్తలా అడిగినప్పుడల్లా చెల్లెలి ముఖంలో ఉప్పొంగుతున్న ఆనందం చూసి వీరేషుకి మనసులో సంతోషం కలిగినా.. పైకి కనపడకుండా
“బతుకంతా అలా సూసుకుంటే అంతకన్నా ఏంగావాలా? “ అనుకుంటూ.. వాళ్లిద్దరూ మాట్లాడుకునేటప్పుడు గానీ, కొనుక్కునేటప్పుడుగానీ దరిదాపుల్లోకి కూడా పోకుండా దూరదూరంగా తిరిగాడు మరియాద కాదని.
ఆమె ఏమడిగిందో, అతనేం కొన్నాడోగానీ వారం తిరిగేనాటికి పెద్ద సంచే అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో అన్న కొడుక్కోసమని నల్ల కళ్లజొడు, కూతురు కోసమని జడకుప్పులూ, ఇద్దరికీ స్కూలు బేగ్ లూ, పెన్సిల్ బాక్సులూ కొంది ఆమె.
అలా కొంటే భర్తేమంటాడోనని ముందు మొహమాటపడుతుంటే అది గమనించి సూరిబాబే బాగున్నవేవో చూసి తనే ఎంపిక చేసి డబ్బులిచ్చాడు. అయితే, ఆ రోజు సాయంత్రమే వాళ్లిద్దరూ ఊరికి బయల్దేరేది. భార్య, వదినతో కలసి లోపలింకా ఏదేదో సర్ధుతూనే ఉంది.
అంతలోనే అకస్మాత్తుగా బామ్మర్ధి వీరేష్ తో సూరిబాబన్నాడు..
“ఈరేస్ బావా..! ఇక్కడెక్కడో అక్కిరాజు పేటనుంటాది. అక్కడ నాకు దూరమొరస దుర్గేసని మాయన్నయ్యొకడున్నాడు. ఇస్త్రీ బండేత్తాడు. ఆ మజ్జనెప్పుడో మా ఊరొచ్చినప్పుడు సెప్పేడు ఎప్పుడైనా హైద్రాబాద్ సైడొత్తే రమ్మని. ఆడి ఫోన్నెంబరుంది గానీ రెండ్రోజులపాటు అటెల్లొత్తాను. సడెన్‌గా గుర్తొచ్చింది. వచ్చెల్లేనని తెలిత్తే పెద్ద గొడవైపోద్ది ఆడితో..” అని బామ్మర్దితో అని..నాలుగడుగులు వెనక్కేసి ..అక్కడే ఉండి సామాన్లు సర్ధుతున్న భార్యకేసి చూస్తా..
“అన్నీ సర్దేసుంచు. రేపు సందేలకల్లా తిరిగొచ్చేత్తాను. వచ్చాకా ఎల్దాంలే….” అంటూ బయల్దేరుతున్న సూరిబాబుతో..
“ ఏదోసారి ఆ ఫోన్నెంబరియ్యి మాట్తాడదాం. అక్కిరాజు పేటెక్కడో నాకే తెల్దు.. నువ్వెలాగెల్తావ్” ఒకింత గాభరాగా అన్నాడు వీరేషు.
“ ఏలాగోలాగ నేను ఎతుక్కుంటా ఎల్తాన్లే..! ఆర్ని..ఆ మాత్రం అడ్రసెవరూ జెప్పరేంట్రా?” ఎకసెక్కెంగా అన్నాడు సూరిబాబు అదోలా నవ్వుతూ..
“అసలు ఊల్లో ఉన్నాడో, లేడో ఫోన్జేత్తే తెలుత్తాది గదా..! పెళ్ళిగ్గూడా వచ్చినట్టు లేడు. సూసిన గురుతైతే లేదు. తీరా అక్కడిదాకా ఎల్లాకా లేపోతే సేనా ఇబ్బంది పడిపోతావ్….”
నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు వీరేషు.
అయితే మరోమాటకి తావులేకుండా వడి వడిగా నడుచుకుంటూ మాటల్లోనే షేర్ ఆటో ఎక్కేసేడు సూరిబాబు.
“సేరగానే ఫోన్జెయ్యి…” అన్న వీరేషు మాటలు గాల్లోనే కలిసిపోయాయ్.
మొగుడలా ఎవర్నో కలవటానికి వెళ్లేసరికి అన్న పెళ్లాం ఏ పనీ చెయ్యనివ్వటం లేదేమో.. సాయంత్రం బళ్ల నుంచి పిల్లలొచ్చేసరికి వాళ్ళిద్దర్నీ పిలిచి తను కొన్నవన్నీ ఇచ్చింది లక్ష్మి.
“అమ్మా..! ఆమ్మే..! అత్త కొందే ఇయ్యన్నీని. ఇయ్యి అల్లప్పుడు రామోజీ పిల్ము సిటీకెల్లినప్పుడు నాన్నని కొనమంటే కొన్లేదు సూడు. అత్త కొనింది. “ అంది భూదేవి కూతురు ఇంత సంబరపడిపోతూ..
పిల్లాడైతే కళ్లజోడు ముఖానికి తగిలించి గబ గబా లోనికెళ్ళి తీగ మీద వేల్లాడుతున్న పేంటూ, చొక్కా వేసుకొచ్చీ
చొక్కాని పేంటులో దూర్చేసి ఇన్షర్ట్ చేసి..నడుం మీద ఒక వైపు చెయ్యేసి..
“సెల్లీ.. సూడు మహేసుబాబులాగున్నాను కదా..” అన్నాడు.
వాడ్ని చూసి అంతా నవ్వుతుంటే వాళ్లతో కలసి తనూ నవ్వుతూ..
“అవున్లే.. మహేసువే.. మీ నాన ఈరేసు, నువ్వు మహేసువూను. పోజులకేం తక్కువలేదు..” విసుక్కుంది గారాబంగా భూదేవి. మరోసారి నవ్వుకున్నారంతా.
తల్లలా అనేసరికి సిగ్గుపడుతూ గోడ దగ్గరకెళ్ళి బల్లిలా గోడకి కరుచుకుపోయాడు వాడు .
“వాళ్ల మేనత్త నల్లకళ్లజోడు కొనిచ్చే సరికి వాడేదో సరదా పడ్దాడనుకో..! అవును అలాగే ఉన్నావ్ అంటే పోద్ది కదా లక్ష్మీ. పిల్లలకి అదో సరదా. పాపం చూడు వాడెలా సిగ్గు పడ్దాడో..” అంది ఎవరో అపార్ట్‌మెంటులో ఆవిడ. షాపు నుంచనుకుంటా కోడిగుడ్లు తీసుకుని బిల్డింగ్ లోకి వస్తూ ఇదంతా గమనించిందేమో..లిఫ్ట్ నొక్కి దాని కోసం ఎదురు చూస్తూ ఆవిడన్న మాటలకి..
“ఈ మజ్జన ఇలాంటియ్యి బాగా ఎక్కువైపోయాయమ్మగోరూ..మహేస్ పిచ్చి బాగా పట్టుకుందండీడికి. మొన్నామజ్జన మూడొందల నాలుగు సార్ గారూ రోజూ పొద్దున్నే ఏస్కెల్లే సైకిల్ తీసేసి తొక్కుతా”
“నానా..నేను సీమంతుణ్ణి సూడు..” అని పిలుత్తున్నా పలక్కుండా అటెటో ఎల్లిపోయేడండి. ఎతుక్కోలేక సచ్చేం అమ్మగారూ..మీకూ తెల్సే ఉంటాదండి. సార్ కోపం సేసేరండి. యాభై ఏలంటండి ఆ సైకిలు. అమ్మో ..అంత రేట్లుంటాయాండమ్మగోరూ..?” అంది.
“నీ మొకం నీకేం తెల్సు..అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయ్. ఈ మజ్జన రేసులంటా తిరుగుతున్నారు కదా..! ” అంది అప్పుడే వచ్చిన లిఫ్ట్ తలుపులు తెరచి లోనికెళ్ళి మళ్ళీ తలుపులేస్తూ..
“అమ్మో యాభై ఏలే..! మా నానకి ఈరో సైకిలుండేది వదినీ.. నన్ను అడ్దగర్ర మీద కూసోబెట్టుకుని సెంటర్లోకి తీస్కెల్లి ఎర్ర బిళ్లలు కొనిచ్చేవోడు.. నాకెంతగుర్తో.. మాయమ్మ ఎనక్కూసుంటే మాయన్నయ్యా, నేనూ ముందుగూకుని సేగల్లు సినిమాకెల్లేవోల్లం. మజ్జమజ్జలో సైకిలికి సెయిను ఊడిపోయేది. మమ్మల్ని దిగమని సీకట్లో సైను ఎట్టుకుని మల్లీ ఎక్కమనీవోడు.. సైకిల్లేపోతే సనం గడిసేదు కాదు మా నానకి. రైతులింటికాడ్నించి సైకిల్ మీదెట్టుకునే బట్తల మూటలవీ తెచ్చీసీవోడు. మాయమ్మ ఎనకాల నడిసొచ్చీది. సాకలి పేటలో మా నానకొక్కడికే సైకిలుండేదేమో..
పేటలోవోల్లంతా నాన్న సైకిలెక్కి సినిమాకెల్లే మాయమ్మన్జూసి “మహారాణి” యని గుసగుసలాడుకునేవోరు.
మా నాన యాక్సిడెంట్లో పోతే ఆల్లందరి దిట్తే అనుకుందమ్మ. అందుకే అన్నయ్యెన్నిసార్లడిగినా సైకిలే కొన్లేదమ్మ. మల్లీ ఆ ఇది ఈడికొచ్చినట్టుంది..” ఇంకా గోడనే అంటిపెట్టుకునున్న మేనల్లుడి దగ్గరకెల్లి..భుజంమ్మీద చెయ్యేసి నడిపించుకుని తీసుకొస్తా ఆడబిడ్దన్న మాటలకి..
“అవును.. మీయన్నయ్యకి సైకిల్ తొక్కుతుం రాదు..”
“సెప్పేను గదా.. నేర్సుకోలేదు.. అమ్మకి భయమని..”
“ఇంతకీ ఆ ఎల్లిందెవరింటికో మీ ఆయనేవైనా సెప్పేడేంటే సెల్లీ..” అన్నాడు వీరేషు..అప్పటిదాకా పైన వాటర్ టేంకు శుబ్రం చేసాడేమో..చీపురూ, బక్కెట్టూ పట్టుకుని తడిచి పోయిన బట్తల్తో కిందకి దిగుతూ..
“లేదన్నయ్యా… నాకెవరో తెల్దు. సెప్పలేదు..”
“సెప్తాడేమో..లే..”
అన్నట్తుగానే రెండు రోజుల తర్వాత దీపాలెట్తేవేళ జాంకాయల కవరుతో హడావిడిగా ఇంటికొచ్చాడు సూరిబాబు. వస్తూనే ” అన్నీ సర్దేశావా..?” అన్నాడు భార్య లక్ష్మిని, భూదేవిచ్చిన మంచినీళ్ళు తాగుతూ
సర్దేశానన్నట్టుగా తలూపింది లక్ష్మి.
“మరైతే బయల్దేరు. తొమ్మిదిన్నరకి బండుందంట..” తొందరపెట్టాడు పెళ్ళాన్ని.
“లేడికి లేసిందే పరుగంట.. ఏటి బావా ..ఇప్పుడే గదా వచ్చింది. ఇయ్యాల్టికి ఉండిపొండి. రేపెల్దురుగాని.. ఎలాగూ రిజర్వేసన్ కాదు కదా..” నిదానంగా అన్నాడు వీరేషు.
“లేదు బావా ఎల్లాలి. అనుకున్నదానికంటే రెండ్రోజులు ఆలస్యమైంది. రైతులు ఎదురుసూత్తా ఉంటారు..వాన్లొచ్చినయ్యంటే..బట్తలారవ్. రైతులకిబ్బంది..”
“అలాగే ఎల్లిపోతావా ఏటి? వేడి వేడి నీళ్లోసుకో. బట్తలయ్యీ మాసిపోయినట్టున్నయ్.” అన్నాడు నలిగి, మాసిపోయిన సూరిబాబు బట్తల్నే అనుమానంగా చూస్తా..
“ఆ..ఎలాగూ రైల్లో సీట్లు దొరక్కపోతే కిందే తుండుగుడ్ద పరుసుకుని పడుకోవాల. ఆ మాత్రం దానికి స్నానం చెయ్యటాలూ, బట్తలేసుకోవటాలూ ఎందుక్కానీ.. అన్నం ఉంటే పెట్టెయ్యమ్మా.. రెండు ముద్దలు తినేసెల్తాం..”
అన్న సూరిబాబు మాటల్తో.. అప్పటికే వండేసిందేమో ఆడపడుచుని తయారవ్వమని తను వడ్డించటం మొదలెట్టింది భూదేవి.
“మాయ్యా.. అత్త నాకిది కొంది. బాగుందా..? ఇయ్యాల బళ్ళోకి కూడా పెట్టుకెల్లేను..” అన్నాడు వీరేషు కొడుకు తన కళ్ల జోడుని మేనమామకి చూసిస్తా.
“బాగుందిరా. మా ఊరొచ్చినప్పుడు మంచిది కొనిత్తాలే. అందాకా పెట్టుకో..” అన్నాడు అన్నం తింటూ తింటూనే కళ్లజోడు వైపు చూస్తూ..
“ఇంకో కళ్లజోడొత్తొందోచ్..” అంటా సెల్లారంతా పరిగెట్తేసేడాడు ఆనందంతో.
అప్పటిదాకా ఏదో రాసుకుంటా అక్కడే ఉన్న వీరేశు కూతురు , అన్న కళ్లజోడు మావకి చూపించాడని అక్కడ్నించి లేచెళ్ళి అత్త తనక్కొన్నవి చూపించింది “ మాయ్యా..మాయ్యా.. మరేవో అత్త నాకూ ఇయ్యి కొంది..” అంటూ..
“బాగుందమ్మా..దాస్కో..” అన్నట్టుగా తలూపి జేబులోంచి డబ్బులు తీసి ఇద్దరికీ చెరో రెండొందలిచ్చాడు ఏదన్నా మొనుక్కోమని. భూదేవి వద్దన్నా వినలేదతను.
“మా ఊరొచ్చినప్పుడంటన్నావ్.. హైద్రాబాద్ రావా ఏటి? వత్తేనే బాగుంటది బావా ? ఇంతకాలం ఆ మురిగ్గుడ్డలు ఉతికీ ఉతికీ మన పెద్దోల్లు సంపాదిచ్చిందేవుంది సెప్పు. తాతల కాడ్నించీ ఆల్లలా సేత్తానే ఉన్నా మన బతుకులేం బాగుపడ్దాయ్ సెప్పు. ఆ మాటకొత్తే సదువులు మాత్రం ఏం సదివామని..?
ఇక్కడైతే బట్తలుతకక్కాల్లేదు. ఆల్లే ఉతుక్కుని మనకిత్తారు. ఇస్త్రీ చేసిత్తవే. సేసుకున్నోల్లకి సేసుకున్నంత.
ఎంతలేదన్నా రోజుకి ఎయ్యి రూపాలు జేబులో పడతయ్.. డబ్బులిచ్చిగాని బట్తలు తీస్కోరు. ఏనాడ్డబ్బానాడే కళ్లజూత్తాం. అక్కడెవుంది? ఏడాదికోపాలిత్తారు. అంతగా అడిగితే అప్పుడో కొంతా అప్పుడొ కొంతా ఇదిలిత్తారు..”
“మైల బట్తలు ఉతికీ ఉతికీ వాంతొచ్చేసీది. ఇక్కడలాటిది లేనేలేదు. పైగా గౌర్నం. కార్లల్లో ఇంటికే వచ్చి ఇచ్చి పోతుంటారు. కాలు కదపక్కాలేదనుకో..! నామాటిను అన్నయ్యా..! నీకంతగా ఇస్త్రీ సేత్తం ఇట్టం లేదనుకో మాకులాగా ఏదో ఒకపార్టుమెంటు సూసుకుంటే గదద్దుండదు, కరెంటుక్కట్తక్కాలేదు, నీళ్ళు మోసుకోనక్కాలేదు. పైగా తిరిగినంతా, తొంగున్నంతాననుకో..”
అతను అన్నం తింటున్నంతసేపూ చెబుతూనే ఉన్నారు భార్యా, భర్తలిద్దరూను.
తిన్నాకా చెయ్యి కడుక్కుని తుందుగుడ్డకి చెయ్యి తుడుచుకుంటూ..
“అంతా డబ్బుతోనేనా బావా..? మనూర్లో నా బతుక్కున్నంత గ్యారంట్రీ, గౌర్నం మీ బతుకులకుందా? పొట్ట పోసించుకుంటాకి ఎక్కడైతే ఏంటి అనుకున్నప్పుడు మనూరైతే ఏంట్రా? మనకెన్నిచ్చిందిరా వీరేసూ ఊరు?
అయ్యగారింట్లో ఆయంతైతే మనవుండాల. ఆరెక్కడికైనా ఎల్లబోతా నన్నే ఎదుర్రామంటారెందుకురా.. సల్లంగా ఎల్లిన పన్లన్నీ అవుతాయని. అది గుర్తింపు కాదు. అదో ధైర్యం. నమ్మకం. అది ఊరు మనకిచ్చే హామీ. భరోసా. ఎంత భరోసా కాకపోతే , మనల్నికడుపునిండా తినమనే గదరా ఊర్లో ఊరసెరువు మన కులపోల్లకి రాసిచ్చేరు రైతులంతా? జాతరైతే మనవుండాల. పండగలైతే మనవుండాల. దేవుడ్ని ఊరెగిత్తే మనవే. మనం లేకపోతే ఊరికి సలవేదిరా బామ్మర్దీ? అవసరానికి ఆదుకునేది రా ఊరు. ఏ హామీలూ అక్కల్లేదు. నీకు పది పైసలు పుట్టుద్దా ఇక్కడ? పచ్చి మంచి నీల్ల సుక్కోసేదెవ్వర్రా? మనకింత గౌర్నం ఇచ్చిన ఊర్ని నేనైతే వదల్నొరేయ్..
నా ఊరే నాకు ఊపిర్రా. నా ఊపిరాగినా నా వాళ్లకి నా ఊరుంటాది. ఊరుతో బంధముంటాది. వండుకుని తిన్నంత రుచిరా ఊరంటే. మీదో..? అయినా ఈ నాలుగ్గోడలు దాటితే నీ ఉనికేదిరా? పలకరిచ్చే మనిసేడ్రా ఇక్కడ. ఈ బంగ్లా దాటేవంటే నువ్వెవరో? ఎవరెవరో? నా ఇల్లూ, ఇంటి నంబరూ, రేసన్ కార్డూ, ఆధారకార్డూ కాదురొరేయ్ నా ఎడ్రస్సు. నా ఊరు . నా ఊర్రా నా ఎడ్రస్సూ..నువ్వెక్కడికెల్లినా మీదేవూరో సెప్పాల్సిందే..గుర్తెట్టుకో..”
అతని మాటల్లోని నిజం నోరెత్తనివ్వలేదెవర్నీ..
ఆటోలో ముందు కూర్చున్నాడన్నమాటేగానీ కదిలే బళ్ళూ , బస్సులూ ఏవీ కూడా సూరిబాబు మాటలు మదిలో మెదలటానికి ఆటంకం కాలేకపోయాయి వీరేషుకి.
ఆ ధీమా ఏంటో? సూరిబాబుకి ఎవరిచ్చారా ధైర్యం? సరే ..! అది అతనిష్టం. కాదన్లేం. అయినా ఎక్కడికి వెళ్ళొచ్చాడు ఈ రెండ్రోజులూ? ఏది ఎక్కడో, ఎవరు ఎక్కడో తెలియని ఊరు కాని ఊళ్ళో ఎవరింటికి వెళ్ళొచ్చాడు.?
ఆటో దిగి సామాన్లని తీసుకుని స్టేషన్ లోనికొచ్చి టికెట్లు తీసుకుని ఫ్లాట్ ఫాం మీదకి వెళ్ళాకా రైలొచ్చేసరికి కాస్తంత సమయం ఉండే సరికి అడగనే అడిగేసాడు వీరేశు.. దుర్గేసు గురించి. ఇదంతా ఆయనే చెప్పుంటాడన్న లెక్కలో..
“దుర్గేసా ..దుర్గేసెవరు? ” అంటూ పక పకా నవ్వేసాడు సూరిబాబు.
తెల్లగా ఉతికి నీలిమందులో ముంచి మరీ గెంజిపెట్టి సాగదీసి ఆరేసిన బట్తల మీద కుక్క అడుగుల్ని చూసి తెల్లబొయినట్తయ్యింది అతని నవ్వు విని వీరేషుకి.
“దుర్గేసెవరూ లేరు బావా! అబద్దం చెప్పాను.” తెల్లబోవటం అతని వంతైంది..
“అబద్దమా..? ఎంతుకు బావా?” ఆశ్చర్యంగా అడిగాడు వీరేశు.
“ఎంతుకంటే..అలా సెప్తేనేగాని నమ్మరని..”
“మరెక్కడికెల్లావ్?”
“పనికి..” సూరిబాబన్నాడు.
“పనికా? పనికెల్తే నాకెందుకు చెప్పలేదు..? “
“చెబితే నువ్వెల్లనివ్వవని..”
“అసలా అవసరం ఏమొచ్చింది బావా? “
“వచ్చింది బావా..! కాబట్టే ఎల్లాను..”
“అదే..ఎంతుకని అడుగుతున్నాను..”
“పన్లోకెందుకెల్తారు..? డబ్బులకోసవేగా?” నిదానంగా అన్నాడు సూరిబాబు.
“డబ్బుల కోసవా? నన్నడిగితే నేనిత్తాగదా? “ నిష్టూరంగా అన్నాడు తెల్లబోతూ..
“నీ ఇంటికి సుట్టం సూపుగా వచ్చి నా పెల్లాం అన్నగారి దగ్గర “ నా దగ్గర డబ్బులైపోయాయ్ బావా? అప్పియ్యి” అని నా పెల్లాం ఎదురుగా నిన్ను అప్పడిగి నిన్నగాక మొన్న నాబతుకులోకొచ్చి కడకంటా నాతోనే ఉండాలనుకునే నా పెల్లాం దృష్టిలో నేను చులకనెలా అవుతాననుకున్నావ్ బావా? నా పెల్లానికేగాదు..నీ పెల్లానిక్కూడా లోకువే నీ దగ్గర అప్పుజేత్తే. ఎల్లకాలం మర్సిపోరు. నా పరువేంగావాల్నా?
వచ్చేటప్పుడు బాగానే తెచ్చుకున్నాను డబ్బులు. అయితే మీ సెల్లెలు అదే నా పెల్లాం మనం సిటీ అంతా తిరిగినప్పుడు ఏవేవో కొనుక్కుంటానంటే దారి కరుసులక్కూడా లేకుండా కరుసై పోయాయ్ బావా? నా దగ్గర డబ్బుల్లేవంటే నా పెల్లాం దగ్గర నాకెంత నామర్దా? అయినా అలా ఎలా అంటాం సెప్పు. నేనైతే మగోడి జేబు పరిస్ధితేంటో ఆడదానికి ఎప్పుడూ తెలవగూడదు అనే అనుకుంటాను బావా? అప్పుడే మన గౌర్నం నిలబడద్ది ఆల్లదగ్గర. అందుకే ఖర్చు పెట్టేస్తే దారి కరుసులకి సరిపోవని తెలిసినా, నా రెక్కల మీద నమ్మకంతో ఏదడిగినా కొన్నాను, తర్వాత సంగతి తర్వాత సూసుకోవచ్చని. సేతిలో పైసా లేకపోయే సరికి వరసకి అన్నయ్యన్జెప్పి రెండ్రోజులూ మీ అందరికీ సెప్పకుండా దూరంగా పోయి పన్లోకెల్లొచ్చా.”
తెల్లబోయి చూశాడు వీరేశు తన ముందు నిలబడ్ద తన బావని.
అలా చూడగా చూడగా సూరిబాబే కాదు అతని వెనగ్గా ఆత్మాభిమానంతో నిండుకుండలా ఉన్న
ఊరంతా కనిపించసాగిందతనికి.
కన్నెగంటి అనసూయ