ఊరు పిలిచింది

1
11

[dropcap]ఎ[/dropcap]న్నడో వేలు విడిచిన నేల
నన్ను పిలిచింది ఆత్మీయగా
మా ఊరు మమతల సంతకంతో
మనసు మహా దొడ్డది

తరాలు మారిన కాలంలో
మనిషి మారడం అసహజం కాకున్నా
అమానవీయం కాకూడదు
కానీ, విలువల బంధాలు మరిచి
గుండె తలుపులు మూసుకున్నడు

నేను పుట్టిన మట్టి వాసన ఎంతో గొప్పది
మాటా ఆటా పెనవేసుకున్న తీగల్లో
పూల తోటగా
బంధాలన్నీ పరిమళించే గాలిలో
బలమైన వేళ్ళ చెట్లున్నయ్
అదో సుందర నందనవనమే
చూసే కనుల ఆనందం
నడిచిన పాదాలలో పురివిప్పింది
నాట్య మయూరి

నాకే కాదు
నా ముందు తరాలదీ ఇదే అనుభూతి
కోకిల పాడిన కొంగొత్త మానస వీణ
ప్రతిధ్వనించే నా చెవుల రింగుమని
ఒక కలగా, మనిషి బతికిన కళగా

మారిన మనిషి
మనసు లేని మృగమేనా నేడు
చీకటి గుహల ముసిముసి నవ్వులు
నీతి దారులన్నీ మూసుకొన్నవి
ఆర్ధిక తీగలు మీటిన వెర్రివాని నడకలో

ఇప్పుడు వీస్తున్న గాలిలో
ఊరంతా ఆక్సిజన్ విజన్ తగ్గింది
నిప్పుల సెగ నిండిన స్వార్థం పొగల
ఊపిరాడక కొన ప్రాణం అగినట్లు

ఊరు బతుకూ మారిందా
అయితే
ఊరే అర్థం కాని విలోమగీతమైంది
నా దేశం ఇప్పుడు ఊర్లల్లో లేదు
ఊర్లు మునిగి తేలుతున్నయ్
రంగుటద్దాల రాజకీయ క్రీడల్లో

అయినా, అక్కడింకా
ప్రేమ చచ్చిపోలేదు
బహుశా అందుకేనేమో
నేను పుట్టి పెరిగిన్నాటి నేల
నన్ను పిలిచింది
యాది తొవ్విన మట్టిలా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here