పి.వి నరసింహారావు – సృజనాత్మక రచనలు – విశ్లేషణ

10
7

[box type=’note’ fontsize=’16’] యుజిసి-హ్యుమన్ రిసోర్స్ డెవె‌లప్‌మెంట్ సెంటర్, ఉస్మానియ తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ ‘తెలుగు పునశ్చరణ తరగతుల’లో భాగంగా – మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు సృజనాత్మక రచనలను విశ్లేషిస్తూ కస్తూరి మురళీకృష్ణ  చేసిన ప్రసంగపు పాఠం ఇది. [/box]

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం!

ఇక్కడ సమావేశమైన వారంతా పాఠాలు చెప్పడంలో అనుభవం కలవారు. పాఠాలు చెప్పడం అన్నది వెన్నతో పెట్టిన విద్య అందరికీ. నేను అధ్యాపకుడిని కాను, ఉపాధ్యాయుడిని కాను. అయినా నన్ను పి.వి నరసింహారావు సృజనాత్మక రచనల విశ్లేషణ చేయమని అడిగినప్పుడు ఒక్కక్షణం కూడా ‘నాకది సాధ్యమా?’ అన్న సంశయం లేకుండా ఒప్పుకున్నాను. ‘దేవదూతలు అడుగుపెట్టేందుకు సంశయించే స్థలాల్లోకి మూర్ఖులు పరుగులు తీస్తారు’ అన్నట్టు మీ అందరిముందు, ఈ వర్చువల్ వేదిక పైనుంచి, సృజనాత్మక సాహిత్యం గురించి, ప్రతి సంవత్సరం సృజనాత్మక పరవళ్ళు తొక్కే యువతరాన్ని కలుస్తుండే, ప్రభావితం చేస్తుండే మీ అందరితో మాట్లాడి, ఆలోచనలు పంచుకునే అవకాశాన్ని వదలుకోదలచుకోలేదు. ఎందుకంటే ఈనాడు నేను మీతో పంచుకునే ఆలోచనలు మీకు ఏ మాత్రం నచ్చినా, అవి పరోక్షంగా భావితరాల ఆలోచనలపై ప్రభావం చూపించే వీలుంటుంది. ఈ ప్రపంచంలో మానవ సమాజంపై అత్యంత ప్రభావం చూపించేవాళ్ళు నలుగురు. ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, కళాకారులు, గురువులు గమనిస్తే మిగతా ముగ్గురినీ ప్రభావితం చేసేది గురువులే. అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజంపై ప్రభావం చూపించే ఏకైక వ్యక్తి గురువు. అలాంటి గురువులందరికి వందనాలు సమర్పిస్తూ మీతో పి.వి నరసింహారావు సృజనాత్మక రచనల విశ్లేషణల గురించి నా ఆలోచనలు పంచుకోవటం ప్రారంభిస్తున్నాను.

సృజనాత్మకత అంటే …..

ముందుగా మనం సృజనాత్మకత, creativity అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించుకోవాల్సి ఉంటుంది.

Creativity is the act of turning new and imaginative ideas into reality. It is characterized by the ability to perceive the world in new ways, to find hidden patterns, to make connections between seemingly interrelated phenomena and to generate solutions. Creativity involves two processes, thinking and then producing. సృజనాత్మక అన్నదానికి సమగ్రమైన నిర్వచనం ఇది.

సృజనాత్మకత అన్నది కొత్త కొత్త ఆలోచనలు, ఊహలను నిజజీవితంలో ఆచరణలోకి తెచ్చి అమలు చేయటం. ఊహను నిజం చేయటం, ప్రపంచాన్ని కొత్త దృక్కోణంలో దర్శించగలగటం, పైకి కనబడని పద్ధతులను, నమూనాలను కనుగొనటం, పొందుపరచి ఉన్న నమూనాలను కనుగొనటం, సంబంధం లేనటువంటివిగా అనిపించే అంశాల నడుమ సంబంధాలను గుర్తించి పరిష్కారాలను సూచించటం, అంతా సృజనాత్మక క్రిందకే వస్తుంది. సృజనాత్మకత అంటే ఆలోచించటం , ఆలోచన ఆధారంగా సృజించటం.

ఈ నిర్వచనాన్ని బట్టి చూస్తే ఒక శాస్త్రవేత్త సృజానాత్మకత ఉన్నవాడు. ఒక వ్యాపారి, ఒక కళాకారుడు, ఒక రాజకీయ నాయకుడు ఇలా స్వయంగా ఆలోచించి, అందరూ చూడలేని దాన్ని చూసి దాన్ని ప్రదర్శించగలిగిన వారందరూ సృజనాత్మకత ఉన్నవారే. పైనుంచి పడే ఏపిల్ ద్వారా భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఊహించి, ప్రతిపాదించి , నిరూపించటం సృజనాత్మకత. రెక్కలు కదుపుతూ ఎగిరే పక్షులను చూసి రెక్కలతో ఎగిరే లోహవిహంగాన్ని తయారుచేయటం సృజనాత్మకత. తనకు పరిచయం లేని పాత్రలలో దూరి తానే ఆ పాత్ర అయి ఆ పాత్రను సజీవంగా ప్రదర్శించే కళాకారుడిది సృజనాత్మకత. ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న శబ్దాల స్వరాలను కనుగొని సంగీతంగా మలచి అందించే సంగీతకారుడు, స్వరంలో పలికించే గాయకుడు, వాయిద్యాలపై స్వరం పలికించే వాయిద్యకారులూ, తన శరీర కదలికల్లో విశ్వభావనలను ప్రతిబింబించే నాట్యకళకారులు… ఇలా నిత్యజీవితంలోని ప్రతి అడుగునా, అణువణువునా సృజనాత్మకత ఉట్టిపడుతూ కనిపిస్తుంది.

కానీ మనకు సృజనాత్మకత అనగానే ప్రధానంగా సాహిత్యకారులు గుర్తుకువస్తారు. ఒక వస్తువు కోసం లేని డిమాండ్ సృష్టించి, అందంగా ప్రచారం చేసే సృజనాత్మకత గుర్తుకు రాదు. ప్రజలను మంత్రముగ్ధులను చేసి తను ఆడించినట్టు, ఆడేట్టు చేసుకునే రాజకీయ నాయకుడు గుర్తుకురాడు. ఒక రచయిత, ఒక శిల్పి, ఒక చిత్రలేఖనం, ఒక గీతం, సంగీతం ఇవే గుర్తుకువస్తాయి. ఇందుకు ప్రధాన కారణం అర్థం చేసుకోవాలంటే సృజనాత్మకత పట్ల భారతీయ దృక్కోణం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

సృజనాత్మకత-భారతీయ దృక్కోణం

భారతీయ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం ఒక సృజన, ఒక సృష్టి. సృష్టి,  సృజించాలన్న సిసృక్ష నుండి జనించింది. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం పంచభూతాల నడుమ సమతౌల్యం ఉన్నంత వరకూ సృష్టి లేదు. సమతౌల్యం లోపించినపుడు సృష్టి ఆవిష్కృతమౌతుంది. అంటే సృజన ఒక వికారం. ఒక అసమతౌల్య స్థితి. దీనిని మరోకోణంలో ప్రదర్శించాలంటే సముద్రం ఉంది. సముద్ర మథనం జరిగితే కానీ హలాహలం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వంటివి జనించవు. చివరికి అమృతం లభిస్తుంది. కానీ అందుకు ముందుగా జరగాల్సింది సముద్ర మథనం. మథనం లేకపోతే ఏమీలేదు. సముద్రం మనస్సు అనుకుంటే, మనస్సులో జరిగే మథనం సృజనకు దారితీస్తుంది. శరీరం భౌతిక ప్రపంచానికి చెందినది. మనస్సు భౌతిక ప్రపంచానికి స్పందిస్తూ అధిబౌతిక ప్రపంచంలో విహరించాలని తపిస్తుంది. ఈ ఘర్షణ ఫలితంగా సృజన ఉద్భవిస్తుంది. అంటే సృజనకు తపన అవసరం. ఘర్షణ అవసరం. మథనం అవసరం. అయితే మానవ ప్రపంచంలో దేన్ని సూచించాలన్న దానికి నామం అవసరం. రూపం అవసరం. మనది నామరూపాత్మక ప్రపంచం. దేనికైనా ఒక పేరు, ఒక రూపం ఇవ్వందే దాన్ని గుర్తించలేము. అర్థం చేసుకోలేము. అలా పేరు, రూపం సూచించేది వాక్కు. వాక్కు సరస్వతి. ఒక రూపం, పేరు ఇవ్వటం అంటే సంబంధం లేని విషయాలలో దాగి ఉన్న ఒక సమాన లక్షణాన్ని గుర్తించి దాన్ని ధ్వనిరూపంలో వ్యక్తం చేయటం.  అక్షరాల కలయిక ద్వారా వినిపించే ధ్వని తరంగాలే కాక నిర్దిష్టమైన రూపాన్ని మనస్సులో చిత్రించటం. అది సరస్వతి.

బ్రాహ్మీతు భారతీ భాషా గీర్వాగ్వాణీ సరస్వతీ

వ్యాహార ఉక్తిర్ణపితమ్ భాషితం వచనం వచః

బ్రహ్మలోకంలో బ్రహ్మ సరస్సు ఉంది. ఆ సరస్సును ఆశ్రయించి సరస్వతి ఉంటుంది. అక్కడి నుండి నదీరూపంలో ప్రవహిస్తుంది. సరస్వతి అంటే నదీ ప్రవాహం. నదీ ప్రవాహం లాంటి వాక్ప్రవాహం. బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుడి లోకం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. వేదం బ్రహ్మపదార్థం. బ్రహ్మ పదార్థం అనంతచైతన్యం. అనంత చైతన్యం అంటే ఒక సరస్సు. ఆ సరస్సు సరస్వతి. ఎందుకంటే మన ఊహలు, ఆలోచనలు, క్రియలు అన్నీ చైతన్యం నుంచి సముద్భవిస్తున్నాయి. సాహిత్యం శబ్దార్థాలతో కూడినది. అంటే సాహిత్యం సరస్వతీ స్వరూపం. మానవ మనస్సనే చైతన్య ప్రవాహంలో మథనం ద్వారా జనించేది సాహిత్యం. అందుకే సృజన అనగానే మనకు సాహిత్యం స్ఫురిస్తుంది. ఇన్ని రకాల సృజనలు ఉన్నా సాహిత్యం అన్నిటికన్నా ఉన్నత స్థానంలో నిలుస్తుంది. సరస్వతికి అది దగ్గరగా ఉండి మానవ సమాజ హితం కోరుతుంది కాబట్టి.

ఇక్కడే మరో విషయం స్పష్టమవుతుంది. ఎప్పుడైతే సృజనకు మనస్సు కేంద్రం అనుకున్నామో అప్పుడు మనస్సు ఎంత అధిభౌతికమైనదైనా శరీరం అనే భౌతిక పంజరంలో ఇమిడినది. దాని పరిమితులు, పరిధులు నిర్ణయమైపోయాయి. కాబట్టి మనస్సు ఎన్ని ఊహలు చేసినా, ఎంత సృజన చేసినా వాటి పరిమితులు, పరిధులు శరీర పరిధులు నిర్ణయిస్తాయి. అంటే రచయిత ఊహలు అంతరిక్షంలో ఉన్నా కాళ్ళు భూమి మీదనే ఉంటాయి. అతని ఊహలకు ప్రేరణ అతని అనుభవాలకు, అతని చుట్టూ ఉన్న సమాజానికి లోబడి ఉంటాయి. అంటే ఒక రచయిత తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను, తన అనుభవాలను, తాను కలసిన వ్యక్తులు, ఔన్నత్యాల ప్రభావాన్ని దాటి రచనను సృజించలేడన్న మాట. అంటే అది ఎంతటి ఊహా శబలత కలిగి, నిత్యజీవితంలోని అనుభవాలకు దూరంగా ఉండి, అసంభవం అనిపించినా, అతని ఊహలకు బీజం సామాజిక పరిస్థితులకు మనస్సు స్పందన తప్ప మరేమీ కాదన్నమాట. ప్రవహించే జలంలో విద్యుత్తును వెలికి తీసినా, విద్యుత్తుకు బీజం నీటిలోనే ఉంటుంది. అలాగే సృజనాత్మక రచయిత సృజనకు బీజం సమాజంలోనే ఉంటుంది. కాబట్టి ‘సామాజిక స్పృహలేని రచన’ అన్నపదం అర్థవిహీనం. అనౌచిత్యం. అయితే ఈ చర్చ అప్రస్తుతం కాబట్టి దీన్ని ఇక్కడే వదలి ముందుకు సాగుదాం.

పీ వీ సృజన- విశ్లేషణ ప్రాతిపదిక

సృజనాత్మకత, సృజన అన్న పదాలు ఏ రకంగా ప్రధానంగా సాహిత్య సంబంధి అన్నది నిశ్చయించుకున్న తరువాత మనం ఒక రచయిత సృజనను తీసుకుని దాన్ని పరిశీలిస్తే మనకు సృజన గురించి ఇంకా లోతైన అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక రచన రచయిత మనస్సు తునక. అతని మనస్సులో జరిగిన మథన ఫలితం. ఆ మథనం ఫలితంగా వెలువడిన హాలాహలం, కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, అమృతం అన్నిటినీ అతని రచన ప్రతిబింబిస్తుంది.

ఈ రోజు మనం మాజీ ప్రధాని, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పలు విభిన్న శాఖల మంత్రిత్వాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి, పలు భాషాకోవిదుడు, సృజనాత్మక రచయిత, భారతదేశ గమనాన్ని మలుపు తిప్పి శాశ్వత ముద్రవేసిన రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో ‘బృహస్పతి’గా భావించే  కీ.శే. పి.వి నరసింహారావు గారి సృజనాత్మక రచనలను, విశ్లేషణను ఎంచుకున్నాం.

ఆచార్య కోవెల సుసన్నాచార్య గారి మాటల్లో చెప్పాలంటే పి.వి నరసింహారావు రాజకీయాలపై దృష్టి పెట్టకుండా సాహిత్య సృజనపై దృష్టి కేంద్రీకరించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు తప్పకుండా వచ్చి ఉండేది.

తెలంగాణ సాహిత్య చరిత్రను గమనిస్తే ఇద్దరు సృజనాత్మక కళాకారులు, ఒకరు కవి, ఒకరు రచయిత… రాజకీయాల కోసం తమ సృజనను త్యాగం చేయటం కనిపిస్తుంది. ఒకరు ప్రఖ్యాత ఉర్దూ కవి ముఖ్దూం మొహియుద్దీన్. రెండవది పి. వి నరసింహారావు. ఇతరులు రాజకీయాలలో పాల్గొన్న ఏదో ఒక దశలో వారు రాజకీయాల కన్న సాహిత్య సృజనకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ముఖ్దూం మొహియుద్దీన్ పి.వి నరసింహారావులు రాజకీయాల కోసం సాహిత్య సృజనను త్యాగం చేశారు. అయితే వారు సృజించిన సాహిత్యం మాత్రం ఈనాటికీ సాహిత్య ప్రేమికుల హృదయాలను ఉర్రూతలూగిస్తోంది. వారిని స్మరిస్తూ, వారు రచనలు కొనసాగించి ఉంటే సాహిత్యం ఇలా ఇంతగా పరిపుష్టం అయ్యేదో అని ఆలోచిస్తూనే ఉన్నారు సాహిత్య ప్రియులు.

నిజానికి పి.వి నరసింహారావు సృజనాత్మక రచయితగా రచనలను సృజించింది అవి తక్కువ కాలమే. కానీ సాహిత్య సేవ చేసినంత కాలం ఆయన అత్యుత్తమ రీతిలో సేవ చేశారు. ఆయన వరంగల్లులో కాకతీయ పత్రిక నడిపించారు ఇతర సోదరులతో కలిసి. కాకతీయ కళాసమితి స్థాపించి సాహిత్య సంగీత కార్యక్రమాలు నిర్వహించి సామాన్యులకు ఈ రెండు కళలను చేరువచేశారు. ‘కాకతీయ గ్రంథమాల’ పేరిట గ్రంథాలు ముద్రించారు. తాను నడిపిస్తున్న పత్రికలో పాములమర్తి శేషగిరిరావుతో కలిసి ‘జయ – విజయ’ జట్టుగా ఏర్పడి అనేక గేయాలు, పద్యాలు, వ్యాసాలు రచించారు. అవన్నీ ఒక గ్రంథంలో తేవాల్సి ఉంది. అయితే అనేక రచనలు ఇద్దరి పేర్లమీద ఉండటంతో ఏది పి.వి నరసింహారావు సృజననో విప్పి చెప్పటం కొంచెం కష్టతరమైన పని. ఆ తరంవారు, ముఖ్యంగా సుప్రసన్నాచార్య వంటి వారు చేయాల్సిన పని. కానీ కాకతీయ పత్రికలు లభ్యమవటం దుర్లభం అవటంతో ఆయన రచనలను గ్రంథస్థం చేయటం కష్టమవుతోంది. అదీగాక ‘విజయ’ పేరు మీద ఉన్నవన్నీ పి.వి నరసింహారావు సృజనలే అని నిర్ధారించటం కష్టం అని నిపుణులు అనటంతో ఈ కాలంనాటి సృజన సందేహంలో పడుతుంది.

కాకతీయ పత్రికలో ఆయన మారుపేరుతో బోలెడన్ని కథలు రాశారు అని అంటారు. కాని మనకు ప్రస్తుతం ప్రామాణికంగా లభిస్తున్న పి.వి సృజన ‘గొల్ల రామవ్వ’, అలాగే ‘మంగయ్య అదృష్టం’ అన్న నవలిక.

బహుభాషా కోవిదుడు అనటంతో ఆయన విశ్వనాథ సత్యనారాయణ రచన ‘వేయిపడగలు’ను ‘సహస్రఫణ్’గా అనువదించారు. విశ్వనాథ వారి ఆమోదం పొంది, అభినందనలు అందుకున్న రచన ఇది. ఇది ఆయన ఒక్కడే అనువదించారు. ఇటీవలి కాలంలో కొందరు ‘వేయిపడగలు’ను సామూహిక సమహార పద్ధతిలో ఆంగ్లంలోకి అనువదించి భంగపడటం గుర్తుకు తెచ్చుకుంటే పి.వి నరసింహారావు అనువాద పటిమ, రచయిత ఆత్మను పట్టుకుని అనుసృజన చేయటం అన్నది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా 1982లో పోతన భాగవతంపై జరిగిన సెమినార్‍లో ప్రసంగిస్తూ ఆయన బ్రిటిష్‍వారు కొంత కల్చరల్ ఇంపీరియలిజమ్ మనపై రుద్దటాన్ని ప్రయత్నించారు. విశ్వనాథ సత్యనారాయణగారు  తిరుగుబాటు చేసింది దీనిమీదనే. ఆయన కాంగ్రెస్‍లో చేరి జైళ్ళకు పోలేదు. రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ రాజకీయ రంగానికి దీటుగా, సాంస్కృతిక రంగంలో ఆయన ఈ కల్చరల్ ఇంపీరియలిజంకు విరుద్దంగా పోరాడినారు. ‘మీ కల్చర్‍ను మాపై రుద్దకండి. మా ధర్మం, మా సంస్కృతి మాది. స్వధర్మే నిధనం శ్రేయః’ – సత్యనారాయణగారి సర్వసాహిత్యాన్ని, ఆయన భావననూ ఈ అంశంతో మనం చూసుకోవచ్చు అన్నారు. ‘భాగవత సంప్రదాయం జాతీయ సమైక్యత’ అన్న ఉపన్యాసంలో విశ్వనాథవారి సృజనాత్మక రచనల ఆత్మను పట్టుకున్న సృజనాత్మక రచయిత మాటలివి. అందుకే విశ్వనాథ రచనలపై అవగాహన లేని సామూహిక అనువాదంకన్న ఒక్కడే చేసిన ’సహస్రఫణ్’ ఈనాటికీ ‘వేయిపడగలు’ నవలకు దీటైన అనువాదంలా నిలచి ఉంది.

పి.వి నరసింహారావు ‘వందేమాతరం’ అన్నందుకు ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు. ఆంధ్రా యూనివర్శిటీలో అడ్మిషన్ లభించలేదు. అప్పుడు నాగపూర్‍లో చదివారు. అది ఆయనకు లాభించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలతో పాటు మరాఠీ కూడా నేర్చుకున్నారు. ఫలితంగా ‘హరినారాయణ ఆప్టే’ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ను ‘అబల జీవితం’గా అనువదించారు. తరువాత పలుమార్లు మరాఠీ భాషలో ప్రసంగించి మహారాష్ట్ర ప్రజల, పండితుల మన్నన పొందారు. అయితే అనువాద రచనలను సృజనాత్మక సాహిత్యంగా పరిగణించకపోవటం ఆనవాయితీగా ఉండటంతో ఆ రచనల విశ్లేషణ ప్రస్తుతం మన పరిధి బాహిరం. కానీ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. అనువాదం కూడా సృజనాత్మక కళనే. ఎంతో సృజనాత్మక ఆవేశం లేకపోతే మరో భాషలో ఉన్న రచయిత భావావేశాన్ని పట్టుకుని ఇంకో భాషలోకి తర్జుమా చేసి ప్రదర్శించటం వీలుకాదు. సూర్యుడి వెలుగులోని వేడిని పరిహరించి, వెన్నెల వెలుగులు వెదజల్లే చందమామ లాంటి వాడు అనువాదకుడు. చందమామ వెలుగును వెలుగు కాదంటామా? కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మన్నిస్తూ అనువాదాల ప్రస్తావనను ఇంతటితో స్వస్తి చెప్దాం.

రాజకీయాలలో తలమునకలయిన తరువాత పి.వి నరసింహారావు సృజనాత్మక రచనలు వెనుకబడ్డాయి. ఆయన ‘ది ఇన్‍సైడర్’ పేరుతో పలు రాజకీయ వ్యాసాలు వ్రాసినా, తన ఉపన్యాసాలను తానే స్వయంగా రాసుకున్నా వాటన్నిటినీ సృజనాత్మక రచనలుగా పరిగణించలేము. అలాగే ప్రధాని పదవీ బాధ్యతలు పూర్తయిన తరువాత రిటైర్‍మెంట్ జీవితం గడుపుతూ అయోధ్య వివాదంపై ఆయన రాసిన రచన కూడా కాల్పానికేతర రచననే.

అయితే ప్రపంచంలో ఏ రాజకీయవేత్త చేయని సృజన పి.వి నరసింహారావు చేశారు. మాజీ రాజకీయవేత్తలు తను అనుభవాలు, మెమొయిర్స్‌ను పుస్తకాలుగా ప్రచురించారు. స్వీయ జీవిత చరిత్రలను వెలువరించారు. ఇటీవలికాలంలో జీవిత చరిత్ర రచన రాజకీయ రంగంలో మెట్లు ఎక్కడానికి ఒక సాధనంగా మారింది. ఒబమా, హిల్లరీ క్లింటన్, ఎల్ కె అద్వానీ వంటివారు స్వీయ జీవిత చరిత్ర రచనల ద్వారా రాజకీయంగా తమ ఇమేజ్‍ని మెరుగుపరచుకోవాలని ప్రయత్నించారు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా స్వీయజీవిత చారిత్రాత్మక నవల, autobiographical novel ను సృజించలేదు. ఆ ఘనత పి.వి నరసింహారావుదే. ఆయన ఆంగ్లంలో సృజించిన The Insider తెలుగులో కల్లూరి భాస్కరం ‘లోపలి మనిషి’గా అనువదించారు. ఈ మూడూ సృజనాత్మక రచనలు, అంటే గొల్ల రామవ్వ, మంగయ్య అదృష్టం, లోపలి మనిషి, విశ్లేషణల ద్వారా పివి నరసింహారావు సృజనాత్మక పటుత్వాన్ని, అంతరంగాన్ని, ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

పీవీ జీవితం-టూకీగా…

ఇంకా ముందుకు వెళ్ళేముందు, దాదాపుగా అందరికీ పరిచయమైనదే అయినా, టూకీగా పి.వి నరసింహారావు జీవితాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మరో విషయం స్పష్టం చేయదలచుకున్నాను. ఈ విశ్లేషణ, పరిచయాలలో ఎంతవరకు అవసరమో అంతవరకే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది తప్ప అదీ పివి నరసింహారావు సృజనాత్మక ఆవిష్కారానికి ఎంత అవసరమో అంతవరకే తప్ప, ఏ రకంగానూ రాజకీయాలను వ్యాఖ్యానించటం ఉండదు. ఈ విశ్లేషణకూ  రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు. మనకు పి.వి నరసింహారావు సృజనతోనే సంబంధం. ఆయన సృజనాత్మక వ్యక్తిత్వంతోటి సంబంధం. ఎందుకంటే పీవీ నరసింహారావు రాజకీయంగా ఎంత ఎదిగినా సాహిత్యం మాత్రం ఆయన ఆత్మగా నిలిచింది.

శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921న కరీంనగర్‍లోని భీమదేవరళ్ళి మండలంలో జన్మించారు. అతని తండ్రి పాములపర్తి సీతారామారావు, తల్లి పాములపర్తి రుక్మిణి. వారిది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. ఆయనకు బాల్యం నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. యవ్వనంలో రాజకీయాలలో, ముఖ్యంగా నిజాం వ్యతిరేక పోరాటంలో చురుకుగా పనిచేశారు. ఆ కాలంలోనే ఎలాంటి ప్రభుత్యోద్యోగాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రజోపయోగ కార్యాలు చేసే లక్ష్యంతో, వ్యవస్థలో మార్పు తేవాలన్న ఉద్దేశంతో రాజకీయాలలో ప్రవేశించారు. అయితే పి.వి నరసింహారావు ఆలోచనాపరుడు. ఆయనను ‘బృహస్పతి’ అని పిలిచేవారు. మేధావులు రాజకీయాల్లో నెగ్గుకు రావటం కష్టం. అయినా మనసులో మాట మనసులోనే అదిమిపెట్టి, లక్ష్యంపైనే దృష్టిపెట్టి సాగే లక్షణం పి.వి నరసింహారావు చిరకాలం రాజకీయాలలో నిలదొక్కుకునేట్టు చేసింది. ఒక్క పరుషమైన మాట కూడా లేకుండా, ఎవరినీ విమర్శించకుండా, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతూ, తార్కికంగా, విశ్లేషణాత్మకంగా ఉండే పి.వి ప్రవర్తన ఆయనను రాజకీయ శిఖరారోహణంలో దోహదం చేసినా, ఆయనను ఒంటరిగానే నిలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, కేంద్రంలో పలు కీలక మంత్రిత్వశాఖలను సమర్థవంతంగా నిలిపినా ఆయన ఏదో ఒక గ్రూపుకు చెందటం, ఎవరో ఒకరికి విధేయంగా ప్రవర్తిస్తూ వ్యక్తిత్వాన్ని కించపరచుకోవటం చేయలేదు. పదవులు ఆయనను వరించాయి తప్ప. ఆయన పదవులు వరించలేదు. పైగా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు కనబడుతున్నా  అతి కీలకమైన నిర్ణయాలు ఇతర ఏ రాజకీయ నాయకులు కలలో కూడా తీసుకోలేని కఠినమైన, ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాలు ఆయన తీసుకోవటమే కాదు, విజయవంతంగా అమలుచేసి చూపించారు. ఒకోసారి నిర్ణయం తీసుకోనట్టు కనిపించటం కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరించటమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుపరచిన భూసంస్కరణలు; దేశప్రధానిగా అమలులోకి తెచ్చిన ఆర్థిక సంస్కరణలు నిరూపిస్తాయి. అయితే ఆయనకు నాటకాలు తెలియకపోవటంతో ఆయన దేనికీ క్రెడిట్ తీసుకోలేదు. తన గొప్పతనం ఇల్లెక్కి కోడైకూయలేదు. పొగడ్తలను, విమర్శలను,  విజయాలను, అపజయాలను సమానంగా భావించారు. అన్నింటినీ మౌనంగా స్వీకరించారు. కానీ తాను అనుకున్నది సాధించారు. చేయాలనుకున్నది చేశారు. అడుగడుగునా ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని రాజకీయ కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రత్యర్థులను స్నేహితులుగానే చూశారు. తాను చేయవలసినది చేశారు. ఎంత మౌనంగా దేశ భవిష్యత్తును మలుపులు తిప్పారో, అంత మౌనంగా తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొన్నారు. రాజకీయ హింసనూ అంత మౌనంగా అనుభవించారు. అంతే మౌనంగా ప్రపంచం నుంచి నిష్క్రమించారు.

పి.వి నరసింహారావుకు సాహిత్యం ప్రాణం. ఎంతగా రాజకీయాలలో మునిగిఉన్నా అవకాశం దొరికితే సాహిత్యకారులతో ముచ్చటించేవారు. సాహిత్య చర్చలు చేసేవారు. 1990 ప్రాంతాలలో ప్రారంభించిన నవలను 1998 ప్రాంతాలలో అంటే రాజకీయాల నుండి విరమించిన తరువాత ప్రచురించారు. దానికి రెండవభాగం ప్రచురించాలని అనుకున్నారు కానీ దాన్ని పూర్తిచేసేలోగా డిసెంబరు 9 , 2004 ఆయన మరణించారు. దాంతో ‘ది ఇన్‍సైడర్’ రెండవభాగం వెలుగుచూడలేదు.

ఇది టూకీగా పి.వి నరసింహారావు జీవితం.

మనం ఆరంభంలో అనుకున్నాం రచయిత ముడిసరుకు సమాజం నుంచి లభిస్తుందని. అది అతని అంతరంగంలోని సృజనాత్మకత సరస్సులో స్నానం చేస్తూ జరిపిన మథన ఫలితంగా సృజనాత్మక రచన ఉద్భవిస్తుందని. ఈ నేపధ్యంలో పి.వి సృజన ‘గొల్ల రామవ్వ’ను విశ్లేషించాల్సి ఉంటుంది.

గొల్ల రామవ్వ:

1949లో కాకతీయ పత్రికలో ‘విజయ’ అనే కలం పేరుతో ‘గొల్ల రామవ్వ’ కథను ఆయన రాశారు. తన ప్రాణాలకు తెగించి, మనుమరాలి శీలాన్ని సైతం పణంగా పెట్టి, నిజాం వ్యతిరేకపోరాటం సాగిస్తున్న వీరుడికి ఆశ్రయమిచ్చిన ఒక వీరవనిత గాథ ‘గొల్ల రామవ్వ’.

‘గొల్ల రామవ్వ’ కథ ప్రాధాన్యం ఏమిటంటే, నిరక్షరాస్యులయిన ఒక మహిళ దేశభక్తిని అత్యంత హృద్యంగా, అతి గొప్పగా ప్రదర్శించడం. దేశభక్తి అంటే వందేమాతరం అని అనటం, ఉద్యమాల్లో పాల్గొనటం, జైలుకెళ్ళటం, ప్రాణాలు కోల్పోవటం మాత్రమే కాదు, దేశభక్తి అత్యంత నిగూఢంగా, సామాన్యులు జరిపే అసామాన్య చర్యలలో కూడా ప్రతిఫలిస్తుందని నిరూపించిన కథ. సామాన్యులు తమ పరిధిలో ప్రదర్శించే అతి గొప్ప దేశభక్తికి నిలువుటద్దం పడుతుంది ఈ కథ. ఇలాంటివారిని మనం స్మరించం. వారు మనకు కంటికి ఆనరు. చరిత్ర పుస్తకాలలో వీరి ప్రస్తావన రాదు. కానీ సామాన్య ప్రజల ఆదరణ అండదండలు లేకపోతే ఏ ఉద్యమం నిలువలేదు. ఏమీ సాధించలేరు. ఈ నిజాన్ని అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శిస్తుందీ కథ. ‘గొల్ల రామవ్వ’ అన్న ఒక వృద్దురాలు, నిరక్షరాస్యురాలు ప్రాణాలు కాపాడకపోతే ఒక వీరుడు పోలీసుల బారినపడి ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ కథ ఉండేదే కాదు.

‘గొల్ల రామవ్వ’ రచనకు బీజం నిజజీవితంలో ఉంది. పివి నరసింహారావుల నిజాం వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అనేక సాహసాలు చేశాడు. అయితే ఇది ఆయన స్వీయానుభవమా? లేక అతను చూపించిందీ తెలుసుకున్నదీ అయిన సంఘటన ఆధారంగా సృజించిన కథనా?  అన్నది చర్చనీయాంశం. ఒక రచయితపై అనేక సంఘటనలు ప్రభావం చూపినా, వాటిల్లోంచి అన్నీ కథలుగా మారవు. ఆ ఆలోచనలు, ప్రభావాలన్నిటిలో అత్యంత ప్రభావం చూపిన సంఘటన కథగా ప్రకటితమౌతుంది. ‘గొల్ల రామవ్వ’లో ప్రదర్శించిన సంఘటన పీవీ మనస్సుపై అత్యంత ప్రభావం చూపించిందనటానికి నిదర్శనం,  ‘లోపలి మనిషి’ నవలలో కూడా ఈ సంఘటన ప్రస్తావన రావటం నవలలో ప్రధాన పాత్రధారి ‘ఆనంద్’ ‘అప్రోజా బాద్’ నవాబు దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూ పోలీసుల నుంచి తప్పించుకుని ఓ గుడిసెలో దూరతాడు. అక్కడ ఉన్న వృద్ధమహిళ అతడు తన అల్లుడని చెప్పి అతడిని రక్షిస్తుంది. ఈ సంఘటన రెండు పేజీల్లో ఉంటుంది నవలలో. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవటం, ఒళ్లంతా గాయాలు కావటం వంటివన్ని నవలలో వర్ణిస్తాడు. ‘గొల్ల రామవ్వ’ కథలో అవన్నీ ఉండవు.

కథ తిన్నగా ‘డాం… ఢాం… ఢాం’ బాంబుల, పేలుడుతో అర్థరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది అంటూ ఆరంభమవుతుంది. ఆ బాంబుపేలుడు వల్ల వాతావరణంలో మార్పు, ప్రజల మనస్సుల్లో చెలరేగిన అలజడి, ఆందోళనలను వర్ణిస్తాడు రచయిత. ఇదొక అత్యద్భుతమైన రచన ప్రక్రియ. రచయిత స్పష్టంగా ‘ఇదీ విషయం’ అని చెప్పడు. దృశ్యాన్ని అక్షరాల ద్వారా కళ్ళముందు నిలపటం ద్వారా పాఠకుల మనస్సుకు పరిస్థితి బోధపడుతుంది. ఇది విశ్వనాథ సత్యనారాయణ రచన శైలికి దగ్గరగా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో కూడా ఒక వ్యక్తి కాగడా పట్టుకుని చీకటిలోనడుస్తుంటే కనబడే వాటిని మాత్రం వర్ణిస్తూ వ్యక్తి మానసిక స్థితిని పాఠకుడికి చేరువచేస్తాడు. స్పష్టంగా ‘ఇదీ’ అని చెప్పకుండా ఆ ‘ఇది’ మనుసును స్ఫురించేట్టు చేయటం అన్నమాట.

చీకటి వల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచిపోయే పక్షుల కలవరం, వాటి రెక్కల కట కట, ఊరుచుట్టూ, పెరండ్లలో కుక్కల అరుపు. దొడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పక్షుల గిజగిజ… ఇలా సాగుతుంది బాంబు పేలుళ్ళ తరువాత ఊరి వర్ణన. దృశ్యం కళ్ళముందు నిలబడటం అంటే ఇది.

ఇక్కడి నుంచి కథ గొల్ల రామవ్వ దృక్కోణంలో చెప్పటం మొదలవుతుంది. ఇది రచన పద్ధతులలో ఒకటి. రచయిత ముందుగా తాను ప్రదర్శించవలసిన అంశం, లక్ష్యాల గురించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే కథను తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి తరుపున చెప్పవచ్చు. వీరోచితమైన గాథ ద్వార పాఠకుల ఒళ్ళు గగుర్పొడిచి, దేశభక్తి భావం ప్రజ్వలించేట్టు చేయవచ్చు. ఇక్కడే రచయిత వ్యక్తిత్వం ప్రస్ఫుటమవుతుంది.

పి.వి నరసింహారావు స్వతహాగా ప్రచారం కోరుకోడు. ఆయన ప్రవర్తన హుందాగా, గౌరవప్రదంగా, మంద్రంగా, ప్రవహించే నది లాంటిది. తన గొప్ప కాదు, ఎదుటివారి ప్రతిభకు పెద్దపీట వేస్తాడు. limelight కు దూరంగా ఉంటాడు. ఈ రచనలో ఆయన చేస్తున్నదీ అదే. ఒక నిరక్షరాస్య మహిళ అసమానత్యాగం, అకుంఠిత దేశభక్తి ప్రదర్శించాలనుకున్నాడు. అప్పుడు కథ విప్లవకారుడి కోణంలో చెప్తే దృష్టి మారిపోతుంది. కాబట్టి గొల్ల రామవ్వ దృక్కోణంలోనే కథ చెప్పాలి. యువకుడు సాహసం చేస్తున్నాడు. కానీ దానికన్నా ఆమె త్యాగం గొప్పది. యువకుడు ఆ మార్గం ఎంచుకున్నాడు. ఆమె అతడి దారిని స్వచ్ఛందంగా సురక్షితం చేసింది. ఇందులో ఎవరిది గొప్ప త్యాగం?

ఇటునుంచి ముసలవ్వ మనోగతం ద్వారా ఆ కాలంలో గ్రామాలలో నెలకొన్న బీభత్స వాతావరణాన్ని ప్రదర్శిస్తాడు. ‘ఏమనుకున్నావే తల్లీ మా పాడు కాల మొచ్చిందే! మీరెట్లు బ్రతుకుతరో ఏమో బిడ్డ! ఈ తురుకోల్లతోటి చావొచ్చింది. మొన్ననే నలుగుర్ని తుపాకీ వేసి చంపిన్రు! ఇప్పుడు కూడా ఏదో గసోంటి అగాయిత్తమో చేసిన్రేమో! ఏం పోగాలమో వీళ్లకు!’

అంతా అర్థమయిపోతుంది. రచయిత ఏదీ ప్రత్యక్షంగా చెప్పడు. పాత్రలే అంతా చెప్పకనే చేస్తాయి. ఇక విప్లవకారుడు తలుపు కొట్టినప్పుడు ఆమె మనస్సులో చెలరేగిన ఆలోచనలు (పేజీ 78) అద్భుతం. అయితే ఆ తలుపు కొట్టింది తురుకోళ్ళు కాదు, పోలీసులు కాదు అని నిర్ధారించుకున్న తరువాత అతడిని లోపలకు రానిస్తుంది. ఆమె అతడి శరీరాన్ని తడిమి అతడి పరిస్థితిని గ్రహిస్తుంది. స్పర్శతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడని గ్రహించింది. ఆశ్రయమిచ్చింది. ఆ తరువాత వారిద్దరి నడుమ జరిగిన సంభాషణ పి.వి నరసింహారావు అభిప్రాయాలను తెలుపుతాయి. అన్ని పాత్రల సంభాషణల ద్వారా వ్యక్తం చేయటం గమనార్హం. ఒక నాటక రచనలో, ముఖ్యంగా శ్రవ్యనాటక రచనలో పదాల ద్వారా వింటున్న ప్రేక్షకుడి కళ్ళముందు దృశ్యాన్ని నిలపటమనే ప్రక్రియ ఇక్కడ మనకు కనిపిస్తుంది (పేజీ 81) ముసలవ్వ గొణుగుడుతో.

ఇక ఆ యువకుడు ఇద్దరు పోలీసులను చంపేడని తెలిసినపుడు ‘ఇద్దర్నో? కానీ ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగం పనే చేసినవు’ అంటుంది. అంటే నలుగురిలో ఇద్దరినీ చంపేవన్న నిష్టూరం. అద్భుతమైన భావన ఇది. ‘యువకుడు చకితుడైనాడు. అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమైన కల్పనాకాశంలో భ్రమణం సాగించింది. అతని కారుణ్య రూప భావుకత్వం అతడిని మైమరపించింది. శ్రీనామ స్మరణ వల్ల పొంగే హనుమంతుని దేహం వలె తన దేహం కూడా ఉప్పొంగినట్లనిపించింది’ – ఈ సున్నితత్వం కరుడుకట్టిన హంతకులనుంచి విప్లవకారుడిని, సున్నితమైన భావాలు కల తిరుగుబాటుదారుడినీ వేరుచేస్తుంది. ‘పంటను కాల్చండి. కాని పంటకు కాపలాగా ఉన్న అందమైన యువతికి ఏమీ కానీయకండి’ అని ముఖ్దూం అన్నట్టు.

ఇక్కడ వారి చర్యలో ముసలవ్వ అన్నమాటలు గమనార్హం. ‘పెద్దపెద్దోల్లేమో ముచ్చట్లు పెట్టుకుంటు కూకుంటరట! పసిపోరగాళ్ళనేమో పోలీసోల్ల మీదకి పొమ్మంటరట!’ అక్షర లక్షలు చేసేమాట. ఈ గమనిస్తే ఈ అభిప్రాయం ‘లోపలి మనిషి’ నవలలోనూ అడుగడుగునా కనిపిస్తుంది. పి.వి రాజకీయ జీవితంలో కూడా తాను ముందు నిలబడి ఇతరుల విమర్శలను ఎదుర్కొంటు అనుకున్నది సాధించటం గమనిస్తే తాను నమ్మింది ఆచరించటం కనిపిస్తుంది.

ఆ తరువాత కథ స్వాభావికంగా జరిగిపోతుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే కథ చెప్పే పద్ధతి narrative style. కథ చెప్పడం ఎలా ఉండాలంటే కొండమీద నుంచి రాయి దొర్లినట్టుండాలి తప్ప రాయి ఎత్తుకుని కొండ ఎక్కుతున్నట్టుండకూడదు. ఒక్కసారి రాయి దొర్లటం ఆరంభించిందంటే తన త్రోవ అదే వెతుక్కుంటుంది. ‘ఢాం…ఢాం’ అంటూ బాంబు పేలుడు తరువాత యువకుడు ముసలవ్వ గుడిసెలోకి, వెళ్ళటం, పోలీసులు రావటం, అతను ఆమె అల్లుడనుకోవడం అంతా స్వాభావికంగా జరిగిపోతుంది.

‘గొల్ల రామవ్వ’ కథ పీవీ నరసింహారావు స్వీయానుభవమేమో లేక అతని సన్నిహితుడి అనుభవమేమో. కారణం ఈ కథ ఇన్‍సైడర్‍లో పూర్తిగా గుడిసెలోకి వెళ్ళక ముందునుంచీ జరిగిన కథను చెప్పడం వల్ల అనిపిస్తుంది.

మంగయ్య అదృష్టం:

‘మంగయ్య అదృష్టం’ పి.వి రాసిన నవలిక. బ్రహ్మదేవుని ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రతికూల వర్గాలుగా విడిపోయిన ఇతర దేవతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మంగయ్య అనే రాజకీయ నాయకుడిని కేంద్రంగా చేసుకుని చేసే విన్యాసాలతో కూడిన వ్యంగ్య, హాస్య, నవలిక ‘మంగయ్య అదృష్టం’.

‘మూడులోకాలు (మరో లెక్క ప్రకారం ఏడు లోకాలు) తల్లడిల్లిపోయాయి. భయంతో గడగడలాడిపోయాయి’ అంటూ కొండపై నుండి రాయిని దొర్లిస్తూ ఆరంభమవుతుంది ‘మంగయ్య అదృష్టం’. ఒక దివ్యకలహంతో ఆరంభమవుతుంది కథ. ప్రతీకాత్మకంగా రాజకీయ కలహాలను ఎత్తుకు పై ఎత్తులను, కుట్రలను కుతంత్రాలను ప్రదర్శిస్తుందీ కథ. ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ రంగాల నడుమ పోరాటాలు, అహాలు, అడ్డుపుల్లలను అత్యంత వ్యంగాత్మకంగా ఆలోచన స్సోరకంగా ప్రదర్శిస్తుందీ కథ. అయితే ఇది పలు వ్యంగాత్మక రచనల ధోరణిలోనే సాగుతుంది. అయితే దేవతల నడుమ చర్యను ప్రదర్శించే ఈ రచనలో కంప్యూటర్, క్రెడిట్ కార్డ్ వంటి పదాలు రావటంలో రచనకాలం సందేహాస్పదమవుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో రచన మధ్యలో ఎవరయినా చేయి చేసుకున్నారేమో అనిపిస్తుంది. అయితే ప్రపంచంలో తొలి క్రెడిట్ కార్డ్ 1950లో తయారవటం, భారతదేశంలో 1980లో ప్రధమంగా తొలి కార్డు ప్రవేశించటం గమనిస్తే ఈ పదాల వాడకం అనౌచిత్యం అనిపించదు.

’మంగయ్య అదృష్టం’ నవలికలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం, కథాంశంలో దేవతల నడుమ వాగ్వివాదాలు ఉన్నా, దేవతల సభను రాజకీయ సభలు, చర్చలకు ప్రతీకగా నిలిపినా, దేవతల చిత్రీకరణలో అగౌరవం కానీ, అనౌచిత్యం కానీ, హేళన కానీ కనబడకపోవటం. పీవీ నరసింహారావుల సాంప్రదాయ అభిమానం, పురాణ పాత్రలపట్ల అవగాహన గౌరవాలను ఇది స్పష్టం చేస్తుంది.

‘అసలు దేవతలంటే ఎవరనుకున్నావ్? వారంతా మానవుల కల్పనలోనే ఉద్భవించారన్న పరమసత్యం నీకు తెలియదు?’ సరస్వతీ దేవి వ్యాఖ్యాలను తిప్పికొడుతూ బ్రహ్మదేవుడు ‘నా సృష్టిలో ఎక్కడ గాలించినా భర్తను అర్థం చేసుకునే భార్య కానరాదని నాకు బాగా తెలుసు. నా భార్యామణికి కూడా ఇది వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు’ అనటం హాస్యంగా అనిపించినా, దేవతల ద్వారా మానవ సమాజరీతిని ప్రతిబింబించటం దాన్ని అర్థం చేసుకోవాలనే రచయిత హృదయం అర్థం చేసుకోవచ్చు. ‘మంగయ్య అదృష్టం’ నవలికకు ఈ భావన కీలకం. దేవతల అహాల రాజకీయాలాటల్లో  మానవులు పాత్రలు కావటం చూపించటం ద్వారా రాజకీయ ప్రపంచంలో ముందు కనబడుతూ ఆటలు ఆడటం వేరు, వెనుకనుంచి ఆడించే హస్తాలు వేరు అని నిరూపించటం. నిజానిజాలను నిక్కచ్చిగా, కానీ హాస్యపూర్వకంగా, ఎవ్వరూ నొచ్చుకోకుండా కానీ గుచ్చుకునేవారికి గుచ్చుకునేటట్టుగా చెప్పటం ఈ నవలికలో కనిపిస్తుంది. ఇది కూడా విశ్వనాథ రచన శైలి ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’, ‘దమయంతీ స్వయంవరం’తో సహా పలు విశ్వనాథ రచనలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణుశర్మ విశ్వనాథకు కలలో వచ్చి “ఈ మధ్య స్వర్గంలో చాలా తగాదాలు వచ్చినవి. ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు కొందరు చచ్చి, స్వర్గానికి వస్తున్నారు. ఆ వచ్చి ఉన్న నాలుగురోజుల్లో వాళ్ళు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పంచతంత్రం వ్రాసినది నేను కాదనీ, ఇంకెవరోననీ, అతడి పేరు తెలియదని, ఆ వ్రాసినవాడు నన్ను కల్పించాడని ఓ సిద్ధాంతం లేవదీశాడు” అని చెప్తాడు. ఇందులో ఆక్షేపణ ఉంది. విమర్శ ఉంది. వ్యంగ్యం ఉంది. వేదన ఉంది. ఇలా మాటల్లో పలు భావాలు స్ఫురింపచేసే విశ్వనాథ శైలిని పీవీనరసింహారావు ఈ రచనలలో స్పష్టంగా తెలుసుకోవచ్చు.

అందుకే పీవీ రాజకీయానుభవాలు, అభిప్రాయాలు అధికంగా ప్రతిబింబించే ఈ నవలికను ఇంతటితో వదలి ముందుకు సాగాల్సి ఉంటుంది.

లోపలి మనిషి:

ఇక్కడే మరో విషయం మనం స్పృశించాలి. ఒక రచయిత రచన చేసే సమయంలో అతను అనుభవాలు, భావాలు, ఆలోచనలతో పాటు అతని ప్రమేయం లేకుండానే అతను అంతకుముందు ప్రభావితమైన రచనలు, శైలి పద్ధతులు అతని రచనలో చోటు చేసుకుంటాయి. వీటన్నిటిని కలుపుకుని ఆ రచనపై తనదైన ప్రత్యేకముద్ర వేయటం ద్వారా ప్రభావాల ఛాయలను మరుగుపరచటం రచయిత స్వీయ సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. పీవీ రచనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది విశ్వనాథ ప్రభావం, ఇది వారి ప్రభావం అని మనం తీర్మానించవచ్చునేమో కానీ ఇదే రచన విశ్వనాథ రాస్తే ఇలా ఉండదు. ఈ సమన్వయం, ఒకరకమైన సామరస్య ధోరణి, అన్నికోణాలనుంచి సమస్యను ప్రదర్శించి అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం పీవీ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఆయన రచనలను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆయన రచనలకు ప్రత్యేక వ్యక్తిత్వం ఆపాదిస్తుంది. చదవగానే ఇది పి.వి నరసింహారావు రచన అని గుర్తించేటట్టు చేస్తుంది. అలాకాక తనపై ప్రభావం చూపించిన రచయిత ప్రతిభ తుఫానులో కొట్టుకుపోయే రచయితకు ప్రత్యేక గుర్తింపు లభించదు. తాను అనుసరించే రచయిత నీడలో ఒరిగిపోతాడు. తాను చేసిన పరిమిత రచనల ద్వారానే ప్రత్యేక గుర్తింపు సాధించగలగటం పీవీ సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. పి.వి నరసింహారావు రచించిన magnum opus అనదగ్గ రచన autobiographical novel,  ‘The Insider’  తెలుగులో ’లోపలి మనిషి’. పీవీ ఈ నవలను ఆంగ్లంలో రచించారు. ఆంగ్లంలో ఆయన భాష కాస్త పాత ఇంగ్లీషు పండితుల పద్ధతిలో ఉంటుంది. ఆయనలాగే రచన ఉద్రేకం, ఉద్వేగాలు లేకుండా ప్రశాంతంగా, శాంతంగా, మేధాపరమైన చర్చలతో, రాజకీయ సమాచారం, విశ్లేషణ, వ్యాఖ్యాలతో సాగుతుంది. రచన ఆరంభించిన తరువాత పూర్తయ్యేవరకు క్రింద పెట్టలేము. ఇందుకు ప్రధాన కారణం ఈ రచన కోసం పీవీ ఎంచుకున్న ‘స్వీయచరిత్రాత్మక కాల్పనిక కధన పద్ధతి’. ఇక్కడ మనం autobiographical novel గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

autobiographical novel:

సాహిత్యంలో ప్రతి సృజనాత్మక రచన ప్రత్యక్షంగానో, పరోక్షంగా స్వీయ ఆత్మకథనాత్మకమే అంటారు. ఎందుకంటే రచయిత ఎంతగా కాల్పనిక అంతరిక్షంలో విహరించినా దానికి బీజం నిజంలోనే ఉంటుంది. అతని స్వీయానుభవమో, సన్నిహితుల అనుభవమో లేక హృదయం స్పందన సంఘటనలో రచనకు ప్రేరణ నిస్తాయి. ఆ ప్రేరణ ఆధారంగా దాని చుట్టూ కాల్పనిక సంఘటనలు, పాత్రలు అల్లి రచనను సృజిస్తాడు రచయిత. అయితే రచయిత ఎంతగా ప్రయత్నించినా, ప్రతి పాత్రలో ఏదో ఓ రకంగా రచయిత కనిపిస్తాడు. అలా తాను కనిపించకుండా, తన చుట్టూ ఉన్న మనుషులు, వారి వ్యక్తిత్వాలు కనిపించేట్టు రాసే రచయిత అత్యద్భుతమైన సృజనాత్మక రచయిత. ఉదహరణకు,  ఓ రచయిత ఓ అమ్మాయి వెంట పడ్డాడు. ఆమె ‘ఛీ పో’ అంది. ఆ రచయిత ఒంటరిగా కూర్చుని తన తీరని కోరికలను, తన అనుమానాలను విజయాలుగా ప్రదర్శిస్తూ తన తీరని కోరికను తీర్చుకుంటాడు. తనను తాను అర్థం చేసుకుంటాడు. తనలో ఉండాలనుకుని లేని లక్షణాలను రచనలో ప్రదర్శించడం ద్వారా సంతృప్తి చెందుతాడు. కసి తీర్చుకుంటాడు. అందుకే రచనను wishful thinking అంటారు. రచనను ‘catharsis’ అంటారు. రచనను ‘weapon of the weak’ అని కూడా అంటారు. అంటే రచయిత వ్యక్తిత్వం, భావావేశాన్ని బట్టి రచన తీరని కోరికలను తీర్చుకునే సాధనం. మనస్సును ప్రక్షాళన చేసుకునే సాధనం. బలహీనుడి ఆయుధం వంటిది. తన ఈ మనోభావాలను రచయిత ఉన్నదున్నట్టు లేక అనుభవ ప్రదర్శన చేస్తే అది కాల్పనేతర రచన, non fiction అవుతుంది. నిజమైన పేర్లే వాడితే autobiography అవుతుంది. అలా కాక జరిగిన సంఘటనలనే మారుపేర్లతో కాస్త వాస్తవం, కాస్త కల్పన జోడించి రాస్తే అది autobiographical novel అవుతుంది. ఇలాంటి autobiographical novel రాస్తూ, దాన్లో అప్పటి రాజకీయ, సాంఘిక వాతావరణాన్ని ప్రదర్శిస్తే ఆ రచన విలువ మరింత పెరుగుతుంది. స్వీయ జీవిత చరిత్రలో లేని వెలుసుబాటు రచయితకు autobiographical  నవల రచనలో ఉంటుంది. స్వీయ జీవిత చరిత్ర అంటే తేదీలు, సంఘటనలు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు రాస్తే అది వాద వివాదాలకు, కోపతాపాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. ఇవన్నీ వద్దనుకుని, తన దృక్కోణాన్ని వివరిస్తూ, ఇతరుల అసలు రూపును స్పష్టంగా ప్రదర్శించాలనుకున్న రచయితకు ‘నవల’ పనికివస్తుంది. అయితే తాను ఎవరిని విమర్శిస్తున్నాడో, ఏం చెప్తున్నాడో పాఠకుడి ఊహకు అందేట్టు రాస్తూ కాల్పనిక పాత్రల ద్వారా ఇది ప్రదర్శిస్తే అది autobiographical novel అవుతుంది. ప్రపంచ సాహిత్యంలో అత్యంత సృజనాత్మక రచయితలందరి తొలి నవలలు, పేరొందిన నవలలు దాదాపుగా autobiographical రచనలే.

జేమ్స్ జాయ్ నవల ‘పొర్ట్రెయిట్ అఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ యంగ్‍మాన్’ ఆయన అనుభవాల సమాహారమే . ప్రధాన పాత్రధారి జేమ్స్ జాయ్స్. డి.హెచ్. లారెన్స్ నవల ‘సన్స్ అండ్ లవర్స్’ అతడి స్యీయానుభవాల సమహారమైన autobiographical novel. సోమర్సెట్ మామ్ రచన ‘Of Human Bondage సోమర్సెట్ మామ్ జీవితమే. డేవిడ్ కాపర్‌ఫీల్డ్ వంటి రచనలు చార్లెస్ డికెన్స్ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. మికావ్‌బర్ పాత్రలో తన తండ్రిని అమరం చేశాడు. ఆగ్నెస్ పాత్ర ద్వారా తన ద్వితీయ వివాహాన్ని సమర్థించుకున్నాడు. దస్తయేవ్‍స్కీ రచనలు ‘House of the Dead’, ‘Letter from underground’ స్వీయజీవిత చరిత్రాత్మక నవలలే. తారాశంకర్ బందోపాధ్యాయ రచన ‘గణదేవత’, బంకించంద్ర రచన ‘కమలాకాంతర్ దప్తర్’, బిభూతిభూషణ్ రచన ‘పథేర్ పాంచాలి’, శరత్‍చంద్ర ‘శ్రీకాంత్’ వంటివన్నీ autobiographical నవలలే. విశ్వనాథ ’వేయిపడగలు’లో ధర్మారావు విశ్వనాథనే అంటారు. ఇంకా  గోపిచంద్ వంటి వారి పలు రచనలు autobiographical రచనలే. కొడవటిగంటి కుటుంబరావు రచన ‘చదువు’, కొమ్మూరి వేణుగోపాల్ ‘హౌస్ సర్జన్’ ఇలా చెప్తూ పోతే జాబితా అనంతం అవుతుంది. అయితే వీటన్నిటిలో గమనించాల్సింది ఏమిటంటే తన జీవితాన్ని కాల్పనిక పాత్ర ద్వారా ప్రదర్శించటం ద్వారా రచయితకు అధికమైన స్వేచ్ఛ లభిస్తుంది. లేక చర్యలను సమర్థించుకునే వీలు చిక్కుతుంది. ఎదుటివారి నైచ్యాన్ని ప్రదర్శిస్తూ నిజానిజాలు నిక్కచ్చిగా చెప్పే వీలుంటుంది. ఏవరైనా ఏమైనా అంటే ‘కల్పన’ కవచాన్ని వాడుకోవచ్చు పైగా ఇలాంటి రచనల్లో ఆ కాలం నాటి వ్యక్తులనూ తీసుకువస్తే రచన ప్రామాణికత పెరుగుతుంది. అందుకే ‘ఇన్‍సైడర్’ నవల రచనలో పీవీ నరసింహారావు autobiography నవల పద్ధతిని అవలంభించారు. ఈ పద్ధతిని అవలంభించడం వల్ల తనకు కాల్పానిక స్వేచ్ఛ లభించి కథను ఆసక్తికరంగా చెప్పే వీలు చిక్కిందని, రాజకీయాలాటలు నిజాయితీగా ప్రదర్శించే వీలు చిక్కిందని, చరిత్రను చొప్పించే వీలు చిక్కిందని అందుకే స్వీయచారిత్రాత్మక నవల రచనను ఎన్నుకున్నానని నవల విడుదలయిన తరువాత ఇంటర్వ్యూలో పీవీ చెప్పారు.

నిజానికి ఈ రచనకు ఆరంభంలో ఫేరు అంటే 1991లో నవల ఆరంభించినప్పటి పేరు ‘ది అదర్ హాఫ్’. ‘మరో సగం’ హీరో పేరు నిరంజన్. దాన్లో రాజకీయ కుట్రలు కుతంత్రాలతో పాటు లైంగిక జీవితం గురించి కూడా స్వేచ్ఛగా వర్ణనలున్నాయి. కానీ అనుకోకుండా ప్రధానమంత్రి అవటంతో ఆయన నవలలో చాలాభాగాలు తొలగించి కాస్త తిరగరాసి ‘ది ఇన్‍సైడర్’గా నవలను ప్రచురించారు. ఈ నవలకు ప్రేరణ పి.వి నరసింహారావు అంతకుముందు రాసిన ‘ది రీషఫుల్’ అనే వ్యంగ్య, హాస్య స్కిట్. దాన్లో పదవుల పంపిణీ గురించి వ్యంగ్య విమర్శలుంటాయి. అది 1984లో ‘మెయిన్‌స్ట్రీమ్’ అనే పత్రికలో ప్రచురితమయింది. 1998లో ‘ఇన్‍సైడర్‍’ ను అప్పటి ప్రధాని అటల్‍బిహారీ వాజ్‍పేయి విడుదల చేశారు.

అయితే పుస్తకం గురించి నెగిటివ్ రివ్యూలు అధికంగా వచ్చాయి. పుస్తకం చప్పగా ఉందన్నారు. మరీ నిడివి ఎక్కువయిందన్నారు. కధానాయకుడు ఆనంద్‍ని పీవీ నరసింహారావుగా గుర్తించటంతో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావుల నడుమ జరిగిన రాజకీయాలు, లక్ష్మీకాంతమ్మతో అనుబంధం వంటి విషయాలపై చర్చలు, ఊహాగానాలు సాగాయి. నెహ్రూ, గాంధీల రాజకీయాలు, వంశపారంపర్య విలువ, హైకమాండ్ పట్ల విధేయత వంటి విషయాలపై పీవీ అభిప్రాయాలు స్పష్టంగా తెలటంతో పలు చర్చలు సాగాయి. భిన్నభిప్రాయాలు వెలువడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది కాల్పనిక నవలనే అయినా చారిత్రాత్మక నవల కూడా అన్న భావన పలువురు వ్యక్తం చేశారు. జవహర్‍లాల్ నెహ్రూ ప్రభావం రాజకీయ రంగంలో ఎలా ఉండేది, ఆయన మరణం, అంత ఆకర్షణీయమైన నాయకత్వలోపం వల్ల ఎలా కేంద్రాన్ని బలహీనం చేసి రాజకీయాలలో అస్థిత్వాన్ని నాయకుడి పట్ల విధేయతకు దారితీసింది, ఇందిరాగాంధీ తిరుగులేని నేతగా ఎదగటం, సీట్ల కోసం ప్రాకులాటలు, రాజకీయాలు, ముఖ్యమంత్రి పదవుల కోసం కుట్రలు, అందరూ ప్రజాసంక్షేమం కోరేవారే కానీ పధకాల అమలు వచ్చేసరికి తలెత్తే స్వార్ధ రాజకీయాలు… ఇలా 1950 నుండి 1980 వరకూ భారతదేశం రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిణామాలకు తాత్విక భూమిక నిచ్చి అవగాహన కలిగించే రచనగా ‘లోపలి మనిషి’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే అనేక విషయాల గురించి నిక్కచ్చిగా రాసిన పీవీ నరసింహారావు ఆ కాలంలో అత్యంత ప్రాధాన్యం వహించిన ‘తెలంగాణ ఉద్యమం’ ప్రదర్శించక పోవటం. ఇందుకు కారణాలు చర్చించటం మన ప్రస్తుత సందర్భ పరిధికి బాహిరం. కానీ జీవితచరిత్రను నవల రూపంలో రాయటం వల్ల కలిగే వెలుసుబాటు ఇది. ఇష్టమైన వాటిని ప్రదర్శించవచ్చు. ఇబ్బందికరమైన వాటిని వదిలేయవచ్చు. ఇదేమిటని ఎవరూ అడిగే వీలులేదు. ఇది చరిత్ర రచన కాదు. స్వీయ జీవిత చరిత్ర కాదు. ఇది కాల్పనిక రచన అని సమాధానం ఇయ్యవచ్చు.

లోపలి మనిషి:

 ‘లోపలి మనిషి’ ‘అఫ్రోజాబాద్’ అన్న ఓ సంస్థానంలో ఆరంభమవుతుంది. ‘అఫ్రోజాబాద్’ అనటంలో తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, ఆ కాలంలో రాజు ప్రజలపై జరిపిన  అత్యాచారాలను వర్ణించవచ్చు. కానీ ఎక్కడా మతం ప్రసక్తి రాదు. ఎవరూ నొచ్చుకునే వీలు ఉండదు. ‘లోపలి మనిషి’ చదువుతుంటే మనకు అన్ని ముసుగులు తొలగిన పివి నరసింహారావు లోపలి మనిషి కనిపిస్తాడు. అర్థమౌతాడు. సానుభూతి కలుగుతుంది. అత్యంత సన్నిహితుడై, ప్రియమైన వ్యక్తి అవుతాడు.

“ఆనంద్ అని పేరు పెట్టారు అబ్బాయికి పదకొండో రోజున బారసాల చేసి” అంటూ ఆనంద్ బాల్యం ఆరంభమవుతుంది ‘లోపలి మనిషి’ కథ. కథ చెప్పడం కోసం రచయిత ప్లాష్‌బ్యాక్ లాంటి ఎలాంటి టెక్నిక్‍లను అవలంభించలేదు. కథను తిన్నగా ప్రారంభించారు. ఇక్కడే ఒక చెయ్యి తిరిగిన రచయితకు,  ఎలాంటి సంచలనాత్మక ఆరంభం  లేకుండా కథను తిన్నగా చెప్పాలనే పీవీ శైలికి తేడా తెలిసేది. మామూలు ఆసక్తికరంగా రాసే రచయిత అయితే కథను కథానాయకుడు ఉన్నతపదవిని అలంకరించటంతోటో, ఏదో గొప్ప పని సాధించిన తరువాత కుట్రలకు గురయి పదవికి రాజీనామా చేస్తున్న ఘట్టంతోటో ఆరంభించేవాడు. ఫ్లాష్‍బ్యాక్‍లో కథను చెప్పేవాడు. కానీ క్లాసిక్ autobiographical novels అన్నీ straight forward narrative తో ఆరంభమవుతాయి. ఇందువల్ల రచయితకు ప్రధాన పాత్రపై పాఠకుడికి ఆరంభం నుంచీ ఆసక్తి కలిగించే వీలు చిక్కుతుంది. అంటే flashy style కథనుంచి కథనంవైపు దృష్టి మళ్ళిస్తే బాల్యం నుంచి తిన్నగా కథ చెప్పే పద్ధతి పాత్రపై పాఠకుల దృష్టిని నిలుపుతుంది. మలుపులు తిరిగే పాత్ర జీవితంతో పాటు పాఠకుడి మనస్సు ఎగసి పడుతూంటుంది.

బాల్యంలో ఆనంద్ అనుభవాలు, అతడిలో చైతన్యం, లింగస్పృహ వంటివి జాగృతం అయ్యే ఘట్టాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. అయితే విశ్వనాథ ప్రభావం ఏదో రూపంలో ద్యోతకమవక తప్పదు. నవాబులు తమ భాషను ప్రజలపై రుద్దటం గురించి వ్యాఖ్యానిస్తూ, భాషను పరిరక్షించటంలోని అంతరార్థాన్ని వివరిస్తూ “వాళ్ళకీ రాష్ట్రం వెలుపలి ఉన్న ప్రజలకూ మధ్య భాష అవినాభవ బంధంగా మారింది” అని వ్యాఖ్యానిస్తాడు. మరో సందర్భంలో పురాణాలు, నాటకాలు ఎలా సంస్కృతిని పరిరక్షించాయో వివరిస్తూ “అహాన్ని విస్మరించి ఇతరుల కష్టసుఖాలలో లీనమయ్యే లక్షణం తనకు ఇందువల్ల అంటే పురాణ పాత్రలలో లీనమయ్యే లక్షణం వల్ల అలవడినట్టు తర్వాత గ్రహించాడు” అని వ్యాఖ్యానిస్తాడు. రచన స్వీయమనస్సు ప్రక్షాళన అనీ, రచయిత తనని తాను, అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగమని నిరూపించే ఇలాంటి వ్యాఖ్యాలు ఈ నవలలో పలు సందర్భాలలో ఉంటాయి. మరో సందర్భంలో ‘పరాయి ఇంట్లో ఉండి చదువుకోవాల్సి రావటం, అమ్మకు దూరంగా ఉండల్సి రావటం వల్ల’ వచ్చిందొక నిర్లిప్తత. ‘దేనికీ స్పందించకపోవటం, నడకలో యాంత్రికత, దేనినీ పట్టించుకోవాలనిపించదు. దేనిమీదా లక్ష్యం లేదు’ అని వ్యాఖ్యానిస్తాడు. మనిషి ఎంత ఎదిగినా అతడిలోని బాలుడు తొంగిచూస్తాడు. బాల్యానుభవాల ప్రభావంతో అతని ప్రవర్తనను నిర్దేశిస్తాడు అనటానికి ఈ వ్యాఖ్యాలు నిదర్శనం. ఇంకొక విషయం ‘బాల్యం నుంచీ తన ఆలోచనలు, తనమీద ఇతరులకు తనని దగ్గర కానీయలేదు. తనకు ఇతరులను దగ్గర కానీయలేదు అన్నది ఆయన గ్రహించాడని మరీ మేధావిలా కనిపించాడేమో కొంతమందికి నచ్చలేదు’ అని ఆనంద్ గురించి వ్యాఖ్యానిస్తాడు. ఈపాటికి ఆనంద్ పివి నరసింహారావు ‘alter ego’ అని పాఠకుడు గ్రహిస్తాడు. చదువుకునే రోజులలో జరిగిన అనుభవాల వల్ల ఒక విషయం అతనికి స్పష్టమవుతుంది. ‘వ్యక్తిగత విధేయతను తాను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక భావానికి… తాను విశ్వసించే ఒకే భావానికి తాను విధేయుడుగా ఉండగలడు. బహూశా వ్యక్తి పాలనకు అనుగుణంగా పుట్టుకొచ్చిన వ్యక్తిగత విధేయత అనే ఆలోచన తనకు సరిపడదు’ అని వ్యాఖ్యానిస్తాడు. ఇక్కడే మనకు నవలలో కనిపించే ఆనంద్ పాత్ర ద్వారా బాహ్యంగా కనిపించే పీవీని అర్థం చేసుకునే వీలు చిక్కుతుంది.

పీవీ నరసింహారావు అందరితో సమన్వయం సాధిస్తూ రాజకీయ జీవితం గడిపాడు. ఆయనను ఇందిరాగాంధి విధేయుడుగా వ్యాఖ్యానించారు. కానీ నవలలో, పలు సందర్భాలు తన విధేయత సిద్ధాంతానికి కానీ వ్యక్తిగతానికి కాదు అని నిరూపిస్తూన్నట్టుంటాయి. ముఖ్యంగా, భూసంస్కరణల విషయంలో పార్టీ వ్యతిరేకతను, సమాజంలోని కొన్ని వర్గాల వ్యతిరేకతను తట్టుకుంటూ, కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ కూడా వాటిని అమలుపరచిన తీరు, ఈ నవల ద్వారా తన విధేయత వ్యక్తికి కాదు సిద్ధాంతానికీ అని నొక్కి చెప్పాలనుకున్నాడు రచయిత అని స్పష్టం చేస్తుంది. గమనిస్తే పివి నరసింహారావు ప్రధాని అయిన తరువాత పద్ధతి ప్రకారం పీఠాలను కదలించిన తీరు పీవీ నరసింహారావు ఆనంద్ పాత్ర ద్వారా తన అంతరంగాన్ని బట్టబయలు చేశారన్న విషయం స్పష్టం చేస్తుంది.

స్వాత్రంత సాధన తరువాత స్వతంత్ర పోరాట వీరులు ఎలా అదృశ్యమయ్యారని ప్రశ్నిస్తూ నవలలో చర్చించిన తీరు ఆ కాలంలో మారుతున్న వ్యక్తిత్వాలు, ప్రాధాన్యతలను బోధిస్తుంది. సిద్ధాంతాలను వ్యక్తిగత స్వార్థాలు ఎలా ఆక్రమించాయో పాఠకుడికి తెలుస్తుంది. వీటి నడుమ ఆదర్శాన్ని సిద్ధాంతాన్ని పట్టుకుని వ్రేలాడుతున్న ఆనంద్‍ని చూసి జాలి కలుగుతుంది. ఆదర్శాలు, వ్యక్తిత్వం, మేధ ఏ రకంగా రాజకీయ రంగంలో మనుగడ కోల్పోతున్నాయో బోధపడుతుంది.

ఈ సందర్భంలో ఆనంద్ సంశయాలు, పివి నరసింహారావు వ్యక్తిగత సంశయాలుగా, పాఠకుడి మనస్సులో మెదిలే సంశయాలుగా ఎదుగుతాయి. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ పోకడలోనే ముందు ముందు ఉండబోతోందో? మహా అయితే ఇదొక సుడిగాలిగా, కాకపోతే జూదంగా పరిణమించదు కదా? ఇందులో తను ఇమడగలడా? తను రాజకీయాలనుంచి తప్పుకోవలసిందేనా? తప్పుకుని ఏం చేయాలి? చివరికి ఒంటరిగానే పోవాలని నిర్ణయించుకుంటాడు. ఇలా పరాజయాన్ని రకరకాలుగా భరిస్తూ, ఎద్దేవాలను, హేళలనలను విస్మరిస్తూ ఆనంద్ తన లక్ష్యం వైపు వెళ్తాడు. ఈ ఎదుగుదలను ఒక పద్ధతి ప్రకారం ప్రదర్శించాడు రచయిత ఈ నవలలో. ఎక్కడా తొందరపాటు, కప్పదాటు వేయటం లేదు. దాచటం లేదు. ఆనంద్ వ్యక్తిత్వాన్ని అనుభవాలనే ఉలులు తీర్చిదిద్దటాన్ని నిజాయితీగా ప్రదర్శించాడు. ఆనంద్ మౌనం, నిర్ణయాలను జాప్యం చేయటం, ఆవేశానికి లోనుకాకపోవటం, మాట తూలకపోవటం, వంటివన్నీ మనకు అర్థమైపోతాయి.

ఇలా ఒక అధ్యాయం దాటుతూ మనకు పీవీ రచన శైలిపై విశ్వనాథ ప్రభావం, ముఖ్యంగా వేయుపడగలు, సముద్రపు దిబ్బ వంటి నవలల ప్రభావం తెలుస్తుంటుంది కానీ వాటితో ఏమాత్రం పోల్చలేని రచన ఇది. ‘వేయిపడగలు’లో ధర్మారావు ప్రేక్షకుడు. అతని చుట్టూ అతనెరిగి సమాజపు ఆనవాళ్ళు అదృశ్యమైపోతుంటాయి.  మనుషులు మారిపోతుంటారు. వ్యక్తిత్వాలు మారిపోతుంటాయి. వాటి ప్రభావానికి గురవుతూ కూడా మౌన ప్రేక్షకుడిలా నిలబడిపోతాడు ధర్మారావు.

‘సముద్రపు  దిబ్బ’లో స్వాతంత్రానంతరం రాజకీయ నిర్ణయాల వల్ల భారతీయ సమాజంలో వచ్చిన పెనుమార్పులు, భవిష్యత్తులో జరుగబోయే అనర్థాలు ప్రతీకాత్మకంగా చిత్రితమవుతాయి.

‘లోపలి మనిషి’లో ఆనంద్ ధర్మారావులానే తన చుట్టూ జరుగుతున్న పెనుమార్పులను మౌనంగా చూస్తూంటాడు. కానీ ధర్మారావుకు భిన్నంగా ఆనంద్ ఈ పెనుమార్పులకు ఒక కారణం. ఆ మార్పుల ప్రవాహంలో కొట్టుకుపోతూ కూడా తన పరిధిలో ఉన్న అంశాలలో తన లక్ష్యం సాధించాడు. పంకంలో ఉంటూ బురద అంటని పద్మం లాంటివాడు ధర్మారావు అయితే, ప్రవాహంలో కొట్టుకునిపోతూ కూడా వీలయిన రీతిలో ప్రవాహ దిశను కొంతయినా మార్చిన వాడు ఆనంద్. కానీ ఈ రెండు పాత్రలూ దేనికీ తొణకవు, బెణకవు. విశ్వనాథలాగే పివి నరసింహారావు కూడా అవసరం దొరికినప్పుడల్లా సాంఘిక, రాజకీయ అంశాలపై వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. చారిత్రక అంశాలు, వాటి ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. కొన్ని సందర్భాలలో చైనా యుద్ధం, ఇందిరాగాంధీ తిరుగులేని నేతగా ఎదగటం, భూసంస్కరణ చట్టం వంటి సందర్భాలలో వివరణలు విశ్వనాథ రచనల్లాగే నవల స్థాయిని దాటి ‘వ్యాసం’ స్థాయికి ఎదుగుతాయి. కానీ వాటిని చెప్పిన తీరు, చెప్పటంలో నిజాయితి, ప్రదర్శిస్తున్న దృక్కోణాల వల్ల విడువకుండా చదువగలుగుతాము.

ఇక రచయిత రాజకీయ అవగాహన, సముద్రపు దిబ్బలో విశ్వనాధ వ్యాఖ్యాలను ప్రతిబింబిస్తాయి. ‘వెనుకటి సామంతరాజులు ఇప్పుడు ముఖ్యమంత్రి అనే సరికొత్త ఆహార్యంలో ప్రత్యక్షమయ్యారు. సామ్రాజ్యాధికారం కేంద్రాధికారంగా రూపాంతరం చెందింది. రెండూ పైపైన జరిగిన మార్పులే. లోపల వరకు మాత్రం చాలావరకూ అలానే ఉంది’ అంటాడు. ’బ్రిటీష్ వారు పోయారు కాని వారి ఆత్మ ఇక్కడే ఉంది’ అన్న విశ్వనాథ వారి వ్యాఖ్యకు వివరణ ఇది.

‘మనం ప్రాచీన పదజాలం నుంచి శబ్దాల్ని మాత్రమే తీసుకుని వాడుకున్నామనుకుంటాం. అది సరి కాదు. మాటలతో పాటు వాటికి సంబంధించిన భావాలు కూడా ఆలోచనలలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా రాజరికం, రాజుగారి పట్ల భక్తి విధేయతలు సామూహిక చేతనలో జీర్ణించుకుపోయాయి’ అని పివి వ్యాఖ్యానిస్తారు. ‘జీవలక్ష్యం’ అనే పదాన్ని విశ్వనాధ వాడుతారు.

‘అధికార యంత్రాంగాన్ని ఉక్కుచేతులతో శాసించటం, క్రౌర్యం, అవతలి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆనందించే ప్రవృత్తి, దురంహంకారం, అసహనం, నిరంకుశత్వం, దురుసుతనం, కర్కషత్వం, ఆడవాళ్ళను అనుభవించటం ఒక హక్కుగా భావించటం’ ఇది ఆనంద్ ప్రత్యర్ధి వర్ణన. స్వీయజీవిత చరిత్రలో ఇలా రాయటం కుదరదు.

ఇలా అడుగడుగునా రాజీయాల గురించి, కుట్రల గురించి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా విశ్లేషిస్తూ, విమరిస్తూ, వివరిస్తూ సాగుతుంది రచన. అయితే ఆనంద్ ప్రేయసి అనదగ్గంత సన్నిహితంగా ఉన్నా అరుణ పాత్రలో ఆనంద్ అనుబంధాన్ని, రాను రాను ఆ బంధం రూపొందిన  విధాన్ని  అత్యంత సన్నిహితంగా, ఎంతో లోతుగా ప్రదర్శిస్తాడు రచయిత. వారి సంబంధం ద్వారా చెలరేగిన సంచలనం, అపోహలు, అపప్రదలు, వీటి ద్వారా ఆనంద్‍ను దెబ్బతీయాలన్న ప్రయత్నాలు, రూపాంతరం చెందుతున్న అరుణ వ్యక్తిత్వం రచయితగా, ఇతర మనుషులను అర్థం చేసుకునే అవగాహన లోతును ప్రదర్శిస్తాయి.

రాజకీయాల తరువాత ఈ నవలిలో అంతగా విమర్శించింది ‘పత్రికారంగాన్ని’. ఇలా ‘ఇన్‍సైడర్’లోని ఏదో అంశాన్ని విశ్లేషిస్తూపోతే ఒక మేధావి రచయిత రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ అతని మానసిక వేదనతో పాటు సాటి మనుషులను అర్థం చేసుకుని అవగాహనతో, వివరిస్తూ, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మేధాపరంగా చిత్తు చేయటం వివరిస్తూ పోతే సమయం సరిపోదు. కాబట్టి రెండు ఉదాహరణలతో ‘లోపలి మనిషి’కి వీడ్కోలు పలుకుదాం.

‘రాజకీయ వర్గాల్లో ఉండే విచిత్రమే ఇది. నిర్ణయాలు తీసుకునే బాధ్యతనంతటిని ఒకే ఒక పాపల భైరవుడికి అప్పగించి కూర్చుంటారు. ఒకవేళ నిర్ణయం తప్పని రుజువైతే అందరూ కలిసి ఆ వ్యక్తి మీద మేకులు దిగేయటం ప్రారంభిస్తారు’ ఇలా రాజకీయాన్ని నిరసించిన పివి తన అధికారంలో పాపాల భైరవుడయ్యాడు. ఇతరులకు పేరు ప్రఖ్యాతులు వచ్చేట్టు చూశాడు. అంటే మనస్సాక్షి సజీవంగా నిలుపుకున్న రాజకీతవేత్త సృజనాత్మకత సజీవంగా నిలుపుకున్న రాజకీయవేత్త తన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటూ, విశ్లేషిస్తూ మూటగట్టి అందులో అనుభవాల ఊట ‘లోపలి మనిషి’ అన్నమాట.

చివరిగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేముందు వ్యక్తి తనని తాను అర్థం చేసుకోవాలంటారు. ‘లోపలి మనిషి’లో పి.వి నరసింహారావు తన లోపలి మనిషిని అర్థం చేసుకుని ఆవిష్కరించినట్టు స్పష్టం అవుతుంది. ఒక సందర్భంలో ఆనంద తరహా వర్ణిస్తాడు.

“ఆనంద్ తరహా పూర్తిగా వేరు. అతని పనిలో తుదిగా కనిపించే ఆకాంక్ష ఏదీ లేదు.” (పేజీ 153).

ముగింపు:

ఈ రకంగా సృజనాత్మక రచయితగా పి.వి నరసింహారావు విశ్వరూపం ‘లోపలి మనిషి’లో కనిపిస్తుంది. ఉత్తమ సృజనాత్మక రచన ద్వారా రచయిత తనను తాను అర్థం చేసుకోవటం ద్వారా తన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ రచన పఠనం ద్వారా పాఠకుడికి తన సమాజం గురించి అవగాహన కలగటం ద్వారా తన గురించి తనకు ఒక ఆలోచన కలుగుతుంది అంటారు. ఈ నిర్వచనంతో అన్వయిస్తే ‘లోపలి మనిషి’ స్వీయ చారిత్రాత్మక నవలల్లో ఉత్తమ సృజనాత్మక రచనగా నిర్ణయించటంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ ఉండవు.

“నవల ఇక్షుఖండంలా ఉండాలి. ఎంత గట్టిగా కొరికితే అంతగా రసం ఊరాలి. ఎంతగా పీలిస్తే అంతగా రసం ఉప్పతిల్లాలి” అంటారు. ముఖ్యంగా నవలలో కథకన్నా కథ చుట్టూ ఏర్పాటుచేసిన రసమే ప్రాధాన్యం అనీ అంటారు. ఈ నిర్వచనం ప్రకారం  ‘లోపలి మనిషి’ ఒక చెరుగుగడ లాంటిది. ఎంత లోతుగా వెళ్తే అంతగా విషయాలు తెలుస్తాయి. ఏదీ లభించకపోయినా రాజకీయాల కుట్రలు కుతంత్రాలు గురించి తెలుస్తుంది.

కాబట్టి సుప్రసన్నాచార్యగారన్నట్టు పి.వి నరసింహారావు కనుక సాహిత్యరంగం వైపు దృష్టి పెట్టుంటే ‘జ్ఞానపీఠం’ సంగతి అటుంచి తెలుగు సాహిత్యం సుసంపన్నం అయ్యుండేదన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here