పాపం పక్కింటాయన

2
7

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

మా పక్కింటాయనకి మైల్డ్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చేరంటే చూడ్డానికి వెళ్ళేను.

“అక్కయ్యగారూ..” అంటూ కళ్ళ నీళ్ళెట్టేసుకున్నాడు పాపం..

ఆయన చెప్పిన మాటలు అవధరించండి..

“ఆరోజు పొద్దున్నండీ అక్కయ్యగారూ… నాకెంత మంచి కల వచ్చిందనుకున్నారూ!..ఆ కలలో నాకు నేను ఇలా అనేసుకున్నాను..

‘మా ఇంట్లో నేనంటే హడల్. నేను ఆఫీసునుంచి వచ్చేనంటే అప్పటిదాకా హోరెత్తిపోతున్న ఇల్లంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోతుంది. మా ఆవిడ భ్రమరాంబ వంటింట్లో కెళ్ళిపోతుంది. పిల్లల చేతుల్లోకి పుస్తకాలు వచ్చేస్తాయి. ఆఖరికి మేం పెంచుకునే టామీ కూడా తోక ముడుచుకుని ఓ మూలకి వెళ్ళి కూర్చుని నన్ను చూస్తూ గుడ్లు మిటకరిస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. హబ్బా.. నేనెంత గొప్పవాడినీ అనుకుంటూ అందర్నీ ఇలా మిలటరీ డిసిప్లిన్‌లో పెట్టగల నా అథారిటీకి నన్ను నేనే మెచ్చేసుకుంటూంటాను. కానీ ఆ సంతోషం పైకి కనిపించకుండా గంభీరంగా మొహం పెట్టేసుకుని ఇంట్లోకి అడుగు పెడతాను..’ అని ఆనందపడిపోతున్న నాకు గబుక్కున మెలకువ వచ్చేసిందండీ.

లేచి చూసేటప్పటికి మా ఆవిడ భ్రమరాంబ అంత పొద్దున్నే పనంతా పక్కన పెట్టేసి వాళ్ళమ్మతో ఫోన్‌లో మాట్లాడుతోంది. పిల్లలిద్దరూ టివీ రిమోట్ కోసం కొట్టుకుంటూ ఒకళ్ళమీద ఒకళ్ళు పడి బలాబలాలు తేల్చుకుంటున్నారు. టామీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ గంతులేస్తూ ఇద్దరినీ ఉత్సాహపరుస్తోంది. వాళ్ల ఫైట్‌కి బాక్‌గ్రౌండ్ లాగా టీవీ హెచ్చుస్థాయిలో మోగుతోంది.

“ఆపండీ.. అంటూ గట్టిగా అరిచేను… అహహహ లేదు లేదు.. అరిచేననుకున్నానండీ. నా నోటమ్మట మటుకు కీచుమనే చిన్న శబ్దం కూడా బైటికి రాలేదు. రాలేదు కాదు.. రాదు కూడా.. నాకు తెల్సు.. నేనెందుకిలా అయిపోయేనో.. నా గోతిని నేనే తవ్వుకున్నాను. అందుకే దీనికి ప్రాయశ్చిత్తం కూడా నేనే చేసుకోవాలి అనుకున్నానండీ అక్కయ్యగారూ. దానికి కూడా అంతా ప్లాన్ చేసుకున్నానండీ. నేనంటే భయం లేకుండా వున్న వీళ్ళందరినీ ఆర్డర్లో పెట్టెయ్యాలి అనుకున్నానండీ.”

నేను శ్రధ్ధగా వినడం మొదలెట్టేను. కాస్త ఆగి మళ్ళీ మొదలెట్టేడు..

“ఆ రోజేమయిందంటేనండీ అక్కయ్యగారూ…ఎప్పటిలాగే గబగబా ఆఫీసుకి వెళ్ళడానికి తయారయి హాల్లోకి వచ్చేను. స్థలాలు మారేయి కానీ సీన్లు అవే కంటిన్యూ అవుతున్నాయి. పిల్లలు పుస్తకాలు పెట్టుకుందుకు ఒకే బేగ్ కోసం పోట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ చెరొకటీ కొన్నాను కదా… మరి రెండోది ఏమైనట్టూ అని చుట్టూ చూసిన నాకు ఓ మూల చిరిగిపోయిన రెండో బేగ్ కనపడింది. అంటే అప్పటికే పిల్లలిద్దరూ దెబ్బలాడుకుని ఒక బేగ్ చింపేసుకుని, రెండో బేగ్ చింపే భీకర ప్రయత్నంలో ఉన్నారన్నమాట.

అరిచి ఆయాసపడి లాభంలేదని తెల్సిన నేను భ్రమరాంబ ఎక్కడుందా అని చూసేను. వంటింటిగట్టు ఎక్కి కూర్చుని, కిటికీలోంచి మీ ఇంటి పెరట్లోకి తొంగి చూస్తోంది. ఇంట్లో ఎంత గొడవ జరుగుతున్నా, ఏమైపోయినా, పిల్లలు పోట్లాడుకుంటున్నా ఏమీ పట్టించుకోకుండా అలా చూస్తోందంటే మీ ఇంట్లో ఏదో విశేషమే జరిగుండాలి. ఏమిటా అని నేనూ తన వెనకాల నిలబడి తొంగిచూడబోయేను. వెనకాల నేను వచ్చినట్టు గ్రహించిన భ్రమరాంబ “మీకు టైమైపోయిందా! ఇంకా రైస్ కుక్కర్ ఆఫ్ అవలేదు. ఈ పూటకి లంచ్ బైట ఎక్కడైనా చేసెయ్యండి.” అంటూ పిల్లల వైపు వెళ్ళి, ఇద్దరి వీపులూ విమానం మోత మోగించింది. వాళ్ల సైరన్ కూతలకి నాకు గుండెల్లోంచి దడలాంటిది మొదలైంది. అంతే… అలా కళ్ళు మూసుకుని కిందకి కూలబడేంత వరకూ గుర్తుంది.. అంతే…మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నానండీ.”

అని చెప్పి, హమ్మయ్యా అనుకుంటూ నీరసపడి వేలాడిపోయేడు పాపం..

వింటున్న నాకు ఏం చెప్పాలో తెలీలేదు. ఈ భ్రమరాంబ గురించి నాకు బాగా తెలుసు. రోజూ ఏదోకటి కొంటూనే వుంటుంది.. అది పనికొచ్చినా సరే.. పనికిరాకపోయినా సరే.. ఒకవేళ కొనడానికి ఇంట్లో డబ్బులు కనపడకపోతే ఇంట్లో వున్న ఇంకే వస్తువో అమ్మేసి మరీ కొత్తది కొంటుంది.

ఎప్పుడో కానీ ఇంట్లో వంట చెయ్యదు. మొగుణ్ణి బైట తినెయ్యమని, పిల్లలకి బ్రెడ్డో ఏదో పెట్టి స్కూల్ కి పంపేసి, తను ఊరి మీద పడుతుంది. ఊరంతా ఆమెకి చుట్టాలూ, స్నేహితులే.. బ్రేక్‌ఫాస్ట్ ఒకింట్లోనూ, లంచ్ ఇంకో ఇంట్లోనూ చేసినా మళ్ళీ మొదట వెళ్ళిన వాళ్ళింటికి వెళ్ళడానికి సుమారు నెల పడుతుంది. వస్తూ వస్తూ ఇంకెవరింటినుంచో ఇంట్లోవాళ్లందరికీ రాత్రికి తినడానికి కావల్సినవి తెచ్చేస్తుంది.

వాళ్ళు మా పక్కింట్లోకి వచ్చిన కొత్తల్లోనే ఆవిడ ధోరణి తెలుసుకున్న నేను కాస్త దూరంగానే వుండడం మొదలుపెట్టేను. కానీ పాపం ఆ మొగుడుగార్ని చూస్తుంటే మటుకు జాలేసేది.

ఇంతకీ ఇంట్లో ఆవిణ్ణీ, పిల్లల్నీ ఆర్డర్లో పెట్టడానికి ఆయన వేసిన ప్లాన్ యేమిటో తెలుసుకోవాలనిపించింది. అదే అడిగేను ఆయన్ని.

“ఇంతకీ మీరనుకున్న ప్లానేవిటీ?”

“ఏవుందీ! ఇదిగో.. ఇలాగే గుండెనెప్పి వచ్చినట్టు యాక్ట్ చేద్దామనుకున్నాను. హూ.. నిజంగానే వచ్చేసింది..” అన్నారాయన.

నాకు అయ్యోపాపం అనిపింఛింది.

“పోనీలెండి.. స్ట్రోక్ మైల్డ్ గానే వచ్చిందన్నారు డాక్టర్ గారు. అన్నీ మన మంచికే.. మీ ప్లాన్ నిజమయ్యిందనుకోండి.. దెబ్బకి మీరనుకున్నట్టె అవుతుందిలెండి..” సర్దిచెప్పే నాయనకి.

“ఏవిటయేదీ! అదుగో.. అటు చూడండి..” అన్నారు.

ఆయన చూపించినవైపు చూసేను. ఆవిడగారు వీధిలో పోయేదాన్ని దేన్నో పిలిచి బేరమాడుతున్నారు.. పిల్లలిద్దరూ వాళ్ళమ్మ కొత్తగా కొన్న స్కూల్ బేగ్ లని ఓ చూపు చూస్తున్నారు.

పాపం పక్కింటాయన..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here