పాపం! సుబ్బరాజు

0
12

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘పాపం! సుబ్బరాజు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“భూ[/dropcap]మ్మీద సుఖపడితే తప్పులేదురా! బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా! తప్పేలేదురా!” అంటూ అద్దంలోకి చూసుకుంటూ మాంచి ఉషారుగా పాడుతూ బయటకు వెళ్లడానికి తయారవుతున్నాడు సుబ్బరాజు.

కొద్ది రోజులుగా సుబ్బరాజులో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అతని భార్య మంగకి.

మనిషి చాలా హుషారుగా ఉంటున్నాడు.

షాపింగ్ కూడా తరచుగా చేస్తున్నాడు. మొన్నటికి మొన్న మూడు జతల ఖరీదైన కొత్త బట్టలు కొనుక్కొచ్చాడు. నిన్నైతే ఓ ఖరీదైన మొబైల్, డ్రైఫ్రూట్స్, స్వీట్ పేకట్లు, తన కోసమని పిల్లల కోసమని కొత్త బట్టలు తీసుకు రావడం మంగకి కొత్తగానే ఉంది.

“ఎందుకిప్పుడీ కొత్త బట్టలూ, అనవసరమైన ఖర్చులూ” అని మంగ అడిగినా, సరైన జవాబు లేదు.

అదే నిర్లక్ష్యం.. “నాకు తెలియదా? ఎప్పుడు ఏది చేయాలో? అనవసరమైన సలహాలు ఇవ్వకు” అంటూ విసురుగా బయటకు వెళ్లిపోయాడు.

కేరళా లాటరీ ఏమైనా తగిలిందా లేక మరేమైనా అనుకుంటూ మళ్లీ అడిగే ధైర్యం చేయలేక పోయింది.

మరునాడు ఉదయం సుబ్బరాజు ఆఫీసు నుండి కాల్ వచ్చింది. సుబ్బరాజు ఆ సమయానికి స్నానం చేస్తున్నాడు.

మంగ ఫోన్ తీసి “ఎవరూ! ఎవరు కావాలండి..?” అంది.

“అమ్మా! మేము సుబ్బరాజు పనిచేస్తున్న ఆఫీసు నుండి కాల్ చేస్తున్నాం, సుబ్బరాజు ఉన్నాడా?” అని అడిగాడు.

“ఆ! ఉన్నారండి.. స్నానం చేస్తున్నారు. బయటకు వస్తే చెబుతాను మీరు కాల్ చేసారని”.. అవతలి వ్యక్తి పేరు కనుక్కొని ఫోన్ కట్ చేసింది మంగ.

స్నానం చేసి వచ్చి సుబ్బరాజు ఆఫీసుకు కాల్ చేసాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న రిసెప్షనిస్ట్ ఆఫీసుకు వచ్చిన వెంటనే యూనిట్ హెడ్‌ని కలవమని చెప్పి పోన్ కట్ చేసింది.

ఆఫీసుకు చేరుకున్న వెంటనే సుబ్బరాజు హెడ్‌ని కలవడానికి వెళ్లాడు. హెడ్ వారి ఆఫీసు పారదర్మకంగా ఉండటం వలన, లోపల హెడ్ ఎదురుగా కూచున్న పోలీస్ ఆఫీసర్‌ను చూసి గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలయింది. ‘నా గురించి ఎవరైనా కంప్లైంట్ చేసారేమో, అందుకే పోలీస్ వచ్చాడేమో!’ ఆ ఆలోచనతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.

నిలబడలేనంత నిస్సత్తువ ఆవహించింది. పోలీసు ఎందుకొచ్చాడబ్బా అనుకుంటూ మంచి నీళ్లు తాగడానికని పక్కకి వెళ్లాడు.

మంచి నీళ్లు తాగి వచ్చి ఆఫీసు ఎదురుగా నిలుచున్నాడు. ఇప్పుడైతే పోలీస్ అక్కడ లేడు.

‘ఊరికే భయపడ్డానే! ఆ పోలీసు ఆఫీసర్ వేరే పని మీద వచ్చుంటాడు’ అనుకుని సమాధాన పడ్డాడు.

హెడ్ లోపలికి రమ్మని సైగ చేసాడు.

బెరుకుగా లోపలికి వెళ్లిన సుబ్బరాజుతో “ఏం సుబ్బరాజు నీ అకౌంట్‌లో ఈ మధ్య ఎవరైన ఎక్కువ మొత్తం డబ్బులు వేసారా” సూటిగా విషయానికి వచ్చేసాడు హెడ్.

ఈ హఠాత్తు ప్రశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అనుకుని సుబ్బరాజు నీల్లు నములుతున్నాడు.

‘నా అకౌంట్‌లో డబ్బులు పడ్డ సంగతి ఈయనకెలా తెలుసు? నేనైతే ఆఫీసులో కానీ, బయట కానీ ఎవరికీ చెప్పలేదు. బహుశా బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చారేమో’ అనుకుంటూ..

“అవును సారూ! ఓ మూడు దఫాలుగా దగ్గర దగ్గర ఓ డెబ్బై ఐదువేలు పడ్డాయి”

“అవి ఎక్కడినుంచి ఎవరు వేసారో చూసుకోలేదా” అడిగాడు హెడ్.

“లేదు సారూ! చూసుకోలేదు, ఆ విషయాలు నాకంతగా తెలియవు కదా సారు!” అంటూ నసిగాడు.

“తెలియదా! అదెలాగయ్యా! నీ అకౌంట్‌లో డబ్బులు పోతే ఊరుకుంటావా? బ్యాంక్‌కు పోయి ఫిర్యాదు చేస్తావు కదా! ఎవరివో డబ్బులు నీ అకౌంట్‌లో పడితే కూడా ఫిర్యాదు చేయలికదా!” హెచ్చు స్వరంలో అడిగాడు హెడ్.

“అంటే ఆ విషయం నాకు తెలియదు సారూ!”అంటూ నసిగాడు సుబ్బరాజు.

“సరే! మంచిది విను, నీ అకౌంట్ లోకి ఆ డబ్బులు ఎలా వచ్చాయో నేను చెబుతాను, ఆ డబ్బులు మన కంపెనీ నుండి సుబ్బరాజు అనే సప్లయర్‌కి బదిలీ చేయబోయి, మీ ఇద్దరి పేర్లు ఇంటి పేర్లతో సహా ఒకటే అవటం వలన, ఇద్దరికీ ఒకే బ్యాంకులో అకౌంట్లు అవటం వలన, చివరి నెంబర్లు సరిచూసుకోకపోవటం వల్ల పొరపాటుగా మన అకౌంట్స్ విభాగం వాళ్లు నీ అకౌంట్ లోకి మూడు దఫాలుగా ఆ మొత్తాన్ని బదిలి చేసేసారు. ఆ సప్లయర్ వచ్చి అడిగితే మాకా విషయం తెలిసింది. నీవేమో అదృష్టం తలుపు తట్టిందనుకుని ఊరుకున్నావు. సరే జరిగిందేదో జరిగింది. బ్యాంక్‌కు వెళ్లి ఆ డెబ్బై ఐదువేలు మన ఆఫీసు అకౌంట్‌కి బదిలీ చేసేయి. మన అకౌంట్ మేనేజర్ నీతో వస్తారు” అన్నాడు హెడ్.

ఇంకా నీళ్లు నములుతున్నాడు సుబ్బరాజు.

“ఏం, డబ్బులు బాంక్‌లో లేవా, అంటే ఖర్చు పెట్టేసావా” అని అడిగాడు హెడ్

“అవును సారు! ఓ యాభై వేల వరకు ఖర్చు పెట్టేసాను, ఒక్కరోజు టైం ఇవ్వండి. రేపుదయానికి మొత్తం డబ్బైఐదు వేలు క్యాష్ తీసుకుని తెచ్చి ఇస్తాను” అన్నాడు సుబ్బరాజు.

అలా కుదరదని హెడ్ గదమాయించినా, సుబ్బరాజు బ్రతిమాలటం వలన, కొన్నిసంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న వాడవటం వలన, తప్పు ఇరువైపులా ఉన్నందు వలన “సరే! రేపు ఉదయం పదకొండు గంటలకు తెచ్చి ఇచ్చేయి”, అని చెప్పి హెడ్ అతని ప్రతిపాదనని అంగీకరించాడు.

తన దురాశ, అవివేకం వల్ల ఇదంతా జరిగిందని బాధ పడుతూ, మళ్లీ యాభైవేలు అప్పుచేయాల్సి వచ్చినందుకు జుట్టు పీక్కుంటూ, ఆ రోజుకి శెలవు పెట్టి, ఎవరో తెలిసిన వారి దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పుతెచ్చి మరునాడు ఆఫీస్‌లో కట్టి, పేద్ద గండం నుండి బయటపడినట్టు హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బరాజు.

ఇంతా జరిగినా ఇంట్లో ఈ విషయాలేవీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు సుబ్బరాజు. ఆఫీసు నుండి వచ్చిన ఫోన్ గురించి మంగ అడిగినా, “ఏం లేదు ఏదో అవసరం ఉండి చేసారులే” అని సర్దిచెప్పాడు. కానీ మంగకి అనుమాన నివృత్తి కాలేదు. సుబ్బరాజు లేని సమయం చూసి సోంబాబుకు ఫోన్ చేసింది మంగ. సోంబాబు, సుబ్బరాజుకి సహొద్యోగి మరియు మంచి స్నేహితుడు. మంగకి విషయమంతా చెప్పేసాడు, తాను చెప్పినట్టు సుబ్బరాజుకి చెప్పొద్దని.

మరునాడు ఉదయం సుబ్బరాజు నిద్రలేచి బాత్రూమ్‌కి వెళ్తుండగా, పెరటి నుండి భార్య కూనిరాగాలు వినిపిస్తున్నాయి, “తెలిసిందిలే, తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే” అంటూ. ఎందుకో ఆ పాట సుబ్బరాజుకి నచ్చలేదు.

“ఆపుతావా! ఉదయాన ఈ కచ్చేరి” చిరాకు పడ్డాడు సుబ్బరాజు.

‘అబ్బో రాజుగారు లేచినట్టున్నారు’ అనుకుంటూ..

“లేచారా! ఉండండి టీ తీసుకొస్తాను” అంటూ వంటింటి లోకి జారుకుంది ముసి ముసిగా నవ్వుతూ మంగ.

సుబ్బరాజుకు ఎందుకో ఆ పాట ఆమె తన కోసమే పాడినట్టనిపించి, ‘ఎవరైనా విషయం ఈమెకు చెప్పారా! చెబితే చెప్పని.. అయినా నేనేమీ డబ్బు దుర్వసనాలకు ఖర్చు పెట్టలేదుగా! నా స్థానంలో ఎవరున్నా ఇలానే చేస్తారేమో’ అని సమాధానపరుచుకున్నాడు పాపం! సుబ్బరాజు!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here