పాటే మంత్రము: మరో చరిత్ర – ఏక్ దూజే కే లియే

0
9

[dropcap]ప్రే[/dropcap]మకథా చిత్రాల్లో ‘మరో చరిత్ర’ది ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రేమకు భాష అడ్డు కాదనేది ఇందులో ప్రధానాంశం. ఒక తెలుగమ్మాయి, ఒక తమిళ అబ్బాయి మధ్య జరిగిన కథ ఇది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా తీశారు. ఒక హిందీ అమ్మాయి, ఒక తమిళ అబ్బాయి మధ్య కథగా తీశారు. చక్కని పాటలు ఈ రెండు చిత్రాలకూ వెన్నెముకలా నిలిచాయి. తెలుగు చిత్రానికి ఎమ్మెస్ విశ్వనాథన్, హిందీ చిత్రానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు.

ముందు స్థూల కథ చెప్పుకుందాం. బాలు, స్వప్న విశాఖపట్నంలో పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. భాష వేరైనా వారి మనసులు కలుస్తాయి. బాలు తండ్రికి, స్వప్న తల్లికి అసలు పడదు. పిల్లలు ప్రేమించుకుంటున్నారని తెలిసి వాళ్ళు అడ్డు చెబుతారు. భాష తెలియకుండా ప్రేమ ఎలా పుడుతుంది, మీది ఆకర్షణ మాత్రమే అంటారు. కాదంటారు పిల్లలు. వారి పెళ్ళి చేయటానికి ఒక షరతు పెడతారు పెద్దలు. ఒక సంవత్సరం పాటు వారు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉండాలి. అలా ఉన్న తర్వాత కూడా వారు పెళ్ళి చేసుకోవాలనుకుంటే చేస్తామని అంటారు. బాలు హైదరాబాద్‌లో ఉద్యోగానికి వెళతాడు. అక్కడ విధవరాలైన యువతి సంధ్య పరిచయమౌతుంది. ఆమె దగ్గర తెలుగు నేర్చుకుంటాడు. అపార్థాల కారణంగా స్వప్న ఇంకో పెళ్ళి చేసుకోబోతోందని అనుకుంటాడు బాలు. తాను మోసపోయాననుకుని సంధ్యతో పెళ్ళికి సిద్ధపడతాడు. ఇంతలో సంధ్యకి బాలు, స్వప్నల ప్రేమ గురించి తెలుస్తుంది. స్వప్న దగ్గరకు వెళుతుంది. స్వప్న ఇంకా బాలు కోసం ఎదురుచూస్తోందని తెలుసుకుంటుంది. బాలుకి నిజం చెప్పి పెళ్ళిని రద్దు చేసుకుంటుంది. ఒక సంవత్సరం పూర్తి అవటంతో బాలు స్వప్నని కలుసుకోవటానికి వెళతాడు. సంధ్య అన్నయ్య పెళ్ళి రద్దు కావటంతో బాలు మీద కోపంతో అతన్ని చంపెయ్యమని తన స్నేహితుడికి చెబుతాడు. అతని గ్యాంగ్ బాలు మీద దాడి చేస్తుంది. స్వప్న మీద కన్నేసిన ఒక దుర్మార్గుడు ఆమె మీద దాడి చేస్తాడు. ఆమె అతన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఒక పాడుబడ్డ ఇంటి పై అంతస్తు నుంచి కింద పడుతుంది. బాలు, స్వప్న తీవ్రంగా గాయపడతారు. ఒకరు లేక ఒకరు ఉండలేక ఇద్దరూ సముద్రంలో దూకి ప్రాణాలు విడుస్తారు.

భాష తెలియకపోయినా ప్రేమించుకోవటం అనే అంశాన్ని చెప్పటానికి ఉపమానాలతో రెండు సినిమాల్లోనూ పాటలు పెట్టారు. ఇదే పాట తర్వాత స్వప్న మీద అనుమానం వచ్చిన బాలు నోట విషాదగీతం గా కూడా వినబడుతుంది. ఇవి రెండూ చక్కని కవిత్వానికి అవకాశం ఉన్న సందర్భాలు. ముందు మొదటి పాట గురించి మాట్లాడుకుందాం. ఇది నాయిక పాడే పాట.

తెలుగు పాట:

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో

కలిపింది ఏ వింత అనుబంధమౌనో

తెలిసీ తెలియని అభిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది

మమత ఒకటే అది నేర్చినది

భాష లేనిది బంధమున్నది

మన ఇద్దరినీ జత కూర్చినది

వయసే వయసును పలకరించినది

వలదన్నా అది నిలువకున్నది

ఎల్లలు యేవి వొల్లనన్నది

నీదీ నాదొక లోకమన్నది

తొలి చూపే నను నిలవేసినది

మరుమాపై అది కలవరించినది

మొదటి కలయికే ముడివేసినది

తుది దాకా ఇది నిలకడైనది

 

హిందీ పాట:

తేరే మేరే బీచ్ మేఁ కైసా హై యే బంధన్ అంజానా

మైనే నహీఁ జానా తూనే నహీఁ జానా

ఎక్ డోర్ ఖీఁచే, దూజా దౌడా చలా ఆయే

కచ్చే ధాగే మేఁ బంధా చలా ఆయే

ఐసే జైసే కోయీ దివానా

పెహనూంగీ మైఁ తేరే హాథోం సే కంగనా

జాయేగీ మేరీ డోలీ తేరే హీ అంగనా

చాహే కుఛ్ కర్ లే జమానా

కిత్నీ జుబానేఁ బోలే లోగ్ హమ్ జోలీ

దునియా మేఁ ప్యార్ కీ ఏక్ హై బోలీ

బోలే జో షమా పర్వానా

 

హిందీ పాట అనువాదం:

నీకూ నాకూ ఈ తెలియని బంధమేమిటో

నేనూ ఎరుగను నీవూ ఎరుగవు

ఒకరు పాశం లాగితే ఒకరు పరుగున వస్తారు

తెలియని బంధానికి కట్టుబడి వస్తారు

వశం తప్పినట్టుగా

నా చేతికి గాజులు నీవే తొడగాలి

నా మేనా నీ వాకిటికే చేరాలి

లోకమేమైపోయినా

ఎన్నో భాషలు మనుషులవి

ఎక్కడైనా ఒకే భాష ప్రేమది

దీపం శలభం భాష అది

తెలుగు పాట ఆచార్య ఆత్రేయ రాశారు. హిందీ పాట ఆనంద్ బక్షీ రాశారు. తెలుగు పాటలో ప్రేమికులని పువ్వు, తుమ్మెద (తేటి) లతో పోల్చారు పల్లవి లోనే. హిందీ పాటలో మూడో చరణంలో ప్రేమికులని దీపం, శలభం (దీపం పురుగు) తో పోల్చారు. పువ్వు, తుమ్మెద జాతులు వేరు. దీపం, శలభం స్వభావాలు వేరు. అయినా తుమ్మెద పువ్వు దగ్గరకు చేరుతుంది. శలభం దీపం దగ్గరకు చేరుతుంది. అలాగే వేరు వేరు సంస్కృతుల నాయికా నాయకులు ఆకర్షితులయ్యారు. కథ ప్రకారం చూస్తే దీపం, శలభం పోలికే సరైనది అనిపిస్తుంది. శలభం రెక్కలు కాలి మరణిస్తుంది. దీపం మలిగిపోతుంది. నాయికా నాయకులు చివరిలో మరణించినట్టే. హిందీ కవిత్వంలో ఈ పోలిక ఎక్కువ కనిపిస్తుంది. ‘కటీ పతంగ్’ సినిమాలో “ప్యార్ దివానా హోతా హై” పాటలో ఈ చరణం ఉంటుంది:

షమా కహే పర్వానే సే అరే చలా జా

మేరీ తరహ్ జల్ జాయేగా యహాఁ నహీఁ ఆ

వో నహీఁ సున్తా, ఉస్కో జల్ జానా హోతా హై

అనువాదం:

శలభంతో దీపమంది వెళ్ళిపొమ్మని

నాలా కాలిపోతావు నావద్దకు రావద్దని

శలభం వినదు, కాలిపోవటం మానదు

 

పువ్వు-తుమ్మెద, దీపం-శలభం పోలికల్లో ప్రేమ గుడ్డిది అనే భావం ఉంది. ఎవరు నచ్చుతారో ఎవరికీ తెలియదు. నచ్చిన తరవాత ఇక వివశులైపోతారు. ఈ వివశత్వాన్ని తెలుగు పాటలో “వలదన్నా అది నిలువకున్నది” అని చెప్పారు. హిందీ పాటలో ‘దీవానా’ అని చెప్పారు. అంటే తన వశంలో తాను లేనివాడు. పిచ్చివాడు అనే అర్థంలో కూడా వాడతారు.

తెలుగు పాటలో మొదటి కలయిక వేసిన ముడి గురించి చెబితే హిందీ పాటలో విడదీయరాని పాశం గురించి చెప్పారు. తెలుగు పాటలో లేని పెళ్ళి ప్రస్తావన హిందీ పాటలో ఉంది. నా చేతికి గాజులు నువ్వే తొడగాలి, నేను మేనా (డోలీ) లో నీ ఇంటికే రావాలి అంటుంది నాయిక.

తెలుగు పాట పి. సుశీల పాడితే హిందీ పాట లతా మంగేష్కర్ పాడారు. లతా మంగేష్కర్ 1970 తర్వాత ఫిల్మ్ ఫేర్ అవార్డుల పోటీ నుంచి తప్పుకున్నారు. లేకుంటే ఈ పాటకే కాక ఇంకా ఎన్ని అవార్డులు వచ్చి ఉండేవో!

ఇదే పాట తర్వాత బాలు నోట విషాదగీతంగా వినిపిస్తుంది. బాలు ఉద్యోగరీత్యా కాకినాడ వెళతాడు. అక్కడికి స్వప్న కాలేజీ విహారయాత్రకు వస్తుంది. స్వప్న తల్లి ఆమె బావని నిఘా కోసం పంపిస్తుంది. స్వప్నకి ఈ విషయం తెలిసి హోటల్లో బావ రూమ్ నంబర్ తెలుసుకుని అక్కడికి వెళుతుంది. ఇది బాలు చూస్తాడు. చిన్న అనుమానం వస్తుంది. బాలుది పక్క గది. స్వప్నకి వినపడేలా పాట పాడతాడు. ఇందులో రెండు చరణాలు ఉంటాయి. మొదటి చరణం రెండు పాటల్లోనూ ఒకటే. రెండవ చరణం మారుతుంది.

తెలుగు పాటలో రెండవ చరణం:

వయసే వయసును పలకరించినది

వలదన్నా అది నిలువకున్నది

చేసిన బాస శిలవలె నిలిచి

చివరికి మంచై కరుగుతున్నది

హిందీ పాటలో రెండవ చరణం:

నీంద్ న ఆయే ముఝే చైన్ న ఆయే

లాఖ్ జతన్ కరూఁ, రోకా న జాయే

సప్నోం మేఁ తేరా ఆనా జానా

హిందీ పాట అనువాదం:

నిదుర లేదు, కుదురు లేదు

ఎంత వద్దనుకున్నా ఆగటం లేదు

నా కలల్లో నీ రాకపోకలు 

తెలుగు పాటలో తాము చేసుకున్న బాసల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఒక సంవత్సరం పాటు విడిపోయినా తిరిగి కలుసుకుంటామని అనుకున్న మాట ఆమె మరచిపోయిందని నిందిస్తున్నాడు. ఇంతకు ముందు శిలలా నిశ్చలంగా ఉన్న సంకల్పం ఇప్పుడు మంచులా కరిగిపోయిందని అంటున్నాడు. ఆమెకి అతని అభియోగం అర్థమైంది. కానీ అతని ఎదుటపడితే తమ ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుంది. అందుకే మౌనంగా ఆక్రోశిస్తుంది. ఇక్కడ బాలులో నిజం తెలుసుకోకుండా నిందించే తొందరపాటు కనిపిస్తుంది. స్వప్నలో తర్వాత అతనికి సర్దిచెప్పుకోవచ్చనే నమ్మకం కనిపిస్తుంది.

హిందీ పాటలో నిందించటం ఉండదు. నా కలల్లోకి నీవు వస్తూనే ఉన్నావు అంటాడు. విరహంతో వేగిపోతున్నాను అంటాడు. తొందరపాటు లేకుండా తర్వాత నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. పాట రచయిత బాగా సంయమనం పాటించినట్టు అనిపిస్తుంది.

తెలుగులోనూ, హిందీలోనూ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడారు. హిందీ పాటకు ఆయనకు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ‘అంజానా’, ‘దీవానా’ అన్నపుడు చివర వచ్చిన ‘నా’లో ఎస్పీబీ పలికించిన విషాదం గుండెల్ని పిండేస్తుంది. హిందీ పాటకు ఉత్తమ రచయితగా ఆనంద్ బక్షీకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.

ఈ చిత్రంలో మరో సందర్భం బాలు వెళ్ళిపోయాక స్వప్న తాము కలుసుకున్న ప్రదేశాలకి వెళ్ళి అతన్ని తలచుకోవటం. ఇక్కడ కూడా అద్భుతమైన పాటలు రాశారు ఆచార్య ఆత్రేయ, ఆనంద్ బక్షీ.

తెలుగు పాట:

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే

చిలిపి పనులకు కోటి దండాలు

వెన్నెలల్లే విరియబూసి వెల్లువల్లే ఉరకలేసే ॥పదహారేళ్ళకు॥

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు

పాటలు పాడిన చిరుగాలులకు

తెరచాటొసగిన చెలులు శిలలకు

దీవెన జల్లులు చల్లిన అలలకు

కోటి దండాలు శత కోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు

నాలో నిన్నే నింపిన కళ్ళకు

నిన్నే పిలిచే నా పెదవులకు

నీకై చిక్కిన నా నడుమునకు

కోటి దండాలు శత కోటి దండాలు

భ్రమలో లేపిన తొలి జాములకు

సమయం కుదిరిన సందె వేళలకు

నిన్ను నన్ను కన్నవాళ్ళకు

మనకై వేచే ముందు నాళ్ళకు

కోటి దండాలు శత కోటి దండాలు

హిందీ పాట:

(సాకీ: కోషిష్ కర్ కే దేఖ్ లే

దరియాఁ సారే నదియాఁ సారీ

దిల్ కీ లగీ నహీఁ బుఝ్ తీ

బుఝ్ తీ హై హర్ చింగారీ)

సోలా బరస్ కీ బాలీ ఉమర్ కో సలామ్

అయె ప్యార్ తెరీ పెహలీ నజర్ కో సలామ్

దునియా మేఁ సబ్ సే పెహలే జిస్నే యే దిల్ దియా

దునియా కే సబ్ సే పెహలే దిల్ బర్ కో సలామ్

దిల్ సే నికల్ నే వాలే రస్తే కా షుక్రియా

దిల్ తక్ పహుఁచ్ నే వాలీ డగర్ కో సలామ్

జిస్ మేఁ జవాన్ హోకర్ బద్ నామ్ హమ్ హుయే

ఉస్ షహర్, ఉస్ గలీ, ఉస్ ఘర్ కో సలామ్

జిస్ నే హమేఁ మిలాయా, జిస్ నే జుదా కియా

ఉస్ వక్త్, ఉస్ ఘడీ, ఉస్ గజర్ కో సలామ్

మిల్ తే రహే యహాఁ హమ్, యే హై యహాఁ లిఖా

ఉస్ లిఖావట్ కీ జేర్-ఒ-జబర్ కో సలామ్

సాహిల్ కే రేత్ పే యూఁ లహరా ఉఠా యే దిల్

సాగర్ మేఁ ఉఠ్ నే వాలీ హర్ లహర్ కో సలామ్

ఇన్ మస్త్ గహరీ గహరీ ఆంఖోఁ కీ ఝీల్ మేఁ

జిస్ నే హమేఁ డుబోయా ఉస్ భఁవర్ కో సలామ్

ఘూంఘట్ కో ఛోడ్ కర్ జో సర్ సే సరక్ గయీ

ఐసీ నిగోడీ ధానీ చునర్ కో సలామ్

ఉల్ఫత్ కే దుష్మనోఁ నే కోషిష్ హజార్ కీ

ఫిర్ భీ నహీఁ ఝుకీ జో ఉస్ నజర్ కో సలామ్

హిందీ పాట అనువాదం:

(సాకీ: ఎంత ప్రయాస పడినా

ఈ వాగులూ నదులూ

ప్రేమజ్వాల ఆరదు

ప్రతి అగ్ని ఆరినా)

పదహారేళ్ళ చిరు ప్రాయానికి దండాలు

ఓ ప్రేమా! నీ తొలిచూపుకి దండాలు

ఈ జగంలో మొట్టమొదట మనసిచ్చిన మనిషికి

ఈ జగంలో మొట్టమొదట మనసు దోచిన మనిషికి దండాలు

డెందం నుండి పయనించే దారి ఓ వరం

డెందం దాకా చేరుకునే బాటకు దండాలు

ఎక్కడ వయసుకొచ్చి మనమందరి నోళ్ళలో పడ్డామో

ఆ ఊరు, ఆ వీధి, ఆ ఇంటికి దండాలు

ఏదైతే మనల్ని కలిపిందో, విడదీసిందో

ఆ కాలం, ఆ సమయం, ఆ వేళకు దండాలు

మన కలయికకు గుర్తులు రాశామిక్కడ

ఈ రాతల్లోని ఒంపుసొంపులకి దండాలు

ఈ ఇసుకతిన్నెల్లో పొంగిందీ హృదయం

కడలిలో ఎగసిపడే ప్రతి కెరటానికి దండాలు

మాయ చేసే ఈ కనుల లోతైన సరసులో

మునకలేయించిన సుడిగుండానికి దండాలు

మేలిముసుగుని వదిలి తలపై నుంచి జారిన

ఈ మాయదారి లేత పచ్చ పయ్యెదకి దండాలు

ప్రేమ గిట్టనివాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు

అయినా వంగని ఆ చూపుకి దండాలు

ఆత్రేయ ఎంతో భావుకతతో నాయికానాయకులు కలుసుకున్న సముద్రతీరాన్ని వర్ణించారు. ఇసుకతిన్నెలని పరుపులని, చిరుగాలులు పాటలు పాడాయని, రాళ్ళు తెరచాటు ఇచ్చాయని, అలలు జల్లులతో దీవించాయని అన్నారు. నాయిక నాయకుడితో నడవటానికే తన కాళ్ళని, అతన్ని చూడటానికే తన కన్నులని, అతన్ని పిలవటానికే తన పెదవులని, అతని కోసమే తన నడుమని అంటుంది. మొత్తానికి అతనే ఆమె లోకం. తమను తమ తలిదండ్రులు కన్నారు కాబట్టి, అలా వారు తమకు ప్రేమించుకునే అవకాశం కల్పించారు కాబట్టి వారికీ వందనాలు అంటోంది. ఇది ప్రేమకు పరాకాష్ట. భవిష్యత్తు తమదే అనే భావంతో పాట ముగుస్తుంది.

హిందీ పాటలో కొత్త భావాలు పొందుపరిచారు ఆనంద్ బక్షీ. ప్రేమకు ఆద్యులైన్ వారికి వందనాలంటుంది నాయిక. వారు ప్రారంభించిన సంప్రదాయం తాము కొనసాగిస్తున్నామని భావం. ప్రేమించగలగటం ఒక వరమని, ప్రేమని ఆమోదించిన ప్రియునికి వందనాలంటుంది. తెలుగు పాటలో తలిదండ్రుల ప్రస్తావన ఉంటే, హిందే పాటలో ఊరు, వీధి, ఇల్లు ప్రస్తావన ఉంది. ఇవన్నీ వారి ప్రేమకి సాక్షులుగా ఉన్నాయి. తాము కలుసుకున్న వేళయే కాక తాము విడిపోయిన వేళని కూడా తలచుకుంటోంది. కాలం ఓ చక్రమని, తాము మళ్ళీ కలుసుకుంటామనే భావం ఇందులే ఉంది. రాళ్ళల్లో రాసుకున్న రాతలను చూసి మురిసిపోతోంది. ఇక్కడ “రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు” అనే తెలుగు పాట గుర్తొస్తుంది. ఉత్తరాదిలో మేలిముసుగు సంప్రదాయం ఉంది. ముసుగు వేసుకున్న పయ్యెద జారటం కట్టుబాట్లని తెంచుకోవటానికి సంకేతం. తెలుగులో “చెంగావి చీర” అన్నట్టు హిందీలో “ధానీ చునరియా” (లేత పచ్చ పయ్యెద) అంటారు.

తెలుగు పాట ఎస్. జానకి పాడగా హిందీ పాట లతా మంగేష్కర్ పాడారు. హిందీ పాటలో సాకీ అనూప్ జలోటా పాడారు. హిందీ పాటకి ఆనంద్ బక్షీకి ఫిల్మ్ ఫేర్ నామినేషన్ వచ్చింది. అంటే రెండు పాటలకూ ఆయనకు నామినేషన్లు వచ్చాయి. తనతో తానే పోటీ పడ్డారన్నమాట! ఆయనకు ఆయనే సాటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here